విఘ్నేశ్వరుడు (చందమామ)
Vignaeswarudu Novel (CHANDAMAMA)
23. విచిత్ర వినాయకీయం
సాలలో యింత గొడవ జరుగుతున్నా, పాలేరు ఇంకా నిద్రిస్తూనే ఉన్నాడు. పక్కనే పత్రిపూలతో నిండిన గణేశ విగ్రహం ఉంది. నేలంతా చెరుకుపానకంతో బురద, బురదగా తడిసి ఉంది. కాపలా వాళ్ళను పిలిపించి అడిగితే వాళ్ళు, “చాలా రాత్రయింది, పాలేరు నిశ్చింతగా నిద్ర తీస్తున్నాడు, మాకూ కునుకొచ్చింది. అంతలో ఏనుగు అరుపుతో కళ్ళు తెరిచాము. పెద్ద ఏనుగు చీకట్లో తెల్లగా కనిపించింది. చెరుకంతా లాగి మేసేస్తున్నది, గానుగలాగ పిప్పంతా ఊపేస్తున్నది; మాకు చెడ్డ భయమేసింది. పారిపోయాం!” అంటూ వాళ్ళింకా భయంతో వొణికి పోతూనే చెప్పారు.
భూస్వామిలో గొప్ప పరివర్తనం కలిగింది. అలాగే వెళ్ళి పాలేరు పాదాలకు మ్రొక్కుతూన్నట్లు సాగిలపడిపోయాడు. పాలేరు మేల్కొన్నాడు. లేచి నుంచున్నాడు. భూస్వామి అతని పాదాలు వదలకుండా శిరస్సుతో మ్రొక్కుతూనే ఉన్నాడు.
భూస్వామి భార్య విఘ్నేశ్వర విగ్రహానికి ప్రణమిల్లి, “స్వామీ! ఇన్నాళ్ళకు మమ్మల్ని అనుగ్రహించావు, ధన్యులం!” అని అంటూ జరిగిందంతా పాలేరుకి చెప్పింది.
మహాద్భుతాన్ని విన్న జనం తండోప తండాలుగా అక్కడికి చేరుకుంటున్నారు. దివాణం క్రిక్కిరిసిపోయింది. నేలపై ఏనుగు పాదాల గుంటల్లో నిలిచి ఉన్న చెరుకురసాన్ని తీర్థంగా సేవిస్తూ, చెరుకు పిప్పిని విఘ్నేశ్వర మహా ప్రసాదంగా పట్టుకు వెళ్తున్నారు.
పాలేరు, భార్య పిల్లవాడితో కలిసి వినాయక విగ్రహానికి దణ్ణాలు పెడుతూ, “చిన్న పత్రిపిసరైనా వేసి నిన్నెన్నడూ పూజించలేదు. నీ కోసమని పంపిన చెరుకు నీకు పెట్టనైనా లేదు.. నా కోసం ఎందుకింత శ్రమపడ్డావయ్యా? ఏనుగు రూపంతోనైనా అందరికీ కనిపించావు, నాకు కనిపించావు కావు. నిద్దరపోయిన దద్దమ్మను!” అంటూ పిల్లవాడిలాగ బావురుమన్నాడు.
అప్పుడు విగ్రహం స్థానంలో చెరుకుగడ పట్టుకొని, విఘ్నేశ్వరుడు పాలేరు ముందు సాక్షాత్కరించాడు. పాలేరు కొడుకు తీసుకు వెళ్ళిన చెరుకుగడే అతని చేతిలో ఉంది!
విఘ్నేశ్వరుడు పాలేరును తన తొండంతో దగ్గరకు తీసుకొని, అభయ హస్తంతో అతని తల నిమురుతూ, “నాయనా! కులాలు, జాతులు ఆచారాలు నేను పెట్టినవి కావు, అంతా మనుఘులు కల్పించుకున్నవే. నా దగ్గర ఎక్కువ తక్కువలకు చోటు లేదు! అందుకే నీకు కనిపించాను!” అని చెప్పి అంతర్థానమయ్యాడు.
జనులందరూ చేతులెత్తి జోడిస్తూ పాలేరుతో, “నీ మూలంగా మాకు గణేశుని దర్శన భాగ్యం కలిగింది.” అంటూ పదేపదే మొక్కుతూ బ్రహ్మరథం పట్టారు.
“ఇక్షు అంటే చెరుకు, సహస్ర-ఇక్షు, వెయ్యి చెరుకుల గణపతి; సహ సహస్రేక్షు గణపతిగా విఘ్నేశ్వరుడు కీర్తింపబడ్డాడు. చెరుకుగడ పట్టుకొన్న వినాయక విగహ్రం ప్రతిష్ఠింపబడి అక్కడ గొప్ప ఆలయం వెలిసింది.” అని పావనమిశ్రుడు కథ ముగించాడు.
ఆలయమంటపంలోని చిత్రాల కథలన్నీ పావనమిశ్రుడు చెప్పాడు గాని ముఖద్వారం మీద చిత్రింపబడినది మాత్రం మిగిలి ఉంది. అది చాలా పెద్ద చిత్తరువు. మంటపంలోని చిత్రాలన్నీ ఒక ఎత్తు అది ఒక్కటీ ఒక ఎత్తు! చిత్రలేఖన ప్రతిభ అంతా అందులో ఉంది. ప్రతి రోజూ ఆ చిత్రాన్ని పరీక్షగా నిల్చుని చాలా సేపు తదేకంగా చూస్తూండే యువకుడొకడు పావనమిశ్రుడి పాదాలకు నమస్కరించి, “మహాశయా! ఈ ఆలయ మంటపంలోని చిత్రాలను ఎవరు చిత్రించారు? ఆ మహాశిల్పి చరిత్ర ఏమైనా ఉంటే చెప్పండి! ఆ ముఖద్వారం మీద వున్న చిత్రానికి నా కళ్ళూ, మనస్సూ అంకితమైపోయాయి. ఆ చిత్తరువు గురించిన గాథ కూడా చెప్పి చిత్ర చరిత్ర సంపూర్ణం చెయ్యండి!” అన్నాడు.
పావనమిశ్రుడు ఆ యువకుణ్ణి సాదరంగా చూసి, “నాయనా! చూడగా నువ్వూ చిత్రకారుడిలాగ కనిపిస్తున్నావు! ముఖద్వారం మీది చిత్తరువు నాకూ అభిమాన చిత్రమే. దాని గాథ తర్వాత చెప్పి విఘ్నేశ్వర చరిత్ర సంపూర్ణం చేస్తాను! నువ్వడిగిన చిత్రశిల్పికి చరిత్ర లేకపోలేదు, ఉంది!” అంటూ కన్నులు మూసి ఏదో గుర్తు తెచ్చుకుంటున్నట్లు ధ్యానించి, కాస్సేపై నాక చెప్పడం ప్రారంభించాడు:
వాతాపి నగరానికి సాధువుల గుంపుతో పధ్నాలుగేళ్ళ ప్రాయంగల వాడొకడు వచ్చి వాతాపి గణపతి ఆలయం వదలకుండా అలాగే ఉండిపోయాడు.
అతని ఊరేదో పేరేదో అతనికే తెలియదు. అతని నుదుట పెద్ద గాయం మానిన గుర్తు చూసి, పాపం ఏదో దెబ్బ తగిలి స్మృతి పోగొట్టుకొన్నవాడులాగుంది, అని అంతా అనుకున్నారు. ఆ బాలుడు మూగవాడా అన్నట్లు అట్టే మాట్లాడేవాడు కాడు. గోడల మీద బొమ్మలు గీస్తుండేవాడు. మంటపం రాతిపలకల నేల మీద సుద్దతో బొమ్మలు గీస్తూండేవాడు. గీస్తూన్నంత సేపూ అతని ముఖం పూర్ణచంద్ర బింబంలాగ నవ్వుతూ వెలుగుతూండేది. అంచేత చిత్రానందుడు, చిత్రముఖుడు అనీ, అతడు ఎక్కువగా విఘ్నేశ్వరుడి బొమ్మల్నే వేస్తూండడంవల్ల విఘ్నేశ్వర చిత్రకారుడు అనే పేరును లుప్తాక్షరిగా విచిత్రుడు అని అంటూండేవారు.
అప్పటికి గజాననపండితుడు చాలా వృద్ధుడయ్యాడు. రోజూ సాయంత్రం ఇంటి దగ్గర పిల్లలకు విఘ్నేశ్వరుడి కథలు చెప్పుతూండేవాడు. విచిత్రుడు ఆ కథలను అతిశ్రద్ధగా అరుగు మీద చెవికోసుకొని వింటూండేవాడు. కథ విన్న మర్నాడు ఆ కథకు సంబంధించిన చిత్రం ఏ గోడ మీదనో కనిపించేది.
గజానన పండితుడికి విచిత్రుడి మీద చాలా వాత్సల్యం. ఇంటిలోపలికి పిల్చినా విచిత్రుడు గడప మీద ద్వారం వెలుపలే కూర్చుని వింటూ, “స్వామీ, ఇక్కడ కూచుని వింటేనే నా కొక్కడికే చెబుతున్నట్లు ఎంతో బాగా వినిపిస్తున్నది!” అనేవాడు. విచిత్రుడు చిత్రించే విఘ్నేశ్వరుడి బొమ్మలు చూసి గజాననుడు మురిసిపోతూ, విఘ్నేశ్వరుడికి సంబంధించిన అనేక కథలను ప్రత్యేకంగా అతనికి చెబుతూండేవాడు.
విచిత్రుడి వెనక ఎప్పుడూ పిల్లలు గుంపులుగా ఉండేవారు. అతను బొమ్మలు వేస్తూంటే నిశ్శబ్దంగా చూసి ఆనందిస్తూ, తర్వాత చిన్న చిన్న బొమ్మలు వేస్తూండేవారు. ఊళ్లో పిల్లలకి చిత్రకళ అబ్బింది.
విచిత్రుడు పగలంతా వీధుల్లో గోడల మీద జేగురుముక్కతోనో, సుద్దరాయితోనో బొమ్మలు వేస్తూ, వాతాపి గణపతి ఆలయంలో పంచే ప్రసాదంతో గడిపి, రాత్రి ఆలయమంటపం మెట్లమీద ఓ వారగానో, ఊరి చివరనున్న వాడలో ఏ పంచకిందనో నిద్రపోయేవాడు.
ఆ వాడలో కుమ్మరులు, చర్మకారులు, పంచములు మొదలైనవారుండేవారు. విచిత్రుడంటే ప్రాణం పెట్టేవారు. ఏ అపరాత్రివేళ విచిత్రుడు వచ్చినా అతని కోసం ఉంచినదాన్ని పెట్టి తినిపించి మరీ విచిత్రుడికి పడక సదుపాయం చేసి నిదురపోయే వాళ్ళు.
ఆ విధంగా విచిత్రుడు పెరిగి పెద్ద వాడయ్యాడు.
తానెవరో తనకే తెలియకుండా మరిచి పోయిన విచిత్రుడికి అన్నలూ తల్లీ తండ్రి అందరూ ఉన్నారు!
వాతాపి నగరానికి కొంత దూరంలో ఉన్న ఒక ఊళ్లో మధ్యతరగతి కుటుంబంలో విచిత్రుడు పుట్టాడు. తండ్రి మూలంగా అతనికి అతి బాల్యంలోనే బొమ్మలు గీయడం అబ్బింది. బొమ్మలు వెయ్యడానికే పుట్టాడా అన్నట్లు ఆ కుర్రవాడికి మరేదీ అబ్బలేదు. అన్నలు, వదినలు అతణ్ణి యీసడించుకొని ఇంటి నుండి తరిమేశారు. కుర్రవాడికి విఘేశ్వరుడంటే చాలా యిష్టం. వాతాపి నగరానికి బయలు దేరివస్తూ, తిండీతిప్పలు లేని నీరసంతో మార్గంలో ఒక కరుకురాతి మీద పడి పోయాడు. దెబ్బ తగిలి తెలివితప్పి పడి ఉన్న అతణ్ణి సాధువుల గుంపు కాపాడి వాతాపి నగరానికి తెచ్చారు. అదీ విచిత్రుడి బాల్యచరిత్ర.
ఆ ఏడాది వాతాపి నగరంలో వినాయక చతుర్థి, ఉత్సవాలకు ఒక ప్రదర్శన ఏర్పాటు జరిగింది.
నిలువెత్తు వినాయక విగ్రహాలను చిత్రకళా ప్రతిభ కనపరుస్తూ రంగులు వేసి ప్రదర్శనలో పెట్టాలి. అన్నిట్లో గొప్పగా ఉన్న విగ్రహాన్ని వెయ్యి బంగారు కాసులకు నవరాత్రి ఉత్సవాలు నిర్వహించే వారు కొంటారు. రత్నఖచిత స్వర్ణకంకణాన్ని నగరపాలకులు చిత్రకారుడికి బహూకరిస్తారు.
ఆ పోటీ ప్రదర్శనకు ఆస్థాన చిత్రకారులూ, గొప్ప గొప్ప చిత్రకళా నిపుణులూ చాలా మూల్యాన్ని వెచ్చించి దేశాంతరాల నుండి తెప్పించిన రంగులు, బంగారు పూతలు, రంగురంగుల మెరుపు రేకులు, రంగురాళ్ల పొళ్ళు ఉపయోగించి, మెరుగుపూత పెట్టిన విగ్రహాలను ప్రదర్శనలో పెట్టారు .
విచిత్రుడికి ఒక కుమ్మరి మిత్రుడున్నాడు. విచిత్రుడు దగ్గరుండి చెప్పిన విధంగా అతడు బంక మట్టితో విఘ్నేశ్వర విగ్రహాన్ని చేశాడు. విచిత్రుడు సున్నము, మసి, జేగురు, పచ్చమట్టి, ఆకుపసర్లను ఉపయోగించి విగ్రహానికి రంగులు దిద్దాడు.
విచిత్రుడు రంగులు వేసిన ఆ విగ్రహాన్ని చిత్రకార ప్రముఖులు ప్రదర్శనలో పెట్టనివ్వలేదు. విచిత్రుడు ప్రదర్శన నిర్వాహకులతో, “అయ్యా! దయతో చిట్ట చివర్న నా విగ్రహాన్ని కూడా ఉంచండయ్యా! ఉడతాభక్తిగా నేను కూడా నాకు వచ్చినంతగా విఘ్నేశ్వరుడికి రంగులు వేశానని అనుకుంటూ, ఆ గొప్ప గొప్ప విఘ్నేశ్వరుల సరసన నా విఘ్నేశ్వరుడు కూడా ఉంటే చూసుకోవాలని ఉందయ్యా! అంతకు తప్ప మరే కోరికా లేదు!” అని ప్రాధేయపడ్డాడు.
కాని, “కులగోత్రాలు, ఊరూ పేరూ లేనివాడివి, కడజాతులతో తిరిగేవాడివి. అలాంటి నీ చేతుల్లో తయారైన విగ్రహానికి వంశ ప్రతిష్ఠలుగల ప్రఖ్యాత మహా చిత్రకారుల విగ్రహాల సరసన ప్రదర్శించడానికి అర్హత లేదు!” అని నొక్కి వక్కాణించారు. ప్రదర్శన నిర్వాహకులు. విచిత్రుడు చాలా విచారపడ్డాడు.
కుమ్మరి మిత్రుడు, “ప్రదర్శన పందిట్లో పెట్టకపోతే పోయారు. మనం విగ్రహాన్ని వేరేచోట పెడదాం పద!” అని విచిత్రుడికి నచ్చజెప్పి, ప్రదర్శనశాలకు దగ్గర్లో ఉన్న ఒక అరటిచెట్టు మొదట విగ్రహాన్ని పెట్టి, విచిత్రుణ్ణి తనతో బాటు అక్కడ కూర్చుండబెట్టుకున్నాడు.
ప్రదర్శనశాలలో పెద్దవాళ్ళు విగ్రహాలను చూస్తూ. గుంపులు గుంపులుగా చేరి, విగ్రహాలకు ఉపయోగింపబడిన రంగుల విలువల గురించీ, చిత్రకారుల పదవీ కులగోత్రాల గొప్పలు చెప్పుకుంటూ ఉంటే, పిల్లలంతా విచిత్రుడి వినాయక విగ్రహం దగ్గరికి చేరి హర్షధ్వానాలు చేస్తూ ఆసక్తితో చూస్తున్నారు.
ఆ సమయంలో ఆకాశం నుండి జారిపడ్డ జంట మెరుపుల్లాగ ఉన్న ఇద్దరు తరుణులు, ప్రదర్శనశాలకు వచ్చారు. వారు నిండుగా ధరించిన రత్నాభరణాల కాంతి మిరుమిట్లు గొల్పుతున్నది.
జనం వారిని చూసి విస్తుబోతూంటే, పెదామె, “కళానంద నగరం మాది. మాకు నచ్చిన వినాయక విగ్రహం కోసం పదివేల వరహాలు పట్టుకు తిరుగు తున్నాం!” అంటూ చేతనున్న బంగారు జలతారు అల్లిక సంచిని గల గల్లాడించింది. అక్కడ ఉన్న చిత్రకారులు చరచరా వారి వారి విగ్రహాల దగ్గరికి వెళ్ళి నిల్చున్నారు.
“మా అక్క ప్రసన్నవదన గొప్ప గాయనీమణి. అంతే కాదు, గొప్ప తిండి పోతు. నైవేద్య పుష్ఠి, విగ్రహపుష్ఠి తర్వాతనే గాత్రపుష్ఠి. బొజ్జ పెంచి పాడిచూడు. అనే గాయక సిద్ధాంతాలకు తార్కాణం మా అక్క ప్రసన్నవదన!” అంటూ సుకుమారంగా సమ్మోహనాస్త్రంలాగున్న చిన్నామె కాలిమువ్వలు ఘల్లు మనిపించింది.
“మా చెల్లి మోహన గొప్ప వాగుడుకాయ, అంతకంటే గొప్ప నర్తకీమణి! చూడ్డానికి చిన్నారి చిట్టిలాగుందే కాని, నన్నే ఎత్తి తిప్పేస్తుంది! అంత శక్తి సామర్థ్యాలున్నాయి దానికి. నృత్యంలో దాని చురుకుదనం చూడ శక్యం కాదు!” అని ప్రసన్నవదన చెప్పింది.
“మా చేత పాడించడం, ఆడించడం, ఆ ఇంద్రుడికీ, కుబేరుడికీ సాధ్యం కాదు. అలాంటి ఆటపాటల్ని, మాకు కావలసిన విగ్రహం ముందు జరుపుతామని మొక్కుకున్నాం!” అని మోహన చెప్పింది.
వారి మాటలకు పరవశించిపోతూన్న జనం మంత్రించినట్లుగా పక్కకు తప్పుకుని విశాలంగా దారి చేశారు.
-వచ్చే సంచికలో ముగింపు)
Post a Comment