విఘ్నేశ్వరుడు (చందమామ)
Vignaeswarudu Novel (CHANDAMAMA)
22. సహస్రేక్షు గణపతి
అవ్వ ఒక రోజున ఫలవృక్షాలతో నిండివున్న మార్గంగుండా వెళ్తూండగా ఒక అందమైన బాలకుడు చెట్టు మీద కూర్చుని పాడుకుంటున్నాడు. చెట్టునిండా పళ్ళు విరగపండి వున్నవి.
ఆ కుర్రవాణ్ణి పలకరించి మాట్లాడాలని అవ్వకు బుద్ధి పుట్టింది. “నాయనా! ఒక పండు యిలా పడెయ్యవూ! నోరూరు తున్నది,” అని అన్నది.
బాలుడు నవ్వుతూ, “అవ్వా! ఏపండు కావాలి? చెట్టు నిండా రకరకాల పళ్ళున్నవి. ముసలితనాన్ని పోగొట్టే పండు యిమ్మంటావా? మృత్యువుని దూరంజేసే పండా? ధనరాసుల్నిచ్చే పండా? ఎలాంటి పండు కావాలి?” అన్నాడు.
అవ్వకు ఆ బాలుడు సుబ్రహ్మణ్యేశ్వరుడే అని తెలిసిపోయింది. ఆమె చేతులెత్తి మొక్కుతూ, “సుబ్రహ్మణ్య స్వామీ! ఎంత పంచినా తరగని అపార జ్ఞాన సంపదనిచ్చే పండు యివ్వు, తండ్రీ! జ్ఞానఫలాన్ని అనుగ్రహించు!” అంటూ సాగిలపడింది.
సుబ్రహ్మణ్య స్వామి నిజరూపంతో దండాన్ని ధరించి నెమలిపై సాక్షాత్కరించాడు. అవ్వ శిరస్సు బళ్ళెపు మొనతో సుతారంగా తాకి అనుగ్రహించాడు. అవ్వకు ఒక్కసారిగా విశ్వస్వరూపమైన ఓంకార తత్వము, బ్రహ్మ జ్ఞానము, జీవన్ముక్తి మార్గము తెలిసి అపారమైన జ్ఞానం కలిగింది. సుబ్రహ్మణ్యేశ్వరుడు అవ్వను ఆశీర్వదించి అంతర్థానమయ్యాడు.
అవ్వకాలి నడకను ఊరూరా, వాడవాడా జ్ఞానాన్ని, భక్తిని, ఉత్తమ జీవన ధర్మాలను సామాన్యులకు తెలిసే మాటలలో ప్రబోధిస్తూ దేశ సంచారం చేసింది.
అవ్వ నోటి నుంచి వచ్చిన మధుర వాక్కులు కవితలాగ గీతాలై ప్రజాసామాన్యంలో వ్యాప్తి పొంది చిరస్థాయిగా నిలిచాయి. ఆ అవ్వ అలా వెళ్తూ చీకటిపడ్డ వేళకు ఒక అరణ్య మార్గానికి వచ్చింది. ఆకాశంలో మేఘాలు దట్టంగా క్రమ్ము కొచ్చాయి. చిట్టచీకటిగా వుంది. ఉండి, ఉండి మెరుస్తున్నది. తుప్పర పడుతున్నది. అవ్వ కాలికి రాయి తగిలి పడిపోయింది. చేతనున్న ఊతకర్ర దూరంగా పడింది.
ఆ చీకటిలో ఎవరో వస్తున్న పాదధ్వని మధురంగా వినిపించింది. అవ్వ తలఎత్తి చూసింది. అప్పుడే మెరిసింది. మెరుపు వెలుగులో ముద్దుగా, బొద్దుగా దోరపు బొజ్జతో ఒక బాలుడు కనిపించాడు. ఆ బాలుడు అవ్వను లేవనెత్తి కర్రతెచ్చి అందించాడు. అవ్వ పట్టిన కర్రను బాలుడు కదలకుండా పట్టుకుని, “అవ్వా! ఎక్కడికి వెళ్తున్నావు? ఏ క్షేత్రం చూడాలని వెళ్తున్నావు? ఏ తీర్థం సేవిస్తావు?” అని అడిగాడు.
“నాయనా! నాకు యీ పుడమి అంతా ఒకే ఒక దివ్యక్షేత్రం. ప్రత్యేకంగా క్షేత్రాలు, తీర్థాలు సేవించాలని నాకులేదుగాని నేను చేరవలసిన క్షేత్రాన్ని ఎలాగ చేరాలో దారి కనిపించడం లేదు. ఇంతకూ నువ్వెవరో ఏమిటో! పసివాడివి యీ చీకటిలో వస్తున్నా వెందుకు?” అని అవ్వ అన్నది.
“అవ్వా! నేను నీ ఆబాల్య సన్నిహితుణ్ణి, పుట్టినప్పట్నించీ నన్నెరిగున్న దానివే, చీకటిలో గుర్తించ లేకపోతున్నావు! ఇంతకూ నువ్వు చేరాలనుకుంటున్న ఆ క్షేత్రం ఏమిటో చెప్పావు కాదు!” అన్నాడు బాలుడు.
“చెప్పి ఏంలాభం! తీసుకెళ్తావా? అది శివసన్నిధానం అనే మహా క్షేత్రం! అన్నది అవ్వ.
“ఓష్! ఈ మాత్రందానికేనా, అదెంత పని నాకు! నీ చెయ్యి పట్టుకొని తీసుకెళ్తాను, పద!” అంటూ బాలుడు అవ్వ చేతిని పట్టుకొని అడుగు వేశాడు. రెండో చేత ఊతకర్రతో అవ్వ అడుగు ముందుకు వేయబోతుండగా పెద్ద మెరుపు మెరిసింది. ఆ కాంతిలో తన చేతిని తొండంతో పట్టుకొని నడిపించే విఘ్నేశ్వరుణ్ణి చూసి అవ్వ కన్నులు మూసి, “దేవా! చిన్ననాటి నుంచీ నువ్వే నడిపిస్తున్నావు, నేను కన్నులు మూసుకున్నా తెరిచినా ఒకటే!” అని అనుకుంటూ కళ్ళు తెరవకుండానే విఘ్నేశ్వరుడు ఎక్కిస్తూ తీసుకెళ్తూంటే ఎన్నో ఎన్నో మెట్లు ఎక్కుతూ, అలా ఎంత కాలం గడిచిందో తెలీకుండా వెళ్ళింది.
అలా వెళ్ళగా వెళ్ళగా, “అవ్వా! శివసాన్నిధ్యాన్ని సమీపించాము!” అని అన్న విఘ్నేశ్వరుని మాటకు అవ్వ కన్నులు తెరిచి చూసింది.
అక్కడ వెలుగు తప్ప మరేమీ కనిపించలేదు. క్రిందికి చూస్తే అనేక నక్షత్ర మండల సముదాయాలు సోపానపంక్తుల్లాగ కనిపించాయి. ఎన్నెన్నో సూర్యకుటుంబాలు, తోకచుక్కలు, వాయు రూపంలో తిరుగుతూ పెరుగుతున్న జ్యోతులు, వెలుగు చక్రాల్లాగ గిర్రున తిరుగుతున్న తేజోమండలాలతో నిండిన అనంత విశ్వం పాదాల దిగువ కన్నులపండువుగా వున్నది.
విఘ్నేశ్వరుడు అవ్వ చేతిని వదలి, “అవ్వా! శివసన్నిధానాన్ని చేరుకున్నావు. ఇక్కడ కాలం అనేది లేదు. నాశము అనేది లేదు. ఇదే సృష్టి స్థితిలయాలకు అతీతమైన శివుని సన్నిధానం. అసలు కైలాసం! విశ్వనాథుడు విశ్వేశ్వరుడైన శివుణ్ణి దర్శించు!” అని చెప్పి అంతర్థానమయ్యాడు.
అవ్వకు లింగాకారంగా మీదకూ కిందకూ ఒకేలాగ వ్యాపించి ఉన్న గొప్ప జ్యోతి కనిపించింది. ఆ జ్యోతిలో ప్రమథ గణాలు చేస్తున్న స్తోత్రం ఓంకారధ్వనిగా వినిపిస్తున్నది. విశ్వేశ్వరుడైన శివుడు కనిపించాడు. అతనికిరుపక్కలా, విఘ్నేశ్వరుడు, పార్వతి కుమారస్వామి, నంది మొదలైన వారంతా ఉన్నారు.
అవ్వకు శివ సాక్షాత్కారమైంది. శివుడు ప్రీతితో తన అభయహస్తాన్ని అవ్వ తలపై ఉంచి అనుగ్రహించాడు. ఆ విధంగా అవ్వ శివసాయుజ్యాన్ని పొందింది.
మంటప చిత్రాల్లో చెరుకుగడ పట్టి ఉన్న విఘ్నేశ్వరుడిని ఒక రైతు కుతూహలంగా చూస్తూండడం గమనించి పావన మిశ్రుడు కథ ఆరంభించాడు:
రాజంతటి భూస్వామి ఒకడు ఏటేటా వినాయక పూజలు, ఉత్సవాలు ఘనంగా జరిపిస్తూ, గణేశభక్తశిరోమణి అనిపించుకున్నాడు. అతనికి అనేక పంటపొలాలతో బాటు పెద్ద చెరుకుతోట ఉంది.
ఆ చెరుకు తోట పని అంతా చూసుకుంటూ ప్రతి ఏటా పుష్కలంగా చెరుకు పండించి భూస్వామికి మంచి రాబడి చేకూర్చే పాలేరు, మనస్సులో విఘ్నేశ్వరుణ్ణి నమ్మిన భక్తుడు. “ఈసారి మరింత బాగా పండించు గణేశా!” అని మనస్సులో మొక్కుతూ చెరుకునాటి ఏడాదికేడాది తన యజమానికి మరింత లాభం చూపించేవాడు.
పాలేరూ అతని భార్యా, పదేళ్ళ కొడుకు ముగ్గురూ చెమటోడ్చి పని చేసేవారు. భూస్వామి మాత్రం చాలా తగ్గించి కూలి ఇచ్చేవాడు, అదీ సరిగా ఇచ్చేవాడు కాదు. పాలేరు అమాయకుడు, అల్ప సంతోషి ఏమీ అనేవాడు కాడు.
భూస్వామి భార్య ఉత్తమురాలు, మంచి అయినా చెడ్డ అయినా మనస్సులో గణేశుడికే నివేదించుకొనేది. పాలేరుకి కూలి యివ్వడంలో భర్త మరీ అన్యాయం చేస్తూంటే, “పాపం, వాళ్ళు పడే కష్టానికి మీరిచ్చేది ఏ మాత్రం? సరిగా యివ్వండి!” అనేది.
“బాగానే ఉంది. నీ బోడి సలహా! ఇలాగ మిగుల్చుకుంటూ వస్తేనే గదా మనం గణేశ ఉత్సవాలు జరిపించేది!” అనేవాడు భూస్వామి.
ఆమె “కష్టపడేవాళ్ళ నోట మట్టి గొట్టి పూజలూ, ఉత్సవాలూ జరపకపోతేనేం? గణేశా, ఈయనకు మంచి బుద్ధి కలిగించు!” అని అనుకునేది.
ఆ ఏడాది చెరుకు ఏనుగుతొండాల్లాగ మరింత విశేషంగా పండింది. వెయ్యేసి చెరుకులు కట్టిన మోపులు బళ్ళతో భూస్వామి దివాణం చేరుతున్నాయి.
“అంతా గణేశ్వరుడి దయ. ఊరికే పోతాయా, పూజలూ ఉత్సవాలు. మరిదేనికి చేయిస్తున్నాం!” అన్నాడు భూస్వామి.
“అంతే గాని మన పాలేరు శ్రమ ఏమీ లేదంటారు. అంతేనా?” అని భార్య అన్నది.
“బాగానే ఉంది నీ వల్లమాలిన జాలి! అలా పాలేర్లనూ, జీతగాళ్ళను వెనకేసుకొస్తే మనం కూడా వాళ్ళ వెనక్కే వెళ్ళ వలసి వుంటుంది. ఈ మనుషుల్లో ఏముంది. అంతా ఆ వినాయక దేవుడి మహిమ!” అన్నాడు భర్త.
“ఓ విఘ్నేశ్వరా! ఈయనకు జ్ఞానోదయం కలిగించవలసింది నీవే!” అని ఆమె మనసులో ప్రార్థించింది.
పాలేరు కొడుక్కి విఘ్నేశ్వరుడంటే ప్రాణం. వినాయక చవితికి తెల్లకలువలూ, ఎర్రతామరలూ, పూలూ, పత్రీ ప్రతి ఇంటికీ పూజకు తెచ్చి యిచ్చేవాడు.
వినాయక చవితి వచ్చింది. కుర్రవాడి ప్రాయంతో బాటు బుద్ధి కూడా ఎదుగుతున్నదేమో. వాడు చెరుకు మోపుల్ని భూస్వామి దివాణానికి చేరవేయిస్తున్న తండ్రి దగ్గరి కెళ్ళి, “నాన్నా, మనం కూడా వినాయకుడికి పెట్టుకుందాం. ఒక చెరుగ్గెడ తీసుకెళ్తా!” అన్నాడు.
పాలేరు ఒక చెరుకు తీసి కొడుక్కిచ్చాడు. వాడు దాన్ని ఇంటికి తీసు కెళ్తున్నాడు. అది భూస్వామి కంటబడింది.
భూస్వామి ఆ ఉగ్రనరసింహావతారుడై, “ఏమిరా.. నా చెరుకంతా నీ ఇంటికి చేరవేయిస్తున్నావా?” అంటూ పొలేరు పై విరుచుకుపడి నానా మాటలూ అంటూ, కొరడాతో కొడుతూంటే, భూస్వామి వెంటనున్న పరివారమూ, గ్రామస్థులూ చూస్తూ ఊరుకున్నారేగాని కిక్కురు మనలేదు . భూస్వామి పలుకుబడి అలాంటిది! అతడేం చేసినా చెల్లుతుంది, ఎదురు తిరిగి అడిగేవాడు లేడు.
పాలేరు తాళుకోలేక, “చవితి కదా వినాయకుడికి పెట్టుకుందామని పట్టుకెళ్ళమని యిచ్చాను, ఒక్కటంటే ఒక్క చెరుకు.....” అన్నాడు.
భూస్వామి. “ఏమిటీ! మీ జాతి తక్కువ వాళ్ళకి పూజలూ, వినాయకుడూనా?” అన్నాడు.
పాలేరు, “కడజాతి అయితే అయింది గాని, దేవుడూ భక్తీ ఉండవా?” అన్నాడు.
భూస్వామి హేళనగా, “నీ ముఖానికి భక్తి కూడానా! నక్కకూ, నాకలోకానికి ఉన్నంత దూరం! చెరుగెడ పట్రా!” అన్నాడు.
పాలేరు, “ఒక్క చెరుకు కోసం అలా రాపాడిపోతారేమయ్యా? బళ్ళతో చెరుకు దింపుకున్నది చాలదా. ఒక్క చెరుకుతో ఏం బావుకుంటావయ్యా?” అన్నాడు.
భూస్వామి, “ఎంత మాట కూశావురా! ఒకటి కాదు పది కాదు వెయ్యి చెరుకులైనా నాకు పూచిక తో సమానం తెలుసా! తెల్లవారే సరికి నువ్వు వెయ్యి చెరుకులు తినాలి! నమిలిన పిప్పి అంతా పోగు కనిపించాలి! లేకుంటే చెరుకొక్కంటికి వెయ్యి కొరడా దేబ్బలు తింటావు, తెలిసిందా!” అంటూ పాలేరును పెడరెక్కలు విరిచి కట్టించి, భృత్యులచేత వాణ్ణి బందీలాగ చెరుకు నిలవ చేసే సాలలో వ్రాయించి, వెయ్యి చెరుకుల మోపు ముందు పడ వేయించాడు.
భూస్వామి గొప్ప తిక్కమనిషి, ఎంత తోస్తే అంత. పాలేరు నుంచిన సాల చుట్టూరా భటుల్ని కాపలా పెట్టాడు.
భూస్వామి భార్య, “వి ఘ్నేశా పాలేరు ఉత్త అమాయకుడు. చెరుకు తినడానికి పూనుకుంటే పాపం నిష్కారణంగా చస్తాడు. తినక పోతే నా భర్త దెబ్బలు కొడతాడు. వాణ్ణి ఎలాగ కాపాడ తావో మరి!” అని మనసులో అనుకొంది.
పాలేరుకి ఏమీ తోచలేదు. చేసేదిలేక విఘ్నేశ్వరుణ్ణి తలచుకొంటూ, చీకటిపడే వేళకు అలాగే నిద్రలో పడిపోయాడు.
తెల్లవారుతూనే భూస్వామి వెళ్ళి చూస్తే, తెల్లగా హిమాలయపర్వతంలాగ చెరుకు పిప్పిపోగు కనిపించింది. భూస్వామి దెయ్యం పట్టినవాడిలాగ పెద్ద కేక పెట్టి, తెరిచిన నోరు తెరిచినట్టే ఉండి పోయాడు.
ఆ కేక విని వచ్చిన భార్యతో భూస్వామి, “అంతా సర్వనాశనం! సాలలో ఒక్క చెరుకు మిగలకుండా అంతా పిప్పి పిప్పి! పాలేరు కాడు, భూతం! వాడు మనల్నీ తినేస్తాడు, పద!” అంటూ అరుస్తూంటే, ఆమె నవ్వి, “వాడు భూతమూ కాదు, తిననూలేదు, నేను కళ్ళారా చూశాను. అప్పటికింకా తెల్లారలేదు. ఏనుగ ఘీంకారం విని. కిటికీ లోంచి చూశాను. పెద్ద ఏనుగు చెరుకు మేస్తూ కనిపించి మాయమైంది!” అన్నది.
“ఏనుగేమిటి, నీ మొహం! యీ చుట్టు పక్కల ఏనుగన్నది ఉన్నట్టు వినలేదు.” అని భూస్వామి అంటూండంగా, కొంత మంది వినాయక ఉత్సవశాల నుండి పరుగున వచ్చి, “రాత్రినుంచీ పందిట్లో పూజలో పెట్టిన వినాయక విగ్రహం కనిపించటం లేదు. అంతటా వెతికాము,” అని చెప్తూనే సాలలోకి చూస్తూ, “అదుగో, విగ్రహం, అదుగో!” అంటూ అటు కేసి వెళ్ళారు.
Post a Comment