విఘ్నేశ్వరుడు (చందమామ)
Vignaeswarudu Novel (CHANDAMAMA)
18. చళుక వర్మ కథ
శత్సంజయుడు ఎలుకతో చళుక వర్మను దూరంగా చిన్న ఇంటికి తరిమి, “నువ్వు, మా మధ్య ఉండవలసిన వాడివి కావు. నీ ఎలుక వాహనుడైన విఘ్నేశ్వర భక్తికి తగ్గట్టు, ఆ వాహనం జాతిదే నీకు తగ్గ ఇల్లాలు! నీ ఇల్లాలు అసూర్యం పశ్యగా ఎవరికీ కనపడకుండా ఉండే అంతఃపుర కాంతగా ఉండడానికి ఇంటినిండా ఎలుక బిలాలు ఉన్నవిలే!” అంటూ ఎకసక్నెం చేశాడు.
చళుకుడు తండ్రి మాటలకు ప్రశాంతంగా, “తండ్రి, కుమారులందరికీ పెళ్ళి చేయడమనేది చాలా గొప్ప విషయం! ఎవరి కెవ్వరో అది ఏనాడో రాసి పెట్టిందే అంటారు. మన చేతుల్లో ఏమీ లేదు! అంతా ఆ విఘ్నేశ్వరుని ఇచ్ఛకదా!” అన్నాడు.
చళుకుడు ఉత్తమ గ్రంధాలను చదువుతున్నప్పుడు చుళుక పక్కనే చేరి వింటూండేది. చళుకుడు విఘ్నేశ్వరుణ్ణి అర్చిస్తూన్నప్పుడు నోటితో పువ్వులు అందించేది. చళుకుడు తిన్న తర్వాత పెడితేనే తినేది. అలా కాలం గడుస్తూండగా వినాయక చవితి దగ్గరికి వచ్చింది.
అందరూ ఇళ్ళకు వెల్లవేసి ధాన్యాలు దంచుకొంటున్నారు. చుళుక రాత్రికి రాత్రి ఎలుకలన్నిటినీ పిలిచింది. ఎలుకలు తోకలు ముంచి ఇంటి గోడలకు సున్నం కొట్టాయి, పళ్ళతో పై పొట్టు వొలిచి ధాన్యాన్ని మెరికల్లా బియ్యం చేశాయి.
వినాయక చవితి ఉదయాన చళుకుని వదినలు స్వయంగా బంగారు బిందెలతో నదీజలాన్ని నెత్తినెత్తుకొని వస్తున్నారు. అది చూచి చళుకుడు కొద్ది విచారం కనబరిచాడు.
చుళుక వెంటనే బిందెలో దూరి దొర్లించుకుంటూ నదీతీరాన్ని చేరుకుని యివతలకి వచ్చి కొండంత బిందెనూ, పొంగిపొర్లి ప్రవహిస్తున్న నదినీ చూసి హతాశురాలై, “బిందెనైతే దొర్లించు కొచ్చాను గాని, నీళ్ళెలా ముంచగలను? బిందెతో ఎలా మోసుకెళ్ళగలను? అవివేకురాల్ని, పనికి మాలిన దాన్ని, నేనెందుకు బ్రతికి?” అని అనుకుంటూ తలను అక్కడున్న రాతికేసి కొట్టుకుంటుండగా విఘ్నేశ్వరుడు అక్కడ ప్రత్యక్షమై, ఎలుకను చేతితో ముద్దుగా నిమిరాడు. శాపవిమోచనమై ఎలుక రూపు మాయమై దేవకాంత కళ్యాణ కింకిణి నిజరూపంతో విఘ్నేశ్వరుడి పాదాల మీద ప్రణమిల్లి, అనేక విధాల స్తుతించింది. విఘ్నేశ్వరుడు కళ్యాణకింకిణిని ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు.
కళ్యాణ కింకిణి నీళ్ళ బిందెను తలకెత్తుకొని నడిచి వెళ్తూంటే, దారి పొడవునా ప్రజలు బొమ్మల్లాగ నిల్చుని చూస్తూ, “ఎవరీ దేవసుందరి? ఎవరింటికి వెళ్తున్నది?” అని విస్తుపోయారు.
చళుకవర్మ వదినలు కళ్యాణకింకిణి తమ చిన్న మరది ఇంటిలోకి వెళ్ళడం చూసి, ముఖాలు వేలాడదీసుకున్నారు.
శతృంజయుడు తన అజ్ఞానానికి తనే సిగ్గుపడి, చళుక వర్మను సతీసమేతంగా రాజమందిరానికి తోడ్కొని వచ్చాడు.
చళుకుని అన్నలు తండ్రితో, “మాకూ అలాంటి ఎలుకలతోనే ఎందుకు పెళ్ళిళ్ళు చేయలేదు? అలా చేసి ఉంటే మాకూ అప్సరసలే తయారై వచ్చి ఉండేవారు కదా!” అని గద్దించి అడిగారు.
ఇటువంటి తెలివిమాలిన కొడుకుల కోసమా నేను సామ్రాజ్యాన్ని ఆర్జించి పెట్టింది! అని శతృంజయుడు విరక్తి చెంది తపస్సు చేసుకోడానికి అరణ్యాలకు పోయాడు.
చళుక వర్మ అన్నలు అసంతృప్తి, పరస్పర ద్వేషాలతో కలహించి యుద్ధాలు చేసి కొట్టుకుచచ్చారు. ఎంత వద్దంటున్నా వినక, ప్రజలు చళుక వర్మను తమ రాజుగా ప్రకటించుకున్నారు. చళుకవర్మ పాలనలో ప్రజలు సుఖశాంతులతో జీవించారు.
చళుక వర్మ కళ్యాణ కింకిణి పేరున కళ్యాణి అనే మరొక గొప్ప నగరాన్ని నిర్మించాడు. అతనికి కళ్యాణకింకిణి వలన నలుగురు పుత్రులు కలిగారు. వారు చాళుక్యులుగా పిలువబడ్డారు. ఆ విధంగా చాళుక్య రాజవంశాలకు మూల పురుషుడైన చళుక వర్మ కాలంలో వాతాపి నగరం అనేక దేవాలయాలతో, ప్రాకారాలతో శోభిల్లింది. కళలకు కాణాచిగా, విద్వాంసులకు పండితులకు ఆటపట్టుగా, భూతల స్వర్గం అనిపించుకుంది. నగరాధిదేవతగా విఘ్నేశ్వరుడు ఆరాధింపబడ్డాడు. ఉత్కృష్టశిల్పానికి ప్రామాణికమైన ఆలయమంటపశిల్పాన్ని చూడ్డానికి దేశం నలుమూలల నుంచీ రాజులు మొదలుకొని సామాన్య యాత్రికుల వరకూ ఎల్లప్పుడూ వస్తూండేవారు.
చాళుక్యులు నాలుగు దిక్కులా రాజ్యాలు ఏర్పరుచుకొని పాలించారు. చాళుక్య వంశ రాజులు శాఖోపశాఖలుగా దేశమంతటా వ్యాపించి రాజ్యాలు చేశారు. వాతాపి నేలినవారు వాతాపి చాళుక్యులనీ, కళ్యాణి నగరాన్ని పాలించినవారు కళ్యాణి చాళుక్యులనీ, వేంగి నేలినవారు వేంగీ చాళుక్యులనీ, తూర్పుచాళుక్యులు,పశ్చిమ చాళుక్యులు, సౌరాష్ట్ర చాళుక్యులుగా పేరొందారు. కాలక్రమాన వాతాపిని బాదామి అని కూడా వ్యవహరించారు.
విఘ్నేశ్వర వినోద గాథలు
వాతాపి గణపతిగా విఘ్నేశ్వరుడూ, విఘ్నేశ్వర క్షేత్రంగా వాతాపి నగరమూ దేశాంతరాల్లో పేరు మ్రోగుతున్న కాలంలో, పావనమిశ్రుడు అనే పండితుడు సాయంకాలాల్లో వాతాపి గణపతి ఆలయ మంటపంలో పిల్లలకు విఘ్నేశ్వరుడికి సంబంధించిన కథలను చెపుతూండేవాడు.
మంటపం గోడలపై విఘ్నేశ్వరుడి గాథలు చిత్రాలుగా చిత్రితమై ఉన్నాయి. ఆ చిత్తరువుల్లో వినోదకరమైన ఒక చిత్రాన్ని ఒక పిల్లవాడు గురువుకు చూపించి ఆ కథ చెప్పమన్నాడు.
పావనమిశ్రుడు కథ ప్రారంభించాడు:
ఒక నగరంలో సత్యశర్మ, లోభగుప్త ఇరుగు పొరుగున ఉండేవారు. లోభగుప్తుడి అసలు పేరు లాభగుప్త, కాని అతని లోభితనానికీ, అత్యాశకూ ఊళ్ళో వారంతా లోభగుప్త అనే స్థిరపరిచారు.
సత్యశర్మ, లోభగుప్త రోజూ శివాలయానికి వెళ్ళేవారు. సత్యశర్మ గర్భ గుడిలోకి వెళ్లే దారిలోనే ఉన్న విఘ్నేశ్వర విగ్రహం ముందు ప్రణమిల్లి స్తోత్ర గానం చేశాక శివదర్శనం చేసుకొని వెళ్లేవాడు.
లోభగుప్తుడు గర్భాలయం ప్రవేశిస్తూనే శివలింగం ముందు సాగిలిపడి కోటి లాభాలు చేకూర్చమని చాలా సేపు అలాగే ధ్యానిస్తూండేవాడు.
ఒకనాడు సత్యశర్మ శివదర్శనం చేసుకొని వెళ్తూండగా, లోభగుప్తుడు వస్తున్న సమయంలో నంది విఘ్నేశ్వరుడితో, “విఘ్నేశ్వరా! నీ భక్తుడు సత్యశర్మ చాలా డబ్బు అవసరంలో ఉన్నాడు. అతణ్ణి ఆదుకోవలసిన అవసరం లేదా?” అన్నాడు.
“ఔనోయి, నందీ! ఈ సాయం కాలానికి అతనికి వెయ్యి వరహాలు అంది స్తున్నాను!” అని విఘ్నేశ్వరుడు అన్నాడు.
రాతి విగ్రహాలు మాట్లాడుకుంటున్న మాటలు ఆశ్చర్యంతో లోభగుప్తుడు విని, క్షణం ఆలస్యం చేయకుండా సత్యశర్మ ఇంటికి వెళ్లి, “శర్మా! నువ్వేదో అవసరంలో ఉన్నట్టుంది, ఐదువందల వరహాలు ఇస్తాను, తీసుకో!” అని చెప్పి వెళ్ళి డబ్బు తీసుకొచ్చాడు.
సత్యశర్మ, “అయ్యా గుప్తగారూ! నిన్ననే కదా అసలు వడ్డీలతో మీరిచ్చిన రుణం తీర్చకపోతే ఇల్లు ఖాళీ చేయమని చెప్పారు. ఈ అయిదువందలూ ఎలాగ తీర్చగలను?” అన్నాడు.
లోభగుప్తుడు, “అదా నీ సందేహం! ఈ ఐదు వందలు తీసుకుని సాయం కాలానికి నీకు లభించిన మొత్తం ఎంతయితే అంత నాకు యిస్తే చాలు!” అన్నాడు.
సత్యశర్మ తటపటాయిస్తూంటే, అతని భార్య, “ముందు ఆ ద్రవ్యాన్ని తీసుకోండి, అవతల పెళ్ళివారు చాలాసేపై కూర్చుని ఉన్నారు!” అని ప్రోత్సహించింది.
సత్యశర్మ కుమార్తెకు అప్పుడే పెళ్ళి కుదిరింది. వరుడి తల్లి తండ్రి అయిదు వందల వరహాల విలువ చేసే నగలు పిల్లదానికి పెట్టాలని పట్టుబట్టారు.
సత్యశర్మలో భగుప్తుడితో, “అయ్యా, సాయంకాలానికి నాకు లభించింది ఇవ్వడానికి నా కెలాంటి అభ్యంతరమూ లేదు కాని, అలా లభించే ఆస్కారం ఏదీ లేదు.....” అంటూ నసుగుతూంటే, లోభగుప్తుడు, “అదంతా వదిలెయ్యి, మనం ఇరుగు పొరుగు వాళ్ళం! ఇప్పుడు నేనిస్తే తర్వాత నువ్విస్తావు. యీ మాత్రం దానికి మొహమాట పడకు” అంటూ ఐదు వందల వరహాల మూట సత్యశర్మ చేత పెట్టాడు.
సత్యశర్మ సత్య సంధుడని లోభగుప్తుడికి బాగా తెలుసు.
సాయంత్రం ఔతున్నది కాని సత్యశర్మకు ఏ వరహాలూ అందిన సూచన కనిపించలేదు. లోభగుప్తుడు కంగారు పడుతూ , దేవాలయానికి పరుగెత్తి, విఘ్నేశ్వర విగ్రహం తొండం పట్టుకొని లాగుతూ, “ఏమయ్యా, విఘ్నేశ్వరా! సత్యశర్మకు వెయ్యి వరహాలు త్వరగా ఇప్పించుమరి.....” అని అంటూండగా ఆతని అరచేయి తొండం సందున ఇరుక్కు పోయి తీస్తే రాకుండా తొండం మరింత గట్టిగా బిగించి నొక్కి పట్టింది.
నొప్పితో లోభగుప్తుడు కిరకిరలాడి పోతూంటే, “సత్యశర్మకు వెయ్యి వరహాలు ఎంత త్వరగా నువ్వు ఇప్పిస్తే అంత త్వరగా నీకు విడుదల!” అని విగ్రహం నుండి వినిపించింది.
లోభగుప్తుడు రెండో చేత్తో నెత్తీ నోరూ బాదుకుంటూ, “అన్యాయం దేవుడా, అన్యాయం! ఐదువందలు ముందే ఇస్తిని గదా!” అని పెడబొబ్బలు పెట్టాడు.
“అదా సంగతి! ఐదువందలు ఇచ్చి వెయ్యి పుచ్చుకొని సునాయాసంగా అయిదువందల వరహాలు కాజేద్దామని ఎత్తు వేశావన్నమాట! ఆశాపాతకుడా, నీ దురాశకు ప్రాయశ్చిత్తంగా సత్యశర్మకు మిగతా ఐదు వందలూ యివ్వడమే గాకుండా, అతడి కిచ్చిన రుణాన్ని చెల్లు పెట్టి, అతని కుమార్తె వివాహం నీ స్వంత ఇంటి పెళ్ళి లాగ జరిపించు!” అని విఘ్నేశ్వర విగ్రహం నుండి గంభీరగర్జన వినిపించింది.
లోభగుప్తుడు క్షణాల మీద తన వారిని పిలిపించి, సత్యశర్మకు మిగతా ఐదు వందల వరహాలూ ఇప్పించి, అతని రుణానికి చెల్లు పెట్టించి, అతని కూతురు పెళ్లి ఖర్చంతా పెట్టుకుంటానని ప్రమాణం చేశాకనే అతని చేయి ఇవతలికి వచ్చింది.
లోభికి మంచి శాస్త్రి జరిగిందని ఊరు ఊరంతా చెప్పుకున్నారు.
లోభగుప్తుడు సత్యశర్మ కుమార్తె వివాహాన్ని స్వంత కూతురు వివాహంలాగ వైభవంగా జరిపించాడు. అప్పట్నించి బుద్ధి తెచ్చుకొని లోభగుణాన్ని విసర్జించి, అన్యాయంగా ఆర్జించిన ఆస్తిని ధర్మ కార్యాలకు వినియోగించి, విఘ్నేశ్వరుడి దయకు పాత్రుడై, గొప్ప ధార్మికుడని పించుకున్నాడు.
కథ ముగించి పావనమిశ్రుడు విఘ్నేశ్వర ప్రసాదాన్ని తెచ్చి పిల్లలకు పంచాడు. పిల్లలు ప్రసాదాన్ని నోట్లో వేసుకొని ఆనందంగా కేరింతాలు కొడుతూ ఇళ్ళకు పరుగెత్తారు.
మరొక సాయంత్రం ఒక బాలిక మంటపం గోడలపై గల మరో చిత్రాన్ని చూపించి కథ చెప్పమన్నది. పావన మిశ్రుడు ప్రారంభించాడు:
కళ్యాణినగరంలో కలహకంఠి అనే ధనికురాలు, కోడలు పుట్టింటినుంచి ఎక్కువగా నగలు పెట్టుకురాలేదని సాధింపుతో రాచిరంపాన పెట్టి పెట్టి, చివ రకు నిర్దాక్షిణ్యంగా వెళ్ళగొట్టింది.
కలకంఠి అని నామకరణం చేయబడినప్పటికీ కలహకంఠిగా పేరు పొందిన ఆ ధనిక ఆత్త కోడలు సౌదామిని, పుట్టెడు దుఃఖంతో పుట్టింటికి బయలుదేరి దారి తప్పి అరణ్యంలోపడి, ఆకలితో అట మటించిపోతూ ఒక వెలగచెట్టు దగ్గర పడిపోయింది.
తను పుట్టినింటి కెళ్ళి కూడా ప్రయోజనం లేదు. తన పెళ్ళికి చేయించిన నగలకే తండ్రి అప్పుల పాలయ్యాడు. మరి నగలు పెట్టలేడు. అంచేత ఆ కీకారణ్యంలో చావడమే మేలు! అనుకుంటూండగా చెట్టు నుండి ఒక వెలగ పండు రాలి దొర్లుకుంటూ, అందుకో మన్నట్లు ఆమె చేతి దగ్గర ఆగిపోయింది. దాన్ని పట్టుకొని సౌదామిని లేచి కూర్చుంటుండగా భూమి అది రేలాగ ఒక పెద్ద ఏనుగు పరుగున రావడం కనిపించింది.
సౌదామిని చిన్నతనం నుంచీ విఘ్నేశ్వరుడి పై గొప్ప భక్తి విశ్వాసాలు కలది. విఘ్నేశ్వరుణ్ణి తలచుకొని ఏనుగు పాదాల కిందపడి చావాలని ఎదురు వెళ్ళింది. ఏనుగు ఠక్కున ఆగిపోయింది.
ఏనుగు సౌదామిని చేతిలో ఉన్న వెలగపండును తొండంతో తీసుకొని నోట వేసుకొని, దీవిస్తున్నట్లుగా తొండంతో సౌదామిని తలనిమిరి చేయి పట్టుకొని తిన్నగా ఒక పెద్ద గుహ దగ్గరికి తీసుకెళ్ళింది.
Post a Comment