విఘ్నేశ్వరుడు (చందమామ)_17 Vignaeswarudu Novel (CHANDAMAMA)

 విఘ్నేశ్వరుడు (చందమామ) 

Vignaeswarudu Novel (CHANDAMAMA)

17. వాతాపి నగర గాథ


విఘ్నేశ్వర శిల్పంలోని దేవతా విగ్రహాలగానానికి తన్మయుడైన అగస్త్యుడు, “వాతాపి గణపతీ! నీ అద్భుత శిల్పాన్ని నీవే మలచుకొన్నావు! ఇటువంటి మహెూన్నత శిల్పం చెక్కడం ఎవరితరం!” అన్నాడు.


అప్పుడు విగ్రహంలోనుంచి, “అగస్త్య మహర్షీ! నా కోసమని నేను శిల్పం మలచుకోలేదు, నీ తృప్తి కోసం నీ కోరిక నెరవేర్చాను, అంతే! అందువల్ల ఈ మహా శిల్పం కొంత కాలం మాత్రమే ఉంటుంది, అటు పిమ్మట అదృశ్యమౌతుంది! ద్వాపరంలో ధర్మరాజు అశ్వమేధయాగ సందర్భంలో, ఇదే స్థానంలో మరొక పెద్ద విగ్రహం ప్రతిష్ఠంపబడుతుంది!”

అంటూ విఘ్నేశ్వరుని మాటలు వినిపించాయి - అని ధౌమ్యుడు అర్జునుడితో చెప్పి, “అర్జునా! ఆ మహా శిల్పాన్నే మనం చూస్తున్నాం,” అని ఆగాడు.


అర్జునుడు మహా శిల్పం చుట్టూరా పలుమార్లు ప్రదక్షిణాలు చేసి, భక్తి శ్రద్ధలతో పరిశీలించాడు. మహాశిల్పం విఘ్నేశ్వరుడే. ఆ విఘ్నేశ్వరుడిని అంటి పెట్టుకొని త్రిమూర్తులు, జగదంబ, లక్ష్మీ పార్వతీ సరస్వతులు, నవగ్రహాలు మొదలుకొని అనేకమంది దేవతలు మనోహరశిల్పాలుగా మలచబడ్డారు. విఘ్నేశ్వరుని రెండు పాదాల ఇరుకున విఘ్నం బంధింపబడి ఉన్నది, ఎలుక రాజు తోక విగ్రహం చుట్టూరా వలయం చుట్టి ఉన్నది. శిల్ప శోభ తిలకించడానికి వేయికళ్ళున్నా చాలవు అనిపిస్తున్నది. తనివితీరా చూశాక అర్జునుడు ధౌమ్యుడితో, “ఆచార్యదేవా! ఇంతటి మహనీయ శిల్పం చుట్టూరా నెలకొన్న వాతాపినగరం మహోన్నతదశ అనుభవించి యిప్పుడెందుకిలా ఉంది? వాతాపినగర గాథ వినాలని కుతూహల పడుతున్నాను!” అన్నాడు.


ధౌమ్యుడు తిరిగి చెప్పడం ప్రారంభించాడు:


అగస్త్యుడు లోపాముద్ర ఆదేశానుసారం ఏమీ మిగుల్చుకోకుండా, ఉంచిన ధనాన్ని అందరికీ పంచేసి, ప్రజారాజ్య పాలనా బాధ్యతలను పౌరధర్మాలను అనుసరిస్తూ సుఖ జీవనం గడపండని ప్రజలకు చెప్పి, కట్టుబట్టలతో లోపాముద్రతో తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు.


విఘ్నేశ్వర మహాశిల్పమే ప్రజారాజ్య మకుటంగా ఆరాధించుతూ వాతాపినగర ప్రజలు చిరకాలం క్రమబద్ధంగా సుఖ జీవనం చేశారు. తరాలు మారాయి. ఆదర్శరాజ్యంగా, ప్రజారాజ్య మార్గదర్శకంగా దినదిన ప్రవర్ధనమానమై విస్తరించిన వాతాపినగరం దేశదేశాంతరాల్లో పేరు పొందింది.


అగస్త్యుడు తన్ను కూడా హతమారుస్తాడనే చావు భయంతో పారిపోయి, వింధ్యాటవుల్లో ఊరూ పేరూ లేని చీకటి బతుకు బతుకుతున్న ఇల్వలుడు వాతాపి నగరం పేరు ప్రఖ్యాతులు విని, అగస్త్యుడు అక్కడ లేడని తెలుసుకొన్న మీదట నయవంచనతో సాధించాలనే తలంపుతో, ప్రజాసేవనే జీవిత పరమార్థంగా పెట్టుకొన్న వాడిలాగ రూపు మార్చుకొని, వాతాపినగర ప్రజల మధ్యకు చేరాడు. అప్పటి పరిస్థితి కూడా ఇల్వలుడికి అనుకూలంగా ఉంది.


క్రమక్రమంగా కాలమహిమ వల్ల, వాతాపినగర ప్రజల్లో స్వార్థచింత అంకురించి పెరగసాగింది. కలిమిలేములు ప్రారంభమయ్యాయి. ప్రజల్లో భేదాభిప్రాయాలు, పొరపొచ్చాలు తలదాల్చాయి. తెలివితేటలు, తెలివితక్కువ వారిని వంచించడానికి పనికివచ్చాయి.


అలాంటి పతనదశ ప్రారంభంలో, ఇల్వలుడు ఒక ప్రజానాయకుడుగా తయారై ఇంద్రజాల విద్యలతో ఒక మహా పురుషుడుగా ప్రజలను ఆకట్టుకున్నాడు.


నగర మధ్యంలో ఉన్న విఘ్నేశ్వర మహా శిల్పం మీద ప్రజలకు గురి ఉన్నంత కాలం అగస్త్యుణ్ణి , అగస్త్యుడు చెప్పిన నైతిక సూత్రాల్ని మరచిపోరనే విషయం గుర్తించాడు. తాంత్రిక విద్యలు, మద్య పానీయాలు ప్రజలకు రుచి చూపించాడు. అగస్త్యుడు నాటించిన ప్రజా రాజ్య సూత్రాల శిలా ఫలకాలను ఊడబెరికించి, కొత్త కొత్త సూత్రాలు నూరిపోశాడు. ఒకరి నొకరు దోచుకోవడంలో ఉన్న ఆనంద విశేషాన్ని ప్రచారం చేశాడు. గిరిగీసుకొని కూచోడం మనిషిలక్షణం కాదనీ, కొత్త కొత్త సుఖాలు తెలుసుకోడానికే బ్రతకడం, అనే సిద్ధాంతానికి ప్రజల్ని మళ్ళించాడు. ప్రచ్ఛన్న వేషాలతో చాలా మంది రాక్షసులు ఇల్వలుడికి తోడైనారు. ప్రజాసేవకుడుగా అవతరించి, ప్రజానాయకుడుగా తయారైన ఇల్వలుడు మహానాయకుడై, ప్రజలపై అంకుశంగా మారాడు. అంతఃకలహాలు రేపాడు. వాతాపి నగరం కొట్లాటలతో నిండిపోయింది. దుర్మార్గులు అమాయకులను వేటాడుతున్నారు. నగరం అల్లకల్లోలమై పోయింది. చాలామంది ప్రజలు నగరం విడిచి వెళ్ళిపోయారు.


ఇల్వలుడు నగర మధ్యంలో ఉన్న విఘ్నేశ్వర మహాశిల్పాన్ని నేలమట్టం చేయాలని ప్రయత్నాలు ఆరంభించాడు. శతఘ్నుల్ని చుట్టూరా గురి పెట్టించాడు. శిల్పం అడుగు నేలలో ప్రేలుడుమందు దట్టింపించి, అగ్గి ముట్టించడమే తరవాయిగా ఉన్న సమయంలో, అతి విచిత్రంగా అద్భుతం జరిగింది. నిప్పు తగిలించ కుండానే మందుగుండు

పేలింది. శతఘ్నిశకటాలు అటు నుంచి ఇటు వెనక్కు తిరిగి ప్రేలి గుండ్ల వర్షం కురిపించాయి. ఆ అగ్నివర్షంలో దుర్మార్గులంతా మరణించారు. చాలా మంది వికలాంగులయ్యారు. వారిలో ఇల్వలుడు కూడా ఒకడు. ఇల్వలుడి ఒక కాలు, ఒక చేయి పోయింది. రక్తసిక్తమైన దేహంతో నేల దొర్లుతూన్న సమయంలో, ఇల్వలుడికి విగ్రహం నుంచి మాటలు వినిపించాయి.


“ఓరీ, ఇల్వలా! అంగ వైకల్యంతో, ముసలితనంతో చివికి చివికి కుళ్ళుతూ చిరకాలం జీవించు! నీకు అదేసరియైన శిక్ష!” అని విఘ్నేశ్వరుడు శపించాడు.


వాతాపినగరం క్రమంగా తన పూర్వ వైభవాన్ని కోల్పోయి, కొద్ది మంది మనుష్యులతో మాత్రమే ఇప్పుడిలా బీడు పడిపోయింది, అని ధౌమ్యుడు చెప్పడం ముగించాడు.


అర్జునుడు అంతా విని అటు తిరిగి చూసి, ఆశ్చర్యంతో నోట మాట రాక అలా ఉండిపోయాడు. విఘ్నేశ్వర మహా శిల్పం కనిపించలేదు!


“అర్జునా, ఆశ్చర్యపడకు! మహా శిల్పం అదృశ్యమైపోతుందని యిది వరకే వింటివి కదా!” అని ధౌమ్యుడు అంటూండగా ఆ చుట్టుపక్కల ఉన్న ఒక ముళ్ళపొదలో, ఒక పండుముసలి వికృతరూపుడు ఒక చేయి, ఒక కాలుతో నేల మీద శరీరాన్ని యీడ్చుకొని వస్తూ కెవ్వున అరిచి, మహాశిల్పం ఉండిన వేపు చేతులు చాచి జోడించి గిలగిలలాడుతూ చనిపోయాడు.


అర్జునుడు అది చూసి ఆశ్చర్యపోతూ, “గురుదేవా! వాడే కదా ఇల్వలుడు!” అన్నాడు.


ధౌమ్యుడు, “ఔను, ఎప్పటికైనా దుర్మార్గులు అలాగే నశిస్తారు!” అన్నాడు.


వార్తాహరుల చేత వాతాపి నగరానికి బయలుదేరి రమ్మని అర్జునుడు ధర్మరాజుకు కబురు పంపాడు.


హస్తినాపురం నుండి ధర్మరాజు భీమ, నకుల, సహదేవులతో వాతాపి నగరానికి వచ్చాడు.


ఆ రాత్రి ధర్మరాజు విఘ్నేశ్వర మహా శిల్పం అంతర్ధానమైన ప్రదేశానికి ఎదురుగా కూర్చొని, “నా తమ్ముడు నీ మహా శిల్పం దర్శించాడు. దేవా! నాకూ ఆ భాగ్యం కల్గించవా? నీ మహనీయ శిల్పాన్ని ఎవరు చెక్కుతారు! సత్వరమే నీ విగ్రహ ప్రతిష్ఠ జరిపించే మహా భాగ్యాన్ని నాకు కల్గించు!” అని కన్నులు మూసి విఘ్నేశ్వరుని ధ్యానిస్తూ వేడుకొన్నాడు.


అప్పుడు అతని చెవుల్లో, “ధర్మజా! దేవశిల్పి విశ్వకర్మ, దానవశిల్పి మయుడు కలసి శిల్పులుగా వచ్చి విగ్రహాన్ని చెక్కు తారు. విగ్రహ ప్రతిష్ఠ జరిగిన వెంటనే యాగాశ్వం కదలి వెళ్తుంది. నీ అశ్వమేధ యాగం జయప్రదంగా జరుగుతుంది. వాతాపి నగరాన్ని పునరుద్ధారణ చెయ్యి!

మీ పాండవ సంతతివారైన చంద్రవంశ రాజులు చిరకాలం ఈ నగరాన్ని పాలిస్తారు!” అనే వాక్కులు వినిపించాయి.


ధర్మరాజు కళ్ళు తెరిచేసరికి ఎదురుగా మహోన్నతంగా విఘ్నేశ్వర మహాశిల్పం దేదీప్యమానంగా కనిపించి అంతర్ధానమైంది.


మర్నాటి ఉదయం ఒక తెల్లనివాడు, ఒక నల్లనివాడు ఆ దరిదాపుల్లో పొదల మధ్య ఉన్న పెద్ద స్ఫటిక శిలను పరీక్షిస్తూ కనిపించారు. వారెవరైనదీ గ్రహించి ధర్మరాజు వారికి మ్రొక్కి మర్యాదలు జరిపాడు.


ఆ శిలను పెకలించడానికి తవ్వుతున్నప్పుడు, అక్కడ గొప్పనిధి దొరికింది. ఆ బంగారాన్ని ఇల్వలుడు నిక్షిప్తపరిచాడు. ఆ చోటు వదల్లేక చివికి చివికి వాడు చివరకు మరణం పాలయింది కూడా అక్కడే.


ధర్మ రాజు ఆ నిధిని వాతాపినగర అభివృద్ధికి వినియోగించాడు.


ఆ ఇద్దరు మహాశిల్పుల చేతుల మీదుగా వి ఘ్నేశ్వరుని విగ్రహం, మహాశిల్పం అదృశ్యమైన చోటనే గొప్ప ఆలయము, పెద్ద మంటపము తయారైనాయి. విశ్వకర్మమయుల శిల్పరీతుల అద్భుత సమ్మేళనంతో ఒక గొప్ప శిల్ప సాంప్రదాయానికి నాంది అయింది. భరతవంశం వారిచే నెలకొల్పబడినందు వల్ల అది భారతీయ శిల్పంగా పేరొంది, కాలాలతరబడి గొప్ప ప్రఖ్యాతి పొంది చిరస్థాయిగా వర్ధిల్లింది.


ఆ విధంగా విఘ్నేశ్వర శిల్పం పూర్తి చేసి శిల్పులిద్దరూ ఎలాగ వచ్చారో అలాగే మాయమయ్యారు.


ఆలయంలో ధర్మరాజుచే విఘ్నేశ్వర విగ్రహ ప్రతిష్ఠ జరిగిన వెంటనే గుర్రం దౌడు తీసి పరుగెత్తింది. అర్జునుడు, భీముడు సైన్యసమేతంగా దాని వెనక బయలుదేరారు.


ధర్మరాజు అగస్త్యుడు ఏర్పరిచిన ప్రజారాజ్య పద్ధతులతో వాతాపి నగర పాలన సాగేలా పాలనా దక్షత ఏర్పాటు చేసిన తరువాత నకుల సహదేవులతో హస్తినా పురానికి తిరిగి వెళ్ళాడు.


ప్రజారాజ్య పర్యాయ పదంగా ఆ ప్రాంతం అగస్త్యరాజ్యమనీ, నగరం అగస్త్యనగరమనీ, కొంతకాలం పేర్కొన బడినవి. కాలక్రమాన వాతాపినగరం అనే పేరే స్థిరంగా నిలిచిపోయింది.


అర్జునుడు దిగ్విజయాన్ని ముగించుకొని గుర్రంతో హస్తినాపురం చేరాడు. అశ్వమేధయాగం జరిగింది. ధర్మరాజు యాగభాగాలను, విశ్వకర్మకూ, మయుడికీ ప్రత్యేకంగా అర్పించాడు. శిల్పులకు శిల్పానికి గౌరవ ప్రపత్తులు చేకూర్చాడు.


ధర్మరాజు తర్వాత పరీక్షిత్తు, పరీక్షిత్తు తర్వాత జనమేజయుడు పాలించారు. జనమేజయుడి సంతతి వారైన రాజులు వాతాపినగరాన్ని పాలించసాగారు.


వాతాపినగరాన్ని పాలించిన చంద్రవంశ రాజులలో శతృంజయుడు గొప్ప సామ్రాజ్యపిపాసి. వాతాపి నగరం రాజధానిగా వాతాపి సామ్రాజ్యాన్ని స్థాపించాడు. సైన్యాల్ని పెంచడానికి ప్రజల

మీద విపరీతంగా పన్నులు వేశాడు. నిరంకుశ పాలన సాగిస్తూ, ఇల్వలుడు మళ్ళాపుట్టాడు అని అనిపించుకున్నాడు.


అతని కుమారుల్లో కడపటివాడైన చళుకవర్మ చాలా మంచివాడు. అగస్త్యుడి ప్రజారాజ్య సూత్రాలపై గురిగలవాడు. విఘ్నేశ్వరుణ్ణి భక్తితో ఆరాధిస్తూ, విద్య పట్ల, కళలపట్ల ఆసక్తితో ఉండేవాడు. అగస్త్యుడి అంశ అతనిలో ఉన్నదని ప్రజలు అనుకునే విధంగా ప్రజాభిమానాన్ని సంపాదించాడు.


సామ్రాజ్య విస్తరణకు శతృంజయుడు కుమాళ్ళను ఆయత్తం కమ్మన్నాడు. చళుకుడు తండ్రితో, “జనహింస పరపీడనతో కూడిన సామ్రాజ్య విస్తరణ కసాయి వృత్తికంటే ఏం గొప్పది?” అని అన్నలతో కలిసి దండయాత్రకు వెళ్ళడం మానేశాడు.


శతృంజయుడు మండిపడుతూ, “ఔరా! సింహం కడుపున ఎలుక పుట్టినట్లు రాజవంశంలో తప్పపుట్టావు! నీకు తగిన శాస్తి జరగాలి!” అని అంటూ ఒక ఎలుకను పట్టి తెప్పించి, దానికి చుళుక అని పేరు పెట్టి, దానితో చళుకవర్మకు పెళ్ళి అని చాటించాడు.


చుళుక అసలు పేరు కళ్యాణ కింకిణి! ఒక అప్సరస. ఇంద్రుడి శాపం వల్ల ఎలుకగా భూమ్మీద పడింది.


కళ్యాణ వేదిక పైన వున్న పెళ్లిపీటలపై రాకుమారుణ్ణీ, ఎలుకనూ చూసి, వచ్చిన వారు చేసే కోలాహల పరిహాసానికి చళుకుడు సిగ్గుతో కృంగిపోవాలని శతృంజయుడు, ఆ విచిత్ర వివాహానికి రాజుల్నీ, ప్రజల్ని ఆహ్వానించాడు. కాని చళుకవర్మ మందహాసంతో, “ఎలుకను మహారాజు, కోడలుగా చేయించగల విఘ్నేశ్వరుడు, ఎలుకను చిలుకల కొలికిగా చేసినా చేయవచ్చు, అని మీరంతా నమ్మకపోవచ్చును గాని, నేను నమ్మగలను!” అన్నాడు.

--(ఇంకా వుంది)

Post a Comment

Previous Post Next Post