విఘ్నేశ్వరుడు (చందమామ)_16 Vignaeswarudu Novel (CHANDAMAMA)

 విఘ్నేశ్వరుడు (చందమామ) 

Vignaeswarudu Novel (CHANDAMAMA)

16. విఘ్నేశ్వర మహాశిల్పం


వాతాపి నగర మధ్యంలో ఉన్న మహా శిల విఘ్నేశ్వర శిల్పంగా, రూపొందాలనే కోరిక అగస్త్యుడికి మిగిలిపోయింది. లోపాముద్ర చిత్రకళా ప్రవీణురాలు. ఆమె అక్కడకు వచ్చి మహాశిలను పరిశీలించి, అది ఏ విధంగా రూపొందాలో అలాంటి విఘ్నేశ్వరుని రూప రేఖా చిత్తరువును తయారుచేసింది.


రేఖా చిత్రమైతే తయారైంది గాని, ఆ ప్రకారంగా మహాశిలను మలచగల శిల్పులు, శిల్పాచార్యుడు ఎంత ప్రయత్నించినా లభించలేదు. అగస్త్యుడు చింతాక్రాంతుడై మహాశిల ఎదురుగా కూర్చొని, చిత్రపటాన్నీ, శిలనూ పదేపదే చూసుకుంటూ కాలం గడుపుతున్నాడు.


వచ్చిన శిల్పాచార్యులందరూ చిత్రం చూసి, “ ఇలాంటి శిల్పం మలచటం దేవ శిల్పి విశ్వకర్మకో, దానవశిల్పి మయుడికో తప్ప ఇతరులకు సాధ్యం కాదు!” అంటూ వెనక్కు జంకారు.


శిల్పులు ఉలులను మహాశిల మీద పరీక్షించి, “ఇది వజ్రపాషాణం. దీన్ని చెక్కడానికి మామూలు ఉలి పనికే రాదు, వజ్రపు ఉలులుండాలి. దేవతలో, యక్షులో వచ్చి చెక్కవలసిందే కాని, మానవమాత్రుల తరం కాదు!” అంటూ చెప్పారు.


ఆ సమయంలో దేవశిల్పి విశ్వకర్మ భార్య విష్ణుమానస పుత్రిక విశ్వకళ అలిగి పుట్టింటికి వెళ్ళి వున్నది. విశ్వకర్మ మతిస్థిరం పోగొట్టుకున్నాడు. దానవ శిల్పి మయుడు అతని అప్సర భార్య హేమ తిరిగి దేవలో కానికి వెళ్ళిపోగా, పిచ్చివాడై జాడలేకుండా ఎక్కడో తిరుగుతున్నాడు . విశ్వకర్మనో, మయుణ్ణో పిలుద్దామన్నా వారి స్థితి అంత అధ్వాన్నంగా ఉంది.


అగస్త్యుడికి మహాశిలను విఘ్నేశ్వర విగ్రహంగా రూపొందించడం సమస్యగా నిలిచిపోయింది. నిద్రాహారాలు మాని అతడు శిల కెదురుగా అలాగే దివా రాత్రాలు కూర్చొని విఘ్నేశ్వరుణ్ణి ధ్యానిస్తూ, “గణపతీ! నా కోరిక కోరికగానే ఉంచేశావు. ఇక నీదే భారం!” అని స్మరణ చేస్తూ దిక్కులు చూస్తూ నిరీక్షించసాగాడు.


ఒకనాటి సంధ్యాసమయంలో దోరపు బొజ్జ ఊపుకొంటూ గుజ్జుగా ఉన్న ఒక బాలప్రాయంవాడు అటు వస్తున్నాడు. అతని చేతిలో ఏదో ఉలి లాంటిది పిడితో ధగధగా మెరుస్తున్నది. కండలు తేరి ఉన్నాడు, శిల్పిలాగ కనిపించాడు.


అగస్త్యుడు ఆశగా అతని చేత నున్నదాన్ని బాగా పరికించి చూడగా, అది ఏనుగుదంతం కొనముక్క పిడిలో బిగించినట్టుగా తెలుసుకుని ఆశ్చర్యపోయాడు.


ఆ తరుణశిల్పి, అగస్త్యుణ్ణి సమీపించి, “ఏమిటో మహర్షులవారు మహాశిల ముందు మంతనాలాడుతూ కూర్చున్నారు; ఏమైనా పని దొరుకుతుందేమోనని యిలా తిరుగుతున్నాను!” అన్నాడు.


అతని మాటలు మధురంగా అగస్త్యుడికి పారవశ్యాన్ని కలిగించాయి.


“చిరంజీవీ! ఈ మహా శిలను గణపతి దేవుడి విగ్రహంగా చూడాలని ఎన్నో దినాలుగా ఉవ్విళ్ళూరు తున్నాను.” అంటూ తన దగ్గరున్న రేఖా చిత్రాన్ని శిల్పికి చూపించి, “ఇంతకూ నువ్వెవరు? ఏం పని చేస్తావు?” అని అడిగాడు.


“నేను చేసే పనుల్లో మొదటిది పుష్ఠిగా తినడం, తర్వాత శిల్పం చెక్కటం, నన్ను బాలశిల్పాచార్యుడు అని పిలుస్తూంటారు!” అని బాలశిల్పి చెప్పాడు.


అగస్త్యుడికి అతడి మాటలతీరు మేను పులకరించే నవ్వు పుట్టించాయి. ఆయన అతణ్ణి సందేహంగా చూస్తూ, “మహా శిలను మహాశిల్పంగా రూపొందించే మహా శిల్పి కోసం పడిగాపులుపడి ఉన్నాను. శిల్పి నంటున్నావు గాని, బాలశిల్పివి; శిల బ్రహ్మాండమైనదీ, మహోన్నతమైనదీను! నీవేమో పొట్టి వాడివి. అలాంటప్పుడు, మహాశిల్పాన్ని మలచగలవా అని ఏమని అడగ్గలను” అన్నాడు నిట్టూరుస్తూ.


బాలశిల్పి నవ్వి, “బాలశిల్పి నైనంత మాత్రాన నా శిల్పం మహాశిల్పం కాదని అనుకోకు! మహా అని అన్నంత మాత్రాన గొప్పేమీ కాదు. మన ఉలికి సాధ్యం కానిదేదీ లేదు!” అంటూ ఉలిని తీసి చూపించాడు. అది ధగధగా వజ్రంలాగా మెరుపులు విరజిమ్ముతున్నది.


అగస్త్యుడు చూస్తూండగా బాలశిల్పి ధంతం ఉలిని మహాశిల మీదకి విసిరాడు. ఉలిమొన తాకిడితో పెద్ద మెరుపు, కాంతి, ఉరిమిన శబ్దమూ వెలువడ్డాయి. అక్కడ శిలకు ఒక రంధ్రం ఏర్పడింది.


“అది నాభిస్థానము. మూర్తి శిల్పానికి నాభిస్థానము చాలా ముఖ్యమైనది; అందునా లంబోదరుడి నాభి! లంబోదరంతో శిల్పం ప్రారంభమవుతున్నదన్నమాట!” అని బాలశిల్పి చెప్తూంటే, రాతి నుండి 'లంబోదర లక్ష్మికరా....' అంటూ మాళవ రాగంలో సన్నగా పాట అగస్త్యుడికి వినిపించింది.


“ఇది అయస్కాంత రాయి! చెక్కుతున్నప్పుడు ప్రచండమైన విద్యుత్తు వెలువడుతుంది, గనక శిల్పం చెక్కడం పూర్తయ్యేవరకూ, ఈ చుట్టు పక్కల పిట్ట మనిషి ఉండకూడదు. గొప్ప ధ్వనులు కూడా వినిపిస్తాయి. నగర వాసులు భయపడి కంగారుపడ నవసరం లేదు. ఓ మహర్షీ, ఇక నీవు వెళ్ళవచ్చు. వెళ్ళి నిశ్చింతగా నిద్రతీయి. తెల్లవారు ఝాముకి శిల్పం పూర్తవుతుంది!” అని చెప్పాడు బాలశిల్పి.


అగస్త్యుడు ఆశ్చర్యపడ్డాడే గాని, అంతకు మించి మరేమీ అతనికి తోచలేదు. అతని బుద్ధి ఏదో నిద్రలో పడ్డట్టుగా ఉంది! కొంచెం తేరుకొని అగస్త్యుడు రేఖా చిత్ర పటాన్ని తీసి బాలశిల్పికి యివ్వ బోతుంటే, “ఇదివరకే చూపించావుగా, ఒక్కసారి చూస్తే చాలు. పదే పదే చూసు కుంటూ చెక్కేరకం మహాశిల్పిని కాను, శిల్పం ఒక ఆటలాగ చెక్కుకొనే కేవలం బాలశిల్పిని! అంతా అయ్యాక చిత్రం గీచిన వారిని వచ్చి చూసుకోమను, సరిగ్గా ఉందో లేదో! చిత్రానికి ఎంత యిచ్చావో ఏమోగాని, నా కేమాత్రం ప్రతిఫలం ముట్ట జెపుతావో చూడాలి!” అని బాల శిల్పి అన్నాడు. చివరి మాటలు అగస్త్యుడికి దిగులు పుట్టించాయి.


తన భార్య లోపాముద్ర కోరిక మేరకు తీసి ఉంచిన ధనం తప్పితే తన అధీనంలో యింకేమీ లేదు, అంతా పంచి పెట్టేశాడు. శిల్పికి పారితోషికంగా ఆ కొద్ది పాటి ధనమూ యిచ్చి వేయక తప్పదు. లోపాముద్రకు ఏమని చెప్పడం? అలా అనుకుంటూ అగస్త్యుడు వెళ్ళే సరికి లోపాముద్ర ముఖం తేజోవంతంగా దీపంలాగ వెలిగిపోతున్నది. ఏమిటి సంగతి? అన్నట్లు భార్యవంక చూశాడు.


లోపాముద్ర పొంగిపొర్లే ఆనందంతో, “అగస్త్యులవారు నన్ను మన్నించాలి! ఋషి పత్ని ఋషిపత్నిలాగే ఉండాలనీ, అదే ధర్మమనీ నాకు తొలుత నుండీ తెలిసినదే. నగలు, మంచి బట్టలు కావాలని, ధనం సేకరించుకు రమ్మని నేను ఎందుకన్నానో, నాకే ఆశ్చర్యంగా ఉంది ఇప్పుడు. ఏదో ఒక మహత్కార్యం నెరవేరడానికి అనిర్వచనీయమైన ఏదో శక్తి నా నోట ఆ మాటలు పలికించినట్లు తోస్తున్నది. నాకు ఏ ఆభరణాలూ వద్దు. ఏ పట్టుచీరలూ వద్దు, ఏ ధన సేకరణా వద్దు! నాలో తాత్కాలికంగా ప్రవేశించిన అజ్ఞానం యిప్పుడిప్పుడే తొలగిపోయింది!” అని అన్నది.


ఆమె మాటలకు అగస్త్యుడు లోలోపల సంతసించాడు.


“శిల్పి కుదిరాడు శిల్పం తయారౌతున్నట్లే, తెల్లవారేసరికి పూర్తి అవుతుందట!” అన్నాడు ఋషి.


“ఏమిటేమిటీ! తెల్లారేసరికి ఆ మహా శిల, శిల్పం అవుతుందా? ఆ శిల్పి మానవుడా, దేవుడా?” అన్నది లోపాముద్ర.


“మానవమాత్రుడే, బాలుడు కూడా. ప్రతిఫలం ఎలా యివ్వాలో, ఎంతివ్వాలో ఏమీ తోచకుండా ఉంది.” అన్నాడు అగస్త్యుడు.


“నా నిమిత్తంగా తీసి ఉంచిన ధనం ఉందిగా, అది చాలదా?” అన్నది లోపాముద్ర.


“సరే, తెల్లవారాక ఎదో ఒక లాగ సరి పెట్టవచ్చు,” అన్నాడు అగస్త్యుడు.


“అన్నట్టు, రేపు భాద్రపద శుద్ధ చతుర్థి, వినాయకచవితి రోజు! శిల్పం ధ్యాసలో పడి మీరు నెలలు, తిథులు మరిచినట్లున్నారు.” అన్నది లోపాముద్ర.


“ఏమిటీ! రేపు వినాయకచవితి, విఘ్నేశ్వర శిల్పం తయారవడం! చిత్రంగా ఉందే!” అంటూ అగస్త్యుడు ఆశ్చర్యపడుతూంటే, లోపాముద్ర, “ఆ శిల్పి బాలుడూ కాడు, మానవమాత్రుడూ కాడు!” అన్నది.


భార్య మాటల్లో ఎదో అద్భుత సత్యం ఉందనిపించింది, అగస్త్యుడికి. చాలా రాత్రయింది, నిద్ర పట్టలేదు, కుతూహలం పెరిగింది, ఏం జరుగుతున్నడో చూడాలని అగస్త్యుడు బయలుదేరాడు.


అగస్త్యుడు మహాశిల సమీపాన్ని చేరే సరికి కనిపించిన దృశ్యానికి అతని ఒళ్లు జలదరించింది. అలాగే అక్కడ చతికిల బడిపోయాడు. కొన్ని వందల ఉలులు శిల్పాన్ని వాటంతట అవే చెక్కుతున్నవి. రంగు రంగుల విద్యుత్కాంతులు మిరుమిట్లు గొల్పుతున్నవి. ఖణఖణ ధ్వనలతో సూరుమంటూ శబ్దం వెలువడుతున్నది. ఉలులన్నీ ఏనుగుదంతం కొన ముక్కల్లాగ వజ్రాల్లా మెరిసిపోతున్నవి. అది స్వప్నమో నిజమో తెలియని విభ్రాంతిలో మైకం కమ్మి, అగస్త్యుడు అలాగే సొమ్మసిల్లి నిద్రలో పడిపోయాడు.


అలా నిద్రపోయిన ఋషి కళ్ళు తెరిచే సరికి ఎదురుగా తట్టి లేపుతున్న బాల శిల్పి కనిపించాడు, తూర్పు తెల్లనవుతున్నది.


“ఏమిటి, మహర్షి! ఇక్కడ ఇలా నిద్రిస్తూ కలగంటున్నావు? యోగవిద్యా పారంగతుడవైన నీకు యీ కలల నిద్ర ఏమిటి! శిల్పం పూర్తయింది. చిత్రం గీచిన వారిని వచ్చి చూసుకోమను; చిత్రించిన దంతా సరిగ్గా శిల్ప రూపం పొందిందో లేదో!” అని బాలశిల్పి అంటూండగా, పళ్ళెరం నిండా కుడుములూ, జలమూ, పూలు పట్టుకొని లోపాముద్ర వచ్చింది.


అగస్త్యుడు సంభ్రమాశ్చర్యాలతో స్ఫటికంలాగ మెరిసిపోతూన్న విఘ్నేశ్వర మహా శిల్పాన్ని చూస్తూండగా, బాలశిల్పి అతనితో. “నాకు ప్రతిఫలం ఏమిస్తావో యివ్వుమరి,” అన్నాడు.


అగస్త్యుడు మాట తడబడుతూ, “మహా శిల్పీ! నీకు ఏమిచ్చినా చాలదు, అయినా చంద్రుడికో నూలుపోగన్నట్లు కొద్దిపాటి ధనం తీసి ఉంచాను, తెస్తాను!” అన్నాడు.


బాలశిల్పి, “సరే, ఇంతకూ రేఖా చిత్రరచన చేసినందుకు ఏమిచ్చావో అది చెప్పు ముందు? శిల్పం చెక్కడం శ్రమ మాత్రమేగాని గొప్పతనమంతా శిల్పాకృతికి మూలమైన రేఖా చిత్రానిదే. చిత్రణ ఊహాసంపన్నమైన మేధస్సుతో కూడిన కళ!” అన్నాడు.


“అయ్యా, బాలశిల్పాచార్యా! చిత్రంచిన వారికి వేరే ఏమీ యివ్వనవసరం లేదు. ఆ చిత్రం తయారు చేసింది నా భార్యే!” అంటూ లోపాముద్రను చూపిస్తున్నట్లుగా ఆమె వంక చూశాడు అగస్త్యుడు. లోపాముద్ర ఎదో తన్మయా వస్థలో మునిగి ఉన్నది.


“ఏమి మాట మహర్షీ! నేనే అయితే ఒక మహానగరాన్ని నిర్మించడానికి సరిపడే ధనాన్ని చిత్రణకు యిచ్చి ఉందును, అంత గొప్ప రేఖా చిత్రమది. ఆ ధనం ఆ యమ్మకే చెందుతుంది!” అన్నాడు బాలశిల్పి.


అగస్త్యుడు , “అసలు ఆ ధనాన్ని ఆమె కోసమనే తీసి ఉంచాను!” అని నోరుజారి అన్నాడు.


బాలశిల్పి ఆశ్చర్యంగా. “ఏమిటీ! ఇంతకూ అది స్త్రీ ధనమన్నమాట! చెప్పావు గనక సరిపోయింది. నువ్విచ్చినా, నేను పుచ్చుకున్నా ఎంత అన్యాయం మూట గట్టుకొనే వారమో కదా! అందులోది చిల్లిగవ్వ కూడా నాకు ఆఖ్ఖర లేదు,” అంటూ లోపాముద్ర వంక చూసి, “అమ్మా! నీ చేత్తో ఒక్క బిళ్ళ కుడుము నాకు పెట్టు, నా కదే చాలు! చెక్కిందానికి బొక్కిందే కూలి అని బ్రహ్మ శిల్పుల నుదుట ఎప్పుడో రాసి పెట్టేశాడు!” అని అన్నాడు.


ఆ మాటలు వినడంతోనే లోపాముద్ర కుడుముల పళ్ళెరాన్ని అతని ముందు పెట్టి, సాష్ఠాంగపడి బాలశిల్పి పాదాలు పట్టుకొని, “విఘ్నేశా! నీ అనుగ్రహంతో, మా జన్మలు తరించాయి!” అన్నది. బాలశిల్పి అదృశ్యమయ్యాడు.


అగస్త్యుణ్ణి ఆవరించిన మాయ విడి పోయింది. విఘ్నేశ్వర మహా శిల్పం ముందు ప్రణమిల్లి, “విఘ్నేశ్వరా! నేనెంతో గొప్ప యోగబలం గల వాడిననీ, తపశ్శాలిననీ గర్వపడుతూండే వాడిని. కాని, నీ ముందు వఠ్ఠి అజ్ఞానినై పోయాను. ఎంతటి వాడైనా, నీ మాయకు అతీతుడు కాడు!” అంటూ నమస్కారాలు చేస్తూ లెంప లేసుకుంటూంటే, శిల్పంలోని దేవతా విగ్రహాలన్నీ పాడుతూన్నట్లుగా, 'వాతాపి గణపతిం భజే హం!...' అనే కీర్తన హంసధ్వని రాగంలో మారుమ్రోగుతూ వినిపించింది.

--(ఇంకా వుంది)

Post a Comment

Previous Post Next Post