రాకాసిలోయ (చందమామ)_35
రాకాసిలోయ_35
జయమల్లు గుహ ముందుకు వెళ్ళి, “ఓ రాకుమారీ కల్పకవల్లీ! యివే నీకు మా నమస్సులు. ఇక్కడ వున్న ముగ్గురం కూడా మీ దేశ పౌరులమే. కేశవుడని పిలవబడే యువకుడు, మా నాయకుడు. నా పేరు జయమల్లు; గోమాంగ్ మా స్నేహితుడు. దుష్టుల సలహా విని, మీ తండ్రి మమ్మల్ని దేశద్రోహులుగా ప్రకటించినా, మేము ఎప్పటికీ దేశభక్తులమే, దుష్టులైన బ్రహ్మదండి, జగభోజి మాంత్రికులను సంహరించబోతున్నాం. మీ ఆజ్ఞ ఏమిటో సెలవివ్వండి!" అన్నాడు.
జయమల్లు యిలా అనగానే గుహలో చిన్నసవ్వడి అయింది. ఆ వెంటనే, ఉదయసూర్యుని కాంతిలో, ధగధగా మెరిసి పోతూ, పదహారు పదిహేడేళ్ళ జవ్వని గుహలో నుంచి బయటికి వచ్చింది. ఆమె రూపలావణ్యాలు కేశవుడి కళ్ళకు మిరుమిట్లు కొల్పినై. అతడు మంత్రపు బొమ్మలా రాకుమారి కేసి చూస్తూ నిలబడిపోయాడు.
కల్పకవల్లి గుహ నుంచి బయటికి వచ్చి, కేశవుడి కేసి, అతడి చేతిలో బందీగా వున్న కింకరుడి కేసి ఓ మారు చూసి, జగభోజి బలవంతంగా తన తల మీద ముడివేసిన దంతపు కిరీటాన్ని లాగి, దూరంగా విసిరి వేస్తూ, “మీ సహాయంవల్ల నేను ఈ దుష్టుల బారి నుంచి బతికి బయటపడ్డాను. మీ రాజభక్తి నాకు తెలియంది కాదు. బ్రహ్మదండి కల్పించిన కట్టు కథలు నమ్మి, నా తండ్రి మిమ్మల్ని అనుమానించాడని నాకే కాదు, రాజ్యంలో వున్న చాలామందికి కూడా తెలుసు. మీరు, నన్ను కాపాడిన వాళ్ళు గనక, మిమ్మల్ని ఆజ్ఞాపించే హక్కు నాకు లేదు. నాకూ, ఒక ఆయుధం యివ్వండి. లోయలోకి వెళ్ళిన ఆ దుష్టుల్ని వేటాడేందుకు, నేనూ వస్తాను,” అన్నది.
కేశవుడు మారు మాటాడకుండా, తన దగ్గర వున్న కత్తిని కల్పకవల్లికి అందిస్తూ, "రాకుమారీ ! ఈ కత్తి మీరు తీసుకోండి, ఈ బాణాలు నాకు చాలు !" అన్నాడు.
జయమల్లు కేశవుడి చేతిలోంచి అడవి తీగ ఉచ్చును అందుకుని, కింకరుడి కేసి పళ్ళు కొరుకుతూ చూసి, “కింకరా! నీకు, నీ ప్రాణ మంటే ఎక్కువ తీపా? లేక నీ గురువు రక్షణ ఎక్కువ తీపా?" అని అడిగాడు.
“మహాగురో, నన్ను చంపకండి! నాకీ భూప్రపంచంలో, నా ప్రాణాని కన్నా ఎక్కువ మధురమైందీ, విలువైందీ మరేం లేదు." అన్నాడు కింకరుడు ఏడుపు గొంతుతో.
“అయితే, నువ్వు ఆ ధనరాసులున్న రావిచెట్టు దగ్గిరకు దారి తియ్యి. మోసం చెయ్య ప్రయత్నించావో, నీ గొంతుకు ఉరి బిగుసుకుంటుంది," అన్నాడు జయమల్లు.
“మహాప్రసాదం, గురుదేవరా ! ఆ చెట్టు దగ్గిరకు సూటిగా వెళ్ళే దారి తియ్యమన్నారా? చుట్టు తిరిగి వెళ్ళే దారి తియ్యమన్నారా ?" అని అడిగాడు కింకరుడు.
“ఏ దారైనా తియ్యి, నీ గురువుకూ, వాడి వెంట వున్న పిశాచాలకూ మాత్రం మనం అక్కడికి వస్తున్న సూచన తెలియకూడదు,” అన్నాడు జయమల్లు.
“ధన్యుణ్ణి, గురుప్రభో! అలాగే చేస్తాను. మీ పనైన తరువాత మాత్రం, నా గొంతు బిగించి చంపకండి," అంటూ కింకరుడు దారి తీశాడు.
ఆ తరువాత వాడు వాళ్ళను లోయ మధ్యకు తీసుకుపోయాడు. అక్కడ ఒక చెట్టు కింద వాడాగి, దూరంగా కనిపిస్తున్న ఒక ఎత్తయిన రావిచెట్టును జయమల్లుకు వేలితో చూపుతూ, “అదే, రాకాసిలోయలో అంతులేని ధనరాసులున్న రావిచెట్టు, దాని పాదంలో ఒక పాము పుట్ట వున్నది. నేనూ, నా పాత గురువూ దానిని ఎప్పుడో గుర్తించి, ఆ ధనరాసుల మీద హక్కున్న జాతకుడి కోసం ఎదురుచూస్తున్నాం," అన్నాడు.
గోమాంగ్ యిచ్చిన కత్తి తీసుకుని, కేశవుడు రావిచెట్టు కేసి బయలుదేరాడు. జయమల్లూ తతిమ్మా వాళ్ళంతా, అతడికి కొంచెం వెనకగా చెట్ల చాటున నక్కుతూ కదిలారు. కింకరుడి మెడకు బిగించి వున్న తీగను లాగి పట్టుకుని, కోయగోమాంగ్ అతడి వెన్నంటి నడుస్తున్నాడు.
కేశవుడు రావిచెట్టును సమీపించాడు. ఆ చెట్టు మొదట్లో ఒక పెద్ద పుట్ట వున్నది. చెట్టు పైన వున్న గండభేరుండ పక్షులు కేశవుడు అక్కడికి రావటం చూస్తూనే, రెక్కలు టపటపలాడిస్తూ, కర్ణకఠోరంగా అరిచినై. కేశవుడు పుట్ట దగ్గరకు వెళ్ళి, కత్తితో దానిమీద గట్టిగా రెండుసార్లు కొట్టాడు. ఆ వెంటనే ఒక పెద్ద కలుగులో నుంచి మహాసర్పం ఒకటి పడగ విప్పి బుసలు కొడుతూ బయిటికి వచ్చింది. ఒకవేళ ఆ సర్పం తన మీదికి వస్తుందేమో అన్న అనుమానంతో కేశవుడు కత్తి ఎత్తి పట్టుకుని, దానికేసి ఒకడుగు వేశాడు. సర్పం బుసలు కొట్టటం మాని తల వంచుకుని పుట్ట మీంచి దిగి, దూరంగా పోసాగింది. రావిచెట్టు మీద వున్న గండభేరుండాలు కొన్ని వికృతంగా అరుస్తూ, దాని మీదికి దూకినై.
మహాసర్పం పెట్టే బుసలూ, దానిని తన్నుకుపో చూస్తున్న గండభేరుండాలు చేసే రొదా ఓ క్షణకాలం చూసి, కేశవుడు తన కత్తితో పుట్టను తవ్వసాగాడు. ఒకటి రెండు నిమిషాలు నిశ్శబ్దంగా గడిచింది. హఠాత్తుగా దాపులనున్న చెట్ల వెనక నుంచి కలకలం బయలుదేరింది. కొరడా ఛెళ్ళుమన్నట్టు పెద్ద ధ్వని అయింది. కేశవుడు ఆ ధ్వని వచ్చిన వైపుకు చూశాడు.
బ్రహ్మదండి మాంత్రికుడూ, జగభోజీ - వాళ్ళ వెనకగా పులుగు రాయుడూ, స్థూలకాయుడూ, జిత, శక్తి వర్మలూ చెట్ల చాటు నుంచి పెద్దగా అట్టహాసం చేస్తూ బయటికి వచ్చారు. కేశవుడు కంట బడగానే, బ్రహ్మదండి మాంత్రికుడు పెద్దగా నవ్వుతూ, “వత్సా కేశవా! నిన్ను కోటీశ్వరుణ్ణి చేయటానికి నేనెన్ని అవస్థలు పడ్డాను! మొత్తం మీద, ఈ చెట్టు పాదంలో వున్న నిధి నిక్షేపాలకు హక్కుదారువైన జాతకుడివి రానే వచ్చాడు. కాలభైరవుడు చెప్పిన దంతా సత్యమైంది, ధనాన్ని కాపలాకాసే మహాసర్పం, అంతా నీ పరం చేసి పక్కకు తప్పుకున్నది. ఇక నువ్వడ్డం తొలుగు,” అంటూ కేశవుడికేసి రాసాగాడు. జిత, శక్తివర్మలు కత్తులు దూశారు. స్థూలకాయుడు కొరడా ఎత్తి పట్టుకున్నాడు. పులుగు రాయుడు చెట్టు మీద వున్న గండభేరుండాల కేసి ఆశగా చూశాడు.
కేశవుడు కత్తి తీసుకుని లేచి నిలబడి, బ్రహ్మదండినీ, అతడి అనుచరవర్గాన్ని చూస్తూ, “మీరంతా, వున్న చోటునే ఆగండి. ఒక్కడుగు ముందుకు వేశారో, నిలువునా నరికేస్తాను.” అన్నాడు, రౌద్రం వుట్టి పడుతున్న గొంతుతో.
ఆ మాటలకు బ్రహ్మదండీ, జగభోజీ పొట్టలు పట్టుకుని నవ్వారు. “మా గరుడ వంశం వాళ్ళ దెబ్బ వీడికి తెలీదు!” అన్నాడు పులుగురాయుడు.
“నా పూర్వ బానిస యింత ధైర్యంగా మాట్టాడుతున్నాడంటే, అందుకేదో మంచి కారణమే వుంటుంది. ఇక్కడ జరగబోయే రక్తపాతంలో నాకు భాగం వద్దు,” అంటూ స్థూలకాయుడు, కొరడాను భుజానికి తగిలించుకున్నాడు.
జిత, శక్తివర్మలు ముందుకు వస్తూ, “ఒకళ్లం వీడి తలా, ఒకళ్ళం వీడి కాళ్ళూ - ఒక్క వేటుకు నరికేద్దాం.” అన్నాడు.
కేశవుడు జిత, శక్తివర్మల కేసి ఒకడుగు వేసేంతలో, “గురు మౌనానందుడికీ, జై!" అన్న కేకలు వినిపించినై. ఆ మరుక్షణంలోనే ముసలివాడూ, బిడాలీ, శ్వానకర్ణీ కొద్ది మంది తమ అనుచరులతో, చెట్ల చాటునుంచి బయటికి వచ్చారు. వాళ్ళను చూస్తూనే, “హాఁ కాలభైరవా!" అంటూ బ్రహ్మదండి మరోవైపుకు పరిగెత్తబోయాడు. అటు నుంచి, జయమల్లు తన అనుచరులతో చెట్ల చాటు నుంచి బయిటికి వచ్చి, బ్రహ్మదండి బలగాన్ని చుట్టు ముట్టాడు.
చేత కత్తిబట్టి ముందుకు వస్తున్న రాకుమారి కల్పకవల్లిని చూస్తూనే, జగభోజి, “అరే, మోసం ! నా కాబోయే భార్య గుహ నుంచి ఎలా బయటపడగలిగింది ? ఆ ద్రోహి కింకరు డెక్కడ ?" అంటూ అరిచాడు.
“కింకరు డిక్కడే వున్నాడు, గురో! గొంతుకు ఉరిబిగిస్తే, అన్ని రహస్యాలూ వీళ్ళకు చెప్పి, యిక్కడికి వెంటబెట్టుకొచ్చాను. ప్రాణం తీపి అలాంటిది గురో!" అంటూ కింకరుడు, కోయగోమాంగ్ పక్క నుంచి కేక పెట్టాడు.
అదే సమయంలో కల్పకవల్లి కత్తితో బెబ్బులిలా ముందుకురికి, జగభోజి కంఠాన్ని ఒక్క వేటుతో నరుకుతూ, “పాపీ ! నీకు యిదే తగిన శిక్ష,” అన్నది.
జగభోజి చావు చూస్తూనే, బ్రహ్మదండి మాంత్రికుడు పెద్దగా మూలిగి, “వత్సా, కేశవా ! శిష్యా, జయమల్లూ ! నన్ను చంపకండి, నేనేమైనా పాపాలు చేసివుంటే - అదంతా మీ యిద్దరి మంచికే చేశాను. ఇక్కడున్న ధనరాసులన్నిటికీ వారసులు, మీరు," అంటూ బావురుమన్నాడు.
ఈ లోపల కేశవుడు, తన తండ్రి కేసి పరిగెత్తి, “అయ్యా, నిన్నీ జన్మలో మరి చూస్తాననుకో లేదు," అంటూ కావిలించుకున్నాడు. ముసలివాడు మాట్లాడేందుకు గొంతు పెగలక, కళ్ళవెంట ఆనందబాష్పాలు రాల్చాడు. ఆ తండ్రి కొడుకుల ప్రేమచూసి కల్పకవల్లి, ఎంతో ఆనందపడింది.
బిడాలీ, శ్వానకర్ణీ, కేశవుడి దగ్గరకు వచ్చి, “కేశవా ! నువ్వూ, నీ మిత్రులూ రెక్కల మనుషులను హతమార్చటానికి, మాకు చేసిన సహాయానికి కృతజ్ఞతగా, నీ తండ్రికీ, అతడి అనుచరులకూ, మా చేతనైనంత సహాయం చేశాం,” అన్నారు. కేశవుడు ఆ అడవి మనుషుల నాయకు లిద్దర్నీ ఎంతో ప్రేమతో కౌగిలించుకున్నాడు.
బ్రహ్మదండి మాంత్రికుడూ, పులుగు రాయుడూ, బానిసల యజమాని స్థూల కాయుడూ బంధించబడ్డారు. కింకరుడు తమకు చేసిన సహాయానికి సంతోషించి, అతడి మెడకు బిగించిన ఉరితాడు తొలగించాడు కోయగోమాంగ్.
కల్పకవల్లి, అక్కడ చేరిన వారందరికీ పరిచయం చేయబడింది. ఆ తరువాత కొంత సేపటికి బిడాలీ, శ్వానకర్ణి వాళ్ళ అనుచరులు తెచ్చిన వార్త విని, బ్రహ్మపుర రాజూ, రాజగురువూ, అక్కడికి వచ్చారు.
కేశవుడు, రాజుకూ, రాజగురువుకూ, రావిచెట్టు మొదట్లో వున్న పాము పుట్ట చూపుతూ, “ఆ పుట్ట తవ్వితే, తమకు అంతులేని ధనరాసులు లభించగలవు. అందులో నాకు పాలు యివ్వవలసిందని, అడగబోవటం లేదు. మహారాజా!" అన్నాడు.
రాజు, తన కుమార్తె కేసి, కేశవుడి కేసి ఓమారు చూసి, వాళ్ళు ఒకళ్ళు నొకళ్ళు ప్రేమగా చూసుకోవటం గ్రహించి, చిరునవ్వు నవ్వుతూ, “కేశవా, నీ కేదో నా మీద విరోధ భావం వున్నట్టు కనబడుతున్నది. నిన్నూ, నీ తండ్రినీ, నీ స్నేహితులనూ దేశ ద్రోహులుగా ప్రకటించటంలో, నేను పొరబాటు చేశానని గ్రహిస్తున్నాను. నా ఒక్కగా నొక్క కుమార్తె కల్పకవల్లి అపహరణ సంగతి తెలిసిన తరువాత, నేను రాజ్యంలో చేయించిన చాటింపు విషయం నీకు తెలియనట్టుంది. ఆమెను తిరిగి తెచ్చి నాకు ఒప్పచెప్పిన వ్యక్తికి, ఆమె నిచ్చి వివాహం చేయటమే గాక, అర్ధ రాజ్య మిస్తానని కూడా ప్రకటించాను." అన్నాడు.
రాజగురువు, ఒక చేత్తో కేశవుడి భుజాన్నీ, మరొక చేత్తో జయమల్లు భుజాన్నీ పట్టుకుని, “మీరు పడిన కష్టాలకు మహారాజు కన్నా, నేనే ఎక్కువ బాధ్యుణ్ణి. బ్రహ్మదండి వెంట యిద్దరు సైనికుల్ని పంపటం ద్వారా, అతడు రాజభక్తుడనీ, మీరు రాజద్రోహులనీ - అనవసరమైన అపవాదు కలిగించాను. ఏది ఏమైనా మీరు మీ శక్తి సామర్థ్యాల వల్ల అన్ని కష్టాలను ఎదుర్కొని జయించటమే గాక, రాకాసి లోయలోని ధనరాసుల్ని బ్రహ్మపురరాజ్య పరం చేశారు. ఆ ధనం వల్ల రాజ్యంలోని ప్రజలంతా సుఖపడతారు," అన్నాడు.
ఆ తరువాత సైనికులు రావిచెట్టు మొదట్లో వున్న పుట్ట అయిదారడుగులు తవ్వేసరికి, వాళ్ళకు పెద్ద భూగృహం ఒకటి కనిపించింది. అందులో వున్న వెలలేని రత్న మణి మాణిక్యాలు, బంగారం, వెండీ చూసి అందరూ దిగ్ర్భాంతులయారు. ఆ ధనమంతా సైన్యం వెంట వచ్చిన ఏనుగుల మీదా, బళ్ళమీదా ఎక్కించబడింది.
తరువాత అందరూ బ్రహ్మపురం చేరారు. రాకుమారి కల్పకవల్లితో, కేశవుడి వివాహం మహావైభవంగా జరిగింది.
ముసలివాడు ఏ చీకూచింతా లేకుండా తన కొడుకు కేశవుడి వద్ద వుంటూ, శేషజీవితాన్ని హాయిగా గడిపాడు. కొంత కాలానికి రాజు వృద్ధాప్యంలో మరణించగా, కేశవుడు బ్రహ్మపుర రాజ్యానికి రాజై, జయమల్లు మంత్రిగా, కోయగోమాంగ్, చిన్న గడేజంగ్ లు సేనానాయకులుగా తనకు అన్నిటా సహాయపడుతూండగా, చాలా కాలం సుఖంగా రాజ్యపాలన చేశాడు.
(సమాప్తం )
Post a Comment