రాకాసిలోయ (చందమామ)_34 RakasiLoya Janapada Novel by Dasari Subramanyam (CHANDAMAMA)

 RakasiLoya 1-35 Janapada Novel by Dasari Subramanyam (CHANDAMAMA)

రాకాసిలోయ (చందమామ)_34

 _దాసరి సుబ్రహ్మణ్యం

రాకాసిలోయ_34

    కొంత చర్చ జరిగిన మీదట బ్రహ్మపుర రాజు, “గురువర్యా ! ఈ సరికే జగభోజి మన రాక తెలుసుకుని వుంటే, వాడు అమ్మాయితో సహా లోయ వదిలి పారిపోయే ప్రమాదం వున్నదని నేను భయపడుతున్నాను," అన్నాడు.


    రాజగురువు కొంచెం ఆలోచించి, తల పంకిస్తూ, “మహారాజా ! మీరు అలాంటి భయాలేమీ పెట్టుకోకండి. మన రాక జగభోజికి తెలియదనుకోవటం పొరపాటు. అడవిలో కల్పకవల్లిని వాడు పట్టుకున్నప్పుడు అన్న మాటలు, ఆమె చెలికత్తెలు స్పష్టంగానే విన్నారు. ఈ రాబోయే అమావాశ్యకు గాని, వాడి దీక్ష నెరవేరదు. అప్పటివరకూ ఎన్ని ప్రమాదాలు వచ్చినా, వాడు యీ రాకాసిలోయలోనే వుంటాడు. ఒకవేళ వాడు ఆఖరి నిమిషంలో భయపడి పారిపోదలచినా, మనం కాపుంచిన, గురు మౌనానందుడూ, కోయ గడేజంగ్ వాడి ప్రయత్నం సాగనివ్వరు." అన్నాడు.


    రాజగురువు అన్నట్టే గురు మౌనానందుడూ, కోయ గడేజంగ్ తమ తమ అనుచరులతో రాకాసి లోయ నుంచి పైకి ఎక్కి పారిపోయేందుకు వీలున్న దారులన్నీ వేయి కళ్ళతో కాపలా కాస్తున్నారు. మౌనానందుడి అనుచరుల్లో ముఖ్యులు బిడాలీ, శ్వానకర్ణీ; కోయ గడేజంగ్ అనుచరుల్లో ముఖ్యుడు, నరమాంస భక్షకుల నాయకుడైన చండ మండూకుడు.


    బ్రహ్మపుర రాజు వెంట వీరే కాక పెద్ద సేన కూడా వున్నది. అందులో గజాశ్వదళాలు కూడా వున్నవి. కోయగోమాంగ్ తనకు వినబడుతున్నవని చెప్పే గంటల సవ్వడులు; ఆ గజ సైనిక దళాల్లోని, ఏనుగుల మెడలకు వేలాడుతున్న కంచు గంటలు చేసే ధ్వనులు.


    రాత్రి గడుస్తున్న కొద్దీ, లోయకు కొంచెం ఎగువగా రాళ్ళ మీద కూచుని వున్న కేశవుడూ అతడి మిత్రులకు, అన్నివైపుల నుంచీ రకరకాల శబ్దాలు వినబడుతున్నవి. పిండారబోసినట్టుగా వున్న వెన్నెల కాంతిలో వాళ్ళకు, దిగువనున్న లోయ స్పష్టంగా కనబడుతున్నది.


    జయమల్లు లోయకేసి కొంచెం సేపు పరీక్షగా చూసి, "కేశవా! ఈ వెన్నెల వెలుగులో యిక్కణ్ణించి మనం లోయలోకి దిగటం ఏమంత కష్టం కాదు. నా ఉద్దేశం, ఆ పులిరాజును సూర్యోదయం లోపలే చంపి, దాని చర్మం వలిచి, నువ్వు ధరించటం మంచిదని. తెల్లవారితే, మన ఉనికి జగభోజికీ, వాడి అనుచరుడికీ తెలిసి పోవచ్చు." అన్నాడు.


    “నువ్వన్నట్టు ఆ పని ఎంత త్వరగా ముగించుకుంటే అంత మంచిది. ఈ లోయ చుట్టూ ఎవరో చేరి, మన కంటే ముందుగా లోయలోకి దిగే ప్రయత్నంలో వున్నారని నా అనుమానం. వాళ్ళు శత్రువులో, మిత్రులో మనకు తెలుసుకునే అవకాశం లేదు." అన్నాడు కేశవుడు.


    ఆ తరువాత ముగ్గురూ, కోయగోమాంగ్ దగ్గరవున్న విషం పూసిన అంబులను సమానంగా పంచుకుని, ఎగుడు దిగుడుగా వున్న రాళ్ళ మీది నుంచి, అడవి తీగను ఆసరాగా పట్టుకుని, లోయలోకి దిగారు.


    లోయ అంతా నిశ్శబ్దంగా వున్నది. ఉండి వుండి ఏదో ఒక మహా వృక్షం మీది నుంచి గండభేరుండ పక్షి ఒకటి వికృతంగా అరుస్తున్నది. నల్లని చెట్ల నీడలూ, ఆ నీడల్లో అటూ యిటూ ఎగిరే మిణుగురు పురుగులూ తప్ప, పులిరాజు అక్కడ వున్న సూచన లేమీ వాళ్ళకు కనిపించ లేదు.


    “పులిరాజు యీ ప్రాంతాల్లో ఎక్కడో మన కోసం పొంచి కూచుని వున్నదని, నా నమ్మకం. ఈ రాళ్ళ దగ్గర వుండటం ప్రమాదం. ఆ కనబడే ఎండిన మోడు చెట్టుకేసి నడవండి,” అంటూ జయమల్లు ముందుకు రెండడుగులు వేశాడు.


    ఆ క్షణంలోనే ఆ ముగ్గురూ సంభ్రమాశ్చర్యాలతో నిచ్చేష్టులయ్యారు. చూస్తూండగానే, ఆ వెన్నెల రాత్రి, అంతవరకూ ఎండ మోడుగా వున్న చెట్టు ఫలపుష్పాలతో నిండిపోయింది.


    "కేశవా, మనం జయించాం! ఈ రాకాసి లోయలోని ధనరాసులు మనవే. కాల భైరవుడు నిన్నావేశించి నప్పుడు చెప్పిన దొకటి నిజమైంది. ఇక మనకు కావలసింది, ఆ పులిరాజు......”


    జయమల్లు మాట ముగించే లోపలే, ఆశ్చర్యంగా ఆ క్షణాన ఫలపుష్పాలతో నిండి పోయిన మోడు చెట్టు వెనక నుంచి, పులి పెద్దగా ఖాండ్రించిన చప్పుడైంది. మరుక్షణాన కేశవుడు విల్లు అటుకేసి ఎక్కుపెట్టాడు. పులి చెట్టు వెనక నుంచి భయంకరంగా మరోసారి అరిచి, పంజా పైకెత్తి, కేశవుడి కేసి లంఘించబోయింది. కేశవుడు విషబాణాన్ని గురి చూసి, పులిరాజు రెండు కళ్ళ మధ్య తగిలేలా కొట్టాడు.


    పులి ఒక్కసారి గాండ్రించి, చాపచుట్టలా పక్కకు పడిపోయింది. కేశవుడూ, జయమల్లూ, గోమాంగ్ పరుగు పరుగున వెళ్లి దాని కాళ్ళూ నడుము పట్టుకుని పైకి లేవనెత్తారు. జయమల్లు చిన్న గొంతుతో, "నిశ్శబ్దంగా సాధ్యమైనంత త్వరగా ఏదైనా గుహలోకి పదండి. జగభోజి మనం పులి రాజును చంపిన సంగతి యిప్పుడే గ్రహిస్తే ప్రమాదం. దీని చర్మం వలిచి, కేశవుడు ధరిస్తే తప్ప, మన దెబ్బ కిక్కడ తిరుగు వుండదు." అన్నాడు.


    ఆ ముగ్గురూ చచ్చిన పులిరాజును మోసుకుని, దాపుల నున్న ఒక గుహలోకి చేరేంతలో జగభోజి కంఠం కర్కశంగా వినిపించింది. "ఏమిరా శిష్యా, కింకరా! ఈ పులి రాజు నాకు నిద్రలేకుండా చేస్తున్నాడు ! పాపం, ఆ రాకన్నె ఎంతగా బాధపడుతున్నదో ! ఎందుకా గాండ్రిపులూ గోండ్రింపులూ ?” అని కేక పెట్టాడు.


    "అంతా తెల్లవారి తెలుస్తుంది. గురో ! ఆ రాజు ఆఖరున పెట్టిన కేక వింటే - అది గాండ్రిపుగానూ లేదు, గోండ్రిపుగానూ లేదు - గొంతులో ప్రాణ మేదో గురగుర మన్నట్టున్నది. మీరు యిక హాయిగా నిద్రపోండి, ఉదయమే, చూసుకుందాం.” అన్నాడు కింకరుడు. గుహలో ప్రవేవించిన కేశవుడూ, జయమల్లూ, గోమాంగ్ కలిసి, క్షణాల మీద పులి రాజు చర్మం వలిచారు. జయమల్లు ఆ చర్మాన్ని కేశవుడికి నడుం దగ్గర నుంచి తిప్పి, భుజం మీదుగా చుట్టాడు. కోయ గోమాంగ్ కేశవుడి యీ కొత్త వేషం చూసి, ఎక్కడలేని ఉత్సాహంతో, "కేశవా, యిప్పుడు నీ రూపం చూపరుల్లో భయం, భక్తీ కూడా రేకెత్తించేలా వున్నది. ప్రయత్నిస్తే నువ్వు మా కోయజాతి కంతా నాయకుడివి కాగలవు." అన్నాడు.


    “అలాంటి ప్రయత్నాలు చేసే తరుణం యింకా రాలేదు." అంటూ జయమల్లు గుహలో నుంచి ఓమారు బయటికి తొంగి చూసి, “ఇక మనం యిక్కడ సాధించవలసింది ఒకే ఒక కార్యం వున్నది. కాలభైరవుడు చెప్పిన, ఆ పెద్ద రావిచెట్టూ, దాని పాదంలో వున్న పాముపుట్టా యీ లోయలో ఎక్కడున్నదో కనుక్కోవాలి." అన్నాడు.


    "ఆ గుర్తుల్ని బట్టి మనం రావిచెట్టును కనుక్కోవచ్చు. అక్కడ వున్న ధనరాసుల్ని తవ్వుకు పోవటం కూడా వెంటనే చేద్దామంటావా?" అని అడిగాడు, కోయ గోమాంగ్ ఉత్సాహంగా.


    జయమల్లు అతడి ప్రశ్నకు జవాబు చెప్పకుండా, చెవులు రిక్కించి వినసాగాడు. దూరంగా ఎక్కడో మనుషులు అటుకేసే నడిచి వస్తున్న సవ్వడి అస్పష్టంగా అతడికి వినిపిస్తున్నది.


    “ధనం మాట తరువాత. ముందు రాజకుమార్తెను, ఆ జగభోజి బారి నుంచి కాపాడాలి. మనం, ఆమె రాజ్యపౌరులం! అన్నాడు కేశవుడు ఆవేశంగా.


    జయమల్లు, కేశవుణ్ణి సమీపించి భుజంమీద చెయ్యివేసి, "కేశవా ! కాస్త గొంతు తగ్గించి మాట్టాడు. ఈ లోయలో జగభోజి, కింకరులతో పాటు మరెవరో కూడా వున్నారని నా అనుమానం. జాగ్రత్తగా విను.....ఏవైనా, అడుగుల చప్పుడులు....."


    జయమల్లు మాట పూర్తి కాకుండానే, అల్లంత దూరం నుంచి పెద్దగా పిలుస్తున్న ఒక గొంతు వినబడింది. "సోదరా, జగభోజీ ! నువ్వెక్కడ? నేను యిక్కడికి తిరిగి వచ్చాను. ఈ రాకాసి లోయలో నీ కంఠధ్వని, పులిరాజు రంకెలు విని, నా చెవులకు పట్టిన తుప్పు వదిలించు కుందామనుకున్నాను. కాని మీ రెండు గొంతులూ వినబడవేం?"


    ఆ వెంటనే జగభోజి గొంతు పెద్దగా జవాబిచ్చింది, “సోదరా! ఎవరు? బ్రహ్మదండేనా? ఆహాఁ, ఎంత అదృష్టం! ఎన్నాళ్ళకు తిరిగి వచ్చావు!" కేశవుడూ, జయమల్లూ, కోయగోమాంగ్ ముఖముఖాలు చూసుకున్నారు. వాళ్ళకు బ్రహ్మదండి మాంత్రికుడి గొంతు భయాశ్చర్యాలను కలిగించింది. సమయానికి యీ దుర్మార్గుడూ యీ లోయ చేరాడన్న మాట! ఇప్పుడేమిటి కర్తవ్యం?


    బ్రహ్మదండి మాంత్రికుడు, జగభోజి నివశించే గుహను చేరిన గుర్తుగా, అటువైపు నుంచి, మాటల ధ్వనులు వినబడసాగినై. ఒకటి రెండు నిమిషాలు గడిచిన తరువాత, బ్రహ్మదండి గొంతుస్థాయి కాస్త పెంచి, "సోదరా! నువ్వు, ఆ బ్రహ్మపుర రాకన్నె కల్పకవల్లిని అపహరించుకుని యిక్కడికి తేవటంలో పెద్ద ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నావు. బ్రహ్మపుర, కపిలపుర రాజ్యాల్లో నివశించే, అనాది ఆటవిక జనాలను వెంట బెట్టుకుని, ఆమె తండ్రి మన రాకాసి లోయను చుట్టు ముట్టాడు. నేను, నీ రక్షణకుగాను, పులుగురాయుడనే ఒక పక్షి తల వెధవతో కలిసి ఒక రహస్య సొరంగ మార్గాన యిక్కడికి వచ్చాను," అన్నాడు.


    “నా క్షేమం గురించి, నువ్వు పడిన ఆదుర్దా చూసి, నాకు చాలా సంతోషం కలుగుతున్నది. మనం యిద్దరం ఎంత లేదన్నా, పాతిక ముఫ్పై సంవత్సరాలు, యీ లోయలో ఒకే గురువు దగ్గిర మంత్ర శాస్త్రం అభ్యశించాం. సరే, యింతకూ నువ్వెళ్ళిన పని, ఏమయింది ?" అని అడిగాడు జగభోజి.


    జగభోజి ప్రశ్నకు, బ్రహ్మదండి ఛీత్కారం చేసి, “మనం గురువు గురువు అనుకునే ఆ నీచుడు, చచ్చి ఎక్కడున్నాడో గాని - వాడు మనకు మనసిచ్చి మంత్ర శాస్త్రం బోధించలేదు.


    బ్రహ్మపుర రాజ్యం లోని ఒకానొక కొండలో కాలభైరవుణ్ణి ప్రతిష్ఠాపన చేసి, మనకు కావలసిన జాతకుడు, కేశవుడనే వాణ్ణి పట్టుకుని, వాడిచేత యిక్కడ దొరికే ధనరాసుల విషయం చెప్పించే ప్రయత్నం చేశాను. కాని, నా పని పూర్తయే లోపలే, బ్రహ్మపుర రాజగురువు తన మంత్రశక్తితో అక్కడ వున్న అందరి నోళ్ళూ కట్టేశాడు." అన్నాడు.


    ఆ తరువాత జగభోజీ, బ్రహ్మదండి మాంత్రికుడూ కలిసి లోయలోకి కొంత దూరం వెళ్ళి, అక్కడ చెట్ల కింద కూచుని వున్న పులుగురాయుణ్ణి, స్థూలకాయుణ్ణి, జిత, శక్తివర్మలను కలుసుకున్నారు. ఆ సమయంలో తూర్పు దిక్కు కొంచెం తెలతెల్లనవుతున్నది.


    “ఇక మనం లోయ మధ్యకు పోదాం. ధనరాసులు నిక్షేపమై వున్న రావిచెట్టూ, ఆ పాము పుట్టా ఎక్కడున్నవో, నాకు తెలుసు!" అంటూ జగభోజి ముందుండి దారి తీశాడు.


    జగభోజి, బ్రహ్మదండితో కలిసి గుహ విడిచి పోవటం; రాజకుమారికి కింకరుడి కాపలా సంగతి - అంతా కేశవుడు చీకట్లో ఒక గుహ ముందు అటూ యిటూ పచారు చేస్తున్న కింకరుడి ఆకారం కనబడింది.


    వాళ్ళు ముగ్గురూ, కింకరుడు కాపలా కాస్తున్న గుహ దగ్గరకు వెళ్ళే సరికి, కింకరుడు గుహ ముందు బయట ఆగి, గుహలో వున్న కల్పకవల్లి సుద్దేశించి, "హాఁ రాకుమారీ! బ్రహ్మపుర రాజ్యంలోని సరస్సు దగ్గిర చూడగానే, నిన్ను నేను ప్రేమించేశాను. నువ్వు మా గురువు జగభోజిని ఎలా ప్రేమించి వివాహమాడతావో, నా కర్థం కావటం లేదు. అడవిపంది కోరల్లా వున్న వాడి పళ్ళూ, దబ్బనాల్లా పైకి లేచిన వాడి కనుబొమలూ, నెత్తిన చింకికుళాయీ - ఏ కన్య అయినా వాణ్ణి ఎలా ప్రేమిస్తుంది? నన్ను, చూడు! ఈ తలలో వున్న ఈకలు రాజభేరుండానివి! వాటిని సంపాయించేందుకునేను చేసిన సాహసం ......"


    కింకరుడు మాట మధ్యలోనే పెద్దగా అరవబోయి, ప్రాణం కడబట్టుతున్న వాడిలా కీచుమన్నాడు. దానికి కారణం, కేశవుడు ఉచ్చు బిగించి విసిరిన అడవితీగ, గురిగా వాడి కంఠానికి పడి బిర్రబిగుసుకుపోవటం.


    "కేశవా! వాడు ఊపిరాడక చచ్చేట్టున్నాడు. వాడితో మనకు కొంత పని వున్నది. ఆ ఉచ్చు కాస్త వదులు చెయ్యి," అంటూ జయమల్లు రాళ్ళ చాటు నుంచి ముందు కురికాడు. కేశవుడు, కికంరుడి మెడకు బిగుసుకు పోయిన ఉచ్చును వదులుచేశాడు. 

ఇంకా వుంది...

Post a Comment

Previous Post Next Post