రాకాసిలోయ (చందమామ)_33 RakasiLoya Janapada Novel by Dasari Subramanyam (CHANDAMAMA)

 RakasiLoya 1-35 Janapada Novel by Dasari Subramanyam (CHANDAMAMA)

రాకాసిలోయ (చందమామ)_33

 _దాసరి సుబ్రహ్మణ్యం

రాకాసిలోయ_33

    తమకు ఆధారంగా వున్న అడవి తీగను గణాచారి ముఠా వాళ్ళు పైన నరికివేస్తున్న శబ్దం వింటూనే, కేశవుడితో పాటు జయమల్లూ, కోయగోమాంగ్ కూడా భయంతో కంపించి పోయారు. కాని, మరుక్షణంలో వాళ్ళకు ఎక్కడలేని గుండెధైర్యం కలిగింది.


    "ఇన్ని కష్టాలు దాటి, యింత దూరం వచ్చి, యిక్కడ చావబోతున్నామంటే నేను నమ్మను," అన్నాడు కేశవుడు నిండు కంఠంతో.


    "నీవన్నది నిజం, కేశవా ! నా కాలి కేదో పట్టు చిక్కింది. మీరు తీగ మాద నుండి సాధ్యమైనంత బరువు తగ్గించి, చేతి పట్టుకేమైనా దొరుకుతుందేమో చూడండి. వీలయితే, మనం తీగను ఏ రాతి కన్నా ముడి వేయటం మంచిది. అప్పుడు, పైన తెగినా, మనం ఒక్కసారిగా లోయలోకి పడిపోం," అన్నాడు జయమల్లు.


    జయమల్లు మాట ముగించే లోపలే, ముగ్గురిలో పై నున్న కోయగోమాంగ్, “ఆ దుర్మార్గులు తీగ నరికేశారు!” అంటూ ఒక్కసారిగా అరిచి, తల కిందులై పోయాడు. 


    అతడితో పాటు కేశవుడూ, జయమల్లూ కూడా పట్టు తప్పి, గాలిలో ఒకటి రెండు పల్లటీలు కొట్టారు. కాని, వాళ్ళల్లో ఎవరూ తమ చేతిలో వున్న అడవి తీగను విడిచి పెట్ట లేదు. ఆ జాగర్తే వాళ్ళను కాపాడింది. కను మూసి తెరిచేంత వ్యవధిలో వాళ్ళు తిరిగి రాళ్ళకేసి గుంజ బడ్డారు. ముగ్గురి శరీరాలూ, శిఖరం దిగువనున్న రాళ్ళను బలంగా తాకినై.


    “తెగ నరకబడిన అడవి తీగ మన అదృష్టం కొందికీ, దిగువను ఏ రాయినో చుట్టుకుని బిగుసుకుపోయింది.” అన్నాడు జయమల్లు.


    కేశవుడూ, గోమాంగ్ ఏదో జవాబివ్వ బోయేంతలో, కొండ శిఖరం మీది నుంచి గణాచారి ముఠా వాళ్ళు ఉత్సాహంగా, "ఆ దుష్టులు యీసరికి కింది లోయలోని రాళ్ళమీద పడి తునాతునియలై వుంటారు. మన పక్షి మాతల రెక్కలు నరుక్కు వెళ్ళే వాళ్ళందరికీ, యిదే చావు రాసిపెట్టివున్నది,” అంటూ పెద్దగా కేకలు పెట్టారు.


    ఆ కేకలు లోయ అంతా ప్రతిధ్వనించింది. పెద్ద పెద్ద చెట్ల మీద రెక్కలు చాచుకు నిలబడి వున్న గండభేరుండాలు గొంతులెత్తి కర్ణకఠోరంగా ఒక్కసారి అరిచినై. ఎక్కడో పులి ఒకటి రంకె వేసింది. ఈ భయంకర ధ్వనులను విని నిశ్చేష్టులైన కేశవుడూ అతడి అనుచరులు తెప్పరిల్లే లోపలే, ఒక మానవ కంఠం లోయలో నుంచి విసుక్కుంటున్నట్టు కటువుగా పలికింది, “కింకరా! ఏమిరా, ఆ రణగొణ ధ్వనులు? పులిరాజు కూడా మేల్కున్నాడు !" అన్నదా కంఠం.


    ఆ వెంటనే జవాబుగా మరో గొంతు, “జగభోజి గురో! ఆ గణాచారి సజ్జు ఎవర్నో చంపి రాకాసిలోయలోకి తోసినట్టుంది. ఈ గత్తర కంతా అదే కారణం," అన్నది.


    “ఆ చచ్చిన వాళ్ళు బ్రహ్మపురం రాజూ, వాడి గురువూ కాదు గదా ? వాళ్ళ మధ్య మన చెవులపాలిట జోరీగల్లా తయారయ్యారు," అన్నాడు జగభోజి.


    “వాళ్ళా ! వాళ్ళిక్కడికి దారి తెలుసుకుని వచ్చే లోపల, మనం రాకన్నెను పెళ్ళాడి, ధనరాసులతో కూడా అంతర్ధాన మవుతాం. తరువాత వాళ్ళు యీ లోయలోని గండభేరుండాలకూ, కొండ చిలవలకూ, క్రూర మృగాలకూ ఆహారం కావలసిందే !" అన్నాడు కింకరుడు.


    “ఆఁ, రాకన్నె! కింకరా, ఆ మాటే మరిచాను. అమావాశ్య యింకా పదమూడు రోజులున్నది. ఆ రాత్రిగాని నాకు ఆ కన్నెతో లగ్నం కుదరదు. ఇప్పుడు లోయలో రేగిన గడబిడకి ఆ అందాల హంస నిద్ర మేలుకుని కలవర పడుతున్నదేమో చూడు,” అన్నాడు జగభోజి.


    కింకరుడు పెద్దగా నవ్విన సవ్వడి అయింది. ఆ తరవాత వాడు పెద్దగా గొంతెత్తి, “గురో, ఆ కన్నె..... కల్పకవల్లి..... అందాల హంస కాదు, భయంకర బెబ్బులి ! తన తండ్రి బ్రహ్మపురం రాజూ, ఆయన గురువూ కలిసి వచ్చి తనను కాపాడగలరనే యింకా భ్రమిస్తున్నది. అందుకే మిమ్మల్ని చులకన చేసి మాట్లాడుతున్నది. ఆవిడి క్కాస్త, ఈ రాకాసిలోయ అంటే బెదురు పుట్టటం అవసరం, మీరలా వూరుకోండి,” అన్నాడు కింకరుడు.


    ఆ తరువాత అంతా నిశ్శబ్దం. లోయ కింది భాగం నుంచి వచ్చిన యీ సంభాషణ అంతా విన్న కేశవుడూ, జయమల్లూ, కోయగోమాంగ్ ఆశ్చర్యంతో, భయంతో కంపించి పోయారు. ఒకటి రెండు క్షణాలపాటు మాట్టాడదామన్నా ఎవరికీ గొంతు పెగిలింది కాదు. ఆఖరికి జయమల్లు కంపిస్తున్న కంఠ స్వరంతో మెల్లిగా, “విన్నావా, కేశవా ?" అని అడిగాడు.


    “విన్నాను ! మనకంటే ముందే యిక్కడికి మాంత్రికుడో ఎవరో చేరినట్టున్నది. వాడి స్వాధీనంలో మన బ్రహ్మపురం రాజు కూతురు కల్పకవల్లి వున్నది. వాడు, మనం వచ్చిన ధనరాసుల కోసమే యిక్కడ కాపలా వేశాడు." అన్నాడు కేశవుడు.


    జయమల్లు ఏమీ మాట్లాడ లేదు. అతడు ఆలోచనలో పడ్డాడు. అదృష్టవశాత్తూ, వాళ్ళకు కొంచెం దిగువగా కొండ అంచునుంచి బయటికి పొడుచుకు వచ్చిన రాళ్ళు కొన్ని కనిపించినై, తీగమీది నుంచి నిశ్శబ్దంగా వాటి మీదికి జారి ముగ్గురూ, చీకట్లో చుట్టూ కలయ చూస్తూ కూచున్నారు.


    “మనం బ్రహ్మపురం వదిలి చాలాకాలమైంది. ఈ లోపల అక్కడ చాలా మార్పులు జరిగినట్టుంది. రాజకుమార్తె కల్పకవల్లి, ఈ రాకాసిలోయ ఎలా చేరింది? ఈ జగభోజి ఎవడు? కింకరుడనే వాడు వాడి శిష్యుడిలా వున్నాడు. మనం రాకుమారిని రక్షించగలమా, జయమల్లూ?” అన్నాడు కేశవుడు.


    జయమల్లు కేశవుడి మాటలు విని జవాబిచ్చే స్థితిలో లేడు. అతడు, జగభోజికీ, కింకరుడికీ జరిగిన సంభాషణ వెనక వున్న రహస్యం ఏమిటో తెలుసుకునేందుకూ, 'పులిరాజు' అన్న జగభోజి మాటల అర్థం కనుక్కునేందుకు ఆలోచిస్తున్నాడు.


    "కేశవా ! ఈ సంగతేమైనా నీకు గుర్తు వున్నదా ? మనం బ్రహ్మపురం దగ్గిర కొండల్లో వున్నప్పుడు, బ్రహ్మదండి మాంత్రికుడు కాలభైరవుణ్ణి నీ మీదికి ఆవాహన చేశాడు. అప్పుడు నీవు ఆ మైకంలో కొన్ని రహస్యాలు చెప్పావు. అవేమిటో తరవాత నేను నీకు చెప్పాను,” అన్నాడు జయమల్లు.


    కేశవుడు అనుమానంగా జయమల్లు కేసి చూస్తూ తలాడించి, “ఆ గొడవేమీ నాకు అంతగా గుర్తు లేదు. ఈ రాకాసి లోయలో ధనరాసులున్న వన్న సంగతొక్కటే నాకు బాగా జ్ఞాపకం వున్న విషయం !" అన్నాడు.


    అప్పటి వరకూ వాళ్ళిద్దరి సంభాషణా వింటూ, నిశ్చేష్టుడై కూచుని వున్న కోయగోమాంగ్, హఠాత్తుగా ప్రాణం వచ్చిన వాడిలా కేశవుడి కేసి తల తిప్పి, "నా కళ్ళకు లోయ కావల ఎక్కడో దీపాల వెలుగు కనిపిస్తున్నది. చెవులకు ఏనుగులు ఘీంకరించిన ధ్వని వినబడుతున్నది," అన్నాడు.


    "నా కలాంటి కాంతులు గాని, ధ్వనులు గాని వినిపించటం లేదు. నన్నేదో మత్తు ముంచేస్తున్నది. నాకీ రాకాసిలోయలోని బంగారమూ వద్దు వెండీ వద్దు. ప్రాణం విసిగిపోయింది. చావంటే నాకేం భయం లేదు - కాని, చచ్చే ముందు ఒక్కసారైనా మా అయ్యను చూడగలిగితే, ఎంత బావుండును!" అంటూ కేశవుడు కళ్లు మూసుకుని, వెనక్కు చేరగిలబడి పోయాడు.


    జయమల్లు కేశవుడి భుజం పట్టుకుని లాలిస్తూ, “నిరుత్సాహ పడకు, కేశవా! ఎన్నో భయంకర ప్రమాదాలను ధైర్యంగా ఎదుర్కుని, జయించి యిక్కడికి చేరాం. జగభోజి, వాడి శిష్యుడు కింకరుడి సంభాషణ విన్న తరువాత నాకు మన కష్టాలు తీరే సమయం ఆసన్నమయిందని నమ్మకం కలుగుతున్నది. మనం, నీ ముసలి తండ్రినే కాదు, బ్రహ్మపుర రాజునూ, రాజ గురువునూ - అందర్నీ చూడగలగవచ్చు. ఈ లోయలోని నిధులు మాత్రం మనవి. అవి సంపాయించే శక్తి మనకే వున్నది. వాటి మీది హక్కు కూడా మనదే. యిందులో సంశయించటాని కేమీ లేదు." అన్నాడు. అని అడిగాడు కేశవుడు.


    "భవిష్యత్తు మన కను కూలంగా వున్నదని, అంత నమ్మకంగా నీ వెలా చెప్పగలవు ?” అని అడిగాడు కేశవుడు.


    జయమల్లు ఓ క్షణకాలం తల పంకిస్తూ వూరుకుని తరవాత, చిన్న గొంతుతో, "కాలభైరవుడు నిన్నావేశించినప్పుడు, నీవు బ్రహ్మదండి మాంత్రికుడితో అన్న మాటలివి, 'వింధ్యారణ్యాల కవతల ఒక గొప్ప కొండలోయ వున్నది. అదే రాకాసిలోయ! ఆ లోయలో ఒకచోట ఎత్తయిన ఒక రావి చెట్టు, దాని కింద ఒక పాము పుట్ట.....ఎండి మోడుగా వున్న చెట్టు వెన్నెల రాత్రి ఫల పుష్పాలతో నిండి పోతుంది..... పులిరాజును చంపి, చర్మం వలిచి, దాన్ని.....' ఆ తరువాత బ్రహ్మపుర రాజగురువు తన మంత్రశక్తితో నీ నోరు కట్టేశాడు." అని చెప్పాడు.


    “అంతా బాగానే వున్నది. మనం రాకాసి లోయ చేరామన్న సత్యం ఒక్కటి తప్ప, తతిమ్మా మాటల్లో వున్న నిజమెంతో యింత వరకూ సూచనగా నైనా బయటపడలేదు." అన్నాడు కేశవుడు నిస్పృహగా.


    "కాలభైరవుడు ఆవేసించినప్పుడు, నువ్వు చెప్పిన ప్రతి అక్షరం నిజమై తీరుతుంది. ఇంతకు ముందు జగభోజి అన్న మాటల్లో 'పులిరాజు కూడా మేల్కున్నాడు!' అన్న పదం అర్థం ఏమిటి? మనం సూర్యోదయం కాగానే లోయలోకి దిగి, ఏదో విధంగా ఆ పులిరాజును చంపబోతున్నాం. తరువాత దాని చర్మం వలిచి, దాన్ని......"


    జయమల్లు మాట ముగించే లోపలే, వాళ్ళు కూర్చుని వున్న కొండరాళ్ళకు దిగువగా పెద్దపులి భయంకరంగా రంకె వేసింది. ఆ ధ్వని వింటూనే ముగ్గురూ తలలు వంచి కిందికి చూశారు. వాళ్ళకు నిప్పు రవ్వల్లా కణకణ లాడుతూ మెరుస్తున్న రెండు కళ్ళు లోయ అడుగున కనిపించినై.


    “ఇదే పులిరాజు ! ఆ మెరుస్తున్న కళ్ళు మనం చూడ గలుగుతున్నామంటే, అది మోర ఎత్తి, మనకేసే చూస్తున్న దన్న మాట !" అన్నాడు కోయగోమాంగ్.


    “మనలనది గుర్తించింది, దాన్ని మనం గుర్తించాం, బావుంది ! ఒకళ్ళ నొకళ్ళు చంపుకునేందుకు వెతుక్కోవలసిన శ్రమ తప్పింది. గోమాంగ్ ! నీ దగ్గిర విషం పూసిన అంబులు వున్నవి గదా ?" అన్నాడు జయమల్లు.


    “వున్నవి. ఇప్పుడే పులి వేట ప్రారంభిద్దా మంటావా, మల్లూ ?” అని అడిగాడు కోయ గోమాంగ్.


    “వేటకు యిది సరైన సమయం కాదు. ఈ చీకట్లో, మనం చంపిన పులిరాజును జగభోజి ఎత్తుకు పోవచ్చు. మనం దాన్ని కొంచెం రహస్యంగా చంపాలి. అది మనను విడిచి పారిపోతుందన్న భయం లేదు. మన వాసన పసి కట్టింది గనక మనం దానికి గుర్తు; దాని మెరిసే కళ్ళు చూశాం కనక, మనకు అది గుర్తు. ఎవర్ను ఎవరు చంపి చర్మం ఒలుచుకోగలమో ఉదయం కాగానే చూద్దాం. ఆ తరువాత జగభోజి అంతు తేల్చాలి." అన్నాడు జయమల్లు నిబ్బరంగా.


    గోమాంగ్, జయమల్లులు సంభాషిస్తున్నంత సేపూ కేశవుడు నిశ్చలంగా కూచుని వున్నాడు. వాళ్లిద్దరి సంభాషణా ఆగిపోగానే అతడు, జయమల్లుకేసి ఆశ్చర్యంగా చూస్తూ, “మల్లూ, నాకేం మతిపోవటం లేదు గదా ! మేలుకుని వుండే కలలు కంటున్నానేమో అని భయంగా వున్నది. లోయ కావలి నుంచి ఏమిటి ధ్వనులు ? వింతగా వుందే !" అన్నాడు.


    “నీకూ, ఏనుగుల ఘీంకారం లాటి ధ్వనులు వినబడుతున్నవా?” అని ప్రశ్నించాడు, జయమల్లు.


    “ఏనుగులు చేసే ఘీంకారాలే కాదు, ఎక్కడో గంటల చప్పుడు కూడా వినబడుతున్నది. ఏమంటావ్, గోమాంగ్? నీ కలాటి ధ్వనులేమైనా వినబడుతున్నవా?" అని అడిగాడు కేశవుడు.


    "ఇదంతా ఏదో మాయలా వుంది. నాకు గంటలు మోగుతున్న ధ్వనే కాదు, గాలి మోసుకొస్తున్నట్టు, ఏవో మాటలు కూడా వినబడుతున్నవి. నన్నడిగితే, యిదంతా ఏదో మంత్ర ప్రభావం వల్ల మనకు కలుగుతున్న భ్రమ అంటాను," అన్నాడు గోమాంగ్.


    కోయ గోమాంగ్ మాటలు జయమల్లులో రకరకాల ఆలోచనల్ని రేకెత్తించినై. గోమాంగ్ అన్నట్టు ఈ రాకాసిలోయ అంతా మంత్రగ్రస్తమా? జగభోజి బ్రహ్మపుర రాజు కూతురు కల్పకవల్లిని, ఏ విధంగా యిక్కడికి తీసుకురాగలిగాడు? ఈ లోయలో నుంచి కాలు బయటికి పెట్టకుండానే, వాడా కార్యం సాధించాడా?


    జయమల్లు అంతు దొరకని యిలాంటి ప్రశ్నలకు సమాధానాల కోసం సతమత మవుతుంటే, కేశవుడు తన తండ్రి యీ సమయంలో యిక్కడ వుంటే, ఎంతో బావుండేదని ఆలోచిస్తున్నాడు.


    కోయగోమాంగ్ తమ నాయకుడైన గడేజంగ్ వస్తే, రాజకుమారి జగభోజి చెర నుంచి విముక్తురాలు కాగలదని యోచిస్తున్నాడు.


    రాకాసిలోయకు యీవల వైపున ఆ ముగ్గురు మిత్రులూ ఎవరి ఆలోచనల్లో వారుండగా, లోయకు ఆవల నున్న మైదానంలో బ్రహ్మపురం రాజు, రాజగురువూ సైన్యం మధ్య తమ కోసం నిర్మించబడిన డేరాల్లో కూచుని ముందు కర్తవ్యం గురించి చర్చలు జరుపుతున్నారు. వాళ్ళను పట్టుకున్న సమస్య; సైన్యంతో రాకాసిలోయలోకి దిగటమా? లేక కొద్దిమంది అంగరక్షకుల్ని వెంట తీసుకుని లోయలోకి ప్రవేశించటమా? అన్నది.

ఇంకా వుంది...

Post a Comment

Previous Post Next Post