రాకాసిలోయ (చందమామ)_32
రాకాసిలోయ_32
లోయలోకి దిగుతూనే తమకు ప్రత్యక్షమైన ఈ వింత దృశ్యం చూసి కేశవుడూ, అతడి అనుచరులు ఆశ్చర్యపోయారు. జయమల్లు గణాచారిగ్గాని, అతడి ఎదురుగా చేరి డప్పులు వాయిస్తూ నాట్యం చేస్తున్న అతడి అనుచరులగ్గాని, కనబడకుండా వుండేందుకు, దాపులనున్న ఒక మహా వృక్షం ఎక్కాడు.
ఆ వెంటనే కేశవుడూ, కోయగోమాంగ్ కూడా చెట్టుమీదికి పాకారు. “వీళ్ళేదో నరమాంస భక్షకుల్లా కనబడుతున్నారు. ఆ గండబేరుండ పక్షిని చేత బట్టుకుని చిందులు తొక్కేవాడు, వాళ్ళ నాయకుడనేందుకు సందేహం లేదు. మళ్ళీ మనం చిక్కుల్లో పడలేదు గదా !" అన్నాడు జయమల్లు.
జయమల్లు మాటలకు కేశవుడేదో జవాబు చెప్పబోయేంతలో, గణాచారిలా గంతులు వేస్తున్న వాడు తన అనుచరులకేసి తిరిగి, పెద్దగా గొంతెత్తి, “మన కష్టాలన్నిటికీ కారణం, శత్రువులు మన గండభేరుండ పక్షి మాతల్ని సంహరించటమే. ఆ పక్షి మాతల్ని మనం కాపాడామో, ఆ మాతలు మనను కాపాడుతవి. గండభేరుండాల్ని రక్షించే సాహసం మీలో ఎవరికైనా వున్నదా ?" అని ప్రశ్నించాడు.
ఆ ప్రశ్నకు జవాబుగా అతడి అనుచరులు ఈటెలు పైకెత్తి, “గండభేరుండాల్ని పట్టుకుని, వాటి రెక్కలు నరికి ఎత్తుకు పోతున్న వాళ్ళెవరో మాకు తెలుసు. ఈనాటి నుంచి ఆ దుర్మార్గుల్ని ఈ ప్రాంతాల అడుగు పెట్టకుండా చేయగలం. యిదే, మా ప్రతిజ్ఞ !" అన్నారు.
“అలా అయితే, యిక వెళ్లండి, రాత్రనక పగలనక, ఆ పక్షి మాతలు నివశించే లోయ ప్రాంతాలను శత్రువుల నుంచి కాపాడండి," అంటూ గణాచారి తన చేతిలో వున్న గండభేరుండ పక్షిని వదిలేశాడు.
"ఇదీ సంగతి ! పులుగురాయుడి ముఠా వాళ్ళు యీ ప్రాంతాల వున్న గండభేరుండ పక్షుల్ని పట్టుకుని, వాటి రెక్కలు నరుక్కు పోతున్నారన్న మాట," అన్నాడు జయమల్లు తల పంకిస్తూ, “వాళ్ళు చేస్తున్న ఈ దుండగాల వల్ల మనం చిక్కులోపడే ప్రమాదం వున్నది. మనం యీ గణాచారిగాడి అనుచరుల కంటబడితే, మననూ రెక్కల మనుషుల కింద జమకట్టి హత మార్చేందుకు ప్రయత్నిస్తారు,” అన్నాడు కేశవుడు.
“మనకు అడుగడుగునా అవాంతరాలే. రాకాసిలోయను సమీపిస్తున్నామన్న సంతోషం ఏమీ లేకుండా పోయింది. వీళ్ళను తప్పుకుని కొండల్లోని ఆ సొరంగ మార్గం తెలుసుకోవటం ఎలా?" అని ప్రశ్నించాడు కోయగోమాంగ్.
ఈ విధంగా చెట్టు కొమ్మల్లో దాగి వున్న ఆ ముగ్గురూ ఆలోచిస్తు న్నంతలో గణాచారి కొద్ది మంది తన అనుచరుల్ని వెంట పెట్టుకుని వెళ్లిపోయాడు. కేశవుడూ వాళ్ళు మరికొంత సేపు కొమ్మల్లోనే వుండి, ఆ చుట్టుపక్కల ఎవరూ లేరని ధృవపడిన తరువాత మెల్లిగా చెట్టు దిగి వచ్చారు.
“ప్రస్తుతానికి ఆ గణాచారి ముఠా భయం లేదు. బిడాలీ, శ్వానకర్ణీ చెప్పిన ఆ సొరంగమార్గమేదో తెలుసుకుంటే రాకాసిలోయకు చేరవచ్చుగదా," అన్నాడు కోయగోమాంగ్.
ఆ మాటలకు జయమల్లు నవ్వి, “ఇన్ని కొండలూ, గుట్టలూ వున్న ఈ ప్రదేశంలో మనకు కావలసిన సొరంగ మార్గం వెతకటం తేలికకాదు. మనం ముందు ఈ లోయలో నివశించే వాళ్ళ కంటబడకుండా మెలకువతో వుండాలి. అది చాలా ముఖ్యం." అన్నాడు.
కేశవుడు నిశ్శబ్దంగా చెట్ల చాటున నడుస్తూ అల్లంత దూరంలో వున్న కొండలకేసి చేయిచూపి, "మనం ఆ ప్రాంతాలకు ఏ ప్రమాదం లేకుండా చేరగలిగితే, ఆ తరువాత ఆ సొరంగ మేదో కనుక్కోవచ్చు. మాట్లాడకుండా నడవండి," అన్నాడు.
ఆ తరువాత ముగ్గురూ కొంతదూరం నడిచి ఒక కొండ ప్రాంతాన్ని సమీపించారు. ఆ కొండ ఎగుడు దిగుడుగా వున్న పెద్ద పెద్ద బండరాళ్ళతో నిర్జనంగా కనిపించింది. ఆ ప్రాంతాల గణాచారి అనుచరులెవరూ లేరని నిశ్చయించుకున్న తరవాత కేశవుడూ వాళ్ళు చెట్ల చాటు నుంచి బయటికి వచ్చి, కొండను సమీపించబోయారు.
హఠాత్తుగా వాళ్ళకు ఎదురుగా వున్న ఒక ఎత్తయిన ప్రదేశం నుంచి కేకలు వినిపించినై, ముగ్గురూ తలలు ఎత్తి అటుకేసి చూశారు. నలుగు రైదుగురు అడవి మనుషులు వాళ్ళకేసి ఈటెలు ఊపుతూ, “ఎవరు మీరు? వెనక్కు తిరిగిపోండి. ఒక్క అడుగు ముందుకు వేశారో ప్రాణాలు దక్కవు. గండభేరుండాల రెక్కలు నరుక్కుపోయే మీ దుర్మార్గం యిక సాగదు,” అని పెద్దగా అరిచారు.
వాళ్ళ కేకలకు జవాబుగా జయమల్లు, “మేము గండభేరుండ పక్షుల రెక్కలు నరుక్కు పోయేందుకు వచ్చిన వాళ్ళంకాదు. మా దారిన మమ్మల్ని పోనివ్వండి," అని కేక వేశాడు.
జయమల్లు మాట ముగిసేలోపలే కొండ మీది నుంచి పెద్ద పెద్ద రాళ్ళు వేగంగా వచ్చి వాళ్ళు నిలబడిన చోట పడసాగినై. కోయగోమాంగ్ రాళ్ళు విసిరే వాళ్ళతో ఏదో అనబోయేంతలో జయమల్లు అతడి భుజం పట్టుకు వెనక్కు లాగుతూ, “నువ్వేమి చెప్పినా, వాళ్ళ నుంచి నీ కొచ్చే జవాబు రాళ్ళవర్షం తప్ప మరేం వుండదు. వెనక్కు తిరిగి వాళ్ళ దెబ్బకు అందకుండా పారిపోవటమే ప్రస్తుతానికి క్షేమం," అన్నాడు.
జయమల్లు వెనుకగా కేశవుడూ అతణ్ణి అనుసరించి కోయ గోమాంగ్ కొంతదూరం పరిగెత్తి, అక్కడ వున్న రాళ్ళ వెనక ఆయాసపడుతూ కూచున్నారు. కొంచెం సేపు ఎవరూ మాట్టాడలేదు. గణాచారి అనుచరులు తమను వెన్నంటి వస్తున్నారేమో అన్న భయంతో, వాళ్ళ అలికిడి కోసం జాగ్రత్తగా కొద్దిసేపు విని, అలాంటిదేమీ లేకపోవటంతో ముగ్గురూ తృప్తిగా ఒక నిట్టూర్పు విడిచారు.
“మనం రాకాసిలోయను చేరేందుకు ఉపయోగపడే సొరంగ మార్గం ఎక్కడ వున్నదో నాకు తెలిసిపోయింది,” అన్నాడు జయమల్లు, కేశవుడూ. గోమాంగ్ అతడి కేసి ఆశ్చర్యంగా చూశారు.
జయమల్లు చిరునవ్వు నవ్వుతూ, “ఆశ్చర్యపడకండి. రాకాసిలోయ అనేది ఈ కొండల వెనక ఎక్కడో వున్నదనిగదా, బిడాలీ, శ్వానకర్ణీ చెప్పింది. అంటే యీ కనబడే కొండలు దానికి ఒక వైపున వున్న ఆనకట్టలాంటి వన్నమాట. వీటిని ఎక్కి చూస్తే లోయా, అవతల మరొక కొండల సాలువూ కనబడే, ఆ మధ్యనున్న లోయ, రాకాసిలోయ !" అన్నాడు.
“అలా అయితే వాళ్ళు చెప్పిన 'ఒకానొక సొరంగం' మాటేమిటి?" అని అడిగాడు కోయగోమాంగ్.
“ఒకానొక; అనటంలోనే ఆ బిడాలికీ, శ్వానకర్ణికీ యీ ప్రాంతాల గురించిన వివరాలేవీ బాగా తెలియవని తెలిసిపోతున్నది. ఆ రాకాసిలోయకు వెళ్ళి తిరిగి వచ్చిన వాడెవడూ లేడని వాళ్ళే చెపుతున్నారు గనక, ఆ సొరంగం అదీ అంతా పుక్కిటి పురాణం ఎందుక్కాగూడదు ?" అన్నాడు జయమల్లు.
“అలా అయితే, మనం ఏ విధంగా అయినా గణాచారి అనుచరుల కనుగప్పి, వాళ్ళున్న కొండ ప్రాంతం చేరాలని నీ అభిప్రాయం. అంతేనా, మల్లూ?” అని అడిగాడు కేశవుడు.
జయమల్లు అవునన్నట్టు తలవూపి, "మనం చీకటిపడ్డ తరువాత బయలుదేరటం మంచిది. ఈ లోపల యిక్కడే కాలక్షేపం చేద్దాం. ఇక్కడ శత్రుభయం ఉండదని నా నమ్మకం. ఆకలిగా వున్నది. ఏదీ, మనం వెంట తెచ్చుకున్న ఆహారం బయిటికి తీయండి," అన్నాడు.
కోయగోమాంగ్ పెద్ద పెద్ద టేకు చెట్టు ఆకులలో కట్టివున్న ఆహారాన్ని కట్లు విప్పి జయమల్లూ, కేశవుడి ముందు పెట్టాడు. ఆ తరవాత ముగ్గురూ తృప్తిగా భుజించి సూర్యాస్తమయం అయ్యేవరకూ అక్కడే కాలం గడిపారు.
సూర్యాస్తమానం అయిన కొద్ది సేపటికి చంద్రోదయ మయింది. కేశవుడూ అతడి మిత్రబృందం కొండ ఎక్కేందుకు ప్రయాణమయ్యారు. జయమల్లు తన అనుచరులకేసి తిరిగి, “ఈ వెన్నెల మనకూ, గణాచారి ముఠా వాళ్ళకు కూడా అనుకూలమైనదే. మనం ఈ ప్రాంతాలకు కొత్త గనక, దారి మార్గం వెతుక్కోవటానికి ఉపయోగంగా వుంటుంది. శత్రువులకు కూడా మన చర్యలు గుర్తించటం తేలిక, కనక, సాధ్యమైనంత వరకూ చెట్ల చాటున - చీకటిలో నడవండి," అన్నాడు.
ముగ్గురూ ఆ విధంగా చీకటి మాటున నడుస్తూ, కొండ ప్రాంతంకేసి కొంతదూరం నడిచే సరికి, ఎదురుగా ఒక చెట్టు కింద నల్లని ఆకారం ఒకటి కదిలిన సవ్వడి వినిపించింది.
ఆ వెంటనే ముగ్గురూ అక్కడ గుబురుగా వున్న పొదలచాటున నక్కి కూచుని, ఆ ఆకారం కేసి పరీక్షగా చూశారు.
“ఒక్కడే ఒక్కడు ! కొండ మీదికి వెళ్ళే మార్గాన్ని కాపలాకాచే గణాచారి అనుచరుడై వుంటాడు,” అన్నాడు కోయగోమాంగ్.
“అందుకు సందేహం ఏమీ లేదు. కాని, వీడు యిక్కడ వుండగా మనం ముందుకు వెళ్ళటం అసంభవం. వీణ్ణి ఏదో విధంగా యిక్కడ కాళ్ళూ చేతులు కట్టి పడవెయ్యాలి.” అన్నాడు కేశవుడు.
“అదేపాటి కష్టమయిన పని ! నేను ఆ పక్కన వున్న పొదల్లోకి వెళ్లి కొంచెం అలికిడి చేస్తాను. అదేమిటో చూసేందుకు వాడు బయలుదేరతాడు. మీరు వెనకనుంచి వాణ్ణి పట్టుకుని, అరవకుండా నోరు మూసి, కాళ్ళూ చేతులూ బిగించండి," అంటూ కోయగోమాంగ్ వున్న చోటు నుంచి కదిలి, పిల్లిలా నక్కినక్కి నడుస్తూ పొదల చాటుకు వెళ్ళాడు.
కొద్ది సేపట్లో గోమాంగ్ వెళ్ళిన పొదల వెనక నుంచి చిన్న చిన్న ధ్వనులు బయలుదేరినై. ఆ వెంటనే గణాచారి అనుచరుడు ఈటెను పైకెత్తి పొదలకేసి నడుస్తూ, “ఏయ్, ఎవరక్కడ? బయిటికి రండి !" అంటూ పెద్దగా కేక పెట్టాడు.
వాడా విధంగా పొదలను సమీపించే లోపల కేశవుడూ, జయమల్లూ నీడల్లా నిశ్శబ్దంగా కదిలి, హఠాత్తుగా వెనక నుంచి వాడి మీద పడ్డారు. కేశవుడు కాపలావాడి చేతులు రెండూ వెనక్కు విరిచి పట్టుకుని, కాళ్ళను తన కాళ్లతో మెలివేశాడు. జయమల్లు వాడి నోటిని తన చేత్తో గట్టిగా మూసి, మెడను వెనక్కు వంచాడు. కాని, ఈ లోపల గణాచారి అనుచరుడు కీచుమంటూ పెద్దగా ఒక కేకపెట్టాడు. ఆ వెంటనే కొండ మీది నుంచి అరుపులు వినబడినై.
"ఇక వీణ్ణి ఆలశ్యం కాకుండా కాళ్ళూ చేతులు కట్టి, నోట్లో ఆకలములు కుక్కండి. వీడు పెట్టినకేక, కొండ మీదవున్న వీడి మిత్రులు వినటం ఒకవిధంగా మనకు ఉపయోగ పడవచ్చు,” అన్నాడు జయమల్లు.
క్షణాల మీద జయమల్లు వాళ్ళు తమ పని ముగించుకుని కొండ కేసి చూసేసరికి, అటువేపు నుంచి నలుగురైదుగురు గణాచారి ముఠా వాళ్ళు పరిగెత్తుకు రావటం కనిపించింది.
“ఆ కొండ మీద కాపలావున్న వాళ్ళంతా తమ అనుచరుడి రక్షణకు యిటు పరిగెత్తు కొస్తున్నారు. మనం ఏ ఆటంకం లేకుండా కొండ మీదికి చేరవచ్చు. పరిగెత్తండి!" అంటూ కేశవుడు కొండ కేసి దౌడు తీశాడు.
కేశవుడు ఊహించినట్టు కొండ శిఖరం మీద శత్రువు లెవరూ లేరు. అతడు శిఖరం మీది నుంచి ఆవలి వైపుకు చూసి నిశ్చేష్టుడయాడు. అతడికి అక్కడ వెడల్పయిన లోయా, వింత వృక్షాలూ, వాటి మీద పిశాచాల్లా రెక్కలు చాచుకు నిలబడి వున్న గండ భేరుండాలూ కనిపించినై, “ఇదే, రాకాసిలోయ !" అన్నాడు కేశవుడు ఎంతో ఉత్సాహంగా.
"సందేహం లేదు. కాని, యీ శిఖరం మీది నుంచి లోయలోకి ప్రవేశించటం ఎట్లా ? నిట్టనిలువుగా వున్న యీ రాళ్ళమీద ఎక్కడా కాస్త కాలు మోపేందుక్కూడా ఆస్కారం లేదే !" అన్నాడు జయమల్లు నిరాశగా.
“ఇదుగో, యిక్కడేవో అడవి లతల తీగలు వున్నవి. వీటి సాయంతో మనం లోయలోకి దిగవచ్చు,” అన్నాడు కోయగోమాంగ్ ఉత్సాహంగా, ఆ తీగలు తమ బరువును మోసేంత బలంగా వున్నవో లేవో పరీక్షించేందుకు జయమల్లూ, కేశవుడూ వంగి వాటిని పట్టి చూస్తున్నంతలో, వెనక నుంచి పెద్ద రణగొణ ధ్వని వినబడింది.
“చూడండి, ఆ దుర్మార్గులు యిక్కడే వున్నారు. చుట్టుముట్టి ఈటెలతో పొడవండి!" అంటూ ఒకడు పెద్దగా అరిచాడు. ఆ వెంటనే అయి దారుగురు గణాచారి ముఠా వాళ్ళు పెడ బొబ్బలు పెడుతూ శిఖరం పైకి రాసాగారు.
"ఈ అడవి తీగలు పట్టుకుని లోయలోకి దిగటం తప్ప మనకు మార్గాంతరం లేదు. ఊఁ రండి !" అంటూ జయమల్లు బలమైన తీగ నొకదాన్ని పట్టుకుని శిఖరం మీది నుంచి లోయలోకి దిగసాగాడు. కేశవుడూ, గోమాంగ్ అతణ్ణి అనుసరించారు.
“ఆ తీగ ఎక్కడున్నదో చూసి, రాళ్ళతో దాన్ని నుజ్జునుజ్జు చేయండి ! ఆ ముగ్గురు దుర్మార్గులూ కింది లోయలో రాళ్ళమీద పడి పచ్చడి అయిపోతారు," అని గణాచారి ముఠా వాడొకడు కేక పెట్టాడు. ఆ వెంటనే వాడి అనుచరులు రాళ్ళు తీసుకుని తీగను నరకసాగారు.
ఇంకా వుంది...
Post a Comment