రాకాసిలోయ (చందమామ)_31 RakasiLoya Janapada Novel by Dasari Subramanyam (CHANDAMAMA)

 RakasiLoya 1-35 Janapada Novel by Dasari Subramanyam (CHANDAMAMA)

రాకాసిలోయ (చందమామ)_31

 _దాసరి సుబ్రహ్మణ్యం

రాకాసిలోయ_31

    కేశవుడి అనుచరులను రక్షించ వచ్చిన యిద్దరు అడవి మనుషులూ, తమ నాయకులు పెట్టే కేకలు విని ఎంతో ధైర్యం తెచ్చుకున్నారు. ఒకటి రెండు నిమిషాల కాలం రెక్కల మనుషుల చేతికి చిక్కకుండా పోరాడగలిగితే, ఆ తరువాత తమ జాతి వాళ్ళ సాయం వస్తుందని వాళ్ళకు నమ్మకం కలిగింది. కేశవుడూ, జయమల్లు కూడా పరిస్థితి గ్రహించి, ఎక్కడలేని ధైర్యం తెచ్చుకున్నారు. వాళ్ళు కోయగోమాంగ్ ను ఉత్సాహపరుస్తూ, రెక్కల మనుషులను మొసళ్ళ మడుగులోకి నెట్టసాగారు. ఇంతలో గోమాంగ్ కింద పడివున్న ఈటె నొకదాన్ని చేతికి తీసుకుని, దానితో రెక్కల మనుషుల్ని పొడుస్తూ, “కేశవా, యిక మనకు ప్రమాదం లేదు. ఆయుధం దొరికింది. మీరు కూడా ఈ దుర్మార్గులతో కుస్తీపట్లు మాని ఆయుధాలు తీసుకోండి,” అని అరిచాడు.


    గోమాంగ్ చేత ఈటె దెబ్బలు తిన్న రెక్కల మనుషులు కీచుమని అరుస్తూ మొసళ్ళ మడుగులో పడసాగారు. అది చూస్తూనే మిగిలిన వాళ్ళు అక్కడి నుంచి కాలిబలం కొద్దీ పరిగెత్తుతూ, “పులుగురాయా! ప్రమాదం, గుహావాసులు వందల వేలసంఖ్యలో మన మీది కొస్తున్నారు." అని కేకలు పెట్టారు. ఆ హెచ్చరిక వింటూనే ఎక్కడెక్కడ వున్న రెక్కల మనుషులూ ఆ ప్రాంతం వదిలి అడవికేసి బయలుదేరారు. తన అనుచరులను ప్రోత్సహించి, అడవి మనుషులతో యుద్ధానికి పూనుకోవటం సాధ్యం కాదని పులుగురాయుడు గ్రహించాడు. కాని, ఒకసారి అడవి మనుషులకు వెన్నుచూపితే, ఆ తరువాత వాళ్ళు తనను, పిరికిపంద కింద జమకట్టే ప్రమాదం వున్నది. ఇప్పుడేమి చేయటం?


    పులుగురాయుడి తటపటాయింపు గ్రహించిన బ్రహ్మదండి మాంత్రికుడు మంత్రదండాన్ని పైకెత్తి, “జై కాలభైరవా !” అంటూ పెద్దగా ఒక కేక పెట్టి, “పులుగు ప్రభో ! యిది మనకు కష్టకాలం. గ్రహాలు వికటించినై. కాలభైరవుడు ఎందుకనో ఆగ్రహించాడు. ప్రస్తుతానికి మనం చేయగలిగిందేమీ లేదు. ఆ గుహావాసులూ, జయమల్లు ముఠా వచ్చి మన మీద పడకముందే, అడవిలోకి తిరోగమిద్దాం." అన్నాడు.


    "మాంత్రికా, అదే నేనూ అనుకుంటున్నాను. మా గరుడజాతి వాళ్ళకు రాత్రిళ్ళు బొత్తిగా కళ్ళు కనిపించవు. సూర్యోదయం కానివ్వండి, మా ధాటి చూపెడతాం," అంటూ పులుగురాయుడు బయలుదేరాడు. అంతలో జిత, శక్తివర్మలు అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చారు. వాళ్ళ చేతుల్లో వున్న కత్తులు సగం విరిగి వున్నాయి. వాళ్ళ దేహాలు రక్తంతో తడిసి వున్నాయి.


    జిత, శక్తి వర్మలను చూస్తూనే బ్రహ్మదండికి ప్రాణం లేచి వచ్చినట్టయింది. అతడు వాళ్ళను సమీపించి, “జితా, శక్తి ! మీరు యింకా బతికే వున్నారా ? ఆ దుర్మార్గులు మీ యిద్దర్నీ హత్య చేశారనుకున్నాను," అన్నాడు.


    “వాళ్ళా.....మమ్మల్నా.....హత్యా !" అంటూ జితవర్మ పెద్దగా నవ్వి, “మా మొండి కత్తులు చూడు, నెత్తురులో స్నానమాడిన మా శరీరాలు చూడు ! ఎంత మంది శత్రువుల్ని చంపామో మాకే తెలీదు. కత్తులు విరిగిపోవటంతో వెనుదిరిగి యిటు పురోగమించి రావలసివచ్చింది,” అన్నాడు.


    జితవర్మ మాటలకు స్థూలకాయుడు విరగబడి నవ్వుతూ, “మీ యిద్దర్లో ఏ ఒకడూ శత్రువులను చూశామని చెప్పినా నేను నమ్మను. ఇంతసేపూ ఏ చెట్టుకొమ్మల్లోనో దాక్కుని వుంటారు !” అన్నాడు.


    స్థూలకాయుడి మీదికి జిత, శక్తివర్మలు తమ మొండికత్తుల్ని ఎత్తేంతలో, పులుగు రాయుడు వాళ్ళను కసురుతూ, “ఛీ, యిక వూరుకోండి, మీ నుంచే నా రాజ్యానికి యింత ప్రమాదం వచ్చింది. మీ కాపలాలో వున్న ఆ దుర్మార్గులు ఎలా తప్పించుకు పోగలిగారు? ఆ సంగతేదో యిక్కడే తేలాలి. మిమ్మల్ని రాకాసి పక్షిమాతకు బలిచేస్తాను,” అంటూ ఈటెను వాళ్ళ మీదికి ఎత్తాడు.


    అంతలో గుహవాసులు అటుకేసి వస్తున్న సూచనగా కేకలు వినబడినై, బ్రహ్మదండి మాంత్రికుడు, పులుగురాయుడి చేయి పట్టుకుని, “పులుగుదేవా! మీరు శాంతించండి. ఆ అడవి మనుషుల దండు యిటే వస్తున్నది, ముందు మనం యిక్కణ్ణించి పారిపోకపోతే ప్రమాదం," అన్నాడు.


    బ్రహ్మదండి మాట ముగించే లోపలే పులుగురాయుడు అడవికేసి పరుగులంకించు కున్నాడు. స్థూలకాయుడూ, బ్రహ్మదండి మాంత్రికుడూ, జిత, శక్తివర్మలు కూడా అతడి వెనక పరిగెత్తారు. జితవర్మ, శక్తివర్మతో, “శక్తి, చూశావా ? మనం శత్రువులను చీల్చి చండాడేందుగ్గాను కనబరిచిన శూరవీరత్వం, సాహసధైర్యాలూ ఎందుక్కొరగాకుండా పోయినై. ఆ పిట్టతల వెధవా, బ్రహ్మదండీ కూడా మన దర్పబలశౌర్యాలను శంకిస్తున్నారు." అన్నాడు.


    “వాళ్ళిద్దరే శంకించటమేం! ఈ మాంసం పోగు కూడా మనను అపహాస్యం పట్టిస్తున్నాడు. ఇప్పుడు మన కత్తులు మొండివయి పోయినై. మంచి కత్తులు సంపాయించగానే ఈ అందర్నీ కట్టకట్టి నిలవునా నరికేద్దాం," అన్నాడు శక్తివర్మ.


    అంతలో వాళ్ళకు “బిడాలికీ జై !" అన్న కేకలూ, రివ్వురివ్వు మంటూ మీదికి వచ్చిపడే ఈ టెలూ ప్రత్యక్షమయినై. “మరి కొంచెం వేగంగా పరిగెత్తండి. శత్రువులు మనను చూసినట్టుంది. జితా, శక్తి! మీ చచ్చు సంభాషణ కట్టిపెట్టి, నోళ్ళు మూయండి!" అంటూ బ్రహ్మదండి మాంత్రికుడు లేడిలా ఛంగున ముందు కురికాడు.


    కేశవుడు తన అనుచరులనూ, బిడాలీ, శ్వానకర్ణి ముఠా వాళ్ళనూ వెంట పెట్టుకుని వచ్చి, పులుగురాయుడు నివశించే గుడారాల ప్రాంతాన్ని చుట్టుముట్టే సరికి, అక్కడ వారికి రెక్కల మనుషులెవరూ కనిపించ లేదు. ఆ దుర్మార్గులు ప్రమాదం శంకించి అడవి కేసి పారిపోయి వుంటారని కేశవుడూ, జయమల్లూ నిశ్చయించుకున్నారు. కాని, చీకటిలో వాళ్ళను వెంబడించి చుట్టుముట్టటం సాధ్యమయ్యేది కాదు. ఆ కారణం వల్ల కేశవుడు గుహావాసులను చిన్నచిన్న ముఠాలుగా అడవి ప్రాంతానికి వెళ్ళి, కనబడిన రెక్కల మనుషులను హతమార్చమన్నాడు. అలా బయలుదేరిన ఒక మఠా చేతిలో పడవలసిన బ్రహ్మదండీ, పులుగురాయుడూ అదృష్టవశాన తప్పుకుని అడవిలోకి పారిపోగలిగారు.


    రాత్రి గడిచి సూర్యోదం అయ్యేవరకూ కేశవుడూ అతడి అనుచరులు కాలుతున్న పులుగురాయుడి గుడారాల ప్రాంతాలనే కాలం గడిపారు. రెక్కల మనుషులు చెట్ల మీది నుంచి కిందికి దూకేందుకు ఉపయోగించే పక్షిరెక్కలు వాళ్ళకు ఒకచోట గుట్టలు గుట్టలుగా కనిపించినై, వాటిని చూడగానే బిడాలికీ, శ్వానకర్ణికీ యింతకాలంగా వాళ్ళు చేసిన మోసం తెలిసిపోయింది.


    “నిజంగా వాళ్ళు రెక్కలున్న మనుషులని మేం నమ్మాం. వాళ్ళు పక్షుల్లా ఆకాశంలోకి ఎగరగలరని కూడా మేం భావించాం. అంతా మోసం !” అన్నాడు బిడాలి.


    "ఆ మోసమేదో యిప్పుడు తెలిసిపోయింది. ఇక ఆ నీచుల్ని అడవిబాతుల్ని వేటాడినట్టు వేటాడతాం. వాళ్ళు వఠ్ఠి పిరికిపందలు కూడా. వాళ్ళ ధైర్యం ఏపాటిదో కూడా యింతకు ముందు తేలిపోయింది,” అన్నాడు శ్వానకర్ణి.


    గుహావాసుల నాయకులిద్దరికీ కలిగిన ఆత్మవిశ్వాసం చూసి, కేశవుడూ, జయమల్లూ చాలా సంతోషించారు. సూర్యోదయమై నాలుగు బారల పొద్దెక్కగానే, కేశవుడూ, జయమల్లూ, కోయగోమాంగ్ ల గౌరవార్థం; బిడాలీ, శ్వానకర్ణ గొప్ప విందు ఏర్పాటు చేశారు.


    ఆ విందు జరిగేటప్పుడు ఆటలూ పాటలూ సాగినై, యువకులైన గుహావాసులు మల్ల యుద్ధాలూ, ఈటెలతో రకరకాల వ్యాయామాలూ చేశారు.


    విందు మధ్య జయమల్లు బిడాలికీ, శ్వానకర్ణికీ ఒక సలహా యిచ్చాడు. రెక్కల మనుషుల ప్రమాదం యిక లేదు గనక, వాళ్ళిద్దర్నీ తమ తమ ముఠాలతో కొండ గుహలు వదిలి వచ్చి, సమతలంగా వున్న ఆ ప్రాంతాల విశాలమైన గృహాలు నిర్మించుకో మన్నాడు.


    ఈ సలహాకు శ్వానకర్ణి అనంగీకార సూచకంగా తల వూపి, “మేము మా తాత ముత్తాతలకు పూర్వం నుంచి కూడా గుహల్లోనే కాలం గడుపుతున్నాం. ఇప్పుడు ఆ ఆచారం వదిలి, ఈ చెట్ల కింద ఎలా నివశించటం?” అన్నాడు. బిడాలి కూడా అదే అభిప్రాయం వెలిబుచ్చాడు.


    జయమల్లు చిరునవ్వు నవ్వి, “అయితే, ఒక పని చెయ్యండి. ఒకేసారి అందరూ గుహలు వదిలి రాకుండా, మీలో కనీసం యువతరం వాళ్ళనైనా యిక్కడ నివశించేలా చేయండి. గుహల్లో వుండటంకన్నా, యిక్కడ వెలుగూ, గాలీ వున్న ప్రాంతాల నివశించటం ఆరోగ్యకరం అని తేలితే, మిగతా వాళ్ళు కూడా ఆ తరవాత యిక్కడికి రావచ్చు. ఏది ఏమైనా, ఆ రెక్కల మనుషుల్ని మాత్రం తిరిగి యిక్కడికి వచ్చి గుడారాలు కట్టకుండా చూడండి. ఈ ప్రాంతం మంచినీటి సమృద్ధి, ఆహార సమృద్ధి కలది," అన్నాడు.


    “ఆ రెక్కల మనుషుల్ని గురించిన భయం మా కేమీ లేదు. మీ సహాయం వల్ల నేను మా మూల పురుషుడి మహత్తర శక్తులు గల గద సంపాయించుకున్నాను. బిడాలికీ నాకూ మధ్య యిప్పుడు శత్రుత్వమేమీ లేదు. మేము మిత్రులం. మా రెండు ముఠాలకూ మీరు చేసిన మేలు మరువరానిది. మా నుంచి మీ కెలాంటి సహాయం కావాలో అడగండి. ఎంత కష్టసాధ్యమైన దైనా చేయగలం," అన్నాడు శ్వానకర్ణి. శ్వానకర్ణి మాటలకు అంగీకార సూచకంగా బిడాలి తల వూపాడు.


    జయమల్లు తన అనుచరు లిద్దరి కేసి ఓమారు చూసి, తరువాత బిడాలీ, శ్వాస కర్ణులతో, “మీరు, కోరితే మాకెలాంటి సహాయమైనా చేస్తారని మాకు తెలుసు. మేము రాకాసిలోయకు వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చిన వారెవరైనా మీలో వుంటే చెప్పండి," అన్నాడు.


    జయమల్లు యిలా అనగానే బిడాలీ, శ్వానకర్ణులు ముఖముఖాలు చూసుకున్నారు. ఇద్దరి ముఖాల్లో ఆశ్చర్యం, భయం తాండవించింది. శ్వానకర్ణి గొంతు ఓమారు సవరించుకుని చిన్నగొంతుతో, “ఆ రాకాసి లోయకు వెళ్ళి వచ్చిన వాళ్ళెవరూ, మా తరం వాళ్ళలో బతికి లేరు. కాని, దాన్ని గురించి విన్నాం. అది ఈ అరణ్యాల కవతల గల కొండల్లో ఒక గొప్ప లోయ. అక్కడికి చేరటం చాలా కష్టం; తిరిగి రాగలగటం అంతకన్నా కష్టం. ఇంతకూ అక్కడి కెళ్ళవలసిన పని మీకేం కలిగింది ?" అని ప్రశ్నించాడు.


    “బిడాలీ! నీ మాటలను పట్టి చూస్తుంటే, నీకు ఆ ప్రాంతాలకు వెళ్ళే దారి తెలుసునన్నట్టు కనబడుతున్నది. ఆ మార్గం ఏదో చూపించు, చాలు. ఆ లోయలో పెరిగే ఒక గొప్ప ఓషధి మాకు కావాలి. బ్రహ్మపుర రాజుకు నయంకాని వ్యాధి ఒకటి పుట్టింది. ఆ ఓషధితో ఆయన వ్యాధి కుదరగలదని రాజవైద్యులు మమ్మల్ని పంపారు," అన్నాడు జయమల్లు.


    “బిడాలి చెప్పినట్టు, ఆ లోయకు వెళ్ళటం, తిరిగిరావటం కూడా అసంభవం, ఆలోచించుకోండి,” అన్నాడు శ్వానకర్ణి.


    “అవన్నీ ఆలోచించకుండానే, యింతదూరం వచ్చామనుకున్నావా, శ్వానకర్ణీ? మేం ఎలాంటి ప్రమాదాలనైనా ఎదుర్కోటానికి సిద్ధంగానే వున్నాం. దారేదో మాకు చూపండి. పోతే, మీరు మాకు చేయవలసిన మరొక సహాయం; ఆ పులుగురాయుడి వెంట, బ్రహ్మదండి అనే మాంత్రికుడొకడున్నాడు. వాడు మీకు దొరికితే ప్రాణాలతో మేం తిరిగివచ్చిన దాకా బందీగా వుంచినా సరే, లేక చంపినా సరే, మా అభ్యంతరం ఏమీ లేదు,” అన్నాడు జయమల్లు.


    “ఓఁ ఆ సంగతి గుర్తు పెట్టుకుంటాం. మీకు రాకాసిలోయకు దారి చూపటమే కాదు, మీ వెంట నేనూ బిడాలీ కూడా వస్తాం. ఏమంటావ్ బిడాలీ ?” అని అడిగాడు శ్వానకర్ణి.


    బిడాలి ఎక్కడలేని ఉత్సాహం కనబరుస్తూ, “నేను పెద్దవాణ్ణయి పోయాను, నా ముఠాకు నాయకుడుగా తగిన యువకుణ్ణొకణ్ణి చూసి నియమించి, మీ వెంట రాగలను," అన్నాడు.


    దీనికి కేశవుడూ, జయమల్లూ అభ్యంతరం చెప్పారు. తరువాత కొంత చర్చ జరిగిన మీదట, సూర్యాస్తమయానికి ఓ గంట ముందుగా, కేశవుణ్ణి, జయమల్లునూ, కోయ గోమాంగ్ నూ అక్కడ వున్న ఎత్తయిన పర్వత శిఖరాల మీది నుంచి, బలమైన ఊడలసాయంతో బిడాలీ, శ్వానకర్ణి ముఠావాళ్ళు లోయలోకి దించారు.


    ఆ లోయలో వున్న ఒకానొక సొరంగ మార్గం వెంటపోతే, అది రాకాసి లోయకు దారి తీయగలదని వాళ్ళు చెప్పారు.


    ఊడల సాయంతో కొండశిఖరం మీది నుంచి లోయలోకి దిగిన కేశవుడూ అతడి అనుచరులకు దూరంగా డప్పుమోత వినబడింది. వాళ్ళు అటుకేసి చూశారు. గణాచారిలా జుట్టు వరబోసుకుని వున్న ఒకడు, చిందులు వేస్తూ కేకలు పెడుతున్నాడు. అతడి చేతిలో భయంకర రూపంగల ఒక పక్షి వున్నది. 

ఇంకా వుంది...

Post a Comment

Previous Post Next Post