రాకాసిలోయ (చందమామ)_30 RakasiLoya Janapada Novel by Dasari Subramanyam (CHANDAMAMA)

RakasiLoya 1-35 Janapada Novel by Dasari Subramanyam (CHANDAMAMA)

రాకాసిలోయ (చందమామ)_30

 _దాసరి సుబ్రహ్మణ్యం

రాకాసిలోయ_30

    శక్తివర్మ కత్తి దూసి ముందుకు వెళ్ళటం చూస్తూనే జితవర్మ కూడా కత్తి తీసుకుని అడవి మనుషుల దారిని అడ్డగించాడు. కాని, అడవి మనుషు లిద్దరూ వాళ్ళను తమ చేతులతోనే పక్కకు నెట్టుతూ, “పెద్దగా గోల చేయకండి. పులుగురాయుడు ఈ ముగ్గురు దుర్మార్గుల్నీ రహస్యంగా తన వద్దకు తీసుకు రమ్మన్నాడు. ఈ సంగతి పక్క గుడారంలో వున్న బ్రహ్మదండి మాంత్రికుడికీ, స్థూలకాయుడికీ తెలియకూడదు," అన్నారు.


    ఆ మాటలతో జిత, శక్తివర్మలు ముఖ ముఖాలు చూసుకున్నారు. వాళ్ళిద్దరికీ అడవి మనుషుల ప్రవర్తన ఆశ్చర్యం కలిగించింది. శక్తివర్మ కత్తి వరలో పెట్టబోయిన వాడల్లా ఆగి, చిన్న గొంతుతో, “పులుగురాయుడు ఈ ముగ్గురు హంతకుల్నీ తన దగిరికి తీసుకు రమ్మని మిమ్మల్ని పంపితే, తీసుకుపోండి, మా అభ్యంతరం ఏమీలేదు. కాని, మీ ముఖ కవళికలు చూస్తూంటే, మీరు రెక్కల మనుషుల జాతి వాళ్ళలా లేరు. దానికేమంటారు?" అన్నాడు.


    శక్తివర్మ యిలా అనగానే అడవి మనుషుల్లో ఒకడు నవ్వి, “ఒక పని కలిగి, మేం కావాలనే అడవి మనుషుల తలలు తగిలించుకున్నాం. ఛీ, దారి తొలగండి ! మీ యిద్దరూ పరమ శుంఠల్లా వున్నారు," అన్నాడు ముందుకు పోబోతూ.


    జితవర్మ తోక తొక్కిన పాములా ఎగిరి పడి, కత్తితో అడవి మనిషి మీదికి దూకబోయాడు. అంతలో కేశవుడు అతడి కాళ్ళు రెండూ పట్టుకుని వెననక్కు గుంజటంతో ముందుకు బోర్లా పడిపోయాడు. మరుక్షణంలో కోయగోమాంగ్, శక్తివర్మను పట్టుకుని ముందుకు పడదోశాడు.


    జయమల్లు ఒక తాడుతో వాళ్ళిద్దర్నీ సమీపంచి, “కిక్కురుమన్నారో, మీ యిద్దరి ప్రాణాలూ నిలువునా తీసేస్తాం. చచ్చినట్టు పడివుండండి,” అంటూ హెచ్చరించి, తాడుతో యిద్దరి చేతులూ కాళ్ళూ కలియకట్టాడు. అంతలో పక్కన వున్న గుడారంలో నుంచి బ్రహ్మదండి మాంత్రికుడి గొంతు వినబడింది.


    “ఇక్కడ జరిగిన గొడవేదో బ్రహ్మదండి పసికట్టినట్టుంది. ఇక మనం పారిపోవటమే క్షేమం." అంటూ జయమల్లు గుడారంలో కనిపించిన ఆయుధాలు తీసుకున్నాడు.


    ఆ సరికి బ్రహ్మదండీ, స్థూలకాయుడూ కూడా పెద్దగా గావుకేకలు ప్రారంభించారు: “ఆ దుర్మార్గులు ముగ్గురూ జిత, శక్తి వర్మలను చంపి పారిపోచూస్తున్నారు. ఓ పులుగురాయా! రండి, గుడారాన్ని చుట్టుముట్టండి."


    ఆ కేకలు వింటూనే జయమల్లు గుడారం ద్వారం దగ్గర ఆగి, అడవి మనుషులతో, “మీ యిద్దరూ లోపలికి రావటం చూస్తూనే మీ రెవరైందీ పోల్చుకున్నాం. లోగడ మిమ్మల్ని బిడాలి, శ్వానకర్ణి వెంట చూశాం. మీ ముఠాల వాళ్ళు పెద్ద బటగంతో యిక్కడికి దాడి వస్తున్నారా ?" అని అడిగాడు.


    “అలాంటిదేమీ లేదు. మీ రెలా వున్నారో చూసి రమ్మని మా నాయకులు మమ్మల్ని పంపారు.” అన్నాడొక అడవి మనిషి.


    కేశవుడు గుడారం నుంచి బయటికి వెళ్ళి, బ్రహ్మదండి మాంత్రికుడున్న చోటు కేసి ఓమారు చూసి, జయమల్లుతో ఏదో చెప్పబోయేంతలో, స్థూలకాయుడు కొరడా ఝళిపిస్తూ అటుకేసి రాసాగాడు. అది గమనిస్తూనే కోయగోమాంగ్ కత్తి దూసి అతడి మీదికి ఉరకబోయేసరికి, వాడు పెద్దగా బొబ్బలు పెడుతూ వెనుదిరిగి, “ఆ క్రూరులు ముగ్గురికీ తోడుగా మరిద్దరు రెక్కల మనుషులు చేరారు. పులుగురాయుడి ముఠాలోనే ముసలం పుట్టింది. స్వామి ద్రోహం, పులుగురాయా, స్వామి ద్రోహం!" అంటూ పరిగెత్తాడు.


    జయమల్లు చుట్టూ ఓమారు కలయ చూశాడు. ప్రతి గుడారం ముందూ రెక్కల మనుషులు గుంపులుగా చేరుతున్నారు. కొందరు, "మోసం, స్వామి ద్రోహం!" అంటూ అటూ యిటూ పరిగెత్తుతూ, ఎదురైన వాళ్ళకు ఏమో చెపుతున్నారు.


    "కేశవా, గోమాంగ్! మనం పారిపోయేందుకు ఒకే ఒక ఉపాయం నాకు తోస్తున్నది. ఈ సరికే మన శత్రువులందరికీ, మనం గుడారంలో నుంచి తప్పించుకు బయట పడినట్టు తెలిసిపోయింది. వాళ్ళు క్షణాల మీద మనను పట్టుకునేందుకు యిక్కడికి వస్తారు. మనం ఎక్కడ వున్నదీ, ఎటు పారిపోతున్నదీ వాళ్ళకు తెలియకుండా తికమక పెట్టేందుకు ఒకటి చేద్దాం. ఆ వెలుగుతున్న కాగడాలు తీసుకుని, సాధ్యమైనన్ని గుడారాలకు నిప్పు పెడదాం. అప్పుడు బయలుదేరే గందరగోళంలో మనం పారిపోవచ్చు,” అన్నాడు జయమల్లు.


    జయమల్లు మాట ముగించే లోపలే కేశవుడూ, గోమాంగ్, అడవి మనుషులిద్దరూ భగభగ మండే కాగడాలు తీసుకుని, “మోసం, స్వామి ద్రోహం!" అని అరుస్తూ, అందు బాటులో వున్న గుడారాలన్నిటికీ నిప్పు పెట్టారు. క్షణాల మీద అవి అంటుకుని భుగభుగ మంటూ మంటలు లేచినై.


    బ్రహ్మదండి మాంత్రికుడూ, స్థూలకాయుడూ ఆ మంటలు చూస్తూనే ఠారెత్తి పోయారు. బ్రహ్మదండి మంత్రదండాన్ని పైకెత్తి, “హాఁ కాలభైరవా ! నాకు అగ్ని స్నానం రాసి పెట్టావా ? నీ భక్తుణ్ణి పరీక్షిస్తున్నావా ?” అంటూ మంటలను తప్పుకుని పరిగెత్తుతూ, స్థూలకాయుడితో, “వీర కంఠీరవా ! నీ ప్రతాపం చూపటానికి యిదే అదను. ఆ దుర్మార్గులు ఎటు పారి పోతున్నారో కనిపెట్టి వుండు. నేను ఆ పిట్టతల వెధవను నిద్ర లేపుతాను," అని చెప్పి, పులుగురాయుడు వుండే గుడారానికేసి దౌడు తీశాడు.


    బ్రహ్మదండి హడావిడిగా తనకేసి పరిగెత్తి రావటం చూస్తూనే, పులుగు రాయుడు పెద్దగా నవ్వి, “ఏం, మాంత్రికా ! ఒళ్ళూ పై తెలియకుండా డేగలా ఎగిరి వస్తున్నావ్, ఏమిటీ కథ ?” అని అడిగాడు.


    “ఏమిటీ కథ ? ఏం, పులుగు ప్రభో ! మనందరి కేమన్నా మతులు పోయినయ్యా? ఆ దుర్మార్గులు మన గుడారాలకు నిప్పు పెట్టి పారిపోతూంటే, మీరు నవ్వుతూ యిక్కడ కూచున్నారా? పైగా, మీ సహచరుల్లోనే కొందరు స్వామి ద్రోహులై, ఆ దుర్మార్గులతో కలిసిపోయారు,” అన్నాడు బ్రహ్మదండి పెద్దగా రొప్పుతూ, "ఆ స్వామి ద్రోహుల్నీ, ఆ పాపాత్ములు ముగ్గుర్నీ వలవేసి కొంగల్ని పట్టినట్టుగా పట్టి తెచ్చేందుకు నా అనుచరుల్ని ఎప్పుడో పంపాను. నువ్వేమీ హడావిడి పడక సానధానంగా కూచో, నీ అంగరక్షకులు జిత, శక్తివర్మ లెక్కడ? ఆ ఎనుబోతు బానిసల యజమాని ఏమయ్యాడు? వాళ్ళూ ఆ దుర్మార్గులతో కలసి పారిపోయే ప్రయత్నంలో లేరుకదా?" అన్నాడు పులుగు రాయుడు, బ్రహ్మదండి మాంత్రికుడి కేసి గుచ్చి గుచ్చి చూస్తూ, బ్రహ్మదండి ఆ ప్రశ్నతో గతుక్కుమని, “అలాంటిదేమీ జరగదు, పులుగు దొరా ! వాళ్ళూ నీ అనుచరుల వెంట ఆ ద్రోహుల్ని పట్టి తెచ్చేందుకు వెళ్ళివుంటారు." అన్నాడు.


    అంతలో నలుగురైదుగురు రెక్కల మనుషులు అక్కడికి పరగెత్తుకుంటూ వచ్చారు. వాళ్ళను చూస్తూనే, పులుగు రాయుడు, “ఆ ముగ్గురూ దొరికారా? స్వామి ద్రోహం చేసిన దుర్మార్గు లెంత మంది ?” అని ప్రశ్నించాడు.


    రెక్కల మనుషుల్లో ఒకడు తమ నాయకుడికి వంగి వంగి దణ్ణాలు పెట్టి, “పులుగు దొరా ! వాళ్ళు మొత్తం అయిదుగురు. వాళ్ళు మన వాళ్ళల్లో కొందరిని చంపారు. మన చక్రబంధం నుంచి బయటపడి సూటిగా మొసళ్ళ మడుగుకేసి పారిపోతున్నారు," అన్నాడు.


    “అలా అయితే మన పని మరీ తేలికైనట్టే. వాళ్ళు మొసళ్ళ మడుగును చుట్టి పారిపోకుండా దారి అటకాయించండి, మడుగులో దిగి పారిపోయే ప్రయత్నం చేశారో, అందర్నీ మొసళ్ళు భక్షించి వేస్తయ్. ఒడ్డున ఆగితే, మనం వేసిన వలలో చిక్కుకుంటారు. అదీ, మన ఎత్తుగడ! అర్థమైందా? యిక వెళ్ళండి,” అన్నాడు పులుగురాయుడు.


    “ఆ కేశవుణ్ణి మాత్రం మొసళ్ళు తినకుండా చూడాలి, పులుగేంద్రా ! వాడు చచ్చేందుకు వీలులేదు. రాకాసి లోయలోని ధనరాసుల కన్నిటికీ వాడే వారసుడు,” అంటూ బ్రహ్మదండి మాంత్రికుడు గోల ప్రారంభించాడు.


    పులుగురాయుడు ఆ మాట లేవీ విననివాడిలా లేచి నిలబడి, తన అనుచరులతో, “పదండి, వాళ్ళు మొసళ్ళ వాత బడ్డారో, మనవాళ్ళచేత చిక్కారో చూద్దాం,” అంటూ బయలుదేరాడు. బ్రహ్మదండి అతణ్ణి అనుసరించాడు.


    పులుగురాయుడు మొసళ్ళ మడుగు ప్రాంతం చేరేసరికి, ఆ ప్రదేశమంతా అటూ యిటూ పరిగెత్తే వాళ్ళతో, కేకలు పెట్టే వాళ్ళతో పెద్ద గొడవగా వున్నది. అతడు తన అనుచరుల్లో యిద్దరు ముగ్గుర్ని దగ్గరకు పిలిచి, “ఏమయింది ? వాళ్ళు మన వల నుంచి తప్పుకు పారిపోలేదు గదా ?" అని ప్రశ్నించాడు.


    "లేదు దొరా! వాళ్ళను ఉచ్చులో బిగించేందుకు చుట్టూ కమ్ముకుంటూ వచ్చాం. వాళ్ళు మరెటు పోయేందుకూ దారిలేక, మొసళ్ళ మడుగు అంచున వున్న చెట్ల పొదల్లోకి దూరారు. ఇక మనం వాళ్ళను వెతికి, వాటి మధ్య నుంచి కుందేళ్ళను లాగినట్టు బయటికి లాగటమే మిగిలి వుంది," అన్నాడొకడు.


    “భేష్, మహా బావుంది. ఆ పని కాస్తా అయిందని పించండి," అంటూ పులుగు రాయుడు ఎగిరి ఒక చెట్టు మోడు మీద నిలబడ్డాడు. అతడి అనుచరులు కాగడాలతో పొదలన్నీ వెతుకుతూ ముందుకు కదిలారు.


    అదంతా చూస్తున్న బ్రహ్మదండికీ, కేశవుడు దుస్సాహసంతో మొసళ్ళ మడుగులోకి దూకిపారిపోయే ప్రయత్నం చేస్తాడేమో అనిపించింది. ఆ వెంటనే అతడు పెద్దగా గొంతెత్తి, “వత్సా, కేశవా! నీకొచ్చిన ప్రాణ భయం ఏమీ లేదు. నీ వెంట వున్న ఆ ద్రోహుల్ని వదిలి, యిటు వచ్చెయ్యి. దయామయుడైన పులుగు రాజేంద్రుడు నిన్ను తప్పక క్షమిస్తాడు." అని కేక పెట్టాడు.


    బ్రహ్మదండి పెట్టిన కేకకు జవాబుగా అన్ని వైపుల నుంచీ, “బిడాలికీ జై ! శ్వానకర్ణికీ జై !" అన్న భీకరమైన నినాదాలు మార్మోగినై. ఆ వెంటనే పొడవైన ఈటెలు బయ్ఁ మంటూ వచ్చి రెక్కల మనుషుల మీద పడసాగినై.


    పులుగురాయుడు మోడు మీది నుంచి కిందికి దూకుతూ, “ఆ అడవి మనుషులు మన చక్రబంధానికి చుట్టూ చక్రబంధం బిగించారు. లాభం లేదు. పరిగెత్తండి, ఆకాశంలోకి గరుడపక్షుల్లా లేవండి, “అంటూ వెనుదిరిగి కాలి బలం కొద్దీ పరిగెత్తసాగాడు. బ్రహ్మదండి కూడా అతడి వెనక పరిగెత్తుతూ, “జితా, శక్తీ! ఎక్కడ?” అని అరవసాగాడు.


    రెక్కల మనుషుల గుడారాలు నిప్పంటుకుని మండిపోవటం చూసిన బిడాలీ, శ్వానకర్ణీ, యిదే మంచి తరుణం అనుకుని, తమ ముఠావాళ్ళతో వచ్చి రెక్కల మనుషులు పారిపోయే ప్రయత్నం చేయటంతో వాళ్ళకు ఎక్కడలేని ధైర్యం కలిగింది. కాని, వాళ్లకు కేశవుడూ అతడి అనుచరు లెక్కడ వున్నదీ సూచన మాత్రంగానైనా తెలియలేదు. ఆ కారణం వల్ల తాము విసిరే ఈటెలు ఒకవేళ వాళ్ళకు తగిలినా తగలవచ్చన్న అనుమానం శ్వానకర్ణికీ, బిడాలికీ కలిగింది. ఆ వెంటనే వాళ్ళు తమ అనుచరులకు ఈటెలు విసర వద్దని ఆజ్ఞాపించి, గొంతులెత్తి, “కేశవా, జయమల్లూ ! మీ రెక్కడ వున్నారు ?" అంటూ కేకలు వేశారు.


    బిడాలీ, శ్వానకర్ణీ పెట్టిన కేకలు, మొసళ్ళ మడుగు అంచున గల పొదల్లో దాగివున్న కేశవుడి అనుచరులకూ, వారి వెంటవున్న అడవి మనుషులకూ వినబడినై. కాని,వాళ్ళు జవాబిచ్చే లోపలే కొందరురెక్కల మనుషులు అటుగా వచ్చి, వాళ్ళ మీద కలియబడ్డారు.


    కేశవుడూ వాళ్ళకు తమ కత్తులు ఉపయోగించే అవకాశం కలగలేదు. ఒకవైపున మొసళ్ళతో నిండి వున్న మడుగూ, రెండవ వైపున చెట్ల పొదలూ -ఆ పరిస్థితిలో వాళ్ళు అన్నిటికీ తెగించి, రెక్కల మనుషుల మీద ముష్ఠా ముష్ఠ యుద్ధానికి దిగారు.


    ఈ పోరాటంలో బలంగా దెబ్బలు తిన్న వాళ్ళూ, కాళ్ళు జారిన వాళ్ళూ మడుగులో పడసాగారు. కేశవుడూ, గోమాంగ్ కూడా రెండుసార్లు మడుగులో పడి, తిరిగి క్షణాల మీద ఒడ్డు చేరి, రెక్కల మనుషుల్ని అందులోకి నెట్టసాగారు. దూరంగా బిడాలీ, శ్వానకర్ణి పెట్టే కేకలు వాళ్ళకు వినబడుతూనే వున్నవి. 

ఇంకా వుంది...

Post a Comment

Previous Post Next Post