రాకాసిలోయ (చందమామ)_29 RakasiLoya Janapada Novel by Dasari Subramanyam (CHANDAMAMA)

  RakasiLoya 1-35 Janapada Novel by Dasari Subramanyam (CHANDAMAMA)

రాకాసిలోయ (చందమామ)_29

 _దాసరి సుబ్రహ్మణ్యం

రాకాసిలోయ_29

    బ్రహ్మదండి మాంత్రికుడి కేక వింటూనే కేశవుడు, ఆ ధ్వని వచ్చిన వైపుకు తల తిప్పాడు. తనకు అడ్డంగా వున్న రెక్కల మనుషులను పక్కకు తొలగ తోస్తూ, మాంత్రికుడు ముందుకు వచ్చాడు. అతడికి యిరు వైపులా జిత, శక్తివర్మలు కత్తులు దూసి నిలబడి వున్నారు. బ్రహ్మదండిని చూస్తూనే కేశవుడు కళ్ళెర్ర చేసి ముందుకు ఉరక బోయాడు. అంతలో నలుగు రైదుగురు రెక్కల మనుషులు అతడి మీద పడి ఆయుధాలన్నీ లాగి వేశారు. ఆ తరువాత జయమల్లూ, కోయగోమాంగ్ కూడా నిరాయుధులుగా చేయబడ్డారు.


    నిస్సహాయంగా నిలబడి వున్న ఆ ముగ్గురికేసీ చూసి, జిత, శక్తివర్మలు వికటంగా ఒక పెద్ద నవ్వు నవ్వి, కత్తులు పై కెత్తుతూ, “ఆహాఁ, కత్తుల్ని యింతకు ముందే బాగా సాన పట్టి వుంచటం మంచిదయింది. ఒక్క వేటుతో రెండు తుండేలు చేయగలం !" అంటూ ముందుకు రాబోయారు. కాని, అంతలో స్థూలకాయుడు తన కొరడాను పైకెత్తి పెద్దగా రంకె పెట్టి, వాళ్ళ కత్తుల్ని కొరడాతో చుట్ట బెడుతూ, “ఏయ్ఁ, జితా, శక్తి ! ఆగండి. వాళ్ళను చంపేందుకు వీలులేదు. వాళ్ళు ఒకప్పుడు నా బానిసలు. అరవై బంగారు కాసుల విలువ చేస్తారు. ఆ డబ్బు ముందు నా కిచ్చి తరువాత మీ యిష్టం వచ్చినట్టు చంపుకోండి,” అన్నాడు.


    స్థూలకాయుడి మాటలకు జితవర్మ తోక తొక్కిన తాచులా లేచి, “ఓయ్ఁ, మాంసం పోగూ ! ముందు నువ్వు ఆ కొరడాను నా కత్తికి అడ్డం తియ్యి. వాళ్ళిప్పుడు నీ బానిసలు కారు. వాళ్ళ నెప్పుడో అమ్ముకున్నావ్. ఆ కొన్న వర్తకులు చచ్చారు కూడా !" అన్నాడు.


    “ఆ వర్తకులు చచ్చారు గనకే, నా వస్తువులు తిరిగి నా పరం అయినై. నీకీ పాటి వ్యవహార జ్ఞానం కూడా లేదా ? అయ్యో, అనాగరిక మానవుడా !" అన్నాడు స్థూలకాయుడు, జిత, శక్తి వర్మలు రెచ్చిపోయి, కత్తులు జార విడిచి స్థూలకాయుడి మీద కలియ బడ్డారు. స్థూలకాయుడు వాళ్ళను పిల్లి ఎలుకను పట్టినంత ఒడుపుగా పట్టుకుని నేలకేసి కొట్టాడు.


    అంతవరకూ వినోదం చూస్తున్న వాడిలా నిలబడిన బ్రహ్మదండి మాంత్రికుడు, తన మంత్ర దండాన్ని పైకెత్తి ఛీ అంటూ చీదరించుకుని, పులుగురాయుడి కేసి తల తిప్పి, “పులుగేశా ! యిక మనం చూస్తూ వూరుకుని లాభం లేదు. ఈ మతిలేని వెధవలు ముగ్గురూ కుక్కల్లా కాట్లాడుకుని, ఆ కేశవుణ్ణి కూడా చంపటమో, లేక వాడు తన అనుచరులతో పారిపోయేందుకు అవకాశం కలిగించటమో చేస్తారు. ముందు ఆ కాట్ల కుక్కల్ని విడ దీయండి,” అన్నాడు.


    పులుగురాయుడు తన చేతిలో వున్న ఈటెను పోట్లాడుకుంటున్న వాళ్ళకేసి గురి పెట్టి, “జితా, శక్తి ! మీరిక ఆ ఎనుబోతుగాణ్ణి వదలండి. ఈ దొరికిన ముగ్గురూ నా వాళ్ళు. వాళ్ళను పట్టుకున్నది, నేను. తెలిసిందా ?” అన్నాడు రౌద్రంగా, పులుగురాయుడి హెచ్చరిక వింటూనే జిత, శక్తివర్మలు స్థూలకాయుడి పట్టు విడిపించుకుని, కింద పడి వున్న తమ కత్తుల్ని తీసుకుని, దూరంగా పోయి, పళ్ళు కొరుకుతూ నిలబడ్డారు.


    స్థూలకాయుడు రొప్పుతూ తన కొరడా భుజాన వేసుకుని బ్రహ్మదండి మాంత్రికుడి కేసి గుడ్లురుముతూ చూశాడు.


    బ్రహ్మదండి కేశవుణ్ణి సమీపించి అతడి భుజం పట్టుకుని కుదుపుతూ, “వత్సా, కేశవా! నీ మేలుకోరే నన్ను, నా శిష్య ద్రోహి జయమల్లు చెప్పడు మాటలు విని ఎంత అపార్ధం చేసుకున్నావో, ఆలోచిస్తుంటే నా ఆత్మ గిలగిల కొట్టుకుంటున్నది. నిన్ను కోటీశ్వరుణ్ణి చేయటమేగాక, లోకానికే అధిపతిని చేద్దామనుకున్నాను. ఇది, నా కోర్కె మాత్రమే కాదు; ఆ ఉపాసకుల ఊడల మర్రి కాలభైరవుడి ఆజ్ఞ! ఆ శత్రువుల పాలిటి బ్రహ్మజెముడే నిన్ను తిరిగి నా పరం చేశాడు. మన యిద్దరం ఏక మవటం అంటే అగ్నికి వాయువు తోడైనట్టే. మన దెబ్బకు తిరుగు వుండదు. ఏమంటావ్?” అని ప్రశ్నించాడు.


    బ్రహ్మదండి మాటలు వింటూంటే కేశవుడికి ఒళ్లు మండి పోయింది. అతడు మాంత్రికుడి చేతిని తన భుజం మీది నుంచి విసురుగా లాగివేసి, “బ్రహ్మదండీ, నీ కల్లబొల్లి మాటలు నేను నమ్ముతా ననుకోకు, నీ వేపాటి మంత్ర శక్తిగల వాడవో నాకు తెలుసు !” అన్నాడు ఉద్రేకంగా.


    బ్రహ్మదండి లోపల పొంగే కోపాన్ని అణుచుకుంటూ, "కేశవా, యీ ఒక్కసారికి నీ యీసడింపు మాటలను సహించాను. మరోసారి నా మంత్ర శక్తిని కించపరుస్తూ మాట్టాడావో, నిన్ను నిలువునా బూడిద చేసి, అది శరీరానికి రాసుకుని ఆ కనబడే మొసళ్ళ మడుగులో స్నానం చేసి, నా కాలభైరవుడి దగ్గరకు వెళ్ళిపోతాను. ఈ జయమల్లు శుంఠకు ఒక్క చారల గాడిద వేషం వేసే మంత్రం తప్ప మరేం తెలుసు?" అంటూ జయమల్లుకేసి తిరిగి, “ఈ ద్రోహినీ, ఆ కోయ వెధవనూ ఈటెలతో శరీరాలు తూట్లు తూట్లుగా పొడిచి, గద్దలకు ఆహారంగా వెయ్యండి,” అన్నాడు పళ్ళు పటపట కొరుకుతూ.


    బ్రహ్మదండి మాంత్రికుడు మాట ముగించే లోపలే జిత, శక్తివర్మలు కత్తులెత్తి జయమల్లునూ, కోయగోమాంగ్ నూ పొడవబోయేంతలో, పులుగురాయుడు తన ఈటెతో వాళ్ళ కత్తులను కింద పడేలా కొట్టి, “ఆగండి, ఆగండి ! 'గద్దలకు ఆహారం' అన్న మాట వింటూనే నాకో ఆలోచన వచ్చింది. వీళ్ళిద్దరి రూపు రేఖలూ చూస్తూంటే వీళ్ళు గద్ద జాతి మానవుల్లా కనిపిస్తున్నారు. మా గరుడ జాతి వాళ్ళకు, గద్ద జాతి వాళ్ళు సర్వ కాలాల్లో సేవకా వృత్తి చేసి బతకాలని శాస్త్రం వున్నట్టు విన్నాను. కనక, వీళ్ళిద్దరూ నా సేవకులు," అంటూ తన అనుచరులకేసి తిరిగి, “ఒరేయ్, వీళ్ళను నా గృహానికి తీసుకుపోయి జాగ్రత్తగా కాపాడండి. నా ఉడుపులూ అవీ చెదలు పట్టకుండా దులిపి ఎండవేసే పని నేర్పండి. వాళ్ళు పారిపోయారో, మీ ప్రాణాలు తీస్తాను.” అన్నాడు.


    పులుగురాయుడి అనుచరులు జయమల్లునూ, కోయగోమాంగ్ నూ భుజాలు పట్టుకుని యీడ్చుకు పోబోయేంతలో, బ్రహ్మదండి వాళ్ళకు అడ్డు పడి, పులుగు రాయుడితో, “పులుగు ప్రభో ! మీరు అతిగా తొందర పడకండి. వీళ్ళ సంగతి మీకు ఆవగింజంత కూడా తెలీదు. వీళ్ళు పారిపోతారనే భయం మీ కొద్దు. వాళ్ళు పారిపోదలిస్తే, మీ ప్రాణాలు తీసిం తరవాతే పారిపోతారు. నా మాట విని, వీళ్ళ నిక్కడే ముక్కలు ముక్కలుగా నరికించి కాకులకు మేతగా వేయండి," అన్నాడు.


    బ్రహ్మదండి యిలా అనగానే పులుగురాయుడు చీదరించుకుంటున్న వాడిలా ముఖం పెట్టి, "ఏం, బ్రహ్మదండీ ! ప్రతి స్వల్పానికి నువ్వు కనబరచే భయం, చేసే గోలా చూస్తూంటే, నువ్వు కాకి జాతి మానవుడిలా కనిపిస్తున్నావు. గద్ద జాతి మానవులకు, కాకి జాతి మానవులు అన్ని వేళలా ఊడిగం చేస్తూ జీవించాలని శాస్త్ర పుస్తకాల్లో వుంది. ఆ సంగతి నీకూ తెలుసు ! కనక నిన్ను ఈ యిద్దరికీ సేవకుడిగా నియమిస్తున్నాను," అన్నాడు.


    పులుగురాయుడి మాటలతో బ్రహ్మదండి శివమెత్తిన వాడిలా అయిపోయి, గంతులు వేస్తూ, మంత్ర దండాన్ని గిర్రున తిప్పుతూ, “పులుగు దొరా, ఈ కాలభైరవోపాసకుణ్ణి ఎంత మాటన్నారు ! సరే, నేను నా కేశవుణ్ణి వెంట బెట్టుకుని రాకాసిలోయకు వెళ్ళిపోతాను. మీకు వాగ్దానం చేసిన విధంగా, మీ దేవతకు బలి మనుషుల్ని తప్పక పంపుతాను. రేపు సూర్యోదయంతోనే, నా ప్రయాణం," అన్నాడు.


    “అందుకు నా అభ్యంతరం ఏమీ లేదు. యిక కదలండి," అంటూ పులుగురాయుడు బయలుదేరాడు. అతడి వెంట అందరూ కదిలారు. కేశవుణ్ణి, జయమల్లునూ, కోయ గోమాంగ్ నూ పది మంది రెక్కల మనుషులు ముందూ వెనకా కాపుండి నడిపించారు.


    బ్రహ్మదండి, స్థూలకాయుడికి సౌంజ్ఞ చేసి గుంపు నుంచి పక్కకు తీసుకుపోయి రహస్యంగా, “వీర చూడామణీ! నే చెప్పేది శ్రద్ధగా విను. యిక మనం ఈ పక్షి ముఖం వెధవ దగ్గిర వుండటం ప్రమాదకరం. రేపు తెల్లవారుతూనే, నేనూ, జిత, శక్తివర్మలూ, నువ్వూ కలిసి, ఆ కేశవుణ్ణి తీసుకుని రాకాసి లోయకు వెళ్లిపోదాం. ఆ కేశవుడు పారిపోకుండా జాగ్రత్త పడ్డామంటే, రాకాసి లోయలోని ధనరాసులన్నీ మనవే. వాడు వెంట లేకుండా అక్కడ మనం ఒక గుడ్డి గవ్వకు కొరగాం. అదీ సంగతి,” అన్నాడు.


    “ఆ వెధవ కుర్రకుంకను గురించి నువ్వంతగా వాపోవటం ఏం బాగా లేదు. నా లెక్కన వాడు ఇరవై బంగారు కాసుల కన్నా ఎక్కువ విలువ చెయ్యడు." అన్నాడు స్థూల కాయుడు పెదాలు చప్పరిస్తూ.


    “అన్నన్నా, ఎంత మాట! ఆ కేశవుడు సామాన్యుడనుకున్నావా? వాడు రాజయోగాన్ని భుజాన వేసుకుని పుట్టాడు. వాడి మూపు మీద పడగ విప్పిన పాము ఆకారం గల మచ్చ చూస్తే, నువ్విలా మాట్లాడవు. దాన్ని స్వయంగా ఆ కాలభైరవుడే అచ్చుగుద్దాడు, తెలిసిందా?" అంటూ బ్రహ్మదండి మాంత్రికుడు చెంపలు వేసుకున్నాడు.


    “వాడు బ్రహ్మపురానికి రాజైన నాడు గాని, నువ్వు చెప్పేది నేను నమ్మను. ఏదెలా అయితే నాకేం ? నాకు చేసిన వాగ్దానం మాట మరవకు," అన్నాడు స్థూలకాయుడు.


    బ్రహ్మదండీ, స్థూలకాయుడూ రహస్యంగా మాట్లాడుకోవటాన్నేగాక, అంతకు ముందు జరిగిన సంఘటనలన్నీ కూడా బిడాలి, శ్వానకర్ణి నియమించిన వేగుల వాళ్ళు, కొండ రాళ్ళ చాటు నుంచి గమనించారు. వాళ్ళు కేశవుడూ, అతడి అనుచరులు పులుగు రాయుడికి పట్టు బడటం దగ్గర నుంచి సర్వం ఎప్పటికప్పుడు తమ నాయకులకు తెలియ పరుస్తూనే వున్నారు.


    కేశవుడూ వాళ్ళు గుహలో ప్రవేశించిన తరువాత నిప్పులు కక్కే సింహం పారి పోవటాన్ని గురించి విన్న బిడాలీ, శ్వానకర్ణి యిక తమకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదని నిశ్చయించుకుని, గుహలో ప్రవేశించి, కొంత సేపటికి కోయగోమాంగ్ వదిలిపోయిన రాతి గదను చూశారు. ఆ తరువాత వాళ్ళు కాలిగుర్తులను అనుసరిస్తూ నడిచి, సొరంగం పైన వున్న కంత నుంచి బయట జరుగుతున్నదంతా గమనించారు.


    “ఇంత మంది దుర్మార్గుల్ని వాళ్ళ స్వస్థలంలో ఎదిరించి గెలవటం కష్టం. పైగా, ఈ లోపల వాళ్ళు కేశవుణ్ణి అతడి స్నేహితులనూ చంపవచ్చు." అన్నాడు బిడాలి.


    శ్వానకర్ణి తన మూల పురుషుడి రాతి గదను కళ్ళ కోసారి అద్దుకుని, “ఇక, నా ముఠాకు అపజయ భయం లేదు. మన మిత్రులైన ఆ ముగ్గుర్నీ రక్షించే భారం నాది. తరువాత, వాళ్ళ సాయం కూడా తీసుకుని, మొత్తం ఈ రెక్కల పక్షిగాళ్ళను దుంపనాశం చేస్తాను.” అన్నాడు.


    “వాళ్ళను రక్షించే భారం నా మీద కూడా కొంత వున్నది. రెక్కల మనుషుల దేవతకు బలికానున్న నా ముఠా వాళ్ళను ఆ ముగ్గురూ రక్షించారు. ఇంతకూ నీ ఆలోచన ఏమిటి?" అని అడిగాడు బిడాలి.


    బిడాలి అలా ప్రశ్నించగానే శ్వానకర్ణి తల పంకిస్తూ కాసేపు వూరుకుని, తరవాత అంతదూరంలో వున్న తన ముఠా వాళ్ళలో యిద్దర్ని దగ్గిరకు పిలిచి, "మీరు చీకటి పడుతూనే, ఈ కంత నుంచి బయటికి పోయి అక్కడ పడి వున్న పక్షి రెక్కలు తగిలించుకుని, రెక్కల మనుషుల్లా నటిస్తూ, పులుగురాయుడు నివసించే ప్రాంతాలకు వెళ్ళి, కేశవుడూ వాళ్ళ స్థితి ఎలా వున్నదో తెలుసుకు రావాలి," అని ఆజ్ఞాపించాడు.


    “ఇదా నీ ఎత్తుగడ? బాగానే వుంది. నీ ముఠా వాణ్ణోకణ్ణీ, నా ముఠా వాణ్ణోకణ్ణీ పంపుదాం. అది న్యాయంగా వుంటుంది,” అన్నాడు బిడాలి. ఇందుకు శ్వానకర్ణి అంగీకరించాడు.


    తరువాత కొంత సేపటికి సూర్యాస్తమానమై క్రమంగా చీకటి పడింది. శ్వానకర్ణి, బిడాలి ముఠాల అడవిమనుషు లిద్దరూ సొరంగాన్నుంచి బయిటికి పాక్కుంటూపోయి, అక్కడ మధ్యాన్నం జరిగిన తన్ను లాటలో రెక్కల మనుషులు వదిలిపోయిన పక్షి రెక్కల్లో తమకు కావలసినవి ఏరుకుని, చేతులకు తగిలించుకుని పులుగురాయుడు నివసించే ప్రాంతాలకు వెళ్ళారు.


    దారిలో ఆ యిద్దర్నీ ఎవరూ అనుమానించి అటకాయించ లేదు. వాళ్ళు ఒక్కొక్క గుడారాన్నే దాటిపోతూ, చివరకు బ్రహ్మదండీ, స్థూలకాయుడూ వున్న గుడారం ముందు నుంచి వెళ్ళేటప్పుడు, కాగడాల వెలుగులో వాళ్ళిద్దర్నీ గుర్తించి, ఆ పక్కనే కేశవుడూ అతడి అనుచరులుండవచ్చని ఊహించారు. తరువాత నాలుగడుగులు ముందుకు వెళ్ళేసరికి వాళ్ళు ఊహించినది నిజమని తేలిపోయింది. ఒక గుడారం ముందు జిత, శక్తివర్మలు కత్తులు పట్టుకుని కాపలా కాస్తున్నారు. లోపల కేశవుడూ, జయమల్లూ, కోయగోమాంగ్ చాపల మీద కూచుని మాట్టాడు కుంటున్నారు.


    అడవి మనుషులిద్దరూ జంటగా జిత, శక్తి వర్శలను సమీపించి, “దారి తొలగండి! లోపల వున్న ఆ ముగ్గురు దుర్మార్గుల్నీ తన వద్దకు తీసుకు రమ్మని పులుగుదొర ఆజ్ఞ అయింది,” అన్నారు.


    జిత, శక్తివర్మలు పక్కన వెలుగుతున్న కాగడాలతో అడవి మనుషుల ముఖాలను పరీక్షగా చూసి, దారి యిచ్చారు. కాని, అంతలో జితవర్మ కేదో అనుమానం తగిలి, “వీళ్ళు రెక్కల మనుషుల జాతి వాళ్ళలా లేరు, అడవి మనుషుల ముఖ లక్షణాలు కనబడుతున్నవి." అన్నాడు.


    “అవునవును, నాకూ అదే అనుమానం కలిగింది, సుమా!" అంటూ శక్తివర్మ కత్తి దూసి, “ఏయ్, మీరెవరు? ఆగండి !" అంటూ ముందుకు వెళ్ళాడు. 

ఇంకా వుంది...

Post a Comment

Previous Post Next Post