RakasiLoya 1-35 Janapada Novel by Dasari Subramanyam (CHANDAMAMA)
రాకాసిలోయ (చందమామ)_28
రాకాసిలోయ_28
కేశవుడు నిశ్శబ్దంగా పాకుతూపోయి, స్థూలకాయుడు నిలబడి వున్న రాతి వెనక ఆగి, కత్తిని అతడి కాళ్ళకు అడ్డంగా ఆనించి, “స్థూలకాయా! చెప్పేది నిశ్శబ్దంగా విను. అటూ యిటూ గెంతటంగాని, నీ వెనక ఎవరో వున్నట్టు సూచనగాని చేశావో, నీ రెండు కాళ్లూ ఒక్క వేటుకు తెగిపోగలవు." అన్నాడు గొంతు తగ్గించి మాట్లాడుతూ.
స్థూలకాయుడు ఒక క్షణకాలం స్తంభించి పోయాడు. తరువాత నిలువెల్లా ఓసారి వణికిపోయాడు. ప్రాణభీతితో ఒక్కసారిగా అరుద్దామనుకున్నాడు గాని, కేశవుడి హెచ్చరికా, పదునుగా కాళ్ళకు ఆనించబడి ఒరుసుకుంటున్న కత్తీ, అతడి బుద్ధిని అదుపులో పెట్టినై.
“ఎవరు నువ్వు? కేశవుడివి కాదు గదా?” అన్నాడు స్థూలకాయుడు వినపడీ వినపడనట్టు.
“నేను కేశవుణ్ణే! నా వెనక పదీ పదిహేను మంది కత్తుల వాళ్ళూ, బాణాల వాళ్ళూ వున్నారు. కదిలావో, చచ్చినవాడివే! ఇక చెప్పు! నువ్వు, నిజంగా బ్రహ్మదండి మాంత్రికుణ్ణి ఆ పక్షి వేషం వాణ్ణి బానిసలుగా పట్టుకున్నావా? లేక అంతా కపట నాటకమా?" అని ప్రశ్నించాడు కేశవుడు.
“అంతా కపట నాటకమే. ఆడేది నేనైనా, ఆడిస్తున్నవాడు ఆ మాంత్రిక వెధవ. ప్రాణభయం కొద్దీ వాడు చెప్పిన దానికి ఒప్పుకున్నాను. నన్ను చంపకు, నీకు పుణ్య ముంటుంది," అంటూ స్థూలకాయుడు బావురుమన్నాడు.
స్థూలకాయుడు బొమ్మలా కదలామెదలక నిలబడి వుండి, పెదాలు మాత్రం ఆడిస్తూ ఏవో ధ్వనులు చేస్తూ వుండటం, అల్లంత దూరంలో వున్న చెట్ల చాటు నుంచి గమనిస్తున్న బ్రహ్మదండికీ, పులుగు రాయుడికీ ఆశ్చర్యం కలిగించింది.
“వాడట్టా ఎండు మానులా నిర్ర నిగడదీసుకు పోయాడేం? ఏదైనా గుర్రపు వాతరోగం కాదుగదా?" అన్నాడు పులుగు రాయుడు కోపంగా.
బ్రహ్మదండి ఆ ప్రశ్నకు అడ్డంగా తలాడిస్తూ, “అలాంటిదేం కాదని నా అనుమానం. వాడు మనం వేసిన గాలం! ఆ గాలానికి చేప పడిందని నాకు తోస్తున్నది. అయినా సంశయం ఎందుకు? ఒకసారి సౌంజ్ఞ చేసి చూద్దాం. జవాబు వస్తుందో లేదో తెలిసి పోతుంది," అంటూ తన మంత్ర దండాన్ని పైకెత్తి, స్థూలకాయుడి కేసి ఆడించాడు.
బ్రహ్మదండికి జవాబిచ్చేందుకు స్థూలకాయుడు తన చేయి ఎత్తబోయి, అంతలో కేశవుడి కత్తి కాళ్ళను మరింత గట్టిగా ఒరుసు కోవటంతో ఆగిపోయాడు.
కేశవుడు తన పక్కనే వున్న జయమల్లూ, కోయగోమాంగ్ కేసి తల తిప్పి, “వీడేదో తన మిత్రులకు చెప్ప చూస్తున్నట్టున్నది,” అన్నాడు.
“అందుకు సందేహం లేదు. కాని, మనకు రానున్న ప్రమాదం ఆలోచించావా? ఆ బ్రహ్మదండి, పక్షిమొహం వాడూ యీ సరికే మనను పట్టేందుకు, తమ అనుచరులతో బయలుదేరి వుండవచ్చు,” అన్నాడు జయమల్లు.
కేశవుడు తన కత్తిని స్థూలకాయుడి మోచేతికి ఒకసారి తాకించి, “నిజం చెప్పక పోయావో, నీ కాళ్ళతోపాటు, చేతులుకూడా నరికేస్తాను. ఇప్పుడు బ్రహ్మదండీ, పక్షిముఖం వాడూ ఏం చేస్తున్నారు?” అని అడిగాడు.
“వాళ్లిద్దరూ తల లొక చోట చేర్చారు; ఏదో రహస్యాలోచన చేస్తున్నట్టున్నది. జిత, శక్తివర్మలు తమ కత్తుల్ని చెట్టు బోదె మీద సాన బెడుతున్నారు,” అన్నాడు స్థూలకాయుడు. వాడు చెప్పిన దాంట్లో అబద్ధం ఏమీ లేదు. బ్రహ్మదండీ, పులుగురాయుడూ కలిసి ఆసరికే కొందరు రెక్కల మనుషుల్ని, శత్రుబలమేపాటో తెలుసుకు వచ్చేందుకు పంపారు. వాళ్ళల్లో కొందరు పెద్ద పెద్ద వృక్షాలెక్కి అక్కణ్ణించి రాతిమీద నిలబడి వున్న స్థూలకాయుణ్ణి, ఆ వెనక నక్కివున్న కేశవుణ్ణి, జయమల్లునూ,కోయ గోమాంగ్ నూ చూశారు.
“ఇంతకూ శత్రువులు ముగ్గురే ముగ్గురు ! పిల్లి కూనల్ని పట్టినట్టు వాళ్ళను మెడలు పట్టి యివతలికి యీడ్చవచ్చు." అనుకుంటూ రెక్కల మనుషులు తమ నాయకుడి దగ్గరకు పరిగెత్తుకు వెళ్ళి, తాము చూసింది చెప్పారు.
తన అనుచరులు యిచ్చిన భోగట్టా వింటూనే, పులుగురాయుడు కనుబొమలు ముడిచి, “ఇందులో ఏదో పెద్ద మోసం వున్నది, బ్రహ్మదండీ! ముగ్గురే ముగ్గురు మానవ మాత్రులు, యింత ధైర్యంగా మన మధ్యకు వస్తారంటే నేను చచ్చినా నమ్మను." అన్నాడు.
“వాళ్ళ సంగతి తెలియకపోతే నేనూ నమ్మను!" అంటూ బ్రహ్మదండి పెద్దగా నవ్వి, “వాళ్ళలో ఒకడు కేశవుడూ, రెండవ వాడు జయమల్లనే నా పూర్వ శిష్యుడూ, పోతే, ఆ మూడవవాడు కోయశుంఠ అయి వుంటాడు. ఆ ముగ్గురూ మహిష లగ్నంలో పుట్టినవాళ్ళు. ఆ జాతకులకు వెనక చూపూ వుండదు, ముందు చూపూ వుండదు. ఏటికి అడ్డంపడి యీదటమే,” అన్నాడు.
"అయితే యిప్పుడు మనం చేయవలసిందేమిటి?" అన్నాడు పులుగురాయుడు.
“ఏముంది, వాళ్ళ ముగ్గుర్నీ చుట్టు ముట్టి పట్టేద్దాం,” అన్నాడు బ్రహ్మదండి.
“వాళ్ళూ, బాణాలూ, కత్తులూ వెంట వుంచుకు తిరిగేవాళ్ళే, అంత తేలిగ్గా దొరుకుతారని నేననుకోను. మనలో చాలామందిమి చావ వలసి వస్తుంది. ముందు ఆ స్థూలకాయుణ్ణి వాళ్ళు చంపేస్తారు.” అన్నాడు పులుగురాయుడు.
“వాడు నరభక్షకులకు దొరికి ఎప్పుడో చచ్చేవాడే, నేను ప్రాణం పోసి వెంట పెట్టుకు వచ్చాను. ఇవ్వాల్టితో వాడికి ఆయుషు తీరిపోయిందనుకుందాం! పోతే, నువ్వూ నేనూ ఎంతో కాలం బతికి వుండి, అర్ధరాజ్యమూ, రాకాసిలోయలోని ధనరాసులూ అనుభవించవలసిన వాళ్ళం. అందువల్ల మనం తొందరపడి, ఆ దుర్మార్గుల బాణం వేటుకు అందే దూరంలోకి వెళ్ళకూడదు. నీ నా అనుచరుల్ని, వాళ్ళను పట్టి తెచ్చేందుకు పంపుదాం,” అన్నాడు బ్రహ్మదండి మాంత్రికుడు.
“అంతే చేద్దాం,” అంటూ పులుగురాయుడు పక్కకు తిరిగి తన అనుచరులకు సౌంజ్ఞ చేశాడు. వెంటనే ముఫ్పై నలభై మంది రెక్కల మనుషులు తమ నాయకుడి దగ్గరకు వచ్చారు. పులుగురాయుడు వాళ్ళతో కొంచెం సేపు రహస్యంగా మాట్టాడి, యిక వెళ్ళమన్నట్టు చేతులు వూపాడు.
రెక్కల మనుషులు రెండు ముఠాలుగా చీలిపోయి, కొందరు చెట్ల మీదికి ఎక్కసాగారు. మరి కొందరు రాళ్ళ వెనక నక్కుతూ, స్థూలకాయుడున్న ప్రదేశానికి బయలుదేరారు.
“ఏం, జితా, శక్తీ! మీ రిక్కడే వున్నారేం? ఆ కేశవుడూ వాళ్ళను పట్టేందుకు సాయపడరా?" అని అడిగాడు పులుగు రాయుడు జిత, శక్తివర్మలను.
ఆ ప్రశ్న వింటూనే జిత, శక్తి వర్మలు పదును పెడుతున్న కత్తులను ఒరలలో పెట్టి, “ఆ నీచుల్ని పట్టుకుని, మా చేతుల్ని మలినం చేసుకుంటామా! మా పని బ్రహ్మదండి మాంత్రికుడి అంగరక్షణ చేయటం. బ్రహ్మపుర రాజగురువు మమ్మల్ని పంపింది అందుకేగదా, బ్రహ్మదండీ?" అంటూ మాంత్రికుణ్ణి ప్రశ్నించారు.
బ్రహ్మదండి వచ్చే కోపాన్ని దిగమింగుతూ, “అవును, అవును,” అంటూ తలాడించి వూరుకున్నాడు.
ఈ లోపల రెక్కల మనుషులు తమ మీద దాడికి వస్తున్నట్టు ముందుగా చూసి కేశవుడికీ జయమల్లుకూ కోయగోమాంగ్ హెచ్చరిక చేశాడు. మహావృక్షాల మీదికి పాకి పోతున్న వాళ్ళను చూస్తూనే కేశవుడు నవ్వి, "ఈ పక్షి వెధవలు అంత ఎత్తు నుంచి, మన మీదికి దూకి, మనను పట్టుకుంటారన్న మాట! సరే, బాణాలు ఎక్కుపెట్టి, ముందు ఒకళ్ళిద్దర్ని పడకొట్టండి, మిగతా వాళ్ళు పారిపోతారు. ఇంతకూ వీళ్ళ నాయకులెక్కడ?" అన్నాడు, విల్లంబులు చేతికి తీసుకుంటూ.
ఆ వెంటనే జయమల్లూ, గోమాంగ్ కూడా తమతమ విల్లంబులు తీసుకున్నారు. కేశవుడు చెట్ల మీదికి పాకుతున్న ఒక రెక్కల మనిషి మీదికి గురి పెట్టిన బాణాన్ని చప్పున దించుతూ, జయమల్లుకేసి తిరిగి, “జయమల్లూ! వీళ్ల నెంతమందిని చంపినా మనకు కలిగే మేలులేదు. ఆ బ్రహ్మదండిని ముందు మారణం చెయ్యాలి. వాడెక్కడ? వాడూ మన మీదికి వస్తున్నాడా? ఏయ్, స్థూలకాయా! బ్రహ్మదండి యిటుకేసి వస్తున్నాడా? నిజం చెప్పు,” అని స్థూల కాయుణ్ణి ప్రశ్నించాడు.
స్థూలకాయుడు నిలువెల్లా వణికిపోతూ, “వాడు రావటం లేదు. వాడూ, పిట్టల నాయకుడూ చెట్ల కింద నిలబడి యిటుకేసే చూస్తున్నారు,” అన్నాడు.
“ఆ దుర్మార్గుడికి మన శక్తేమిటో తెలుసు, కేశవా ! సరే, యిక మనం యిక్కడ కాలయాపన చెయ్యకూడదు. ఇద్దరు ముగ్గురు రెక్కల మనుషుల్ని పడకొట్టి, మనం గుహ కంతలో నుంచి తిరిగి కొండ పొట్టలోకి వెళ్ళిపోదాం," అంటూ జయమల్లు బాణం గురిచేసి చెట్ల మీదికి చరచరా పాకిపోతున్న రెక్కల మనుషుల్లో ఒకడి మీదికి దాన్ని వదిలాడు.
కేశవుడూ, అతడి అనుచరులు తమ దృష్టిని రెక్కల మనుషుల మీదికి మళ్లించారని గ్రహించిన స్థూలకాయుడు రాతి మీది నుంచి చెంగున కిందికి దూకి, కాలి సత్తువ కొద్దీ, బ్రహ్మదండీ, పులుగురాయుళ్ళకేసి పరిగెత్తుతూ, “వాళ్ళు అంతా కలిసి ముగ్గురే! చంపండి, పట్టుకోండి," అంటూ అరవసాగాడు.
“ఆహాఁ, కేశవా! ఈ దుర్మార్గుడు మన నుంచి బతికి బయటపడ్డాడు. అయినా, ఒక దెబ్బ కొట్టి చూద్దాం, తగులుతుందేమో!" అంటూ కోయగోమాంగ్ లేచి నిలబడి పారిపోతున్న స్థూలకాయుడి మీదికి బాణం వదిలాడు. కాని, ఆ బాణం స్థూలకాయుడి పక్కగా దూసుకపోయి, బ్రహ్మదండీ, పులుగురాయుడూ నిలబడివున్న చెట్టు బోదెకు ఠపీ మని తగిలింది.
బాణం చేసిన ధ్వని వింటూనే బ్రహ్మదండి ఎగిరి గంతేసి, “ఆ దుర్మార్గులు ముగ్గురూ మన మీదికే బాణాలు వదులుతున్నారు పులుగేంద్రా! పరిగెత్తు!" అంటూ వెనుదిరిగి చెట్లలోకి పారిపోసాగాడు. పులుగురాయుడూ, జిత, శక్తివర్మలూ అతణ్ణి అనుసరించారు.
గోమాంగ్ తో పాటు కేశవుడూ, జయమల్లూ కూడా లేచి నిలబడ్డారు. వాళ్ళకు పారిపోతున్న బ్రహ్మదండి ముఠా కనిపించింది. వాళ్ళను వెంట పడి తరమటమా, మానటమా అని వాళ్ళు ఆలోచించేంతలో చెట్ల మీది నుంచి, చావగా మిగిలిన రెక్కల మనుషులు భయంకరంగా అరుస్తూ, వాళ్ళ మీదికి ఎగిరి రాసాగారు.
కేశవుడూ, అతడి అనుచరులు బాణాలు ఒక దాని వెంట ఒకటిగా కిందికి దూకుతున్న రెక్కల మనుషుల మీదికి వదిలారు. వాళ్ళల్లో బాణం దెబ్బలు తగిలిన కొందరు బాధతో అరుస్తూ, అంత ఎత్తు నుంచి గాలిలో పల్టీలు కొడుతూ కిందపడసాగారు. ఇక తిరిగి తాము గుహలో ప్రవేశిద్దామని కేశవుడూ, జయమల్లూ నిశ్చయించుకుని వెనుదిరిగేంతలో, రెక్కల మనుషుల్లో రెండవ ముఠా రాళ్ళ చాటు నుంచి ఒక్కుమ్మడిగా గావు కేకలు పెడుతూ, లేచి నిలబడ్డారు. వాళ్లందరి వద్దా పొడవైన ఈటెలు వున్నవి.
“ఇక బాణాలతో లాభం లేదు, కత్తులకు పని చెప్పండి. శత్రువులు మన గుహా మార్గాన్ని అడ్డుకున్నారు. పోరాడుతూ వీళ్ళ చక్రబంధం నుంచి బయట పడటం ఒక్కటే యిప్పుడు మనం చేయవలసింది. మనం వీళ్ళకు దొరక్కుండా ఎటు పారిపోయినా ఫరవా లేదు," అంటూ జయమల్లు కత్తి దూసి రెక్కల మనుషుల్ని ఎదుర్కున్నాడు.
కేశవుడూ, గోమాంగ్, జయమల్లుల కత్తి దెబ్బలకు రెక్కల మనుషుల్లో ఒక్కొక్కడే చావు కేక పెట్టి కింద పడసాగాడు. వాళ్ళు చేతులకు కట్టుకున్న పక్షి రెక్కలు, ఈ ద్వంద్వ యుద్ధంలో వాళ్ళకు చాలా ఆటంకంగా తయారయినై. వాళ్ళల్లో కొందరు ఈటెలను అటూ యిటూ తిప్పబోయి, ఆ వేగానికి కట్టుకున్న రెక్కలు ఒక దాన్నొకటి మెలివేసు కోవటంతో, చాప చుట్టల్లా కింద పడసాగారు.
“మనం జయించాం, కేశవా! ఇక, మనం గుహలోకి ప్రవేశించి, క్షేమంగా శ్వానకర్ణి ముఠాను చేరవచ్చు." అంటూ జయమల్లు అటుకేసి రెండడుగులు వేసి నిశ్చేష్టుడైపోయాడు.
ఎదురుగా దడి కట్టినట్టు నిలబడిన తన అనుచరులతో పులుగురాయుడు ప్రత్యక్షమయాడు. జయమల్లుతో పాటు, కేశవుడూ, కోయగోమాంగ్ కూడా అటుకేసి చూసి, తరవాత చుట్టూ కలయ చూశారు. వలయాకారంలో తమను రెక్కల మనుషులు వందల సంఖ్యలో చుట్టు ముట్టినట్టు వాళ్లు గ్రహించారు. బ్రహ్మదండి ఎక్కడ? అన్న అనుమానం వాళ్ళకు కలిగింది. ఆ వెంటనే బ్రహ్మదండి మాంత్రికుడి కంచు కంఠం పలికింది: “ఆ కేశవుణ్ణి మాత్రం ప్రాణాలతో పట్టుకుని, మిగతా యిద్దర్నీ నిలువునా నరికేయండి !"
ఇంకా వుంది...
Post a Comment