రాకాసిలోయ (చందమామ)_27 RakasiLoya Janapada Novel by Dasari Subramanyam (CHANDAMAMA)

   RakasiLoya 1-35 Janapada Novel by Dasari Subramanyam (CHANDAMAMA)

రాకాసిలోయ (చందమామ)_27

 _దాసరి సుబ్రహ్మణ్యం

రాకాసిలోయ_27

    బ్రహ్మదండి పెట్టే కేకలతో, రెక్కల మనుషులు చెల్లా చెదరుగా పారిపోతూ, ప్రాణ భీతితో అరిచే అరుపులతో, మైదాన ప్రదేశమంతా దద్దరిల్లి పోయింది. నిప్పులు కక్కే సింహం మాత్రం రెక్కల మనుషుల జోలికి పోక, అల్లంత దూరంలో వున్న అడవికేసి సూటిగా పరిగెత్తసాగింది.


    సింహం బాగా బెదిరి పోయిందనీ, అది తన ప్రాణరక్షణకు అడవికేసి పారి పోతున్నదనీ ముందుగా గ్రహించినవాడు, బ్రహ్మదండి మాంత్రికుడు. ఆ వెంటనే అతడు మంత్రదండాన్ని సింహం కేసి ఝళిపిస్తూ, “జై కాలభైరవా! ఫట్ ఘట్ హుం.....సింహాన్ని చెవులు పట్టుకుని, అడవిలోకి లాగెయ్, ఉపాసకుల ఊడల మర్రీ!" అంటూ ఒక పెనుకేక పెట్టి, “హేయ్, జితా, శక్తి ! మీ రెక్కడ? రండి, రండి, భయం లేదు. సింహాన్ని కాననంలోకి తరిమేస్తున్నాను,” అంటూ తన అంగరక్షకులను పిలిచాడు, కేక వింటూనే జిత, శక్తివర్మలు ఒక చెట్టు చాటు నుంచి తొంగిచూసి, నిప్పులు కక్కే సింహం అరణ్యంకేసి దౌడు దీస్తున్నదని గ్రహించి, కత్తులు దూసి, గిరగిరా తిప్పుతూ, “ఆఁ వచ్చాం, వచ్చాం, బ్రహ్మదండీ! సింహం మా కత్తి వేటుకు అందకుండా తప్పుకున్నది. అరణ్యంలోకి జొరబడి దాన్ని వేటాడమంటావా?” అని అడిగారు.


    బ్రహ్మదండి పెద్దగా నవ్వుతూ, “మీ ధైర్య సాహసాలు నాకు తెలియనివా? అయినా, సింహాన్ని యిప్పుడు అరణ్యంలోకి వెళ్ళి వేటాడటం క్షేమం కాదు. ముందు రెక్కల పురుగుగాళ్ళకు ధైర్యం చెప్పి మందవేయటం అవసరం. వాళ్ళ నాయకుడు...... ఆ గూబ ముఖం వెధవ ఎక్కడ? వాణ్ణి వెంటనే యిక్కడికి పిలుచుకు రండి, లేకపోతే నేనే వాడున్న చోటుకు వస్తాను. నా అనుమానం రూఢి అయింది ! ఆ కేశవుడి జుట్టు మన చేతికి దొరికినట్టే !" అన్నాడు.


    కేశవుడి పేరు వింటూనే జిత, శక్తి వర్మలు ఉలిక్కిపడి చుట్టూ కలయ చూస్తూ, “కేశవుడా? ఎక్కడ?” అంటూ బ్రహ్మదండి కేసి అనుమానంగా చూశారు.


    బ్రహ్మదండి మాంత్రికుడు ఏ మాత్రం తొణక్కుండా, “జితా, శక్తి! మీరు తొందర పడకండి! వాడెక్కడో యీ ప్రాంతాలనే తన అనుచరులతో తిరుగుతున్నాడు. మనం జాగ్రత్తగా తిరుగులేని పథకం ఒకటి వేసి వాళ్ళందర్నీ పట్టేయాలి ? ముందు నేను చెప్పిన పని చెయ్యండి," అన్నాడు.


    జిత, శక్తివర్మలు వెళ్ళేసరికి రెక్కల మనుషుల నాయకుడు తన అనుచరులందర్నీ ఒక చోటుకు చేర్చి, వాళ్ళు సింహాన్ని చూసి అంతగా హడలి చెల్లా చెదరైనందుకు కేకలు వేస్తున్నాడు. “మనది గరుడ వంశం ! మన శక్తికీ, ధాటికీ యీ లోకంలో తిరుగులేదు. మన వంశం వాళ్ళు తప్ప, ఆకాశంలోకి పక్షిలా ఎగుర గలిగిన వాళ్ళు యింకెవరున్నారు? ఆ నిప్పులు కక్కే సింహాన్ని మీరు ఎగిరి వెళ్ళి, గరుడపక్షి సర్పాన్ని తన్నినట్టుగా తన్ని ముక్కలు ముక్కలు చేయవలసింది. అది చేయకపోగా పిరికివాళ్ళలా పారిపోతున్నారు !" అంటున్నాడు వాడు.


    జిత, శక్తివర్మలు అతణ్ణి సమీపించి బ్రహ్మదండి అతడి కోసం ఎదురు చూస్తున్నట్టు తెలియపరిచారు. బ్రహ్మదండి పేరు వింటూనే రెక్కల మనుషుల నాయకుడు, ముఖం కందగడ్డలా చేసుకుని, “మీ బ్రహ్మదండి మాంత్రికుడంటే నాకు అపనమ్మకం కలుగుతున్నది. తన మంత్రశక్తితో ప్రతిదాన్నీ భస్మం చేయగలనని చెపుతూంటాడే, ఆ సింహాన్ని ఎందుకని భస్మం చేయలేదు? అది అరణ్యంలోకి పారిపోయింది. అది ఏ క్షణాన్నయినా తిరిగి వచ్చి, మావాళ్ళ వ్యాయామ క్రీడల్ని పాడుచేయవచ్చు,” అన్నాడు కోపంగా.


    జిత, శక్తివర్మలు వంగి వంగి దణ్ణాలు పెడుతూ, “ఆ నిప్పులు కక్కే సింహం కంటె కూడా ప్రమాదకరులైన వాళ్ళ వల్ల మనకు కీడు రానున్నది," అని చెప్పారు.


    రెక్కల మనుషుల నాయకుడు తలకు తగిలించుకున్న గద్దముక్కుకుళాయిని ఒకసారి పైకెత్తి, “మనకు కీడు రానున్నదా? ఎవర్నించి ? ఆ బిడాలీ, శ్వానకర్ణి ముఠాలు ఏకమై మన మీదికి దండు రావటం లేదుగదా?" అన్నాడు కొంచెం బెదురుగా, “ఆ వివరాలు మాకు తెలియవు, మీరొకసారి దయ చేయండి, సర్వం బ్రహ్మదండి ఏరుక పరుస్తాడు." అన్నారు జిత, శక్తివర్మలు.


    రెక్కల మనుషుల నాయకుడు బ్రహ్మదండి మాంత్రికుడున్న చోటుకు బయలుదేరాడు, అతణ్ణి అంత దూరాన రావటం చూస్తూనే బ్రహ్మదండి కూచున్న రాతి మీది నుంచి లేచి, అతడికి ఎదురు వెళ్ళి, “పులుగురాయా! దయ చేయండి, దయ చేయండి," అంటూ ఆహ్వానించాడు.


    పులుగురాయా, అన్న పిలుపుతో ఉబ్బి పోయిన రెక్కల మనుషుల నాయకుడు, బ్రహ్మదండిని సమీపిస్తూ గాలిలోకి కొంచెం ఎగిరి పెద్దగా నవ్వుతూ, “బ్రహ్మదండీ, ఏమిటి మనకు రానున్న కీడు? నీ వాలకం చూస్తే, అలాంటి ప్రమాదం ఏమీ వున్నట్టు లేదే,” అన్నాడు.


    “కీడా? అలాంటిదేమీ లేకపోగా, మనకు గొప్ప మేలు కలిగే లక్షణాలు కనబడు తున్నవి. అడవిలో నీ అనుచరుల నుంచి దేవతకు బలి యివ్వనున్న యిద్దరు గుహా వాసులను విడిపించిన ద్రోహుల ముఠా, ఆ కొండ గుహల్లో ఎక్కడో దాగి వున్నదని, నాకు గట్టి నమ్మకం కలిగింది. నిప్పులు కక్కే సింహం వెనకా ముందులు చూడకుండా, మన జనాల్లో పడి పారిపోయిన తీరు చూస్తే, ఆ దుర్మార్గులు దాన్ని చంపేందుకు ప్రయత్నించారనీ, అది తప్పించుకు పరిగెత్తిందనీ తెలియటం లేదా?” అన్నాడు బ్రహ్మదండి ఉత్సాహంగా.


    బ్రహ్మదండి యిలా అనగానే, పులుగు రాయుడు ఎగిరి గంతేసి, “కేశవుడూ, వాడి అనుచరులా! ఇంకా రాకాసిలోయలో వున్న వెండి బంగారాలూ! చూస్తారేం, పదండి, వాళ్ళనిప్పుడే కొండ గాలించి పట్టేద్దాం." అన్నాడు.


    బ్రహ్మదండి మాంత్రికుడు తనకు ప్రాణాపాయం కలిగినప్పుడల్లా, తనను పట్టుకున్న వాడికి అర్ధరాజ్యం యిప్పిస్తానని వాగ్దానం చేశాడు. చండమండూకుడి నుంచి బయట పడేందుకు అతడికీ, తరువాత రెక్కల మనుషుల నాయకుడైన పులుగురాయుడికి దొరికి అతడికీ, మీకు అర్ధరాజ్యం వస్తుందని మాట యిచ్చేశాడు. పైగా, చండమండూకుడి నరమాంస భక్షకులకు దొరికిన స్థూల కాయుణ్ణి, తనకు తోడుగా వుంటాడని చెప్పి, మండూకుణ్ణించి ఆ బానిస యజమానిని కాపాడి, తన వెంట తెచ్చుకున్నాడు.


    పులుగురాయుడి తొందరపాటు చూసి బ్రహ్మదండి మాంత్రికుడు ముఖం చిట్లించి, “పులుగురాయా, యిది వేగిరపాటుకు సమయం కాదు. కేశవుడూ, అతడి వెంట వున్న జయమల్లూ, కోయవాడూ మహా జిత్తులమారి వెధవలు. మనం ఒక్కుమ్మడిగా కొండ గుహలకేసి వెళితే, వాళ్ళు గుహ కందరాల్లో పడి మనకు చిక్కకుండా పారిపోగలరు. వాళ్ళను గుహలు విడిచి వచ్చేలా చేయాలి. అప్పుడు మనం వాళ్ళను చేజిక్కించుకోవచ్చు." అన్నాడు.


    “అదెలా సాధ్యం? నువ్వు చెప్పేదాన్ని బట్టి చూస్తే వాళ్ళేమీ అమాయకులు కాదే,” అన్నాడు పులుగురాయుడు.


    “వాళ్ళ జిత్తులమారి తనాన్ని, కాలభైరవుడి కరుణాకటాక్షం వల్ల నేను జయిస్తాను. దానికి మన స్థూలకాయుడు... ఆ బానిస యజమాని వున్నాడే...... వాడి సహాయం అవసరం. ఆ మాంసం పోగును పిలిపించండి," అన్నాడు బ్రహ్మదండి. వెంటనే పులుగురాయుడు తన అనుచరులను బానిస యజమానికోసం పంపాడు. ఈ లోపల బ్రహ్మదండి, తన అంగరక్షకులైన జిత, శక్తివర్మలతో బయలుదేరి, కొంతదూరం వెళ్ళి, చెట్ల చాటున వున్న ఒక గుడిశె ముందు నిలబడ్డాడు.


    “నీ ఎత్తుగడ ఏమిటి బ్రహ్మదండీ ? మళ్ళీ ఏదో కొంప మీదికి తెచ్చేట్టున్నావు. ఆ మహాకాయుడికి ఎలాంటి పని ఒప్పచెప్పబోతున్నావు ?" అని అడిగాడు జితవర్మ.


    “నీ చచ్చు ప్రశ్నలతో నా ఆలోచన చెడకొట్టకు. ఆ బానిస యజమానిని నరభక్షకులు తినకుండా కాపాడింది, నేను. ఆ కారణం వల్ల వాడు నా బానిస కింద లెక్క నేను యిష్టమొచ్చిన విధంగా వాణ్ణి ఉపయోగిస్తాను," అన్నాడు బ్రహ్మదండి మాంత్రికుడు విసుగ్గా.


    “వాడు, నీ బానిస ఎలా అవుతాడు? వాడికీ అర్ధరాజ్యం యిప్పిస్తానని ప్రమాణం చేశావుగదా?” అని అడిగాడు శక్తివర్మ.


    “వాడికి అర్ధరాజ్యం యిప్పిస్తానని, ప్రమాణం చెయ్యలేదు. అర్ధరాజ్యంలో తనకు నచ్చిన వాళ్ళను బానిసలుగా పట్టుకు పోయి అమ్ముకునే అధికారం యిస్తానన్నాను." అన్నాడు బ్రహ్మదండి కోపంగా, ఆ సమయంలో పులుగురాయుడు వాళ్ళను సమీపించి, “ఏమిటి, మీలో మీరు పోట్టాడుకుంటున్నారులా వుంది ?" అని ప్రశ్నించాడు.


    బ్రహ్మదండి చప్పున అతడికేసి తిరిగి చిరునవ్వు నవ్వుతూ, “పోట్టాట కాదు. నా అంగరక్షకు లిద్దరూ స్వయంగా కొండ గుహల్లోకి వెళ్ళి, ఆ కేశవుడి ముఠాను పట్టుకొస్తామంటున్నారు. నేను తొందర పడవద్దని చెపుతున్నాను,” అన్నాడు.


    ఆ తరువాత ఒకటి రెండు నిమిషాలకు స్థూలకాయుడు రెక్కల మనుషుల వెంట బ్రహ్మదండి వున్న చోటుకు వచ్చి, “ఏం, మహామాంత్రికా ! నాతో కావలసిన పనేమిటి?” అంటూ భుజాన వేలాడుతున్న కొరడా చేతిలోకి తీసుకున్నాడు.


    బ్రహ్మదండి, స్థూలకాయుణ్ణి దూరంగా తీసుకుపోయి రహస్యంగా అతడితో కొంత సేపు మాట్లాడాడు. మాంత్రికుడి మాటలకు అతడు మొదట్లో భయం, బెదురూ కనబరిచినా, ఆఖరుకు తృప్తుడైనట్టు ముఖం పెట్టి, కొరడాను పైకెత్తి పెద్దగా ఝళిపించి, కోర మీసాలను మెలివేసి, ఒక రంకె వేశాడు.


    బ్రహ్మదండి, పులుగురాయుడి దగ్గరకు వచ్చి, “పులుగురాయేంద్రా ! కేశవుడు యిక మన అరచేతి అమలకం, తిరుగు లేదు. తమరూ, తమ అనుచరులు కొద్దిమందీ మాతో కలిసి, ఆ రాతి గుట్టలున్న ప్రదేశానికి రండి, స్థూలకాయుడు ఒక నాటకం ఆడబోతున్నాడు. అంతా ఒక్క నిమిషం పని, వివరాలు యిప్పుడడక్కండి," అన్నాడు ప్రాధేయపడుతున్నట్టు.


    ఆ వెంటనే పులుగురాయుడు నలుగురైదుగురు అనుచరులతో బ్రహ్మదండి చెప్పిన గుట్టల ప్రదేశానికి బయలుదేరాడు. బ్రహ్మదండి, జిత శక్తివర్మలు అతణ్ణి అనుసరించారు. స్థూలకాయుడు కొరడాను గాలిలో గిర్రున తిప్పుతూ, వాళ్ళ వెనగ్గా నడిచి వెళ్ళి, గుట్టలలో వున్న ఒక పెద్ద రాతి మీద ఎక్కి బ్రహ్మదండి ముఠా దగ్గరకు రాగానే వాళ్ళను కొట్టబోతున్న వాడిలా కొరడా ఝళిపిస్తూ, “ఏయ్, బ్రహ్మదండీ, జితాశక్తి, పులుగురాయా ! యిక మీరు నా నుంచి పారిపోలేరు. మిమ్మల్నందర్నీ, ఆ కేశవుడికి అమ్మేస్తాను. అతడి చేతిలో మీకు చిత్రవధ తప్పదు. మీరు చావగానే, ఆ కేశవుడు నిరాటంకంగా రాకాసిలోయకు వెళ్ళి ధనరాసులు తెచ్చుకుంటాడు. నేనూ అతడి వెంట వెళతాను," అంటూ కొండలు మార్మోగేలా అరవసాగాడు. గుహ కప్పులో వున్న కంత కుండా యిదంతా చూస్తున్న కేశవుడికీ, జయమల్లుకూ, కోయగోమాంగ్ కూ చాలా ఆశ్చర్యం కలిగింది. మహాక్రూరుడైన స్థూలకాయుడు బతికి వుండటమేగాక, వాడు బ్రహ్మదండినీ వాడి అనుచరులనూ బానిసలుగా పట్టుకున్నాడంటే, వాళ్ళకు నమ్మశక్యం కాకుండా వున్నది.


    "కేశవా, యిందులో ఏదో పెద్ద మోసం వున్నది," అన్నాడు జయమల్లు, కేశవుడు ఏదో జవాబు చెప్ప బోయేంతలో, స్థూలకాయుడు కొరడాను ఠపీమని ఒకసారి మోగించి, “యిక మీరంతా వెళ్ళండి, బ్రహ్మదండీ! జాగర్త, ఆ చీకటి గుడిసె దాటిపోయారో, నానౌకర్లు మిమ్మల్నందర్నీ నిలువునా కోసేస్తారు," అంటూ గావుకేక పెట్టాడు. ఆ తరువాత బ్రహ్మదండి వాళ్ళు వెళ్ళి పోవటం కేశవుడికీ ఆతడి అనుచరులకూ కనిపించింది. స్థూలకాయుడు మాత్రం యింకా రాతి మీదే నిలబడి మీసాలు మెలివేస్తూ, కొరడాను గాలిలో తిప్పుతూ ఛెళ్ళు ఛెళ్ళుమనిపిస్తున్నాడు.


    “మల్లూ ! యిదే మనకు మంచి అదను, స్థూలకాయుణ్ణి పట్టుకుని అసలు రహస్య మేమిటో తెలుసుకుందాం. ఒకవేళ బ్రహ్మదండీ, రెక్కల మనుషులూ మన మీదికి దాడి చేయవస్తే, తిరిగి యిదే కంతగుండా గుహలో ప్రవేశించి కనబడకుండా మాయం కావచ్చు," అంటూ కేశవుడు కంత నుంచి బయటికి వచ్చి, నేల మీద పాకుతూ స్థూలకాయుడు నిలబడి వున్న రాతికేసి బయలుదేరాడు.


    జయమల్లు కేశవుణ్ణి తొందర పడవద్దని హెచ్చరించబోయాడు. కాని, కేశవుడు ఆ సరికే అయిదారు గజాల దూరం ముందుకు వెళ్ళిపోయాడు. ఇక చేసేది లేక జయమల్లూ, కోయ గోమాంగ్ లు కూడా కేశవుడి వెనక పాకుతూ బయలుదేరారు. 

ఇంకా వుంది...

Post a Comment

Previous Post Next Post