RakasiLoya 1-35 Janapada Novel by Dasari Subramanyam (CHANDAMAMA)
రాకాసిలోయ (చందమామ)_26
రాకాసిలోయ_26
గుహ లోపలి భాగం ఏమంత చీకటిగా లేదు. ఎక్కడినుంచో వెలుగు దానిలోకి పడుతున్నది. ఆ గుడ్డి వెలుగులో, అందరి కన్న ముందు నిలబడి గుహ లోపలికి తొంగి చూసిన కేశవుడికి, ఏవో నిప్పు రవ్వలు లేచి చెల్లా చెదురైనట్టు కనిపించింది.
“నిజంగా, గుహావాసులు చెప్పినట్టు లోపల వున్నది నిప్పులు కక్కే సింహమే అయితే, అది మన బాణం వేటు దూరంలోనే వున్నది," అంటూ కేశవుడు తన అనుచరుల కేసి చూశాడు. ఈలోపల జయమల్లూ, కోయగోమాంగ్ కూడా గుహలో రేగిన నిప్పురవ్వలను గమనించారు.
“మనం సింహాన్ని బయటికి వచ్చేట్టు చేయాలి. అలా చేయగలిగామో దాన్ని చంపటం తేలిక. అలాకాక, మనం గుహలో ప్రవేశించటం ఏమంత క్షేమం కాదు.” అన్నాడు జయమల్లు.
జయమల్లు యిలా అంటూ వుండగానే, కోయగోమాంగ్ గుహముందున్న ఒక పెద్దరాయి తీసుకుని బలంగా గుహలోకి విసురుతూ, 'ఏ హెూయ్!' అంటూ బిగ్గరగా అరిచాడు. ఆ ధ్వని గుహలో మారుమోగింది. ఆ వెంటనే లోపల నిప్పు రవ్వలు చేటలతో చెరిగినట్టు లేచినై.
కేశవుడు చప్పున బాణం ఎక్కుపెట్టి సూటిగా గుహలోకి వదులుతూ, “సింహం మన మీదికి దూకేందుకు వస్తున్నది," అంటూ హెచ్చరించాడు. కాని, మరుక్షణం గుహను నిశ్శబ్దం ఆవరించింది. నిప్పురవ్వల కాంతి మాయమయింది.
“సింహం మనను చూసి బెదురుకుని పారిపోయింది. సందేహం లేదు." అన్నాడు కోయగోమాంగ్.
“ఇక మనం గుహలోకి జొరబడి దాన్ని వెంటబడి తరిమి వేటాడటమే మార్గం, ఏమంటావ్, జయమల్లూ?" అని ప్రశ్నించాడు కేశవుడు.
జయమల్లు గుహ లోపలికి రెండడుగులు వేసి ఆగి, “గుహావాసులు చెప్పినంత భయంకర జంతువేమీ కాదు, ఈ సింహం! పోతే తతిమ్మా సింహాల్లో లేని ప్రత్యేకత దీనికొకటి వుంది. అది, ముక్కుల్లో నుంచో, నోట్లో నుంచో నిప్పురవ్వలు రాల్చటం. అది చూసే గుహావాసులు అంత భయపడిపోయారు. సరే, జాగ్రత్తగా నడవండి. మనం వదిలే మూడు విషబాణాల్లో ఏ ఒక్కటి తగిలినా సింహం చచ్చినదానికిందే లెక్క అంతేనా గోమాంగ్?” అన్నాడు.
“ఆ విషం సంగతి నాకు బాగా తెలుసు. నీ కెలాంటి సంశయం అక్కరే లేదు,” అన్నాడు కోయగోమాంగ్ నమ్మకంగా.
ముగ్గురూ గుహలోకి ప్రవేశించి ముందుకు నడవసాగారు. కొంతదూరం లోపలికి పోయేసరికి, వాళ్ళకు గుహ రెండు మూడు భాగాలుగా చీలిపోవటం కనిపించింది. అంతా వెలుగుగానే వున్నది. కాని, ఎక్కడా సింహం జాడలేదు.
“మళ్ళీ తిరిగి మనం గుహా కందరాల్లో పడ్డాం. ఏదారి ఎటు పోతుందో చెప్పలేం. సింహం, ఈ మార్గాల్లో దేనివెంట పారిపోయినట్టు?" అన్నాడు కేశవుడు.
కోయ గోమాంగ్ మోకాళ్ళ మీద పాకుతూ గుహ చీలికలైన ప్రదేశాన్ని జాగ్రత్తగా పరీక్షించి చూసి, “సింహం, యిదుగో, ఈ కుడివైపు సొరంగ మార్గాన పోయింది. యిక కదలండి," అంటూ బయలుదేరాడు.
జయమల్లు అతడి భుజం, పట్టుకుని ఆపుతూ, “గోమాంగ్, తొందరపడకు, నువ్వన్నట్టు సింహం ఆ మార్గానే పోయినా, అది ఏ మలుపో తిరిగి, వెనక్కు వచ్చి, మన మీద హఠాత్తుగా దూకవచ్చు. ఆ సంగతి ఆలోచించావా?" అన్నాడు. జయమల్లు యిలా అనగానే, గోమాంగ్ ఆశ్చర్యం కనబరుస్తూ, “అవును, జయమల్లూ, నువ్వన్నది నిజమే. మనలో ఒకళ్ళు వెన్ను కాస్తూ వెనక్కు నడవటం మంచిది. అప్పుడు సింహం మన మీద దొంగ దెబ్బ తీయలేదు." అన్నాడు.
జయమల్లూ, గోమాంగ్ ముందు నడుస్తూండగా, కేశవుడు వెనక్కు తిరిగి నడుస్తూ వాళ్ళను అనుసరించాడు. ఆ విధంగా వాళ్ళు గుహ మార్గాల వెంట కొంతదూరం నడిచే సరికి హఠాత్తుగా గోమాంగ్, చిన్నకేక వేసి, “చూడండి! ఇదిగో, మనిషి పుర్రె, బహుశా యిది బిడాలి ముఠా వాడైన భాగ్ మారాదయివుంటుంది. వాడే గదా శ్వానకర్ణి వాళ్ళ గద తీసుకుని ఈ గుహలోకి ప్రవేశించింది,” అన్నాడు.
జయమల్లు ఆగి, అంతదూరంలో వున్న పుర్రెను చేతికి తీసుకుని పరీక్షించి చూసి, “గోమాంగ్, నువ్వన్నట్టు యిది భాగ్ మారాదే కావచ్చు. ఆ రాతి గద కూడ యీ దాపులనే ఎక్కడో వుంటుంది,” అన్నాడు.
ముగ్గురూ సొరంగ మార్గంలో గద కోసం వెతకసాగారు. కేశవుడు వికటంగా నవ్వుతూ, ఒక మూల నుంచి దాదాపు నాలుగడుగుల పొడ వున్న ఒక రాతి ముక్కను, చివర గుండ్రంగా రాతి ముళ్ళతో వున్న దానిని పైకెత్తి, “ఇదేనా, అద్భుతశక్తులున్న శ్వానకర్ణి మూల పురుషుడి గద!" అన్నాడు.
జయమల్లు ఆ రాతి ముక్కను పరీక్షించి చూసి, “ఇది రాతి గద అనే దాంట్లో సందేహం ఏమీ లేదు. అద్భుత శక్తుల మాట ఆ గుహావాసులకే తెలియాలి! సరే, వచ్చిన పని అయింది. యిక బయటపడదామా?" అన్నాడు.
“సింహం మాటేమిటి?" అని అడిగాడు కేశవుడు.
“అవును, దాన్ని చంపుతామని మాట యిచ్చాంగదా, చంపకుండా ఎలా పోవటం.” అన్నాడు కోయగోమాంగ్.
జయమల్లు చిరునవ్వు నవ్వుతూ రాతిగదను కోయగోమాంగ్ చేతికిచ్చి, “మనం సింహాన్ని చంపుతామని ఎవరికీ వాగ్దానం చెయ్యలేదు. రాతి గదను శ్వానకర్ణికి తెచ్చి యిస్తామని చెప్పాం. ఆ పని పూర్తయింది. సింహం సంగతి మనకెందుకు? అది ఎంత భయంకర మృగమో కూడా మనకు తెలియదు. అనవసరంగా దుస్సాహసం చెయ్యటం వివేకం కాదు." అంటూ కేశవుడి కేసి తిరిగాడు.
జయమల్లు అన్నదానికి కేశవుడు ఏదో జవాబు చెప్పబోయేంతలో, కోయగోమాంగ్ ఎగిరి గంతేసి, “నిప్పులు కక్కే సింహం! బాణాలు ఎక్కు పెట్టండి,” అంటూ రాతి గదను పై కెత్తాడు.
సింహం హఠాత్తుగా ఒక మలుపు తిరిగి భయంకరంగా గర్జిస్తూ ముందుకు దూకింది. జయమల్లూ, కేశవుడూ బాణాలు ఎక్కుపెట్టే లోపల గోమాంగ్ తన చేతిలో వున్న రాతి గదతో, దాని తల మీద గట్టిగా ఒక దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బ తింటూనే సింహం చెంగున వెనుదిరిగి పరిగెత్తసాగింది. కేశవుడూ, జయమల్లూ వదిలిన బాణాలు దానికి తగలలేదు.
“దీనికి సింహమని ఎవరు పేరు పెట్టారో గాని, యిది సింహం కాదు; మా కోయ వాళ్ళు దీన్ని సింహలీక మంటారు. మా కొండ ప్రాంతాల కూడా యివి వున్నవి. దాని ముక్కు నుంచి వెలువడే రవ్వల్లో కాంతి వుంటుంది తప్పు; వేడిమి వుండదు,” అన్నాడు కోయగోమాంగ్.
“దాని మెడా మూతీ చూసిన వాడెవడూ అది అసలు సింహపు జాతి జంతువంటేనే నమ్మడు. పైగా, వట్టి పిరికి గొడ్డులా వున్నది. అయినా, ఈ వర్ణనంతా యిప్పుడెందుకు. ఎదురయింది గనక, దాని అంతు తేల్చుదాం,” అంటూ జయమల్లు ముందుకు పరిగెత్తాడు.
సింహం గుహ మార్గాన కొంత దూరం సూటిగా పరిగెత్తి, ఒక మలుపు తిరిగింది. జయమల్లు మలుపు సమీపిస్తూనే వేగం తగ్గించి, ముందుకు తొంగి చూసి పెద్దగా నవ్వుతూ, “ఇదేదో మన కోసం యిక్కడ పొంచి వుంటుందని భయపడ్డాను. కాని, అంతు లేకుండా పారిపోయింది. యిప్పుడేమిటి చేయటం?" అన్నాడు.
కేశవుడూ, కోయగోమాంగ్ లు జయమల్లును సమీపించి, ముందున్న సొరంగం కేసి చూశారు. గోమాంగ్ రాతి గదను రెండు చేతులతో పట్టుకుని పైకెత్తి అటూ యిటూ ఊపుతూ, “దీనిలో ఏదో అద్భుత శక్తి వున్నది. సందేహం లేదు. ఒక్కదెబ్బకే ఆ సింహలీకం ఎంత బెదిరి పోయిందో చూశారుగదా?" అన్నాడు.
“ఇక వెనక్కు తిరిగి పోవటమే మంచిదేమో.” అన్నాడు జయమల్లు.
“ఇంత శ్రమపడి వూరికే పోవటం ఎందుకు. ఆ సింహాన్ని చంపి దాని చర్మం వలుచుకుపోదాం," అన్నాడు కేశవుడు. ముగ్గురూ గుహ మార్గం వెంట నడవసాగారు. కాని ఎక్కడా సింహం జాడ లేదు. అది మారే గుహా మార్గంలోనో దాక్కుని వుంటుందని వాళ్ళు భావించారు. కాని, యిన్ని సొరంగపు బాటల్లో దాన్ని వెతికి చంపటం ఎలా?
జయమల్లు వెనక్కు తిరిగి నడవబోయిన వాడల్లా చప్పున ఆగి, “మనం వచ్చిన మార్గానే తిరిగి నీటి మడుగు దగ్గరకు వెళ్ళేందుకు, దారి మీకు గుర్తుందా? లోగడ మనం గుహా కందకాల్లో దారి తప్పినట్టే, మళ్ళీ దారి తప్పంగదా!" అన్నాడు.
ఆ ప్రశ్నతోగాని అందరికీ తాము చేసిన పొరపాటు తెలిసి రాలేదు. సింహాన్ని చంపాలన్న ఉత్సాహంలో ఎటుపోతున్నదీ గుర్తు పెట్టుకోకుండానే ముగ్గురూ సొరంగ మార్గాల వెంట పరిగెత్తారు. ఇప్పుడు ఏ మార్గాన వెళితే, తాము గుహావాసులుండే ప్రాంతాలకు చేరగలరో వాళ్ళకు అర్ధం కాలేదు.
“మనం తొందరపడి ఏదో ఒక సొరంగమార్గాన్ని పట్టి, దారి తెలియక తరవాత గందరగోళ పడటం మంచిది కాదు. ముందుగా మనం నీటి మడుగుకు ఎంత దూరంలో వున్నామో గ్రహించగలిగితే బావుంటుంది.” అన్నాడు జయమల్లు.
“ఆ సంగతి గ్రహించటం ఎలా?" అన్నాడు కేశవుడు.
జయమల్లు జవాబు చెప్పబోయేంతలో, కోయగోమాంగ్ అక్కడ ఎగుడుదిగుడుగా వున్న రాళ్ళ మీంచి పైకి పాకి, ఒక కంతలో నుంచి తల దూర్చి బయటికి తొంగి చూస్తూనే, “హాఁ తల్లీ, కోనలమ్మా!” అంటూ మూలిగి, కాసేపు ఆశ్చర్యంగా తలపంకించి, చప్పున కిందికి దూకాడు.
“ఏమిటంత ఆశ్చర్యపడ్డావ్? ఏం కనబడింది?" అని జయమల్లు, గోమాంగ్ ను ప్రశ్నించాడు. గోమాంగ్ మెల్లిగా మాట్లాడమన్నట్టు అందరికీ సౌంజ్ఞ చేసి, "మనం తిరిగి ప్రమాదాల్లో తల దూర్చాం. గుహాకందరాల్లో పడి మనం రెక్కల మనుషులుండే ప్రాంతం చేరటమేగాక, బ్రహ్మదండి మాంత్రికుడిక్కూడా చేరువఅయ్యాం ," అన్నాడు.
బ్రహ్మదండి మాంత్రికుడి పేరు వింటూనే కేశవుడికీ, జయమల్లుకూ కలిగిన ఆశ్చర్యం అంతా యింతా కాదు. వాళ్ళిద్దరూ, గోమాంగ్ ఎక్కి చూసిన కంత దగ్గిరకు పోతున్నంతలో, గోమాంగ్ వాళ్ళను హెచ్చరిస్తూ, “మీరు తొందరపడి ఏదన్నా చేసి, మనం వున్న ప్రాంతం వాళ్ళకు తెలిసేలా చేయకండి. రెక్కల మనుషులు బ్రహ్మదండి మాంత్రికుడి ముందు వ్యాయామ ప్రదర్శనలు చేస్తున్నట్టున్నది." అన్నాడు.
కేశవుడూ, జయమల్లూ నిశ్శబ్దంగా పైకి పాకి కంతలో నుంచి బయిటికి తొంగి చూశారు. ఎదురుగా ఒక పెద్ద మైదానం, పెద్ద పెద్ద వృక్షాలు, వాటి మీది నుంచి అనేక మంది రెక్కల మనుషులు పక్షుల్లా ఎగిరి కిందికి దూకుతున్నారు. అక్కడ వున్న ఒక ఎత్తయిన రాతి ఆసనం మీద బ్రహ్మదండి మాంత్రికుడు కూచుని వుండి, చేతిలో గల మంత్రదండాన్ని అటూ యిటూ ఊపుతున్నాడు.
“ఈసారి వీణ్ణి ప్రాణాలతో పోనివ్వకూడదు, చిత్రవధ చేయాలిసిందే,” అన్నాడు కేశవుడు రోషంగా.
జయమల్లు తల వూపి ఏమో చెప్పబోయేంతలో, రెక్కల మనుషులు ఒక్కసారిగా హాహాకారాలు చేసి, చెల్లా చెదరుగా పారిపోసాగారు. బ్రహ్మదండి ఎగిరి రాతిమీద నిలబడి మంత్రదండాన్ని గాలిలో ఊపుతూ, “ఆం హుం ఫట్ ఫట్... కాలభైరవా..." అంటూ కేకలు ప్రారంభించాడు. నిప్పులు కక్కే సింహం పారిపోతున్న రెక్కల మనుషుల కేసి వేగంగా పరిగెత్తుతున్నది.
ఇంకా వుంది...
Post a Comment