రాకాసిలోయ (చందమామ)_25 RakasiLoya Janapada Novel by Dasari Subramanyam (CHANDAMAMA)

 RakasiLoya 1-35 Janapada Novel by Dasari Subramanyam (CHANDAMAMA)

రాకాసిలోయ (చందమామ)_25

 _దాసరి సుబ్రహ్మణ్యం

రాకాసిలోయ_25

    తమ నాయకుణ్ణి పిలుచుకు వచ్చేందుకు బయలుదేరిన బిడాలి అనుచరుడికి, దారిలో బిడాలి మరి పదిమంది తన ముఠా వాళ్ళతో ఎదురయ్యాడు. వాళ్ళందరి దగ్గరా రకరకాల ఆయుధాలున్నాయి. అందరూ చెట్ల చాటున పొంచి నడుస్తూ ముందుకు వస్తున్నారు. బిడాలి తన అనుచరుణ్ణి చూసి, “ఎందుకలా పరిగెత్తుతున్నావు? ఏం జరిగింది?” అని ఆదుర్దాగా ప్రశ్నించాడు.


    బిడాలి అనుచరుడు, తను కేశవుడూ వాళ్ళచేత ఎలా రక్షించబడ్డాడో, రెక్కల మనుషులు ఏ విధంగా వాళ్ళ బాణాల దెబ్బకు అందకుండా పారిపోయారో, చెప్పబోయే సరికి, బిడాలి అతణ్ణి వారిస్తూ, “ఆ సంగతంతా, నీ వెంట వున్నవాడు వచ్చి చెప్పాడు. నేనడిగేది; మిమ్మల్ని ఆ శ్వానకర్ణి దుర్మార్గుడి ముఠావాళ్ళు చుట్టు ముట్టిం తరవాత జరిగిందేమిటని," అన్నాడు. బిడాలి అనుచరుడు శ్వానకర్ణి ముఠా నివశించే కొండ గుహ దగ్గిర జరిగిన సంభాషణా, జయమల్లు చేసిన వాగ్దానం సంగతి చెప్పి, “వాళ్ల మూలపురుషుడి రాతి గద తెచ్చి యిస్తే, తను మనతో శత్రుత్వం మానుకుంటానని శ్వానకర్ణి చెప్పాడు. జయమల్లు ఆ రాతి గద తెమ్మని నీకు చెప్పవలసిందిగా నన్ను పంపాడు,” అన్నాడు.


    రాతి గద పేరు వింటూనే బిడాలి గతుక్కుమని, తన అనుచరులకేసి కళ్ళెర్ర చేస్తూ చూశాడు. వాళ్ళంతా తలలు వంచుకున్నారు. బిడాలి వచ్చే కోపాన్ని ఆపుకుంటూ, "నేను ముందే చెప్పాను. కాని, మీలో ఏ ఒక్కరికి బుద్ధి జ్ఞానం వున్నట్టు లేదు. మీరంతా కలిసి, ఆ భాగ్ మారాను ప్రోత్సహించి, చేయించిన వెధవ పనితో ఎన్ని చిక్కులు వచ్చినయ్యో చూశారా? ఇప్పుడా రాతి గద ఎక్కడ వున్నదని వాళ్ళకు చెప్పేట్టు?” అన్నాడు.


    “చాతనైతే, వాళ్ళ పూర్వీకుడి గదను ఆశ్వానకర్ణినే తెచ్చుకోమనండి. ఆ రాతి ముక్క కోసం ఎంతో ధైర్యశాలి, బలశాలీ అయిన మనవాడొకడు చచ్చాడు." అన్నాడు బిడాలి అనుచరుల్లో ఒకడు.


    బిడాలి కోపాన్ని ఆపుకోలేక చేతిలో వున్న ఈటెను బలంగా ఒకసారి నేలకు తాటించి, “వాడి కెంత ధైర్యం బలం వుంటే మాత్రం, నిప్పులు కక్కే సింహాన్ని చంపగలడా? ఆ ప్రయత్నంలో వాడూ చచ్చాడు, గదా పోయింది," అంటూ ఒక్క క్షణకాలం ఆలోచించి, “ఇక నడవండి. జరిగిందేదో ఆ శ్వానకర్ణికే చెబుదాం,” అన్నాడు.


    “మనం పదిమంది కంటే ఎక్కువలేం. శత్రువు గుహకు ఎలా వెళ్ళటం? వాళ్ళు మన మీది కొస్తే, మనం ఏమయేట్టు?” అన్నాడొకడు బిడాలి కేసి చూస్తూ, “ఇదీ మీ ధైర్యం! ఇంత ప్రాణభయం వున్నవాళ్ళు, ఆ రాతి గద జోలికెందుకు పోయారు? సరే, అదంతా యిప్పుడు తవ్వి లాభం లేదు. శ్వానకర్ణి నుంచి మన కెలాంటి ప్రమాదం రాకుండా, ఆ కేశవుడూ, జయమల్లూ, గోమాంగ్ రక్షించగలరు. వాళ్ళచేతుల్లో వున్న కొత్తరకం ఆయుధాలు చూశారు గదా, వాటి దెబ్బకు తిరుగులేదు,” అన్నాడు బిడాలి.


    బిడాలి తన ముఠావాళ్ళతో కేశవుణ్ణి అతడి స్నేహితుల్నీ సమీపించేసరికి, అక్కడ వాళ్ళు శ్వానకర్ణితో మాట్లాడుతున్నారు. బిడాలి రావటం చూస్తూనే, శ్వానకర్ణి కోపంతో ముక్కపుటాలు ఎగరవేస్తూ, “చూశారా! వాళ్ళు ఆ రాతి గద తేవటం లేదు. వాళ్ళతో ఇంక రాజీమాట లేమిటి?" అన్నాడు కోపంగా.


    జయమల్లు, బిడాలి కేసి తిరిగి, “ఏం బిడాలీ! ఆ రాతి గద వెంట తెమ్మని నీ అనుచరుడితో కబురు చేశానే, ఎందుకని తేలేదు? శ్వానకర్ణితో శత్రుత్వం యింకా పొడిగించాలని వున్నదా?” అని అడిగాడు.


    “నా కెవరితోనూ శత్రుత్వం నెరపాలని లేదు. ఈ అరణ్యంలో ఏ ముఠావాళ్ళతోనూ నాకు విరోధం లేదు. కావాలని శ్వానకర్ణే నాతో విరోధం పెట్టుకున్నాడు. మా వాళ్ళు దొంగిలించారనే రాతి గద లాంటివి ఇరవై రాతి గదలు అతడి కివ్వగలను. సరా," అన్నాడు బిడాలి.


    “నాక్కావలసింది, మా మూలపురుషుడి రాతి గద. దానిలో ఎంతో మహత్తువున్నది. మీరు దొంగిలించుకుపోయిన దానికి బదులుగా వెయ్యి గద లిస్తామన్నా, నే నొప్పను." అన్నాడు శ్వానకర్ణి రౌద్రంగా.


    “ఆ మహత్తున్నమ్మే, మావాడు మడుగుపక్క గుహలో వున్న నిప్పులు కక్కే సింహాన్ని చంపేందుకు వెళ్ళి, హతమారిపోయాడు," అన్నాడు బిడాలి యీసడింపుగా.


    “అది సరే, గద ఎక్కడున్నది?” అని ప్రశ్నించాడు జయమల్లు.


    “గదా వాడూ కుడా అయిపూ అజా లేకుండా పోయారు. ఆ సింహం వున్న గుహలోకి వాడు ప్రవేశించటం చూసిన వాళ్ళున్నారు తప్ప, బయటికి రావటం చూసిన వాళ్ళు లేరు. అది వాణ్ణి చంపి తినేసి వుంటుంది,” అన్నాడు బిడాలి.


    “మోసం! నేను నమ్మను! " అంటూ శ్వానకర్ణి అరవటం ప్రారంభించాడు.


    జయమల్లు బిడాలిని దూరంగా తీసుకు పోయి, నిజం చెప్పవలసిందిగా కోరాడు. బిడాలి ప్రమాణాలు చేసి జరిగినదంతా చెప్పి, “ఆ భాగ్ మారా నా ముఠావాడయినా, ఆ గద దొంగిలించటం సంగతి నా కేమీ తెలియదు. నా ముఠాలోని కుర్ర కారు ప్రోద్బలంతో వాడా పని చేశాడు. తగిన శిక్ష అనుభవించాడు,” అన్నాడు.


    జయమల్లు, శ్వానకర్ణి దగ్గరకు వచ్చి, “శ్వానకర్ణీ , నువ్వు బిడాలి మాటలు నమ్మ వచ్చు. మీ మూలపురుషుడి గదలో అంత మహత్తు వున్నదనుకుంటే, దానిని మేము తెచ్చి పెట్టగలం. మీరూ మీరూ సఖ్యంగా వుండండి,” అన్నాడు.


    “బిడాలి మాటలు నమ్మటం అంటే, ఆ గద నిప్పులుకక్కే సింహం గుహలో వున్నదనుకోవాలి. సింహం మనిషిని తిన్నదేమో కాని, రాతి గదను కూడా తిన్నదనుకోవటం కుదరదుగదా? ఆ సింహం గుహలో ప్రవేశించి, ఆ గదను మీ రెలా తేగలరు?" అన్నాడు శ్వానకర్ణి  ఆశ్చర్యంగా.


    “మా శక్తి యింకా మీకు తెలియలేదన్న మాట. పదండి, ఆ సింహం వుండే మడుగూ, గుహా చూపండి,” అంటూ జయమల్లు ముందుకు రెండడుగులు వేశాడు. కేశవుడూ, కోయగోమాంగ్ అతడి వెనక బయలుదేరారు.


    బిడాలి శ్వానకర్ణి తమ తమ అనుచరులతో అరణ్యంలో కొంత దూరం నడిచి ఒక పెద్ద నీటి మడుగు దగ్గరకు వచ్చారు. ఆ నీటి మడుగుకు అవతలి ఒడ్డున ఒక ఎత్తయిన కొండ వున్నది. అందులో అనేక గుహలు - వున్నవి. మడుగునీరు, కొండ అంచువరకూ ఆనుకుని పొర్లిపొర్లి ప్రవహిస్తున్నది. ఒక పెద్ద నీటిపాయ ఏదో ఆ మడుగులోంచి, దూరంగా వున్న కొండల కేసి ప్రవహించటం జయమల్లు గమనించాడు.


    “అదుగో, ఆ కనిపించే పెద్ద గుహ సింహానికి నివాసస్థానం. అక్కడికి వెళ్ళి ప్రాణాలతో తిరిగి వచ్చినవాడెవడూ లేడు,” అన్నాడు బిడాలి. శ్వానకర్ణి అవునన్నట్టు తలాడించి జయమల్లు కేసి చూశాడు. జయమల్లు, కేశవుణ్ణీ, కోయగోమాంగ్ నూ కొంచెం దూరంగా తీసుకు వెళ్ళి, సాహసించి సింహం వున్న గుహలోకి ప్రవేశించి, దానిని చంపటమా, మానటమా అన్న సమస్య గురించి చర్చించాడు. ఇంత దూరం వచ్చింతరవాత, యిప్పుడు వెనక్కు తిరగటం తెలివైన పని కాదని కేశవుడూ, గోమాంగ్ కూడా సలహా యిచ్చారు. కాని, నిప్పులు కక్కే సింహం అంటున్నారే, దాన్ని తమ బాణం దెబ్బలతో చంపగలగటం సాధ్యమా అన్న అనుమానం వాళ్ళకు కలిగింది.


    “ఎంత బలమైన మృగాన్నయినా సరే, ఒక్క అంబు దెబ్బతో కదలా మెదలక పడేలా చేయగలిగిన విషం నా దగ్గిర వున్నది. ఆ విషం పూసిన బాణం తగిలితే, ఆ సింహం చాపచుట్టలా కింద పడి వూరుకుంటుంది. కాని, బాణం గురి తప్పితే మాత్రం మనకు చావు తప్పదు,” అన్నాడు గోమాంగ్.


    “మూడు బాణాలు గురి తప్పటం సాధ్యమా ?” అన్నాడు కేశవుడు.


    కాని, అది హఠాత్తుగా మన మీద ఏ రాళ్ళచాటునుంచో దూకితే, ఏంగాను?" అని ప్రశ్నించాడు గోమాంగ్.


    “ఆ ప్రమాదం రాకుండా, మనం తగు జాగ్రత్తలో వుందాం. అసలు ఆ సింహం ఆ గుహలో వున్నదో, మరెటయినా పోయిందో ముందు తెలునుకోగలిగితే బావుణ్ణు. అది నిశ్చయంగా గుహలో వున్నదని తెలిస్తే, అది మన మీద దొంగ చాటుదెబ్బ తీయకుండా జాగ్రత్త పడవచ్చు, అన్నాడు జయమల్లు.


    “సింహం గుహలో వున్నదీ లేనిదీ తెలుసుకోవటం, ఏమంత కష్టం కాదు. కొన్ని జంతువులను - ఏ మేకల్నో, దున్నపోతుల్నో ఆ గుహకేసి తోలితే, నిజం తెలిసిపోతుంది. వాటిని చూసి సింహం గుహ నుంచి బయటికి రావచ్చు. లేదా, జంతువులు అది వున్నట్టు వాసనపట్టి దూరంగా పారిపోవచ్చు,” అన్నాడు కోయ గోమాంగ్.


    ఈ ఉపాయం జయమల్లుకూ, కేశవుడికీ కూడా నచ్చింది. వాళ్ళు ఈ సంగతి చెప్పగానే, శ్వానకర్ణి తన ముఠావాళ్ళను పంపి, పది మేకలనూ, కొన్ని ఎనుబోతులనూ అక్కడికి తెప్పించాడు. తరవాత వాటినన్నిటినీ ఒకదానికొకటి తాళ్ళతో కట్టి, మడుగు కవతల వున్న కొండ గుహ కేసి తోలించాడు.


    జంతువులు నీటిలో ఈదుతూ సింహం వుండే గుహ కేసి మామూలుగానే వెళ్ళి, గుహ మరి కొంచెం దూరంలో వుందనగా, పెద్దగా బెదిరిపోయి, తాళ్ళు తెంచుకుని, అరుస్తూ చెల్లా చెదురుగా నీటి వాలున పడిపారిపోసాగినై.


    “సింహం గుహలోనే వున్నది, సందేహం లేదు. కాని, అది జంతువులను పట్టేందుకు గుహ నుంచి బయటికి ఎందుకు రాలేదో, తెలియకుండా వున్నది.” అన్నాడు బిడాలి.


    శ్వానకర్ణి వికటంగా నవ్వుతూ, “నీ ముఠావాళ్ళు దానికి మనిషి మాంసం రుచి ఎలా వుంటుందో చూపించారు. ఇక అది మనుషుల్ని తప్ప తినదు. చాతనైతే మీ వాడి నొకణ్ణి పంపు, గుహలో నుంచి బయటికి దూకుతుంది," అన్నాడు.


    శ్వానకర్ణి మాటలకు ఉగ్రుడైపోయి బిడాలి ఏదో అనబోయేంతలో, జయమల్లు అతణ్ణి సమాధానపరుస్తూ, “ఇప్పుడు మళ్ళీ మీరు తగూలాడకోకండి. సింహాన్ని చంపి, రాతిగద తెచ్చేపని మానెత్తిన వేసుకున్నాం. మీరు చేయవలసిందల్లా, మాకు ఒక తెప్ప కట్టివ్వటం," అన్నాడు.


    శ్వానకర్ణి ఆజ్ఞ యివ్వగానే అతడి అనుచరులు కొన్ని ఎండు కర్రలు తెచ్చి, వాటిని చెట్ల ఊడలతో గుదికట్టి మడుగులోకి తోశారు. ఈ లోపల కోయ గోమాంగ్, తను దాచి వుంచుకున్న విషాన్ని అన్ని బాణాల మొనలకూ రాసి, వాటిని బాగా ఎండ పెట్టాడు. ముగ్గురూ తెప్ప ఎక్కి అది తోసేందుకు అమర్చిన గడకర్రలను చేతికి తీసుకున్నారు.


    జయమల్లు, మడుగు ఒడ్డున నిలబడివున్న బిడాలినీ, శ్వానకర్ణినీ ఉద్దేశించి, “మీరు, యిక్కడ వున్నా సరే, లేక శాంతంగా ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయినా సరే, మాకు అభ్యంతరం లేదు. మేము ఒక గంటలో ఆ రాతిగద తీసుకుని వస్తాం," అన్నాడు.


    బిడాలిగాని, శ్వానకర్ణిగాని మాట్లాడలేదు. వాళ్ళిద్దరికీ జయమల్లూ అతడి అనుచరులు యిక తిరిగి రావటం అంటూ వుండదన్న భయం పట్టుకున్నది. అది గ్రహించిన జయమల్లు, “గంట ఎందుకు, పావుగంలోనే తిరిగి వస్తాం. రాతి గదను శ్వానకర్ణి కీ, నిప్పులుకక్కే సింహం చర్మాన్ని బిడాలికీ బహూకరిస్తాం." అన్నాడు పెద్దగా, తెప్ప క్రమంగా మడుగు దాటి సింహం వుండే గుహను సమీపించింది. “గుహలో ఏదో అలికిడైనట్టు నాకు అనుమానంగా వున్నది,” అన్నాడు కోయ గోమాంగ్.


    “అనుమానాలతో ఏం పని, మనం గుహలోకి వెళ్ళబోతున్నాం గదా," అంటూ కేశవుడు, తెప్ప ఒడ్డు తాకగానే ఎగిరి గంతేసి కిందికి దూకాడు. ముగ్గురూ నిశ్శబ్దంగా నడుస్తూ గుహను సమీపించి, లోపలికి తొంగిచూశారు. 

ఇంకా వుంది...

Post a Comment

Previous Post Next Post