రాకాసిలోయ (చందమామ)_24 RakasiLoya Janapada Novel by Dasari Subramanyam (CHANDAMAMA)

 RakasiLoya 1-35 Janapada Novel by Dasari Subramanyam (CHANDAMAMA)

రాకాసిలోయ (చందమామ)_24

 _దాసరి సుబ్రహ్మణ్యం

రాకాసిలోయ_24

    కేశవుడూ వాళ్ళు వదిలిన బాణాలు గురితప్పి జుయ్ఁ , మంటూ పెద్ద శబ్దం చేస్తూ పోయి బలంగా చెట్ల కొమ్మలను తాకినై. ఆ ధ్వని వింటూనే రెక్కల మనుషులు కిందికి దూకేవాళ్ళల్లా, గాలిలో ఆగి, “మోసం, నమ్మకద్రోహం!" అంటూ అరిచి, దూరంగా వున్న చెట్ల చాటుకు ఎగిరిపోయారు.


    “ఆ దుర్మార్గులు, మన బాణం వేటు నుంచి చాలా దూరం పారిపోయారు. ఇప్పుడేమిటి చేయటం?” అన్నాడు కేశవుడు. జయమల్లు పొదలచాటు నుంచి లేచి నిలబడుతూ, “వాళ్ళు ఎంతో దూరం ఎగిరిపోయి వుండరని, నా నమ్మకం. వెతుకుదాం, రండి!" అంటూ బయలుదేరాడు. అంతలో ప్రాణాపాయం నుంచి బయటపడిన గుహావాసు లిద్దరూ అక్కడికి పరిగెత్తుకుని వచ్చి, “అయ్యా, ఆ రెక్కల మనుషులు ఆకాశంలోకి ఎగిరి పోయారు. కాని, అంతకన్న దుర్మార్గులైన శ్వానకర్ణి ముఠావాళ్ళు మనకేసి వస్తున్నారు. మనం ప్రాణాలతో పారిపోలేం," అన్నారు.


    శ్వానకర్ణి అన్న పేరు వింటూనే జయమల్లు ఆశ్చర్యపడి, “ఎవడా శ్వానకర్ణి? పేరు వింతగా వుందే! వాడి ముఠావాళ్ళు మన మీదికి ఎటు నుంచి దాడి చేసేందుకు వస్తున్నారు?" అని అడిగాడు.

 

    గుహావాసులు జవాబు చెప్పేలోపలే, కోయగోమాంగ్ పక్కకు తిరిగి చూస్తూ, “అవిగో కాగడాలు! ఒక మందకు మంద మనకేసి వస్తున్నారు," అంటూ బాణం ఎక్కుపెట్టాడు. జయమల్లూ, కేశవుడూ అతడు చెప్పిన వైపుకు చూశారు. గుహావాసుల్లాగే వున్నచాలా మంది అడవి మనుషులు, ఈటెలు పట్టుకుని, కాగడాలు వూపుతూ నిశ్శబ్దంగా తమ కేసి రావటం వాళ్ళకు కనిపించింది.


    జయమల్లు బాణం ఎక్కుపెట్టి వాళ్ళ కేసి కొంత దూరం నడిచి ఆగి, “మీరెవరో మాకు తెలియదు. మీకూ మాకూ ఎలాంటి శత్రుత్వం లేదు. మీ దారిన మీరు పొండి. అలా చేయక పోయారో, మీకు మా చేతుల్లో చావు తప్పదు,” అన్నాడు. కేశవుడూ, కోయ గోమాంగ్ కూడా బాణాలు ఎక్కుపెట్టి, అతడి పక్కన నిలబడ్డారు. గుహావాసు లిద్దరూ వాళ్ళ వెనక దాక్కున్నారు.


    కాగడాల వెలుగులో ముందు నడుస్తున్న ఒక అడవి మనిషి, చేతిలోని ఈటెను పై కెత్తి, “మీకూ మాకూ శత్రుత్వం లేని మాట నిజం. మీ దారిన మీరు పొండి. మాక్కావలసిం దల్లా, మీ వెంట వున్న బిడాలి ముఠావాళ్ళు. వాళ్ళిద్దర్నీ మాకు ఒప్పగించండి," అన్నాడు.


    ఎవరీ బిడాలి? అన్న అనుమానం జయమల్లునూ, అతడి తోటి వాళ్ళనూ ఆశ్చర్యపరిచింది. శ్వానకర్ణి, బిడాలి - ఎవరు వీళ్ళు? ఎందుకు వీళ్ళ మధ్య శత్రుత్వం?


    “అయ్యా, బిడాలి మా నాయకుడు. ఇవ్వాళ ఉదయం వేళ ఆయన్ని మీకు చూశారు. మాలాగే ఈ శ్వానకర్ణి ముఠా వాళ్ళు కూడా కొండ గుహల్లో నివశించే జాతివాళ్ళే. అయినా, వాళ్ళకూ మాకూ బద్ధవైరం. వాళ్ళకు మమ్మల్ని ఒప్పచెప్పారో నిలువునా కోసి చంపేస్తారు,,” అన్నాడొక గుహావాసుడు, వణికిపోతూ.


    “జయమల్లూ! మనం వీళ్ళను రక్షిస్తామని మాటయిచ్చాం . ఏమైనా సరే, ఆ మాట నిలబెట్టుకోవలసిందే,” అన్నాడు కేశవుడు. కోయగోమాంగ్ తలాడించి, వింటి తాడు బలంగా లాగబోయాడు.


    జయమల్లు అతణ్ణి వారిస్తూ, 'కేశవా! మనం చేసిన వాగ్దానం నిలబెట్టుకోలేనంత పిరికిపందలం కాదు. కాని, పరిస్థితి చూశావా? మన విరోధులు నలభై యాభైమంది వరకూ వున్నారు. మనం వాళ్లందర్నీ చంపి పారిపోగలగటం సాధ్యమయేది కాదు," అన్నాడు.


    “అయితే, ఏమిటి నీ ఆలోచన?" అన్నాడు కేశవుడు అనుమానంగా.


    “రాజీ మాటలతో వాళ్ళను ముందుకు రాకుండా ఆపుదాం. అలా సాధ్యం కాకపోతే, అన్నిటికీ తెగించి పోరాటం చేద్దాం," అంటూ జయమల్లు ముందుకు రెండడుగులు వేసి, “ఇప్పుడు మాట్లాడింది శ్వానకర్డీయేనా? అలా అయితే, ఈటె అవతల పారేసి, ఒక్కడూ ముందుకు రాకోరతాను. ఇదుగో, నా విల్లంబులు వదిలేశాను,” అంటూ తన విల్లంబులను కింద పడవేశాడు.


    “శ్వానకర్ణి మా నాయకుడు. ఆయన గుహ దగ్గరే వున్నాడు. నేనాయన అనుచరుణ్ణి. కాలయాపనెందుకు? ఆ బిడాలి ముఠా వాళ్ళిద్దర్నీ వదిలి, మీ దారిన మీరు పొండి," అన్నాడు శ్వానకర్ణి అనుచరుడు.


    “అలా ఎన్నటికీ జరగదు. వాళ్ళిద్దర్నీ మీరు పట్టుకోవాలంటే, ముందు మాతో యుద్ధం చేయాలి. అందుకు తయారయారో, మీలో ఒక్కడూ బతకడు. మా బాణాల దెబ్బ మీకు తెలియదేమో? ఇంతకు ముందే యిద్దరు రెక్కల మనుషుల్ని చెట్ల మీంచి కింద పడేలా కొట్టాం,” అంటూ జయమల్లు బాణం ఎక్కుపెట్టాడు.


    ముగ్గురూ విల్లంబులతో ముందుకు నాలుగడుగులు వేసేసరికి, శ్వానకర్ణి అనుచరుడు వెనుదిరిగి, తన ముఠా వాళ్ళతో ఏదో అన్నాడు. వెంటనే అందరూ అతడి చుట్టూ గుంపుగా చేరి గడబిడగా మాట్లాడుకోసాగారు.


    “కేశవా! ఆ గొడవ చూశావా? మన మీద దాడి చెయ్యటమా? మానటమా? అన్న సమస్య తేలక వాళ్ళల్లో వాళ్ళే తన్నుకునేట్టున్నారు. ఇదే మంచి అదను. ఒక పాచిక వేసి చూస్తాను,” అంటూ జయమల్లు అడవి మనుషుల కేసి తిరిగి, “మీలో చావదలుచుకున్న వాళ్ళంతా ముందుకు రండి, తతిమ్మా వాళ్ళు వెనక్కు తిరిగి పొండి. మీ నాయకుడు శ్వానకర్ణి యీ సమయంలో యిక్కడ వుంటే, మాతో స్నేహానికి తప్పక ప్రయత్నించేవాడు. మీరు వట్టి మందమతుల్లా వున్నారు,” అన్నాడు.


    జయమల్లు యిలా అనగానే, శ్వానకర్ణి అనుచరుణ్ణని చెప్పుకున్నవాడు తోటివాళ్ళను పెద్దగా కసురుకుని, జయమల్లు కేసి రెండడుగులు నడిచి, “మీరు కావాలంటే మా నాయకుడితో స్వయంగా మాట్లాడవచ్చు. భయం లేకపోతే, మా వెంట రండి, ఆయన వుండే గుహకు తీసుకుపోతాం,” అన్నాడు.


    భయం అన్న మాట వింటూనే కేశవుడికి ఎక్కడలేని పౌరుషం వచ్చింది. వాడు వింటి తాడును గట్టిగా లాగి మోగిస్తూ, "మేము కావాలంటే మీ నాయకుడి దగ్గరకే కాదు, అతడి ముత్తాత దగ్గరికైనా వస్తాం, నడవండి,” అన్నాడు తీవ్రంగా.


    జయమల్లుకు, కేశవుడు అనాలోచితంగా మాట జారాడేమో అన్న భయం కలిగింది. కాని, యిప్పుడు అన్నమాట మీద నిలవక తప్పదు. మాట తప్పితే, తాము భయపడుతున్నా మనుకుని, ఆటవికులు ఒక్కుమ్మడిగా మీద పడవచ్చు.....


    జయమల్లు యిలా అలోచిస్తూనే వెనుదిరిగి, వెనక నిలబడి వున్న గుహావాసుల్లో ఒకడికి, అక్కణ్ణించి పారిపోయి, జరిగిన సంగతేమిటో తమ నాయకుడైన బిడాలికి చెప్పమన్నాడు. రెండవవాణ్ణి తమ వెంటే వుండమన్నాడు. అంతలో శ్వానకర్ణి అనుచరుడు పెద్దగా గొంతెత్తి, “మీరన్నదే బావుంది. మా వెంట రండి. మా నాయకుడితో మాట్లాడుదురు గాని. ఆయన మిమ్మల్ని మీ దారిన పొమ్మంటే పోవచ్చు. అనవసరంగా మీరూ మేమూ, ఆ బిడాలి ముఠా వెధవ లిద్దరి కోసం యిక్కడ చావటమెందుకు?" అన్నాడు.


    “సరే, మీరు ముందు నడవండి. మీ గుహలుండే చోటు చేరేవరకూ, మీకూ మాకూ యిప్పుడున్న దూరమే వుండాలి. ఏదైనా మోసం చేయచూస్తే, మీలో ఒక్కడు కూడా బతకడు." అన్నాడు జయమల్లు.


    ఆ తరవాత అంతా ముందుకు కదిలారు. ఒక అరగంట కాలం ప్రయాణం చేసి ఎత్తయిన కొండలు గల ఒకానొక ప్రాంతాన్ని చేరారు. అప్పటికి తూర్పు దిక్కు కొంచెం కొంచెమే తెల్లనవుతున్నది. ఆ వెలుగులో జయమల్లుకూ, అతడి అనుచరులకూ ఎగుడు దిగుడుగా వున్న కొండలూ, వాటి అంచులమీద నిలబడి వున్న గుహావాసులూ కనిపించారు.అందరూ ఆ ప్రదేశానికి చేరుతూ వుండగానే, పై నుంచి పెద్ద పెద్ద కొండరాళ్ళు దొర్లి, కేశవుడూ వాళ్ళకేసి రాసాగినై. అది చూస్తూనే ముందున్న శ్వానకర్ణి అనుచరులు కేకలు పెడుతూ కొండ మీదికి పరిగెత్తారు.


    ముందు నడుస్తున్న జయమల్లు ఆగి, “గోమాంగ్! అదిగో, ఆ కుడివైపున వున్న బండ మీద ఎలుగు చర్మం కప్పుకుని నిలబడి వున్నవాడే శ్వానకర్ణి అయివుంటాడు. వాడికి బాణం గురిచేసి పెట్టు. కాని, నేను వదలమనేవరకూ వదలవొద్దు," అని చెప్పి, ముందుకు రెండడుగులు వేసి, “శ్వానకర్రీ! మీరేదో నమ్మక ద్రోహం తలపెట్టినట్టున్నది. అలా అయితే ముందు చావనున్నది. నీవు! చూశావా? నీ గుండెలకు బాణం ఎక్కుపెట్టి వున్నది. పారి పోయేందుకు ప్రయత్నించావో, బాణం నీ గుండెలలో నుంచి దూసుకుపోతుంది," అని కఠినంగా హెచ్చరించాడు.


    జయమల్లు హెచ్చరిక పూర్తయే లోపలే శ్వానకర్ణి ముఠావాళ్ళు వాళ్ళ మీదికి కొండరాళ్ళు దొర్లించటం ఆపేశారు. అంతలో శ్వానకర్ణి అనుచరుడు, తమ నాయకుణ్ణి సమీపించి, జయములు వారు అంతలో శ్వానకర్ణి అనుచరడుు సమీపించి, జయమల్లూ వాళ్ళను చూపుతూ ఏమో చెప్పాడు. నాయకుడు అటూ యిటూ రెండు మూడుసార్లు తలాడించి, జయమల్లు కేసి తిరిగి పెద్ద గొంతుతో, “మీరు మా శత్రువులకు మిత్రులు, కనక - మాకు శత్రువులు. మీరు మా నుంచి ప్రాణాలతో పారిపోలేరు." అన్నాడు.


    ఆ మాటలు వింటూనే కేశవుడు విల్లుపై కెత్తి, “ఊఁ మల్లూ! యిక లాభం లేదు. ఆ శ్వానకర్ణినీ మరికొందర్నీ కొట్టి పారిపోదాం. బాణం ఎక్కుపెట్టు," అన్నాడు.


    జయమల్లు, కేశవుణ్ణి తొందర పడవద్దని వారించి, "కేశవా! మనం ఈ ప్రాంతాలకు కొత్త వాళ్ళం. ఇక్కడ నివసించే అడవిజాతి వాళ్ళందరితో వైరం పెట్టుకుని ఎక్కడికి పారిపోగలం? మనం పుట్టి పెరిగిన రాజ్యం వదిలినది మొదలు దారి పొడుగునా ప్రతివాళ్ళతో విరోధం తప్ప, ఒక్కళ్ళతో కూడా మనకు స్నేహం కలవలేదు. పులి మీద పుట్రలాగా, బ్రహ్మదండి మాంత్రికుడు మనను వెన్నాడే వుంటున్నాడు. మనం ఈ గుహావాసులతో మైత్రి చేయగలిగితే, వీళ్ళ నుంచి రాకాసిలోయకు వెళ్ళే మార్గం తెలుసుకునే అవకాశం కలగవచ్చు. అంతే కాక, నీ తండ్రి ఒకవేళ ఈ ప్రాంతానికి వస్తే, అతడికి వీళ్ళు సహాయపడే వీలుకూడా వుంటుంది," అన్నాడు.


    తండ్రి పేరు వింటూనే కేశవుడు వెలవెల పోయి, విల్లంబులు దించుతూ, “కాని, వీళ్ళతో స్నేహం చేయటం ఎలా? వీళ్ళు పచ్చిమాంసం తినే ఆటవికులు!" అన్నాడు.


    “అదంతా నాకు వదిలెయ్యి. రెక్కల మనుషుల్నుంచి రాబోయే ప్రమాదం చూపి, ఆ బిడాలికి, ఈ శ్వానకర్ణికీ మైత్రి కలిగించేందుకు ప్రయత్నిస్తాను. వాళ్ళూ వీళ్ళూ కూడా కొండగుహల్లో నివసించే వాళ్ళేగదా," అంటూ జయమల్లు శ్వానకర్ణి కేసి తిరిగి, “శ్వానకర్ణి! మేం నీ బెదిరింపులకు భయపడే వాళ్ళం కాదు. బిడాలి ముఠావాళ్ళను రెక్కల మనుషుల నుంచి కాపాడతామని వాగ్దానం చేశాం. ఆ రెక్కల మనుషుల్ని పది పన్నెండు మందిని చంపాం కూడా. మీరూ మీరూ పోట్టాడుకుంటూ వుంటే, ఆ దుర్మార్గులు నీ ముఠావాళ్ళను కూడా ఏదో ఒక రోజున ఎత్తుకు పోవటం మొదలు పెడతారు. ఇంతకూ - నీకూ ఆ బిడాలికీ వైరకారణం ఏమిటి?" అని అడిగాడు.


    “వైర కారణమా? ఆ బిడాలి తండా వాళ్ళంతా నీచులు ఎక్కడా వుండరు. నేను గుహలో లేని సమయం చూసి, వాళ్ళు మా మూల పురుషుడి రాతి గద ఎత్తుకుపోయారు. అది ఎన్నో మహత్తర శక్తులు గలది. అది తిరిగి సంపాయించుకునేందుకు, వాళ్ళనందర్నీ సర్వనాశనం చేయబోతున్నాను," అన్నాడు శ్వానకర్ణి పళ్ళు కొరుకుతూ.

    “ఆ రాతి గద బిడాలి తెచ్చి నీ కిచ్చేస్తే, మీ మధ్య వైరం పోయినట్టేనా?” అని ప్రశ్నించాడు జయమల్లు.


    శ్వానకర్ణి హేళనగా నవ్వుతూ, “బిడాలి ఆ గద తెచ్చి నా కివ్వటమా? అదెలా సాధ్యం? ఆ గద కోసం వాడు ఎన్ని చావులైనా చస్తాడు; తన ముఠా వాళ్ళనందర్నీ చావనిస్తాడు,” అన్నాడు.


    “బిడాలి రహస్యం నాకు తెలుసు. మీ మూల పురుషుడి రాతి గద బిడాలి చేత తెప్పించి, నీ కిప్పిస్తాను," అంటూ జయమల్లు, వెనక నిలబడి వున్న బిడాలి ముఠావాడికేసి తిరిగి, “అంతా విన్నావు గదా? వెంటనే వెళ్ళి, మీ నాయకుణ్ణి రాతి గద తీసుకుని యిక్కడికి రమ్మన్నానని చెప్పు. అతడి కొచ్చిన ప్రాణభయం ఏమీ లేదు," అన్నాడు. బిడాలి అనుచరుడు వెంటనే బయలుదేరి వెళ్ళాడు.

ఇంకా వుంది...

Post a Comment

Previous Post Next Post