రాకాసిలోయ (చందమామ)_23 RakasiLoya Janapada Novel by Dasari Subramanyam (CHANDAMAMA)

 RakasiLoya 1-35 Janapada Novel by Dasari Subramanyam (CHANDAMAMA)

రాకాసిలోయ (చందమామ)_23

 _దాసరి సుబ్రహ్మణ్యం

రాకాసిలోయ_23

    కేశవుడు తను దాక్కున్న రాతి చాటు నుంచి మెల్లిగా పాకుతూ, జయమల్లూ, కోయగోమాంగ్ లు వున్న చోటుకు వెళ్ళి చిన్నగొంతుతో, “జయమల్లూ! మనం తిరిగి నరభక్షకుల వాతపడలేదు గదా?" అని ప్రశ్నించాడు.


    జయమల్లు అడ్డంగా తలాడిస్తూ, “వీళ్ళు నరభక్షకులై వుండరు. ఇంత నిశ్శబ్దంగా, మన కంటికి కనపడకుండా దాగివుండి, మన మీద దాడి చేస్తున్నారంటే, వీళ్ళెవరో మరొకజాతి మానవులు. నరభక్షకులైతే పెద్ద రణగొణధ్వని చేసేవాళ్ళు,” అన్నాడు.


    కేశవుడు మరేదో మాట్లాడబోయేంతలో రాళ్ళుపడటం ఆగిపోయింది. ఒకటి రెండు క్షణాల నిశ్శబ్దం తరవాత, జయమల్లు వున్నటు నుంచి మోకాళ్ళమీద లేచి, ముందుకు చూశాడు. అతడితోపాటు కేశవుడూ, కోయగోమాంగ్ లేవబోయేంతలో, చెట్ల చాటు నుంచి పెద్దకేక వినబడింది: “వాళ్ళ ముగ్గుర్నీ ప్రాణాలతో పట్టుకోండి. రెక్కల మనుషులకు యిద్దాం. మన జాతి వాళ్ళు ముగ్గురు బతికినా బతికినట్టే!”


    రెక్కల మనుషులు, మన జాతివాళ్ళు; అన్న మాటలు వింటూనే, జయమల్లు ఎగిరి లేచి నిలబడి, “ఇక అడవి లోపలికి పరిగెత్తుదాం రండి," అంటూ గుబురుగావున్న చెట్లకేసి పరిగెత్తసాగాడు. కేశవుడూ, కోయగోమాంగ్ అతణ్ణి అనుసరించబోయేంతలో, దుక్కలా వున్న ఒక అడవిజాతివాడు పెద్ద కర్రతో గోమాంగ్ మీదికి వచ్చాడు.


    గోమాంగ్ ఆ కర్రతోనే, వాణ్ణి మెడ మీద గట్టిగా పొడిచి ముందుకు పరిగెత్తాడు. కేశవుడు కూడా అతణ్ణి అనుసరించాడు.


    అడవిలోకి చాలా దూరం పరిగెత్తిన తరవాత ముగ్గురూ రొప్పుతూ రోస్తూ ఒక చెట్టు కింద కూచున్నారు. శత్రువులు తమను తరుముకురావడం లేదన్న నమ్మకం వాళ్ళకు కలిగింది. 'రెక్కల మనుషులు' అన్న మాట కోయగోమాంగ్ కు బెదురు పుట్టించింది. అతడు కేశవుడి కేసి భయంగా చూస్తూ, “కేశవా, ఆ అడవిజాతి వాళ్ళు అన్న మాటలు విన్నావు గదా? వాళ్ళకు రెక్కల మనుషులు తెలుసు!" అన్నాడు.


    అవును, రెక్కల మనుషులేమిటి? ఇదేదో వింతగా వున్నదే!” అన్నాడు కేశవుడు.


    “మీ యిద్దరూ అలాంటి వాళ్ళు వున్నారని ఎప్పుడూ వినలేదా?” అని ప్రశ్నించాడు కోయగోమాంగ్.


    కేశవుడూ, జయమల్లూ కూడా లేదన్నట్టు అడ్డంగా తలలు వూపారు. “పక్షుల్లా ఎగిరే, రెక్కల మనుషులనే వాళ్ళు వున్నారు. కాని, ఎక్కడ వున్నారో మాత్రం మా కోయవాళ్ళకు తెలియదు. వున్నట్లు మాత్రం విన్నాం. వాళ్ళు మహాక్రూరులు," అన్నాడు కోయగోమాంగ్.


    పక్షుల్లాగా ఎగిరే మనుషులు వుండటం అసంభవం. నేను నమ్మను," అన్నాడు జయమల్లు.


    “అయితే, ఆ అడవి మనుషులు వేసిన కేక అర్థం ఏమిటి?" అన్నాడు కేశవుడు.


    “ఏమో! నా కర్ణం కావటం లేదు,” అంటూ జయమల్లు లేవబోయేంతలో, “అయ్యో రెక్కలమనిషి, చచ్చాం !" అన్న పెద్ద ఆర్తనాదం వినబడింది.


    ఆ ఆర్తనాదం వింటూనే ముగ్గురూ అటుకేసి పరిగెత్తారు. ఒక ఆడవిమనిషి ప్రాణ భయంతో భయంతో వణికిపోతూ అరుస్తున్నాడు. అతడికి కొంచెం ముందుగా నడుస్తున్న మరొకణ్ణి, చెట్టుకొమ్మ మీది నుంచి దూకిన పక్షిలాంటి పెద్ద ఆకారం ఒకటి, అంత ఎత్తుకు లేపి, దూరంగా విసిరివేసింది.


    “రాకాసిపక్షి!" అంటూ కోయగోమాంగ్ కేక పెట్టాడు. అంతలో ముగ్గురూ కేకలు పెడుతున్న అడవిమనిషిని సమీపించి, “నీ స్నేహితుణ్ణి రక్షించే ప్రయత్నం ఏమీ చెయ్యక, అలా ఊరికే గగ్గోలుపడి పోతావేం!” అన్నారు.


    ఆ మాటలు వింటూనే అడవిమనిషి చప్పున వెనుదిరిగి చూసి, ప్రాణం తేరుకున్నవాడిలా ముఖం పెట్టి, “రెక్కలమనిషికి చిక్కినవాణ్ణి రక్షించటం ఎవరితరం అవుతుంది? పైగా, వాళ్ళు మా గుహవాసుల మీద పగబట్టి వున్నారు. వాళ్ళ దేవత కోసం బలికి పంపవలసిన యిద్దర్ని మేం పంపలేదు." అన్నాడు.


    జయమల్లు అందరికిన్న ముందుగా పరిగెత్తి, రెక్కల మనిషి విసిరివేసినవాణ్ణి సమీపించి, వాడిలో ఏమైనా ప్రాణం వుందో లేదో అని పరీక్షించి చూశాడు. కాని, వాడప్పటికే మరణించాడు.


    “వీడు సగం భయంతో గుండెలాగి చచ్చాడని నా అనుమానం. అంత ఎత్తు నుంచి మనిషి పడితే, ఏ కాళ్ళు చేతులో విరగొచ్చు కాని, చావు యింత తొందరగా రాదు," అన్నాడు జయమల్లు.


    “ఇంతకూ ఆ రెక్కలమనిషెక్కడ?" అంటూ కేశవుడు చెట్టు కొమ్మల్లోకి చూశాడు. “వాడెంకెక్కడుంటాడు? ఆకాశంలోకి ఎగిరిపోయాడు,” అన్నాడు అడవిమనిషి.


    జయమల్లు ఆలోచనలో పడ్డాడు. అడవి మనిషిని చంపినవాడు రెక్కలమనిషి అనేందుకు సందేహం లేదు. పొడవైన పెద్దరెక్కలూ, మామూలు మనిషికి వున్నట్టు కాళ్ళూ చేతులూ వాడికి వున్నవి. వాడు నిజంగానే ఆకాశంలోకి ఎగిరిపోగలడా? మనిషైనవాడికి అదెలా సాధ్యం? లేక వాడు గొప్ప మంత్రవేత్తా?


    “ఆ ఎగిరేమనుషులు ఎందరుంటారు? ఎక్కడుంటారు?" అని ప్రశ్నించాడు జయమల్లు, అడవిమనిషిని. వాళ్ళు చాలామంది వున్నారనీ, కాని, సంఖ్య తెలియదనీ చెప్పి, వాడు జయమల్లుకు పడమటి దిక్కు చూపిస్తూ, "అదుగో, ఆ కొండల వెనక ఎక్కడో వాళ్ళుండే ప్రదేశం వున్నది. అక్కడకు వెళ్ళి ప్రాణాలతో తిరిగివచ్చిన వాళ్ళెవరూ లేరు,” అన్నాడు.


    ఆ మాటలు వింటూనే జయమల్లు, కేశవుడి కేసి తిరిగి, “కేశవా! ఇందులో ఏదో మోసం వున్నది. ఎగిరేమనిషంటూ ఎవడో ఒకడు...ఏ మంత్రశక్తివల్లనో, మరే అద్భుతసాధన వల్లనో వుండవచ్చుగాని - వందల వేల సంఖ్యలో అలాంటి వాళ్ళు వుండేందుకు అవకాశం లేదు. ఈ రహస్యం ఏమిటో తెలుసుకోవాలి,” అన్నాడు.


    అలాగే చేద్దాం. ఆ ఎగిరేశక్తి ఎలా వస్తుందో గ్రహిస్తే, మనం దారి పొడుగునా ఈ ప్రమాదాలకు గురికాకుండా, సూటిగా ఎగిరిపోయి రాకాసిలోయలో వాలవచ్చు." అన్నాడు కేశవుడు.


    హఠాత్తుగా వాళ్ళు నిలబడి వున్న చోటుకు అన్ని వైపుల నుంచి పెద్ద కలకలం బయలు దేరింది. కనుమూసి తెరిచేంతలో, నలభై యాభైమంది అడవిమనుషులు పెద్ద పెద్ద ఈటెలు ఊపుతూ వాళ్ళను చుట్టుముట్టి, అంత దూరాన్నుంచే, “లొంగిపొండి. పారిపోయేందుకు ప్రయత్నించారో, చంపుతాం!" అంటూ కేకలు పెట్టారు.


    కేశవుడు చప్పున తమపక్కన నిలబడి వున్న అడవిమనిషి ముందుకులాగి, అతడి వెనక బాణం ఎక్కుపెట్టి నిలబడ్డాడు.


    జయమల్లూ, కోయగోమాంగ్ కూడా చెరొక వైపుకూ తిరిగి అడవిమనుషుల కేసి బాణాలు గురిపెట్టారు. జయమల్లు కంచు కంఠంతో, "మేం ప్రాణాలతో మీకు దొరకటం కల్ల. మేం చచ్చే ముందు మీలో సగం మందిని చంపుతాం. మీతో మాకు శత్రుత్వం లేదు. మా దారిన మమ్ముల్ని పోనివ్వండి," అని కేక పెట్టాడు. కేశవుడి ముందు నిలబడి వున్న అడవి మనిషి, తన జాతివాళ్ళ కేసి చేయి వూపుతూ, “వీళ్ళకేమీ హాని చెయ్యకండి. రెక్కల మనిషి నుంచి నన్ను కాపాడారు," అని అరిచాడు.


    “కావాలంటే మీ గుహావాసులందర్నీ, రెక్కల మనుషుల నుంచి కాపాడగలం. మా బాణాలకు యీ లోకంలో తిరుగులేదు,” అన్నాడు కేశవుడు.


    అడవి మనుషులంతా ఒకళ్ళను చూసి మరొకళ్ళు ఈటెలు దించారు. వాళ్ళ నాయకుడైన వృద్ధుడు ఈటెను తల కిందులుగా పట్టుకుని ముందుకు వస్తూ, “నిజంగా మీరు మాకు రెక్కలమనుషుల నుంచి రక్షణ కల్పించగలరా? ఎంతో కాలంగా వాళ్ళ దేవతకు రోజున యిద్దరు చొప్పున మా జాతివాళ్ళను బలికి ఒప్ప చెపుతున్నాం," అన్నాడు.


    “మీకు రక్షణ యివ్వటమే కాదు, మొత్తం ఆ రెక్కల మానవజాతిని సర్వనాశనం చేస్తాం. మా మాట నమ్మండి,” అన్నాడు జయమల్లు.


    అడవిమనుషుల నాయకుడు, తన ఈటెను దూరంగా విసిరివేశాడు. అతడి అనుచరులంతా తమ ఈటెలను కూడా అదే ప్రదేశంలో ఒక గుట్టగా పడవేశారు. కేశవుడూ, అతడి స్నేహితులూ విల్లంబులు దించారు. అడవిమనుషుల నాయకుడు కేశవుణ్ణి సమీపించి, అతడి విల్లును పరీక్షించి చూస్తూ, “ఇలాంటి ఆయుధాలు వాడటం మాచేతకాదు. రెక్కల మనుషుల్లో కొందరు వీటిని ఉపయోగించటం చూసిన వాళ్ళున్నారు. మీరు నిజంగా వాళ్ళకు సమ ఉజ్జీలు. మాకు వాళ్ళ బెడద వదిలించండి. రోజుకు మా జాతి వాళ్ళిదర్ని పొట్టన పెట్టుకుంటున్నారు. మీకు మాచేతనైన సహాయం చేస్తాం," అన్నాడు.


    “మీకు రాకాసిలోయకు దారి తెలుసా?” అన్నాడు కోయగోమాంగ్.


    జయమల్లు కోపంగా అతణ్ణి వారించి, “ఆ సంగతులు మాట్లాడేందుకు యిది తగిన సమయం కాదు. సరే, రెక్కల మనుషులకు బలిగా రోజూ మీరు పంపే యిద్దర్నీ ఏ ప్రదేశంలో ఆ దుర్మార్గులకు ఒప్ప చెపుతారు?" అని అడిగాడు.


    అడివిమనుషుల నాయకుడు తల ఎత్తి చెట్ల చాటు నుంచి కొంచెంగా కనబడుతున్న ఒక కొండ శిఖరాన్ని చూపుతూ, “ఆ ప్రదేశం యిక్కడికి అరకోసు దూరంలో వుంటుంది. చీకటి పడగానే, మేము నిర్ణయించిన మా జాతి వాళ్ళిద్దరు అక్కడికి వెళతారు. వాళ్ళను ఆ రెక్కల మనుషులు ఎత్తుకు పోతారు,” అని చెప్పాడు.


    “ఆ దుష్టు లెంతమంది అక్కడికి వస్తారు? ఏవిధంగా మీరు బలికి పంపిన వాళ్ళిద్దర్నీ ఎత్తుకుపోతారు?" అని జయమల్లు అడిగాడు.

    “వాళ్ళెంతమంది వస్తారో, ఏ విధంగా ఎత్తుకుపోతారో చూసినవాళ్ళెవరూ లేరు. కాని, మా వాళ్ళను కాళ్ళతో పట్టుకుని వాళ్ళు ఆకాశంలోకి లేచి పోతారని వదంతిగా చెప్పుకుంటారు. అందులో వున్న నిజం ఎంతో నాకు తెలియదు,” అన్నాడు అడవి మనుషుల నాయకుడు.


    “అయితే, యిక మీరు వెళ్ళి ఆ బలికి పంపేవాళ్ళను పంపండి. మా ప్రయత్నంలో మేముంటాం. రేపు ఉదయానికల్లా, మీరు పంపిన వాళ్ళిద్దర్నీ వెంట పెట్టుకుని రావటమేగాక, ఆ దుర్మార్గుల అసలు రహస్యమేమిటో కూడా తెలుసుకువస్తాం. ఇంతకూ, మీరుండే గ్రామం ఎక్కడ?” అని అడిగాడు జయమల్లు.


    మేము కొండ గుహల్లో నివశిస్తాం. మేము అనాదిగా గుహావాసులం. మిమ్మల్ని కలుసుకునేందుకు రేపు సూర్యోదయానికల్లా యిక్కడి వస్తాం," అన్నాడు గుహా వాసుల నాయకుడు. తరవాత అతడు తన అనుచరులతో వెళ్ళిపోయాడు. కేశవుడూ వాళ్ళు, కొండ శిఖరం కేసి నడిచారు. దారిలో కోయగోమాంగ్ రెండు కుందేళ్ళను కొట్టి, వాటి కాల్చిన మాంసంలో తన స్నేహితులిద్దరికీ భాగం పెట్టాడు.


    ముగ్గురూ కొండ ప్రాంతానికి చేరేసరికి బాగా చీకటి పడిపోయింది. అంతలో చంద్రోదయమయింది. ఆ వెలుగులో చెట్ల నీడల కింద నడుస్తున్న వాళ్ళకు, కొంచెం ఎడంలో ఏదో అలికిడి అయిన ధ్వని వినబడింది. ముగ్గురూ పొదలచాటుకు వెళ్ళి నక్కి కూచున్నారు. అల్లంత దూరంలో, ఒక పెద్ద వృక్షం కింద యిద్దరు నిలబడి వున్నారు. వాళ్ళలో ఒకడు రెండవ వాడికి ఏదో హెచ్చరిక చేశాడు. ఆ వెంటనే యిద్దరూ చెట్టుబోదె పట్టుకుని పైకి పాక సాగారు.


    “చూశావా, వాళ్ళ రెక్కలు!" అన్నాడు కేశవుడు, మెల్లిగా జయమల్లుతో. జయమల్లు తల వూపాడు. అంతోల ఆ చెట్టు కేసి మరో యిద్దరు వస్తున్నారు. కోయ గోమాంగ్ వాళ్ళ కేసి పరీక్షగా చూసి, “వాళ్ళిద్దరూ గుహావాసులు. రెక్కల మనుషుల దేవతలకు బలి పశువులుగా పంపబడ్డవాళ్ళు,” అన్నాడు.


    “వాళ్ళను రక్షిస్తామని మనం మాట యిచ్చాం!" అన్నాడు కేశవుడు. జయమల్లు అవునంటూ తల వూపి బాణం ఎక్కుపెట్టి ముందుకు కదిలాడు. కేశవుడూ, గోమాంగ్ కూడా బాణాలు ఎక్కుపెట్టి ముందుకు నడిచారు.


    “నాకు ఆ దుర్మార్గుల తంత్రమేమిటో చాలావరకు తెలిసిపోయింది. వాళ్ళిద్దర్లో ఏ ఒకడూ ప్రాణాలతో పారిపోకూడదు. తెలిసిందా?" అన్నాడు జయమల్లు.


    “వాళ్ళు గుహా వాసుల్ని తన్నుకుని ఆకాశంలోకి ఎగరక ముందే, మనం కొట్టాలి. అలా కాకపోతే మన బాణం దెబ్బకు అందరు.” అన్నాడు కోయ గోమాంగ్.


    అంతలో “రాకానీ పక్షిమాతకూ, జై.” అన్న అరుపు మాను చిఠారు కొమ్మల్లో మారుమోగింది. ఆ వెంటనే రెండు నల్లని ఆకారాలు, రెక్కలు టపటప లాడిస్తూ, చెట్టుకింద నిలబడిన గుహా వాసుల మీదికి రాసాగినై. కేశవుడూ, జయమల్లూ, కోయగోమాంగ్ వింటి తాళ్ళను చెవివరకూ లాగి, జయ్ఁ మంటూ మూడు బాణాలను వాటి మీదికి వదిలారు. 

ఇంకా వుంది...

Post a Comment

Previous Post Next Post