RakasiLoya 1-35 Janapada Novel by Dasari Subramanyam (CHANDAMAMA)
రాకాసిలోయ (చందమామ)_22
రాకాసిలోయ_22
కేశవుడూ, జయమల్లూ గుహలో ఏర్పడిన కంత నుంచి బయటికి చూస్తూంటే, కోయ యువకుడు గుహలోని చీకటి కోణాలన్ని వెతకసాగాడు. అతడికి ఒక మూల కొన్ని విల్లంబులు కనిపించినై. అతడికి ఎక్కడ లేని ధైర్యం కలిగింది. ఒక విల్లు చేతికి తీసుకుని, దానికి తాడు తగిలించి, అంబుల పొదిని భుజాన వేసుకుని, వాడు కేశవుడూ, జయమల్లుల దగ్గరకు వెళ్ళాడు.
జయమల్లు కోయ యువకుడి కేసి ఆశ్చర్యంగా చూస్తూ, “గోమాంగ్! ఇవన్నీ ఎక్కడివి? బాణం ఎక్కుపెట్టుతున్నా వెందుకు? దానితో భయంకర మృగాన్ని చంపాలను కుంటున్నావా ?" అని అడిగాడు.
కోయగోమాంగ్ అవునన్నట్టు తలవూపి, బాణాన్ని వదలబోయేంతలో కేశవుడు చప్పున వెనుదిరిగి, అతడి చెయ్యి పట్టుకుని, “నువ్వు చెయ్యబోయేది చాలా ప్రమాదకరమైనపని. నీ బాణం దెబ్బకు ఆ రెంటిలో ఏదీ చావకపోగా, అవి రెండూ కలిసి మన మీదికి విరుచుకుపడినా పడవచ్చు. వాటి నెందుకు రెచ్చకొట్టటం? అసలు ఈ విల్లంబులు నీ వెక్కడ సంపాయించావ్?" అని ప్రశ్నించాడు.
కోయగోమాంగ్ గుహలోని ఒక చీకటి మూలకు చేయి చూపాడు. కేశవుడు అక్కడికి పరిగెత్తి, ఒక విల్లూ, కొన్ని అంబులూ చేతికి తీసుకుంటూ, “ఇవి యీ సమయంలో మనకెంతో అవసరం. కత్తులు తప్ప అన్నీ పోగొట్టుకున్నాం. ఇక గుహ నుంచి బయట పడదామా?" అన్నాడు.
“ఈ బాణాలూ యివీ బహుశా, ఇక్కడ వున్న రెండు కంకాళాల తాలూకువయి వుంటవి. వీళ్ళిద్దరూ యిక్కడికి ఎందుకు వచ్చినట్టు ? ఎలా మరణించినట్టు ?" అన్నాడు జయమల్లు.
“ఆ ప్రశ్నకు జవాబు కనుక్కునే లోపల మనం కూడా వాళ్ళతో చేరిపోవలసి రావచ్చు. ఆ తరువాత మన వెనక వచ్చిన వాళ్ళు, మన కంకాళాలను చూసి, యిలాంటి ప్రశ్నలే వేసుకుంటారు!” అన్నాడు కేశవుడు విసుగ్గా, జయమల్లు ఏదో చెప్పబోయేంతలో, గుహ వెనుక భాగం మీదికి, భయంకర మృగం, మహాసర్పం ఉప్పెనలా వచ్చి పడినై. వాటి తాకిడికి గుహ అంతా కంపించి పోయింది. కేశవుడూ, అతడి అనుచరులిద్దరూ గుహలో బోర్లాపడిపోయారు. గుహ మధ్య భాగం రెండుగా విచ్చిపోయి, ఫెళ ఫెళ మంటూ రాళ్ళూ, రప్పలూ అందులోకి దొర్లుకుపోయినై. కేశవుడూ, అతడి స్నేహితులు కూడా వాటి వెంట కింద అగాధంలోకి పడిపోయారు.
ముగ్గురికి దెబ్బలు తగిలినై. శరీరమంతా రాళ్ళ మధ్య పడటంతో గీరుకుపోయింది. కాని, వాళ్ళ కత్తులూ, విల్లంబులూ వాళ్ళతో పాటు కింది అగాధంలోకి పడిపోయినై. ముగ్గురూ ఒళ్ళు దులుపుకుంటూ లేచి నిలబడ్డారు. ఇంత ప్రమాదంలో చిక్కినా, ఏకాలో చెయ్యో విరగనందుకు, వాళ్ళు చాలా సంతోషించారు.
“మనం గొప్ప అదృష్టవంతులం !” అన్నాడు కేశవుడు.
“అందుకేం సందేహం! కాని, ఈ చీకటికోన లోంచి బయటపడటం ఎలా? అది యిప్పటి సమస్య!" అన్నాడు జయమల్లు.
కోయగోమాంగ్, అగాధం వెంట కొంచెం దూరం మోకాళ్ళ మీద పాకిపోయి, ఒక మలుపు తిరిగి, “కేశవా, జయా! మనకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. మనం కొండ పొట్టలోని గుహ కందరాల్లో చిక్కుకు పోయాం. కాని, ఎక్కడినుంచో కొంచెం వెలుగు వచ్చి పడుతున్నది. మనం సురక్షితంగా యిక్కణ్ణించి బయటపడొచ్చు." అన్నాడు, గోమాంగ్ మాటలు వింటూనే కేశవుడూ, జయమల్లూ ఆత్రంగా అతడున్న చోటుకు పరిగెత్తారు. వాళ్ళకూ అంత దూరాన వున్న సొరంగంలో కొద్దిపాటి వెలుగు కనిపించింది. కాని, అది ఎటునుంచి వస్తున్నదో మాత్రం అర్థం కాలేదు.
“సరే, యిక మనం బయలుదేరుదాం. యిక్కడ ఎటు చూసినా గుహా మార్గాలు కనిపిస్తున్నవి. దేని వెంట వెళితే, మనం బయలు ప్రదేశాన్ని చేరగలమో అర్థం కావటం లేదు,” అన్నాడు జయమల్లు.
కేశవుడు మౌనంగా ముందుండి దారి తీశాడు. అతడికి తన ముసలి తండ్రిని గురించిన దిగులుతోపాటు, యిప్పటి తన స్థితికూడా దిగులు పుట్టిస్తున్నది. బహుశా, యిక్కడ అడ్డదిడ్డంగా వున్న సొరంగ మార్గాల్లో చిక్కుకుని, తనూ, తన స్నేహితులిద్దరూ మరణించవచ్చని కూడా అతడు భావించాడు.
ముందు నడుస్తున్న కేశవుడికి కొంత దూరం పోయిన తరువాత, హఠాత్తుగా మార్గం రెండు మూడు వైపులకు చీలిపోవటం కనిపించింది. తను వాటిల్లో దేని వెంట వెళ్ళాలి ? అన్న ప్రశ్న అతడికి ఎదురయింది. అతడి తటపటాయింపు గ్రహించిన వాడిలా వెనకవున్న జయమల్లు, "కేశవా ! ఆలోచించేంద కేముంది? ముక్కుకు సూటిగా నడువు. ఈ కాస్త గుడ్డి వెలుగు వున్నంతవరకూ, మనం నిరాశ చెందనవసరం లేదు." అన్నాడు.
జయమల్లు మాట ముగించేలోపల, ఎడమవైపునున్న సొరంగ మార్గాన్నుంచి కీచుమన్న వికృత ధ్వని వినిపించింది. ఆ వెంటనే రెక్కలల్లాడినప్పుడయే తపతప మనే ధ్వనిలాటి శబ్దం వినబడింది. కేశవుడు చప్పున కత్తి దూసి మార్గం మలుపు తిరిగి నిశ్చేష్టుడయిపోయాడు. అతడి వెనకవున్న జయమల్లుకు కలిగిన ఆశ్చర్యం అంతా యింతా కాదు. కోయగోమాంగ్ 'దయ్యం' అంటూ కీచుమన్నాడు. జయమల్లు బిగ్గరగా నవ్వాడు. కేశవుడు తన అంబుల పొదికేసి చేయి పోనిచ్చాడు. గోమాంగ్, ఆ సరికే బాణం ఎక్కుపెట్టి వున్నాడు.
సొరంగ మార్గం పైన ఎగుడు దిగుడుగా వున్న రాళ్ళమీద నిలువెత్తునవున్న ఒక నల్లని ఆకారం తారట్లాడుతున్నది. ఆ గుడ్డి వెలుగులో కూడా ఆ ఆకారం నోటిపళ్ళు తళతళ మెరుస్తున్నవి.
“గోమాంగ్, అది దయ్యం కాదు, దయ్యపు గబ్బిలం! బాణం ఎక్కుపెట్టావు గదా, గురిగా దాని తలమీద తగిలేలా కొట్టు!" అన్నాడు జయమల్లు. అదే క్షణంలో గోమాంగ్ వదిలిన బాణం రివ్వుమంటూ వెళ్ళి, దయ్యపు గబ్బిలం తలను తాకింది. గబ్బిలం కీచు మంటూ అరిచి పల్లటీలు కొడుతూ కిందపడిపోయింది.
గోమాంగ్ ముందుకు వెళ్ళి గిరాగిలా కొట్టుకుంటున్న గబ్బిలాన్ని ఒక అంబుతో పొడిచి చూస్తూ, “అడవిలో పుట్టి అడవిలో పెరిగిన వాణ్ణయినా, ఇంత పెద్ద గబ్బిలాన్ని నే నెన్నడూ చూడలేదు.” అన్నాడు.
“ఆ మాట కొస్తే, నేనూ చూడలేదు. మనమేదో ఒక వింత ప్రపంచంలోకి వెళుతున్నామని నా అనుమానం,” అన్నాడు జయమల్లు.
“బహుశా, యిదే రాకాసిలోయకు వెళ్ళే మార్గమేమో!” అన్నాడు కేశవుడు.
“మీకేమైనా అరుపులు...... తోడేళ్ళ అరుపుల్లాంటివి, వినబడుతున్నావా?” అని ప్రశ్నించాడు. కోయగోమాంగ్.
కేశవుడూ, జయమల్లూ ఓ క్షణకాలం ఆగి, “అవును, ఏవో జంతువులు మొరుగుతున్న ధ్వని అస్పష్టంగా వినబడుతున్నది,” అన్నాడు ఆశ్చర్యంగా.
“అయితే యిక మనం బతికి బయటపడ్డట్టే. తోడేళ్ళున్నచోట, కావలసినంత వేట వుంటుంది. తినేందుకు కొల్లలు కొల్లలు!" అన్నాడు గోమాంగ్ ఉత్సాహంగా.
“ముందు మనం గజిబిజిగా వున్న, ఈ సొరంగమార్గాల నుంచి బయటపడ్డప్పుడు గదా, తిండి మాట,” అన్నాడు కేశవుడు.
“నావి పాము చెవులు! నన్ను దారి తీయనీయండి. సూటిగా ఆ తోడేళ్ల మందమధ్యకి తీసుకుపోతాను," అంటూ గోమాంగ్ చెవులు రిక్కించి తోడేళ్ళ అరుపులు ఏవైపు నుంచి వస్తున్నవో పసిగడుతూ మందు నడవసాగాడు. నాలుగైదు నిమిషాల కాలం సొరంగమార్గాల్లో నడిచిన తరవాత, వాళ్ళకు హఠాత్తుగా ఒకగుహ వైపు నుంచి కళ్ళు మిరుమిట్లు కొలిపే వెలుగు కనిపించింది. ముగ్గురూ ఉత్సాహంతో ఎగిరి గంతులేశారు. గుహ బయట చిన్న చిన్న పొదలూ, కొంచెందూరంలో పెద్ద పెద్ద చెట్లూ వాళ్ళ కంటబడినై. తోడేళ్ళ అరుపులు కూడా మరింత దగ్గిరగా వినిపించసాగినై.
కేశవుడూ, అతడి అనుచరులూ వెలుగు వస్తున్న గుహ ద్వారం నుంచి బయటికి వచ్చారు. గుహ ముందు ఒక పక్కగా సమతలంగా వున్న ప్రదేశంలో, పదీపన్నెండు జింకలూ, కొన్ని లేళ్ళూ మందగా నిలబడి వున్నవి. వాటి చుట్టూ గుండ్రంగా తిరుగుతూ నాలుగు తోడేళ్ళు పెద్దగా అరుస్తున్నవి. తమను సమీపించవచ్చే తోడేళ్లను, మెలితిరిగిన కొమ్ములు గల జింకలు కొన్ని తలలు వంచి పొడిచేందుకు ప్రయత్నిస్తున్నవి. "తోడళ్ళను ఎదిరించే జింకలను, నేనెక్కడా చూడలేదు,” అన్నాడు జయమల్లు.
“అది నీ దురదృష్టం. ప్రాణరక్షణకు, తోడేలును చంపిన కొండ గొర్రెను నేను చూశాను," అన్నాడు కోయగోమాంగ్. వాళ్ళీ విధంగా మాట్లాడుకునేంతలో తోడేళ్ళ దృష్టి వాళ్ళమీద పడింది. అవి చప్పున జింకల చుట్టూ తిరిగేవల్లా ఆగి, కోరలు చాస్తూ, ఆ ముగ్గిరికేసి రాసాగినై. కేశవుడు బాణం ఎక్కుపెట్టి ఒక తోడేలును కొట్టాడు. బాణం గుండెల్లో తగలగానే, తోడేలు పెద్ద పెట్టున అరిచి, ఎగిరి అంత దూరాన పడింది. మిగతా తోడేళ్ళు భయంకరంగా మొరుగుతూ కేశవుడు వాళ్ళున్న చోటుకు పరిగెత్తి రాసాగాయి. గోమాంగ్, జయమల్లు కూడా బాణాలు ఎక్కుపెట్టి వదిలారు. గోమాంగ్ దెబ్బకు మరొక తోడేలు కింద పడింది. తతిమ్మా తోడేళ్ళు రెండూ ఒక్క క్షణం నిలబడి, తరవాత పెద్దగా మొరిగి, బండరాళ్ళ మీచి నుంచి దూకుతూ అడడిలోకి పారిపోసాగినై.
కోయ గోమాంగ్ పెద్దగా నవ్వి, “అరె, జింకలూ, లేళ్ళూ ఎక్కడ?" అంటూ ఆశ్చర్యపడ్డాడు.
“నువు చూడలేదా? అని ఎప్పుడో పారిపోయినై. తోడేళ్ళ బారినుంచి తప్పుకుని, మన బారిన పడేందుకవేమీ తెలివితక్కువవి కాదు.” అన్నాడు కేశవుడు.
“నాకు చచ్చే ఆకలేస్తున్నది. దొరికితే ఒక లేడిని తినేయగలను," అన్నాడు గోమాంగ్.
“అందరికీ ఆకలిగానే వుంది. కాని, మనం మండూకుడూ, బ్రహ్మదండి అనుచరుల్నుంచి ప్రమాదం రాకుండా చూసుకోవాలి. వాళ్ళు మన కోసం కొండలూ, గుట్టలు గాలిస్తున్నారు," అన్నాడు జయమల్లు.
కోయ గోమాంగ్ చుట్టూ ఓ మారు కలయచూసి, “నన్నడిగితే, అసలిది నరభక్షకుల లంకే కాదంటాను. ఇక్కడి చెట్టూ చేమలూ, ఈ కొండ తీరూ అంతా భిన్నంగా వున్నది. ఏమంటావ్, కేశవా?” అన్నాడు.
కేశవుడు కూడా చుట్టూ పరీక్షగా చూసి, “మనం బహుశా, కొండగుహల్లో కందరాల్లో పడి, మరో లంకకో, దేశానికో చేరినా చేరి వుండవచ్చు. అయినా, మన జాగ్రత్తలో మనం వుండాలి,” అంటూ జయమల్లు కేసి తిరిగి, “మల్లూ, మా అయ్య నరభక్షకులకు దొరక్కుండా పారిపోయి వుంటాడంటావా?" అని ప్రశ్నించాడు.
“ఓc అందుకు సందేహమా? మీ అయ్యకన్న జిత్తులమారిని నేనెక్కడా చూడలేదు. చెట్ల మీద వుండి, అంతమంది నరభక్షకుల్ని ఎలా హడలకొట్టాడో చూశావు గదా? ఆ వెంట వున్న చిన్న గడేజంగ్ ధైర్యసాహసాల్లో సింహం అంటే నమ్ము,” అన్నాడు జయమల్లు.
జయమల్లు మాటలతో కేశవుడికి కాస్త ఉత్సాహం కలిగింది. అతడు అడవి కేసి చూస్తూ, “మనం ముందు ఏదైనా ఆహారం సంపాయించాలి. నాకు దాహం కూడా అవుతున్నది. ఈ దగ్గర్లో ఎక్కడో నీరుండక పోదు," అంటూ ముందుకు నడిచాడు.
ముగ్గురూ కొండ సమీపాన్నుంచి, నిశ్శబ్దంగా కదిలి అడవిలోకి నడవసాగారు. అప్పటికి సూర్యుడు కొంచెంగా పడమటి దిక్కుకు వాలాడు. ముగ్గుర్నీ ఆకలి బాధిస్తున్నది. చెట్లనేమైనా పళ్ళుగాని, తేనె తుట్టెలుగాని దొరుకుతవేమో అని గోమాంగ్ తల ఎత్తి పరీక్షగా చూస్తూ నడవసాగాడు. అట్లా నడుస్తున్న గోమాంగ్ హఠాత్తుగా ఒక కాలు భూమిలోకి గుచ్చుకుపోవటంతో పెద్దగా కేక పెట్టాడు. పక్కనే వున్న జయమల్లు అతడి జబ్బ పుచ్చుకుని వెనక్కు లాగాడు.
చూడటానికి సమతలంగా వున్న ఆ ప్రదేశంలో, ఏ కారణం వల్ల గోమాంగ్ ఊబిలో చిక్కుకున్న వాడిలా ముందుకు పడబోయాడో వాళ్ళకు అర్థం కాలేదు. కేశవుడు అక్కడ అడ్డదిడ్డంగా పడివున్న చెట్ల కొమ్మల్నీ, రెమ్మల్నీ తొలగించాడు. దిగువను వాళ్ళకు ఒక గొయ్యి కనిపించింది. అందులో నిలువునా పాతివున్న గసిక కర్రల మీద ఒక పులి కొన వూపరితో కొట్టుమిట్టాడుతున్నది.
“ఇది, మనుషుల కోసమో, జంతువుల కోసమో ఎవరో పెట్టిన మాటు. కాస్తలో ప్రమాదం తప్పుకున్నాం," అన్నాడు కేశవుడు. అదే సమయంలో అన్ని వైపులనుంచీ, రాళ్ళూ, కర్రలూ వాళ్ళమీదకు జడివానలా వచ్చి పడసాగినై. కేశవుడూ, అతడి అనుచరులూ విల్లంబులు పైకెత్తి, భూమి మీద బోర్లా పడుకుని, చుట్టూ కలయ చూడసాగారు. ఎక్కడా మనిషి జాడ లేదు.
ఇంకా వుంది...
Post a Comment