విఘ్నేశ్వరుడు (చందమామ)_14 Vignaeswarudu Novel (CHANDAMAMA)

 విఘ్నేశ్వరుడు (చందమామ) 

Vignaeswarudu Novel (CHANDAMAMA)

14. సత్యభామా పరిణయం


కృష్ణుడి ఆశ్చర్యానికి రుక్మిణి చిరునవ్వుతో, “ఔను, నాథా! ఈ రోజు నాలో ఆనందం పొంగి పొర్లుతున్నది. ఆ కన్య కామణికి మీ మీద ఎంత ఆశ! అమాంతంగా మిమ్మల్ని నిధిని దాచుకున్నట్లు తన గుప్పెట్లో ఉంచుకోవాలన్నంత మమత  నాకు కనిపించింది!” అన్నది.


“మరి, నీ సంగతి చెప్పలేదు!” అన్నాడు కృష్ణుడు.


“మీ లోపల ఒక అణువునై ఇమిడి ఉండిపోవడమే నాకు కావలసిందల్లా! మీరు ఎవరి గుప్పెట్లో ఉన్నా నేను మీలో నే ఉంటాను గదా!” అన్నది రుక్మిణి.


“రుక్మిణీ! ఎంతో గొప్ప భావాల్ని ఎంత సూక్ష్మాతి సూక్ష్మంగా నిర్వచించావు! అందుకే నిన్ను కోరి కోరి ఎత్తుకు వచ్చాను!” అన్నాడు కృష్ణుడు.


“నాకు నిజమని తోచింది చెబుతున్నాను. నా కంటే సత్యభామదే గొప్ప మమత, బలమైనది! ఆ మమతలో, అనంతమైన ప్రకృతిశక్తి అంతా ఉంది, స్వామీ! నాలో ఉన్నది. భక్తిప్రధానమైనది మాత్రమే!” అని చెబుతున్న రుక్మిణిని వారించి, కృష్ణుడు చిరునవ్వు చిందిస్తూ, “రుక్మిణీ, వేదాంతం మాట్లాడకు!” అన్నాడు.


కొద్ది దినాలు గడిచాయో లేదో, “కృష్ణుడు శమంతక మణిని అపహరించాడు!” అనే వార్త కార్చిచ్చులా అంతటా వ్యాపించింది. ఆ విధంగా అందరితో చెప్పి సత్రాజిత్తే మణిని పోగొట్టుకున్న దుఃఖంతో పిచ్చివాడై వీధి వీధులా తిరిగి అరుస్తూ  విశేష ప్రచారం చేశాడు.


తన మీద మోపబడ్డ అభాండానికి చింతించి ప్రయోజనం లేదని కృష్ణుడు  దిటవు తెచ్చుకొని, “విఘ్నేశ్వరా! ఇదంతా నీ లీల, తరువాత నీ దయ!” అని  ధ్యానించి, మణిని ఆ న్వేషించడానికి అరణ్యాల్లోకి వెళ్ళాడు.


జరిగినదేమంటే: సత్యభామను సత్రాజిత్తు వరుసకు తనకు మేనల్లుడైన శతధన్వుడనే రాజు కిచ్చి వివాహం చేసే నిర్ణయానికొచ్చి, తన తమ్ముడు ప్రసేనజిత్తును, శతధన్వుడితో మాటామంతీ చేసి రమ్మని పంపాడు. ప్రసేనుడు శ్యమంతక మణిని ధరించి అరణ్య మార్గంలో వెళ్తూండగా, ఒక సింహం మణి చేత ఆకర్షింపబడి అతణ్ణి చంపింది. ఆ సింహాన్ని జాంబవంతుడు చంపి, మణిని తీసుకుపోయి, తన కుమార్తె జాంబవతికి యిచ్చాడు.


మణిని ధరించి, వెళ్లిన తమ్ముడు తిరిగి రాకపోవడంతో, ఒకప్పుడు మణిని అడిగిన కారణంగా కృష్ణుడే తన తమ్ముణ్ణి సంహరించి మణిని అపహరించాడని సత్రాజిత్తు చాటాడు. సత్యభామను పెళ్లాడ్డానికి ఉవ్విళ్ళూరుతున్న శతధన్వుడు, జరాసంధుడు మొదలైన కృష్ణుడి శత్రువులైన రాజులు సత్రాజిత్తును బలపరిచి పగ తీర్చు కోడానికి సాయపడతామంటూ కబురు పెట్టారు.


మణిని ఆన్వేషిస్తూ వెళ్ళిన కృష్ణుడు, అరణ్యంలో ఒక చోట చచ్చిపడి ఉన్న ప్రసేనుడినీ, సింహాన్నీ, జాంబవంతుడి అడుగుజాడలనూ చూసి జాంబవంతుడి గుహకు వెళ్ళాడు.


గుహలో నవ యవ్వనవతి, సుందరి అయిన జాంబవతి మణిని బంతిలాగ ఎగరవేసి పట్టుకొంటూ ఆడుకొంటున్నది. జాంబవతి పసిపిల్లగా అరణ్యంలో జాంబవంతుడికి దొరికిన అనాధ రాజపుత్రిక . అతడామెను తన ముద్దుల కూతురుగా పెంచుకొచ్చాడు.


మణిని తీసుకొనడానికి కృష్ణుడు ఆమె చేతిని పట్టుకొన్నాడు. జాంబవతి చేతిని  విడిపించుకోవడానికి ప్రయత్నించకుండా తల వాల్చి సిగ్గుదొంతరలతో క్రీగంట  కృష్ణుణ్ణి చూస్తున్న సమయంలో జాంబవంతుడు గుహకు వచ్చి, కృష్ణుడిపై లంఘించాడు. ఇద్దరికీ పన్నెండు రోజులు  గొప్ప యుద్ధం జరిగింది. కృష్ణుడు పిడికిటితో జాంబవంతుడి గుండెమీద బలంగా  పొడిచాడు. ఆ పోటుతో రాముడే  కృష్ణుడుగా, అవతరించాడని జాంబవంతుడు గుర్తించాడు.


జాంబవంతుడు కృష్ణుడికి ప్రణమిల్లి, “కృష్ణా! జాంబవతి చేతిని పట్టనే పట్టావు, జాంబవతి నీదే!” అంటూ శ్యమంతకమణినీ, జాంబవతినీ కృష్ణుడికి సమర్పించాడు.


జాంబవతితో జాంబవంతుడు వెంటరాగా కృష్ణుడు మణితో ద్వారకకు వచ్చి, సత్రాజిత్తుకు మణిని అందజేశాడు. జాంబవంతుడు సత్రాజిత్తుకు జరిగినదంతా చెప్పాడు.


సత్రాజిత్తు పశ్చాత్తాపం పొంది కృష్ణుడితో, “కృష్ణా! సొమ్ము పోయినవాడు పాపాత్ముడు అనే విధంగా నేను మహాపరాధం చేశాను. నన్ను నీ యిష్ట మొచ్చినట్లు దండించు!” అన్నాడు.


కృష్ణుడు సత్రాజిత్తుతో, “నీ పశ్చాత్తాపమే నీకు దండన!” అన్నాడు.

అప్పుడు సత్రాజిత్తు తన అపచారానికి పరిహారంగా, మన్ననగా శ్యమంతక మణినీ, సత్యభామను కృష్ణుడి ఎదుట ఉంచి స్వీకరించమని వేడుకొన్నాడు.


కృష్ణుడు సత్యభామను స్వీకరిస్తూ, శమంతకమణిని సత్రాజిత్తునే ఉంచుకోమని తిరిగి యిచ్చివేశాడు. అప్పుడు సత్యభామ, కృష్ణుడు తనను స్వీకరించిన ఆనందం పొంగిపొర్లుతుండగా, “చుశావా, నాన్నా! నేను గొప్పదాన్నో, మణి గొప్పదో యిప్పుడు తెలిసిందా!” అన్నట్లు  సగర్వంగా సత్రాజిత్తును చూసి, “నాన్నా! ఒకప్పుడు విఘ్నేశ్వరుడి మహత్తును గుర్తించలేనివాడివై ఏమో అన్నావు. నేను విఘ్నేశ్వరుణే నమ్ముకొన్నదాన్ని. నా అభీష్టం నెరవేరింది!” అంటూ విఘ్నేశ్వరుణ్ణి ధ్యానించి చేతులెత్తి మొక్కింది.


అప్పుడు విఘ్నేశ్వరుడు ఆకాశంలో లీలగా కనిపించి, “భగవంతుడు తనకు అత్యంత ప్రియమైన సత్యానికి ఎల్లప్పుడూ వశవర్తిగా ఉంటాడు. సత్యమే అతని సొత్తు!” అనే అర్థం స్ఫురించేలాగ, “సత్యభామా పరిణయంతో కృష్ణుడు సత్యాపతిగా పేరు పడతాడు!” అని చెప్పాడు. - 


సత్రాజిత్తు భక్తితో విఘ్నేశ్వరుడికి మ్రొక్కి. “నా అపచారాన్ని మన్నించుదేవా!” అంటూ లెంపలు వేసుకొన్నాడు.


కృష్ణుడు, “విఘ్నేశా! అంతా నీ లీల, నీ దయవలన - అపవాదు తొలగించుకొని మణికంటే అమూల్యమయిన సత్యభామా మణిని సంపాదించాను!” అన్నాడు.


విఘ్నేశ్వరుడు, “శ్యమంతకమణి  కథ విన్న వారికి అపనిందలు అంటవు,” అని చెపుతూ అంతర్ధానమయ్యాడు.


సత్రాజిత్తు కృష్ణుడి కాళ్ళు కడిగి కన్యాదానం చేసే తన అదృష్టానికి పొంగిపోతూ, కృష్ణుడితో సత్యభామ వివాహాన్ని మహా వైభవోపేతంగా జరిపించాడు. తరువాత కృష్ణుడు జాంబవతిని వివాహం చేసుకొన్నాడు. జాంబవంతుడు కృష్ణుడితో, “కృష్ణా! నీవు రామావతారంలో ఉన్నప్పుడు నీతో యుద్ధం చేయాలని అభిలాషను వ్యక్తం చేశాను. నీ వంటి అల్లుడిని పొందిన జనక మహారాజు అదృష్టానికి అసూయ పడుతున్నానని కూడా అన్నాను. ఆ రెండు కోరికలూ యిప్పుడు తీర్చావు, నేను ధన్యుణ్ణి, జీవన్ముక్తుణ్ణి!” అని చెప్పి తపస్సు చేసి తరించడానికి అరణ్యాల్లోకి వెళ్ళిపోయాడు.


కొంతకాలం తరువాత శతధన్వుడు కసితో సత్రాజిత్తును చంపిమణిని తీసుకుని కృతవర్మ, అక్రూరులు తోడుగా పారిపోయాడు. కృష్ణుడు సత్యభామను ఓదార్చి శతధన్వుడిని యుద్ధంలో సంహకొరించాడు. అక్రూర కృతవర్మలు మణితో పారిపోయారు. వారిని వెదకిపట్టి కృష్ణుడు మణిని తీసుకొచ్చి, తండ్రి జ్ఞాపక చిహ్నంగా ఉంచుకోమని సత్యభామకు ఇచ్చాడు.


కృష్ణుడు మిత్రవింద, కాళింది, భద్ర, నాగ్నజితి, లక్షణ అనేవారిని కూడా వివాహం చేసుకొన్నాడు. ఎనమండుగురు భార్యలతో కృష్ణుడు భోగభాగ్యాలతో తులతూగుతూ ప్రతి ఏటా వినాయకచవితిని భక్తి శ్రద్ధలతో జరుపుతూ వచ్చాడు.


శ్యమంతక మణి ప్రభావం వల్ల సత్యభామ అంతఃపురం అంతులేని బంగారంతో నిండిపోయింది. ఆ బంగారంతో సత్యభామ రత్నరాసులనూ, ఆ మూల్యా భరణాలనూ. చీనిచీనాంబరాలనూ కోకొల్లలుగా తన ఇంట నింపుకొంది. అష్టమహిషులలో తానే ఐశ్వైర్యవంతురాలననే సంపద్గర్వంతోబాటు, తానే అధికురాలననీ, కృష్ణుడికి ఇష్ట భార్యననే అహంభావంక్రమక్రమంగా పెరిగింది.


కృష్ణుని అష్టమహిషులలో జాంబవతి గొప్ప వైణిక విద్వాంసురాలు. నారదుడు తన మహతివీణను వాయించుతూ గగన మార్గంలో పయనిస్తూండగా పరిహాసం చేస్తూన్నట్లుగా పకపకమంటూ నవ్వు వినిపించింది.


నారదుడు నివ్వెరపోయి, “ఎవరా నవ్వేది? ఎందుకు నవ్వుతున్నావు?” అంటూ నలుదెసలా చూశాడు.


“నారదా! యింకా నీవు చాలా నేర్చుకోవలసి ఉంది. నీ వీణావాదానికి నీవు నీలో పొంగిపోతూంటే నవ్వు వచ్చింది!” అని అశరీరవాణి పలికింది.


నారదుడు, “ఎవరి వద్ద యింకా నేర్చుకోవాలి?” అని అనుకుంటూండగా విఘ్నేశ్వరుడు సాక్షాత్కరించి, “జాంబవతి వద్ద వీణావాద్యంలోని మెళుకువలన్నీ క్షుణ్ణంగా తెలుసుకో!” అని చెప్పాడు.


ఆ విధంగా నారదుడు కృష్ణుడి అనుగ్రహంతో జాంబవతి వల్ల వీణావాదంలోని మెళుకువలన్నీ తెలుసుకున్నాడు.  ఒకనాడు కృష్ణుడు రుక్మిణి అంతఃపురంలో ఉండగా నారదుడు పారిజాత పుష్పాన్ని అతని కిచ్చాడు. కృష్ణుడు దాన్ని రుక్మిణి కిచ్చాడు. అది విని సత్యభామ అలిగింది. కృష్ణుడు సత్యభామను బుజ్జగించి ఆమెతో గరుడ వాహనంపై ఇంద్రుడి స్వర్గానికి వెళ్ళి, నందనవనంలోని పారిజాత వృక్షానికి వృక్షాన్నే తీసుకువచ్చి సత్యభామ ఇంటి పెరట్లో నాటాడు. అయినప్పటికీ కృష్ణుడికి తన పై గురి తగ్గిపోతూన్నదేమోననే దిగులు పట్టుకొన్నది సత్యభామకు. కృష్ణుడిని  తన చెప్పుచేతల్లో తన మందిరంలో ఉండి పోయేలాగ చేసుకోవాలన్న తాపత్రయం పెంచుకొన్నది.


నారదుడు ఒకనాడు సత్య ఇంటికి వచ్చి, పుణ్యకవ్రతం ఆచరిస్తే కృష్ణుడు ఆమె అధీనంలోనే ఉంటాడని చెప్పాడు. సత్యభామ వ్రత నియమం ప్రకారం కృష్ణుణ్ణి నారదుడికి దానం చేసింది. నారదుడు కృష్ణుని ఎత్తుకెత్తు బంగార మిచ్చి కొనుక్కోవచ్చునని అమ్మకానికి పెట్టాడు. సత్యభామ తన ఇంటనున్న అంతులేని బంగారాన్ని కృష్ణ తులాభారంలో పెట్టింది, శ్యమంతక మణిని కూడా వేసింది. కాని కృష్ణుడు కొంచెమైనా తూగలేదు. అప్పుడు సత్యభామ గర్వాన్ని విడిచి పెట్టి, రుక్మిణిని కృష్ణుణ్ణి విడిపించుకొనే మార్గం  చెప్పమని వేడింది.


రుక్మిణి, “చెల్లీ! కృష్ణుడితో సరితూగ  గల సంపద భక్తి ఒక్కటే! భక్తిపూర్వకంగా వేసిన ఒక్క తులసీదళం చాలును!” అని చెప్పి సత్యభామకు చిన్న తులసిఆకు యిచ్చింది.


సత్యభామ ఆ తులసీ దళాన్ని కన్నుల కద్దుకొని, భక్తిపూర్వకంగా తక్కెడలో వేసింది. కృష్ణుడు కూర్చున్న సిబ్బె పైకి లేచి సమానంగా తూగింది. అప్పుడు నారదుడు తులసి దళాన్ని మాత్రమే తీసుకొని కళ్ళకు అద్దుకొని, కృష్ణుణ్ణి సత్యభామ పరం చేసి వెళ్లిపోయాడు.


కృష్ణ తులాభారంతో సత్య భామకు జ్ఞానోదయం అయింది. ఐశ్వర్యంమీద, మణి మీద వ్యామోహం నశించి కృష్ణుడే తన పెన్నిధిగా భక్తిభావం కలిగింది.


మణివలన లభించిన బంగారాన్ని అంతటినీ కృష్ణుడు చెప్పినట్లుగా యాత్రికులకూ, బాటసారులకూ భోజన వసతి సౌకర్యాలు గల ధర్మశాలలనేకం, దేశమంతటా తండ్రి స్మృతి చిహ్నాలుగా కట్టించింది. ఆ ధర్మశాలలు సత్రాజిత్తు  పేరు స్ఫురించేలాగ సత్రములు అని పిలువబడ్డాయి.


అటు పిమ్మట కొంతకాలానికి కృష్ణ బలరాముల చెల్లెలైన సుభద్రకు అర్జునుడితో వివాహం జరిగినప్పుడు, సత్యభామ శ్యమంతక మణిని సుభద్రకు అరణంగా పెట్టింది. ఆ విధంగా మణి పాండవులను చేరింది.


మణి కూర్చిన బంగారం ధర్మరాజు రాజసూయ యాగం చేయడానికి బాగా ఉపయోగపడింది. తరువాత ధర్మరాజు జూదమాడి తనతో బాటు తమ్ములనూ, ద్రౌపదినీ, రాజ్యాన్ని ఓడిపోయాడు. రాజుసూయయాగం చూచి దుర్యోధనుడికి కన్ను కుట్టింది. ద్రౌపదిని పరాభవించాలనే దుశ్చింత రేపింది. పాండవుల పురోహితుడైన ధౌమ్యుడు తొలినుండి అనేక అనర్దాలకు కారణమవుతూ వచ్చిన శ్యమంతక మణిని విసర్జించమని చెప్పగా అర్జునుడు మణిని వింటికి సంధించి బలంగా భూమి కేసి కొట్టాడు. మణి భూగర్భంలో నిక్షిప్త పడిపోయింది.


పాండవులు జూదంలో కౌరవులకు ఓడి అరణ్యవాసం చేస్తూండగా, ఒకనాడు నారదుడు వారి వద్దకు వచ్చి, రాజ్య ప్రాప్తికి భక్తి శ్రద్ధలతో విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించి గణేశవ్రతాన్ని చేసి, తరవాత అజ్ఞాత వాసానికి వెళ్ళమని చెప్పాడు.

--(ఇంకా వుంది)

Post a Comment

Previous Post Next Post