విఘ్నేశ్వరుడు (చందమామ)
Vignaeswarudu Novel (CHANDAMAMA)
13. శమంతకమణి - వినాయకచవితి
కృష్ణుడిమాటలకు నవ్వి, మృదంగ కేసరి, “అలాగని తప్పించుకోబోతున్నావా? వీల్లేదు! నీ మురళీ గానం గొప్పదో, నా మృదంగ వాయిద్యం గొప్పదో, ఇప్పుడే తేలిపోవాలి!” అన్నాడు.
కృష్ణుడు గడగడలాడుతూ, ఊదడానికి మురళి తీశాడు. మృదంగకేసరి మఠం వేసి మద్దెల వాయించ మొదలు పెట్టాడు. కృష్ణుడు యమునాకళ్యాణి రాగాన్ని వాయిస్తూ మృదంగ కేసరిని తిక మక పెట్టి ఠక్కున హంసధ్వని రాగాన్ని అందుకొని అద్భుతంగా వాయిస్తూంటే, మృదంగ కేసరి పరవశించి మైమరిచి మద్దెల విడిచి నృత్యం చేయడం మొదలు పెట్టాడు.
కృష్ణుడు హంసధ్వని రాగాన్ని చిత్ర విచిత్ర గతులతో స్వరాలు మరింత దురితంలో పలికిస్తూంటే, మృదంగ కేసరి రూపు విడిచి విఘ్నేశ్వరుడు విఘ్నేశ్వరుడై తొండమెత్తి, బొజ్జ ఊపుకొంటూ తాండవం చేశాడు. మద్దెల మాయమై ఎలుక గంతులు వేసింది.
విఘ్నేశ్వరుడు తనకు ప్రియతమమైన హంసధ్వని రాగానికి పులకరించిపోతూ, తాండవం చేస్తూ అలసిపోతూంటే కృష్ణుడు ఠక్కున మురళి వాయించటం ఆపి, విఘ్నేశ్వరుడు పడిపోకుండా ఒడిసి పట్టుకొని, “పార్వతీనందనా! మళ్లీ బోర్లపడ్డావంటే, మీ అమ్మ మురళీ గానాన్ని వినకూడదని శపించి పోతుందేమోనన్న భయంతో, నిన్ను కింద పడిపోకుండా పట్టుకున్నాను, మరేం అనుకోకు, లంబోదరా!” అన్నాడు.
విఘ్నేశ్వరుడు, “కృష్ణా, నీ మురళీ గానాన్ని వినాలనే ఇలా వచ్చాను. మన కృష్ణవినాయకీయం నిజంగా సుందరకాండే!” అన్నాడు.
కృష్ణుడు, “విఘ్నేశా! పాపం, నీ వాహనం మద్దెల దరువులు బాగా తిన్నదే!” అని అంటూ ఎలుకను ముద్దుగా నిమిరాడు.
విఘ్నేశ్వరుడు. “కృష్ణా! కంసుడికి అంత్యకాలం సమీపించింది. ధనుర్యాగం సాకుతో నిన్ను తీసుకురమ్మని, అక్రూరుణ్ణి పంపుతాడు. వెళ్ళు! విజయోస్తు!” అని చెప్పాడు.
కృష్ణుడు, “అంతా నీ దయ, స్వామీ!” అని చేతులు మోడ్చి మ్రొక్కాడు.
విఘ్నేశ్వరుడు, “అవతారమూర్తివి! నా దయ కాదు, నీ లీల! అన్నట్టు అర్కకుబ్జ రూపంతో నీ కోసం ఎదురు చూస్తూంటుంది, అనుగ్రహించు!” అని చెప్పి ఎలుక వాహనం ఎక్కి, ఆకాశానికి రివ్వున వెళ్లి అంతర్ధానమయ్యాడు.
అక్రూరుడు కృష్ణ బలరాములను మధురాపురానికి రధం మీద తీసుకు వెళ్ళాడు. అష్టవంకరలతో ఉన్న కుబ్జ కృష్ణుడికి ఎదురొచ్చి, పాదాలకు మ్రొక్కి చందనం పూసింది. కృష్ణ బలరాములకు పూలమాలలు వేసింది.
కృష్ణుడు ఆప్యాయంగా కుబ్జను రెండు చేతులతో లేవనెత్తాడు. కుబ్జ రూపం పోయి అప్సరసరూపంతో అర్క దేవలోకం చేరుకుంది.
కంసుడు తనను చంపాలని చేసిన కపటోపాయాలన్నిటినీ చిత్తు చేసి, కృష్ణుడు, కంసుణ్ణి పట్టుకుని సింహాసనం నుంచి ఈడ్చిలాగాడు. కంసుడు మరణించాడు.
దేవకీ వసుదేవులను కారాగార విముక్తులను చేసి, కృష్ణుడు ఉగ్రసేనుడిని కూడా కారాగారం నుండి విడిపించి, అతని సింహాసనం అతని పరం చేశాడు.
కృష్ణ బలరాములు పెద్దవాళ్ళయ్యారు. కృష్ణుడు అనేక మంది దుర్మార్గులను, రాక్షసులను నిర్మూలించాడు. సముద్రంలోకి చొచ్చుకొని దుర్భేద్యంగా ఉండేలాగ ద్వారకానగరాన్ని నిర్మాణం చేయించి, అన్న బలరాముణ్ణి యాదవులకు పెద్దగా చేసి రాజరికాన్ని నెలకొల్పాడు.
కృష్ణుడు రుక్మిణిని తెచ్చుకొని వివాహం చేసుకొన్నాడు.
సర్వసంపదలతో తుల తూగుతున్నా, కృష్ణుడు ఎప్పటివలెనే ఆవులను కాస్తూ, పాలుపితుకుతూ గోపాలకృష్ణుడుగానే ద్వారక లో ఉంటున్నాడు.
ద్వారకానగరం పక్కనే సత్రాజిత్తు అనే ప్రముఖుడు రాజువలె సంస్థానం ఏర్పరచుకొని భోగభాగ్యాలతో తులతూగుతున్నాడు. తాను సూర్యవంశ క్షత్రియుడనని సగర్వంగా చెప్పుకుంటూ, సూర్యోపాసకుడై గొప్ప తపస్సు చేశాడు. సూర్యుడు ప్రసన్నుడై శమంతక మణి అనే పెద్ద వజ్రాన్ని అతనికి ప్రసాదించాడు. శమంతకమణి నుండి వెలువడే కాంతి కిరణాలు బంగారు కణికల్లో ప్రతి రోజూ అతనికి అంతులేని బంగారం సమకూరుతూండేది.
సత్రాజిత్తు ప్రముఖులనిపించుకుంటున్న వారికి ఆహ్వానాలు పంపి మరీ వచ్చినవారందరికీ మణిని చూపించి, మణి ప్రభావాన్ని వర్ణిస్తూ మురిసిపోతూండేవాడు. కృష్ణుడికి కూడా ఆహ్వానం పంపించాడు గాని కృష్ణుడు రాలేదు. ఎప్పుడో వీలు చూసుకొని వస్తానని తిరుగు కబురు పంపించాడు. గర్విష్ఠి అయిన సత్రాజిత్తు కృష్ణుడిపై ద్వేషం పెట్టుకున్నాడు. కృష్ణుడి గురించి ఎన్నో విశేషాలు విన్నా, ఒక యాదవ ప్రముఖుడిగా తప్పితే కృష్ణుడి పై అతనికి పెద్ద అభిప్రాయం ఏర్పడలేదు.
సత్రాజిత్తుకు సత్యభామ అనే అసమాన సౌందర్యవతియైన కుమార్తె ఉన్నది. శమంతకమణితో బాటు సత్యభామ సౌందర్యం కూడా విఖ్యాతి కెక్కింది; జరాసంధుడిలాంటి రాజాధిరాజులు సైతం సత్యభామను చేబట్టాలని కాచు కొని ఉన్నారు.
సత్యభామకు విఘ్నేశ్వరుడిపై ఎనలేని భక్తి విశ్వాసాలున్నవి. ఆమె ప్రతి వినాయక చవితికి విఘ్నేశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించి కృష్ణుణ్ణి తన అధీనుడిగా చేయవలెనని కోరుకుంటూండేది. కృష్ణుడు ఆ దారిన వచ్చినప్పుడల్లా సౌధాగ్రంమీద నిల్చుని చూసి చూసి, ఒకసారైనా అతడు తల పైకెత్తి తన్ను చూడలేదుకదా అని నిరాశతో విఘ్నేశ్వరుడి మ్రోల మోకరిల్లి, తన ఆశ ఫలింపజేయమని మరీ మరీ ధ్యానిస్తూండేది.
సత్రాజిత్తుకు కుమార్తె మనసు తెలిసినా తెలియనట్టే ఉండేవాడు. ఒకనాడు సత్య విఘ్నేశ్వరుడి ముందు మోకరిల్లి ఉండగా చూసి, “ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానుడి అనుగ్రహం మనపై ఉండగా, ఇలాంటి మొక్కుబడులు దేనికమ్మా?” అన్నాడు.
సత్యభామ చివాలున లేచి, “అలా అనకూడదు, నాన్నా! మనోవాంఛితాన్ని సఫలం చేయగల దేవుడు విఘ్నేశ్వరుడు ఒక్కడే!” అన్నది.
“ఏమిటి నీ మనోవాంఛితం? రుక్మిణితో పాలు పంచుకోవడమేనా?” అన్నాడు సత్రాజిత్తు.
“పాలు పంచుకోవడమేమిటి? కృష్ణుణ్ణి నా అధీనంలో పెట్టుకొంటాను!” అన్నది సత్యభామ.
సత్యభామ పట్టుదల ఎలాంటిదో సత్రాజిత్తుకు తెలియనిది కాదు. అయినా వఠ్ఠి బేల అని తనకు తాను సరిపెట్టుకొంటూ వెళ్లాడు.
మర్నాడే కృష్ణుడు సత్రాజిత్తు దగ్గరికి వచ్చాడు. రాక రాక వచ్చిన కృష్ణుడి కళ్ళ పడాలని సత్య సంబరపడుతూ ముస్తాబు సవరించుకొని సభామందిరానికి వెళ్లేసరికి కృష్ణుడు అప్పుడే వెళ్లిపోయాడు. సత్రాజిత్తు శమంతకమణిని గుప్పెట్లో భద్రంగా పట్టుకొని ఉగ్రంగా కృష్ణుడు వెళ్ళిన వేపే చూస్తూ ఎంతో దిగులుగా నిల్చున్నాడు.
సత్యభామ తండ్రితో, “ఏమిటి నాన్నా అలాగ ఉన్నారు? వచ్చిన వాడు నన్ను తనకు యిమ్మని అడగలేదు గద!” అన్నది.
“అలా అడిగినా నేనంతగా పట్టించుకోను గాని, ఏమడిగాడో తెలుసా? శమంతకమణిని యిమ్మన్నాడు. తన లాంటి వాడి దగ్గిర ఉంటే, ప్రజలందరి శ్రేయస్సుకీ ఎన్నోవిధాల ఉపయోగపడుతుందని కూడా అన్నాడు!” అని సత్రాజిత్తు చెప్పాడు.
సత్యభామ చిరుకోపంతో, “ఇంతకూ, నా కంటే శమంతకమణే నీకు ఎక్కు వైనది కదూ?” అంటూ చరచర వెళ్లబోతూంటే సత్రాజిత్తు బుజ్జగింపుగా, “అలా అనుకోవద్దమ్మా! ఆ కృష్ణుడి పేరాసకు విస్తుబోతున్నాను, అంతే!” అంటూ నసిగాడు.
“అతడు మణి యిచ్చే బంగారాన్ని దాచుకుంటానని అనలేదుగదా, అతనిది పేరాస ఎలా అవుతుంది, నాన్నా? కృష్ణుడంతటివాడు అడిగినప్పుడు సంతోషంతో యిచ్చి వేస్తే ఎంత బాగుండేది. నాన్నా!" అన్నది సత్యభామ.
సత్రాజిత్తు కంపించిపోతూ, “ఇవ్వను, ప్రాణాలతో ఉండగా నా దగ్గిర్నుంచి మణిని ఎవ్వరూ తీసుకోలేరు! మణి నా ప్రాణం, నా సర్వస్వం!” అంటూ గట్టిగా అరిచాడు.
సత్యభామ ముఖం జేవురించుకొని, “ఔను! మణి నీకు అంత గొప్పది! నా కంటే గొప్పది! ఆ శమంతకమణి గొప్పదో, నేను గొప్పో ఆ కృష్ణుడే రుజువు చెయ్యాలి!” అంటూ చరచరా వెళ్లింది.
కొద్ది రోజుల తరవాత వినాయక చవితి వచ్చింది. సత్యభామ యధావిధిగా విఘ్నేశ్వరుణ్ణి అర్చించి, ఆ సాయంత్రం పల్లకిలో ద్వారకానగరానికి బయలుదేరి వెళ్లింది.
ఆ సాయంత్రం ఆకాశం దట్టంగా మబ్బు పట్టింది. చీకటి అవుతున్నది. కృష్ణుడు ఆవుపాలు పితుకుతున్నాడు. ఒక్కసారిగా మబ్బు విడిపోయి చవితి చంద్రవంక పాలల్లో తళుక్కున ప్రతిబింబించి కృష్ణుడికి కనిపించి క్షణంలో మబ్బుక్రమ్మి మాయమైంది.
వినాయక చవితినాడు చంద్రుడు కంటబడినందుకు కృష్ణుడు నొచ్చుకుంటూ, పూజా మందిరంలోకి వెళ్లి అక్షతలు తల మీద చల్లుకొని, విఘ్నేశ్వరుని ముందు నిల్చుని కన్నులు మూసి, “దేవా! ప్రతిబింబమే అయినా చూశాను, అంతా నీ దయ!” అని ధ్యానించాడు. అతను అలా ధ్యానిస్తున్నప్పుడు “కృష్ణా! నీవు చూడాలని చూడలేదుగా! నీలాపనింద పడినా మబ్బు విడిపోయినట్లే విడిపోతుంది! ఇదీ ఒక లాభానికే అనుకోవయ్యా!” అంటూ విఘ్నేశ్వర ప్రతిమలోంచి వెలువడినట్లుగా మాటలు వినిపించాయి.
కృష్ణుడు కన్నులు తెరిచి, “స్వామీ! అంతా నీ లీల!” అన్నాడు.
అదే సమయంలో రుక్మిణి పూజా మందిరం ప్రవేశిస్తూ విఘ్నేశ్వరుని ముందు నిల్చుని ఏదో జపిస్తున్న కృష్ణుణ్ణి ఆశ్చర్యంతో చూసి, “శ్రీవారు విఘ్నేశ్వరుల వారితో ఏదో మంతనాలు జరుపుతున్నట్లున్నదే!” అన్నది.
కృష్ణుడు, “ఇదే వేళ ఒకానొక వినాయక చవితినాడు నన్ను పెంచిన యశోదమ్మతో నేను అన్న మాటలు గుర్తు కొచ్చాయి, అంతే!” అన్నాడు.
“ఆ ముద్దుమాటలేమిటో నాకు కూడా వినిపించవా, స్వామీ!” అన్నది రుక్మిణి.
కృష్ణుడు, “యశోదమ్మ పితుకుతున్న పాలలో చవితి చంద్రుడి బింబం చూసి కేరింతాలు కొట్టాను. ఎన్ని నిందలు పడతావో కదా. అని యశోదమ్మ నొచ్చుకున్నది. పెద్దయ్యాక అయినా నింద తప్పదన్నది. దానికి నేను, అమ్మా, అప్పుడు మళ్ళా చూడాలికదూ అని అన్నాను.” అని చెప్పాడు.
రుక్మిణి, “మరి అప్పుడు నీలాపనింద సంగతి ఏమైంది?” అనడిగింది.
“మన్ను తింటున్నానని అన్నయ్య చెప్పనే చెప్పాడు!” అన్నాడు కృష్ణుడు.
రుక్మిణి, “మళ్లీ ఇప్పుడు చంద్రుణ్ణి చూడలేదుకద! చూడాలన్నా కనిపించడులెండి, బాగా మబ్బుపట్టి ఉంది!” అని అంటూ ఏదో చెప్పబోతున్నట్లు చూసింది.
“రుక్మిణీ! ఎదో చెప్పవచ్చినట్టున్నావే, ఏమిటి విశేషం?” అనడిగాడు కృష్ణుడు.
“విశేషమే! సత్రాజిత్తులవారి ఇంటి మణి మన ఇంటికి విచ్చేసింది!” అన్నది రుక్మిణి.
కృష్ణుడు, “శమంతకమణి మన ఇంటికి రావడమేమిటి?” అన్నాడు ఆశ్చర్యంగా.
“ఆ మణి కాదు. సత్రాజిత్తుల వారి కన్యకామణి --సత్యభామామణి వచ్చింది. చాలా సేపుగా ఇక్కడే మాట్లాడుకుంటూ ఉన్నాము. చూసి చూసి ఇప్పుడే పల్లకిలో వెళ్లింది. ఆమెను సాగనంపి ఇలా వచ్చాను. మీరు కనిపించారు!” అన్నది రుక్మిణి.
కృష్ణుడు తలపంకించి, “అలాగా! మన ఇంటి విఘ్నేశ్వర దేవుణ్ణి కూడా చూడాలని వచ్చి ఉంటుంది. చూసింది కదా!” అన్నాడు.
రుక్మిణి, “విఘ్నేశ్వర దేవుణ్ణి చూడాలని వచ్చిందో, మీ కన్నుల్లో పడాలని వచ్చిందో మరి! ఇక్కడ వున్నంత సేపూ ఆమె చూపులు మిమ్మల్నే తెగ వెతికి వెతికి వేసారాయని మాత్రం నాకు రూఢిగా తెలుసు!” అన్నది.
“ఏమిటీ వింత! మాటలు రావనుకున్న రుక్మిణీదేవి, ఈ రోజు చతురంగా మాట్లాడు తున్నదే!” అని కృష్ణుడు అన్నాడు.
--(ఇంకా వుంది)
Post a Comment