విఘ్నేశ్వరుడు (చందమామ)_12 Vignaeswarudu Novel (CHANDAMAMA)

 విఘ్నేశ్వరుడు (చందమామ) 

Vignaeswarudu Novel (CHANDAMAMA)

12. కృష్ణవినాయకీయం


వినాయక చవితి నాటి మునిమాపు వేళ విఘ్నేశ్వరుడు తన దంతంలాగే ఉన్న చంద్రుణ్ణి చూస్తూ, నిండు బొజ్జతో మందంగా అడుగులు వేస్తున్నాడు. చిట్టెలుక వెంట వస్తున్నది.


నెలవంక విఘ్నేశ్వరుడి సంకేతం అంటారు. విఘ్నేశ్వరుడి నుదుట తెల్లని మంచి గంధంతో తీర్చిదిద్దిన బాలచంద్ర తిలకం, ఆకాశం మీది చవితి చంద్రుడి ప్రతిబింబంలాగ ప్రకాశిస్తున్నది. ఫాల చంద్రుడు, బాలచంద్రుడు అని కూడ విఘ్నేశ్వరుడికి పేర్లున్నవి.


కాలి బొటన వ్రేలికి చిన్న రాయి తగిలి వినాయకుడు అమాంతంగా బోర్లా పడ్డాడు. కడుపు పగిలిపోయింది. తిను బండారాలు వెలికివచ్చి నేల విరజిమ్ముకున్నాయి. అదే అదనుగా ఎలుక వాటిని గబగబా తినసాగింది. ఆ వినోదానికి, ఆకాశపు చిరునవ్వులా ప్రకాశించే చందమామ పకపకా నవ్వాడు. దేవతలు మొదలైన వారంతా వచ్చి, పెద్ద సర్పంతో వినాయకుడి బొజ్జ కలిపి కుట్టారు.


పార్వతికి చంద్రుడి మీద చాలా కోపం వచ్చింది. ఆమె, “వినాయక చవితి నాడు చంద్రుణ్ణి చూస్తే, నీలాపనిందలు వచ్చి పడతాయి!” అని శపించింది.


అది మొదలు పిల్లల్ని సైతం చూడ నివ్వకుండా వినాయక చవితి నాడు చంద్రదర్శనం కాకుండా, అంతా జాగ్రత్త పడుతూ వచ్చారు.


ద్వాపర యుగం వచ్చింది. దేవకీ వసుదేవులకు చెరసాలలో పుట్టి, గోకులంలో యశోద ముద్దుల పట్టిగా పెరుగుతున్న బాలకృష్ణుడు పూతన, శకటాసురుడు, తృణావర్తుడు అనే రాక్షసుల్ని అప్పటికే చంపేశాడు, బాగా మాటలు నేర్చాడు.


ఆ రోజు వినాయక చవితి. యశోద పాలు పితుకుతున్నది. బాలకృష్ణుడు యశోద వీపుమీద నుంచి వంగి పాత్రలోని పాలలో ప్రతిబింబించిన చంద్రవంకను చూసి, “చందమామ! పాలల్లో చంద మామ!” అంటూ చప్పట్లు చరిచాడు.


యశోద గతుక్కుమని, “ఎంత పని చేశావు కన్నా! ముందు, ముందు ఎన్ని నీలాపనిందలు పడవలసివస్తుందో మరి.” అని నొచ్చుకుంది.


“నీలాపనింద అంటే ఏమిటమ్మా?” అన్నాడు కృష్ణుడు.


“ఉత్తినే నిన్ను దొంగ అంటారు!” అన్నది యశోద.


“విచారించకమ్మా! పాలు, వెన్న దొంగతనం చేస్తుంటానమ్మా, అప్పుడది నీలా పనింద అవదుగా!” అన్నాడు కృష్ణుడు.


“ఆరి పిడుగా! నీ నోట బ్రహ్మాండాలు విరుచుకు పడా!” అని అంటూ గోపమ్మ బుగ్గలు నొక్కుకున్నది.


“బ్రహ్మాండాలు చూశావామ్మా?” అని కృష్ణుడడిగాడు.


యశోద, “బ్రహ్మాండాలకేంగాని, పెద్దయినా నీ మీద అభాండాలు పడ్డం ఖాయం!” అంటూ సున్నితంగా బాలుడి తల మీద మొట్టికాయ పెట్టింది.


“అప్పుడు మళ్ళీ ఇలాగే చందమామను చూడాలి కదూ?” అన్నాడు కృష్ణుడు.


“పెద్దయ్యాక చూస్తే మరీ తప్పు!” అంది యశోద. మనసులో, “విఘ్నేశా! అభం శుభం తెలియని పసివాడు, నీడ చూశాడు, అంతే. మన్నించు!” అని అనుకుంటూ.


ఆ మర్నాడు బలరాముడు గబగబా వచ్చి యశోదతో, “అమ్మా! తమ్ముడు మన్ను తింటున్నాడు. అబద్ధం కాదు, వాడి నోరు చూడు!” అని చెప్పాడు. యశోద చరచరా వెళ్ళింది.


కృష్ణుడు మట్టి ముద్దలు వరసగా పేరుస్తున్నాడు. యశోద కృష్ణుడి చెవిపట్టి, “ఏదీ నోరు తెరు!” అన్నది.


“నన్ను నీచేత కొట్టించాలని ఎవరో ఏదో చాడీ చెప్పినట్టుంది. నీలాపనిందలు పడతాయని నిన్న నే కదా నువ్వు చెప్పావు? మట్టితో, ఉండ్రాళ్ళు లడ్లు చేస్తున్నానమ్మా. మట్టితో చేసిన వినాయకుడు మన్నుతో చేసినవైతేనే నిజంగా తింటాడమ్మా!” అన్నాడు కృష్ణుడు.


యశోద లెంపలు వేసుకుంటూ, “తప్పు నాయనా, తప్పు! మన్నుతో చేసినా, రాయితో చెక్కినా దేవుడు దేవుడే! అపచారం స్వామీ! విఘ్నేశా! పిల్లవాడి మాటలు ఏ మాత్రం పట్టించుకోకు!” అని ధ్యానించింది.


“అయితే వచ్చే వినాయక చవితికి వెన్న ఉండ్రాళ్ళు, నేతి లడ్లూ బోలెడన్ని చెయ్యి. ఎన్ని తింటాడో చూస్తా. తినక పోతే తినిపించుతా!” అన్నాడు కృష్ణుడు.


“ముందు నీ నోరు చూపించు!” అంటూ యశోద వంగి చూడబోతూంటే కృష్ణుడు ''ఆఁ" అంటూ బార్లా నోరు తెరిచాడు.


యశోద అలా చూస్తూనే ముచ్చెమటలు పట్టి చతికిల కూలబడింది. కృష్ణుడి నోటిలో బ్రహ్మాండాలు, నక్షత్రమండలాలు, సూర్యుళ్ళు, చంద్రుళ్ళు, సముద్రాలు, పర్వతాలు: సమస్తమూ కనిపించాయి. పాలు పితుకుతున్న యశోద వీపున వాలి, మెడ చుట్టూరా చిట్టిచేతులు చుట్టి, పాలల్లో చందమామను చూపిస్తున్న కృష్ణుడు కనిపించాడు. యశోద కల అనుకుని గిల్లుకొని కళ్లు నులుముకొంది. కల కాదు, ఏ దేవతో, వినాయకుడో తనను మాయలో ముంచేస్తున్నాడని అనుకుంటూ చుట్టూరా చూసింది. యశోద వెర్రిచూపులకు చుట్టూ చేరిన పిల్లవాళ్ళు కేరింతాలు కొడుతున్నారు. స్తంభం చాటున బలరాముడు ముసి ముసి నవ్వులు నవ్వుతున్నాడు.


కృష్ణుడు యశోద ముఖం మీదకు వంగి, “చూడమ్మా చూడు! మన్ను కనిపించిందా ? బాగా చూడు!” అంటూ తెరిచిన నోరు మరింత దగ్గరగా చూపుతుంటే, యశోదకు దేవాదిదేవుళ్ళు కనిపించారు. కృష్ణుడు పిల్లనగ్రోవి ఊదుతూంటే, విఘ్నేశ్వరుడు తాండవం చేస్తూ కనిపించాడు. కృష్ణుడు పెద్ద నల్లని సర్పం తలల మీద తంతున్నాడు. అది కృష్ణుణ్ణి చుట్టి వేస్తున్నది.


యశోద కెవ్వున అరిచి మూర్ఛ పోయింది.


యశోద తిరిగి కళ్ళు తెరిచేసరికి మంచం చుట్టూరా గొల్లభామలూ, గొల్ల అవ్వలూ కనిపించారు.


“నాకేమైంది?” అని ఆశ్చర్యంగా అడిగింది యశోద.


ఆమెకు ఏదీ జ్ఞాపకం లేదు. ఏమీ జరగనట్టే అంతా మరిచిపోయింది.


“నీకేమైందో మాకు తెలీదు గాని, మా ఇళ్ళల్లో దొంగతనాలు జరిగాయి. ఆ దొంగ నీ ముద్దుల కొడుకే! వెన్న, మీగడ, పాలు, పెరుగులు కుర్రమూకకీ, కోతులకూ పంచి పెడుతుండగా కళ్ళారా చూశాము!” అని చెప్పారు గోపకాంతలు.


యశోద, “ఏమిటేమిటీ! అవన్నీ మీ ఇళ్ళల్లోవని ఎలాగ అనుకున్నారు? మా ఇంట లేవనుకున్నారా? గోకులం ఊర్లోని ఇళ్ళన్నీ కలిపి, మా ఇంట వున్న వాటిలో సగానికైనా రావు; వెళ్ళండి, వెళ్ళండి!” అంటూ వాళ్ళను సాగనంపింది.


కృష్ణుడు మెల్లగా వచ్చి, “ఏం జరిగిందమ్మా?” అనడిగాడు. “ఏం జరుగుతుందన్నానో అదే జరిగింది! నీ మీద నీలాపనింద పడింది!” అన్నది యశోద.


“నీలాపనింద తప్పించేసుకున్నానమ్మా. వాళ్ళు చెప్పిందంతా నిజమే నమ్మా!” అన్నాడు కృష్ణుడు.


యశోదకు పట్టరాని కోపం వచ్చింది. పెద్ద తాడుతో కృష్ణుణ్ణి పెద్ద రోలుకు వేసి కట్టింది. కృష్ణుడు ఆ రోటిని ఈడ్చుకుంటూ వెళ్ళి, జంటగా పెరిగిన రెండు మద్ది మానుల సందున దూరి రోటిని లాగాడు. మహా వృక్షాలు రెండూ వేళ్లతో పెళ్లగించుకొని కూలాయి. శాపవిముక్తులైన గంధర్వులు కృష్ణుణ్ణీ నుతించి ఆకాశానికెగిసి, అదృశ్యులయ్యారు.


ఏడాది తిరిగింది. వినాయక చవితి వచ్చింది. రంగురంగుల పెద్ద వినాయక విగ్రహాన్ని నందుడు చేయించాడు. యశోద పాల మీగడతో పిండి కలిపి ఉండ్రాళ్ళు, వెన్న అప్పాలు, నేతిలడ్లు, పాలతో జిల్లేడు కాయలు దండిగా చేసింది.


నైవేద్యాలన్నీ పళ్ళేల నిండా నింపి, పూజామందిరంలో అమర్చి తలుపు చేరవేసి, యశోద అలా వెళ్ళింది.


కృష్ణుడు మెల్లగా పూజా మందిరం ప్రవేశించి తలుపు మూసి, తినుబండారాల్ని వినాయక విగ్రహానికి అందిస్తూ, “తినవయ్యా తిను!” అంటూ ప్రతిమ బొజ్జా నిమిరాడు.


ప్రతిమ విఘ్నేశ్వరుడై తొండంతో అందుకొంటూ, “కృష్ణా! నేనందించేవి నువ్వూ తినాలి! విఘ్నేశ్వర చరిత్రలో ఇది సుందరకాండ!” అంటూ వెన్నతో చేసిన తినుబండారాల్ని కృష్ణుడి నోట కుక్కాడు. పళ్లాలు ఖాళీ అవుతున్నాయి.


యశోద పూజా మందిరానికి వస్తూ గవాక్షం గుండా లోపల జరుగుతున్న సుందరకాండ చూచి కొయ్యబారి పోయింది. ముచ్చెమటలు పట్టాయి. మళ్లీ తమాయించుకొని, “అబ్బే, నే నేదో

భ్రమపడుతున్నాను. నా కళ్ళకేదో మాయ తెగులు పట్టుకుంది!” అని సర్ది చెప్పుకుంటూ తలుపు తెరిచి వచ్చింది.


వినాయక విగ్రహం విగ్రహం లాగే వున్నది. అమర్చి పెట్టిన తినుబండారాలు కనిపించటం లేదు. కృష్ణుడు బిక్క మొహం పెట్టి చూస్తున్నాడు.


“నీ తిండి తగలడా! పూజ కాకుండా అంతా పాడుచేశావు.” అంటూ యశోద కృష్ణుడి వీపు మీద గట్టిగా నాలుగు చరిచింది.


కృష్ణుడు ఏడుస్తూ, ఎవరికీ చిక్క కుండా పరుగు తీసి, కాళింది మడుగు చేరాడు. ఆ వెనుకనే యశోదతో బాటు గోకులంలోని వారంతా ఆదుర్దాగా వెళ్లారు.


కాళింది మడుగులో ఉంటున్న కాళీయ మహా సర్పం వల్ల గోకుల వాసులకు ఎన్నో విధాలుగా హాని జరుగుతూ వస్తున్నది. కృష్ణుడు మడుగు ఒడ్డునే ఉన్న చెట్టెక్కి, మడుగు మధ్యకు వ్యాపించి ఉన్న కొమ్మ మీది నుంచి, మడుగులోకి దూకి, కాళీయనాగుడి నెత్తి మీద పిడుగులాగ పడ్డాడు . గజ్జెలందెలు ఘల్లు ఘల్లుమనగా కృష్ణుడు కాళీయుడి తలల మీద తాండవం చేశాడు. అద్భుతంగా కాళీయమర్దనం జరిగింది. కాళీయుడి శాపం తీరింది. కుమార్తెలను తీసుకెళ్లి పాతాళంలో వాసుకికి అప్పగించి, కాళీయ రూపం ఉపసంహరించుకొని, విఘ్నం విఘ్నేశ్వరుడి అధీనమైంది.


కొడుకు నెత్తుకొని యశోద ఇంటి కొచ్చి చూ సేసరికి, పూజామందిరంలో పళ్లాలన్నీ నిండుగా ఎలాగ పేర్చినవి అలాగే ఉన్నాయి. బాలకృష్ణుడి వీపు మీద మాత్రం యశోద వ్రేలి తట్లు కనిపిస్తున్నాయి. యశోద వాటిని చూసి, “నా చేతులు పడిపోను! నా కళ్ళకేదో మాయ రోగం వచ్చి నిష్కారణంగా కొట్టాను. పాపిష్టి దాన్ని!” అని వలవలా ఏడ్చింది.


“అమ్మా! బోలెడు వేళ ఉంది, పూజ చెయ్యవూ మరి!” అన్నాడు కృష్ణుడు. నందుడు యశోద కృష్ణుడిచేతే పూజ చేయించారు. నైవేద్యాల్ని ఊరందరికీ పంచారు. ఆ తినుబండారాల్లో అమృతం ఉందనిపించింది. గోకులమంతా ఆనందం పొంగిపొర్లింది.


కృష్ణుడు బాగా యెదిగాడు. గోవర్ధనగిరిని ఎత్తి ప్రళయ భీకరమైన జడివాన నుండి గోవులనూ, గోపకులనూ కాపాడి, ఇంద్రుడికి గర్వభంగం చేశాడు.


గోవర్ధన ప్రాంతంలో ఒకనాడు కృష్ణుడు ఆవులను కాస్తూండగా, చంకను పెద్ద మద్దెల పెట్టుకొని వస్తున్న ఒక పెద్ద మనిషి, “అబ్బాయీ, ఇక్కడ కృష్ణుడు అనే అబ్బాయి ఉన్నాడట. మురళి చాలా గొప్పగా వాయిస్తాడని చెప్పుకుంటున్నారు. ఆ మురళీ గానం ఏపాటిదో చూద్దామని వచ్చాను. అతడి ఉనికి చెప్పగలవా?” అన్నాడు కృష్ణుడితో.


“స్వామీ, ఆ కృష్ణపరమాణువును నేనే! తమరెవరో చాలా గొప్ప మృదంగ విద్వాంసుల్లాగ ఉన్నారు. తమరెవరో తెలియని వాణ్ణి, కాస్త సెలవియ్యండి, స్వామీ!” అని కృష్ణుడు చేతులు జోడిస్తూ అన్నాడు.


“నన్ను మృదంగ కేసరి అని పిలుస్తారు. మాది దక్షిణ దేశం. మధురానగరానికి వెళ్తున్నాను. కంసుడు ధనుర్యాగం చేస్తాడుట. అప్పుడు నా మద్దెల విద్వత్తును ప్రదర్శిద్దామని వెళ్తున్నాను.” అన్నాడు మృదంకేసరినని చెప్పుకొన్న పెద్దమనిషి.


అతని కాలికి రత్నఖచితమైన గండ పెండెరం, చేతులకు కెంపులు తాపిన సింహ తలాటాలు, మెడలో బంగారు నిమ్మకాయల దండ, చెవులకు పెద్ద కుండలాలు. ధగధగా మెరుస్తున్నవి. మద్దెల నిండా నవరత్న స్వర్ణ పతకాలు తాపి ఉన్నవి.


కృష్ణుడు వాటిని చూసి అబ్బుర పడుతూ, “స్వామీ, నేను ఆవుల్ని కాసే సామాన్య గోపకుణ్ణి. నా పిల్లనగ్రోవి సాదా వెదురుబొంగు ముక్క! మీ దక్షిణదేశ విద్వాంసులు, తాళానికి ప్రసిద్ధులు. ఇహ నేను ఏదో ఒక రాగాన్ని ఊది, ఆవుల్ని పాలించుకోవడం తప్పితే, మరేదీ తెలియని గాలిపాటగాణ్ణి మాత్రమే!” అన్నాడు.


--(ఇంకా వుంది)

Post a Comment

Previous Post Next Post