విఘ్నేశ్వరుడు (చందమామ)_11 Vignaeswarudu Novel (CHANDAMAMA)

 విఘ్నేశ్వరుడు (చందమామ) 

Vignaeswarudu Novel (CHANDAMAMA)

11. విఘ్నేశ్వర లీలలు


ఒకానొకప్పుడు లక్ష్మి మానససరోవరంలో జలకమాడుతూండగా, పార్వతి విష్ణువు వేషం ధరించి లక్ష్మిని సమీపించింది. నవ మోహనంగా కనిపించిన నారాయణుని లక్ష్మి చూచింది. నారాయణుని వేషంలో ఉన్న పార్వతికి కూడా లక్ష్మి సౌందర్యం మనోహరంగా కనిపించింది. ఇద్దరూ సాభిప్రాయంగా చూసుకున్నారు. ఆ చూపుల కలయికలో సరోవరంలో ఒక స్వర్ణకమలం లేచింది. అందులో ధగధగ మెరిసిపోతున్న పసిపాప ఉన్నది.


లక్ష్మి, నారాయణుని దగ్గిరచేరి కౌగలించుకున్నది. పార్వతి పగలబడి నవ్వుతూ, “నేను నారాయణుడిని కాను, లక్ష్మీ!” అని నిజరూపంతో కనిపించింది. లక్ష్మి,” అన్నకు తగ్గ చెల్లెలివే, నారాయణి అనిపించుకున్నావులే!” అన్నది.


పార్వతి, “అప్పుడు విష్ణువు మోహినీ రూపంతో శివుణ్ణి మాయబుచ్చినదానికి ఇది చెల్లు వేసుకో!” అన్నది.


స్వర్ణకమలంలోని పసిదాన్ని చూసి ఇద్దరూ మురిసిపోయారు. అపార ప్రేమ పుట్టి చేతుల్లోకి తీసుకున్నారు. అప్పుడు విఘ్నేశ్వరుడు వచ్చి, “తల్లులారా! మీ ఇద్దరి అంశలతో అవతరించిన ఈ బిడ్డ పార్వతి పరంగా, జయ, లక్ష్మి పరంగా శ్రీ కలిసి జయశ్రీ గా పెరుగుతుంది. ఈమెకు వరుడు కూడా శివకేశవుల అంశలతో అవతరించి ఉన్నాడు!” అని చెప్పి, పసిదానితో ఉన్న స్వర్ణకమలాన్ని కావేరీనదిలో ఉంచి రమ్మని వాయుదేవుడికి చెప్పాడు. వాయుదేవుడలాగే జయశ్రీని కావేరినదికి చేర్చాడు.


దక్షిణ ప్రాంతాన్ని పాలించే చక్రవర్తి స్వర్ణకమలంలో కనిపించిన బాలికను, వరప్రసాదంగా లభించిన పుత్రికగా తీసుకు వెళ్ళి, నామకరణ మహోత్సవం జరిపించుతూండగా, ఆకాశవాణి “జయశ్రీ అని పిలవండి!” అని పలికింది. జయశ్రీ రాకుమారిగా పెరిగి ముల్లోకాల్లో అంత సౌందర్యవతి, సాహసవంతు రాలు ఉండదనిపించుకొన్నది.


జయశ్రీకి రాజభవనం కంటే ప్రకృతి సౌందర్యంతో నిండి ఉండే అరణ్యాల్లో విహరించడమే యిష్టంగా ఉండేది. విల్లమ్ములు ధరించి, వన్యమృగాలను అదుపులో ఉంచుతూ తిరుగుతూండేది.


హరిహరాంశలతో అవతరించిన స్వామి కైలాసం వెళ్ళి, విఘ్నేశ్వరుణ్ణి, కుమార స్వామిని కలుసుకోవాలని ఎన్నాళ్ళుగానో అనుకుంటున్నాడు. ఒకనాడు అలాగే వెళ్ళాడు, స్వామి. విఘ్నేశ్వరుడు, కుమారస్వామి ఆనందంగా ముచ్చట లాడుతూ, మానససరోవర జలవిహారం చేస్తూండగా, విఘ్నేశ్వరుడు, “ఈ మానస సరోవరంలోనే లక్ష్మీ పార్వతుల తేజస్సులతో స్వామికి కాబోయే దేవేరి ఉదయించింది!” అని ఊరుకున్నాడు.


స్వామికి కుతూహలం కలిగినా అణుచుకొని, మరి కొంత కాలం అక్కడ గడిపి, వెళ్ళబోతున్నప్పుడు విఘ్నేశ్వరుడు, “స్వామీ! మా కంటే పెద్దవాడివైన నీవు బ్రహ్మచారిగా ఉండటం బాగా లేదు, సత్వరంగా నీకు కళ్యాణం తప్పదు!” అన్నాడు.


కుమారస్వామి, విఘ్నేశ్వరుడు స్వామికి ఘనంగా వీడ్కోలు యిచ్చారు. స్వామి నిజనివాసానికి చేరుకున్నాడు.


ఒక నాడు స్వామి వినోదంగా పెద్దపులి మీద స్వారి చేస్తూ అరణ్యంలో తిరుగుతూండగా, పులిని కదలనివ్వకుండా మట్టూరా బాణాలు రివురివ్వున నాటుకున్నాయి. స్వామి బాణాలు వచ్చిన దిశగా కోపంగా చూశాడు. కోపం పటా పంచలైంది. విల్లమ్ములతో ఠీవిగా నిల్చుని చిరునవ్వు విసరిన జయశ్రీ కనిపించి, స్వామి గుండెలో బాణంలాగ గుచ్చుకొన్నది. స్వామి అంతర్ధానమయ్యాడు.


జయశ్రీకి స్వామిని గురించి విఘ్నేశ్వరుడు కలలో అదివరకే చెప్పి ఉన్నాడు. అతనికోసమే అరణ్యాల్లో తిరుగుతున్నది.


నారదుడి ఆ దేశంతో, చక్రవర్తి జయశ్రీకి స్వయంవరం ఏర్పాటు చేశాడు. రాజాధి రాజులుగా మారు రూపాలతో ఇంద్రాది దేవతలు కూడా వచ్చారు. స్వామి ఒక సాధారణ శబరయువకుడి రూపంతో విల్లమ్ములు ధరించి, పెద్ద నల్లని కుక్కను వెంటబెట్టుకొని వచ్చాడు.


రాజాధి రాజులు ఠీవి ఒలక బోస్తూ శబర యువకుణ్ణి, అతని పెంపుడు కుక్కనూ ఎకసక్కెం చేశారు.


స్వామి సింహ ద్వారానికి అడ్డంగా, అందర్నీ కారాగారంలో బందీలు చేసినట్లు కుక్క మీద కూర్చున్నాడు. కుక్క పెద్ద పులిగా మారింది. భయంకరంగా గాండ్రుమన్నది. జయశ్రీ స్వామిని గుర్తించి చరచరావచ్చి వరమాలవేసి వరించింది. స్వామి జయశ్రీని పులి మీద ముందు కూర్చుండబెట్టుకొన్నాడు. దేవతలకు కోపం వచ్చింది. శబరయువకుడి మీద ఒక్కుమ్మడిగా విరుచుకుపడి, ఆయుధాలు తీశారు. స్వామి విల్లమ్ములు తీసి అందర్నీ ఎదుర్కొన్నాడు.


అతని బాణప్రయోగధాటికి దేవతలు చెల్లా చెదరై, నిజ రూపాలతో అస్త్రాలు ప్రయోగించారు. స్వామిని ఎలాంటి అస్త్రమూ తాకలేకపోయింది. ఇంద్రుడి వజ్రాయుధం కూడా పనికిమాలినదైంది. అప్పుడు స్వామి తన నిజరూపంతో హరి హర స్వామిగా సాక్షాత్కరించాడు. దేవతలు చేతులు మోడ్చారు, “శరణం స్వామీ!” అన్నారు.


స్వామి జయశ్రీల కళ్యాణం దేవాది దేవతల మధ్య మహా వైభవంగా జరిగింది. జయశ్రీతో స్వామి నిజనివాసానికి వెళ్లాడు.


త్రేతాయుగంలో ఆర్యావర్తంలో కోసలుడు, కేకయుడు, వసుమిత్రుడు అనే రాజులు ముగ్గురూ ఆప్త మిత్రులుగా ఉండేవారు. కోసలుడికి కౌసల్య, కేక యుడికి కైకేయి, వసుమిత్రుడికి సుమిత్ర అనే కుమార్తెలున్నారు. అయోధ్యను పాలించే దశరధుడికి తమ కుమార్తెలను యిచ్చి పెళ్ళి చేయాలని ముగ్గురు రాజులకూ ఏకాభిప్రాయం కలిగింది దశరధుడు అంగీకరించాడు.


ముగ్గురు రాజులూ జైమినిమహర్షి చేత వివాహానికి లగ్నం పెట్టించారు. జైమిని ముహూర్తం నిర్ణయించి, “నేను పెట్టిన ముహూర్తబలం ఎటువంటిదంటే, వి ఘ్నేశ్వరుడి సాక్షిగా ఈ ముగ్గురి వివాహం దశరధుడితో జరిగి తీరుతుంది! అయితే, వివాహం జరిగే ముందు రాకుమార్తెలకు రాక్షసగండం కనిపిస్తున్నది. కనుక , ముగ్గుర్నీ జాగ్రత్తగా ఉంచాలి!” అని చెప్పాడు.


ముగ్గురు కన్యలనూ రాజులు ఒక పెద్ద పెట్టెలో భద్రంగా దాచారు.


నారదుడు రావణాసురుడితో, “లంకేశ్వరా! అతి త్వరలోనే దశరథుడికి వివాహం కాబోతున్నది. దశరధుడి కుమారుడు నిన్ను హతమారుస్తాడు!” అని చెప్పాడు.


రావణుడు రాకుమార్తెలను ఎత్తుకు రమ్మని మహెూదరుడు అనే గొప్ప రాక్షసుణ్ణి పంపాడు. మహెూదరుడు కన్యలను పెట్టెలో భద్రపరిచినది కనిపెట్టి, ఆ పెట్టెను మ్రింగేశాడు. వాడు ఆకాశ మార్గంగా సముద్రం మీదుగా లంకకు వెళ్తూండగా, కడుపునొప్పి వచ్చి పెట్టెను కక్కేశాడు. సముద్రంలో పడి పెట్టె కెరటాల మీద కొట్టుకుంటూ పోయింది.


దశరధుడు సముద్రం మీద దూర తీరాలకు వెళ్ళి పెద్ద నౌకలో తిరిగి వస్తున్నాడు. ప్రయాణం ఆలస్యమైంది. అనుకున్ననాటికి చేరలేక పోతున్నందుకు విచారిస్తూ, దశరథుడు సముద్రాన్ని చూస్తూండగా, నౌకవైపే కొట్టుకొని వస్తున్న పెద్ద పెట్టె కనిపించింది. పెట్టె నౌకను ఢీకొని పైకప్పు ఊడిపోయింది. అందులో రాకుమార్తెలు కనిపించారు. తాళ్ళ నిచ్చెనలతో వాళ్ళను నౌక మీదకు రప్పించాక , ఆ ముగ్గురూ తాను వివాహం చేసుకోనున్న పెండ్లి కుమార్తెలేనని దశరధుడు తెలుసు కున్నాడు. సరిగ్గా అదే సమయానికి జైమిని మహర్షి ముహూర్తం పెట్టాడు. అప్పుడు అక్కడ విఘ్నేశ్వరుడు ప్రత్యక్షమై, ముగ్గురు రాకుమార్తెలతో దశరధుడి వివాహం జరిపించి, అంతర్ధానమయ్యాడు. ముగ్గురు వధువులతో దశరధుడు ఆనందంగా స్వదేశం చేరుకున్నాడు.


చిర కాలానికి దశరధుడికి నలుగురు కుమారులు పుట్టారు. పెద్దవాడైన రాముడు కైకేయి కారణంగా సీతతో, లక్ష్మణుడితో అరణ్యవాసం వెళ్ళాడు. రావణుడు సీతను ఎత్తుకుపోయి లంకలో పెట్టాడు. రాముడు హనుమంతుడు, సుగ్రీవుడు మొదలైన వానరుల సహకారంతో లంకను ముట్టడించి, రావణ సంహారం చేశాడు. సీతతో పుష్పక విమానంలో బయలుదేరి, వారధి కట్టడం ప్రారంభించిన సముద్ర తీరంలో ఆగి, అక్కడ శివపూజ జరిపి, అయోధ్యకు వెళ్ళాలనుకున్నాడు.


శివలింగ ప్రతిష్ఠకు తగిన లింగాన్ని తీసుకురముని హనుమంతుడిని కైలాసానికి పంపాడు. హనుమంతుడు మనోవేగంతో కైలాసం చేరుకొని, అక్కడ ఉన్న శివలింగాల్లో పెద్ద లింగాన్ని చూసి రెండు చేతులతో ఎత్తబోయాడు. లింగం కొంచమైనా కదల్లేదు. దానికంటె చిన్న లింగాన్ని తీయబోయాడు, అదీ కదల్లేదు. చివరికి అన్నిటికంటే చిన్న లింగాన్ని కూడా ఎత్తలేకపోయాడు.


కాలం మించిపోతున్నది. తన అసమర్ధతకు హనుమంతుడు విచారిస్తుండగా, బుడిబుడి నడకలతో అక్కడికి ఒక పిల్లవాడు వచ్చాడు. “ఎవరయ్యా నీవు? హనుమంతుడిలాగే ఉన్నావు, కాని కావు!” అన్నాడు పిల్లవాడు.


“నేను హనుమంతుడినే! ఒక శివలింగాన్ని తీసుకురమ్మని రాముడు పంపాడు. ఇంతకూ, నీ వెవరవోయి, బాలుడా?” అన్నాడు హనుమంతుడు.


“ఇక్కడి లింగాలను ఎవరూ ఎత్తుకు పోకుండా నన్ను కాపలా ఉంచారు గాని, నీవు హనుమంతుడవని చెబుతున్నావు. హనుమంతుడు శివుని అవతారమే అనీ, పంచముఖాంజనేయుడనీ విన్నాను. నీ పంచముఖాలు ఏవీ?” అన్నాడు బాలుడు.


అప్పుడు హనుమంతుడు గరుడ, వరాహ, సింహ, అశ్వముఖాలను కలుపుకొని, పంచముఖాంజనేయుడై, ఉన్నతంగా పెరిగి పిల్లవాడితో నవ్వుతూ, “విఘ్నేశ్వరా! నా వంతు అయింది. పంచముఖ విఘ్నేశ్వర రూపంతో కనిపించడం నీ వంతు!” అన్నాడు.


అప్పుడు బాలుడి రూపంలో ఉన్న విఘ్నేశ్వరుడు, ఐదు తలలతో సమాన ఎత్తున పెరిగి విశ్వరూపంతో కనిపించాడు.


హనుమంతుడు పంచముఖ విఘ్నేశ్వరుడికి నమస్కరించి,“పిల్లవాడి రూపంతో వస్తున్నప్పుడే విఘ్నేశ్వరుడివని గ్రహించాను. శివలింగాలు కదలకుండా చేసింది నీవేకదా? నీవే ఒక లింగాన్ని ప్రసాదించు!” అన్నాడు.


విఘ్నేశ్వరుడు. “హనుమా! నీ పంచముఖ రూపం చూడాలని నేను ఇలా చేశాను. నీవు శివాంశతో పుట్టినవాడవు, నీకు అడ్డేమిటి? అయినా అడిగావు గనక విశేషాంశలు గల లింగాన్ని నీకు యివ్వాలనే, ఎంచి ఉంచాను, తీసుకు వెళ్ళు.” అని చెబుతూ, హనుమంతుడి దోసిట్లో గొప్పదైన జ్యోతిర్లింగాన్ని ఉంచాడు.


హనుమంతుడు మామూలు రూపంతో దోసిట్లోని లింగాన్ని పదిలంగా పట్టుకొని, రివ్వున ఎగిరి వెళ్లాడు. అప్పటికి కాలాతిక్రమణ జరిగింది.


సమయం మించిపోకుండా సీతాదేవి ఇసుకతో శివలింగాన్ని చేసింది. రాముడు జలాభిషేకం చేసి, పూజకు ఉపక్రమించబోతూండగా, హనుమంతుడు లింగంతో అక్కడ వాలాడు.


హనుమంతుడు జరుగుతున్నది చూసి, తోకతో సైకతలింగాన్ని చుట్టి తీసి వేయబోయాడు. కాని ఇసుక లింగం చెక్కు చెదరలేదు. హనుమంతుడు మరింత తోక గట్టిగా బిగించి లాగితే తోక నొప్పి పెట్టిందేగాని లింగం కదల్లేదు.


అప్పుడు రాముడు హనుమంతుణ్ణి శాంతపరిచి, “హనుమా! బుద్ధిమంతులు కూడా ఒకొక్కప్పుడు పొరపాటు పడుతూంటారు సుమీ! అన్నీ తెలిసినవాడివి, సైకతలింగమైనా, అది శివునికి ఆనవాలు కదా? ఇంతకూ, ఇప్పుడేం మించి పోయింది గనక, నీవు తెచ్చిన లింగాన్ని సైకతలింగం దాపునే ప్రతిష్ఠించి, పూజించి మరీ వెళతాను!” అని చెప్పాడు.


హనుమంతుడు తను తెచ్చిన లింగాన్ని రాముడికి యిచ్చి, లెంపలు వేసుకొని సైకతలింగానికి మొక్కాడు. రాముడు హనుమంతుడు తెచ్చిన లింగాన్ని ప్రతిష్ఠించి, యధావిధిగా పూజాక్రమం సీతతో కలిసి జరిపిన పిమ్మట, అందరితో పుష్పకం మీద అయోధ్యకు చేరి, పట్టాభిషిక్తుడయ్యాడు.

--(ఇంకా వుంది)

Post a Comment

Previous Post Next Post