విఘ్నేశ్వరుడు (చందమామ)
Vignaeswarudu Novel (CHANDAMAMA)
8. ప్రమథ గణాధిపత్యం
కుమారస్వామికి తన పెళ్ళి ఆగిపోవడానికి కారణమైన విఘ్నేశ్వరుడి మీద గుర్రుగా ఉంది.
ఒక నాడు అతడు తల్లితో, “వాజమ్మ కాక జేజెమ్మ ఎలాగౌతాడమ్మా అన్న! నలుగుముద్ద తిండిముద్దకే గాని ఘనకార్యం చేయగలడా?” అన్నాడు ఎకసక్కెంగా.
వినాయకుడు గుడ్ల నీరు పెట్టుకొని, “చూడమ్మా! తమ్ముడు ఎంతలేసి మాటలంటున్నాడో...” అంటూ ఏడ్చినంత పని చేశాడు.
పార్వతికి కూడా కోపం వచ్చింది. వినాయకుణ్ణి అక్కున చేర్చుకొని బుజ్జగిస్తూ, “నాన్నా, నేను చేసిన బొమ్మవని వీళ్లకు అక్కసురా! తండ్రి చంపనే చంపేశాడు, తమ్ముడు ఇలాగ దెప్పుతున్నాడు. పోనీలే, వాళ్ళ అజ్ఞానం వాళ్ళకే తలవంపు!” అంది.
“తమ్ముడు అజ్ఞాని అయితే అవుతాడు గాని, నాన్నకు అజ్ఞానం ఏమిటమ్మా, నీ పిచ్చిగాని.....” అన్నాడు గణపతి ఆశ్చర్యంగా.
పార్వతి ఏదో తలంచుకొని, “నాకు కాదురా పిచ్చి, ఆ శంకర మహాదేవుడికే పిచ్చి ఎక్కి విష్ణుదేవుడి జగన్మోహిని అవతారం వెంటబడి నవ్వులపాలవలేదా ఏమిటి!” అన్నది.
“ఆ తర్వాతేం జరిగిందమ్మా?” అన్నాడు గణపతి.
“ఏదో ఘోరమే జరిగింది, వాళ్ళిద్దరి మధ్యా ఒక భైరవుడనే కారు చీకటి లాంటి భూతపిల్లడు పుట్టాడట!” అంది తల్లి.
“భైరవుడెక్కడుంటాడమ్మా? వాణ్ణి చూడాలనివుంది!” అన్నాడు కొడుకు.
“ఎక్కడో ఉంటాడు. నల్లటి బట్టలు కడతాడట, వాడి దగ్గరికి పొరబాటున కూడా వెళ్ళకుమీ, ఝడు సుకుంటావు!” అంది పార్వతి.
“ఝడుసుకోవడమంటే ఏమిటమ్మా? అది కూడా తెలుసుకోవద్దూ?” అన్నాడు గణపతి.
“పెళ్ళాడితే తెలుస్తుంది!” అంది పార్వతి.
“అదా సంగతి! భార్యారత్నాలు అంటే అంత భయంకరం అన్నమాట, అందుకే నేను పెళ్ళిచేసుకోనమ్మా!” అన్నాడు గణేశుడు.
కుమారస్వామి అందుకొని, “అదే నీ ఘనకార్యం! నేను యిప్పుడేపోయి సూర్యుణ్ణి చుట్టివస్తాను!” అంటూ నెమలి నెక్కి తుర్రుమన్నాడు.
విఘ్నేశ్వరుడు తిన్నగా వెళ్లి మేరు పర్వతం ఎక్కి చిట్టచివర శిఖరాగ్రం మీద కూర్చున్నాడు.
మేరుపర్వతం చుట్టూరా సూర్యుడు తిరుగుతూంటాడు. అక్కడ సూర్యాస్తమయం అనేది ఉండదు.
కుమారస్వామి శ్రమపడి సూర్యుడి చుట్టూరా ప్రదక్షిణం చేసి వచ్చి అన్న మేరుపర్వతం ఎక్కి కూర్చున్నాడని తెలుసుకొని, విచారంగా ముఖం వేల వేసి ఊరుకున్నాడు.
“ఏం కుమారా, అలా తల వేలాడ దీసుకున్నావు?!” అని పార్వతి ఆశ్చర్యపోతూ అడిగింది.
“అమ్మా! నేను సూర్యుడి చుట్టూరా తిరిగితే అన్న సూర్యుణ్ణే తన చుట్టూరా త్రిప్పుకొంటున్నాడమ్మా! నిజం చెప్పాలంటే అన్న చేసినదే ఘనకార్యం!” అన్నాడు కుమారస్వామి.
కొద్దిరోజుల తర్వాత పార్వతి మళ్ళీ పెళ్ళి ప్రస్తావన తెచ్చింది.
“అమ్మా! సౌందర్యంలో నీకు సమఉజ్జీ అయిన సుందరి కనిపిస్తే పెళ్లాడాలని ఉందమ్మా!” అన్నాడు విఘ్నేశ్వరుడు.
పార్వతి చురక తగిలినట్లు పెదవి కరుచుకొని, “అలాగైతే ఇంటి మొగసాల కూర్చొని, దారి వెంట వచ్చేపోయే వాళ్లను చూస్తూండరా, కుంకా!” అంటూ కదిలింది.
“అలాగే తల్లీ! నీ ఆజ్ఞ!” అని వినాయకుడు వీధిలో కూర్చుని కొంత సేపు తూర్పుకి మరికొంత సేపు ఉత్తరంకూ, అలాగ ఎనిమిది దిక్కులకూ ముఖం పెట్టి చూడసాగాడు.
పార్వతి అతని వింత చేష్టకు వింతగా చూసి, “ఏం నాయనా, కనిపించిందా?” అని అడిగింది.
విఘ్నేశ్వరుడు, “అమ్మా! ఏ దిక్కు చూచినా నాకు మరేదీ కనిపించలేదు, జగజ్జననివైన నీవే ఎనిమిది చేతులతో ఎనిమిది దిక్కులా కనిపిస్తున్నావమ్మా!” అన్నాడు.
పార్వతి ఆనందంతో మైమరిచిపోయింది. “నాయనా! విఘ్నరాజా! అందరు దేవుళ్లూ తూర్పుముఖంగా ఉండి పూజలందుకోవాలని నియమం ఉంది గాని, నీవు ఎటు ముఖం పెట్టి ఉన్నా ఆరాధనీయుడవే!” అని వరం యిచ్చింది. అతని పెళ్ళి మాటే మర్చిపోయి, ముద్దులకొడుకు మురిపెంపు మాటలు శివుడితో ఒకటికి రెండుసార్లు చెప్పి చెప్పి ఆనందించింది.
చివరకు పార్వతి పట్టుబట్టి పెళ్ళి ప్రస్తావన తెచ్చింది. “అమ్మా! తమ్ముడు దేవ సేనాధిపతి పదవిలో ఉన్నాడు, అతను ఇద్దర్ని పెళ్ళాడినా తగును. నేను ఊరికే తింటూ కూర్చున్నాను. ఎలా పెళ్ళి చేసుకునేది?” అన్నాడు విఘ్నరాజు.
శివుడు, “నువ్వు నా ప్రమథగణాలన్నిటికీ గణనాథుడివిగా ఉండు!” అన్నాడు.
“నాన్నగారూ! ఉండమంటే సరా? అర్హత ఉండాలిగదా! తమ్ముడు ఎలాగూ సేనాధిపత్యంలో ఆరితేరి ఉన్నవాడు, ఉండనే ఉన్నాడుగదా!” అన్నాడు విఘ్నేశ్వరుడు.
ప్రమథులు కుమారస్వామినే అభిమానించారు. శివుడు, “లేదు, నా గణాలకు గణనాథుడుగా విఘ్నేశ్వరుడే ఉండాలి! కుమారస్వామికి దేవ సేనాధిపత్యం ఉండనే ఉంది, అదీగాక రెండు పనులు చూసుకోవడం శ్రమ కూడా!” అన్నాడు.
విఘ్నేశ్వరుడు, “నాన్నగారూ, ఏదేనా పరీక్ష పెట్టి నెగ్గినవారికే గణనాయకత్వం యివ్వడం సమంజసంగా ఉంటుంది గదా!” అన్నాడు.
దేవతలు, ప్రమథులు కలిసి ఒక పందెం పెట్టారు. ఈ భూమ్మీదున్న అన్ని క్షేత్రాల్ని, తీర్థాల్ని ఎవరు ముందు సేవించి తిరిగివస్తారో వారు గెల్చినట్టు అని.
కుమారస్వామి నెమలి మీద ఎగిరి వెళ్ళాడు. వినాయకుడు చక్కా చతికిల బడి కూర్చున్నాడు.
అప్పుడు విష్ణువు అతణ్ణి ఏకాంతానికి తీసుకెళ్ళి, “నాయనా! మేము నిన్ను అభిమానిస్తున్న వాళ్ళం , నీ ఓటమి మా దేవతలందరి ఓటమీ అవుతుంది, మాకు తల వంపులు తేవడం నీకు భావ్యం కాదు. అదీగాక తండ్రి గొప్పదనం తనయుడు నిరూపించితేనే జన్మసార్ధకత అవుతుంది. నువ్వేమీ తిరగనక్కరలేదు, నేను చెప్పి నట్టు చేస్తే చాలు!” అని విఘ్నేశ్వరుడి చెవిలో రహస్యం ఉపదేశించాడు.
పార్వతి 'హమ్మయ్య' అనుకుంటూ విష్ణువును కృతజ్ఞతగా చూసింది.
విఘ్నేశ్వరుడు మఠం వేసి కన్నులు మూసి శివపంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ కూర్చున్నాడు.
కుమారస్వామి వెళ్ళినచోటల్లా అంత కంటే ముందే విఘ్నేశ్వరుడు ఎలుక మీద వచ్చి తీర్థమాడి సేవించి వెళ్ళినట్లు తెలుసుకొని ఆశ్చర్యపడుతూ హతాశుడై తిరిగి వస్తూనే తాను ఓడిపోయినట్లు విఘ్నేశ్వరుడిదే విజయమని చెప్పాడు.
విఘ్నేశ్వరుడు తమ్ముడితో చేతులు కలిపి శివుడి వద్దకు తీసుకెళ్లి, “తమ్ముడూ! నేను జయించనూ లేదు, నీవు ఓడనూ లేదు. మనం ఇద్దరం నిమిత్తమాత్రులం, జయించింది. నాన్నగారే! శివపంచాక్షరీ మహిమ అలాంటిది. గెలిచినది శివనామం గెలిపించింది. విష్ణువు!” అని జరిగింది చెప్పాడు.
విఘ్నేశ్వరుడు కుమారస్వామి చేరో పాదమూ పట్టుకొని తండ్రికి మ్రొక్కారు.
కుమారస్వామి అందరి మధ్య నిలబడి, “విఘ్నేశ్వరుడికి ప్రమథ గణాధిపత్య పట్టాభిషేకం సత్వరమే జరగాలి, శివుని ఆజ్ఞ అందరికీ శిరోధార్యము!” అని నొక్కి చెప్పాడు.
దేవతలు సంతోషించారు. సిద్ధ, సాధ్య, యక్ష, భూత గణాల వారంతా హర్షం ప్రకటించారు. ప్రమథగణ ప్రముఖులైన భృంగీశ్వర, శృంగీశ్వర, చండీశ్వర, నందీశ్వరులు మాత్రం వ్యతిరేకించారు. లోగడ పుత్రగణపతి రూపంతో వాళ్ళను విఘ్నేశ్వరుడు శృంగభంగం చేశాడు.
ఆ అక్కసుతో వారు, “కుమారస్వామికి తన బలాలు అంటూ దేవగణ సేనలు ఉన్నాయి, మేము శివుడి నమ్మిన బంట్లుగా శివగణంగా మొదటినుంచీ పరిగణింపబడుతున్నాం. అటువంటప్పుడు విఘ్నేశ్వరుడు మాకు అధిపతి ఎలాగ అవుతాడు? గణపతి అనిపించుకోడానికి కూడా అతనికి తనది అంటూ ఎలాంటి బలగమూ లేదు, గణాధిపత్య పట్టాభిషేకం దేనికి?” అని కుళ్ళు వెళ్ళ బోసుకున్నారు.
శివుడు కళ్ళెర్రజేశాడు, “నా నిర్ణ యాన్నే అధి క్షేపించగలంత గొప్పవారై పోయారా మీరు!” అని ప్రమథనాయకుల్ని ఈసడించుకున్నాడు.
విఘ్నేశ్వరుడు శాంతంగా, “ఔను, ఔను, నిజమే నా గణాలు ఎక్కడ? ఏవీ? లేవు, లేవు కాబోలు! అన్నట్టు పుత్ర గణపతిగా ఉన్నప్పుడు నాకూ కొంత బలగం ఉన్నట్లు అనుమానం, ఆ గణాలు ఎక్కడ? ఎక్కడ?” అని అరిచాడు.
అప్పుడు కోటాను కోట్ల విఘ్నేశ్వరుడి లాంటి వారు దిక్కులు ఈనినట్లు పుట్టు కొచ్చి దిక్కులు పిక్కటిల్లేలాగ జయజయ ధ్వానాలు చేస్తూ విఘ్నేశ్వరుడి బలాలుగా వచ్చి నిల్చున్నారు.
వారందరికీ తలా నాలుగు చేతులున్నాయి. నాలుగు చేతుల్లో అనేక ఆయుధాలు, పరికరాలు, చిత్రవిచిత్ర వస్తు జాలమూ ఉన్నాయి. కొందరి చేతుల్లో గంటాలు, లేఖినులు, కుంచెలు, రంగులు ఉంటే మరికొందరి చేతుల్లో శూలాలు, విల్లమ్ములు, కత్తులు, గదలు ఉన్నాయి. కొందరు కొడవళ్ళు, సుత్తులు, కత్తులు, రంపాలు, ఉలులు, శేనాలు పట్టుకొని ఉన్నారు. మరికొందరు వీణలు, మృదంగాలు, వేణువులు, డప్పులు వాయిస్తున్నారు. మూలికలు, ఔషధాలు, పానీయాలు, నాగళ్ళు, రాట్నాలు, నవరత్నా భరణాలు, పూలమాలలు, పండ్లూ, తిను బండారాలు మొదలైన వెన్నెన్నో పట్టుకొని ఉన్నారు. వారి మధ్య దేవుళ్ళూ దేవతలూ ప్రమథాది గణాల వాళ్ళు బియ్యం రాశిలో రాళ్ళలా అక్కడక్కడ కనిపించారు.
విఘ్నేశ్వర రూపులు కొందరు ఆకాశంలో ఎగురుతూ అంతరిక్షానికి దూసుకుపోతున్నారు. ఆ గణాధిపగణాల చేతుల్లో ఛత్రచామరాలు, వీవనలు, వింజామరాలు ఆడుతున్నవి. ఆకాశంలో రెపరెపలాడుతున్న అరుణారుణపతాకాల్ని, ఇంకా అనేక రంగురంగుల ధ్వజాల్ని పట్టుకొని ఉన్నారు. వారు రత్నభూషితమైన పెద్ద భద్రసింహాసనాన్ని తెచ్చారు. విఘ్నేశ్వరుణ్ణి దానిపై కూర్చుండబెట్టి ఛత్రచామరాలు పట్టారు. శ్వేతఛత్రం ముత్యాల జాలరులతో ప్రకాశించింది. చిట్టెలుక సింహాసనం కింద చిందులు వేసింది.
పార్వతి మరొకసారి మళ్ళీ మైమరిచి భద్రసింహాసనాశీనుడైన విఘ్నేశ్వరుడికి నమస్కరించబోయింది. “అమ్మా! అమ్మా! వద్దు, నీ ముద్దుల కుమారుణ్ణి,” అని విఘ్నేశ్వరుడు వారిస్తూ చేతులూపేసరికి అంతా అదృశ్యమై, విఘ్నేశ్వరుడు ఒక్కడూ వినయంగా తల్లికి ప్రణమిల్లాడు.
“విఘ్నేశ్వరా!” అన్న పిలుపు శంఖ ధ్వనిలా వినిపించింది. ఆ పిలిచింది విష్ణువు. విఘ్నేశ్వరుడు అటు చూడకుండానే, “నువ్వు చెప్పబోయేది నాకు తెలుసు!” అన్నాడు.
“నీకు తెలిసినా, అది అందరికీ కూడా తెలియాలికదా, అదే చెబుతున్నాను!” అంటూ విష్ణువు, “విఘ్నేశ్వరుడి పెళ్ళి వేయి విఘ్నాల సామెతగా విఘ్నేశ్వరుడు కల్పించుకొన్న విఘ్నాలు ఇప్పటికి వెయ్యి పూర్తయ్యాయి! ఇటు పైని విఘ్నం కల్పించుకోడానికి వీల్లేదు, కల్పించుకొన్నా చెల్లదు!” అని గట్టిగా పలికాడు.
--(ఇంకా వుంది)
Post a Comment