విఘ్నేశ్వరుడు (చందమామ)_05 Vignaeswarudu Novel (CHANDAMAMA)

 విఘ్నేశ్వరుడు (చందమామ) 

Vignaeswarudu Novel (CHANDAMAMA)

5. విజయ విఘ్నేశ్వరుడు


పార్వతి క్షణంలో తన దుఃఖమంతా మరిచిపోయి, పిల్లవాణ్ణి ఎత్తుకుని దిష్ఠి తీసింది. శివుడు చేతులు చాచి పిలిచాడు. శివుడు మళ్ళీ ఏం చేసి పోతాడో అని  భయం భయంగా తప్పటడుగులు వేస్తూ వెళ్ళిన విఘ్నేశ్వరుడి ముద్దు చేష్ఠలకు అంతా ముచ్చటపడ్డారు.


“నాయనా, విఘ్నేశ్వరా! నిన్ను పుత్రుడిగా పొంది ధన్యులం అయ్యాం. చిరంజీవ!” అని శివుడు ఎత్తి ముద్దాడుతూంటే విఘ్నేశ్వరుడు కిందకు దూకి, “తండ్రీ! ఎంతమాట, నేను మీ కొడుకుని, ధన్యుణ్ణి నేను!” అంటూ పార్వతీశివుల పాదాలను చిరుతొండంతో చుట్టి, కళ్ళ కద్దుకొని ప్రణామాలు చేశాడు. తరవాత విష్ణువును సమీపించి ఆయనకు ప్రణామం చేశాడు.


విష్ణువు, “రావోయి ముద్దుల మేనల్లుడా!” అని దగ్గరకు తీసుకొని, “కళ్యాణ మస్తు!” అని దీవించాడు.


అప్పుడు విష్ణువు కాంతిలో విఘ్నేశ్వరుడు నీలాకాశం రంగులో కనిపించాడు. విష్ణువుకీ, విఘ్నేశ్వరుడికీ ఏవో పోలికలున్నట్లు అందరికీ తోచింది. అదే మేనమామ పోలిక అంటే! అని అనుకున్నారు.


వినాయకుడు బ్రహ్మకు నమస్కరించాడు. బ్రహ్మ, “తొలిపూజలందుకోవయ్యా బొజ్జగణపయ్యా!” అని అంటూ అతని ఏనుగబుగ్గలు చిదిమిచిటిక వేశాడు.


తర్వాత విఘ్నేశ్వరుడు లక్ష్మీకి, సరస్వతికి మ్రొక్కాడు. వాళ్ళిద్దరూ కలిసి అతణ్ణి ఎత్తుకుని చెరో చెంపా ముద్దాడి, “మేము విఘ్నేశ్వరుడి ఇరుపక్కలా అత్తా కోడళ్ళ పొరపొచ్చాలు మాని ఇలాగే సఖ్యంగా ఉంటాము!” అని పార్వతిని చూసి, “ముగ్గురమూ ఒకే ముగ్గురమ్మల మూలపుటమ్మ నుండి వచ్చిన సంగతి పుత్రగణపతి చెప్పనే చెప్పాడు. తర్వాత మళ్ళా విడివిడిగా క్షీరసాగరం నుంచి లక్ష్మి, బ్రహ్మ నాలుక నుండి సరస్వతిగా వాణి, మొదట దక్షుని కుమార్తె సతీదేవిగాను, ఇప్పుడు హిమవంతుని పుత్రి పార్వతిగా ఉమ అవతరించాము. జయలక్ష్మి అనే సిద్ది, విద్యావతి అనే బుద్ధి వినాయకుడికి తగిన వధువులు. ఇహ విఘ్నేశ్వరుని పెళ్ళి ముచ్చటే చూడాలి!” అని అన్నారు.


లక్ష్మి, “లక్ష్మికరుడైన విఘ్నేశ్వరుణ్ణి నమ్మిన వారిని స్థిరంగా అంటి పెట్టుకొని ఉంటాను! సిద్ధిస్వరూపిణి జయలక్ష్మి నా అంశ. వినాయకుడికి కానున్న భార్య!” అని చెప్పింది.


సరస్వతి, “విఘ్నేశ్వరుడు జ్ఞానప్రదాత, విజ్ఞానదాయకుడు. అక్షరాభ్యాసానికి ముందు పిల్లలచేత పసుపు ముద్ద విఘ్నేశ్వరుడి పూజ జరిపించి, విఘ్నేశ్వర పరిపూర్ణస్వరూపంగా గుండ్రంగా చుట్టించి మరీ ఓనమాలు దిద్దించాలి; నా అంశగల విద్యావతి బుద్దిరూపిణి, వినాయకుని నాయకి!” అని చెప్పింది.


అప్పుడు విఘ్నేశ్వరుడు బేలముఖం పెట్టి, అందరినీ కలయజూచి, “చూశారా! పెద్దల తీరు ఎలా ఉందో! పెళ్ళి చేసుకొని, వారు పడ్డ ఆవస్థలే పిల్లలు కూడా పడాలని పెళ్ళితొందర పెడతారే గాని, హాయిగా ఉండనివ్వరు. అందునా అమ్మలకు మరీ ఆరాటం! అన్నాడు.


అప్పుడు విష్ణుమూర్తి, “లేదురా బాబూ! అణిమాదిసిద్ధులకు, అష్టఐశ్వర్యాలకు మూలమైన సిద్ధులు ఎనమండుగురు, చక్కనిచుక్కలై నిన్ను పూర్ణ చంద్రుణ్ణి కొలిచినట్లు సేవిస్తూంటే చూడాలని తొందరగానే ఉంది. సుమీ!” అన్నాడు.


విఘ్నేశ్వరుడు, “ఓహెూ! అలాగా, నువ్వు కృష్ణావతారంలో అష్టమహిషులతో వేగుతూ ఆనందిద్దువు గానిలే!” అన్నాడు.


విష్ణువు మందహాసం చేసి, “నీ మాటకు తిరుగులేదు కాని, నీకు మాత్రం పదిమంది వధువుల పెళ్ళి తప్పదు!” అన్నాడు.


“అలాగైతే విఘ్నేశ్వరుడి పెళ్ళికి వెయ్యి విఘ్నాలు అన్న సామెతగా, నేనే విఘ్నాలు కల్పించుకోక తప్పదు!” అన్నాడు విఘ్నేశ్వరుడు.


“వెయ్యి కాదు, కోటి విఘ్నాలు వచ్చినా విఘ్నేశ్వరుడి పెళ్ళి ఆగదు!” అని బ్రహ్మతో గొంతులు కలిపి అందరూ అన్నారు.


అప్పుడు నారదుడు ముందుకు వచ్చి, “విజ్ఞానేశ్వరా! వాచాలతలో నన్ను మించావు కాని, పెళ్ళి తప్పించుకోవడం ఎవరితరం! నేను సంసార సాగరం ఈదడం చాతగాకనే కదా మునినై తిరుగుతున్నాను.

జ్ఞానేశ్వరా! కళ్యాణం, ఉద్యోగం పురుషలక్షణం అని పురుషోత్తములూ ఆది దేవుళ్ళూ అనిపించుకున్న ప్రముఖులంతా పెళ్ళిళ్ళు చేసుకొని సృష్టి , స్థితి, లయాది ఉద్యోగాలు చేస్తున్నారు. నీవూ, నేనూ అనగా ఎంత!” అన్నాడు. 

విఘ్నేశ్వరుడు నవ్వి, “ఓహ్హెూ! నీకూ పెళ్ళి పిచ్చి తగిలే లాగుందే! స్వయంవరానికి కూడా వెళ్ళేవులాగుంది!” అన్నాడు.


నారదుడు, “త్రికాల వేదిని నేనేననుకుంటే అనంతకాలవేదివి నీవు. నీతో వాదించటం నా తరమా? మాటకారి తనంలో నీ తర్వాతనే నేను. అందరి జాతకాలూ నీ చేతుల్లోనే ఉన్నాయి. నిన్ను విస్మరించిన ఎలాంటి ఉద్దండ జ్యోతిషపాండిత్యమూ ఫలించదు. మనం ఇద్దరం మేలురకం వాగుడుకాయలం! మాటలకు దిగితే అనంతకాలం చాలదు గాని, నీవు పూర్ణజ్ఞానివి. మా లాంటి అర్ధజ్ఞానులు ఎలాంటి పిచ్చిలో పడ్డా నీ లాంటి వాళ్ళు తామరాకు మీద నీటిబొట్టు లాగ దేనికి లొంగిపోరు. నీవు మాయకు అతీతుడివి. కాబట్టి సిద్ధిబుద్ధులు, అష్టసిద్ధులూ నిన్ను వరించుతాయని, నన్ను కూడా శ్రీరస్తు శుభమస్తు, శీఘ్రకళ్యాణ సిద్ధిరస్తు! అని పలికించనియ్యి,” అని అంటూ మహతి వీణపై కళ్యాణి రాగం మొదలు పెట్టి సామరాగం అందుకొని సౌరాష్ట్ర రాగంతో మంగళగీతాన్ని పలికించాడు.


దేవతలంతా ఎవరితావులకు వారు వెళ్ళారు. విఘ్నేశ్వరుణ్ణీ, పార్వతినీ, వెంటబెట్టుకుని శివుడు తన నిజనివాసమైన కైలాసానికి వెళ్ళాడు. నారదుడు తిన్నగా వజ్రదంతుడి దగ్గరికి బయలుదేరాడు.


ఆనాడు పుత్రగణపతి తోక పట్టి గిరగిరా తిప్పి విసిరితే పడ్డపాటుకు వజ్రదంతుడి ఒళ్ళునొప్పులు యింకా తీరనే లేదు. ధవళ, భర్తకు పరిచర్యలు చేస్తున్నది. వచ్చిన నారదుణ్ణి చూసి, మళ్ళీ ఏం గొడవ తెచ్చి పెడతాడో అని అనుకుంటూనే లోనికి వెళ్ళింది.


నారదుడు మూషి కాసురుడితో, “నిన్ను పరాభవించిన గణపతి విఘ్నేశ్వరుడిగా వర్ధిల్లుతున్నాడు. మరి .....,” అంటూ ఆగాడు.


పరాభవాగ్ని రగిలి. వజ్రదంతుడు, “ఇప్పుడేం చెయ్యమంటావు, నారదా?” అని బిక్కముహం పెట్టాడు.


నారదుడు, “వరాలదేవుడు బ్రహ్మ ఉండనే ఉన్నాడుగదా! వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి! ప్రతీకారం సాధించు. గణపతి విఘ్నేశ్వరనామం ధరించాడు, గజముఖుడు! గుర్తుంచుకో!” అని చెప్పి చల్లగా వెళ్ళాడు.


మహాశ్వేత అనే నామాంతరం గల ధవళ ఎంత చెప్పినా వినకుండా, వజ్రదంతుడు, “మహాశ్వేతా! నీ పసుపుకుంకాల పుణ్యమా అని నా కెలాగూ చావు భయం లేదుగద! ప్రతీకారం చేసి మనశ్శాంతిని పొందనివ్వు!” అని చెప్పి ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మను ప్రసన్నం చేసుకొన్నాడు.


“ఏం కావాలి యింకా?” అని బ్రహ్మ అడిగాడు.


“విఘ్నానికి రూపం కల్పించి, నా ఆజ్ఞానువర్తిగా చెయ్యి!” అని మూషి కాసురుడు కోరాడు.


బ్రహ్మ విఘ్నాన్ని ఆవాహన చేసి వజ్రదంతుడి ముందుంచాడు. అతడికేమీ కనిపించలేదు. బ్రహ్మ అతనికి సూక్ష్మదర్శన దృష్టి యిచ్చాడు. విఘ్నం మామూలు కంటికి కనిపించని కారు నల్లని సూక్ష్మక్రిమి రూపంలో అతడికి కనిపించింది.


మూషికాసురుడు ఆశ్చర్యంతో, “ఇదేమిటి! ఈ నలుసును ఏం చేసుకోను?” అన్నాడు.


బ్రహ్మ నవ్వి, “విఘ్నం పెనుభూతంలాగ ఉంటుందనుకున్నావు కాని, విఘ్నబీజం కంటికి కనిపించని సూక్ష్మాణువు, సూక్ష్మక్రిమి వల్ల భయంకర వ్యాధి వ్యాపించినట్లే, అనర్ధదాయకమైన విఘ్నకారణం ఎంత చిన్నదైనా, ఎంతటి భీషణాకృతినైనా ధరించి సర్వనాశనం చేయగలదు! కామరూపి, ఏ రూపాన్నైనా ధరించి, అనర్థాలు కలిగించటమే దాని పని. ఏం చేసుకుంటావో చేసుకో!” అని చెప్పి అంతర్ధానమయ్యాడు.


మూషికాసురుడు విఘ్నంతో, “నువు వెంటనే మహా గజాసుర రూపంతో వెళ్ళి విఘ్నేశ్వరుణ్ణి నాశనం చెయ్యి!” అని ఆజ్ఞాపించాడు.


విఘ్నం ఏనుగ శరీరమూ, ఏనుగ కాళ్ళూ, భయంకరమైన చిన్నతలా, పెద్ద కోరలూ, నిప్పుల్లాంటి కళ్ళుగల గజాసుర రూపం పొంది, మహా పర్వతం లాగ కత్తి ఝళిపిస్తూ ఆకాశానికి ఎగిసి ఎగురుతూ వెళ్ళాడు.


కైలాసంలో విఘ్నేశ్వరుడు అల్లారు ముద్దుగా పెరిగి, తలిదండ్రుల అనుమతితో తాను పుట్టిన విశ్వకర్మ నిర్మించిన భవనానికి బయలుదేరాడు. ఎదురుగా వస్తూ మన్మధుడు రూపంతో కనిపించాడు. విఘ్నేశ్వరుడు ఆశ్చర్యంగా. “కనిపించని వాడివి కనిపించావు. ఏమిటి విశేషం? నా మీద నీ విలువిద్య చూపకుమీ! అర్భకుణ్ణి,” అన్నాడు.


మన్మధుడు వినయంగా తల వంచి, “గజేంద్రాననా! నీవు నా బాణాలకు అతీతుడివి. నాకు కనిపించాలని ఉంటే కనిపించే వరం శివుడు యిచ్చినదే గదా. దగ్గిర పోలికలున్న దగ్గిరవాళ్ళం గనుక కనిపించాను. అంతే! నీవు ఎద్దు నెక్కిన శివుడి కొడుకువైతే, నేను గ్రద్దనెక్కిన విష్ణువు కుమారుణ్ణి. నన్ను శివుడు దహించి బ్రతికించాడు. నిన్ను ఖండించి బతికించాడు. నా వాహనం చిలుక, నీ వాహనం ఎలుక. మనస్సును చలింపజేసే పూలమ్ములు నా ఆయుధాలైతే, మనోనిగ్రహాన్ని యిచ్చే పాశాంకుశాలు నీ ఆయుధాలు. మరి నీకు తమ్ముడు కుమారస్వామి పుట్టాలి గదా? పార్వతీ పరమేశ్వరుల పరస్పర అనురాగ తేజస్సే కుమారస్వామిగా అవతరించాలి! తారకాసుర నిర్మూలన జరగాలి. అందుకే గదా నన్ను దేవతలు బూడిద కూడా చేయించింది. కైలాసం చేరబోతున్నాను. అనుజ్ఞ యివ్వు!" అన్నాడు.


విఘ్నేశ్వరుడు, “మన్మధా! అందుకే నేనూ కైలాసం దిగి వెళ్తున్నదీను. నీ పని నిర్విఘ్నంగా నెరవేర్చు, జయప్రదమవుతుంది!” అన్నాడు.


మన్మధుడు అదృశ్యుడై పార్వతీ శివులున్న కైలాస మంటపాన్ని చేరుకున్నాడు.


విఘ్నేశ్వరుడు భవనాన్ని చేరుకొని, సింహద్వారానికి చేరువగా చంద్రశిలా వేదిక పై సుఖంగా కూర్చొని పరిసర ప్రకృతిని ఆనందంగా చూస్తున్నాడు. మెరుగు పెట్టిన వెండి హిమగిరి శిఖరాలు సంధ్య కాంతుల్ని తళతళ ప్రతిఫలిస్తున్నాయి. హిమానీ జలపాతాలు మంద్ర గంభీరంగా సరిగమలు వినిపిస్తున్నాయి. అలాంటి ప్రశాంత సమయంలో, ‘‘విఘ్నేశ్వరుడనేవాడు ఎక్కడ?” అనే భీకరగర్జన దిక్కులు మారు మోగుతూ వినిపించింది.


మహా గజాసుర రూపం ధరించిన విఘ్నం, విఘ్నేశ్వరుడి ఎదురుగా వాలింది. భూమి కంపించింది. గజాసురుడు, “నేను మహా గజాసురుణ్ణి. నువ్వు గజముఖుడివైతే, నేను గజకాయుణ్ణి! నిన్ను హత మార్చవచ్చాను!” అంటూ రంకె వేశాడు.


విఘ్నేశ్వరుడు చెవిటివాడి లాగ అమాయకంగా చూస్తూ, “అబ్బీ, ముక్కలు నరుక్కొని చెరుకుగడ తినాలని ఉంది. గొడ్డలి కాస్త పదును పెట్టి యిస్తివా నీకు కుడుములు పెడతాను.” అని అంటూ పరశువును వాటంగా విసిరాడు. గజాసురుడి కాళ్ళు తెగి పర్వతంలా కూలాడు. విఘ్నేశ్వరుడు ఎక్కి తాండవం చేస్తూ మర్దిస్తూంటే, “మహాప్రభో! నేను విఘ్నాన్ని! బ్రహ్మ యిచ్చిన వరం మేరకు మహా గజాసుర రూపంలో వచ్చాను, శాస్త్రి అయింది!” అని విఘ్నం అరిచింది.


విఘ్నేశ్వరుడు, “నేను విఘ్న వినాశకుణ్ణి! అదీగాక నువ్వు ఇప్పుడు మాయదారి గజాసురుడివి. నిన్ను తుత్తునియలు చేయక తప్పదు. నీ తునకలు నన్ను. నిన్ను ఏమర్చిన వాళ్ళను మాత్రమే పట్టి పీడిస్తాయి. నువ్వు కాళీయనాగుడవై కాళింది మడుగున దాగి ఉండు. బాల కృష్ణుడు నిన్ను మర్దిస్తాడు. అతని పాదాలు నీ తలల మీద పడి నీ పాప పరిహారం అవుతుంది; జాతి సర్పాల పడగల పై విష్ణు పాదముద్రలు అది మొదలు అలంకారంగా శోభిస్తాయి!” అని చెప్పి, పరశువును పట్టి విఘ్నాన్ని ఛిన్నాభిన్నం చేశాడు. ఆ రేణువులు అంతటా వ్యాపించి అదృశ్యమయాయి. విఘ్నం అణురూపంతో మిగిలింది. దేవతలు విఘ్నేశ్వరుడిపై పూల జల్లు కురిపించారు.

--(ఇంకా వుంది)

Post a Comment

Previous Post Next Post