విఘ్నేశ్వరుడు (చందమామ)_04 Vignaeswarudu Novel (CHANDAMAMA)

 విఘ్నేశ్వరుడు (చందమామ) 

Vignaeswarudu Novel (CHANDAMAMA)

4. మహాగణాధిపతి


పార్వతి పుత్రగణపతి కేకకు బిరబిరా వచ్చి, తల తెగిపడి ఉన్న బాలుణ్ణి చూసి, శివుణ్ణి చురచుర చూస్తూ, “ఎంత పని చేశావు! మన పుత్రుణ్ణి నరికావు! పుత్ర హంతకుడివి!” అంటూ కుప్పలా కూలబడి భోరుమని శోకించసాగింది.


అంతవరకు స్తంభించిపోయి చూస్తున్న గుంపులో ఒక్కసారిగా కలకలం సముద్రఘోషలాగా చేలరేగింది. పెద్ద నేరం చేసిన వాణ్ణిలాగ శివుణ్ణి చూడసాగారు. శివుడికి ముచ్చెమటలు పోశాయి. బిక్కముఖం పెట్టి, “నాకు తెలియని పుత్రుడా! ఎలాగ వచ్చాడు?” అన్నాడు.


పార్వతి తనవంటికి పెట్టుకున్న నలుగు ముద్ద ఏ విధంగా పుత్రగణపతి అయినదీ చెప్పింది. దానికి శివుడు పెదవి విరిచి, కోపంగా చూస్తూ, “నీకు కుమారుడైతే కావచ్చు, అందుకే అమ్మ, అమ్మ అంటూ తెగ వాగాడు. మన పుత్రుడంటున్నావు, నాకు పుత్రుడెలాగ అవుతాడు?” అవి అడిగాడు.


పార్వతితెల్లబోయింది. అప్పుడు విష్ణువు బ్రహ్మకు సైగచేశాడు. బ్రహ్మ ముందుకు వచ్చి, “శివుడు పార్వతిచేతిని పుచ్చుకున్నప్పుడే శివుడి తేజస్సు పార్వతి శరీరంనిండా ప్రవేశించి పులకరింపజేసింది. అది మొదలు శివుడు, పార్వతిలో సగభాగంగా అంతర్లీనమై ఉంటూనే ఉన్నాడు. పుత్రగణపతి శివుడి కుమారుడే!” అని నాలుగు నోళ్ళతో నొక్కి చెప్పాడు.


శివుడు చేతులు నలుపుకొంటూ  దిక్కులు చూస్తూంటే, పార్వతి బాలుడి కళేబరం మీదపడి ఏడుస్తూంటే, ఆకాశం నుండి, “ఉత్తర దిక్కుకు తల పెట్టి నిద్రిస్తున్న తలను తెచ్చి నాకు అతికించండి,

నేను లేస్తాను!” అన్న పుత్రగణపతి వాక్కులు వినిపించాయి.


వెంటనే దేవతలూ, ప్రమథులూ అంతా గాలిస్తూ ఎంత వెతికినా ఉత్తర దిక్కుకు తల పెట్టి నిద్రిస్తున్న వాళ్ళెవ్వరూ కనిపించలేదు.


ఇంకా వెతుకుతూ పోగా పోగా సహ్యాద్రి పర్వతం మీద బిల్వవనంలో ఒక తెల్లని ఏనుగుగున్న మాత్రం ఉత్తర దిక్కుకు తల పెట్టి నిద్రిస్తూనే, శివస్మరణ చేస్తూ కనిపించింది.


ఆ ఏనుగుగున్న దేవలోకంలో దేవతా గజమైన ఐరావతం కుమారుడైన గజేంద్రుడు. ఐరావతం ఇంద్రుడి వాహనం. ఒక సారి ఇంద్రుడు అలా వస్తూంటే గజేంద్రుడు అతణ్ణి లెక్కచేయకుండా తన ధ్యాసలో తానుండటం చూసి ఇంద్రుడు కళ్ళెర్రజేసి, “నా వాహనం కొడుక్కు ఇంత పొగరా!” అని దుర్భాషలాడాడు.


అప్పుడు గజేంద్రం శాంతంగా, “నా తండ్రి తనవిధిని తాను చేస్తున్నాడు, అంత మాత్రం చేత నీవు మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడవలసిన పని లేదు, నేను నీకు భయపడాల్సిందేమీ లేదు!” అన్నాడు.


“నేను దేవేంద్రుణ్ణి రా, ఏనుగా!” అన్నాడు ఇంద్రుడు గర్వంగా.


“ఔను, నేను ఏనుగును, గజేంద్రుణ్ణి! మరొకరు నాగేంద్రుడైతే, ఇంకొకరు పక్షింద్రుడు. ఇలా ఎంతమంది ఇంద్రుళ్లున్నా ఉండవచ్చు. నూరు యజ్ఞాలుచేస్తే చాలు, ఇంద్రపదవి పొందవచ్చు, తపస్సుతో సాధించవచ్చు. అందుకే ఎవరెక్కడ ఏది చేస్తున్నారని తెలిసినా నీకు తగనిభయం! ఇంద్రత్వం ఏమంత గొప్పదని నీవు జ్ఞానంతో చెప్పుకొంటున్నావు?” అన్నాడు గజేంద్రుడు.


ఇంద్రుడు రెచ్చిపోయి శపించుతున్నట్లుగా, “నీ తల తెగా!” అని తిట్టాడు.

గజేంద్రం నవ్వుతూ , “శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదుగదా, ఆ తలముందే నీ తల వంచవలసి వస్తుందేమో ఎవరి కెరుక!” అన్నాడు.


గజేంద్రం గొప్ప జ్ఞాని అని గుర్తించలేని గర్వాంధుడైన ఇంద్రుడు, “ఆ శివుణ్ణే నమ్ముకో, భూమ్మీద పడు!” అని గజేంద్రాన్ని స్వర్గం నుండి కిందకు తోసేశాడు. గజేంద్రం సహ్యపర్వతం మీద పడి, ఎల్లప్పుడూ శివసంస్మరణం చేసుకుంటూ, శివుడి నివాసమైన కైలాసం ఉండే ఉత్తర దిక్కుకే తల పెట్టుకొని నిద్రిస్తూండేది.


దేవతలు గజేంద్రం తలను నరికి తీసుకెళ్ళారు. ఆ తలను శివుడు బాలుడి కళేబరానికి అతికించగానే పుత్రగణపతి ఏనుగు ముఖంతో కళకళలాడుతూ లేచి నించున్నాడు.


“నా ముద్దులయ్యకు ఏనుగు ముఖం ఏమిటి? నేను చూడలేను,” అని పార్వతి దుఃఖంతో కళ్ళు మూసుకొంది.


అప్పుడు గజముఖుడు వీనులు విందు చేసేస్వరంతో, “అమ్మా! ఎందుకు విచారిస్తావు? జరగాల్సిందంతా నిర్విఘ్నంగా జరిగింది! ఆనాడు మీరిద్దరూ గోడ మీద ఏనుగుల చిత్రాన్ని చూస్తున్నప్పుడు కనిపించిన నన్ను గుర్తించలేదా? విఘ్నేశ్వరుణ్ణి!” అన్నాడు.


ఆ మాటలు వింటూనే పార్వతికి కల వచ్చినట్లుగా ఆ విశేషమంతా కనిపించింది. శివుడికీ అలాగే విఘ్నేశ్వరుడు స్ఫురణకు వచ్చాడు.


“విఘ్నేశ్వరా! నీవా, మాకు పుత్రుడవై అవతరించావా! ఇందుకా నన్ను అంతగా కవ్వించి కయ్యానికి కాలుదువ్వి, నాకు కోపం తెప్పించింది! నాకు యిప్పుడు అంతా బోధపడుతున్నది, నీ లీల అద్భుతం!” అన్నాడు శివుడు.


“లేకపోతే గజాసురుడికి , నువ్వు ఇచ్చిన వాగానాలు ఎలాగ నెరవేరతాయనుకున్నావు?” అని విఘ్నేశ్వరుడు జ్ఞాపకం చేశాడు.


శివుడు, “బాగా జ్ఞాపకంచేశావు, నేను గజచర్మాన్ని కూడా కట్టుకోవలసి ఉన్నది. ఏనుగుతల నా కుమారుడికి ఉండనే ఉన్నది!” అన్నాడు. ఆ తర్వాత గజచర్మాన్ని తెప్పించి కట్టుకున్నాడు.


శివుడు విఘ్నేశ్వరుడికి వినయంగా వంగి, “విఘ్నేశ్వరా! నీ విశ్వరూపాన్ని చూపించు!” అని కోరాడు.


అప్పుడు విఘ్నేశ్వరుడు ఆకాశానికి పెరిగి ఐదుతలలతో కనిపించాడు. భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశము అనే పంచభూతాల రంగులైన ఆకుపచ్చ, మబ్బు రంగు, ఎరుపు, తెలుపు, నీలం రంగులు అయిదు ఏనుగు తలలకూ ఉన్నవి. ఆ తలలపై నక్షత్రాలు తల పూవులుగా మెరుస్తున్నవి. విఘ్నేశ్వరుడి గుండ్రని పెద్ద బొజ్జ మినుకు మినుకుమనే కాంతులతో ఆకాశాన్ని పోలి ఉన్నది. అతని అనేకమైన చేతుల్లో అంకుశము, గొడ్డలి, పాశము, కలశములతో బాటు త్రిమూర్తు లకు చెందిన శంఖ చక్ర గదా పద్మ ఢమరుక త్రిశూల వజ్రాయుధాలు, జపమాల, కమండలువు. వీణ, ఖడ్గము, శక్తి ఈటె మొదలైనవన్నీ ఉన్నాయి. అతని రూపాన్ని తలలు పైకి సారించి చూస్తున్న వారంతా కళ్ళు మిరుమిట్లు గొలిపే అతని తేజస్సు చూడలేక తలలు దించారు. అప్పుడు అందరిలోనూ ఏదో మహానందం కలిగింది. సరస్వతి వీణ తీసి విఘ్నేశ్వరుడికి ప్రియమైన హంస ధ్వని రాగాన్ని సంరంభంగా దురితగతితో పలికిస్తూంటే, నారదుడు మాయామాళవ గౌళ రాగాన్ని మధ్య మధ్య జోడించాడు. శివుడు ఆనందతాండవం చేశాడు.


ఇంద్రుడితో సహా ముక్కోటి దేవతలు తలలు వంచి విఘ్నేశ్వరుడికి నమస్కరించారు. అప్పుడు ఇంద్రుడి చెవుల్లో, 'ఆ తల ముందే నీ తల వంచవలసి వస్తుందేమో!' అని గజేంద్రం అన్న మాటలు గింగురుమన్నాయి. పుత్ర గణపతికి అతికిన తల గజేంద్రానిదని అతనికి తెలుసు. ఇంద్రుడు చెవులు పటు కొని మూడుసార్లు వంగి లేస్తూ లెంపలేసు కొని సాష్టాంగపడి మ్రొక్కి, “గజేంద్రా! నీవు జ్ఞానివి, నేను అజ్ఞానిని. నా గర్వాన్ని మన్నించు!” అని మనస్సులో అనుకున్నాడు. దేవతలంతా ఇంద్రుడు చేసినట్లే అనుకరించి మ్రొక్కారు.


విశ్వరూపం దాల్చిన విఘ్నేశ్వరుడితో శివుడు, “విఘ్నేశ్వరా! నీ రూపానికి ఎన్నో విశేషార్థాలున్నట్లుగా మాకు తోస్తున్నది, తెలుసుకోవాలని కుతూహల పడుతున్నాము,” అని అన్నాడు.


విఘ్నేశ్వరుడు, “శివభక్తుల సమ్మేళనమే యీ విశ్వం. నేను విశ్వజననీజనకులైన పార్వతీ శివులకు పుత్రుణ్ణి మాత్రమే, వారికి అంజలి ఘటిస్తున్నాను!” అని అంటూ చేతులెత్తిజోడించి ఊరుకున్నాడు.


బ్రహ్మముందుకు వచ్చి యిలా చెప్పాడు: “ మత్స్యావతారం ఎత్తి విష్ణువు సోమకాసురుణ్ణి సంహరించి వేదాల్ని భద్రపరిచాడు. నిండు చందమామ కాంతుల్ని విరజిమ్ముతూ విఘ్నేశ్వరుడు సాక్షాత్కరించి వాటిని నాకు అందజేశాడు. నాకు జ్ఞానసిద్ధి కలిగింది. అప్పుడు విఘ్నేశ్వరుని గురించి విశేషాలు చాలా తెలుసుకున్నాను. సంకల్పసిద్ధికి మూలమైన విఘ్నేశ్వరుణ్ణి ధ్యానించి సక్రమంగా సృష్టి చేయగల్గాను.


విఘ్నేశ్వరుడు విరాట్ స్వరూపుడు. వ్యాపించేవాడు గనుకనే 'విష్ణుం' అని అనిపించుకున్నాడు. ఆకాశము, గాలి, అగ్ని, నీరు, మట్టి అనే పంచమహాభూత గణానికి అధిపతి గనుకనే విఘ్నేశ్వరుడు మహా గణాధిపతి! లక్ష్మీసరస్వతుల నిలయంగా నడుమనున్న విశ్వరూప విఘ్నేశ్వరుడి ఐదు తలలూ శ్వేతనీలము, ఊదా, ఎరుపు, శ్యామనీలము, పచ్చరంగులతో పంచమహా భూతాలకు ప్రతి రూపాలుగా ఉన్నవి.


ఏనుగుతల బలానికీ మేధస్సుకీ చిహ్నం; బొజ్జ ఉండగానే సంబరం కాదు, తగినంత మేధస్సు ఉండాలని అర్థం. కొత్తవి పడుతూ ఉంటే, పాతవి జీర్ణం అవుతూండే తినుబండారాలకు మల్లే, అనంతాకాశంలో నక్షత్రమండలాలు, గ్రహాలు, ఉపగ్రహాలు, గోళాలు, లోకాలు నిండి ఉన్నాయని లంబోదరం గుర్తుచేస్తున్నది. ఈయన త్వరలోనే చిన్న ఎలుక నెక్కి తిరగబోతున్నాడు. అంటే సూర్యచంద్రాది గ్రహాలు మహా మండలాలు శూన్యాకాశంలో గతులు తప్పకుండా అంత లాఘవంగా తిరుగుతున్నాయనీ, విశ్వ స్వరూపం చిట్టెలుక పై ఏనుగుస్వారి లాంటి చిత్రాతిచిత్రమైన విజ్ఞానంతో నిండి ఉన్నదనీ చెప్పడం అన్నమాట! విశ్వ విజ్ఞానానికి విఘ్నేశ్వరుడు సంకేతం, విజ్ఞానేశ్వరుడు అనబడుతున్నాడు.


విశ్వానికి అధినేత, నియంత అంకుశాన్ని ధరించాడు. బుద్ధిబలానికి విఘ్నేశ్వరుడు గురుతు! బుద్ధి వెర్రితలలు వేయకుండా మావటివాడు ఏనుగును ఉంచినట్లుగా, అదుపులో ఉంచాలని అంకుశం మనో నిగ్రహానికి ప్రతిరూపంగా ఉన్నది. సర్వమూ తమతమ ధర్మాలకు కట్టుబడి ఉన్నదని విఘేశ్వరుని చేతనున్న పాశము చెబుతున్నది. పరిపూర్ణత తొణకని బెణకని నిండుకుండ లాంటిదని, కలశాన్ని ధరించాడు. పరశువుతో విఘ్నాన్ని ఛిన్నాభిన్నం చేస్తాడు. విశ్వం నాదాత్మకమైనది. అనేక ఓంకార ఝంకారాల్ని ధ్వనించే విశ్వవీణనే విఘ్నేశ్వరుడు మీటుతున్నాడు. చరాచర జీవ కోట్ల మొరలన్నీ వినడానికే అంత పెద్ద చెవులు రిక్కించి ఉన్నాడు. ఏనుగు కళ్ళు చిన్నవైనా సూక్ష్మదర్శనం కలిగి, నిశితంగా చూడగల్గినట్లే, పరమాణువు మొదలుకొని బ్రహ్మాండాల్ని పరిశీలిస్తున్నాడు. వంపు పెట్టిన వక్రతుండం వంకల్ని తుండ తుండాలుగా చేసి సరిదిద్దుతుంది. తొండం నిడువుగా సాగి ఎన్నిటినైనా అందుకొంటుంది, అందిస్తుంది!


సస్యసమృద్ధికి విఘ్నేశ్వరుడు అధినాధుడు. భోజన ప్రియుడు గనుక, ఆహారం వల్లనే కండబలమూ, కండబలం ఉంటేనే బుద్ధిబలానికి నిలకడ, సార్ధకత ఉంటాయని పండ్లూ, పిండివంటలూ, ఆకుకూరలూ వద్దనకుండా స్వీకరిస్తాడు. భాద్రపద మాసంలో ఏనుగుల్లాంటి మేఘాలు తొండాలవంటి వర్షపుధారలు కురుస్తాయి. మేఘ గణాలకు నాథుడు గణనాధుడు! విఘ్నేశ్వరుడు అవతరించిన ఇది భాద్రపదమాసమే. భాద్రపద శుక్ల చవితినాడు విఘ్నేశ్వరుణ్ణి అర్చించిన వారికి సంకల్పసిద్ధితోపాటు, అన్ని విఘ్నాలను అరికట్టుకోగల బుద్ధి నిబ్బరము కలుగుతుంది.


తన దంతపు గంటాన్ని మోపినది ఎత్తకుండా విఘ్నేశ్వరుని చేతి మీదుగానే పంచమవేదం అనదగ్గ మహాభారతం అక్షరసిద్ధిపొంది, చిరస్థాయిగా నిలుస్తుంది. విఘ్నరాజు మహిమలు వర్ణించడం నా తరం కాదు. ఏ కార్యమైనా తలపెట్టే ముందు విఘ్నేశ్వరుణ్ణి ధ్యానించి, పూజించి మరీ ప్రారంభించాలి, శుభం కలుగుతుంది అంటూ అభయముద్ర పట్టి ఉన్నాడు. మహాగణాధిపతి అందరికీ ప్రధమ ఆరాధ్యదైవము!” అని బ్రహ్మ ముగించాడు.


అప్పుడు శివుడు అందర్నీ కలయజూసి, “బహ్మవాక్కు విన్నారుకదా, విఘ్నేశ్వరుడు తొలిపూజ దేవర!” అన్నాడు.


అందరూ ఔను, ఔను అని తలలూపారు. నారదుడు హంసధ్వనిరాగాన్ని వీణపై హెరెత్తిస్తూంటే, సరస్వతి హంసానంది రాగాన్ని అందుకొంది. ఆ సంరంభంలో పార్వతి విఘ్నేశ్వరుడికి నమస్కరించబోతూంటే, విశ్వరూప మహా గణాధిపతి, “అమ్మా, అమ్మా వద్దు!” అని వారిస్తూ చప్పున విశ్వరూపాన్ని ఉపసంహరించుకొని, గుజ్జు వినాయకుడై తల్లి కాళ్ళు చుట్టేసుకున్నాడు.

Post a Comment

Previous Post Next Post