విఘ్నేశ్వరుడు (చందమామ)
Vignaeswarudu Novel (CHANDAMAMA)
2. చిత్రగణపతి
దేవతలు, రాక్షసులూ కలిసికట్టుగా క్షీరసాగర మధనం చేసి అమృతాన్ని సాధించారు. విష్ణువు జగన్మోహినీ రూపంతో రాక్షసులను మోసపుచ్చి అమృతాన్ని దేవతలపాలు చేశాడు. అమృతం తాగి అమరత్వం పొందిన దేవతలు గర్వంగా తిరగసాగారు. దానవులకు జరిగిన అన్యాయానికి దేవతలపై కసితీర్చుకోడానికి తారకాసురుడు ఘోరమైన తపస్సు చేసి, బ్రహ్మను మెప్పించి, చావులేని వరం కోరాడు.
“పుట్టాక ఎప్పుడో ఒకప్పుడు చావు తప్పనిది; మరోవరం కోరు!” అన్నాడు బ్రహ్మ.
తారకాసురుడు బాగా ఆలోచించి శివుడి కుమారుడి వల్లనే తప్ప మరే విధంగానూ తనకు చావులేని వరాన్ని బ్రహ్మ నుంచి పొందాడు.
అప్పటికి శివుడి భార్య సతీదేవి దక్షయజ్ఞంలో యోగాగ్నితో తనువు చాలించింది. సంతానం లేకుండానే సతీవియోగం పొందిన శివుడు ఉన్మత్తుడిలాగ తిరిగి, తిరిగి హిమాలయ పర్వతాల్లో ఒక చోట విరాగిగా కఠోర దీక్షతో తపస్సు చేస్తూ ఉన్నాడు.
తారకాసురుడు రాక్షసులందర్నీ కూడ గట్టుకొని విజృంభించాడు. ముల్లోకాలనూ ఆక్రమించుకొని, కసితీరా దేవతలను చిత్రహింసలు పెట్టసాగాడు. ఇంద్రాది దేవతలు తమ దీనావస్థను బ్రహ్మతో మొర పెట్టుకున్నారు.
“శివుడికి కుమారుడు పుట్టాలి, అతని వల్లనే తారకుడు చావాలి! అలాంటి వరాన్ని తారకుడికి ఇచ్చాను మరి. ఇంకె వరివల్లా తారకాసురుడికి ఎటువంటి హానీ జరగదు, మరో విధంగా అతడికి చావూ లేదు!” అని బ్రహ్మ చెప్పి దేవతలను వెంట బెట్టుకొని తరుణోపాయానికి విష్ణువు దగ్గిరికి దారితీశాడు.
“సతీదేవి హిమవంతుడికి కూతురుగా పుట్టి పార్వతిగా పెరుగుతూ ఉన్నది. శివుడికీ, పార్వతికి పెళ్ళి జరిగేలా చూడండి!” అని విష్ణువు చెప్పాడు. దేవతలు నారదుణ్ణి హిమవంతుడి దగ్గరికి పంపించారు. నారదుడి ఆదేశం ప్రకారం హిమవంతుడు తపస్సులో నిమగ్నుడై ఉన్న శివుని దగ్గరికి వెళ్ళి, పూజించి తన కుమార్తె పార్వతి అతని తపస్సుకు అనుకూలంగా పరిచర్యలు చేస్తూండడానికి అనుమతించ వలసిందని వినయ పూర్వకంగా కోరాడు.
శివుడి మౌనాన్ని అంగీకారంగా గ్రహించి హిమవంతుడు పార్వతిని శివుడికి పరిచర్యలు చేయడానికి పురమాయించాడు.
చిన్నతనం నుంచి పార్వతికి శివుడంటే చాలా యిష్టం. బాల పార్వతికి నారదుడు శివుడి గురించి అనేక విషయాలు చెపుతూండేవాడు. శివుడి కథలనూ, గుణ గణాలనూ, మహిమలనూ పదేపదే వినడానికి కుతూహల పడుతూ ఉండేది పార్వతి. పెళ్లాడితే శివుణ్ణే పెళ్ళాడాలని ఉవ్విళ్లూరేది. అటువంటి శివుడికి పరిచర్యలు చేయడం తరుణప్రాయంలో ఉన్న పార్వతికి మహాభాగ్యంగా తోచింది.
తెల్లవారుతూండగా శివుడు తపస్సు చేస్తున్న పరిసర ప్రాంగణ మంతా నెమిలి పింఛపుకట్టతో తుడిచి, హిమానీ జలాల్లో మంచిగంధం కలిపి కల్లాపుజల్లి, ముత్యాల ముగ్గులు తీర్చేది. బంగారు తీగెలతో అల్లి, రత్నాలు కెంపులు పొదిగిన తట్టతో శివుడికి యిష్టమైన ఫల పుష్పాలను, మారేడు పత్రిని, తెల్ల కలువలనూ తీసుకెళ్ళి పక్క నుంచేది. బంగారు కమండలువు నిండా హిమశిఖరాల నుండి జారే స్ఫటిక జలాలను నింపి, జపమాలతో కలిపి అమర్చి పెట్టేది. శివుణ్ణి ఆకర్షించడానికి ఎన్నో విధాలుగా అలంకరించుకొని వెళ్ళేది. కిన్నెర పై శివుడికి ప్రీతికరమైన భైరవి, ముఖారి, కేదార, శివరంజని మొదలైన రాగాల్ని ఆలాపించేది. శివుడి చూపులు తనపై పడాలని పదేపదే ప్రయత్నిస్తూండేది.
తపోదీక్షలో నిమగ్నుడై శివుడు ఒక్క సారైనా తనను పరికించగలడేమోనని, అతని చల్లని చూపులు తన పై వాలాలని పార్వతి శివుడి ముఖాన్ని అలా చూస్తూ ఉండిపోయేది. శివుడు పొరపాటుగానైనా తనవంక చూడడేమో అని నిరాశా, నిస్పృహలతో ఊగిసలాడేది.
శివుడి మనస్సు చలించడానికి మన్మధుడి అవసరం తప్పనిసరి అని గుర్తించి, దేవేంద్రుడు మన్మధుణ్ణి పిలిపించాడు. సకలమర్యాదలు చేసి తన సింహాసనం మీద కూర్చోబెట్టి ఎన్నో విధాలుగా పొగిడి పొంగవేశాడు, శివుడికి పార్వతిపై అనురాగం కలిగేలా చేయమని అర్థించాడు.
వసంతుడు సారధ్యం చేస్తూండగా మన్మధుడు చెరకు వింటినీ, పూలబాణాలనూ ధరించి రతీదేవితో చిలుకరధాన్నెక్కి, ఈశ్వరుడు తపస్సు చేస్తూన్న హిమాలయ శిఖరాల నడుమ నున్న లోయను ప్రవేశించాడు. ఒక్కసారిగా ఆలోయ అంతటా వసంత ఋతువు వెల్లివిరిసింది, రమణీయంగా మారింది. కోయిలల సంగీతంతో, తుమ్మెదల ఝం కారంతో అంతా రసమయంగా వెలిగి పోయింది. తానున్న పరిసరమంతా ఆకస్మికంగా మారిపోయినట్లుగా తోచి, శివుడు కళ్ళు తెరిచి చూశాడు. అకాల వసంతా గమనానికి ఆశ్చర్యపోతూ, తపోభంగమైనందుకు నొచ్చుకుంటూండగా అతని చేతినుంచి జపమాల జారిపడింది. పార్వతి జపమాలను తీసి శివుడికి అందిస్తున్న సమయంలో మన్మధుడు విరియబూచిన నల్ల ఉమ్మెత్త పూలపొద చాటునుంచి నీలోత్పల బాణాన్ని శివుడి గుండెకు గురి పెట్టి వదిలాడు. అది తగలగానే శివుడు తృళ్లిపడి తేరిపార జూచాడు. అతని మ్రోల మోకరిల్లి రెప్ప వాల్చకుండా తననే చూస్తున్న పార్వతి ముఖబింబం ఎంతో మనోహరంగా కనిపించింది.
తన తపోభంగానికి శివుడు నివ్వెర పడుతూ రుద్రుడై తన మూడవ కంటిని తెరిచి మన్మధుడిని చూశాడు. మరుక్షణంలో శివుడి ఫాలనేత్రం నుంచి వేలు వడిన జ్వాలల్లో మన్మధుడు కాలి బూడిద అయ్యాడు. శివుడు దిగ్గునలేచి చరచరా తన కైలాస శిఖరాగ్రం మీదికి వెళ్ళిపోయాడు.
మన్మధుడి వెన్నంటి ఉన్న రతీదేవి భర్త బూడిద కుప్పమీద కూలిపోయి భోరుమన్నది. శివ తపోభంగానికి మన్మధుణ్ణి పంపిన దేవేంద్రాది దేవతలను శాపాలు పెట్ట బోయేసరికి, బ్రహ్మాది దేవతలు వచ్చి పార్వతీ శివుల కళ్యాణం జరిగి నప్పుడు మన్మధుడు తిరిగి బతికి వస్తాడని నచ్చజెప్పి, ఓదార్చి సహగమనం మానిపించారు. రతీదేవి మన్మధుడి బూడిద కుప్పనే కనిపెట్టుకొని అలా దివారాత్రాలు గడపసాగింది.
పార్వతికి తన సౌందర్యం పట్ల నమ్మకం పోయింది. శరీర లావణ్యం మీద మమకారం పోయింది. శివుణ్ణి రంజింప చేయలేని తన తనువు నిరర్థకంగా తలచి శివరంజనిగా తపస్సు చేయడానికి పూనుకున్నది. తల్లి మేనక ఎంతవద్దన్నా వినలేదు. కేవలం కొద్ది ఆకులను మాత్రమే తింటూ శరీరాన్ని కృశింప జేసుకొని తపస్సు మొదలు పెట్టింది. జయ, విజయ అనే ఇద్దరు చెలికత్తెలు ఆమెకు తోడుగా ఉంటూ ఆమె యోగక్షేమాల్ని మేనకా , హిమవంతులకు తెలియజేస్తూ వస్తున్నారు. కొన్నాళ్ళ తర్వాత పార్వతి - పర్ణాలను కూడా తినడం మానివేసి నిరాహారంగా తపస్సు చేస్తూ, అపర్ణ అని పేరు పొందింది.
శివుడు మన్మధుణ్ణి భస్మం చేశాడేగాని, మన్మధుడి బాణ ప్రభావం ఊరికేపోలేదు. పార్వతి తపస్సు కూడా ఫలితం సాధించింది. శివుడు మారు వేషంతో పార్వతి దగ్గరకు వెళ్ళి, పార్వతి మనస్సును పరీక్షించాడు. పార్వతిని మనసారా మెచ్చు కొని పెళ్ళి చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. సప్త ఋషులను హిమవంతుడి దగ్గరకు వెళ్ళి పెద్దలుగా పంపించాడు. శివుడంతటి వాడికి కన్యాదాత కాబోతున్నందుకు ఉన్నతోన్నతంగా శిఖరాలు పెంచుకున్నాడు హిమవంతుడు. ఋషులు ముహూర్తం పెట్టి వెళ్ళారు.
ప్రమథ గణాలు ముందు నడవగా శివుడు పెళ్ళికుమారుడై హిమవంతుడింటికి తరలి వెళ్లాడు. హిమాలయ శిఖరాలు పెళ్లిపందిరికి రాటలైనాయి. విష్ణువు, బ్రహ్మ, ఇంద్రుడు మొదలుగాగల దేవతలు, సప్తర్షుల వెంట వేలాది మహర్షులు, నారదాది మునిపుంగవులు అక్కడకు చేరుకున్నారు.
పెద్ద ముతైదువు అరుంధతి శివుడి ఫాలనేత్రం రెప్ప మీదుగా కళ్యాణ తిలకం నిలువుగా దిద్దింది. పెళ్ళి అలంకరణతో శివుడు చాలా సుందరంగా తయారుయ్యాడు. అప్పుడు అందరూ శివుణ్ణి –సుందరేశ్వరుడు అని అన్నారు.
సర్వాలంకార శోభితయై విద్యుల్లతలాగ మెరిసిపోతూన్న పార్వతిని పెళ్ళి కూతురుగా తీసుకొచ్చి విష్ణువు శివుడితో, “నీవు సుందరేశ్వరుడివి అయితే, నా చెల్లెలు పార్వతి మీనా క్షీదేవి!” అని అంటూ పార్వతి కుడిచేతిని శివుడి కుడి చేతిలో పెట్టి యిద్దర్నీ పెళ్ళి పీటల మీద కూర్చో బెట్టాడు.
శివ పార్వతుల వివాహం ఎంత వైభవంగా జరగాలో అంత వైభవంగా జరిగింది.
హిమాలయలోయలో శివుడు, పార్వతి తపస్సులు చేసిన చోటనే దేవశిల్పి విశ్వకర్మ కొత్త దంపతులైన పార్వతీ పరమేశ్వరుల కోసం దివ్యమైన అంతఃపుర మందిరాన్ని నిర్మించాడు.
మంగళ తూర్యనాదాలు మిన్నంటుతూండగా చేతులు కలుపుకొని శివుడు, పార్వతి అందరి మధ్య నడుస్తూ మందిరానికి బయలుదేరారు. మందిరాన్ని చేరుకునే దారిలోనే మన్మధుడి భస్మరాశి ఉన్నది. ఆ బూడిద కుప్పను అంటి పెట్టుకొని రతీదేవి కన్నీళ్ళతో మోకరిల్లి దోసిలిపట్టి పతిభిక్ష అడుగుతున్న దానిలాగ ఉన్నది.
శివ పార్వతులు ఆమె దగ్గరకు వెళ్ళి, ఆమెతల పై చేతులుంచి దీర్ఘ సుమంగళిగా ఉండు అని దీవించారు. శివుడు మళ్లీ తన మూడోకంటినే తెరిచి యీసారి చల్లని వెన్నెల కాంతితో చూడగానే భస్మరాసి మాయమైన మన్మధుడు నిజరూపంతో లేచి అందరికీ కనిపించి, చెరుకువింటి నారిని ఝుమ్మనిపించి అదృశ్యమైయ్యాడు.
అప్పుడు శివుడు రతీదేవితో, “అమ్మా! నీ భర్త తిరిగి జీవించాడు. నీకు ఎప్పటి లాగే సదా కనబడుతూనే ఉంటాడు. నీ రెండు కళ్ళకు తప్ప మరే మూడో కంటికీ కనిపించడు. ఎవ్వరూ అతణ్ణి చూడలేరు గనుక అతణ్ణి ఎవ్వరూ ఏమీ చేయలేరు. అతని బాణాల బారినుండి తప్పించుకోలేరు. నీకు తప్ప యితరులకు కనిపించడం అతని యిష్టంపైనే ఉంటుంది. అలాంటి వరాల్ని అతనికి ఇస్తున్నాను!” అని చెప్పాడు.
పార్వతీ శివులు గృహప్రవేశం చేశారు. కనిపించని మన్మధుడు కూడా కనిపించని పూలబాణాలతో రతీదేవితో మందిరంలోకి వెళ్ళాడు. అరుంధతి నూతన దంపతులకు ఎర్రనీటితో దిష్ఠి తీసి, కర్పూరహారతి పట్టింది. అప్పుడు విశ్వకర్మ తెరతో నిండా కప్పబడి ఉన్న ఒక నిలువెత్తు పలకను పార్వతీ శివుల ఎదురుగా నిలబెట్టి, “ఇది ఒక గొప్ప అపురూప చిత్రపటము. ఈ చిత్రంలో ఇద్దరు చిత్రింపబడి ఉన్నారు. ఆ ఇద్దరిలో ఎవరి సౌందర్యం ఎక్కువ గొప్పదో మా బోటివారికి ఎవ్వరికీ చెప్పశక్యం కాలేదు! అది చెప్పగలవారు మీరిద్దరే నన్న నమ్మకంతో మీ ముందు పెడుతున్నాను, చెప్పండి!” అని తెరను తొలగించాడు.
అది ఒక నిలువుటద్దం! అద్దంలో శివుడు పార్వతి తమ ప్రతిబింబాలను చూసి ముసిముసిగా నవ్వుకున్నారు.
“ముసిముసినవ్వులు సమాధానాలు కావు, చెప్పి తీరాలి!” అన్నాడు నారదుడు.
శివుడు చిరునవ్వుతో పార్వతిని క్రీగంట చూస్తూ, “ధగధగా శుక్రునిలాగ మెరుస్తూన్న ముక్కర గల చిత్రాంగి సౌందర్యమే గొప్పది!” అన్న వెంటనే పార్వతి సిగ్గుతో ఎర్రబడ్డ చెక్కిళ్ళతో, “ఆ ముక్కంటి పురుషుడి సౌందర్యమే సృష్టిలో గొప్పది,” అని వీణ మీటినట్లు పలికింది.
అందరూ శివపార్వతులపై పుష్పాక్షతలు చల్లి వెళ్ళిన తర్వాత కొత్త దంపతులిద్దరూ పట్టుదిళ్ళు అమర్చిన తూగుటుయ్యల పై కూర్చున్నారు.
వారి కెదురుగా విశాలమైన గోడ మీద మనోహరమైన పెద్ద చిత్తరువు చిత్రింపబడి ఉన్నది. చిత్రం మధ్యలో అందమైన ఒక ఏనుగుల జంట నాట్యం చేస్తున్నట్లుగా ముందరి కాళ్ళు ఎత్తి ఎదురెదురుగా ఎత్తిన తొండాలను పెనవేసుకొని ఉన్నవి. తోరణం కట్టినట్టు ఉన్న ఆ రెండు ఏనుగుల మధ్య నుంచి కనిపిస్తున్న సరోవరంలో పెద్ద పద్మము వికసిస్తూ ఉన్నది. ఆ చిత్రంలో చిత్రింపబడిన ఏనుగుల జంటపై శివ పార్వతుల చూపులు నిలిచాయి. అంతలో పద్మ చిత్రమున్నచోట వెన్నెల వంటి జ్యో తి వెలిగింది. ఆ వెలుగు క్రమక్రమంగా పెద్దదై వ్యాపించింది. ఆ వెలుగులో శశివర్ణంతో మెరిసిపోతూన్న విఘ్నేశ్వరుడు వారికి కనిపించాడు.
విఘ్నేశ్వరుడి ముఖము ఏనుగు ముఖమే అయినప్పటికీ, ఆ ముఖంలో దివ్యత్వం నిండి ఉన్నది. ప్రసన్నత వెల్లి విరుస్తున్నది. అతని చూపులు శాంతంగా మేధస్సునూ, శక్తిని చాటుతున్నాయి. అతని దోరపు బొజ్జ నిండుగా తళతళలాడు తున్నది. అభయహస్తంతో నిల్చొని ఉన్న విఘ్నేశ్వరుడు పార్వతికి ముద్దుల మూటలాగ కనిపించాడు.
విఘ్నేశ్వరుడిని చూస్తూంటే శివుడికీ, పార్వతికి ఎన్నడూ ఎరగని అనిర్వచనీయమైన ఆనందమేదో తమలో ఉప్పొంగు తూన్నట్లు అనిపించింది. ఆ ఆనందపార వశ్యంలో నోటమాటరాక విఘ్నేశ్వరుణ్ణి రెప్పవాల్చకుండా చూస్తున్నారు. విఘ్నేశ్వరుడు ఎడమపక్కకు సొంపుగా వంపు పెట్టి ఉన్న చిన్నారి తొండాన్ని సవరించుకొని ఊపుతూ, ముద్దు ముద్దు మాటలతో, “నేను విఘ్నేశ్వరుణ్ణి! విఘ్నాలను అరి కట్టే వినాయకుడిని! పంచభూతగణాలకు అధిపతిని! గణపతిని! చిత్రవిచిత్రమైన రూపం గల చిత్రగణపతిని! మీ ఇరువురి అనురాగ ఫలితంగా శివుడి తేజస్సుతో కుమారస్వామి పుట్టి తారకాసురుణ్ణి అంతమొందిస్తాడు. కుమారస్వామికి ముందుగా నేను అవతరించి మీకు పుత్రుడిగా ఉంటాను. పుత్రగణపతినై అవతరించ బోతున్నాను!” అని చెపుతూంటే పార్వతి అతణ్ణి అందుకొని ఎత్తుకోవాలని చేతులు చాచింది. విఘ్నేశ్వరుడు వెలుగుతో సహా అంతర్ధానమయ్యాడు.
అంతవరకు తమకు కనిపించిందంతా కలా, నిజమా అని పార్వతీ, శివులు ఒకర్నొకరు ప్రశ్నార్థకంగా చూసుకొన్నారు. ఆ చూపుల కలయికలో అంతా మర్చిపోయారు. వారికి కనిపించిన అద్భుతమంతా మరుపుకొచ్చింది.
శివుడు, పార్వతి ఆ మందిరంలో ఆనంద సముద్రంలో మునిగి సంసారం సాగిస్తున్నారు. ఆ సమయంలోనే జగత్తుకు కనీవినీ ఎరగని ఉపద్రవం ముంచు కొచ్చింది.
Post a Comment