విఘ్నేశ్వరుడు (చందమామ)_01 Vignaeswarudu Novel (CHANDAMAMA)

 విఘ్నేశ్వరుడు (చందమామ) 

Vignaeswarudu Novel (CHANDAMAMA)

    1. వటపత్ర బాలగణపతి


    సత్యలోకంలో కమలాసనం మీద కూర్చుని, పగలంతా సృష్టి చేసి, చేసి అలసిన బ్రహ్మకు, కల్పాంతం సమీపించటంతో నిద్రమత్తు ఆవరించింది. ఆ నిద్ర మత్తులో ఆయన ఆవులించినప్పుడల్లా పర్వతశిఖరాగ్రాలు చిట్లి, అగ్నులను వెదజల్లాయి. నిద్రపట్టే సమయాన కళ్ళు చెమ్మగిల్లగా, ఆకాశంలో గుంపులు, గుంపులుగా కూడిన ప్రళయ మేఘాలు మెరుపులతో, భయంకరంగా గర్జిస్తూ, ఏనుగు తొండాల వంటి ధారలతో వర్షించి, లోకాన్ని జలమయం చేశాయి. ఆయన కనురెప్పలు బరువుగా వాలడం ప్రారంభించే సరికి అన్ని దిక్కులా గాఢాంధకారం అలుముకున్నది.


ఈ ప్రళయ పరిస్థితిలో బ్రహ్మ నిద్రించాడు, ఆయనకు ప్రళయమనేది రాత్రి కాలం. తిరిగి నూతన కల్పారంభం కానున్న సమయం ఆసన్నమైంది. సరికొత్త జగత్తు మీద వెలుగు ప్రసరించ బోతున్న తరుణంలో సరస్వతీదేవి వీణ సవరించి భూపాలరాగ స్వరాలను మెల్లగా పలికిస్తూండగా బ్రహ్మకు మెలకువ వచ్చింది.


ఆయన పద్మాసనం వేసి కూర్చుని, నాలుగు ముఖాలతో, నాలుగు దిక్కులూ కలయచూశాడు.


కిందవున్న జగత్తు అంతా నీటిమయమై మహా పర్వతాల్లాంటి కెరటాలతో కల్లోలంగా ఉంది. ఆ తరంగాల మధ్య ఒక చోట కళ్ళను మిరుమిట్లు కొల్పే తెల్లని కాంతి రేఖ కనిపించింది.


ఆ కాంతిలో తరంగాల పై తేలుతూ ఒక పెద్ద మర్రిఆకు, దానిపై చందమామ లాంటి పసివాడు పడుకొని కుడి కాలి బొటన వేలు చప్పరిస్తూ కనిపించాడు.


బ్రహ్మ చేతులు జోడించి, కన్నులు మూసి ధ్యానించి తెరిచినంతలో ఒక వింత దృశ్యం కనిపించింది.


ఆ పసివాడు విశ్వవిరాట్ స్వరూపుడైన పరబ్రహ్మమేనని బ్రహ్మకు అనుభవ పూర్వకంగా తెలిసిన విషయమే. కాని ఇప్పుడా పిల్లవాని తల ఏనుగు తలను పోలి. చిన్నారి తొండంతో కుడిపాదాన్ని పట్టి నోటిలో పెట్టుతూన్నట్టుగా కనిపించింది.


ఆ ముఖం చాలా ప్రసన్నంగా ఉంది. పిల్లవాడు చంద్రకాంతితో ప్రకాశిస్తున్నాడు. నాలుగు చేతులు కలిగి ఉన్నాడు. బ్రహ్మ ఆశ్చర్యంగా చూస్తున్న మరు నిముషంలో, ఆకుతో సహా ఆ పిల్లవాడు అదృశ్యమయ్యాడు. బ్రహ్మకు ఆ ప్రదేశాన ఎత్తుగా లేచిన పెద్ద మట్టిదిబ్బ ఒకటి కనిపించింది.

క్రమక్రమంగా నీటి నుండి సువిశాలమైన భూభాగాలూ, సముద్ర భాగాలూ ఏర్పడ్డాయి.


బ్రహ్మ సృష్టికి పూనుకున్నాడు. మొదట పర్వతాలు, నదులు ఏర్పడాలని సంకల్పించి కమండలం లోంచి నీరు తీసి జగత్తు మీద చల్లాడు. తరవాత వృక్షాలనూ, సస్యాలనూ, ఖనిజాలనూ సంకల్పించాడు. పిమ్మట కదులాడే జీవరాశిని-- మొదట సముద్రంలో చేపలనూ, భూమ్మీద జంతుజాలాన్నీ, క్రిమికీటకాదుల్నీ, పక్షుల్నీ సృజించాడు. తరవాత మనుష్యులను సంకల్పించి కమండలోదకాన్ని చిలికాడు.


బ్రహ్మ సృష్టి చేస్తున్నంత సేపూ సరస్వతీదేవి వీణ వాయిస్తూనే ఉన్నది. ఎందువలనో అనుకోని విధంగా వీణ అపశృతి పలికింది. సరస్వతి నివ్వెర పడుతూ కిందకు చూసి మరింత నివ్వెర పడింది. బ్రహ్మ అర్ధాంగి నివ్వెరపాటు అర్ధంగాక కమలాసనం నుంచి వంగి కిందికి చూశాడు.


పర్వతాలు బోర్లపడుతూ శిఖరాలు భూమిలోకి పాతుకుని వెడల్పుగా పర్వత పాదాలు సూర్యరశ్మి పడకుండా గొడుగుల్లాగా ఎదుగుతూన్నవి.


నదులు సాగరం నుంచి ఎత్తుప్రదేశాలకు చేరుకోబోతున్నవి. వృక్షాలు తల కిందులుగా, వ్రేళ్ళు ఆకాశానికి తన్ను తున్నవి.


సముద్రతరంగాల మీద జలచరాలు తేలుతూ కుప్పిగంతులు వేస్తున్నవి. కొన్ని నిటారుగా పయనిస్తున్నవి. కొన్ని పక్షుల్లా ఎగురుతున్నవి.


జంతువులూ చాలా అనర్థాలతో పుట్టాయి; తలలు లేకుండా కొన్ని, వెనుక కాళ్ళు లేకుండా కొన్ని, ఒంటి కాలివి, మూడు కాళ్ళవీ, కళ్ళూ, చెవులూ అన్నీ వుండి నోరు అనేది లేనివీ, తోకలకు తలలున్నవీ, తలకు తోకలున్నవీ కనిపించాయి. పక్షులకు రెక్కలులేవు. అవి నడవాలంటే కాళ్ళులేక నేల మీద దొర్లుకుంటున్నవి.


ఈ వక్రతలన్నీ గమనించి బ్రహ్మ ఎంతగానో కలవరపడుతూ తన ఉత్తమోత్తమ మనుష్య సృష్టి ఎలాగుందోనని ఆత్రంగా చూశాడు.


మనుషులలో కొందరికి రెండు తలలున్నాయి. అందులో ఒకటి స్త్రీది, రెండోది పురుషుడిది.


పురుషులు జానెడు, బెత్తెడుగా ఉన్నారు. స్త్రీలు పెద్ద ఏనుగుల్లాగా, తాటి చెట్లలాగ ఉన్నారు. వీపులకు తలలు అతికించినట్లున్న వాళ్లు, నాలుగు, మూడు, ఒంటి కాళ్ళ వాళ్ళూ, పొట్టకే పెద్దనోళ్ళున్న కబంధులూ ఆక్రందనాలు చేస్తూ కనిపించారు.


జంతువులు మోరలు పైకెత్తి దీనంగా అరుస్తున్నవి. మూగగా చూస్తున్నవి. బ్రహ్మను నిందిస్తున్నట్లుగా గింజుకుంటున్నవి, కదను తొక్కుతున్నవి.


ఒక జానెడు మగవాడు తాటిచెట్టంత వికృతాకారిణి అయిన స్త్రీని చూపిస్తూ, “ఓ బ్రహ్మ దేవుడా! ఇలాంటి స్త్రీతో నే నెలా సంసార సాగరం యీదేది?” అంటూ ఆకాశానికి తల పెట్టి పెద్దగా అరుస్తున్నాడు.


“నాలుగు తలలంటూ ఉన్నా, అసలు తల అంటూ లేని ఓయి బ్రహ్మదేవుడా! మమ్మల్నెందుకిలాగ పుట్టించావు?” అంటూ వికృతాకారాల మనుషులు చేస్తూన్న ఆక్రందనాలు మిన్నుముట్టు తున్నవి.


బ్రహ్మ నాలుగు తలలూ గిర్రున తిరిగి పోయాయి. ఎనిమిది కళ్ళూ బైర్లు కమ్మాయి. తెల్లబోతూ బ్రహ్మ సరస్వతి వంక అయోమయంగా చూశాడు. అతని నాలుగు తెల్ల మొహాలనూ చూసి సరస్వతి సరసంగా చిరునవ్వుతో సరి పెట్టి ఊరుకొన్నది.


“ఎందుకిలా జరిగింది? సక్రమమైన సృష్టి జరపాలనే సత్సంకల్పంతోనే కదా నేను సృష్టికి పూనుకున్నాను; ఇలాగ ఎందుకు జరిగింది?” అని తనలో తాను అనుకుంటున్నట్లుగా గట్టిగా తలలు పైకెత్తి అరిచాడు బ్రహ్మ. అతని ప్రశ్న దశ దిశలా మారుమ్రోగింది. అయోమయంగా వెర్రిచూపులు చూస్తున్న బ్రహ్మకు పెద్ద వెలుగు కనిపించింది. ఆ వెలుగులో ఒక అద్భుతమూర్తి కనిపించాడు. ఆ మూర్తికి ఏనుగు తల ఉన్నది. నాలుగు చేతులలో పాశము, అంకుశము, కలశము, పరశువు ధరించి ఉన్నాడు. పూర్ణచంద్రుడివలె ప్రకాశిస్తున్నాడు. తెల్లని అతని ఉత్తరీయము ఆకాశమంతటా రెపరెపలాడుతూ ఎగురుతున్నది. అప్పుడు సరస్వతి వీణ ఓంకారనాదం చేసింది. సరస్వతీదేవి వేళ్ళు వాటంతట అవే వీణపై నాదనామక్రియా రాగాన్ని పలికిస్తూ, మాయామాళవ గౌళ రాగానికి మారుతూ, హంసధ్వని రాగాన్ని అందుకొన్నవి. గజాననుడై సాక్షాత్కరించిన ఆ దివ్యమూర్తి వట పత్రం పై నిలుచుని బ్రహ్మను అభయ ముద్రతో ఆశీర్వదించాడు. అతని చుట్టూరా శరత్కాల పూర్ణిమనాటి వెన్నెల వంటి వెలుగు ఆవరించి ఉన్నది.


బ్రహ్మ అప్రయత్నంగా చేతులు జోడించి నమస్కరిస్తూ, “మహానుభావా! అద్భుత మూర్తివైన నీ వెవ్వడవు? నీవెవరో తెలుసుకోలేని అజ్ఞానిని, అనుగ్రహించు!” అని అడిగాడు.


“నాయనా! బ్రహ్మదేవా! సంకల్పం వెనుకనే వికల్పం వెంటాడుతూంటుంది; అదే విఘ్నం! విఘ్నాన్ని అరికట్టి సంకల్పాన్ని నెరవేర్చే నేను విఘ్నేశ్వరుడను! విఘ్నాలకు నాయకత్వం వహించే వికల్పాన్ని నా గొడ్డలితో ఛేదించి ప్రతి కార్యాన్నీ నిండుకలశంలాగ జయప్రదం చేసే విఘ్నవినాయకుడిని. పంచభూతములనబడే పృథ్వీ, నీరు, అగ్ని, వాయువు, ఆకాశములనే భూతగణానికి అధిపతినైన గణపతిని. ఆహార ధాన్యాల్ని ఫలించే సస్యాల్ని నాశనం చేసే మదించిన ఏనుగుల వంటి విఘ్నాలను నా వాడిగల అంకుశంతో అదుపులో పెడుతూ వాటిని నా పాశము అనే బలమైన త్రాటితో కట్టి ఉంచే నన్ను, విఘ్నేశ్వరుడు అని పిలుపు!” అని గంభీర స్వరంతో విఘ్నేశ్వరుడు పలికాడు.


అప్పుడు బ్రహ్మ, “దేవా! విఘ్నేశ్వరా! నా సృజనశక్తికి ఎందుకిలాగ ఘోరమైన విఘ్నం జరిగింది? ఇన్ని వంకరలెందుకు ఏర్పడ్డాయి? ఉత్తమంగా సృష్టి జరిగే మార్గం వివరంగా చెప్పు!” అన్నాడు.


“విఘ్నం గురించి నీకు తెలియాలనే ఇదంతా జరిగింది. మర్రి ఆకుపై బాల గణపతిగా కనిపించిన వటపత్రగణపతినే నేను. అప్పుడు నా గురించి ఆలోచించ లేకపోయావు; నా గురించి ఆలోచించడమంటే విఘ్నం గురించి ముందు జాగ్రత్తపడే జ్ఞానాన్ని కలిగి ఉండటమే! ఆ జ్ఞాన స్వరూపుణ్ణే నేను! బ్రహ్మ మొదలు కొని బుద్దిగల ప్రతి జీవీ కార్యరంగానికి దిగే ముందు విఘ్నం రాకుండా జయప్రదం కావడానికి తగు జాగ్రత్తనూ, జ్ఞానాన్నీ కలిగి ఉండక తప్పదు! ఏనుగు అడుగు వేసే ముందు నేల గట్టితనాన్ని తెలుసుకొని మరీ నడుస్తుంది; ప్రాణుల్లో ఏనుగు బుద్ధిబలం దాని లాగే చాలా పెద్దది. ఏనుగంత విశేష మేధస్సును కలిగి ఉండాలనే సూచనగా నేను గజాననుడిగా ఉన్నాను. నీవు నిద్రిస్తున్న సమయంలో రాక్షసుడైన సోమకాసురుడు నీ నాలుగు వేదాల్నీ అపహరించి సముద్రం అడుగున దాచాడు; మహావిష్ణువు మత్స్యావతారం దాల్చి వాణ్ణి సంహరించి నీ వేదాల్ని భద్రంచా తెచ్చి వటపత్రశాయినై ఉన్న నా దగ్గర ఉంచాడు. ఇవిగో! వాటిని తిరుగ గ్రహించి సృష్టి నిర్వర్తించు!” అని చెప్పి, విఘ్నేశ్వరుడు బ్రహ్మకు వేదాలను ఇచ్చాడు.


బ్రహ్మ వాటిని అందుకొని పరమానందంతో విఘ్నేశ్వరుణ్ణి స్తుతించుతూ, “విఘ్నేశ్వరా! నేను సృష్టి సంకల్పించే ముందు నిన్ను ధ్యానించి, మనసారా నిన్ను పూజించి మరీ కార్యరంగానికి ఉపక్రమించే వరం అనుగ్రహించు! అవకతవకలుగా తయారైన సృష్టి ఉపసంహరించు కొనేలాగ చెయ్యి!” అని కోరాడు.


విఘ్నేశ్వరుడి ప్రభావం వల్ల అంత వరకు జరిగిన వంకర టింకరల సృష్టి అంతా క్షణంలో మటుమాయమైంది. అప్పుడు విఘ్నేశ్వరుడు మళ్ళీ బ్రహ్మతో, “ఓ బ్రహ్మదేవుడా! వక్రతను తుండ తుండములుగా ముక్కలు చేసే వాడిని గనుక నేను వక్రతుండుడు అనే పేరుకు సార్ధకంగా నా తొండాన్ని వక్రంగా ఉంచుతూంటాను. వక్రతుండుణ్ణి అయిన నన్ను ధ్యానించి తలపెట్టిన ఏ పని కూడా వంకర పోదు! నీవు కోరుకున్నట్లే నన్ను ధ్యానించి సృజించు. సృజించటం ఒక కళ! ఆ కళ ఎటువంటి వంకరటింకరలు పోకుండా జగత్తు నీవు మలచిన కళా నిలయంగా భాసిస్తుంది! నీకు మల్లే జగత్తులో అందరికీ అందుబాటుగా తొలి పూజలందుకొనే విఘ్నేశ్వరుడిగా విఘ్నాల నుండి కాపాడుతూ, సంకల్పసిద్ధిని కలిగించే సిద్ధివినాయకుడుగా, సకల గణాలకూ అధిపతిగా గణపతినై శివ పార్వతులకు కొడుకుగా అవతరిస్తాను!” అని చెప్పి, బ్రహ్మను దీవించి అంతర్థానమయ్యాడు.


సరస్వతీదేవి బ్రహ్మ కేసి చిరునవ్వు నవ్వి హిందోళ, శ్రీరాగాలతో మంగళ స్వరాల్ని మహాకాశం పులకరించేట్లుగా వీణపై వినిపించింది.


బ్రహ్మ, “విఘ్నేశ్వరాయనమః!” అంటూ సృష్టిని ప్రారంభించాడు. సృష్టి మరింత అందంగా నిర్విఘ్నంగా సాగింది. గంభీరమైన పర్వత పంక్తులూ, అమృతజలాలతో నదులూ, సుందర వనాలూ, రంగు, రంగుల బొమ్మల్లాంటి జంతుజాలమూ, శారీరకంగానూ, మాన సికంగానూ ఉన్నతులూ, బలవంతులూ అయిన మనుషులతో జగత్తు బ్రహ్మచేసిన కళానిలయంగా విలసిల్లింది. వాగ్దేవి అయిన సరస్వతి తన వాణిని సంగీతంలా ప్రాణి కోటికి స్వరపరిచింది. జీవకోటి సలక్షణంగా పెరిగింది.

ఊడలు చిమ్మే వట వృక్షంలాగ జగత్తు వర్ధిల్లింది.

--(ఇంకా వుంది)

Post a Comment

Previous Post Next Post