రాకాసిలోయ (చందమామ)_21 RakasiLoya Janapada Novel by Dasari Subramanyam (CHANDAMAMA)

 RakasiLoya 1-35 Janapada Novel by Dasari Subramanyam (CHANDAMAMA)

రాకాసిలోయ (చందమామ)_21

 _దాసరి సుబ్రహ్మణ్యం

రాకాసిలోయ_21

    కేశవుడూ, జయమల్లూ, కోయ యువకుడూ బావి నుంచి పైకి వస్తూనే పారిపోతున్న, చండమండూకుణ్ణి, బ్రహ్మదండి మాంత్రికుణ్ణి చూసి ఆశ్చర్యపడ్డారు. వాళ్ళతోపాటు కొందరు నరభక్షకులు కూడా పిక్కబలం కొందికీ అడవిలోకి పరిగెత్తుతున్నారు. అంతలో దాపుల వున్న చెట్ల మాది నుంచి కేశవుడి తండ్రి అయిన ముసలివాడూ, గడేజంగ్ అనుచరుడైన కోయ యువకుడూ కిందికి దూకారు. తండ్రిని చూడగానే కేశవుడికి కలిగిన ఆనందం అంతా యింతా కాదు. అతడు చేతులు పైకెత్తి ఉత్సాహంగా ఒక్క కేక పెట్టి, 'అయ్యా' అంటూ ముందుకు పరిగెత్తబోయేంతలో, వెనక పాడుబడ్డ బావిలోంచి రణగొణ ధ్వని వినిపించింది. అప్పటిగ్గాని, కేశవుడికీ, జయమల్లుకూ, తమను సొరంగ మార్గాన తరుముకు వస్తున్న నరభక్షకుల సంగతి గుర్తుకు రాలేదు. వెంటనే వాళ్ళిద్దరూ, కోయయువకుడూ వెనక్కు తిరిగి బావికేసి రెండడుగులు వేసేంతలో, ముసలివాడు పెద్దగా నవ్వి, “ఆ దుర్మార్గులిద్దర్నీ హడలకొట్టాను. ఇప్ప చెట్లమీద వున్న అరవైమంది, నేరేడు చెట్ల చాటున వున్న నలభై యిద్దరూ... అని కేక పెట్టగానే, ఆ నీచులు ఠారుకుపోయారు. ఇక ప్రస్తుతానికి ప్రమాదం లేదు,” అంటూ ముందుకు రాబోయాడు.


    తన తండ్రికి తమను వెన్నాడి వస్తున్న నరభక్షకుల సంగతి తెలియదని గ్రహించిన కేశవుడు చప్పున వెనుదిరిగి, “అయ్యా, అంతా మనకు ప్రమాదం తొలగలేదు. ఒక మందకు మంద నరభక్షకులు సొరంగ మార్గాన్నుంచి యిటు వస్తున్నారు..." అని హెచ్చరించే లోపలే, పది పన్నెండు మంది నరభక్షకులు కీచుమని అరుస్తూ, ఈటెలు పైకెత్తి బావిలోంచి బయటికి దూకారు. అదే సమయంలో ముసలివాడూ, కోయ యువకుడూ నిలుచున్న చోటుకు వెనకగా వున్న పొదల్లో నుంచి, “మనం అనవసరంగా భయపడ్డాం. ముసలి వెధవ పెద్ద మోసం చేశాడు. అంతా కలిసి వాళ్ళు అయిదుగురే! చంపండి." అన్న చండమండూకుడి కేక వినబడింది.


    “కాలభైరవా, ఉపాసకుల ఊడల మర్రి... ఆ కేశవుణ్ణి చంపకండి! వాణ్ణి ప్రాణాలతో పట్టుకోండి. వాడు చస్తే యిక మనం బతికివుండీ లాభంలేదు. రాకాసిలోయ...... బంగారం...... వెండి...... అర్థరాజ్యం.....” అంటూ బ్రహ్మదండి నెత్తీ నోరూ కొట్టుకుంటూ అరవసాగాడు.


    రెప్పపాటు కాలంలో తను ఆశించిన దానికి భిన్నంగా జరిగిపోవటం చూసి ముసలివాడు ఓ తృటికాలం నిర్విణ్ణుడయ్యాడు. ఎన్నో రోజుల తరువాత తను తన కొడుకును చూడటం జరిగింది. కాని, ఆ ఆనందానికి తను నోచుకోలేదు. ఇప్పుడు తనూ, తన కొడుకూ కడా నరుభక్షకులతో అన్నిటికీ తెగించి పోరాడాలి.


    “చిన్న గడేజంగ్ ! నువ్వేమీ భయపడకు. మన చేతుల్లో కత్తులున్నంతవరకూ మన నెవరూ ఏమీ చేయలేరు. ఊఁ మహాచండీ!" అంటూ ముసలివాడు నరభక్షకులతో పోరుకు తలపడ్డాడు.


    ముసలివాడు పెట్టిన ముద్దు పేరుకు తగినట్టే చిన్న గడేజంగ్ అసహాయ శూరుడు. తమ నాయకుడిలాగే అతడికి ప్రాణభయం అంటే ఏమిటో తెలియదు. అతడు కత్తిచూసి, తన కేసి వస్తున్న నలుగురైదుగురు నరభక్షకుల్ని దెబ్బ కొకటి చొప్పున కింద పడకొట్టాడు. కాని, నరభక్షకుల సంఖ్య వున్న కొందికీ అధికం అవుతున్నది. చెట్ల చాటునుంచి మిడుతల దండులా వాళ్ళు ముందుకొచ్చి పడుతున్నారు. కేశవుడూ, జయమల్లూ, వాళ్ళ వెంట వున్న కోయ యువకుడూ భయంకరంగా వున్న చెట్లకేసి తిరోగమించసాగారు.


    “జ్యేష్ఠా, కనిష్ఠా! ఇంతమంది దుర్మార్గులతో నిలబడి యుద్ధం చేసి లాభం లేదు. అడవిలోకి పరిగెత్తండి. మేమిద్దరం కూడా అదే చేయబోతున్నాం. మిమ్మల్ని ఏదోవిధంగా కలుసుకుంటాను,” అంటూ ముసలివాడు పెద్దగా కేక పెట్టి, తనను చుట్టు ముట్టిన నరభక్షకుల్లో యిద్దర్ని కత్తితో నరికి అడవి లోపలికి పరిగెత్తసాగాడు. చిన్న గడేజంగ్ కూడా శత్రువుల మధ్య నుంచి దారి చేసుకుంటూ ముసలి వాణ్ణి అనుసరించాడు.


    ఈ లోపల కేశవుడూ, జయమల్లూ, కోయ యువకుడు కూడా, ఇక నరభక్షకులతో నిలిచి యుద్ధం చేయటం ప్రమాదం అని గ్రహించి, ఒకళ్ళకొకళ్ళు రక్షణగా పోరుతూ, కలిసికట్టుగా నిలబడి గుబురు చెట్లకేసి పోసాగారు. కాని, నరభక్షకులు మరింతగా కేకలు పెడుతూ వాళ్ళను చుట్టుముట్టేందుకు ముందుకు వస్తున్నారు.


    “ఆ దుర్మార్గులందర్నీ...కేశవుడితో సహా నరకండి. వాణ్ణి ప్రాణాలతో పట్టుకోవాలని చూసి లాభం లేదు. వాడు అది అవకాశంగా తీసుకుని మనవాళ్ళ నందర్నీ ఊచకోత కోస్తున్నాడు.” అంటూ చండమండూకుడు అరిచాడు.


    “కేశవుణ్ణా ... చంపటమా? హాఁ, కాలభైరవా, రాకాసిలోయా !" అంటూ బ్రహ్మదండి మాంత్రికుడు పెద్దగా మూలిగాడు.


    తన అనుచరులు కేశవుడి చేతిలో చావటం చూస్తున్న మండూకుడికి, ఆ మూలుగు, ఎక్కడలేని కోపాన్ని తెప్పించింది. వాడు కళ్ళెర్రచేసి, తన చేతి కర్రతో బ్రహ్మదండి డొక్కలో ఒక్కపోటు పొడుస్తూ, “ముసలి మంత్రాల పీనుగా! నువ్వు. ఈ లంకకు మహమ్మారిలా దాపురించావ్. అర్ధరాజ్యం, ధనరాసులూ అంటూ నాకు ఆశ చూపి, నా అనుచరులందర్నీ, ఆ కేశవుడి కత్తికి బలి అయేలా చేస్తున్నావ్. నిన్ను బతికుండగానే చర్మం వొలిపించి, డప్పు కట్టిస్తాను.” అన్నాడు.


    మండూకుడి కర్ర దెబ్బ తింటూనే బ్రహ్మదండి పెద్దగా కేక పెట్టి, “నరభక్షకేశ్వరా! తను కొయ్య కరవాలంతో అంతధాటిగా పొడవకండి. నేను శరీరంలో ప్రాణం వుండికాక, కేవలం మంత్రాల బలంతో బతుకుతున్నాను. తమరు శెలవిచ్చినట్టు నేను, ముసలి..... వయోవృద్ధుణ్ణి కాను, మంత్ర వృద్ధుణ్ణి !" అన్నాడు.


    “ఏడ్చి మొత్తుకున్నావ్ ! అంత మంత్ర శక్తి వున్న వాడివైతే, అదుగో, ఆ కేశవుడూ వాళ్ళు, నా అనుచరుల్నుంచి తప్పుకుని అడవిలోకి పారిపోతున్నారు. వాళ్ళను నిలువరించు, చూద్దాం !" అన్నాడు మండూకుడు, చేతికర్రను మరోసారి బ్రహ్మదండి డొక్కకేసి గురి పెట్టి.


    బ్రహ్మదండి రెండు చేతులతో మండూకుడికి నమస్కరించి, వణికిపోతూ, “నరభక్షక శమంతకమణి! తమ హస్తదారుకాన్ని కాస్త వెనక్కు మళ్లించండి. సరి... కావాలంటే ఆ కేశవుణ్ణి వాడి అనుచరులనూ వున్న చోటునే నిలువునా భస్మం చేయగలను. ఈ లంకను అలా గాలిలోకి లేపి క్షీరసాగరం మధ్య దించగలను. అష్టగ్రహ కూటమి కల్పించి, సముద్రాలను పొంగించి, లోకాన్ని......”


    బ్రహ్మదండి వాచాలతకు రెచ్చిపోయిన చండమండూకుడు తన చేతికర్రతో అతడి భుజాన గట్టిగా ఒక్క పోటు పొడిచి, “ఇక నీ వాగుడు కట్టిపెట్టు!" అంటూ తనకేసి పరిగెత్తి వస్తున్న అనుచరులను కలుసుకునేందుకు ముందుకు నడిచాడు.


    రొప్పుతూ రోస్తూ వచ్చిన నలుగురైదుగురు నరభక్షకులు తమవంటి మీది గాయాలను, చండమండూకుడికి చూపుతూ, "మహామండూకా! మా చేతనైనదంతా చేశాం. కాని ఆ దుర్మార్గులు మన వాళ్ళల్లో చాలా మందిని చంపి, మండూక పర్వతాలకేసి పారి పోయారు," అన్నారు.


    చండమండూకుడు ఆ మాటలు వింటూనే నిలువెల్లా కంపించాడు. అతడికి కేశవుడూ, జయమల్లుల నుంచి తనకు ప్రాణగండం కలగ వచ్చన్న భయం పట్టుకున్నది. ఒకసారి వాళ్ల నుంచి ఎలాగో చావు తప్పించుకు పారిపోగలిగాడు. పైగా వాళ్ళకు తన రహస్య సొరంగం గురించి కూడా తెలిసిపోయింది...


    “ఆ దుర్మార్గులు ముగ్గురూ కొండల్లోకి పారిపోయారు! ఈ ముసలివాడూ, వాడి వెంటవున్న కోయ వెధవా, అడవుల్లోకి పారిపోయారు! ఇంతమంది మీరుండి, వాళ్ళనెలా పారిపోనిచ్చారు?" అంటూ మండూకుడు తన అనుచరుల్ని నానా తిట్లు తిట్టి, “ఇక వెళ్ళండి! రేపు సూర్యోదయం లోపల వాళ్లు అయిదుగురినీ గాలించి పట్టుకురావాలి. వాళ్ళ శవాలను నాకు తెచ్చి చూపినా ఫరవాలేదు. అలా జరగకపోయిందో....." అంటూ చేతి కర్రను గట్టిగా తాటించాడు.


    “ఆ కేశవుణ్ణి మాత్రం......” అంటూ ఏమో చెప్పబోయిన బ్రహ్మదండి, మండూకుడి రౌద్రాకారం చూసి గట్టిగా నోరు మూసుకున్నాడు. మండూకుడు ఆశ్చర్యంగా చుట్టూ కలయ చూసి, తరువాత బ్రహ్మదండి కేసి తలతిప్పి, “అన్నట్టు నీ అంగరక్షకులిద్దరూ ఎక్కడా కనిపించరేం? వాళ్ళెటయినా పారిపోలేదు గదా!" అన్నాడు అనుమానంగా.


    చండమండూకుడి మాటలు వింటూనే బ్రహ్మదండి ఉలిక్కి పడ్డాడు. అతడికి యింతవరకూ జిత, శక్తి వర్మలను గురించిన ఆలోచనే రాలేదు. తనను ఈ నరభక్షకులకు వదిలి, వాళ్ళిద్దరూ క్షేమంగా ఈ లంక నుంచి పారిపోయారా అన్న అనుమానం అతడికి కలిగింది. ఆ వెంటనే బ్రహ్మదండి పెద్దగా గొంతెత్తి," జితా, శక్తి! ఎక్కడ?" అంటూ కేక పెట్టాడు.


    ఆ వెంటనే అల్లంత దూరాన వున్న చెట్ల మీది నుంచి, “వస్తున్నాం బ్రహ్మదండి, వస్తున్నాం!" అంటూ జిత, శక్తి వర్మలు బదులు కేక పెట్టి, కోతుల్లా కొమ్మల్లో నుంచి కిందికి దూకారు.


“ఇక్కడ యింత భయంకర పోరు జరుగుతూంటే, మీరు పిరికిపందల్లాగా చెట్లల్లో దాక్కున్నారన్నమాట!" అన్నాడు చండమండూకుడు కోపంగా.


    “చెట్లల్లో దాక్కోవటమా! మేమా?” అంటూ జిత, శక్తి వర్మలు జబ్బలు చరుస్తూ వచ్చి, “ఆ జయమల్లు ఎడమ చేతిని నరికిం దెవరు? ఆ ముసలివాడి ముక్కు ఎగిరి కిందపడేలా కత్తి విసిరిందెవరు? మేమే! మేమే!” అన్నారు.


    చండమండూకుడు వాళ్ళిద్దరికేసి అనుమానంగా చూశాడు. బ్రహ్మదండి ముఖం చిట్లించి, “అలాగా, ఆహాఁ! నే ననుకుంటూనే వున్నాను. మీరు శూరులు, వీరులు! సరే, యిక వెళ్లి ఆ దుర్మార్గులు కొండల్లోకి పారిపోయారట. వెతికి పట్టుకు రండి!" అంటూ మండూకుడు చూడకుండా వాళ్ళకు సౌంజ్ఞ చేశాడు.


    బ్రహ్మదండీ, చండమండూకుడూ ఈ విధంగా యిక్కడ గొడవ పడుతూంటే, నరభక్షకుల నుంచి తప్పుకు పారిపోయిన కేశవుడూ, జయమల్లూ, కోయ యువకుడూ లంకలోని కొండ ప్రాంతాలకు చేరి, దాక్కునేందుకు అనువైన గుహ కోసం వెతకసాగారు. ఒక్క కేశవుడికి తప్ప, తతిమ్మా యిద్దరికీ నరభక్షకులతో జరిగిన పోరులో గాయాలు తగిలినై, అన్ని చిన్నచిన్న గాయాలు, పెద్ద ప్రమాదమైనవేం కాదు. కోయ యువకుడు తనకు తెలిసిన మూలికలూ, ఆకులూ కలిపి తన గాయాలకూ జయమల్లు గాయాలకూ, కట్టు కట్టాడు.


    కొండ దిగువ నుంచి వస్తున్న హెచ్చరికలూ, కేకల వల్ల నర భక్షకులు తమను పట్టుకునేందుకు కొండలు గాలిస్తున్నారని కేశవుడికి, అతడి అనుచులకూ తెలిసి పోయింది. కేశవుడికి తన తండ్రిని గురించిన విచారం పట్టుకున్నది. అతడు నరభక్షకులకు దొరకకుండా పారిపోయి వుంటాడా?


    “కేశవా! నీ తండ్రిని గురించి దిగులు పెట్టుకోకు. అతడు మనలాగే అడవుల్లోకి పారిపోయి వుంటాడని నా నమ్మకం. ఇదుగో, మనం ఈ గుహలో దాక్కుందామా?" అంటూ జయమల్లు అక్కడ రాళ్ళలో వున్న చిన్న కంతలో నుంచి లోపలికి చూశాడు.


    మనిషి పట్టీపట్టనంత సన్నగా వున్న కంతలో నుంచి మెల్లిగా జొరబడి ముగ్గురూ ఆ వెనక కొంచెం విశాలంగా వున్న గుహలోకి వెళ్ళారు.


    గుహలో అడుగు పెడుతూనే కోయ యువకుడు ఎగిరి గంతేసి, “ఇక్కడేవో రెండు శవాలున్నవి !" అన్నాడు భయంగా, జయమల్లు గుహ లోపలి భాగంలోకి పరకాయించి చూశాడు. అక్కడ అతడికి రెండు మానవ కంకాళాలు కనిపించినై. అతడు నవ్వుతూ కోయ యువకుడికేసి తిరిగి, “అవి శవాలు కాదు; వట్టి బొమికల గూళ్ళు, భయపడకు, వాటికి సున్నం పోగులకూ తేడా ఏమీ లేదు, మనం..."


    జయమల్లు మాట పూర్తి చేసే లోపలే 'బుస్' మంటూ పెద్ద శబ్దం అయింది. ఆ మరుక్షణాల ఫెళఫెళ మంటూ ఒక రాయి గుహ వెనక నుంచి లోపలికి దభీమంటూ పడింది. గుహ అంతా వెలుగుతో నిండిపోయింది. కేశవుడూ అతడి అనుచరులు అక్కడికి పరిగెత్తి బయటికి తొంగిచూశారు. వాళ్ళకు కలిగిన భయాశ్చర్యాలు అంతా యింతా కాదు.


    ఒక మహాసర్పం, వాళ్ళు కనీ వినీ ఎరుగని ఒక భయంకర మృగంతో చావు బతుకుల పోరు జరుపుతున్నది. సర్పం కొట్టే బుసలూ, భయంకర మృగం పెట్టే అరుపులూ విని ముగ్గురూ ప్రాణభయంతో తల్లడిల్లి పోయారు.

ఇంకా వుంది...

Post a Comment

Previous Post Next Post