రాకాసిలోయ (చందమామ)_20
రాకాసిలోయ_20
చండమండూకుడి అనుచరుడికి, తమ నాయకుడు బ్రహ్మదండిని తిట్టటం గాని, అతణ్ణి అనుమానించటం గాని, ఏ మాత్రం సబబుగా కనిపించలేదు. బోలెడు ధనం యిచ్చి, బ్రహ్మపుర రాజుచేత అర్ధ రాజ్యం యిప్పించగలనని వాగ్దానం చేసిన బ్రహ్మ దండి, మండూకుణ్ణి చంపేందుకు మనుషుల్నెందుకు పంపుతాడు? పైగా, ఆ జ్యేష్ఠుడూ, కనిష్ఠుడూ లేందే రాకాసి లోయలో తను సాధించగలిగిందేమీ లేదని, బ్రహ్మదండి ముందుగానే మండూకుడికి చెప్పి, వాళ్ళను పట్టుకునే పని అతడికి ఒప్పగించాడు. ఆ జ్యేష్ఠుడూ, కనిష్ఠుడూ ఈ లంకకు చేరటంలో ఏదో రహస్యం వున్నది...
చండమండూకుడి అనుచరుడు యిలా ఆలోచిస్తూ, తమ నాయకుడి ముందుకు వచ్చి, "మండూకేశ్వరా, తొందరపడకండి, ఆ దుర్మార్గులిద్దర్నీ పంపినవాడు బ్రహ్మదండి కాడని నా అనుమానం. మన సహాయం కోరిన ఆ మాంత్రికుడు మనను చంపించే ప్రయత్నం ఎందుకు చేస్తాడు? ఇందువల్ల అతడికి కలిగే లాభం ఏమిటి? ఆలోచించాలి." అన్నాడు.
“ఆలోచించు.....తీరిగ్గా ఆలోచించు !” అంటూ మండూకుడు గట్టిగా కసురుకుని, “ముందు నువ్వెళ్ళి, ఆ బ్రహ్మదండి భడవాని యిక్కడకి తీసుకురా. పావు గంటలో రావాలి. తెలిసిందా? అలా చేయక పోయావో, నీ చర్మం వొలిపిస్తాను," అంటూ కళ్ళెర్ర చేశాడు.
మండూకుడి అనుచరుడు పెద్ద పెద్ద అంగలేస్తూ హడావిడిగా రావటం, కొండ అంచున వున్న గుడారాల ముందు కూచుని మాట్లాడుకుంటున్న బ్రహ్మదండి మాంత్రికుడూ, అతడి అంగరక్షకులైన, జితవర్మా, శక్తివర్మలూ చూశారు. నరభక్షకుడి వాలకం వాళ్ళ ముగ్గురిలో భయాశ్చర్యాలను కలిగించింది.
బ్రహ్మదండి, జిత శక్తి వర్మల కేసి తల తిప్పి, “జితా, శక్తి, చూశారా మనకేసి వస్తున్న,మండూకుడి అనుచరుడి ముఖ లక్షణాలు. వాడేదో మాంచి కోపంలో వున్నట్టున్నాడు. మనకేం ప్రమాదం లేదు గదా !” అన్నాడు నిస్పృహగా.
“అసలు ఈ నరభక్షకులతో స్నేహం కలపటమే ప్రమాదం. నే వొద్దని ఎంత మొత్తుకున్నా, విన్నావు కాదు,” అన్నాడు జితవర్మ కోపంగా.
“మనం స్నేహితులమని చెప్పి, డబ్బూ, రాజ్యం వస్తుందన్న ఆశ చూపకపోతే, మనను మండూకుడు ఎప్పుడో కాల్చుకు తినేసేవాడు. ఒకసారి వాళ్ళకు చిక్కిం తరువాత, మనం చేయ గలిగిందేముంది నిస్సహాయులం. అంతా ఆ కాలభైరవుడి అధీనం,” అన్నాడు బ్రహ్మదండి.
సంభాషణ అలా జరుగుతున్నంతలో, మండూకుడి అనుచరుడు అక్కడికి రానే వచ్చాడు. వస్తూనే వాడు, బ్రహ్మదండి కేసి కోపంగా చూస్తూ, “బ్రహ్మదండి, నీ రోజులు ముగిసినై. మా నాయకుడు నిన్ను నిలువునా కాల్చుకు తింటానంటూ కారాలూ మిరియాలూ నూరుతున్నాడు," అన్నాడు.
“నన్నా? కాల్చుకు తినటమా? ఆశ్చర్యం! ఆ మండూకేశ్వరుడికి నేను చేసిన ద్రోహం ఏమిటి? బ్రహ్మపుర రాజ్యంలో అర్ధరాజ్యం యిప్పిస్తానని కూడా మాట యిచ్చానే,” అంటూ బ్రహ్మదండి లేని బింకం నటించాడు.
“అర్ధరాజ్యం మాట భద్రమండూకుడెరుగు! నువ్వు, మా నాయకుణ్ణి చంపించేందుకు, ఆ జ్యేష్ఠుణ్ణి, కనిష్ఠుణ్ణి ఆయన భవంతి దగ్గరకు పంపావు, అవునా?" అని ప్రశ్నించాడు మండూకుడి అనుచరుడు.
జ్యేష్ఠుడు, కనిష్టుడు అన్న పేర్లు వింటూనే బ్రహ్మదండి మాంత్రికుడు, కూచున్న చోటు నుంచి ఎగిరిలేచి, “హాఁ, కాలభైరవా, ఎన్నాళ్ళకు నీ భీకరదృష్టి నా మీదికి ప్రసరించింది! జ్యేష్ఠుడూ, కనిష్టుడూ దొరికారా?" అంటూ జిత శక్తి వర్మలకేసి దిరిగి, “మీకూ తెలుసు గదా, వాళ్ళు జయమల్లూ, కేశవుడని? ఇక లేవండి, బయలుదేరండి, మన ప్రయాణం సూటిగా రాకాసి లోయకే," అంటూ చిందులు తొక్కసాగాడు.
మండూకుడి అనుచరుడు ముందుకు వచ్చి, బ్రహ్మదండి భుజం పట్టుకుని ఒక్క తోపుతోస్తూ, “కపటనాటకం ఆడకు! ఆ జ్యేష్ఠుడూ, కనిష్ఠుడూ దొరికారని నీకెవరు చెప్పారు? ఆ దుర్మార్గుల నుంచి తప్పుకుని ప్రాణాలతో బయటపడటంలో, నాకూ, మండూకేశ్వరుడికీ తల ప్రాణం తోకకు వచ్చింది," అన్నాడు.
“అయితే వాళ్ళిప్పు డేక్కడున్నారు? ఇంకా మండూకేశ్వరుడి భవనంలోనే వున్నారా ? క్షణాల మీద వాళ్ళను పట్టేస్తాను. జితా, శక్తీ, లేవండి,” అంటూ బ్రహ్మదండి కేకలు ప్రారంభించాడు.
బ్రహ్మదండి మాంత్రికుడి ఆదుర్దా, అతడి మాటల తీరూ చూసిం తరువాత, మండూకుడి అనుచరుడికి, అతడు నిర్దోషి అన్న నమ్మకం కలిగింది. జ్యేష్ఠుడూ, కనిష్ఠుడూ బ్రహ్మదండి పంపగా వచ్చిన వాళ్ళని, తమ నాయకుడు అనుకోవటం పొరపాటని, అతడికి మొదటినుంచి తెలుసు. ఇప్పుడు తను వేసిన పేచీతో నిజం తెలిసిపోయింది. కాని, మండూకుడి కోపాన్ని శమింపచేయటం ఎలా?
మండూకుడి అనుచరుడు ఓ క్షణకాలం ఆలోచిస్తూ వూరుకుని, తరువాత బ్రహ్మదండిని దూరంగా తీసుకుపోయి, జిత శక్తివర్మలకు వినబడని విధంగా స్వరం తగ్గించి, “మా నాయకుడు నువ్వంటే మండిపోతున్నాడు," అంటూ జరిగిందంతా చెప్పి, “ఒకవేళ నువ్వు నిర్దోషివని ఎంత చెప్పినా, మా నాయకుడు నమ్మకపోతే, ఏదో మంత్రం వల్లించినట్లు నటించి, జ్యేష్ఠుణ్ణి, కనిష్ఠుణ్ణి అయన భవంతి దగ్గరకు పంపిన వాడు జితవర్మో, శక్తివర్మో అని చెప్పెయ్యి. ఆ యిద్దర్లో ఒకడి పీడ విరగడ అవుతుంది. నువ్వు రానున్న ప్రమాదాన్నుంచి బతికి బయటపడతావు,” అన్నాడు.
ఆ మాటలతో బ్రహ్మదండికి ప్రాణం కుదుటపడింది. అతడు మెల్లిగా తలతిప్పి జిత, శక్తివర్మల కేసి చూసి, “మండూకానుచరాగ్రణీ! మీరు చెప్పింది మహా బావుంది. ఒక్క గొప్పవాడి ప్రాణ రక్షణకుగాను, వెయ్యిమంది అల్పులను బలి చెయ్యవచ్చని శాస్త్ర గ్రంథాలన్నీ మూకవుమ్మడిగా మొరపెడుతున్నవి. ఇక బయలుదేరండి, ఆ మండూకేంద్రుల వారి సన్నిధానానికి వెళ్ళి వారి దివ్య దర్శనభాగ్యం కలిగించుకుందాం," అన్నాడు.
మండూకుడి అనుచరుడూ, బ్రహ్మదండి ముందు నడవసాగారు. వెనకగా వస్తున్న జిత, శక్తి వర్మలకు, వాళ్ళిద్దరూ రహస్యంగా మాట్లాడుకున్న దేమిటో తెలియక పోవటంతో భయం పట్టుకున్నది. కాని, పారిపోయే ప్రయత్నం చెయ్యటం వృథా. లంకలో తమ కొక్క స్నేహితుడు లేడు, అంతా నరభక్షకుల మయం!
నలుగురూ చండమండూకుడున్న పాడుపడ్డ బావి ప్రాంతాల కొచ్చేసరికి అక్కడ మండూకుడు యిద్దరు నరభక్షకులకు ఏవో సంజ్ఞలు చేస్తూ, మధ్యమధ్య భావిలోకి తొంగి చూస్తున్నాడు. అది గమనించిన, అతడి అనుచరుడూ, బ్రహ్మదండి నిశ్శబ్దంగా మండూకుణ్ణి సమీపించారు. మండూకుడు వాళ్ళను బావి దగ్గిర నుంచి, కొంచెం ఎడంలోవున్న చెట్ల కిందకు తీసుకుపోయి ప్రాణభయంతో వణుకుతున్న బ్రహ్మదండితో, “బ్రహ్మదండి, భయపడకు! నువ్వేదో ద్రోహం చేశావని యింతకు ముందు అనుమానించాను. కాని, అడవి నుంచి తిరిగి విచ్చిన నా అనుచరుల ద్వారా, ఆ జ్యేష్ఠుడూ, కనిష్ఠుడూ ఈ లంక కెలా చేరారో తెలుసుకున్నాను. వాళ్ళు బానిసల గుంపు నుంచి విడివడి నదిలోకి దూకి, ఈ లంక చేరారట. సరే, ప్రస్తుత ముఖ్య విషయం అది కాదు. వాళ్ళిద్దరూ మనకిప్పుడు బోనులో చిక్కిన సింహాలు," అంటూ బావి కేసి చేయి వూపి, “వాళ్ళిప్పుడు నా భవనం నుంచి యిక్కడికి వున్న సొరంగ మార్గం గుండా వస్తున్నారు. ఆ చివర మనవాళ్ళను కాపలా పెట్టాను. కొందరు సొరంగ మార్గంలోకి దిగి వాళ్ళనిటు తరుముకు వస్తున్నారు. మనం యిక్కడ మాటువేసి, బావిలోనుంచి వాళ్ళు బయటికి రాగానే సజీవులుగా పట్టుకోవాలి. తెలిసిందా?" అన్నాడు.
మండూకుడు ఇలా చెప్పగానే, బ్రహ్మదండి మాంత్రికుడికి కలిగిన ఆనందం అంతా యింతా కాదు. అతడి కళ్ళముందు రాకాసి లోయలోని ధనరాసులన్నీ గిర్రున తిరిగినై. అతడు జిత, శక్తివర్మల దగ్గరకు వెళ్లి రహస్యంగా, “మండూకుడు చెప్పింది విన్నారు కదా? ఆ కేశవుణ్ణి, జయమల్లునూ ప్రాణాలతో పట్టుకోండి. బహుశా వాళ్ళ దగ్గర ఆయుధాలు వుండి వుంటవి. తప్పని సరైతే ఆత్మరక్షణకు జయమల్లును చంపండి కాని, కేశవుడికి మాత్రం ఎలాంటి హానీ కలిగించకండి. తెలిసిందా ?” అన్నాడు.
ఆ తరువాత అందరూ కలిసి బావి దగ్గరకు వెళ్ళి దాని అంచున పొంచి కూచున్నారు. మండూకుడు మధ్యమధ్య కూచున్నచోటు నుంచి లేచి, బావిలోకి తొంగిచూసి, దాని గట్టు మీద చెవి ఆనించి విని, “శబ్దమవుతున్నది. వాళ్ళిటే వస్తున్నారు,” అని మెల్లిగా తన పక్కనున్న వాళ్ళతో చెప్పసాగాడు.
చండమండూకుడు అనుకున్నట్టు, కేశవుడూ, జయమల్లూ, కోయ యువకుడూ సొరంగ మార్గం కుండా అటుకేసే వస్తున్నారు. వాళ్ళు గుడిశెలో వున్న సొరంగాన్ని కనుక్కున్న తరువాత, మండూకుడి కోసం అక్కడున్న గదులూ అవీ వెతికి, అతడు లేడని గ్రహించి, తిరిగి గుడిశెలోకి పోదామనుకునేంతలో, అక్కడ అలికిడీ, సొరంగ ద్వారాన్ని కప్పివున్న తలుపు తెరవటం వాళ్ళకు కనిపించింది. వెంటనే వాళ్ళు ప్రమాదాన్ని గ్రహించి, కాగడాల వెలుగులో సొరంగం వెంట దాని రెండవ చివరి కేసి బయలుదేరారు.
“మనం అందులో వున్న సంగతి మండూకుడి అనుచరులకు తెలిసిపోయింది. వాళ్ళు మన కోసమే వస్తున్నారు," అన్నాడు కోయ యువకుడు.
కేశవుడు అవునన్నట్టు తల వూపాడు. జయమల్లు వెలుగుతున్న కాగడాతో సొరంగ మార్గాన ముందుకు నడుస్తూ, “మనకు దీని వెంట పడి, ఇది ఎక్కడికి చేరిస్తే, అక్కడికి చేరటం ఒక్కటే వున్న దారి. మండూకుడు ఆ చివర కూడా కాపు పెట్టకపోతే, మనం బతికి బయటపడగలం. అలాకాకపోతే, ప్రాణం వున్నంత వరకూ పోరాడదాం," అన్నాడు.
“అంతకాక చేసేందుకు మరేముంది? నరభక్షకులకు ఆహారం అయ్యే ముందు వాళ్ళల్లో కొందరినైనా, మన కత్తులకు ఆహారం చేద్దాం," అన్నాడు కేశవుడు. కోయ యువకుడు అవునన్నట్టు తలాడించాడు.
ఆ విధంగా వాళ్ళు సొరంగ మార్గం గుండా నడిచి పాడుబడిన బావిని సమీపిస్తున్నంతలో, పై నుంచి అలికిడి వినబడింది, వెంటనే ముందు నడుస్తున్న జయమల్లు ఆగి, కేశవుడితో మెల్లిగా, “మనం భయపడ్డంతా అయింది. వాళ్ళు మనకోసం కాపలా వేశారు." అన్నాడు.
కేశవుడు ఏదో అనబోయేంతలో వెనక నుంచి వేగంగా సమీపిస్తున్న అడుగుల చప్పుడూ, గుడ్డి వెలుగూ కనిపించింది. వెంటనే ముగ్గురూ తమ తమ ఆయుధాలు గుప్పెళ్ళలో గట్టిగా బిగించి పట్టుకున్నారు. కేశవుడు, జయమల్లును తోసుకుని ముందుకు వస్తూ, “వెన్నంటి వస్తున్న శత్రువులు మన మీద పడకముందే, మనం ముందుకు వెళ్ళి ఆ పైన కాపలావున్న వాళ్ళ పని పట్టాలి. ఆ విధంగా మనకు ప్రాణాలతో బయటపడే అవకాశం చిక్కవచ్చు." అన్నాడు.
ఆ వెంటనే ముగ్గురూ వేగంగా ముందుకు పరిగెత్తసాగారు.
“హేఁయ్, ఆ దుర్మార్గులు వచ్చేస్తున్నారు, ప్రాణాలతో పట్టకోండి," అంటూ చండమండూకుడు కేకపెట్టాడు. వాడి అనుచరులూ, జీత, శక్తివర్మలూ ఆయుధాలు చేతబట్టి లేచి నిలబడ్డారు.
“కేశవుడి కేమీ ప్రమదం కలగకూడదు. వాడు వెంటలేందే మనం రాకాసి లోయలో ఏమీ చేయలేం. జితా, శక్తి, జాగ్రత్త ! వాడికేమైనా ప్రమాదం జరిగిందో మిమ్మల్ని నిలువునా, భస్మం చేసేస్తాను. తరువాత విచారించి లాభం లేదు,” అంటూ బ్రహ్మదండి కేక పెట్టాడు.
బ్రహ్మదండి మాంత్రికుడి కేకకు జవాబా అన్నట్టు, కేశవుడూ, జయమల్లూ, కోయ యువకుడూ ఒక్క ఊపులో బావి నుంచి పై కెగిరివస్తూ, సింహాల్లా గర్జించారు. అదే సమయంలో దాపులవున్న గుబురుచెట్లలోంచి, “గురుమౌనానందులకూ, జై !" అన్న కేకలు వినిపించినై. మరుక్షణంలో, ఒక పెద్ద గొంతు, “విప్పచెట్ల మీద వున్న అరవై మంది యోధులూ, ముందు దిగి; ఆ బ్రహ్మదండిని, మండూకుణ్ణి పట్టుకోండి! నేరేడు చెట్ల చాటున వున్న నలభై యిద్దరూ, బావిలోకి దూకి; సొరంగ మార్గాన వస్తున్న నరభక్షకుల్ని నరకండి!" అంటూ భీకరంగా హెచ్చరించింది.
ఆ హెచ్చరిక వింటూనే “భద్రమండూకా!" అంటూ మండూకుడూ, “ఉపాసకుల ఊడల మర్రి, కాలభైరవా!" అంటూ బ్రహ్మదండి మాంత్రికుడూ బావి దగ్గిర నుంచి ఎగిరి గంతేసి, అడవిలోకి పారిపోయేందుకు పరిగెత్తసాగారు.
ఇంకా వుంది...
Post a Comment