రాకాసిలోయ (చందమామ)_19 RakasiLoya Janapada Novel by Dasari Subramanyam (CHANDAMAMA)

RakasiLoya 1-35 Janapada Novel by Dasari Subramanyam (CHANDAMAMA)

రాకాసిలోయ (చందమామ)_19

 _దాసరి సుబ్రహ్మణ్యం

రాకాసిలోయ_19

    కేశవుడికీ, జయమల్లుకీ ఓ తృటికాలం ఏం చేసేందుకూ పాలుపోలేదు. “ఆ కంఠధ్వని బ్రహ్మదండి మాంత్రికుడిది! నా తండ్రిని వాడు హింసిస్తున్నాడు." అనుకున్నాడు కేశవుడు. "ఆ ప్రశ్నించే గొంతు నరభక్షకుల నాయకుడైన చండమండూకుడిది! గుడిశెలో వాడి అనుచరులు ఎంత మంది వున్నారో తెలియదు. ఇప్పుడేమిటి కర్తవ్యం?” అనుకున్నాడు జయమల్లు, ఇలా ఆలోచిస్తూ కేశవుడూ, జయమల్లూ అప్పుడే చలనం వచ్చిన వాళ్లలా చప్పున ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. మాటలూ, సౌంజ్ఞలూ లేకుండానే ఆ క్షణంలో చేయవలసిందేమిటో యిద్దరికీ తెలిసిపోయింది.


    జయమల్లు నిశ్శబ్దంగా వంగి, గుడిశె పక్కన వున్న ఒక ఈటెను చేతికి తీసుకున్నాడు. తరవాత కేశవుడి భుజం మీద చేయివేసి చెవిలో మెల్లిగా, “గుడిశెలో వున్న శత్రువు లెందరో ముందు తెలుసుకోవాలి,” అంటూ గుడిశెకు అల్లివున్న కొబ్బరి ఆకులలో నుంచి ఈటెను నింపాదిగా లోపలికి గుచ్చాడు.


    కేశవుడు, జయమల్లు చేసిన కంతలో నుంచి లోపలికి తొంగి చూశాడు. గుడిశె అంతా చీకటి మయంగా వున్నది. ఒక మూల వెలుగుతున్న కాగడా వెలుగులో మసక మసకగా ఇద్దరు ముగ్గురు మనుషులు కనిపిస్తున్నారు. వాళ్ళల్లో ఒకడు మెడలో మానవ కంకాళాలను పూసలుగా ధరించి వున్నాడు. మరొకడు కూడా దాదాపు అలాగే వున్నాడు. వాడికి మెడలో ఎలాంటి అలంకారాలూ లేవు. వాళ్ళకు ఒక పక్కగా ఒక యువకుడు పెడరెక్కలు విరిచి కట్టబడి వున్నాడు. అతణ్ణి కంకాళలు ధరించి వున్నవాడు ప్రశ్నిస్తున్నాడు.


    “నాకు సర్వం తెలుసు, అంతా తెలుసు ! నా నుంచి నువ్వు ప్రాణాలతో పారిపోలేవు. ముసలివాడి గొడవ నా కవసరం లేదు. నాక్కావలసింది. ఆ జ్యేష్ఠుడూ, కనిష్ఠుడూ. చెప్పు, ఊఁ వాళ్ళెక్కడ?" అని కంకాళాలు ధరించిన వాడు భీకరంగా అరిచాడు.


    అంత ప్రమాద పరిస్థితిలో కూడా కేశవుడికి ఎంతో ఆనందం కలిగింది. ఈ దుర్మార్గులెవరోగాని, వాళ్ళకు చిక్కినవాడు మాత్రం తన తండ్రి కాదు. పైగా, గుడిశెలో వున్న వాళ్ళిద్దరు; వాళ్ళను హతమార్చి, వాళ్ళకు బంది అయినవాణ్ణి విడిపించటం పెద్ద సమస్య కాదు.


    కేశవుడు యిలా అనుకుని, జయమల్లు కేసి తిరిగి, “మల్లూ, మనం లోపలికి జొరబడదాం. శత్రువు లిద్దరే," అన్నాడు.


    జయమల్లు తొందర పడవద్దని కేశవుణ్ణి వారించి, కంతలో నుంచి గుడిశెలోకి చూశాడు. చేతులు విరిచి కట్టబడిన వ్యక్తి, కోయనాయకుడు గడేజంగ్ అనుచరుడన్న అనుమానం అతడికి కలిగింది. అంతలో బంధితుణ్ణి ప్రశ్నిస్తున్నవాడు లేచి నిలబడి, పళ్ళు కొరుకుతూ, “వీడిని ఎంత హింసించినా నిజం చెప్పడు. ఆ మండూక కషాయం తాగించు. నిజం అదే బయట పడుతుంది,” అన్నాడు.


    “అలాగే చేస్తాను, చండమండూకేశ్వరా,” అంటూ మండూకుడి అనుచరుడు లేచి వెళ్లి, గుడిశెలో ఒక మూల నుంచి పాత్ర తెచ్చి, దానిని అక్కడ వున్న మిడిగుడ్ల కొయ్యబొమ్మల ముందు మూడుసార్లు తిప్పి, పాత్రను బంధితుడి నోటిముందు పెడుతూ, “ఇది నిజం చెప్పించే కషాయం, తాగు," అంటూ అతడి నోటిలో బలవంతంగా పోశాడు.


    “వీడు నరభక్షకుల నాయకుడైన చండమండూకుడు, తెలిసిందా? వాడిప్పుడు బంధితుడికి నిజం పలికించే కషాయమేదో యిప్పించాడు. తొందర ఎందుకు? ఏం జరుగుతుందో చూద్దాం. ఆ తరువాత వాణ్ణి, వాడి సేవకుణ్ణి యమపురికి పంపుదాం,” అన్నాడు జయమల్లు.


    ఇంతలో మండూక కషాయం తాగిన వాడు, పెద్దగా రెండుసార్లు దగ్గి, ఒకటి రెండుసార్లు మత్తెక్కిన వాడిలా అటూ యిటూ ఊగిసలాడి, “వాళ్ళిద్దరూ..... జ్యేష్ఠుడూ..... కనిష్ఠుడూ ...... వున్నారు ...... యిక్కడే ......”


    అతడు మాట ముగించే లోపలే జయమల్లు కంత దగ్గిన నుంచి యివతలికి ఎగిరి గంతేసి, “కేశవా, ప్రమాదం ! అది నిజంగా సత్యం చెప్పించే కషాయమే! ఆ తాగిన వాడు మనం యిక్కడ వున్నట్టు చెప్పేస్తున్నాడు. మనం వెంటనే గుడిశెలో జొరబడి ఆ దుర్మార్గుల్ని చంపటం తప్ప మరి మార్గం లేదు,” అంటూ గుడిశె ద్వారానికేసి పరిగెత్తాడు. బయట అడుగుల చప్పుడు వింటూనే చండమండూకుడు అదిరిపడ్డాడు. “ఎవరో శత్రువులు, శత్రువులు!" అంటూ అరిచాడు. అతడి అనుచరుడు ఒక ఈటె తీసుకుని ద్వారంకేసి పరిగెత్తుతూ, “మండూకేశ్వరా, మీరు మాయంకండి!" అని కేక పెట్టాడు.


    కేశవుడూ, జయమల్లూ గుడిశె ద్వారానికి అడ్డంగా వున్న తడికెను ఒక్క తన్ను తన్ని లోపలకు దూకారు. వాళ్ళను ఎదిరించ చూచిన, మండూకుడి అనుచరుణ్ణి కేశవుడు తన కత్తిపీడితో తలమీద ఒక్క వేటు వేశాడు. ఆ దెబ్బకు వాడు అబ్బా అంటూ కిందపడి పోయాడు.


    గుడిశెలోకి ప్రవేశించిన కేశవుడికి, జయమల్లుకూ కలిగిన ఆశ్చర్యం అంతా యింతా కాదు. చేతులు విరిచి కట్టబడి వున్నవాడు, జయమల్లు ఊహించినట్లు గడేజంగ్ అనుచరుడే. కాని, చండమండూకుడి జాడలేదు.


    జయమల్లు, గడేజంగ్ అనుచరుడి కట్లు విప్పి అతణ్ణి గుడిశెలో వున్న ఒక బాదుకు ఆనించి కూచోబెట్టాడు. అతడింకా మత్తుతో అటూ యిటూ వూగుతున్నాడు. జయమల్లు అతడి తల మీద యింత నీరు కుమ్మరించి, భుజాలు పట్టుకుని వూపుతూ, “నువ్వు గడేజంగ్ అనుచరుడివే గదా? మేమిద్దరం స్నేహితులం. మనమంతా జలపాతంలో నుంచి నదిలోకి దూకి కపిలపుర రాజ్యం చేరాం. అక్కడ బానిస వర్తకుడి భటులకు చిక్కకుండా నువ్వూ, నీతోటివాడూ, గురుమౌనానందుడూ ఎటో పారిపోయారు. తరవాత ఏం జరిగింది?"అని గుక్క తిప్పుకోకుండా ప్రశ్నల వర్షం కురిపించాడు.


    జయమల్లు ప్రశ్నకు కోయ యువకుడు కళ్ళు తెరిచి అతడికేసి, కేశవుడికేసి చూడటం మాత్రం చేయగలిగాడు. అతడి ముఖంలో ఆశ్చర్యం, ఆనందం తొణికిసలాడింది. ఏదో చెప్పేందుకు ప్రయత్నించాడు, కాని మాటలు తడబడినై.


మల్లూ, అతణ్ణి తొందర పెట్టకు. కాస్త విశ్రాంతి తీసుకోనీ, ఈ లోపల మనం ఈ చండమండూకుడి జాడ తెలుసుకుందాం,” అన్నాడు కేశవుడు.


    కేశవుడిలా అనగానే మండూకుడి అనుచరుడు లేచి కూచుంటూ, “హాఁ, చండ మండూకేశ్వరా ! మాయమయావా? తిరిగి నీ దర్శనం నూరేళ్ళ తరవాతనే గదా? అంత కాలం నువ్వు లేకుండా, నీ అనుచరులమైన మేము ఎలా జీవించటం!" అంటూ నెత్తినోరూ కొట్టుకో సాగాడు.


    వాడి దుఃఖం, నూరేళ్ళ తరువాతనే గదా నీ దర్శనం అన్న మాటలు విని కేశవుడుకి చాలా ఆశ్చర్యం కలిగింది.


    కాని, జయమల్లు చిరునవ్వు నవ్వుతూ, మండూకుడి అనుచరుణ్ణి సమీపించి, వాడి జట్టు పట్టుకు కుదుపుతూ, “ఓరి దొంగ వెధవా, నీ మాటలు మేము నమ్ముతామే అనుకున్నావా! ఎక్కడ? నీ నాయకుడెక్కడ? నిజం చెప్పక పోయావో నీ ప్రాణం తీస్తాను," అన్నాడు.


    ప్రాణమా? తీస్తావా? అంతకంటె నాక్కావలసిం దేమిటి? చండమండూకేశ్వరుడి కోసం చచ్చినవాళ్ళు నేరుగా స్వర్గానికి వెళ్ళిపోతారు. ఆ సంగతి లోకంలో తెలియని వాళ్ళెవరూ లేరే. నువ్వెంత అమాయకుడివి. నన్ను త్వరగా చంపెయ్యి!" అంటూ మండూకుడి అనుచరుడు పక్కన పడివున్న ఈటెను అందుకుని దాన్ని జయమల్లుకు యివ్వబోయాడు.


    ఈసారి కేశవుడితో పాటు జయమల్లు కూడా చాలా ఆశ్చర్యం పొందాడు. ఒకవేళ నిజంగానే చండమండూకుడు గుడిశెలో నుంచి మాయమయాడా? అన్న అనుమానం అతడికి కలిగింది. అంతలో గడేజంగ్ అనుచరుడు పెద్దగా దగ్గుతూ లేచి నిలబడి, “జ్యేష్ఠా, కనిష్ఠా!. నన్ను గుర్తించారు గదా! సరే. మీకు ఆ దుర్మార్గుడి మాటలు నమ్మకండి. మండూకుడు ఈ గుడిశెలో వున్న రహస్య మార్గం కుండా పారిపోయి వుంటాడని, నాకు గట్టి నమ్మకం వున్నది,” అన్నాడు.


    “రహస్యము.....మార్గము.....ఆహ్హాహ్హా!" అంటూ మండూకుడి అనుచరుడు గుర్రంలా సకిలించి, “చండమండూకేశ్వరుడికి రహస్య మార్గాలు కావాలా? ఆ మహనీయుడు నీటిలో ఉప్పులా కరిగిపోగలడు, గాలిలో పొగలా కలిసిపోగలడు, మట్టిలో సారంలా యింకి పోగలడు, ఆకాశంలో.....


    ఇక నోరుముయ్యి వాచాలపు వెధవా!" అంటూ కోయయువకుడు ఒక్క దూకులో వచ్చి, మండూకుడి అనుచరుడి గొంతు పట్టుకుని, “చూస్తూంటే వీడి ఎత్తు, తమ నాయకుడు బాగా దూరం పారిపోయేందుకు మనచేత యిక్కడ జాగారం చేయించటంలా వుంది. మీరు గుడిశెలోని నేలంతా తొక్కి చూడండి. నేను వీడి కాళ్ళూ చేతులు కట్టి, అరవకుండా నోట్లో గోనెసంచి కుక్కుతాను," అన్నాడు.


    కేశవుడూ, జయమల్లూ గుడిశె అంతా కలయ తొక్కసాగారు. చూస్తుండగానే కోయ యువకుడు తన పని ముగించుకుని, థిణక థిణక తై థిణక అంటూ గుడిశెలో హనుమంతుడిలా కుప్పిగంతులు ప్రారంభించాడు. రెండు, మూడునిమిషాల కాలం ముగ్గురూ గుడిశె అంతా కలయ తొక్కారు. హఠాత్తుగా కోయ యువకుడు కీచుమంటూ అరిచి, “రహస్య మార్గం !" అంటూ దభీమని కింద గోతిలోకి పడిపోయాడు.


    కేశవుడూ, జయమల్లూ కోయ యువకుడు పడిపోయిన గోతిలోకి తొంగి చూస్తూ, “నీకేం దెబ్బలు తగలలేదు గదా ? అరెరె, ఇక్కడ మెట్లు కూడా వున్నవే. మండూకుడు మాయమైంది, ఈ మెట్ల మీదినుంచి భూసొరంగంలో కన్న మాట !" అన్నాడు.


    కోయ యువకుడు ఒంటికి పట్టిన మన్ను దులుపుకుని, తల పైకెత్తి, “ఆ దుర్మార్గుణ్ణి పై నుంచి కిందకు దొర్లించండి. తరువాత మీరు కూడా మెట్లు దిగిరండి. మండూకుడిక్కడే దాక్కుని వుంటాడు," అన్నాడు.


    కేశవుడూ, జయమల్లూ కలిసి, మండూకుడి అనుచరుణ్ణి కాళ్ళు తల పట్టుకుని పై నుంచి గోతిలోకి వున్న మెట్ల మీదుగా కిందకు దొర్లించి, తరువాత వాళ్ళుకూడా కిందకు దిగి, గోతిని, దాని అంచుకు వేళ్ళాడుతున్న చెక్క తలపుతో ఎప్పటిలా మూసేశారు.


    కోయ యువకుడు అనుకున్నట్లు అది వట్టి భూసొరంగం కాదు. అక్కడ విశాలమైన గదులూ, భీకరాకారంతో వున్న కొయ్య బొమ్మలూ, ఈటెలూ,కత్తులూ.....ఇలాంటి సరంజామా చాలా వున్నది.


    పైనున్న గుడిశె మండూకు డాడే కపట నాటకంలో ఒక భాగం మాత్రమే. వాడి నిజమైన నివాస గృహం యిది. ఆ మూలనున్న కాగడాలు వెలిగించి అన్ని గదులూ వెతకండి,” అన్నాడు జయమల్లు.


    ఆ వెంటనే ముగ్గురూ కాగడాలు వెలిగించి, ఆ ప్రదేశమంతా గాలించసాగారు.


    కేశవుడూ, జయమల్లూ, కోయ యువకుడూ భూసొరంగమంతా గాలిస్తుండగా, చండమండూకుడు, తన అనుచరుడొకడితో కలిసి, లంక మధ్య వున్న అడవిలోని ఒక పాడుపడిన బావిలోంచి పైకి వస్తూ, “ఇప్పటి కేదో బతికి బయటపడ్డాం. ఆ బ్రహ్మదండి మాంత్రికపు నీచుడు నన్నెంత మోసం చేశాడు! నన్ను ఎవరి కోసరం అయితే వెతక మన్నాడో, వాళ్ళను నా భవంతి దగ్గరికే పంపి, నా ప్రాణాలు తీయించేయిందుకు ప్రయత్నిం చాడు. లోపల నేను ఆ కోయ కుంకకు మండూక కషాయం తాగించి, నిజం చెప్పిస్తూంటే, ఆ జ్యేష్ఠుడూ, కనిష్ఠుడూ గుడిశె కంతల్లో నుంచి ఇదంతా చూస్తున్నారన్నమాట! వాణ్ణి కర్రగ్గుచ్చి, నిలువునా కాల్చుకు తింటాను,” అంటూ పళ్ళు కొరుకుతున్నాడు.

ఇంకా వుంది...

Post a Comment

Previous Post Next Post