రాకాసిలోయ (చందమామ)_18 RakasiLoya Janapada Novel by Dasari Subramanyam (CHANDAMAMA)

 RakasiLoya 1-35 Janapada Novel by Dasari Subramanyam (CHANDAMAMA)

రాకాసిలోయ (చందమామ)_18

 _దాసరి సుబ్రహ్మణ్యం

రాకాసిలోయ_18

    బానిస వర్తకులిద్దరూ, స్థూలకాయుణ్ణి సముదాయిస్తూ, “అట్టే గొడవ పెట్టకు. కావాలంటే, ఈసారి జరిగే కొనుగోలులో నీకు మరింత లాభం కలిగేలాగా చూస్తాం. నీవు చేసే రణగొణ ధ్వనికి, ఏ సింహాల మందో వచ్చిపడితే, అందరం పరలోక యాత్ర చేయవలసి వస్తుంది,” అన్నారు.


    సింహాల పేరు వింటూనే స్థూలకాయుడు గతుక్కుమని, కాళ్ళు చచ్చుపడిన వాడిలా నిలుచున్న చోటే కూలబడి పోయాడు. ఇక ఆ రాత్రికి ఎవరూ నిద్రపోలేదు. అందరికీ ప్రాణ భయం పట్టుకున్నది.


    రాత్రి గడిచి సూర్యోదయం అవుతూనే వర్తకులు ప్రయాణసన్నాహాలు ప్రారంభించారు. స్థూలకాయుడికి యిస్తామన్న ఐదు బంగారు కాసులూ యిచ్చి, “ఇక నీ దారి నీది. కాస్త జాగ్రత్తగా వెళ్ళు." అన్నారు.


    స్థూలకాయుడు అడవినంతా ఓసారి కలయచూస్తూనే బిక్క చచ్చిపోయాడు. అతడికి రాత్రి మీద పడిన సింహాన్ని గురించిన భయం యింకా వదలలేదు. తను ఒంటరిగా తన గుడారాల దగ్గిరకు ప్రయాణమై పోయేప్పుడు, అది ఏ చెట్టు చాటు నుంచో ఎగిరి మీదపడితే తనేం కాను?


    ఈ లోపల వర్తకులు తమ నౌకర్లను హెచ్చరించి బయలుదేరారు. కేశవుణ్ణి, జయమల్లునూ తతిమ్మా బానిసల నుంచి వేరుచేసి, వాళ్ళను తమ వెనకగా రావలసిందని ఆజ్ఞాపించారు. అటువంటి ధైర్యవంతులిద్దరు తమ వీపుకాచి వుండటం క్షేమం అన్న నమ్మకం వాళ్ళకు కలిగింది.


    “మీ రిద్దరూ మామూలు బానిసల వంటి వాళ్ళు కాదు, బానిసల్లో రాజకుమారు ల్లాంటి వాళ్ళు ! కపిల నగరంలో మిమ్మల్ని అందరికన్నా సంపన్నులైన గృహస్థులు కొనేలా చూస్తాం.” అన్నారు వర్తకులు.


    వాళ్ళావిధంగా ఒక వంద గజాలు నడిచారో లేదో, వెనక నుంచి స్థూలకాయుడు పెద్దగా కేకలు పెడుతూ పరిగెత్తి రావటం కనిపించింది. వర్తకు లిద్దరూ ఆశ్చర్యపడుతూ వెనుదిరిగి చూశారు. స్థూల కాయుడు రొప్పుతూ రోస్తూ వాళ్ళను సమీపించి, “నాకిప్పుడు గుర్తుకు వచ్చింది. కపిల పురంలో నా సొంత పని ఒకటి చూసుకోవాలి. నేనూ మీతోపాటు వస్తాను," అన్నాడు. వర్తకులు ముఖముఖాలు చూసుకుని చిరునవ్వు నవ్వుకున్నారు. వాళ్ళల్లో ఒకడు స్థూలకాయుడి కేసి తిరిగి, “ఓఁ, నువ్వు కావాలంటే మా వెంట రావొచ్చు. కాని, అడవిలో నీకు మేం రక్షణ కల్పించి నందుకుగాను, పది బంగారు కాసులిచ్చుకోవలసి వుంటుంది,” అన్నాడు.


    స్థూలకాయుడు ఓ క్షణకాలం నిర్విణ్ణుడయి పోయి, అంతలోనే ముఖం మీద లేని నవ్వు తెచ్చి పెట్టుకుని, “మీరేదో తమాషా చేస్తున్నారు. ఈ మహారణ్యంలో నాబోటి బలశాలి, ధైర్యసాహసాలున్న వాడూ, మీ వెంట వుంటే ఎంత వుపయోగం," అంటూ ఒరలో నుంచి కత్తిదూసి గిర్రుగిర్రున తిప్పసాగాడు. వర్తకులకు అతడి మీద చాలా జాలి కలిగింది. వాళ్ళు స్థూలకాయుణ్ణి సమీపించి, భుజం తడుతూ, “నీ ధైర్యం మాకు తెలియంది కాదు. కావాలంటే మా వెంట రా, సుంకం ఏమీ యిచ్చుకో నవసరం లేదు. కాని, కపిల పురాన్నుంచి తిరుగు ప్రయాణం ఎలా చేస్తావు ? నువ్వు లేని సమయంలో నీ నౌకర్లు గుడారాలెత్తి పారిపోతే ఏం చేయగలవు ?” అని అడిగారు.


    “వాళ్ళ డొక్కలు చీరేస్తాను. నా పేరంటే వాళ్ళకు సింహస్వప్నం. కపిలపురాన్నించి తిరిగి రావటం అంటారా? ఓఁ, ఎంతమంది అక్కణ్ణించి ఈ అరణ్యానికి వస్తూపోతూ వుంటారో నాకు తెలియదా!" అన్నాడు.


    ఆ తరువాత అందరూ తిరిగి నడక ప్రారంభించాడు. అరణ్యంలో కొంతదూరం వెళ్ళిన తరువాత, బాట ఒకానొక లోయ పక్కకు తిరిగింది. అది చాలా లోతైన లోయ, అందులో ఒక నది ప్రవహిస్తున్నది. లోయ పైభాగాన్నుంచి దాదాపు నది దిగువ వరకూ పెద్ద పెద్ద వృక్షాలూ, వాటిమీద అడవి తీగలూ పెనవేసుకుని ఆ ప్రదేశమంతా చూడటానికి మహాభయంకరంగా కనిపిస్తున్నది.


    కేశవుడు, పక్కనే వున్న జయమల్లుకేసి తిరిగి చిన్న గొంతుతో, “మల్లూ, మనం ఈ దుర్మార్గుల నుంచి తప్పించుకు పోవాలంటే, ఈ ఎత్తునుంచి నదిలో దూకితే సరిపోతుంది. ఏమంటావ్ ?” అన్నాడు.


    జయమల్లు అగాధం దిగువకేసి ఓసారి చూసి, “మనం చెట్ల కొమ్మలకు తగులుకోకుండా సూటిగా నదిలోకి దూకగలిగితే ప్రమాదం వుండదు. అలాకాక....."


    జయమల్లు మాట పూర్తిచేసే లోపలే, బానిసల గుంపుకు ముందుండి దారితీస్తున్న వర్తకుల నౌకర్లు, కెవ్వుమని కేకలు పెట్టారు. ఎదురుగా వున్న రాళ్ళచాటు నుంచీ, చెట్ల బోదెల మాటు నుంచి పెద్ద పెద్ద కత్తులు పట్టుకున్న నరమాంస భక్షకులు కొందరు, “చండమండూకుడికి జై!” అంటూ పిశాచాల్లా అట్టహాసం చేస్తూ ముందు కురికారు.


    “బాణాలు.....కత్తులు.....ఈటెలు....." అంటూ కీచుమని బానిసవర్తకు లిద్దరూ వెనక్కు రెండడుగులు వేసి, “జ్యేష్ఠా, కనిష్ఠా! మీరే మమ్మల్ని, ఈ నరభక్షకుల్నుంచి కాపాడాలి. మీకు స్వేచ్ఛ యిచ్చేస్తున్నాం,” అంటూ అరిచారు.


    కేశవుడూ, జయమల్లూ తృటికాలంలో ఒక నిర్ణయానికి వచ్చారు. నరభక్షకుల వాతపడితే, ఇక స్వేచ్చ అనేదే లేదు. అలా ఆలోచించి, చప్పున యిద్దరూ బానిసవర్తకుల్ని గట్టిగా వడిసి పట్టుకుని, అగాధం అంచునుంచి దిగువనున్న నదికేసి దూకుతూ, “గురిగా నదిలోకి పడగలిగితే, మీకు స్వేచ్ఛ; ఏ చెట్టుమకొమ్మకో తగులుకున్నారో, చావు," అంటూ కేక పెట్టారు.


    ఈ లోపల నరభక్షకులు, తమను ఎదిరించిన బానిసవర్తకుల నౌకర్లను యిద్దరు ముగ్గుర్ని కత్తులతో నరికి, పడ్డచోటునుంచి బంతిలా పైకెగిరి వెనక్కుతిరిగి పారిపోతున్న స్థూలకాయుణ్ణి వెంబడిస్తూ, “ఆ మాంసం పోగును ప్రాణాలతో పట్టుకోండి, మన నాయకుడికి బహుకరిద్దాం. చల్లపడిన మాంసం ఆయన ముట్టడు," అంటూ కేకలు పెట్టసాగారు.

 

    కేశవుడూ, జయమల్లూ అగాధం దిగువ నున్న మహావృక్షాల కొమ్మలకు తాకకుండా అదృష్టవశాత్తూ, సూటిగా నదిలోకి పడిపోయారు. అలా పడేటప్పుడు నీటి తాకిడికి బానిసవర్తకు లిద్దరూ వాళ్ళ పట్టునుంచి జారిపోయారు.


    బానిసవర్తకు లిద్దరూ నీటిలో మునుగుతూ తేలుతూ, “రక్షించండి, జ్యేష్ఠా, కనిష్ఠా, రక్షించండి ! మీకు స్వేచ్ఛ యిస్తాం," అంటూ అరవసాగారు.


    చావు బతుకుల మధ్య కూడా బానిస వర్తకులు తమను యింకా వాళ్ళ ఆస్తిగా భావించి కేకలు పెట్టటం కేశవుడికి ఎక్కడ లేని కోపాన్ని తెప్పించింది. అతడు జయమల్లును హెచ్చరిస్తూ, “వీళ్ళకు నీటి గండం రాసిపెట్టి వున్నది! ఈ నరరూప రాక్షసులను తుదముట్టిద్దాం,” అంటూ వాళ్ళకేసి ఈదబోయాడు కాని, అంతలో అగాధం పైనుంచి భీకరమైన కేకలూ, ఆ వెంటనే రివ్వుమంటూ కొన్ని ఈటెలూ - నదిలోకి వచ్చిపడినై.


    “నరమాంసభక్షకులు, మనను చూశారు. ఇక జాగరణ లాభంలేదు. నీటివాలు వెంట ఈదుకుపోవటమే క్షేమం," అంటూ జయమల్లు పెద్ద పెద్ద బారలతో నది దిగువకు ఈదుతూ, కేశవుణ్ణి హెచ్చరించాడు.


    నది మహావేగంగా ప్రవహిస్తున్నది. కేశవుడూ, జయమల్లులు పెద్దగా ఈదకుండానే, ఆ వేగానికి కొట్టుకుపోసాగారు.


    హఠాత్తుగా వాళ్ళకు నది మధ్య లంక లాంటి ఒక ప్రదేశం కంటబడింది. నదీ ప్రవాహం అక్కడ రెండు పాయలుగా చీలి, ఆ లంకను చుట్టి ప్రవహిస్తున్నది. అప్పటికి బాగా అలసిపోయిన కేశవుడూ, జయమల్లూ పరస్పరం హెచ్చరించుకుని, ఆ లంకకేసి ఈదసాగారు. కొద్ది సేపటికల్లా వాళ్ళు తీరాన్ని చేరి, తాము బలవంతంగా నదిలోకి గుంజిన బానిస వర్తకుల కోసం నదికేసి చూశారు. వాళ్ళ జాడలేదు.


    కేశవుడూ, జయమల్లూ లంకలోకి బయలుదేరారు. వాళ్ళు నాలుగైదడుగుల దూరం వెళ్ళారో లేదో, వాళ్ళకు అక్కడ ఇసుకలో పాదాల గుర్తులు కనిపించినై.


    “ఈ లంక నిర్మానుష్యమైంది కాదు. ఇక్కడ ఎవరో వున్నారు. ఎవరై వుంటారు ?" అన్నాడు కేశవుడు.


    “వాళ్లెవరైతేనేం, మనం నిరాయుధులం," అన్నాడు జయమల్లు.


    “అంత దిగులు పడకు జయమల్లూ, మనం యిప్పటికే ఎన్నోసార్లు మృత్యు ముఖాన్నుంచి బయటపడ్డాం. ఇంకా ప్రమాదాలంటే భయపడవలసిన అవసరం ఏముంది?" అంటూ కేశవుడు లంక లోపలికి దారితీశాడు.


    వాళ్ళిద్దరూ కొంతదూరం నడిచి ఒక ఎత్తయిన దిబ్బలాంటి ప్రదేశాన్ని చేరి, అక్కడి నుంచి దిగువకు చూశారు. ఆ దిగువ, సమతలంగా వున్న ఒక ప్రదేశంలో పాతికా ముఫై చుట్టు గుడిశెల్లాంటివి వున్నవి. వాటి ముందు కత్తిచేబట్టిన ఒకడు కాపలా కాస్తున్నాడు.


    “వాడి ఆకారం చూస్తే నరభక్షకుడిలా వున్నాడు, అవునా?" అని అడిగాడు కేశవుడు. జయమల్లు అవునన్నట్లు తలవూపుతూ, “అదుగో, వాడు మనకేసే తల తిప్పాడు, మనను చూసినట్టున్నది,” అంటూ చప్పున చెట్ల చాటుకు పోయాడు. కేశవుడు కూడా జయమల్లును అనుసరించ బోయేంతలో, కాపలావాడు, "హేయ్ఁ, ఎవరక్కడ, ఆగు!" అంటూ పరిగెత్తి రాసాగాడు.


    “కేశవా, వాడు నిన్కొక్కణ్ణే చూసినట్టున్నది. దగ్గరకు రాగానే వాడితో మాటలు పెట్టుకో.” అంటూ జయమల్లు మోకాళ్ళ మీద పాకుతూ పక్కకు వెళ్ళిపోయాడు.


    కేశవుడు అనుమానించినట్టు, ఆ కాపలావాడు నిజంగా నరభక్షకుడే, వాడు లొట్టలు వేస్తూ కేశవుడి దగ్గరకు వచ్చి, “ఒంటరి వాడివా, లేక తోడుగా ఎవరైనా వున్నారా? అసలు ఈ లంకకు ఎలా రాగలిగావు?" అంటూ, కేశవుణ్ణి నఖశిఖ పర్యంతం పరీక్షగా చూసి, “ఔరా ముదురూగాని, మాంచి దోరమాంసం! నేను ఆకలి మీద వుండటం చూసి, నిన్నే లంకదేవతో యిక్కడికి పంపి వుంటుంది!” అంటూ కత్తి పైకెత్తాడు.


    ఆ సరికి నరభక్షకుడి వెనక్కు పాకుతూ వచ్చిన జయమల్లు, చిరుతగండులా ఒక్క ఎగురున నరభక్షకుడి మీదికి దూకి, తలతో వాడి వెన్నుమీద గట్టిగా ఒక్క ఠాకు ఠాకాడు. నరభక్షకుడు ఒక్క చావుకేక పెట్టి, ముందుకు విరుచుకుపడ్డాడు. వాడి చేతిలోకి కత్తి జారీ దూరంగా పడింది. కేశవుడు ఒక్క ఊపులో దాన్ని చేతికి తీసుకుని, నరభక్షకుడి కంఠాన్ని తెగవేశాడు.


    “ఇద్దరికీ కలిసి ఒక్క ఆయుధం, చాలు!" అంటూ జయమల్లు, మిట్టకు దిగువగా వున్న చుట్టు గుడిశెలకేసి చేశాడు. అక్కడ ఎవరూ వున్నట్టులేదు.


    “ఇదేదో తమాషాగా వున్నది. అడవిలో మనను ఎదుర్కున్న నరభక్షకుల నివాస స్థానం యిదే అయివుంటుంది. వాళ్ళంతా వేటకు వెళితే, వీడు కాపలా కాస్తున్నాడన్న మాట. గుడిశెల్లో ఏముందో ఒకసారి చూద్దామా? తరువాత మన దారిన మనం వెళ్ళవచ్చు." అన్నాడు జయమల్లు, కేశవుడు సరే నన్నాడు. వెంటనే ఇద్దరూ మిట్టదిగి పిల్లుల్లా నిశ్శబ్దంగా గుడిశెలచుట్టూ వున్న కంచె దాటి లోపల ప్రవేశించారు. వాళ్ళకు గుడిశెలకు మధ్యగా కొంచెం ఎత్తుగా వున్న ఒకచోట, తతిమ్మా వాటికన్నా కొంచెం పెద్దదైన ఒక గుడిశె కనిపించింది.


    “అది బహుశా, నరభక్షకుల నాయకుడి భవనం అయి వుంటుంది!” అంటూ జయమల్లు చిన్నగా నవ్వాడు. వాళ్ళిద్దరూ దాన్ని సమీపించారు. హఠాత్తుగా లోపలి నుంచి మాటలు వినిపించినై.


    “చెప్పు, నువ్వెవరో నాకు తెలిసి పోయింది ! ఆ జ్యేష్ఠుడూ, కనిష్ఠుడూ ఎవరో కూడా నాకు, తెలుసు! వాళ్ళెక్కడ ?” అని కసురుతున్నట్టు ప్రశ్నించుతున్న దొక కంఠం.


    కేశవుడూ, జయమల్లూ నిశ్చేష్టులయ్యారు. ఆ కంఠధ్వని ఎవరిది? బ్రహ్మదండి మాంత్రికుడిదా? లేక నరభక్షకుల నాయకుడైన చండమండూకుడిదా?

ఇంకా వుంది...

Post a Comment

Previous Post Next Post