రాకాసిలోయ (చందమామ)_17 RakasiLoya Janapada Novel by Dasari Subramanyam (CHANDAMAMA)

 RakasiLoya 1-35 Janapada Novel by Dasari Subramanyam (CHANDAMAMA)

రాకాసిలోయ (చందమామ)_17

 _దాసరి సుబ్రహ్మణ్యం

రాకాసిలోయ_17

    స్థూలకాయుడు వర్తకులకు కేశవుణ్ణి, జయమల్లునూ చూపుతూ, “చూశారా, కారు పోతుల్లా ఎలా వున్నారో! నదికవతల వున్న జలపాతం మీది నుంచి, ఛడేల్ మని నదిలోకి ఒక్కదూకు దూకి, ఫటేల్ ఛటేల్ మంటూ కొరమీనుల్లా, ఈ దరికి కనుమూసి తెరిచేంతలో ఈదుకొచ్చారు. వీళ్ళను, ఎక్కడా ఒళ్ళు కందకుండా, దెబ్బ తగలకుండా పట్టుకునే ప్రయత్నంలో, నా నౌకర్లు పన్నెండు మంది చచ్చారు. ఆహాఁ ఏం బలం! ఒక్క పిడికిటి పోటుతో ఒక్కొక్కణ్ణి చంపేశారు......."


    స్థూలకాయుడు యిలా మాట్లాడుతూ పోతూంటే, వర్తకుల్లో ఒకడు, “చాలయ్యా, ఆగు ! ఇంతకీ ఒక్కొక్కడికీ ఏ పది బంగారు కాసులో యివ్వమనవు గదా ?" అన్నాడు.


    “పది బంగారు కాసులా! మీరు నన్ను ముంచాలనుకుంటున్నారా? గడిచిన ఇరవైనాలుగు గంటల నుంచి వీళ్ళను నా బిడ్డల్లా సాకుతున్నాను. వీళ్ళకు యింత వరకూ పెట్టిన తిండే ముప్పై బంగారు కాసుల పైన చేస్తుంది. వాళ్ళదేం తిండి, ఏం బలం ! ఒక పలుగు చేతికిచ్చి చూడండి, కొండల్ని నిలువునా పిండిచేసి మరీ చూపెడతారు !” అన్నాడు స్థూల కాయుడు.


    వర్తకుల్లో ఒకడు చిరునవ్వు నవ్వుతూ కేశవుణ్ణి సమీపించి, తన చేతికర్రతో అతడి భుజం మీద ఒక్కపోటు పొడిచాడు. కేశవుడికి బాధా, ఎక్కడలేని కోపమూ కలిగింది. కాని, అతడు నిబ్బరంగా వూరుకున్నాడు. వర్తకుడు పెద్దగా నవ్వుతూ, స్థూలకాయుడి కేసి తిరిగి, “వీళ్ళను గురించి నువ్వు చెప్పిందాంట్లో కొంత నిజం వున్నట్టుంది. ఆ దెబ్బకు మరొకడైతే కీచుమనవలసిందే !" అన్నాడు.


    ఈ మాటలకు స్థూలకాయుడు పరమానందం చెందిపోయి, “ఆహాఁ, నే చెప్పలా? ఒక్కొక్కడూ ఒక్కో ఏనుగు గున్ననుకోండి!" అన్నాడు.


    “అంత కర్ర పోటూకూ కుయ్ఁ కయ్ఁ  మనలేదు. ఒకవేళ వాడు మూగ వెధవ కాదు గదా?” అంటూ రెండో వర్తకుడు, కేశవుడికి దగ్గిరిగా వెళ్ళి, “ఏరా, నీకు మాట్లాడటం చాతవా? నీ పేరేమిటి?” అని అడిగాడు.


    కేశవుడు పొంగి వస్తున్న కోపాన్ని అణుచుకుంటూ, “కనిష్ఠుడు! మనుషుల్ని పశువుల్లా క్రయ విక్రయాలు చేసే మీకు పేర్లతో పనేమిటి?" అన్నాడు.


    “ఆహాఁ చూశారా, ఎంత తెలివైన జవాబిచ్చాడో ? శాస్త్రపురాణాల్లోకి ఎక్కాలిసిన మాట !" అన్నాడు స్థూలకాయుడు పొంగిపోతూ.


    “అఘోరించాడు! ఎన్ని నీతివాక్యాలూ, ధర్మ పన్నాలూ అయితే ఒక బంగారు కాసు చేసేట్టు! సరే, ధర తేల్చు. ఇద్దరికీ కలిపి ముఫ్పై కాసులిచ్చుకుంటాం, సరా?" అన్నాడు వర్తకుడు.


    “ఇద్దరికీ కలిపి ముఫ్పై కాసులు! నన్ను నాశనం చేస్తే మీకేం ఒరుగుతుంది ? నేను మునిగిపోతే మీక్కలిగే లాభం ఏమిటి ? దేవుడు సాక్షిగా చెపుతున్నాను. వీళ్ళిద్దర్నీ పట్టుకునే ప్రయత్నంలో నా నౌకర్లు పన్నెంటు మంది చచ్చారు," అంటూ స్థూలకాయుడు నెత్తినోరూ కొట్టుకోసాగాడు.


    వర్తకులిద్దరూ కొంచెం దూరంగా వెళ్ళి, కొద్దిసేపు సంప్రదించుకుని తిరిగి బానిస వ్యాపారి దగ్గరకు వస్తూ, “ఆఖరి మాటగా నలభై కాసులిస్తాం. ఇష్టమైతే అమ్ము లేకపోతే లేదు. మా కవతల చాలా పనులున్నై. ఇంకా ఇరవై మంది బానిసలను కొని, ఆ కొండవాగు పక్కన వుంచి వచ్చాం. త్వరగా ప్రయాణమై పోవాలి” అన్నారు.


    “ఇలా వ్యాపారం జరిగితే యిక నేను మట్టి కొట్టుకు పోవలసిందే. దీనికన్నా గుడారా లెత్తివేసి, ఏ గుహలోనో ముక్కు మూసుకు కూచుని తపస్సు చేసుకోవటం లాభసాటిగా వుంటుంది." అంటూ స్థూలకాయుడు అటూ యిటూ గెంతసాగాడు.


    బానిసల బేరం యీ విధంగా గంటసేపు సాగి, ఆఖరుకు అరవై బంగారు కాసులకు తేల్చి వేయబడింది. స్థూలకాయుడు వర్తకుల దగ్గిర్నుంచి అరవై కాసులూ తీసుకుని, వాటిని రొండికి బిగించి వున్న పట్టా సంచిలో దాస్తూ, “మళ్ళీ ఎప్పుడు, మీ దర్శనం ? ఒక్క నెల రోజులాగి వచ్చారంటే, మేలిమి బంగారంలాంటి సరుకు ఒప్ప చెపుతాను," అన్నాడు.


    “రాకేం, వస్తాం. మన లావాదేవీలు దీన్తోనే అయిపోయిన వనుకుంటున్నావా ? కాని, నీ నుంచి ఒక్క సహాయం కావాలి.” అన్నారు వర్తకులు.


    “ఏమిటా సహాయం ?" అంటూ స్థూల కాయుడు, అనుమానంగా చూశాడు.


    “మరేం లేదు. ఈ మధ్య కొంతకాలంగా మన కపిల రాజ్యమంతా ఆరాజకంగా వున్నదని నీకు తెలియంది కాదు. కత్తి చేతబట్టగల వాడల్లా, దారి దోపిడి గాడుగా తయారయాడు. మా దగ్గిర చూడబోతే, చాలా విలువైన సరుకుండి - ముప్పై యిద్దరు బానిసలు. రెండు మజిలీల ప్రయాణంలోగాని మేం కపిలపురం చేరలేం. ఈ రాత్రి అడవిలో మజిలీకి నువ్వు కాస్త తోడు రావాలి," అన్నారు వర్తకులు.


    స్థూలకాయుడు మండ్రగబ్బ కాటు తిన్నవాడిలా ఎగిరి పడి, “ఒక్క గంట కాలం నా గుడారాలను నౌకర్లకు ఒప్పచెప్పి ఎక్కడికైనా వెళ్ళానో, నా వ్యాపారం గుఱ్ఱమే. అందరూ దొంగ వెధవలు. నేను చాలా నష్టపడి పోతాను," అన్నాడు.


    వర్తకులు చిరునవ్వు నవ్వుకుని, “ఈ రాత్రి మా వెంట వున్నందుకు, నాలుగు బంగారు కాసు లిచ్చుకుంటాం. సరా ?” అన్నారు.


    “నాలుగు బంగారు కాసులో నా నష్టం పూడుతుందా? పది.....ఎనిమిది..... సరే, ఐదు యివ్వండి. యిక బయలుదేరుదాం," అంటూ స్థూలకాయుడు కొరడా ఝళిపిస్తూ కేశవుడు, జయమల్లుల కేసి వెళ్ళాడు.


    కేశవుడూ, జయమల్లులను వెంట బెట్టుకుని, వర్తకు లిద్దరూ, స్థూలకాయుడూ అరణ్య మార్గాన నడిచి, ఓ గంట తరువాత ఒక కొండవాగు దరికి చేరారు. అక్కడ ముఫ్పై మంది బానిసలు, నౌకర్ల కాపలాలో గంధపు చెక్క నరుకుతున్నారు. వాళ్ళను చూస్తూనే స్థూలకాయుడు పెద్దగా నవ్వి, “బానిసలను కొనటానికైన ఖర్చు, వాళ్ళు మోసుకొచ్చే మంచి గంధం చెక్క అమ్మితే వస్తుంది. ఇక, వాళ్ళ నమ్మగా వచ్చిన డబ్బంగా లాభమే. ఆహాఁ ఎంత తెలివైన వాళ్ళయ్యా, మీరు !" అన్నాడు.


    వర్తకులు ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ, తమ నౌకర్లకు ప్రయాణం కావలసిందని హెచ్చరికలు చేశారు. చూస్తూండగానే నౌకర్లు, బానిసల చేత నరికిన గంధం చెక్క అంతా కట్టలు కట్టించి, వాళ్ళను ఒక సొలుపుగా నడుపుతూ, దానికి అటూ యిటూ కొరడాలు ఝళిపిస్తూ బయలుదేరారు. అందరికన్నా ముందు స్థూలకాయుడు నడవసాగాడు.


    మహా వృక్షాలతో, చిన్నా పెద్ద జలపాతాలతో, ఊబి నేలలతో మహాభయంకరంగా వున్న అరణ్యంలో పడి అందరూ సూర్యాస్తమయం వరకూ నడిచారు. వారికి దారి పొడుగునా సింహ గర్జనలూ, ఏనుగుల ఘీంకారాలు వినిపించ సాగినై, అలాంటి సమయాల్లో స్థూలకాయుడు అదిరిపడుతూ, “ఐదు కాసుల కోసం, నేనేం ప్రాణగండం తెచ్చుకోలేదు గదా,” అనుకోసాగాడు.


    సూర్యాస్తమయమైన కొద్ది సేపటికల్లా అరణ్యాన్ని గాఢాంధకారం అలముకొన్నది. బానిసలందర్నీ సమతలంగా వున్న ఒక చోట మందవేసి, అడవి మృగాలు మీద పడకుండా వుండేందుకు రక్షణగా, వాళ్ళచేత చుట్టూ ముళ్ళ పొదలు ఎత్తుగా వేయించారు. ఆ రక్షణల మధ్య రెండు మూడు చోట్ల పెద్ద నెగళ్ళు వెలిగించారు. ఆ తరువాత అందరికీ ఎండు రొట్టెలూ, కాల్చిన మాంసమూ ఆహారంగా పెట్టారు.


    రాత్రి గడుస్తున్న కొందికీ ముళ్ళ పొదల కావలి నుంచి సింహాలు చేసే గర్జన అధికం కాసాగింది. కేశవుడూ, జయమల్లూ పక్క పక్కల పడుకుని తమ భవిష్యత్తును గురించి మధన పడసాగారు. కేశవుడికి తన తండ్రి ఏమయిపోయాడన్న దిగులు అధికం కాసాగింది.


    “మల్లూ, మా అయ్య క్షేమంగా వుండి వుంటాడంటావా ?" అని అడిగాడు కేశవుడు.


    “అతడి కొచ్చిన ప్రమాదం ఏమీ లేదు. ఈ అరణ్యంలోనే ఎక్కడో కోయ యువకు లిద్దరితో దాక్కుని వుంటాడని నా నమ్మకం," అన్నాడు జయమల్లు.


    కేశవుడికి జయమల్లు మాటల్లో విశ్వాసం కలగలేదు. అతడు మరేదో ప్రశ్నించ బోయేంతలో హఠాత్తుగా సింహ గర్జనలు ఆగిపోయినై. కేశవుడు ఉలిక్కిపడి లేచి కూచుంటూ, “మల్లూ, అంతా నిశ్శబ్దం అయింది, ఏదో ప్రమాదం..." అనేంతలో, భీకరంగా గర్జిస్తూ ఒక సింహం ముళ్ళ పొదల మీది నుంచి కుప్పించి లోపలికి దూకింది. నిద్రపోతున్న బానిసలంతా ఒక్కసారి లేచి, హాహాకారాలు చేశారు. స్థూలకాయుడూ, వర్తకులిద్దరూ కీచుమనే గొంతులతో, “బాణాలు..... కత్తులు ..... ఈటెలు ..... చంపండి, సింహాన్ని చంపండి !" అని తమ నౌకర్లను హెచ్చరిస్తూ ఒక పక్కకు పారిపోయారు.


    నౌకర్లు సింహం మీదికి రివ్వురివ్వు మంటూ బాణాలు వదిలారు. కాని, ఒక్కటీ దాన్ని తాకలేదు. ఈ లోపల సింహం గొలుసులతో బంధించబడి వున్న బానిసల గుంపు మీదపడి, యిద్దరు ముగ్గుర్ని తన పంజా దెబ్బలతో గాయపరిచింది.


    కేశవుడూ, జయమల్లూ ఒకే జట్టుగా నెగళ్ళ దగ్గిరకు పరిగెత్తి, మండుతున్న రెండు కట్టె పుల్లలను తీసుకుని, “బాణాలు వేసి సింహాన్ని మరింతగా రెచ్చకొట్టకండి. దాన్ని మేం బయటికి తరిమేస్తాం !" అంటూ సింహంకేసి పరిగెత్తారు.


    మండుతూన్న కట్టెపుల్లలను చూస్తూనే, సింహం ఓ తృటికాలం తటపటాయించి, అంతలోనే పెద్దగా కోరలు చాచి, ముందున్న కేశవుడి మీదికి లంఘించింది. కేశవుడు దాని పంజా దెబ్బను తప్పుకుంటూ, తన చేతిలో వున్న మండే కట్టెను దాని మీదికి విసిరాడు. మంట తన శరీరాన్ని తాకగానే సింహం ఒక్కసారి పెద్దగా గర్జించి వెనక్కు తిరిగింది. అదే సమయంలో జయమల్లు తన చేతిలో వున్న కట్టెను దాని వెన్నుకు తగిలేలా కొట్టాడు.


    సింహం మెరుపులా ముళ్ళ పొదల మీంచి లంఘించి అరణ్యంలోకి పారిపోయింది. స్థూలకాయుడూ, వర్తకులిద్దరూ కేశవుడూ, జయమల్లుల దగ్గరకు వచ్చారు. స్థూల కాయుడు నిలువెల్లా వణికి పోతున్నాడు, వర్తకుల మాట చెప్పనవసరమే లేదు.


    “మీ యిద్దరూ, మమ్మల్ని ఎంతో ధన నష్టాన్నుంచి కాపాడారు. ఇద్దరు బానిసలు చచ్చారు. ఒకడు గాయపడ్డాడు. అదేమంత పెద్ద నష్టంకాదు. మీరు చూసిన ధైర్యానికీ, చేసిన సహాయానికీ, ఈ నాటి నుంచి మీకు తిన్నంత ఆహారం పెట్టదలిచాం." అన్నాడొక వర్తకుడు.


    “ఓ అలాగే చేద్దాం. కపిల నగరంలో వీళ్ళిద్దరినీ అమ్మేటప్పుడు, ఈ జరిగిన సంగతి గుర్తుంచుకుని, కొంచెం మంచి ధర రాబట్టాలి. ఒకవేళ నేను మరిచిపోతే, నువ్వు కాస్త గుర్తు చెయ్యి." అన్నాడు రెండో వర్తకుడు, తన తోటివాడితో.


    “అందరూ కలిసి నన్ను ముంచారు! వీళ్ళింత అసహాయ శూరులని తెలిస్తే, అరవై కాసులకు అమ్మేవాడినా? నేను గుఱ్ఱమయి పోయాను..... దివాళా ఎత్తిపోయాను....." అంటూ స్థూలకాయుడు కుప్పిగంతులు వేయసాగాడు.

ఇంకా వుంది...

Post a Comment

Previous Post Next Post