రాకాసిలోయ (చందమామ)_16 RakasiLoya Janapada Novel by Dasari Subramanyam (CHANDAMAMA)

  RakasiLoya 1-35 Janapada Novel by Dasari Subramanyam (CHANDAMAMA)

రాకాసిలోయ (చందమామ)_16

 _దాసరి సుబ్రహ్మణ్యం

రాకాసిలోయ_16

    నది ఒడ్డున నిలబడి తమ కేసే చేస్తున్న ఆటవికుల్ని చూస్తూనే, కోయ యువకులు కీచుమన్నారు. ఆ ఆటవికులు తమ జాతి వాళ్ళు కాదు. వాళ్ళకూ తమకూ జాతి వైరం వున్నది. తాము వాళ్ళ కంటబడటం అంటే పోరు తప్పదు. జలపాతంలో నుంచి నదిలోకి పడినప్పుడు, తమ ఆయుధాలన్నీ - ఒక కత్తి తప్ప - నీటిపాలైనవి.


    “జ్యేష్ఠా, కనిష్ఠా! మీ ఆయుధాలన్నీ సురక్షితంగా వున్నవా ? ఈ ఆటవికులు శత్రువులో, మిత్రులో తెలియటం లేదు. వాళ్ళు మొత్తం ఐదుగురికన్న ఎక్కువ లేరు. పోరు తప్పకపోతే, మన ఆయుధాలే మనకు రక్షణ !" అన్నాడు కేశవుడి ముసలి తండ్రి.


    కేశవుడూ, జయమల్లూ కూడా తమ నడుముకు వేలాడుతున్న కత్తులు తప్ప, సర్వం పోగొట్టుకున్నారు. ఒడ్డున నిలబడి తమకేసి చూస్తున్న ఆటవికుల దగ్గిర బాణాలున్నట్టు లేవు. అలాంటి పరిస్థితిలో తమను వాళ్ళు దూరాన్నుంచి ఏమీ చెయ్యలేరు.


    జయమల్లూ, కేశవుడూ యిలా ఆలోచిస్తూ కాళ్ళకు నేల తగలగానే, ఈతమాని, ఒడ్డుకేసి నడవసాగారు. అంతలో ఆటవికుల్లో ఒకడు వెనుదిరిగి పెద్దగా కేకవేశాడు. ఆ వెంటనే ఒక పెద్దరాతి చాటునుంచి పులిచర్మం తలకు కట్టుకునివున్న, ఒక స్థూలకాయుడు అక్కడికి వచ్చాడు. అతడి దృష్టి నీటిలో నుంచి ఒడ్డుకు వస్తున్న కేశవుడూ వాళ్ళ మీద పడింది. వెంటనే అతడు అదిరిపడుతూ, “అయిదుగురు జమాజట్టీల్లాంటి వెధవలు! వీళ్ళందర్నీ పట్టుకోవటం మనవల్ల ఎలా అవుతుంది? వాళ్ళను కూడా కేకవేయండి!" అన్నాడు.


    “జ్యేష్ఠా, కనిష్ఠా! ఈ దుర్మార్గుల పని మీరు చూడండి. ఈ లోపల వీళ్ళకు సహాయం వచ్చే ఆ నీచుల్ని మేం పరలోక యాత్రకు పంపుతాం,” అంటూ ముసలివాడు ఒడ్డు మీదికి ఎగిరి చెట్లకేసి పరిగెత్తాడు. అతడికి వెనకగా కోయ యువకులు కూడా పరిగెత్తారు. కేశవుడూ, జయమల్లూ ఒడ్డుకు చేరి కత్తులు దూసే లోపలే ఆటవికులు అయిదుగురూ వాళ్ళ మీదికి ఉరికారు. స్థూల కాయుడు అటూ యిటూ గెంతుతూ, రొప్పుతూ, “మంచి గిత్తల్లాంటి కుర్రాళ్ళు, కాళ్ళూ చెయ్యీ విరిచారో, మీ ప్రాణాలు తీస్తాను. ఒక్క గాయం కాకుడదు. ఒక్క దెబ్బ తగలకూడదు. జాగ్రత్తగా పట్టుకోండి," అని అరవసాగాడు.


    ఆటవికులు అయిదుగురూ సుడిగాలిలా వచ్చి మీదపడటంతో, కేశవుడికీ, జయ మల్లుక్కూడా ఆత్మ రక్షణకు తమ కత్తులు ఉపయోగించే అవకాశం లేకుండాపోయింది. వాళ్ళు ఆటవికుల్ని ఎదుర్కొని పిడికిళ్ళతో పొడుస్తూ, కాళ్ళతో వాళ్ళ డొక్కల్లో బలంగా తన్న సాగారు. ఆటవికులు మాత్రం వాళ్ళను తిరిగి బలంగా కొట్టకుండా, కాళ్ళు పట్టుకుని కింద పడవేసేందుకు ప్రయత్నించారు. కొద్ది నిమిషాల్లో వాళ్ళ ప్రయత్నం ఫలించింది. కేశవుణ్ణి, జయమల్లునూ ఇద్దరేసి కాళ్లు పట్టుకుని కిందకు పడదోసి, తాళ్ళతో వాళ్ళ చేతుల్ని బిగించి కట్టారు.


    ముసలివాడూ, కోయ యువకులూ పరిగెత్తిన చెట్ల ప్రాంతాన్నుంచి పెద్దగా అరుపులూ, పెడబొబ్బలూ వినిపించసాగినై, “అవసరం అయితే చంపండి. కాని, ప్రాణాలతో పారి పోనీకండి!" అంటూ ఒక కంఠం భీకరంగా గర్జిస్తున్నది. తన తండ్రి, కోయ యువకులూ ప్రమాదంలో చిక్కుకున్నారని కేశవుడు గ్రహించాడు. కాని, తను యిప్పుడు నిస్సహాయుడు....


    ఆటవికుల నాయకుడైన స్థూలకాయుడు చేతులు కట్టబడివున్న కేశవుణ్ణి, జయ మల్లునూ పరీక్షగా చూస్తూ, “దుక్కల్లాంటి కుర్రాళ్ళు! నా నౌకర్లు అయిదుగురినీ పట్టి చేతులతోనే చావ చితకకొట్టారు!" అంటూ నవ్వసాగాడు.


    “మా కత్తులు మా కిచ్చి, నీ నౌకర్లూ నువ్వూ కూడా రండి, పోరాడదాం!" అంటూ కేశవుడు పులిలాగా గర్జించాడు.


    స్థూలకాయుడు ఆ మాటలకు నవ్వుతూ, “కత్తులూ, బాణాలూ ఉపయోగిస్తే ఎవరో ఒకళ్ళు చావక తప్పదు. చాలా ధన నష్టం !" అన్నాడు.


    కేశవుడూ, జయమల్లూ ముఖముఖాలు చూసుకున్నారు. వాళ్ళకా క్షణంలోనే తాము ఎలాంటి దుర్మార్గుల చేత బందీ చేయబడ్డారో అర్థమైంది. వీళ్ళు మనుషుల్ని పట్టుకుని బానిసలుగా అమ్మే నరరూప రాక్షసులు ! అందుకే తమను ఏ మాత్రం గాయపరచకుండా జాగ్రత్తగా పట్టుకున్నారు.


    “మా అయ్య ఏమయినట్టు? అక్కడ అంతా నిశ్శబ్దంగా వున్నదే!” అన్నాడు కేశవుడు ఆదుర్దాగా. జయమల్లు నిస్పృహగా తలాడిస్తూ, “మీ అయ్యా, ఆ కోయ యువకులూ కూడా మనలాగే యీ దుర్మార్గులికి దొరికిపోయి వుంటారు," అన్నాడు.


    చెట్ల ప్రాంతం నుంచి హఠాత్తుగా పెద్ద చావుకేక వినిపించింది. అందరూ అటుకేసి తలలు తిప్పారు. చూస్తుండగానే నలుగురు ఆటవికులు తమ అనుచరులు లిద్దరిని తలా, కాళ్ళూ పట్టుకుని మోసుకుంటే అక్కడికి వచ్చారు. స్థూలకాయుడు వాళ్ళను చూస్తూనే పళ్ళుకొరికి, “రెండు చావులా? వీళ్ళ తోటి వాళ్ళు, ఆ ముగ్గురూ ఏమయ్యారు?" అని ప్రశ్నించాడు.


    “అయ్యా, వాళ్ళని గాయపరచకుండా పట్టుకుందామని ప్రయత్నిస్తే, ఆ దుర్మార్గులు తమ దగ్గర వున్న కత్తుల్తో, ఈ ఇద్దర్నీ నరికారు. మరిద్దర్ని గాయపరిచారు. వాళ్ళు నది ఒడ్డునే పడి పారిపోతూంటే, మన వాళ్ళు తరుముతూ పరిగెత్తారు" అని చెప్పాడు ఆటవికుల్లో ఒకడు.


    స్థూల కాయుడు పట్టరాని కోపంతో గున్న ఏనుగులా నిలువెల్లా వణుకుతూ, “మనవాళ్ళు నలుగురు చస్తే, ఇద్దర్ని పట్టుకున్నామన్న మాట! అంటే రెండు జీవాలు నష్టం! ఇలా అయితే వ్యాపారం సాగినట్టే, ఛీ, శుంఠల్లారా!" అంటూ గంతులేశాడు.


    అతడి అనుచరులు కాసేపు తలలు వంచుకు వూరుకుని, తరువాత మెల్లిగా, “అయ్యా, ఆ గాయపడ్డ యిద్దర్ని కూడా మోసుకుపోవాలి కదా, వీళ్ళను కాస్త తోడు రమ్మనండి," అంటూ కేశవుణ్ణి, జయమల్లునూ పట్టుకున్న వాళ్ళకేసి చూశారు.


    ఈ మాటల్తో స్థూలకాయుడు గూటంలా ఎగిరిపడి, నిప్పులు చెరిగే కళ్ళతో, తన నౌకర్లకేసి చూస్తూ, “మీరు చేసిన వెధవ పనికి, మరికొందరు తోడుకూడా కావాలా ? ఆ గాయపడ్డ పిరికి కుంకలు, గుడారాల దగ్గరికి నడిచిరాలేరా ?" అని కేకలు పెట్టాడు.


    “వాళ్ళు బాగా గాయపడ్డారు. ఒకడికి గొంతులో కత్తి దెబ్బ తగిలింది. రెండో వాడికి డొక్కల్లో కత్తిపోటు పడింది. ఇప్పుడో యింకాసేపటికో అంటున్నారు ...”


    నౌకరు మాట పూర్తిచేయక ముందే స్థూలకాయుడు కీచుగొంతుతో పెద్దగా అరిచి, “చచ్చినవాళ్ళనూ, చావు బతుకుల్లో వున్నవాళ్ళనూ పోషించటానికి నేను వ్యాపారం చేస్తున్నది? ఈ శవాలనూ, ఆ గాయపడ్డ వాళ్లిద్దర్నీ నదిలోకి విసిరేసి, వేగిరం రండి. ఈ నెత్తురు వాసనకు యిక్కడికి సింహాల మంద వచ్చినా రావొచ్చు." అన్నాడు.


    “ఛీ, నువ్వు మనిషివి కాదు, రాక్షసుడివి ! ప్రాణాలతో వున్నవాళ్ళను, నీటిలోకి తోయించుతావా ?” అంటూ కేశవుడు బిగ్గరగా కేకపెట్టి, తన చేతి కట్లను తెంచుకునేందుకు ప్రయత్నించాడు.


    కేశవుడి ఛీత్కారం వింటూనే స్థూలకాయుడు చిరునవ్వు నవ్వి, “కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూండేవాడు, నేలమీద చస్తేనేం, నీటిలో చస్తేనేం ? పైగా నెత్తురు చూశానో, నా హృదయం తల్లడిల్లిపోతుంది. నాది చాలా మెత్తని మనసు. మీకు ఒక్క దెబ్బ తగలకుండా, చిన్నగాయం కాకుండా ఎంత జాగ్రత్తగా పట్టుకున్నానో చూశారు గదా?” అన్నాడు.


    ఆ నరరూప రాక్షసుడి మాటలకు ఏమని జవాబు చెప్పాలో కేశవుడికీ, జయమల్లుకూ అంతుపట్ట లేదు. తమకు ఏనాడైనా అవకాశం దొరికితే, వాణ్ణి నిలువునా చంపాలని వాళ్ళు నిశ్చయించుకున్నారు. స్థూలకాయుడు తన నౌకర్లను హెచ్చరించి బయలుదేరాడు. ఒక గంటకాలం అడవిలో నడిచిన తరువాత అందరూ, పెద్ద పెద్ద గుడారాలున్న ఒక చోటుకు చేరారు.


    “వీళ్ళిద్దర్నీ దుంగకు బిగించండి. ఆ తరువాత మీలో యిద్దరు బయలుదేరి వెళ్లి, ఆ పారిపోయిన ముగ్గురూ ఏమయ్యారో, వాళ్ళ వెంటబడ్డ వాళ్ళేమయ్యారో తెలుసుకురండి," అన్నాడు స్థూలకాయుడు. కేశవుణ్ణి, జయమల్లునూ నౌకర్లు ఒక పొడవాటి దుంగకువున్న కంతల్లో కాళ్ళు పెట్టించి, దానికి అటూ యిటూ వున్న రంధ్రాల్లో కొయ్య మేకులు దిగకొట్టారు. వాళ్ళిద్దరి కంఠాలకూ ఇనప పట్టెడలు బిగించి, వాటిని కలుపుతూ ఒక గొలుసు కట్టారు. వాళ్ళిద్దరి పక్కనా మరికొందరు యిలాంటివాళ్ళే వున్నారు.


    “మనం ఎంత చిక్కుల్లో పడ్డాం! మన బతుకు పశువుల కంటే హీనం అయిపోయిందే, కేశవా!" అన్నాడు జయమల్లు. ఎక్కడలేని దిగులుతో.


    “అధైర్యపడకు మల్లూ! మనం పారిపోయేందుకు అవకాశం చిక్కకపోదు. నా ఆదుర్దా అల్లా, మా అయ్య ఏమయ్యాడనేదే !” అన్నాడు కేశవుడు.


    ఆ పగలంతా గడిచి చీకటిపడే లోపల స్థూలకాయుడు, కేశవుడూ, జయమల్లూ వున్నచోటుకు నాలుగైదుసార్లు వచ్చాడు. వాళ్ళ యోగ క్షేమాలను గురించి కన్న తండ్రి కన్నా ఎక్కువగా వివరించాడు. తన నౌకర్ల చేత మంచి ఆహారం పెట్టించాడు.


    “వీళ్ళిద్దర్నీ మన కన్న బిడ్డల్లాగా చూసుకోవాలి. వీళ్ళు ఆరుగురు మనుషుల పెట్టు. ఆ చచ్చిన నలుగురి ధరా, వీళ్ళధరా....... ఎంతలేదన్నా నూరు బంగారు కాసులు ముట్టితే తప్ప నాక్కలిగిన నష్టం పూడదు. ఇంతకీ, ఆ పారిపోయిన ముగ్గురు దుర్మార్గులూ, వాళ్ళ వెంటబడిన చవటలూ, వాళ్ళందర్నీ వెతకపోయిన ఇద్దరు శుంఠలూ ఏమయినట్టు?" అంటూ స్థూలకాయుడు తన నౌకర్ల మీద విరుచుకుపడ్డాడు.


    చీకటి పడిన కొద్ది సేపటికి ఏడుపులూ, మూలుగులతో స్థూలకాయుడి నౌకర్లు పది మంది గుడారాల దగ్గరకు వచ్చారు. వాళ్ళు చావు బతుకుల మీదవున్న తమ అనుచరులిద్దర్నీ మోసుకు వచ్చారు.


    వాళ్ళు రావటం చూస్తూనే స్థూలకాయుడు పెద్ద కొరడా ఒకటి తీసుకుని, రొప్పుతూ, కేకలు పెడుతూ వాళ్ళను సమీపించి, “ఆ ముగ్గురెక్కడ ? ఈ యిద్దరూ ఎందుగ్గాయపడ్డారు? వెళ్ళిన వాళ్ళంతా తిరిగి వచ్చినట్టులేదే !" అంటూ కొరడాతో వాళ్ళను బాదాడు.


    ఆ దెబ్బలకు నౌకర్లు లబోదిబోమని, “అయ్యా, ఆ ముగ్గురూ మాలో మరొకణ్ణి చంపి, అరణ్యంలోకి పారిపోయారు. ముఖ్యంగా ముసలివాడు మనిషికాదు; మనిషిరూపం ఎత్తిన రాక్షసుడు, వాడి కత్తిసామూ..... వాడి ధాటీ.....” అంటూ పెద్దగా బావురుమన్నారు.


    “మీ చచ్చు వెధవలంతా చేరి నన్ను ముంచారు ! రెండు జమా, ఆరు ఖర్చూ, ఇలా అయితే ఇక వ్యాపారం సాగినట్టే, ఇప్పుడా యిద్దరికీ నూటపాతిక బంగారు కాసులొస్తే తప్ప, అసలు గిట్టుబాటు కాదు." అంటూ స్థూలకాయుడు కొరడా గిలిలో తిప్పుతూ కుప్పి గంతులు వేయసాగాడు.


    ఆ రాత్రి కేశవుడికి, జయమల్లుకూ నిద్ర పట్టలేదు. కొయ్యదుంగలో బిగించి వున్న కాళ్ళు రెండు చచ్చు పడిపోయినట్టుగా వున్నవి. చుట్టూవున్న అడవిలో పులుల కాండ్రింపూ, సింహగర్జనలూ వాళ్ళకు హడలు పుట్టించినై. తాము బానిస వ్యాపారి చేతిలో చిక్కిపోయాననే దిగులులో కూడా, కేశవుడికి తన తండ్రి అరణ్యంలో ఎక్కడో సురక్షితంగా వున్నాడనే సంగతి ఆనందం కలిగించింది.


    తెల్లవారుతూనే స్థూలకాయుడు ఇద్దరు వ్యక్తుల్ని వెంట పెట్టుకుని కేశవుడూ, జయమల్లూ వున్నచోటుకు వచ్చాడు. అతడి వెంటవున్న వ్యక్తులిద్దరూ మంచి పట్టు వస్త్రాలు ధరించి, చెవులకు పెద్ద పెద్ద పోగులతో, జరీకండువాలతో, గొప్ప వర్తకుల్లా వున్నారు. 

ఇంకా వుంది...

Post a Comment

Previous Post Next Post