రాకాసిలోయ (చందమామ)_14 RakasiLoya Janapada Novel by Dasari Subramanyam (CHANDAMAMA)

RakasiLoya 1-35 Janapada Novel by Dasari Subramanyam (CHANDAMAMA)

రాకాసిలోయ (చందమామ)_14

 _దాసరి సుబ్రహ్మణ్యం

రాకాసిలోయ_14

    కేశవుడూ, జయమల్లూ, ముసలివాడూ, కోయనాయకుడి వెంట దారీ డొంకాలేని మహారణ్యంలో పడి ఒక గంటకాలం నడిచారు. అంతా అంథకారం, కన్ను పొడుచుకున్నా కానరాని చీకటి. తామెవరో నిజం తెలిస్తే, ఈ కోయవాడు తమను రాజభటులకు అప్పగిస్తాడేమోనన్న అనుమానం ముసలివాణ్ణి, తతిమ్మా యిద్దర్నీ బాధించసాగింది. ప్రస్తుతానికి బ్రహ్మదండి నుంచి ప్రమాదం తప్పింది కనుక, తాము గుర్రాలెక్కి పారిపోవటం క్షేమమేమో అన్న ఆలోచన ముసలివాడికి కలిగింది.


    ఈ ఆలోచన రహస్యంగా కేశవుడికి, జయమల్లుకూ చెప్పాడు ముసలివాడు. కాని, వాళ్ళు దానికి ఒప్పుకోలేదు. చీకట్లో తామెటు పోతున్నదీ తెలుసుకోకుండా, పారిపోవటం ప్రారంభిస్తే, తాము తిరిగి బ్రహ్మపుర నగర పరిసరాలకే వెళ్ళే అవకాశం వున్నదనీ, అప్పుడు తమకు తప్పక ప్రమాదం కలుగుతుందనీ వాళ్ళు అన్నారు.


    “అర్థ రాజ్యానికి ఆశపడి, ఈ కోయవాడు మోసానికి పూనుకుంటే, ఏం చేసేట్టు?" అన్నాడు ముసలివాడు.


    కేశవుడు తన ఒరలో వున్న కత్తికేసి వేలు చూపాడు. జయమల్లు అంబుల పొదిలోంచి ఒక బాణం లాగి, తిరిగి దాన్ని యథా స్థానంలో పెట్టాడు. తన కొడుకూ, అతడి మిత్రుడూ కనబరిచిన ధైర్యానికి, ముసలివాడు ఎంతో సంతోషించాడు. ఈ పండు వయసులో తను ఏ క్షణాన ఏ చెట్టు కిందో రాలిపోయినా, తన కొడుకు ఈ లోకంలో అన్ని కష్టాలనూ సాహసంతో ఎదుర్కొన గలడన్న నమ్మకం అతడికి కలిగింది.


    అందరికన్నా ముందు నడుస్తున్న కోయల కుల పెద్ద, ఒక మహావృక్షం కింద ఆగి, తన చేతనున్న ఈటెతో, దాని బోదె మీద మూడుసార్లు గట్టిగా కొట్టాడు. ఆ వెంటనే, చెట్ల చాటునుంచి, “ఆగండి ! ఎవరు?" అన్న ప్రశ్న భీకరంగా వినిపించింది.


    కోయ నాయకుడు ఈటెను పైకెత్తి, “గడేజంగ్, గడేజంగ్ !" అంటూ రెండుసార్లు బిగ్గరగా అరిచాడు. మరుక్షణంలో ఇద్దరు కోయ యువకులు అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి, “జంగ్ దొరా, ఏం సెలవు ?" అంటూ తలలు వంచి నిలబడ్డారు.


    “వీళ్ళు ముగ్గురూ బాటసారులు, బందిపోట్ల నుంచి పారిపోయివచ్చి, మన రక్షణ కోరినవాళ్ళు. వీళ్ళను తెల్లవారే వరకూ కాపాడవలసిన బాధ్యత మనది. పోతే, మన వాళ్ళలో పది పన్నెండు మందిని, గూబమాను పక్కనవున్న పల్లెకు పంపి, అక్కడ మన వాళ్ళకూ, ఆ పల్లెలోని దుర్మార్గులకూ జరుగుతున్న పోరు ఏమయిందో తెలుసుకు రావాలి." అన్నాడు గడేజంగ్.


    తమ నాయకుడి ఆజ్ఞకాగానే యువకుల్లో ఒకడు చెట్ల వెనక్కు పరిగెత్తాడు. రెండవ వాడు కేశవుణ్ణి, జయమల్లునూ, ముసలివాణ్ణి వెంట బెట్టుకుని, దాపులనే వున్న కొండ గుహలకేసి బయలుదేరాడు. కేశవుడూ, అతడి అనుచరులూ, చెట్టు చేమలతో దట్టంగా కప్పబడిన ఒక కొండ గుహలో చేరి, కోయ యువకుడిచ్చిన, పళ్ళూ, ఫలాలూ, కాల్చిన లేడి మాంసమూ తృప్తిగా తింటూండగా, అక్కడ గూబమాను పల్లె చేరిన బ్రహ్మదండి మాంత్రికుడు, ఆకలితో, అవమానంతో కడుపు భగ్గుమంటూండగా, పల్లెవాసుల్ని నోటికి వచ్చినట్టల్లా దుర్భాషలాడుతున్నాడు.


    "రాజద్రోహులకు పల్లెలో ఆశ్రయం యివ్వటమేగాక, రాజదూతలను చంపేందుకు వాళ్ళను అరణ్య దారి మార్గంలో కాపలా పెడతారా? ఈ మహాపరాధానికి పల్లెలోని పిన్నా, పెద్దా; ఆడా, మగా అందర్నీ- క్షణాలమీద భస్మం చేయగలను! ఆం హుం ఫట్ ఫట్...కాలభైరవా...” అంటూ బ్రహ్మదండి మంత్రం జపించేంతలో, కేకలు పెడుతూ కొందరు అరణ్యం వైపునుంచి, పల్లెలోకి రాసాగారు. వాళ్ళ చేతుల్లో వున్న కాగడాల వెలుగులో, ఆ వచ్చే వాళ్ళల్లో కొందరు కుంటుతూ వుండటం, మరికొందరు గాయపడిన తమ అనుచరుల్ని మోసుకురావటం కనిపించింది, “రాజద్రోహు లెక్కడ?" అంటూ బ్రహ్మదండి కేకలు పెట్టాడు. అతడి అంగరక్షకులైన జితవర్మా, శక్తివర్మలూ, కొందరు పల్లెవాసులూ వాళ్ళకేసి పరిగెత్తారు. కాని, ఆ వస్తున్న వాళ్ళందరూ పల్లె యువకులే, వాళ్ళందరి ముఖాలమీదా భయభీతులు తాండవిస్తున్నవి. వాళ్ళల్లో దాదాపు గాయపడనివారంటూ ఒకడూ లేదు.


    “ఆ రాజద్రోహులు పారిపోయారా ?" అని అడిగారు జితవర్మా, శక్తివర్మలు.


    “ఉత్తినే పారిపోవటం కాదు, మా మీదికి కోయవిలుకాళ్ళను పంపకంచేసి మరీ పారిపోయారు. మా వాళ్ళల్లో కొందరు వచ్చారు కూడా. అర్ధ రాజ్యానికి వేయి దణ్ణాలు!" అన్నారు పల్లె యువకులు.


    ఇంతలో బ్రహ్మదండి అక్కడికి వచ్చాడు. అతడికి మారువేషాల్లో వున్న కేశవుడూ, జయమల్లూ, ముసలివాడూ దొరక్కుండా పారిపోయారని అర్థమైంది. అతడిక్కలిగిన కోపం అంతా యింతా కాదు, “మీ పల్లెవాసులంతా, ఇంత చచ్చువెధవలని నాకు తెలియదు. ఇంతమంది వుండి, ముగ్గురంటే ముగ్గురు రాజ ద్రోహుల్ని ప్రాణాలతో పారిపోనిస్తారా ! సరే, జితా, శక్తి ! మీరు వెంటనే వెళ్లి మహారాజులుంగారితో, మహరాజగురు శ్రేష్ఠులతో యిక్కడ జరిగిన భీభత్సం సంగతి చెప్పండి. ఆ రాజద్రోహుల్ని మట్టు పెట్టకపోతే, మనం వింధ్యారణ్యాలకు వెళ్ళేలోపలే హతం అయిపోతాం," అన్నాడు.


    జితవర్మా, శక్తివర్మలు ముఖముఖాలు చూసుకున్నారు. ఇద్దరికీ ప్రాణభయం పట్టుకున్నది. బ్రహ్మపుర నగరం చేరేలోపల, మహారణ్యంలో ఆ రాజద్రోహులు తమను దొరక పుచ్చుకుంటే ఏమికాను? వాళ్ళ మనసులోని భావాలు గ్రహించినవాడిలా బ్రహ్మదండి పెద్దగా హుంకరించి, “మీరా నాకు అంగరక్షకులు! మిమ్మల్ని నమ్ముకుని వింధ్యారణ్యాలకు పోవటం అంటే, కోరి ప్రాణగండం తెచ్చుకున్నట్టే !” అన్నాడు.


    “అది కాదు, బ్రహ్మదండి! ఈ రాత్రికి రాత్రే వెళ్ళి రాజగురువుతో, యీ సంగతి చెప్పటం అంత అవసరమంటావా?” అన్నాడు జితవర్మ.


    “అవసరమా ! ఎందుక్కాదు ? ఆ ద్రోహుల్ని విచ్చలవిడిగా సంచరించనిస్తే, మనం వింధ్యారణ్యాలకు ఎలా చేరగలం ? వాళ్ళు మన గుర్రాలను కూడా అపహరించారు గదా ! రాజగురు శిరోమణికి అంతా తెలిస్తే, ఆయన సైనికులను పంపి, వాళ్ళను వేటాడించగలడు గదా ? అదెంత త్వరగా జరిగితే, మనకంత క్షేమం గదా ?" అన్నాడు బ్రహ్మదండి.


    జితవర్మా, శక్తివర్మలు పల్లెవాసుల్లో పది మందిని ధనాశ చూపి, తమకు తోడుగా వెంట బెట్టుకుని, బ్రహ్మపురం కేసి బయటుదేరారు. వాళ్ళు అలా కొంచెం దూరం వెళ్ళారో లేదో, మాంత్రికుడు పరిగెత్తి జితవర్మ భుజం పట్టుకుని దూరంగా లాక్కుపోయి, “జితా ! నువ్వూ, శక్తి కూడా వెళితే, ఈ పల్లెలో నేను ఒంటరిగాడైయిపోతాను. ఈ దుర్మార్గుల్లో ఎవడో ఒకడు నా గొంతుకోస్తే, నా గతేంకాను? నువ్వు యిక్కడే వుండు. శక్తి నగరానికి వెళతాడు,” అన్నాడు. జిత, శక్తివర్మలు కూడబలుక్కున్నారు. జితవర్మ, బ్రహ్మదండితో పాటు పల్లెలో వుండేందుకు అంగీకరించాడు. పది మంది పల్లెవాసుల్ని ఆసరాగా పెట్టుకుని బయలుదేరిన శక్తివర్మ సూర్యోదయం అవుతూండగా బ్రహ్మపురం చేరి, రాజగురువు దర్శనం చేసుకున్నాడు.


    జరిగిన దానికి చిలవలూ పలవలూ అల్లి అతడు చెప్పనదంతా రాజగురువు సావధానంగా విని, “మొత్తంమీద ఆ ముగ్గురూ నా ప్రయత్నాలకు విఘ్నం కలిగించేలా వున్నారు.” అని స్వగతంలా అనుకుని, సేనానాయకుడి కోసం కబురుచేశాడు.


    కొద్దిసేపటి తరువాత సేనా నాయకుడు రాగానే, రాజగురువు అరణ్యంలో బ్రహ్మదండి మాంత్రికుడికి కాస్తలో ప్రాణగండం తప్పిన వైనం చెప్పి, “ఆ ముగ్గురు ద్రోహులూ యింకా మన రాజ్య సరిహద్దుల్లోనే వున్నారని తేలిపోయింది. నువ్వు, సైనికులను జట్లుజట్లుగా పంపి, అరణ్యం, కొండలూ గాలించి వాళ్ళను పట్టుకోవాలి. సరిహద్దు కాపలా వాళ్ళకు కూడా హెచ్చరిక పంపు. ఆ ద్రోహులిప్పుడు క్షత్రియ యువకుల్లా వేషాలు వేసుకుని వున్నారు. ముసలివాడు దండ కమండలాలు పట్టి, కపట సన్యాసం నటిస్తున్నాడు," అన్నాడు.


    సేనా నాయకుడు రాజగురువు దగ్గర సెలవు తీసుకుని వెళ్ళి, ఒకటి, రెండు గంటల కాలం గడిచి గడవక ముందే, సైనికులను పదీ ఇరవైమంది చొప్పున జట్లు జట్లుగా విభజించి, అరణ్య ప్రదేశాలన్నీ గాలించేందుకు పంపాడు. తరువాత, తను ఒక పాతికమంది మెరికల్లాంటి సైనికులతో స్వయంగా రాజద్రోహులను పట్టుకునేందుకు బయలుదేరాడు.


    సరిగ్గా మిట్టమధ్యాహ్న సమయం ఆకాశం మధ్యం నుంచి సూర్యుడు నిప్పులు చెరుగుతున్నా, అరణ్యంలో దట్టంగా పెరిగివున్న చెట్ల కింద చల్లగా వున్నది. ఆ కిందటి రాత్రి తాము గడిపిన గుహలో నుంచి బయటికి వచ్చి కేశవుడూ, జయమల్లూ, ముసలి వాడూ- గుహ ముందున్న చెట్ల కింద కూర్చున్నారు. వాళ్ళ కెదురుగా పులిచర్మాలు పరిచిన ఒక ఎత్తయిన పీఠం మీద గడేజంగ్ కూర్చుని వున్నాడు. కేశవుడూ వాళ్ళు తమ ప్రయాణాన్ని గురించి గడేజంగ్ తో మాట్లాడుతున్నారు.


    హఠాత్తుగా ఇద్దరు కోయయువకులు చెట్ల చాటునుంచి బాణాల్లా దూసుకువచ్చి, తమ నాయకుడి ముందు రొప్పుతూ నిలబడ్డారు. గడేజంగ్, ఆశ్చర్యంగా వాళ్ళకేసి చూస్తూ, "ఏం జరిగింది ?" అని ఆదుర్దాగా వాళ్ళను ప్రశ్నించాడు.


    ఆ యువకులు కేశవుడూ, జయమల్లుల కేసి ఓ తృటికాలం అనుమానంగా చూసి, “జంగ్ దొరా! చాలా ముఖ్యమైన రహస్యం. ఇప్పుడే తెలిసింది. మీరు కాస్త అవతలికి రండి, చెపుతాం," అన్నారు.


    గడేజంగ్ పీఠం మీది నుంచి లేచి వాళ్ళ వెంట కాస్త దూరం నడిచి ఆగాడు. యువకుల్లో ఒకడు చిన్న గొంతుతో తమ నాయకుడికి ఏమో చెప్పసాగాడు. గడేజంగ్ కొద్ది సేపు విని, తలపక్కకు తిప్పి, కేశవుడూ అతడి అనుచరులకేసి ఆశ్చర్యంగా చూసి, తల పంకిస్తూ వాళ్ళకేసి రాసాగాడు.


    తమ కేదో అనుకోని ప్రమాదం రానున్నదని కేశవుడూ భావించాడు. జయమల్లూ, ముసలివాడూ ఒకేసారి ఒరలోవున్న తమ కత్తుల మీదికి చేతులు పోనిచ్చారు. ఇదంతా గమనిస్తున్న గడేజంగ్ చిరునవ్వు నవ్వుతూ వాళ్ళను సమీపించి, “మీ ధైర్యసాహసాలు చెప్పుకోదగ్గవి. కాని, మీ రహస్యం బయటపడిపోయింది. బ్రహ్మపుర సైనికులు మీ కోసం అరణ్యం అంతా గాలిస్తున్నారు. సరిహద్దు కాపలావాళ్ళకు కూడా హెచ్చరిక వెళ్ళింది. మీరు క్షత్రియులూ కాదు, మామూలు ప్రయాణీకులూ కాదు. రాజుతో వైరం తెచ్చుకున్న వాళ్ళు !" అన్నాడు.


    "అర్ధరాజ్యానికి ఆశించి, నీ రక్షణ కోరినవాళ్ళను, సైనికులకు అప్పగించ బోతున్నావా, గడేజంగ్ ?" అన్నాడు కేశవుడు.


    గడేజంగ్ పొట్టచెక్కలయేలా నవ్వుతూ, పీఠం మీది నుంచి వెల్లకిలా కిందబడి, లేచి, “అర్ధరాజ్యం కాదు. మొత్తం బ్రహ్మపుర రాజ్యం యిచ్చినా నేను తీసుకోను. నాకెందుకు రాజ్యం? ఈ మహారణ్యమే నా రాజ్యం. నా కులపువాళ్ళూ, యిక్కడ తిరిగే సాధు, క్రూర మృగాలూ నా పౌరులు. మీరు వెంటనే కోయవేషాలు వేసుకోండి. నా అనుచరులు మిమ్మల్ని సరిహద్దు దాటిస్తారు.” అన్నాడు.


    ఆ మాటలతో కేశవుడికీ, జయమల్లుకూ, ముసలివాడికీ కలిగిన ఆనందం అంతా యింతా కాదు. వాళ్ళు గడేజంగ్ కు ఒకటికి రెండుసార్లు తమ కృతజ్ఞత తెలియపరిచారు. గడేజంగ్ అనుచరులు తెచ్చి యిచ్చిన లేడి చర్మాలు కట్టుకుని, తలల్లో పక్షి ఈకలు ధరించి, తమ దుస్తుల్ని మూటలుగా కట్టి భుజాలమీద వేసుకుని ప్రయాణ సన్నాహమయారు.


    గడేజంగ్, కోయయువకు లిద్దర్ని పిలిచి వాళ్ళతో, “ముందు ఆ మూడు గుర్రాలనూ అరణ్యంలోకి తరిమెయ్యండి. తరువాత నా మిత్రులు యీ ముగ్గుర్నీ అడ్డదారి వెంట తీసుకుపోయి, రాజ్య సరిహద్దులు దాటించండి. ఆ ప్రయత్నంలో సరిహద్దు కాపలావాళ్ళతో పోరు తప్పకపోతే, ముందు ప్రాణాలర్పించవలసిన వాళ్ళు, మీ యిద్దరు !" అన్నాడు.


    క్షణాలమీద గుర్రాలు మూడూ అరణ్యం లోపలికి తరమబడినై.


    కోయయువకుల్లో ఒకడు ముందూ, ఒకడు వెనకా నడవగా, కోయల్లా వేషాలు మార్చుకున్న కేశవుడూ, ముసలివాడూ, జయమల్లూ, బ్రహ్మపుర రాజ్యసరిహద్దుల్ని దాటి పోయేందుకు బయలు దేరారు.

ఇంకా వుంది...

Post a Comment

Previous Post Next Post