రాకాసిలోయ (చందమామ)_13 RakasiLoya Janapada Novel by Dasari Subramanyam (CHANDAMAMA)

 RakasiLoya 1-35 Janapada Novel by Dasari Subramanyam (CHANDAMAMA)

రాకాసిలోయ (చందమామ)_13

 _దాసరి సుబ్రహ్మణ్యం

రాకాసిలోయ_13

    కేశవుడి ముసలితండ్రి ముందుండి దారితీయగా, ముగ్గురూ పల్లెదాటి తిరిగి అరణ్యంలో ప్రవేశించారు. ఆ సరికి బాగా చీకటి పడిపోయింది. అరణ్యం అంతా పక్షులా, జంతువులా, కూతలతో, అరుపులతో ప్రతిధ్వనించి పోతున్నది. ముగ్గురూ నిస్పృహగా ఒక చెట్టుకింద కూర్చున్నారు.


    “ఈ మారువేషాల్లో బ్రహ్మదండి మనను గుర్తించగలడంటావా?" అని అడిగాడు కేశవుడు జయమల్లును.


    జయమల్లు అడ్డంగా తల తిప్పుతూ, “ఏమో చెప్పలేం. కాని, ఈ సరికే మనం ఒక పొరపాటు చేశాం. గురు మౌనానందులు, రచ్చబండ దగ్గిర కూచున్న పల్లెవాసులంతా వినేట్టుగా మాట్టాడేశారు. అలా చెయ్యకుండావుంటే బావుండేది," అన్నాడు.


    “అందులో పొరపాటేమున్నది? ఈ దేశాటనలో, ఆయన తన శిష్యులతో మాత్రమే మాటాడతాడని నేను లోగడే చెప్పాను గదా?" అన్నాడు ముసలివాడు.


    “అవుననుకో, కాని, నీ గొంతులో పలికిన యాస వాళ్ళల్లో ఎవరైనా గుర్తుపడితే ఏమయేది? మనం ఈ బ్రహ్మపుర రాజ్యపు సరిహద్దులు దాటేవరకూ, చాలా జాగ్రత్తగా మసులుకోవాలి. మనం చేసే ప్రతి పనీ ఎంతో ఆలోచించి మరీ చేయాలి. కాకతాళీయంగా బ్రహ్మదండీ, మనమూ ఒకేసారి బయలుదేరటం జరిగింది. రాజగురువు వేసిన ఎత్తు తెలుసుకున్నారు గదా? ఆయన కాలి వ్రణమేదో నయం చేసేందుకు, ఈ మాంత్రికుడు మూలికల కోసం, వింధ్యారణ్యాలకు బయలుదేరాడట! మన శత్రువులు మహా జిత్తులమారి వాళ్ళు,” అన్నాడు జయమల్లు. ముసలివాడు అవునన్నట్టు తల వూపుతూ, చప్పున లేచి కూచుని, “ఈ దాపులనే ఎక్కడో గుర్రం సకిలించిన ధ్వని అయింది. మీకు వినబడిందా?" అని ప్రశ్నించాడు.


    కేశవుడూ, జయమల్లూ జవాబు చెప్పేంతలో, ఈసారి మరింత స్పష్టంగా గుర్రం సకిలించటం వినబడింది. ముగ్గురూ ఆశ్చర్యంగా ముఖముఖాలు చూసుకున్నారు.


    “బ్రహ్మదండీ, అతడి అనుచరులూ యిటే వస్తున్నారులా వుంది! మన చిక్కులన్నీ తీరి, ఈ రాజ్యం సరిహద్దులు దాటి త్వరగా పారిపోవాలంటే, వాళ్ళెక్కివస్తున్న గుర్రాలను కాజేయట మొక్కటే మార్గం,” అన్నాడు ముసలివాడు.


    “ఎలా? అదంత తేలికా, అయ్యా?" అన్నాడు కేశవుడు.


    “అదుగో, ఆ పిలుపే మానమన్నది, గుర్తులేదా? నేను మీ గురువును. నువ్వు కనిష్ఠుడివీ, జయమల్లు జ్యేష్ఠుడూ. మనం ఏకాంతగా వున్నప్పుడు కూడా అలాగే పిలుచు కోవటం అలవాటు చేసుకోవాలి. సరే, యిప్పుడు మీరు ఊఁ అంటే, ఆ బ్రహ్మదండి ఎక్కిన గుర్రాన్ని నేను కాజేయగలను. మీరు కూడా అతడి అనుచరుల గుర్రాలను కాజేయ గలిగితే, తెల్లవారే సరికల్లా, ఈ బ్రహ్మపుర రాజ్యపు సరిహద్దుల్ని దాటిపోగలం. అప్పుడు, ఏ బెడదా వుండదు,” అన్నాడు ముసలివాడు.


    అతడి మాటలకు జయమల్లు నవ్వుతూ, “నీ ఎత్తుగడ ఏమిటి? మాంత్రికుడి గుర్రాన్ని ఎలా పట్టుకోగలవు? అతణ్ణి కత్తితో ఎదిరిస్తావా?" అని అడిగాడు.


    “వాళ్ళు ఎదురుపడి, ఈ చీకట్లో యుద్ధం చేయటం మంచిదికాదు. అప్పుడు రేగే గొడవకు పల్లెవాసులు అక్కడికి వస్తే, మనం పట్టుబడిపోతాం. చడీ చప్పుడూ లేకుండా ఆ గుర్రాల మీది నుంచి వాళ్ళను పడకొట్టాలి. నేను చెట్టు మీద వుండి, మాంత్రికుణ్ణి తాడు వేసి కింద పడకొట్టి, వాడి గుర్రాన్ని వశపరుచుకోగలను,” అన్నాడు ముసలివాడు.


    “ఈ వయసులో నువ్వే అంత సాహసం చేయగలిగితే, గురో, మేం నీకు తీసి పోతామా? ఏం, కేశవా?" అంటూ లేచి నిలబడ్డాడు జయమల్లు.


    “కేశవుడు కాదు, కనిష్ఠుడు! గుర్తుంచుకో." అంటూ ముసలివాడు కస్సుమన్నాడు. ముగ్గురూ లేచి, గుర్రాలు వస్తున్న వైపుకు బయలుదేరారు.


    ఈ లోపల బ్రహ్మదండి మాంత్రికుడు, తన అంగరక్షకులైన జితవర్మా, శక్తివర్మలతో కలిసి, పల్లె కేసి వస్తున్నాడు. అతడికి ముందూ వెనకా వాళ్ళు గుర్రాలెక్కి వస్తున్నారు.


    బ్రహ్మదండికి గుర్రపు స్వారి ఏ మాత్రం అలవాటు లేదు. కానీ, కాలినడకను ప్రయాణించటం సాధ్యంకాదు గనక, ప్రాణం బితుకుబితుకు మంటూనే గుర్రపు స్వారికి ఒప్పుకున్నాడు. చుట్టూ చీకటి, మహారణ్యం, దూరంగా క్రూరజంతువుల అరుపులు - అతడికి ఆ వాతావరణం అంతా భీతావహం కలిగిస్తున్నది.


    ఇక రేపటి నుంచీ మనం రాత్రిళ్ళు ప్రయాణించటం మానుకోవాలి. సూర్యో దయంతోపాటే మనం బయలుదేరుతాం, సూర్యాస్తమయమవగానే ఆగిపోతాం. ఇదెందుకో తెలుసా? ఆ జయమల్లూ, కేశవుడూ, వాడి తండ్రీ, మహాదుర్మార్గులు, వాళ్ళు చీకటిమాటున మన మీద దాడి చేసినా చెయ్యవచ్చు. నా గుహ కావలికాస్తున్న భటుల్ని వాళ్ళేం చేశారో, మీకు తెలుసుగదా?” అన్నాడు బ్రహ్మదండి.


    మహారణ్యం మధ్య, చీకట్లో ప్రయాణమంటేనే హడలిపోతున్న జితవర్మా, శక్తి వర్మలకు, మాంత్రికుడి హెచ్చరిక మరింత భీతి కలిగించింది. వాళ్ళు గుర్రాలను మరికాస్త అదిలిస్తూ, "బ్రహ్మదండీ, నువ్వు చెప్పింది బావుంది. అలాగే చేద్దాం. ఏదీ, మనం చేరవలసిన పల్లె? ఎంతకీరాదే!” అన్నారు చుట్టూ చీకట్లోకి భయంగా చూస్తూ.


    బ్రహ్మదండి వాళ్ళ ప్రశ్నకు ఏదో జవాబు చెప్పబోయి, అంతలోనే కీచుగొంతుతో, “చచ్చాను, ద్రోహం, మోసం, నానడుంకేదో ఉచ్చుపడింది!" అంటూ అరిచాడు.


    “పొరపాటు! కంఠానికని విసిరిన ఉచ్చుతాడు, నడుముకు పడింది!" అన్న అవహేళన చెట్టు మీది నుంచి వినబడింది. అదేసమయంలో జితవర్మా, శక్తివర్మలిద్దరూ, “వింత జంతువు! వింతమృగం!" అంటూ కెవ్వుమని అరిచి గుర్రాల మీంచి పట్టుదప్పి కిందకు పడిపోయారు.


    అంతా కనురెప్పపాటు కాలంలో జరిగిపోయింది. బ్రహ్మదండి చెట్టుకొమ్మ నుంచి వేలాడుతున్నాడు. పై నుంచి అతడి గుర్రం మీదికి ముసలివాడు దూకాడు. కేశవుడూ, జయమల్లూ ఒక్క ఎగురున జితవర్మా, శక్తివర్మల గుర్రాలను అధిరోహించారు.


    “జ్యేష్ఠా, కనిష్ఠా! ఊఁరండి!" అంటూ ముసలివాడు తన గుర్రాన్ని అరణ్యానికి అడ్డంపడి పరిగెత్తించసాగాడు. ఆ సరికి బ్రహ్మదండికి కాస్త ధైర్యం వచ్చింది. అతడు తన నడుముకు బిగిసివున్న తాడును అటూయిటూ గుంజుతూ, “జితా, శక్తి! ఎక్కడ? మీరు చూసింది వింతమృగమా? అయితే వాళ్ళు కేశవుడూ, జయమల్లూ, ముసలివాడూ అయివుంటారు. ఆ జయమల్లు ఒక్కడికే ఆ విద్య తెలుసు. వాళ్ళను వెంబడించండి. పట్టుకోండి! నరకండి!” అంటే కేకలువేశాడు.


    జితవర్మా, శక్తివర్మా మాటలతో కాస్త ధైర్యం తెచ్చుకుని లేచి నిలబడి, ఒర నుంచి కత్తులు దూసేంతలో, బ్రహ్మదండి ఏడుపు గొంతుతో, “జితా, శక్తి! అగండి, ఆగండి. ముందిటురండి! నన్ను ఈ కొమ్మ నుంచి కిందికి దించండి,” అని అరిచాడు.


    జితవర్మా, శక్తివర్మలు అతణ్ణి సమీపించి, బ్రహ్మదండి నడుముకు బిగిసివున్న తాడును తమ కత్తులతో నరికి, దభీమంటూ కింద పడబోతున్న అతణ్ణి, మధ్యలోనే పట్టుకుని దించి నిలబెట్టారు.


    పల్లె పక్కగా అరణ్యంలో రేగిన ఈ కల్లోలం, పల్లెవాసుల చెవిని బడింది. వాళ్ళు కాగడాలూ, కర్రలూ తీసుకుని అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చారు. బ్రహ్మదండినీ, అతడి అంగరక్షకుల్నీ ఆ స్థితిలో చూసి వాళ్ళకు కలిగిన ఆశ్చర్యం అంతా యింతా కాదు.


    “అలా గోళ్ళు గిల్లుకుంటూ చూస్తారేం, మతులేమన్నా పోయినయ్యా?" అంటూ బ్రహ్మదండి వాళ్ళ మీద విరుచుకుపడ్డాడు. “మేమే రాజు గారు పంపగా వచ్చిన, ఆస్థానోద్యోగులం! ముగ్గురు రాజద్రోహులు మా గుర్రాలను అపహరించుకుని, అటుగా పారిపోయారు. వాళ్ళను పట్టుకోండి. అదృష్టవంతుడికి అర్థరాజ్యం!” అంటూ పళ్ళు కొరికాడు.


    పల్లెవాసుల్లో సాహసవంతులైన కొందరు యువకులు, బ్రహ్మదండి చూపిన వైపుకు పరిగెత్తారు. తతిమ్మావాళ్ళు బ్రహ్మదండినీ, జిత, శక్తివర్మలనూ పల్లెకు తీసుకుపోయారు.


    జయమల్లూ, కేశవుడూ, అతడి ముసలి తండ్రీ ఎక్కిన గుర్రాలు అరణ్యానికి అడ్డం పడి పరిగెత్తసాగినై. కాని, చీకటి, దారినడ్డగించే చెట్ల కొమ్మలా, ముళ్ళపొదలా ఆటంకాల వల్ల, వాళ్ళు అనుకున్నంత వేగంగా పారిపోలేకపోయారు. ఇంతలో వాళ్ళకు వెనకగా, కాగడాలూ, కర్రలతో వస్తున్న పల్లెయువకులు కనిపించారు.


    “మనం చిక్కుల్లోపడ్డాం." అన్నాడు జయమల్లు గుర్రం మించి వెనుదిరిగి, తమను వెంబడిస్తున్న పల్లెవాసుల కేసి చూసి “చిక్కుల్లో పడటం మనకేమన్నా కొత్తా? ఇది మొదటి సారికాదు," ఆఖరుసారికాదు," అంటూ ముసలివాడు విసుక్కుని, “అదిగో, అక్కడేదో దీపపుకాంతి లాటిది వున్నది, మీకు కనబడుతున్నదా? బహుశా, అది అరణ్యంలో నివశించే, ఏ గొడ్లకాపరి యిల్లో అయివుంటుంది. మనం సరాసరి అక్కడికెళ్ళి, ఆ ఇంట్లో దాక్కునేందు కేమైనా అవకాశం వుందేమో ప్రయత్నిద్దాం. అంత తప్పనిసరైతే, గుర్రాలను వదిలేద్దాం," అన్నాడు.


    క్షణాల మీద ముగ్గురూ, ఆ దీపపు కాంతి కనిపిస్తున్న వైపుకు తమ గుర్రాలను ఉరికించారు. వాళ్ళు దాన్ని సమీపిస్తూండగానే, చెట్ల చాటు నుంచి రెండు కంఠాలు, “ఎవరా వచ్చేది? ఆగండి!” అంటూ కఠినంగా హెచ్చరించినై.


    ఆ హెచ్చరిక వింటూనే ముసలివాడు గుర్రం దిగి, “అయ్యా, మీరెవరో మాకు తెలియదు. మేం యాత్రికులం. మమ్మల్ని దోచుకునేందుకు బందిపోటు దొంగలు వెంట బడితే, యిటు పారిపోయివస్తున్నాం. వాళ్ళ కాగడాల వెలుగూ, చేతుల్లో కర్రలూ మీరూ చూసే వుంటారు !” అన్నాడు.


    ముసలివాడు మాట ముగించీ ముగించకముందే, దీపం గప్పున ఆరిపోయింది. ఒక ఆజానుబాహుడైన కోయవాడు, పెద్ద ఈటె ఒకటి పట్టుకుని, అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అతడు కేశవుణ్ణి, జయమల్లునూ చూస్తూనే, “మీరా ఎగువనున్న వల్లె వైపు నుంచేనా రావటం? ఆ పల్లె వాసుల్లో సగం మందికి ధనం దోచుకోవటం వృత్తి, తతిమ్మా సగానికి వినోదం కోసం గొంతులు కోయటమే పని. మీరేమీ భయపడకండి, మీ రక్షణ భారం నాది !" అంటూ పక్కకు తిరిగి, “ఓ హెూయ్, ఆ కాగడాలు పట్టుకువచ్చేవాళ్ళ మీద గురి చూసి బాణాలు వదలండి ! వాళ్ళు మరొక్క అడుగైనా ముందుకు రాకూడదు.” అన్నాడు.


    అప్పటివరకూ నిశ్శబ్దంగా వున్న ఆ ప్రాంతం కేకలతో హెచ్చరికలతో మార్మోగి పోయింది. కోయ యువకులు చెట్ల మీది నుంచి, పొదలమాటు నుంచి పల్లె యువకుల మీదికి గురిచేసి బాణాలు రివ్వురివ్వుమంటూ వదలసాగారు. చూస్తూండగానే ఆ ప్రదేశమంతా యుద్ధరంగంగా మారింది. అర్ధరాజ్యం వస్తుందన్న ఆశతో పల్లె యువకులూ, తమ కులపెద్దల ఆజ్ఞను పాలించే పట్టుదలతో కోయయువకులూ సంకుల సమరం సాగించారు. బాణం వేటుదాటి ముందుకు వచ్చిన పల్లె యువకులతో, కోయ యువకులు కర్రలు తీసుకుని పోరాడసాగారు. ఓ క్షణకాలం కోయల కులపెద్ద ఆ దృశ్యం కేసి చూసి, తల పంకిస్తూ, "మా వాళ్ళ ధాటికి, ఆ దుర్మార్గులు నిలబడలేదు, ఆ సంగతి నాకు తెలుసు!


    అయినా, యిక ఈ రాత్రికి, ఈ ప్రదేశం క్షేమకరం కాదు. నా రక్షణ కోరిన వాళ్ళను కాపాడే బాధ్యత నాది కనక, మిమ్ములను ఒక రహస్య ప్రదేశానికి తీసుకుపోతాను రండి," అంటూ బయలుదేరాడు. జయమల్లూ, కేశవుడూ,ముసలివాడూ అతనికి వెనకగా, గుర్రాలను కళ్ళాలు పట్టుకుని నడిపించుకుంటూ కదిలారు.

ఇంకా వుంది...

Post a Comment

Previous Post Next Post