రాకాసిలోయ (చందమామ)_12 RakasiLoya Janapada Novel by Dasari Subramanyam (CHANDAMAMA)

 RakasiLoya 1-35 Janapada Novel by Dasari Subramanyam (CHANDAMAMA)

రాకాసిలోయ (చందమామ)_12

 _దాసరి సుబ్రహ్మణ్యం

రాకాసిలోయ_12

    గుండెల మీదికి సూటిగా గురిచేసివున్న ఈటే, కాపలాభటుడి కేకలూ వింటూనే, బ్రహ్మదండి మాంత్రికుడికి నిద్రమత్తు వదిలిపోయింది. అంతలో అక్కడికి మరిద్దరు కాపలా భటులు పరిగెత్తుకు వచ్చారు.


    “పారిపోవాలని చూస్తున్నాడా? చూస్తారేం, పొడవండి!” అంటూ ఒక భటుడు ఈటెను పైకెత్తాడు. బ్రహ్మదండికి ప్రాణం కడబట్టినంత పనయింది. అతడో క్షణకాలం నోటి వెంట మాటరాక తడబడి, తరవాత కాస్త తెప్పిరిల్లి “అయ్యాల్లారా! వీరభట మహాశయుల్లారా! నన్ను చంపకండి. నేను పారిపోవాలని ప్రయత్నం చెయ్యలేదు." అన్నాడు వణికి పోతూ.


    “పారిపోయేందుకు ప్రయత్నించలేదా? అయితే యిదంతా ఏమిటి? నేను అబద్దాల కోరుననా నువ్వనేది!" అంటూ మొదట దారి అడ్డగించిన భటుడు. ఈటె తిరగవేసి బ్రహ్మదండి నెత్తిన ఒక్క బాదుబాదాడు ఆ దెబ్బకు బ్రహ్మదండి కింద కూలబడి, గిలగిల లాడుతూ, "మహాభట కేసరీ! నన్ను చంపకు. నిద్రపోతూండగా పీడకల వచ్చి, ఆ మైకంలో గది నుంచి బయటికి పరిగెత్తుకు వచ్చాను. నాదే తప్పు," అంటూ బావురుమన్నాడు.


    కాపలాభటులు అతణ్ణి కాళ్లూ చేతులూ పట్టుకుని దూలాన్ని మోసుకుపోయినట్టు గదిలోకి మోసుకుపోయి, మంచం మీదికి గిరవాటువేశాడు. బ్రహ్మదండి మంచం మీద పడుతూనే, ఆ అదురుకు, ఎగిరి కింద నేలమీద వెల్లికిలాపడి, లేచి ఒళ్ళు దులుపు కుంటూ, “బాబులూ, శూరభట శార్దూలాలూ! నన్ను హింసించకండి. నా దగామారి శిష్యుడూ, మరొకడూ కలిసి, నేను రక్తం ఓడ్చి సంపాయించి దాచుకున్న డబ్బును దొంగిలిస్తూంటే చూసి, మతిచెడితప్పుగా ప్రవర్తించాను." అన్నాడు.


    “నీ కింకా మతిచెడే వున్నది," అన్నాడొక కాపలాభటుడు, బ్రహ్మదండి కేసి అనుమానంగా చూస్తూ, “ఇందాక, ఏదో పీడకలవచ్చి, బయిటికి పరిగెత్తానన్నావు. ఇప్పుడు నీ దగామారి శిష్యులు, నువ్వు దాచుకున్న బంగారం ఎత్తుకుపోతూంటే చూసి, మతి చెడిందంటున్నావు? ఏది నిజం?" అని అడిగాడు.


    “వీడు మళ్ళీ కొండల్లోకి పారిపోయేందుకు ఏదో ఎత్తువేస్తున్నాడు. వీడి ఆట కట్టించాలంటే, రాజగురువు కోసం కబురు పంపాల్సిందే," అన్నాడొక భటుడు.


    రాజగురువు పేరు వింటూనే, బ్రహ్మదండి గడగడా వణికిపోతూ, “నాయనలారా! యోధభట భల్లూకాల్లారా! నన్ను కరుణించండి. ఈ అర్థరాత్రి సమయంలో వెళ్ళి రాజ గురువును నిద్రలేపితే, ఆ కోపంలో ఆయన నన్నేమిచేసినా చేయవచ్చు. నా తప్పు మన్నించండి!" అన్నాడు.


    కాపలాభటులు తమలోతాము కూడ బలుక్కుని, మాంత్రికుడి గది తలుపులు బిగించి, అక్కడ యిద్దరు కాపలావుండగా, మూడోవాడు రాజగురువు దగ్గరకుపోయాడు.


    రాజగురువు భటుడు చెప్పిందంతా విని, “మంచిపని చేశారు. తెల్లవారుతూనే వాణ్ణి రాజుగారి దగ్గరకు తీసుకురండి. మీ నాయకుడితో, కొండల్లోని బ్రహ్మదండి గుహ దగ్గిర ఏమి జరిగిందో తెలుసుకురమ్మన్నానని చెప్పండి,” అన్నాడు.


    సూర్యోదయం అయేలోపలే నలుగురు భటులు, బ్రహ్మదండి మాంత్రికుడి గుహ దగ్గరకు వెళ్ళి, గుహముందు కాళ్ళూ చేతులు కట్టి పడవేయబడివున్న తమ యిద్దరు అనుచరుల్నీ చూశారు. వాళ్ళు రాత్రి జరిగిన సంగతంతా చెప్పారు.


    గుహ దగ్గిర్నుంచి భటులు రాచనగరుకు తిరిగి వచ్చేసరికి, అక్కడ రాజూ, రాజ గురువుల ముందు బ్రహ్మదండి మాంత్రికుడు చేతులు కట్టుకు నిలబడి వున్నాడు. భటులు జరిగిందంతా చెప్పారు.


    అంతా శ్రద్ధగా విన్న రాజగురువు, “కాపలా భటుల్ని కాళ్ళూచేతులు కట్టి గుహలో ప్రవేశించిన వాళ్ళు బందిపోట్లు కాదు. కేశవుడూ, జయమల్లూ అయివుంటారు. పోతే, ఆ మూడోవాడెవడైనదీ తెలియటం లేదు!" అన్నాడు.


    “అనుమాన మేల రాజగురు చూడామణీ! వాడు, కేశవుడి తండ్రి అయిన ముసలి వాడు! నా పీడకల సంగతి చెప్పాను గదా? అందులో ఆ ముసలి వెధవ కనిపించలేదు. ఏమైతేనేం, నా నిధి దొంగిలించబడింది,” అంటూ బ్రహ్మదండి కళ్ళనీళ్ళ పర్యంతమయ్యాడు.


    రాజగురువు, మాంత్రికుడి కేసి జాలిగా చూస్తూ, “విచారించకు బ్రహ్మదండీ! రాకాసిలోయలో దొరికే నిధుల్లో నీకూ భాగం వుంటుంది. మనక్కావలసిన కేశవుడు యింకా మనరాజ్య సరిహద్దుల్ని దాటిపోలేదని కూడా తేలిపోయింది. వాణ్ణి పట్టుకునేందుకు ప్రయత్నిద్దాం. కాని, వాడి ప్రయాణం కూడా రాకాసిలోయకే అని అర్థమవుతున్నది. దారి ఖర్చుల కోసం నీ బంగారం దొంగిలించాడు. పాపం," అన్నాడు రాజగురువు.


    బ్రహ్మదండి కోపంతో బుసలుకొడుతూ, “మహారాజా! మహారాజగురుశేఖరా! ఇక నాకు అనుమతి యిప్పించండి. తమరు వేసిన పథకం ప్రకారం, నేను రాకాసిలోయ చేరి, ఆ దుష్టులైన కేశవ జయమల్లుల్ని, కాలభైరవుడికి బలిచేసి, అక్కడ లభించే ధనరాసుల్ని తమ వద్దకు పట్టుకు వస్తాను.” అన్నాడు.


    రాజగురువు అక్కడ నిలబడివున్న భటుల్ని వెళ్ళిపొమ్మని చెప్పి, రాజుతో, “మహారాజా! బ్రహ్మదండీ, జితవర్మా, శక్తివర్మల ప్రయాణానికి, ఈ సాయంకాలం ముహూర్తం పెట్టాను. ఎవరికీ ఎలాంటి అనుమానం కలక్కుండా వుండేందుగాను, మన వేగులవాళ్ళు యీ సరికే నగరంలో, అవసరం అయిన వదంతులు లేవదీసి వుంటారు," అన్నాడు.


    రాజగురువు చెప్పినట్టు, ఆనాటి సూర్యోదయం వేళకే బ్రహ్మపుర నగరంలో ఒక వదంతి ప్రచారం కాసాగింది. రాజగురువు కాలిమీద ఎప్పుడోఒక వ్రణం లేచిందనీ, అది ఎన్ని చికిత్సలకూ లొంగనందున, వింధ్యారణ్యాలలో దొరికే ఒక ఓషధి కోసం బ్రహ్మదండి మాంత్రికుడు వెళుతున్నాడనీ ప్రజలు చెప్పుకోసాగారు.


    రాకాసిలోయలో ఏవో నిధుల కోసం బ్రహ్మదండి వెళుతున్నాడని తెలిస్తే, అతడు ప్రయాణించవలసిన దేశాలరాజులు, అతడికి ఆటంకాలు కలిగిస్తారని రాజగురువు, ఈ వదంతి ప్రచారంలో పెట్టించాడు. రాజగురువు ప్రాణ రక్షణకోసం ఏదో ఓషథో, మూలికో తెచ్చుకునేందుకు వెళ్ళే మనుష్యుల్ని ఎవరూ ఏమీ చేయరు సరి కదా, ప్రయాణానికి అవసరం అయిన సహాయం కూడా చేస్తారు.


    మొత్తం మీద రాజగురువు వేసిన ఎత్తు గడ పారింది. మహా దుష్టమాంత్రికుడని పేరు మోసిన బ్రహ్మదండి, ఇరవైనాలుగ్గంటల్లో ఘనవైద్యుడుగా అందరిచేతా చెప్పుకోబడ్డాడు. “అతడెంత గొప్ప వైద్యశాస్త్రనిధి కాకపోతే, రాజగురువు తన దీర్ఘవ్యాధిని కుదిర్చేందుకు అతణ్ణి నియమించుకుంటాడు!" అనుకున్నారు ప్రజలు.


    ఆ రోజు సాయంకాలం బ్రహ్మదండి మాంత్రికుణ్ణి వింధ్యారణ్యాలకు, సాగనం పేందుకు రాజగురువు స్వయంగా నగర ద్వారం దగ్గరకు వచ్చాడు. ఆయన లోగడే, రాజాస్థానంలో ఉద్యోగాలు చేస్తున్న యిద్దరు యువకుల్ని - జితవర్మ, శక్తివర్మ - అనే వాళ్ళను బ్రహ్మదండి వెంట వెళ్ళేందుకు నియమించాడు. వాళ్ళపని, రాకాసిలోయలో ఒకవేళ నిధినిక్షేపాలు దొరికితే, వాటి నెత్తుకుని బ్రహ్మదండి పారిపోకుండా చూడటం. కాని, ప్రయాణంలో ఎవరైనా అడిగితే మాత్రం, తామిద్దరూ అతడి అంగరక్షకులుగా నియమించబడినట్టు బొంకాలి.


    నగరం ప్రవేశించేప్పుడు ఎంతో అవమానించబడిన బ్రహ్మదండి, నగరం వదిలి పోయేప్పుడు గొప్పగా సన్మానించబడ్డాడు. నగరద్వారం వద్ద గుంపులు గుంపులుగా చేరిన ప్రజల్లో కొందరు అతడి మెడలో పుష్పమాలలు కూడా వేశారు. ఆటలూ, వినోదాలూ కూడా సాగినై.


    ఇక్కడ బ్రహ్మపుర నగరాన్ని మాంత్రికుడు వదిలివెళ్ళే సమయంలో, అక్కడ అడవి మధ్య దాగివున్న కేశవుడూ, జయమల్లూ కూడా వింధారణ్యాలకు వెళ్ళేందుకు తయారవు తున్నారు. కేశవుడి తండ్రి కొని తెచ్చిన దుస్తులు ధరించటంతో వాళ్ళిద్దరూ క్షత్రియ యువకుల్లా మారిపోయారు. డాలూ, కత్తి, శిరస్త్రాణం, అంబులపొదీ - వాళ్ళ నిప్పుడు చూచిన వాళ్ళెవరూ, గొడ్ల కాపరీ, బ్రహ్మదండి మాంత్రికుడి శిష్యుడూ అని గుర్తించలేరు.


    ఈ విధంగా వాళ్ళిద్దరూ వేషాలు వేసుకుని బయలుదేరనున్న సమయానికి, ముసలి వాడు తానూ వాళ్ళ వెంట వస్తానని పట్టుబట్టాడు. కేశవుడూ, జయమల్లూ అతడికి దారితో ఎదుర్కోవలసివున్న ఆపదలను గురించి చెప్పారు. ఈ వృద్ధాప్యంలో కొండలూ, అడవుల వెంటపడి కొన్ని వందల కోసుల దూరం నడవటం కష్టమని అన్నారు. కాని, ముసలివాడు తన పట్టు వదలలేదు.


    “సరే, ఈ రూపంలో నిన్ను ఎవరైనా గుర్తిస్తారు, ఎట్లా?" అన్నాడు కేశవుడు.


    ముసలివాడు ఎగిరి గంతేశాడు. "నగరంలో మీకు దుస్తులు కొనేప్పుడే, నాకూ అవసరం అయిన దుస్తులు కొనుక్కున్నాను. కొంచెం ఆగండి, నన్ను మీరు గుర్తించగలరో లేదో చూస్తాను!" అంటూ ముసలివాడు చెట్ల చాటుకు వెళ్ళి, పావుగంట కాలం గడిచీగడవక ముందే, తిరిగి వచ్చాడు.


    ముసలివాడు వేషం చూసి, కేశవుడూ, జయమల్లూ పొందిన ఆశ్చర్యం అంతా యింతా కాదు. పట్టువస్త్రాలూ, మెడలో రుద్రాక్షమాలా, చేతిలో దండకమండలాలూ, చెవులకు కుండలాలూ, ముఖాన విభూతిరేఖలూ - అతడిప్పుడు అచ్చుపండితుడిలా వున్నాడు.


    “నేనిప్పుడు, మీ యిద్దరికి గురువును! రాజపుత్రులను దేశాటన చేయించేందుకు బయలుదేరినవాణ్ణి, తెలిసిందా?” అన్నాడు ముసలివాడు.


    “అది బాగానే వుంది, గురూ! కాని మనం దారిలో ఏ నగరానికైనా వెళితే, అక్కడ పండితులు నిన్నేమైనా ప్రశ్నిస్తే, అప్పుడు మనం ఏమయేట్టు?" అని అడిగాడు జయమల్లు.


    “గురు మౌనానందుడు! ఈ యాత్రలో ఆయన తన శిష్యులతో తప్ప మరెవరితోనూ మాట్టాడరు, సరిపోయే!” అన్నాడు ముసలివాడు.


    కేశవుడికి తన తండ్రిని వెంటపెట్టుకు వెళ్ళటమే క్షేమమనిపించింది. ఈ వయసులో అతణ్ణి, ఈ అరణ్యంలో వదలిపోవటం మంచిదికాదు. ఈ సరికి బ్రహ్మపురరాజ్యంలో వున్నవాళ్ళందరికీ, తాము తండ్రి కొడుకులమన్న సంగతి తెలిసిపోయి వుంటుంది. తన తల విలువ ఒక చిన్న సామంతరాజ్యం . ఆ ఆశ వున్నవాళ్ళెవరూ తన తండ్రి దొరికితే, తన జాడలు తెలుసుకునేందుకు, అతణ్ణి హింసించక మానరు.


    కేశవుడు తండ్రి కేసి ప్రేమగా చూస్తూ, “అయ్యా....” అని ఏమో చెప్పబోయేంతలో ముసలివాడు, ముఖంలో లేని కోపాన్ని తెచ్చి పెట్టుకుని, "అయ్యాకాదు...గురూ!" అన్నాడు కఠినంగా.


    కేశవుడికీ, జయమల్లుకూ నవ్వాగింది కాదు. కేశవుడు తన తండ్రిని సమీపించి, అతడి చేయిపట్టుకుని ముందుకు నడిపిస్తూ, “గురూ, యిక మనం బయలుదేరుదాం. చీకటిపడే వేళకన్నా, మనం ఏదైనా పల్లె చేరాలి. ఈ రాత్రికి అక్కడే పండుకుని, తెల్లవారి మన ప్రయాణాని కవసరం అయిన గుర్రాలు కొనుక్కుని ముందుకు సాగుదాం. కాలినడకన రాజకుమారులూ, వాళ్ళ గురువూ దేశాటన చేస్తున్నారంటే, ఎవరికైనా అనుమానాలు కలగవచ్చు." అన్నాడు.


    అరణ్యంలో దాదాపు రెండు గంటల కాలం ప్రయాణం చేసి, చీకటిపడుతూండగా ముగ్గురూ ఒక పల్లె చేరారు. వాళ్ళు వీధిలో నడుస్తూండగా, రచ్చబండ చుట్టూ చేరిన జనం అనుకునే మాటలు వాళ్ళకు కొంత ఆశ్చర్యాన్నీ, భయాన్నీ కూడా కలిగించినై.


    “బ్రహ్మదండి మాంత్రికుడు, ఇద్దరు అంగరక్షకుల్ని వెంటపెట్టుకుని, వింధ్యారణ్యాలకు వెళుతున్నాడట! అక్కడ మాత్రమే పెరిగే ఒక ఓషధి తెచ్చి, ఎన్నాళ్ళుగా నయంకాని రాజగురువు కాలివ్రణాన్ని నయం చేస్తాడట!”


    “ఇందులో ఏదో మోసం వున్నది. అయినా, మనం రాజపుత్రులం కనక, ఈ అలగా జనం ఆడుకునే ఊసుకబుర్లలో తల దూర్చకూడదు.” అంటూ జయమల్లు కేశవుడికి సంజ్ఞచేసి, రచ్చబండ దగ్గిరవున్న జనంతో, “ఈ పల్లెలో పూటకూళ్ళ యిల్లు ఎక్కడో చెపుతారా?” అని అడిగాడు.


    ఆ ప్రశ్న వింటూనే ఒక వృద్ధుడు ముందుకు వచ్చి, “అయ్యా, పూటకూళ్ళ యిల్లు యీ దగ్గర్లోనే వున్నది. కాని, అక్కడ మీకు వసతి దొరకదేమో అని నా భయం. రాజుగారి ఆజ్ఞపత్రం తీసుకుని, బ్రహ్మదండి అనే ఒక ఘనవైద్యుడూ, అతడి అంగరక్షకు లిద్దరూ, ఈ రాత్రికి, అక్కడే దిగబోతున్నారని వార్త వచ్చింది," అన్నాడు.


    ఆ మాటలు వింటూనే కేశవుడూ, జయమల్లూ గతుక్కుమన్నారు. కాని, ముసలివాడు మాత్రం దండం పైకెత్తి, “అలాగా, సరే, చూద్దాం. దేశాటనకు బయలుదేరిన రాజకుమారులు పూటకూళ్ళ కొంపలోనే, రాత్రంతా గడపాలని ఎక్కడుంది? ఓయి, శిష్యులూ! రండి, నడవండి!" అంటూ ముందుకు కదిలాడు.

ఇంకా వుంది...

Post a Comment

Previous Post Next Post