రాకాసిలోయ (చందమామ)_11 RakasiLoya Janapada Novel by Dasari Subramanyam (CHANDAMAMA)

  RakasiLoya 1-35 Janapada Novel by Dasari Subramanyam (CHANDAMAMA)

రాకాసిలోయ (చందమామ)_11

 _దాసరి సుబ్రహ్మణ్యం

రాకాసిలోయ_11

    రాజగురువు పంపిన సైనికులూ, నగరంలోని ఉత్సాహవంతులైన యువకులూ కలిసి, క్షణాలమీద కనబడిన బిచ్చగాళ్లందర్నీ పట్టుకుని, రాజనగరు కేసి నడిపించుకు రాసాగారు. ఇలా దొరికిన వాళ్లల్లో కేవలం బిచ్చగాళ్ళేగాక, బీదా బిక్కాజనం కూడా వున్నారు. మాసిన దుస్తులు ధరించి వున్న వాళ్ళూ, చిరుగుల వస్రాల కట్టుకున్న వాళ్లూ కూడా బిచ్చగాళ్ళకిందే జమ కట్టబడటంతో, వాళ్ళ సంఖ్య వందలూ వేలూ దాటింది.


    రాజ ప్రాసాదం ఆవరణలో మందవేయబడిన వీళ్ళందర్నీ చూసి, రాజుగారు చాలా ఆశ్చర్యపడ్డాడు. తన రాజధాని నగరంలో కూటికీ గుడ్డకూ ముఖం వాచిన వాళ్ళు యింత మంది వున్నారని ఆయన ఏనాడూ ఊహించలేదు.


    రాజూ, రాజగురువూ, బ్రహ్మదండి మాంత్రికుడూ ఆవరణలోకి రాగానే, సైనికులు బిచ్చగాళ్ళనందర్నీ ఒక సోలుపుగా (ప్రక్కగా) నిలబెట్టారు. రాజుకూ, రాజగురువుకూ అక్కడ ఉన్నతాసనాలు ఏర్పాటు చేయబడినై, బ్రహ్మదండి పక్కగా నిలబడ్డాడు.


    “గురువర్యా, మన రాజ్యం సర్వసుభిక్షంగా వున్నదని, యింత కాలంగా భావిస్తున్నాను. కాని, వీళ్ళను చూస్తూంటే మన పరిపాలనలో ఏదో లోపం వున్నట్టు కనబడుతున్నది. మహామంత్రి ఒక్కసారైనా - కనీసం సూచన ప్రాయంగా కూడా, పరిస్థితులు యింత దారుణంగా వున్నట్టు నాతో అనలేదు.” అన్నాడు రాజు నిస్పృహపడుతూ.


    రాజగురువు చిరునవ్వు నవ్వుతూ, “మహారాజా! ఇందులో మంత్రిగారిని తప్పు పట్టేందుకు కేమీలేదు. ఈ దరిద్రులందర్నీ మన బొక్కసంలో వున్న ధనం వెచ్చించి పోషించటం సాధ్యమయే పనికాదు. యుద్ధాలూ జననష్టం లేకుండా ధనం సంపాయించే మార్గం ఒకటి కనబడుతున్నది,” అంటూ రాజుగారి చెవిలో రహస్యంగా, “ఈ బ్రహ్మదండిని ఉపయోగించుకుని, రాకాసిలోయలో వున్న ధనరాసులు కొల్లగొట్టే మార్గం ఆలోచించుదాం,” అన్నాడు.


    రాజుగారి ముఖం కళకళ లాడింది. ఆయన బ్రహ్మదండికేసి తలతిప్పి, “బ్రహ్మదండీ, నువ్వు యికనుంచయినా, దుష్టప్రవర్తన మానుకుంటే, నిన్ను క్షమించగలము,” అన్నాడు.


    ఈ మాటలు వింటూనే మాంత్రికుడు రాజుకు సాష్టాంగపడి, “మహారాజా, నేనెప్పుడూ మహారాజులుంగారి సేవకుడనే. దుష్టులు రేపిన పుకార్లు నమ్మి, నా రాజభక్తిని శంకించవద్దని ప్రార్థిస్తున్నాను. తమ బొక్కసాన్ని వెండి బంగారాలతో నింపేందుకే, నేను కాలభైరవోపాసన చేసి, రాకాసి లోయకు వెళ్ళే మార్గం....."


    బ్రహ్మదండి మాంత్రికుడు మాట ముగించక ముందే, రాజగురువు అందుకుని, “బ్రహ్మదండీ, ఆ లోయ సంగతులేవీ నువ్వు బహిరంగంగా మాట్లాడకూడదు. నీ రాజభక్తి సంగతి నే నెరగంది కాదు, జాగ్రత్త!” అన్నాడు కఠినంగా.


    బ్రహ్మదండి కుక్కిన పేనులా అయిపోయాడు. అంతలో సేనానాయకుడు అక్కడికి వచ్చి, వరసగా వున్న బిచ్చగాళ్ళందర్నీ ముందుకు నడవమన్నాడు. సైనికులు హెచ్చరించగానే బిచ్చగాళ్ళు కదిలారు. బ్రహ్మదండి వాళ్ళల్లో ప్రతి ఒక్కడి ముఖాన్ని పరీక్షగా చూస్తూ, “వీడు కాదు... ఉహుఁ, వీడూ కాదు! ఈ ముఖంలో జయమల్లు లక్షణాలున్నా, వాడు కొంచెం పొడుగు. వీడి ఆకారం కేశవుడి, ఆకారాన్ని పోలి వున్నట్టు కనిపిస్తున్నా, వీడిది కాస్త మెల్లకన్ను...వాడివి పులి కళ్ళు!" అంటూ వ్యాఖ్యానించసాగాడు.


    ఈ విధంగా బిచ్చగాళ్ళ పరీక్ష ఒక గంట కాలం పట్టింది. చివరకు వాళ్ళల్లో తమకు కావలసిన జయమల్లూ, కేశవుడూ లేరని తేలిపోయింది.


    “అసలీ పుకారు లేవనెత్తిందెవరు?" అని అడిగాడు రాజగురువు.


    “ఇది అడవిలోకి వెళ్ళిన మన నగరపౌరుల ద్వారా వ్యాపించింది. వాళ్ళకు అక్కడున్న ముసలివాడెవడో చెప్పాడట,” అన్నాడు సేనానాయకుడు.


    “వాడా - ఆ ముసలివాడు! వాడు కేశవుడి తండ్రి. వాడింత కపట విద్య తెలిసిన వాడని నేను నమ్మను. కేశవుడో, జయమల్లో ఈ కట్టుకథ కల్పించి వుంటారు. వాళ్లీ సరికే ఈ రాజ్యం సరిహద్దులు దాటిపోయినా, దాటిపోయి వుండవచ్చు,” అన్నాడు బ్రహ్మదండి కోపంగా.


    రాజగురువుకు అతడు చెప్పినదాంట్లో కొంత సత్యం వున్నట్టు తోచింది. బహుశా వాళ్ళిద్దరూ ఈ సరికి రాకాసిలోయ మార్గం పట్టి వుంటారు!


    రాజుగారూ, బ్రహ్మదండి మాంత్రికుడూ, రాజగురువూ తిరిగి రాజభవనంలో ప్రవేశించారు. సేనానాయకుడు బిచ్చగాళ్ళందర్నీ రాజప్రాసాద ద్వారాలు దాటించి నగరంలోకి తరిమి వేయించాడు. రాజూ, రాజగురువూ కలిసి రహస్య మంతనాలు ప్రారంభించారు.


    “మహారాజా, మనం ఈ సదవకాశాన్ని చేజారి పోనివ్వకూడదు. రాకాసిలోయలో వున్న వెండి బంగారాలను మనవిగా చేసుకోవలసిందే. ఆ విధంగా మీకూ, ప్రజల క్కూడా ఎంతో మేలు కలుగుతుంది. ఆ గుప్త ధనాన్ని సాధించే శక్తి ఒక్క కేశవుడికే వుందని, మాంత్రికుడు లోగడ చెప్పాడు. వాణ్ణి పట్టుకునేందుకే వాడు యింతకాలంగా ఆ కొండ మీద మాటు వేసుక్కూచున్నాడు. కేశవుడి భుజం మీద పడగ విప్పిన నల్లని పాము ఆకారం మచ్చ వున్నదట. దాని ద్వారా బ్రహ్మదండి తనకు కావలసిన యువకుడెవరో గుర్తించాడు." అన్నాడు రాజగురువు.


    “కాని, వాడు మోసగించి మన చేజారి పోయినట్టు కనబడుతున్నది," అన్నాడు రాజుగారు.


    “అందుకే మనం మోసాన్ని మోసంతోనే నిగ్రహించాలి. నాకో మంచి ఉపాయం తట్టింది. తమరు మరోలా అనుకోకపోతే, మనవి చేస్తాను.” అన్నాడు రాజగురువు.


    రాజుగారు అంగీకార సూచకంగా తలాడించాడు.


    “ఆ కేశవుడు వారం రోజుల లోపల నగరానికి వచ్చేట్టయితే, అర్థరాజ్యం యిస్తామని చాటింపు వేయించుదాం. ఆ గడువులోగా వాడు రాకపోతే, వాణ్ణి ప్రాణాలతో పట్టి తెచ్చిన వాళ్ళకుగాని, లేక తల నరికి తెచ్చిన వాళ్ళకుగాని ఒక చిన్న సామంత రాజ్యం యివ్వబడుతుందని ప్రకటిద్దాం. నా ఊహ--వాడు అర్థరాజ్యం దొరుకుతుందన్న ఆశతో తప్పక మన ఆ స్థానానికి వస్తాడని. ఆ తరవాత వాణ్ణి రాకాసిలోయలో ఎలా వుపయోగ పెట్టుకోవాలో నేనూ, బ్రహ్మదండి నిర్ణయిస్తాం," అన్నాడు రాజగురువు.


    అర్థరాజ్యం యిస్తామని వేసే చాటింపు కేవలం కేశవుణ్ణి దొరక పుచ్చుకునేందుకు ఆడే నాటకమే అని తెలిసిం తరవాత రాజుగారు అందుకు అంగీకరించాడు. ఆ వెంటనే బ్రహ్మపుర రాజ్యంలోని పల్లెల్లో, పట్టణాల్లో రాజాజ్ఞ ప్రకారం చాటింపు వేయబడింది.


    ఒకటి రెండు రోజులు గడిచీ గడవక ముందే, ఈ చాటింపు వార్త కేశవుడికీ, అతడి ముసలి తండ్రికీ, జయమల్లుకూ తెలిసింది. నగరవాసులు కొండ ప్రాంతాల నుంచి వెళ్ళిపోగానే, వాళ్ళు ముగ్గురూ ఒక కొండగుహలో చేరారు. ముందు కర్తవ్యాన్ని గురించి తర్జన భర్జనలు చేస్తున్నారు.


    “ఇందులో ఏదో పెద్ద మోసం వున్నది!” అన్నాడు ముసలివాడు.


    “అందుకు సందేహమా! కేశవుడు వెంట వుంటే తప్ప, ఆ రాకాసిలోయ లోని ధనరాసులు దొరకవు. అందుకు తగిన జాతకుడు కేశవుడే అని బ్రహ్మదండి, రాజగురువుకు చెప్పి వుంటాడు. అతడు మహా జిత్తులమారి," అన్నాడు జయమల్లు.


    “బహుశా, నన్ను కాళ్ళూ చేతులూ కట్టి, ఆ రాకాసిలోయకు మోసుకు పోవాలని వాళ్ళు పథకం వేసి వుంటారు. వాళ్ళ పనితీరిం తర్వాత నన్ను తప్పక కొరత వేస్తారు." అన్నాడు కేశవుడు కోపంగా.


    “ఆ ప్రమాదం యిప్పుడే ఎదురవబోతున్నది. నీ తల విలువ అర్థరాజ్యం , తెలిసిందా? కనక, మనం ఎంత త్వరగా, ఈ రాజ్యపు హద్దులు దాటిపోతే అంతమంచిది," అన్నాడు జయమల్లు.


    “ఈ రూపంలో మన నెవరైనా గుర్తిస్తారు. ఈసరికి ఈ చాటింపు వృత్తాంతం యితర రాజ్యాల వాళ్ళక్కూడా తెలిసి వుంటుంది. వాళ్ళు మాత్రం నన్ను గుర్తిస్తే బతకనిస్తారంటావా?" అన్నాడు కేశవుడు.


    కేశవుడి ముసలి తండ్రి పొందిన ఆదుర్దా అంతా యింతా కాదు. అతడు గుహలో నుంచి బయటికి వచ్చి, చుట్టూ కలయ చూసి, “డబ్బుకు ఆశపడిన నగర వాసుల్లో కొందరైనా మళ్ళీ యిక్కడికి వచ్చి, కొండ గుహలూ, కోనలూ వెతికే ప్రమాదం వున్నది. మీరు యిక్కణ్ణించి వెంటనే పారిపొండి,” అన్నాడు.


    “ఈ వేషాలతో లాభం లేదు. దేశాటనకు బయలుదేరిన ఏ క్షత్రియ యువకుల వేషాలో వేసుకుని, వింధ్యారణ్యాల్లోకి పారిపోవలసిందే. అందుకు అవసరం అయిన ధనం బ్రహ్మదండి మాంత్రికుడి గుహలో ఎక్కడ దాచబడి వున్నదో నాకు తెలుసు!" అన్నాడు జయమల్లు.


    “ఆ గుహను రాత్రింబగళ్ళు యిద్దరు సైనికులు కాపలా కాస్తున్నారు." అన్నాడు కేశవుడు. "ఆ యిద్దర్నీ మనం చంపి గుహలోకి వెళ్ళలేమా?” అని ప్రశ్నించాడు జయమల్లు.


    “సాధ్యమైనంత వరకు వాళ్లను చంపకుండానే గుహలోకి వెళ్ళవచ్చు. అంతా రహస్యంగా జరిగిపోవాలంటే, చీకటి పడేవరకూ వేచి వుండటం మంచిది,” అన్నాడు ముసలివాడు. అందుకు కేశవుడూ, జయమల్లూ, సరేనన్నారు.


    సూర్యాస్తమయమై బాగా చీకటి పడే వరకూ ముగ్గురూ వంతుల ప్రకారం తాము దాక్కుని వున్న గుహ ముందు కాపలా కాశారు. ఏ క్షణాన్నయినా, నగరవాసులు తమ గుహకేసి రావచ్చన్న భయం వాళ్లను చాలా బాధించింది. చీకటి పడి కొంచెం రాత్రి పొద్దు పోయిం తరవాత ముగ్గురూ, మాంత్రికుడి గుహకేసి బయలుదేరారు. రాళ్ళు చాటు చేసుకుని పిల్లుల్లా నిశ్శబ్దంగా గుహను సమీపించిన వాళ్ళను, గుహ ముందు కాపలా వున్న సైనికుడు గుర్తించలేదు. ముసలివాడు సైనికుడు నిలుచున్న చోటుకు దాపులలో వున్న రాయి చాటునుంచి, కత్తి ముందుకు చాచి సైనికుడి వెన్నుకు దాన్ని ఆనిస్తూ, “అరవకు! రెండో వాడెక్కడ!" అని ప్రశ్నించాడు మెల్లిగా.


    హఠాత్తుగా వెన్నును కత్తి మొన తాకగానే సైనికుడి పై ప్రాణాలు పైనే పోయినై. వాడు ఏమి చేయటమా అని ఆలోచించేంతలో కేశవుడూ, జయమల్లూ వాడి ముందుకు వచ్చి నిలబడి, “మా బందిపోట్ల నాయకుడు, మిమ్మల్నిద్దర్నీ చంపి, గుహలో వున్న ఒక వస్తువును తెమ్మన్నాడు. కాని, మాకు మిమ్మల్ని చంపాలని లేదు. మా పనేదో మేం చూసుకుపోతాం. నీ తోటి వాడెక్కడ?" అని అడిగారు.


    సైనికుడు నిలువు గుడ్లువేసి, గుహకు ఒక పక్కగా గుర్రు పెట్టి నిద్రపోతున్న, అను చరుణ్ణి చూపించాడు. మరుక్షణం కేశవుడూ, జయమల్లూ, ఆ నిద్రపోతున్న వాడి మీద పడి, వాడి కాళ్ళూ చేతులూ బంధించి ఒక మూల పడవేశారు.


    "కత్తి నా వెన్నులో గుచ్చుకుంటున్నది. మీ బందిపోటు స్నేహితుణ్ణి కత్తి తీయమనండి,” అంటూ ప్రాధేయపడ్డాడు మొదటి సైనికుడు. కానీ, ముసలివాణ్ణి సైనికులు గుర్తించటం ప్రమాదకరమని కేశవుడూ, జయమల్లూ ముందే నిశ్చయించుకున్నారు. తాము వింధ్యారణ్యాలు పట్టి పోయేవాళ్ళు, కాని ముసలివాడు ఈ ప్రాంతాల్లో ఎక్కడో ఒక చోట కొంతకాలం నివసించవలసి వుంటుంది.


    "ఆ బందిపోటు వాడి ముఖం చూశావంటే నువ్వు నిలువునా ప్రాణం వదులుతావు. వాడంత భయంకరుడు!" అంటూ కేశవుడూ,

జయమల్లూ కలిసి సైనికుడి కాళ్ళూ చేతులూ కట్టి, కళ్ళకు గంతలు కూడా బిగించారు.


    జయమల్లు గుహలో ప్రవేశించి, కొద్ది సేపటి తరవాత మశి కొట్టుకున్న దుస్తులతో బయటికి వచ్చాడు. అతడి చేతిలో ఒక సంచీ వున్నది. ఆ సంచీని అతడు అటూ యిటూ కదిలించేసరికి ఘల్లు ఘల్లుమన్న ధ్వని వినబడింది.


    “ఈ సంచీ నిండా బంగారు నాణాలే. బ్రహ్మదండి మాంత్రికుడు ఎందర్నో మోసగించి కూడబెట్టిన ధనం యిది. దీనితో మనం క్షత్రియోచితమైన దుస్తులూ, ఆయుధాలూ కొనుక్కోవచ్చు. ఇక బయలుదేరుదాం,” అన్నాడు జయమల్లు.


    ముగ్గురూ తిరిగి తమ గుహకు వచ్చేశారు. తెల్లవారగానే ఆ బంగారంలో కొంత ఖర్చు పెట్టి, అవసరమైన సామగ్రి కొనుక్కువచ్చేందుకు ముసలివాడు నగరానికి వెళతానన్నాడు. నగరంలో తననెవరూ గుర్తించకుండా మారువేషం వేసుకుంటానన్నాడు. కేశవుడూ, జయమల్లూ అంగీకరించారు.


    గుహలోని రాళ్లచాటున తను రహస్యంగా దాచుకున్న బంగారాన్ని జయమల్లు వెతికి వెలికి తీస్తూండగా, అక్కడ బ్రహ్మపుర రాజుగారి రాచనగరులో నిద్రిస్తున్న బ్రహ్మదండి మాంత్రికుడికి పీడకలలు వచ్చినై. ఎవడో దొంగ ఒకడు, తన బంగారం వున్న సంచీని, పైకి కిందికీ ఎగరవేస్తున్నట్టూ, అది ఘల్లు ఘల్లుమని గోల చేస్తున్నట్టూ వాడు కలగన్నాడు.


    “దొంగ, దొంగ! బంగారం, నా బంగారం!" అంటూ బ్రహ్మదండి మంచం మీంచి కిందికి దూకి వాకిలి కేసి పరిగెత్తసాగాడు. అక్కడ కాపలా వున్న భటుడు, ఈటెను మాంత్రికుడి గుండల కేసి గురిచేసి, "ఒక్కడుగు ముందుకు వేశావో, చంపేస్తాను!" అంటూ హెచ్చరించి, “రండి, రండి! బ్రహ్మదండి, పారిపోవాలని చూస్తున్నాడు!” అంటూ తన తోటి కాపలా భటుల్ని కేకవేశాడు.

ఇంకా వుంది...

Post a Comment

Previous Post Next Post