రాకాసిలోయ (చందమామ)_10 RakasiLoya Janapada Novel by Dasari Subramanyam (CHANDAMAMA)

RakasiLoya 1-35 Janapada Novel by Dasari Subramanyam (CHANDAMAMA)

రాకాసిలోయ (చందమామ)_10

 _దాసరి సుబ్రహ్మణ్యం

రాకాసిలోయ_10

    సేనానాయకుడు ముందుగా నగరంలోకి పంపిన, సైనికుడు, తప్పెటలూ, తాషా మార్పాలూ వాయించే కొందరిని వెంటబెట్టుకుని, నగరంలో చాటింపు వేయించాడు.


    చాటింపు వింటూనే జనం గుంపులు గుంపులుగా చేరి కేకలు పెడుతూ, ఆనందోత్సవాలు ప్రారంభించారు. చాలామంది బ్రహ్మదండి మాంత్రికుణ్ణి చూసేందుకు నగర ద్వారం దగ్గరకు వెళ్ళారు. ముందుగా ద్వారం దాటి నగరం ప్రవేశించినవాడు రాజగురువు. ఆయన శక్తిసామర్థ్యాల వల్లనే మాంత్రికుడు పట్టుబడ్డాడన్న వార్త విన్న ప్రజలు ఆయనకు గొప్పగా స్వాగతం యిచ్చారు. ఆయనకు చేతులెత్తి అందరూ జేజేలు పలికారు.


    కొద్దిసేపటి తర్వాత సేనానాయకుడూ, అతనికి వెనకగా కావడి బద్దకు వేలాడుతున్న మాంత్రికుడితో సైనికులూ నగర ద్వారం సమీపించారు. మాంత్రికుణ్ణి ఆ స్థితిలో చూసి, ప్రజలు అవహేళన చేస్తూ పెద్ద గోల ప్రారంభించారు. కొందరు మాంత్రికుణ్ణి శిగ పట్టుకుని అటూ యిటూ వూపారు. మరికొందరు వాణ్ణి తిడుతూ కొట్టబోయారు. సేనానాయకుడు వాళ్ళను వారిస్తూ, "మాంత్రికుడికి ఎలాంటి హానీ జరక్కూడదు. ఇది మహారాజు ఆజ్ఞ. వీడికి తెలిసిన ఒక రహస్యం వల్ల మన రాజ్యం సుభిక్షం కానున్నది. ప్రజలందరూ వెండి బంగారాల్లో మునిగితేలవచ్చు." అన్నాడు.


    బ్రహ్మదండి మాంత్రికుడు ప్రజలు చేసే కోలాహలం, వాళ్ళనే ఈసడింపు మాటలూ విని అవమానంతో, భయంతో, వణికిపోయాడు. రాకాసిలోయల్లో లభించనున్న సర్వ సంపదలతో రాజ్యాలే జయించాలనుకున్న బ్రహ్మదండి యిప్పటి తన నీచస్థితికి కళ్లవెంటనీరు కార్చసాగాడు. వాడు తనను చుట్టు ముట్టి దుర్భాషలాడుతున్న ప్రజలతో, "అయ్యలారా, నన్ను క్షమించండి, కరుణించండి! బుద్ది గడ్డి తినటం వల్ల, ఏవేవో పొరపాట్లు చేశాను.


    వింత జంతువు ఆకారం ధరించి, అడవిలో నానా భీభత్సం చేసినవాడూ, సేనానాయకుణ్ణి చంపినవాడూ, జయమల్లనే నా గాడిదమారి శిష్యుడు, నేను కాదు. చేతనయితే వాణ్ణి, వాడి వెంటవున్న కేశవుడనే గొడ్ల కాపరిని పట్టుకోండి," అంటూ బావురుమన్నాడు.


    బ్రహ్మదండి మాంత్రికుడు అన్న మాటలు విన్న ప్రజలు, సైనికులను జయమల్లు గురించి, కేశవుణ్ణి గురించి అడిగాడు. దానికి జవాబుగా సైనికులు ఆ ఇద్దరూ కొండల్లో ఎక్కడో కనిపించకుండా దాక్కున్నారని చెప్పారు. ఆ వెంటనే, కాస్త తెగింపూ, కొండంత ఉత్సాహమూ గల కొందరు యువకులు, కర్రలూ, ఈటెలూ తీసుకుని, అడవికేసి పరిగెత్తారు. 


    కేశవుడూ, అతని ముసలి తండ్రీ, జయమల్లూ, కొండల్లోని, ఏనుగుల కొలను దాటి అవతల వున్న అరణ్యం చేరారు. చెట్టు కొమ్మల్లో వుండి, బ్రహ్మపుర నగరానికేసి చూస్తున్న కేశవుడికి, కొందరు మనుషులు జట్లు జట్లుగా అడవిదార్ల వెంట బయలుదేరి, కొండకేసి రావటం కనిపించింది. తమకోసం కొండంతా గాలించిన బ్రహ్మపుర సైనికులు తలలు వాల్చుకుని కొండ దిగి నగరం కేసి పోతున్నారు.


    నగరం నుంచి వచ్చేవాళ్ళ చేతుల్లో వున్న కర్రలూ, ఈటెలూ చూస్తూనే కేశవుడు తమకు వాళ్ళ నుంచి ప్రమాదం రానున్నదని గ్రహించాడు. ఆ వెంటనే, అతడు చెట్టు దిగి వచ్చి, తన తండ్రికీ, జయమల్లుకూ, రానున్న ఆపదను గురించి చెప్పాడు.


    జయమల్లూ, ముసలివాడూ కూడా చెట్టు ఎక్కి చూశారు. వాళ్ళక్కూడా నగరం వైపు నుంచి వస్తున్న యువకులు కనిపించారు.


    ఆ ఇద్దరూ చెట్టు దిగి వచ్చారు. జయమల్లు కేశవుడితో, "సైనికుల కన్న, ఈ వచ్చే వాళ్ళు ఎక్కువ ప్రమాదకారులు. వీళ్ళు వందల సంఖ్యలో వస్తున్నారు. కనక వాళ్ళు మొత్తం కొండనూ, చుట్టూ వున్న అరణ్యాన్ని చుట్టుముట్టినా చుట్టు ముట్టవచ్చు. అలా జరిగితే, మనం చిక్కులో పడిపోతాం. ఇప్పుడు అరణ్యంలోపలి భాగానికి పారిపోయేందు క్కూడా మనకు అట్టే సమయం లేదు,” అన్నాడు.


    కేశవుడికి, ముసలివాడుక్కూడా అలాగే అనిపించింది. తాము బ్రహ్మపుర వాసులకు చిక్కితే, నానా కష్టాలపాలూ కావలసి వస్తుంది. రాజభటులకు చిక్కిపోయిన బ్రహ్మదండి మాంత్రికుడు తమ మీద పగబట్టి వున్నాడు. హఠాత్తుగా ముసలివాడికి ఒక ఉపాయం తోచింది. అతడు కేశవుడితో, జయమల్లుతో యిలా అన్నాడు.


    “నన్ను ఏవైనా అడవి తీగలు తెచ్చి కాళ్ళూ చేతులూ కట్టి, ఆ కనబడే రాతిమీద పడుకోబెట్టండి. మీరు వెంటనే బాగా అరణ్యం లోపలికి పారిపొండి. మన కోసం వెతక వస్తున్న వాళ్ళకు మీరు దొరకకుండానే చూస్తాను."


    ఇందుకు కేశవుడు ఒప్పుకోలేదు. జయమల్లు కూడా అభ్యంతరం చెప్పాడు. రాజగురువు లోగడ ముసలివాణ్ణి చూసి వున్నాడు గనక, బ్రహ్మదండి మాంత్రికుడి శిష్యులు పారిపోయేందుకు సహాయపడ్డాడన్న కారణం చెప్పి, అతణ్ణి శిక్షించగలడని వాళ్ళు నమ్మారు. కాని, ముసలివాడు పట్టుపట్టాడు. ముగ్గురు శత్రువులకు దొరికిపోయేకన్న, కనీసం ఇద్దరయినా సురక్షితంగా వుండటం మేలుకాదా? అన్నాడు.


    "నన్ను, మీ యిద్దరూ పట్టుకుని కాళ్ళూ చేతులు కట్టి పడవేసి పారిపోయారని చెపుతాను. ముసలివాణ్ణి! నా మాట వాళ్ళేందుకు నమ్మరు?" అని ప్రశ్నించాడు కేశవుడి తండ్రి. చివరకు ముసలివాడి బలవంతం మీద చేసేదేమీ లేక, జయమల్లు అతణ్ణి అడవి తీగలతో కాళ్ళూ చేతులూ కట్టి, ఒక ఎత్తయిన రాతి మీత పడుకోబెట్టాడు. తరవాత కేశవుడూ, తనూ ప్రమాదం తొలగగానే, వచ్చి కలుసుకుంటామని చెప్పి, అరణ్యం లోపలికి పరుగు తీశారు.


    కొద్ది సేపటికల్లా, బ్రహ్మపుర నగర వాసులు కొండలూ గుట్టలూ గాలిస్తూ చేసే కోలాహలం ముసలివాడు విన్నాడు. అతడు గొంతెత్తి బిగ్గరగా, “రక్షించండి! రక్షించండి!" అంటూ కేకలు పెట్టాడు.


ఆ కేకలు వింటూనే బ్రహ్మపురం వాళ్లు కొందరు కర్రలూ, ఈటెలూ ఊపుకుంటూ అక్కడికి వచ్చి ముసలివాణ్ణి చూసి ఆశ్చర్యపోయారు. “అయ్యా, నా కట్లు విప్పి కాపాడండి.


    మీరు మాంత్రికుడి శిష్యుల కోసం కొండ కోనలన్నీ గాలిస్తున్నారని నాకు తెలుసు. వాళ్ళే నాకీ దుస్థితి కలిగించారు,” అన్నాడు.


    ఆ వెంటనే నలుగురైదుగురు యువకులు ముసలివాడి కట్లు విప్పసాగారు. కొందరు, “వాళ్ళెటు పోయారు? అరణ్యంలోనే దాక్కున్నారా?" అని ప్రశ్నించారు.


    “అయ్యా, వాళ్ళు కాలాంతకులు, పులికి తెలియకుండా దాని పాలు పితికే రకం. మీరు వాళ్ళ కోసం అరణ్యాలన్నీ గాలిస్తారని గ్రహించి, బిచ్చగాళ్ళలాగా వేషాలు మార్చుకుని, బ్రహ్మపురం కేసే పరిగెత్తారు,” అన్నాడు ముసలివాడు.


    అక్కడ చేరిన వాళ్ళంతా ఔరా అని ముక్కులమీద వేళ్ళు వేసుకున్నారు. వాళ్ళల్లో బాగా తెలివిగలవాజ్ఞనుకునే ఒకడు. “భలే మోసం! మనం ఎక్కడైతే వాళ్ళ కోసం వెతకమో అక్కడికే వెళ్ళారన్న మాట! రాజద్రోహులని తెలిసిపోయిన తరవాత ఎవరైనా నగరం వదిలి అరణ్యాల్లోకి పారిపోతారు. వీళ్ళు అరణ్యాలు వదిలి నగరంలోకి పారిపోయారు! అందువల్లనే వాళ్ళు మన సైనికులకు దొరకలేదు!" అన్నాడు.


    ఈ విధంగా ముసలివాడి మాటల్లో అందరికీ నమ్మకం కుదిరిపోయింది. వెంటనే వాళ్ళు, జట్లు జట్లుగా అన్ని వైపులకూ పరిగెత్తుతూ, “ఓహెూ! మాంత్రికుడి శిష్యులిద్దరూ బిచ్చగాళ్ళ వేషాలు వేసుకుని నగరం కేసి పారిపోయారో హెూ!" అంటూ కేకలు పెట్టారు.


    వెంటనే జనం నగరంలో వున్న బిచ్చగాళ్ళందర్నీ దొరక పుచ్చుకునేందుకు నగరం కేసి పరిగెత్తారు.


    బ్రహ్మదండి మాంత్రికుడి శిష్యుల వేటకు బయలుదేరిన ప్రజలు తిరిగి నగరంలోకి గుంపులు గుంపులుగా వస్తూండగా, రాచనగరులో బ్రహ్మదండి మాంత్రికుడు రాజుగారి ముందు చేతులు కట్టుకు నిలబడి, తనకు ప్రాణభిక్ష పెట్టవలసిందిగా ఆయన్ని బతిమాలు కుంటున్నాడు.


    రాజుగారూ, రాజగురువూ, మంత్రీ, సేనా నాయకుడూ మాంత్రికుణ్ణి ప్రశ్నించి రాకాసిలోయ రహస్యమేదో తెలుసుకోవాలని చూస్తున్నారు కాని, ముందుగా తనకు ప్రాణహాని జరగదని అభయం యిస్తేతప్ప, తను ఆ రహస్యం చెప్పనని మాంత్రికుడు పట్టుపడుతున్నాడు.


    “నీకేమి ప్రాణాపాయం కలగదని రాజుగారి పక్షంగా నేను అభయం యిస్తున్నాను.” అన్నాడు రాజగురువు. రాజు అంగీకార సూచకంగా తలాడించాడు.


    రాకాసిలోయలో ఏవో అపూర్వ ధనరాసులున్నవని నువ్వు చెప్పేమాట నిజమా? నిజమైతే అందుకు రుజువేమి చూపిస్తావు?” అని అడిగాడు రాజగురువు, మాంత్రికుణ్ణి.


    “రుజువా? రాజగురు చూడామణి! ఉపాసకుల ఊడల మర్రి, ఉన్మత్త భైరవుడూ స్వయంగా ప్రత్యక్షమై చెప్పగా, ఈ చెవులతో విన్నాను. అంతకన్న రుజువేమి కావాలి?" అన్నాడు బ్రహ్మదండి మాంత్రికుడు.


    “ఆ మాటలు నమ్మదగినవేనా?" అని ప్రశ్నించాడు రాజగురువు.


    “భైరవా, భైరవా! పాపం హరించుగాక!" అంటూ మాంత్రికుడు రెండు చెవులూ మూసుకుని, “ఇరవైయ్యేళ్ళుగా, ఆ భైరవేంద్రుణ్ణి ప్రత్యక్షం చేసుకునేందుకు నిష్ఠతో ఉపాసన చేశాను. ఆఖరుకు, ఆ రాకాసిలోయ చేరేందుకు తోడ్పడవలసి వున్న జాతకుణ్ణి కూడా పట్టుకున్నాను. తమరు నా మాటల్లో నమ్మకం వుంచకపోతే, యిక నాకా కాలభైరవుడి పాదచతుష్టయమే శరణ్యం!" అంటూ భక్త్యావేశంలో ముందుకు పడిపోయాడు.


    “గురువర్యా, వీడు దుష్టుడైనా, గొప్ప భక్తుడిలా వున్నాడు,” అంటూ రాజు ఆశ్చర్యం కనబరిచాడు. అంతలో ద్వారం వద్ద కలకలం బయలుదేరింది. సేనానాయకుడు అక్కడికి వెళ్ళాడు. ఇద్దరు సైనికులు రొప్పుతూ రోస్తూ, అతడి ముందుకు వచ్చి నిలబడ్డారు. వాళ్ళను చూస్తూనే రాజగురువు చేయి వూపి, "లోపలికి రండి! ఏమిటి విశేషం?” అని అడిగాడు.


    “అయ్యా, నగరంలోని యువకులు, కనపడిన బిచ్చగాణ్ణల్లా పట్టుకుని, 'నువ్వు మాంత్రికుడి శిష్యుడివేనా, నిజం చెప్పు?' అని గొడ్లను బాదినట్టు బాదుతున్నారు. అడ్డం పోయిన మా మీద కూడా వాళ్ళు కర్రలెత్తుతున్నారు," అని చెప్పారు. సైనికులు.


“ఏమిటీ వింత?" అంటూ రాజు, సేనాని కేసి చూశాడు.


    “బ్రహ్మదండి శిష్యులిద్దరూ, బిచ్చగాళ్ల వేషాలు వేసుకుని, నగరంలో తిరుగుతున్నారని ఒక పుకారు పుట్టింది. అందులో వున్న నిజమెంతో తెలీదు,” అన్నాడు సేనానాయకుడు.


    రాజగురువు బోర్లా పడివున్న మాంత్రికుణ్ణి కాలితో తన్ని, "బ్రహ్మదండీ, లేలే, విన్నావా ఈ పుకారు! బిచ్చగాళ్ళ వేషంలో వున్న, నీ శిష్యుల్ని గుర్తు పట్టగలవా?" అని ప్రశ్నించాడు.


    బ్రహ్మదండి మాంత్రికుడు చప్పున లేచి నిలబడుతూ, "గురు ప్రభో! వాళ్ళను బిచ్చగాళ్ళ వేషంలో కాదు, మహారాజుల వేషంలో వున్నా గుర్తుపట్టగలను,” అన్నాడు ధీమాగా, అప్పటివరకూ నోరు మెదపకుండా వున్న మంత్రి, “అయితే, మహారాజా! నగరంలో వున్న బిచ్చగాళ్ళందర్నీ పట్టుకుని యిక్కడికి తెప్పించమన్నారా?" అని అడిగాడు. రాజు గారు సరే నన్నట్టు తల వూపాడు. మంత్రి సేనానాయకుడూ గది నుంచి బయిటికి వెళ్ళారు. వాళ్ళ ఆజ్ఞ కాగానే సైనికులు బిచ్చగాళ్లందర్నీ వెతికి పట్టుకు వచ్చేందుకు, నగరంలోని అన్ని వీధులకూ పరిగెత్తారు.

ఇంకా వుంది...

Post a Comment

Previous Post Next Post