రాకాసిలోయ (చందమామ)_09 RakasiLoya Janapada Novel by Dasari Subramanyam (CHANDAMAMA)

 RakasiLoya 1-35 Janapada Novel by Dasari Subramanyam (CHANDAMAMA)

రాకాసిలోయ (చందమామ)_09

 _దాసరి సుబ్రహ్మణ్యం

రాకాసిలోయ_09

    చమురుతో బాగా తడిసిన ఎండుపుల్లలూ, ఆకలములూ క్షణాల మీద నిప్పంటుకుని పెద్ద జ్వాలలతో బిల మార్గాన్ని కప్పివేసినై. చూస్తూండగానే నల్లని పొగ గుహనంతా ఆక్రమించింది. రాజగురువూ, సేనానీ, సైనికులూ గుహ బయిటికి పరిగెత్తారు.


    “గురువర్యా, మీరన్నట్టు మాంత్రికుడు బిలంలో ఎక్కడో దాక్కుని వుంటాడు. వాడు తప్పక ఈ మంటల్లో పడి ఆహుతి అవుతాడని నా భయం,” అన్నాడు సేనాని.


    రాజగురువు గుహలో మరింతగా కమ్ముకుంటున్న పొగకేసి చూస్తూ, “వాడు అంత తేలిగ్గా చచ్చేరకం కాదు. వాడికి ఆ బిలంలో నుంచి బయటపడేందుకు మరోమార్గం తప్పకుండా వుంటుంది. వాడెక్కడో ఒక చోట కొండ మీదికి తేలుతాడు. సైనికుల్ని కాపుంచి, వాడు తల బయటపెట్టగానే పట్టుకోమని ఆజ్ఞాపించు,” అన్నాడు.


    రాజగురువు యిలా మాట్లాడుతున్న సమయంలో బ్రహ్మదండి మాంత్రికుడు మచ్చల సింహం గుహ వెనక భాగానికి చేరి, తన శిష్యుణ్ణి పిలుస్తున్నాడు. వాడు తన మంత్రదండంతో ఎన్నిసార్లు రాతిమీద కొట్టినా జయమల్లు దానికి అడ్డంగా వున్న ఇనపకమ్మిని తొలిగించి, అతడికి మార్గం యివ్వలేదు.


    బ్రహ్మదండి మాంత్రికుడివి, పాము చెవులు. వాడు గుహలో తన శిష్యుడూ, కేశవుడూ మెల్లిగా మాట్లాడుకుంటూ వుండటం పసిగట్టాడు. తను చేసిన శబ్దం వాళ్ళకు వినబడిందనీ, కాని వాళ్ళు తనను గుహలోకి రానివ్వదలచలేదనీ వాడు గ్రహించాడు. “హుఁ, యిదా మీ ఎత్తుగడ! నన్ను బ్రహ్మపుర సైనికులకు బందీనిచేసి, రాకాసి లోయలోవున్న అమూల్య సంపదలను దొంగిలించాలని చూస్తున్నారా? పిల్లకాకి కేమి తెలుసు ఉండేలు దెబ్బ!” అని మనసులో అనుకుంటూ, మంత్రదండాన్ని ఎత్తి రాతిమీద బలంగా కొట్టి, “ఒరే ద్రోహి, శిష్యా! నువ్వూ, ఆ గొడ్లకాపరీ గుహలోవున్నారని నాకు తెలియదను కుంటున్నావా? నా మంత్రశక్తితో మిమ్మల్నిద్దర్నీ ఈ క్షణాన భస్మీపటలం చెయ్యమంటారా, రాతిని పక్కకు జరుపుతారా?" అని కేక పెట్టాడు.


    ఆ కేక వింటూనే కేశవుడూ, జయమల్లూ కూడా ఉలిక్కిపడ్డారు.


    జయమల్లు అంతలోనే తేరుకుని, "కేశవా, ఆ దుర్మార్గుణ్ణుంచి మన కెలాంటి ప్రమాదమూరాదు. బ్రహ్మపుర సైనికుల వెంట వచ్చిన ఒకడు వాడి మంత్రశక్తిని హరించి, ఎప్పుడో నోరు కట్టేశాడు. వాణ్ణి సైనికులు తప్పకుండా పట్టుకుంటారు. మనం యిక్కడ దాక్కున్నా మనేది బ్రహ్మదండి గాడికి తెలిసిపోయింది గనక, వాడు పగ సాధించేందుకు, మననీ సైనికులకు పట్టిస్తాడు. కనక, మనం యిక్కణ్ణించి పారిపోవాలి,” అన్నాడు.


    జయమల్లు చెప్పింది కేశవుడికి సవ్యంగానే కనబడింది. కాని, అన్ని వైపులా సైనికులు తమ కోసం గాలిస్తుండగా పారిపోవటం ఎలా?


    హఠాత్తుగా గుహ వెనక భాగాన్నుంచి బ్రహ్మదండి పెద్దగా దగ్గిన ధ్వనీ, ఆ వెంటనే, “అయ్యో, నా ఉగ్రభైరవుణ్ణి పునాదినుంచి పెళ్ళగించి అవతల పారేశారా? ఏమిటీ పొగ? చచ్చాను, చచ్చాను! బిలంలో నుంచి బయటపడవలసిందే! రాజభటులకు చిక్కి నానా హింసలూ పడవలసిన యోగం రాసిపెట్టి వున్నది. హాఁ రక్షకా, కాలభైరవా!" అంటూ కేకలు పెట్టటం కేశవుడూ, జయమల్లూ విన్నారు.


    "సైనికులు బిలమార్గాన ఏదో ఊదర పెట్టి, బ్రహ్మదండిగాణ్ణి ఎలుకను కలుగులోంచి లాగినట్టు లాగబోతున్నారు,” అన్నాడు జయమల్లు.


    “ఒరే ద్రోహీ, శిష్యా! నీ మాటలన్నీ నాకు వినబడటం లేదనుకున్నావా?" అంటూ బ్రహ్మదండి పెద్దగా హుంకరించి, తెరలు తెరలుగా దగ్గుతూ, “ఈ బిలం లోంచి కొండ మీదికి వెళ్ళే మార్గం నాకు తెలుసు. అలా వెళ్ళితే నన్ను సైనికులు తప్పకుండా పట్టుకుంటారు. ఇక్కడ పొగలో చిక్కి ఊపిరాడక చచ్చేకన్న, అదే కొంత నయం. కాని, సైనికులకు మీరెక్కడ దాక్కునివున్నారో చెప్పి, మిమ్మల్ని వాళ్ళచేత చిత్రవధ చేయిస్తాను," అన్నాడు.


    ఆ వెంటనే మాంత్రికుడు గుహ వెనక భాగాన్నుంచి వెళ్ళిపోతున్న సూచనగా, కాళ్ళచప్పుడు వినిపించింది. జయమల్లుకు బ్రహ్మదండి అన్నంతపనీ చేస్తాడన్న భయం కలిగింది. అతడు కేశవుణ్ణి కూచున్న చోటునే వుండమని చెప్పి, గుహద్వారం దగ్గరకు వచ్చి బయిటికి తొంగిచూశాడు. అతడి దృష్టికి దూరంగా ఎక్కడో ఒక సైనికుడు ఒక బండరాతి మీద నిలబడి వుండటం కనిపించింది. వాడు గుహ కేసి కాక మరోవైపుకు చూస్తున్నాడు.


    జయమల్లు చప్పున గుహలోకి, వెళ్ళి, "కేశవా, మనం పారిపోవాలంటే యిదే మంచి అదనులాగా కనబడుతున్నది. బ్రహ్మదండి, సైనికులకు మనం దాక్కున్న చోటు చెప్పేస్తాడు." అన్నాడు.


    కేశవుడు చప్పున లేచి నిలబడి జయమల్లు వెంట గుహద్వారం దగ్గరకు వచ్చాడు. అంతలో దూరం నుంచి పెద్ద కలకలం వినబడింది. బ్రహ్మదండి మాంత్రికుడి గొంతు కంచులా మార్మోగుతున్నది. సైనికులు కేకలు పెడుతున్నారు. కేశవుడూ, జయమల్లూ ఓ తృటికాలం నిశ్చేష్టులై ఏమి చెయ్యటమా అని ఆలోచించేంతలో, చేత కత్తిపట్టుకుని ఒక వృద్ధుడు రాళ్ళచాటు నుంచి బయిటికి వచ్చి, గుహ ముందున్న మచ్చల సింహాన్ని చూస్తూనే టక్కున నిలబడిపోయాడు.


    “ఇడుగో, మీ అయ్య, కేశవా!” అన్నాడు జయమల్లు, కేశవుడు ఆశ్చర్యంగా తండ్రి కేసి చూశాడు. జయమల్లు చెయ్యి ఊపుతూ, “సింహం నిన్నేమీ చెయ్యదు, భయంలేదు, రా,” అంటూ పిలిచాడు. కేశవుడి ముసలితండ్రి చుట్టూ ఓ మారు కలయచూసి, రాళ్ళ చాటుగా నక్కుతూ గుహకేసి రాసాగాడు.


    దూరంగా అప్పటివరకూ పెద్దగా మంత్రం పఠిస్తున్న బ్రహ్మదండి మాంత్రికుడి గొంతు చప్పున ఆగిపోయింది. అతడికి ఎదురుగా రాజగురువు కనిపించి, కమండలం లోంచి యింత నీరు తీసి గాలిలోకి విదిలిస్తున్నాడు. అది చూస్తూనే మాంత్రికుడికి నోరు నొక్కుకుపోయినట్టయింది. “హాఁ, కాలభైరవా, నువ్వే నాకు దిక్కు" అంటూ బ్రహ్మదండిని వున్న చోటనే కుప్పగా కూలిపోయాడు.


    “కాలభైరవుడికే దిక్కులేక, రెండుగా ముక్కలై గుహలో పడివున్నాడు. ఇంతకూ నీ పేరేమిటి, మాంత్రిక శిరోమణి!” అంటూ రాజగురువు చిరునవ్వు నవ్వుతూ బ్రహ్మదండిని సమీపించాడు.

రాజగురువునూ, అతడి వెనక కత్తులు పట్టివున్న సైనికులనూ చూస్తూనే బ్రహ్మదండి మాంత్రికుడు ప్రాణభయంతో విలవిలలాడాడు. "మహరాజా, నా పేరు బ్రహ్మదండి మాంత్రికుడు," అన్నాడు తడబడుతూ.


    “నువ్వు చాలా గొప్ప మాంత్రికుడవనుకున్నాను! రాజెవరో, రాజగురువెవరోకూడా గ్రహించలేనంత బుద్దిహీనుడివా?" అంటూ రాజగురువు మాంత్రికుడి తలమీద శిగపట్టి పైకి లేవనెత్తాడు.


    "మహాఘనత వహించిన రాజగురు శేఖరులు నన్ను కాపాడాలి. నేను మీ దాసానుదాసుణ్ణి!" అంటూ బ్రహ్మదండి ప్రాణభయంతో వణికి పోసాగాడు.


    "ఏ ప్రయోజనం ఆశించి నువ్వు అడవిలో బ్రహ్మపురసేనానిని చంపావ్?" అంటూ రాజగురువు బ్రహ్మదండి శిగ గుప్పెటలో బిగించి అటూ యిటూ ఊపాడు.


    “రాజగురుశ్రేష్ఠా! సేనానిని చంపింది నేను కాదు, నా శిష్యుడు. వాడు గురుద్రోహి, నేను వద్దని ఎంత వారించినా వినక, సేనానిని హత్య చేశాడు,” అన్నాడు బ్రహ్మదండి.


    శిష్యుడన్నమాట వింటూనే రాజగురువు మాంత్రికుడి శిగపట్టు విడిచి, “అన్నట్టు వాళ్ళ మాటే మరిచాను. నీ యిద్దరు శిష్యులూ ఎక్కడ? ఊఁ చెప్పు?" అంటూ కళ్ళురిమాడు.


    “రాజగురు శిఖామణి! వాళ్ళల్లో ఒకడే నాశిష్యుడు, రెండోవాడు అడవిలో గొడ్లను కాచుకునే మూర్చుడు. వాళ్ళిద్దరూ కలిసి ఈ ప్రాంతాల చేయని కిరాతకం అంటూ లేదు." అన్నాడు బ్రహ్మదండి మాంత్రికుడు.


    "నే నడిగింది వాళ్ళెక్కడ దాక్కుని వున్నారని? నువ్వు వాళ్ళు చేసిన కిరాతకాల మాట చెపుతున్నావ్. శిష్యులు చేసిన అపచారాలకు బాధ్యత గురువుదన్న సంగతి నాకు తెలుసు. వాళ్లెక్కడ?" అంటూ రాజగురువు, మాంత్రికుణ్ణి గద్దించాడు.


    “రాజగురు చూడామణీ! ఆ ద్రోహులిద్దరూ మచ్చల సింహం గుహలో దాక్కుని వున్నారు. వాళ్ళను వెంటనే పట్టి బంధించకపోతే రాకాసిలోయకు వెళతారు. నా గాడిదమారి శిష్యుడు జయమల్లుకు, ఆ రాకాసిలోయ గురించి సర్వం తెలుసు. వాడు దొంగచాటుగా వుండి, కేశవుణ్ణి పూనిన కాలభైరవుడు చెప్పిందంతా విన్నాడు,” అన్నాడు బ్రహ్మదండి.


    రాకాసిలోయ అన్న పేరు వింటూనే రాజగురువు ఆశ్చర్యపడ్డాడు. అలాంటి పేరు లోగడ అతడెన్నడూ విని వుండలేదు. మాంత్రికుడు కొండమీద చేరి కాలభైరవుణ్ణి ఉపాసించటానికి, సేనాని హత్యకూ - వీటన్నిటికి వెనక ఈ రాకాసిలోయ కథ ఏదో వున్నదని ఆయనకు తెలిసిపోయింది.


    రాజగురువు యిలా ఆలోచించి, తన వెంటవున్న సైనికులతో మాంత్రికుడు చెప్పిన గుర్తుల ఆధారంతో మచ్చలసింహం గుహలో వున్న కేశవుణ్ణి,  జయమల్లునూ పట్టుకు రమ్మన్నాడు. సైనికులు అటుకేసి పరిగెత్తారు. వాళ్ళకు ముసలివాడితో కలిసి వెళుతున్న కేశవుడూ, జయమల్లూ కనిపించారు. సైనికులు పైన రాళ్ళగుట్టలమీద వుండి, కింద నడుస్తున్న ముసలివాడితో, “ఏయ్ ముసలీ! వాళ్ళ నెక్కడికి తీసుకుపోతున్నావ్?" అని కేకవేశారు.


    ఆ కేక వింటూనే కేశవుడి ముసలితండ్రి ఏ మాత్రం తొట్రుపాటు చూపించక, “నేను ఈ దుర్మార్గుల్ని తీసుకుపోవటం లేదు. రాజగురువు వద్దకు అడ్డదారిన తీసుకు వస్తున్నాను. నాకొచ్చే బహుమానం కాజెయ్యాలని వుందేమో, జాగర్త! మీ దారిన మీరు పొండి,” అంటూ పెద్దగా అరిచాడు.


    “ఈ చావబోయే వయసులో కూడా ముసలివాడికి డబ్బంటే ఎంత ఆశ!" అనుకుంటూ సైనికులు వెనుదిరిగి రాజగురువు దగ్గరకు బయలుదేరారు.


    రాజగురువుకు రాకాసిలోయను గురించిన సంగతి సందర్భాలు తెలుసుకోవాలని వున్నా, అది శిష్యులు కూడా దొరికిన తరవాత బ్రహ్మదండిని వాళ్ళ ఎదట ప్రశ్నించటం మంచిదనుకున్నాడు. అప్పుడు వాడు అబద్దాలు చెప్పేందుకు అవకాశం వుండదు.


    రాజగురువు అన్నిటికన్న ముందుగా బ్రహ్మదండి మాంత్రికుడి గర్వం అణచాలని నిశ్చయించుకున్నాడు. ఆయన సేనానాయకుణ్ణి పిలిచి, “ఈ బ్రహ్మదండిని కాళ్ళూ చేతులూ బిగించి, అడవి పందిని వేలాడ కట్టినట్టు కావడికర్రకు వేలాడకట్టి మన సైనికుల చేత నగర ద్వారం వద్దకు మోయించుకురావాలి. ఒక సైనికుణ్ణి ముందుగా నగరంలోకి పంపి, పౌరలందరికీ మాంత్రికుడు పట్టుపడిన కారణంగా, ఈరోజు పర్వదినమని చాటింపు వేయించాలి. ఎందుకైనా మంచిది, యిద్దరు సైనికుల్ని వీడి గుహకు పగలూ రాత్రికూడా కాపలా వుంచు,” అన్నాడు.


    రాజగురువు ఆజ్ఞ వింటూనే సైనికులు బ్రహ్మదండి మాంత్రికుణ్ణి పట్టుకుని తాళ్ళతో కాళ్ళూ చేతులూ కట్టేశారు. తరవాత ఒక లావుపాటి కర్రతెచ్చి, దానికి వాణ్ణి అడ్డంగా వేలాడకట్టి, కర్రచివరల్ను ఇద్దరేసి చొప్పున భుజాన వేసుకుని కొండ దిగువకు బయలు దేరారు. బ్రహ్మదండి మాంత్రికుడు కర్ర ఊపుకు అటూ యిటూ ఊగుతూ, “అయ్యో, ఉపాసకుల ఊడలమర్రీ, ఉన్మత్త భైరవా! నా కెంత అవమానం తెచ్చి పెట్టావోయీ," అంటూ విలపించ సాగాడు.


    రాజగురువు చిరునవ్వు నవ్వుతూ కొండ దిగువున చెట్టుకు కట్టేసివున్న తన గుర్రం కేసి నడిచాడు.

ఇంకా వుంది...

Post a Comment

Previous Post Next Post