RakasiLoya 1-35 Janapada Novel by Dasari Subramanyam (CHANDAMAMA)
రాకాసిలోయ (చందమామ)_08
రాకాసిలోయ_08
కొండ ఎక్కుతున్న బ్రహ్మపుర సైనికుల్లో ఒకడు, కేశవుడూ, జయమల్లూ గుహ నుంచి బయటికి రావటం చూశాడు. వాడు రాజగురువుతో, “అయ్యా, గుహలో వున్నది ఒకడు కాదు, ఇద్దరు మాంత్రికులు, అదిగో చూడండి!" అంటూ గుహ కేసి చేయి చూపాడు.
సైనికుడలా చెప్పగానే రాజగురువుతో పాటు, కేశవుడి ముసలితండ్రి కూడా అటుకేసి చూశాడు. అతడికి ప్రాణం లేచివచ్చి నట్టయింది. తన కొడుకు బతికే వున్నాడు! తను భయపడ్డట్టు, మాంత్రికుడు అతడికేమీ హాని చెయ్యలేదు.
రాజగురువు, పారిపోతున్న కేశవుణ్ణి, జయమల్లునూ చూస్తూనే, “వాళ్లు మాంత్రికులు కాదు, వాడి శిష్యులై వుంటారు. మాంత్రికుడు ఈ సరికే గుహ నుంచి మరోమార్గాన పారిపోయివుంటాడు. లేదా, అక్కడే వాడికి దాక్కునేందుకేదైనా రహస్య ప్రదేశం వుండి వుంటుంది. వాడి శిష్యుల్ని కూడా మనం చేజిక్కించుకోవాలి. మీరు అన్ని వైపుల నుంచీ చుట్టు ముట్టండి,” అని సైనికుల నాజ్ఞాపించాడు.
గుంపుగా నడుస్తున్న సైనికులందరూ, రాజగురువు ఆజ్ఞ వింటూనే జట్లు జట్లుగా చీలిపోయి, వలయాకారంగా కొండ మీదికి ఎక్కసాగారు. పారిపోతున్న కేశవుడూ, జయమల్లూ వాళ్లను చూసి, ఎటు పారిపోవాలో తెలియక తికమకపడ్డారు.
"సైనికులు అన్ని వైపుల నుంచి మనను చుట్టుముట్టి పట్టుకోవాలని చూస్తున్నారు. వాళ్ల కంట బడకుండా పారిపోవటం ఎలా?” అన్నాడు కేశవుడు.
"నేనూ అదే ఆలోచిస్తున్నాను,” అంటూ జయమల్లు ఓ క్షణం ఆగి, “మనం ఒకటి చేద్దాం. ఈ సైనికులు వెన్నంటి వుండగా, కొండ దిగి అడవిలోకి పోగలగటం సాధ్యమయేది కాదు. మనం యిక్కడే ఏదైనా చీకటి గుహలో జొరపబడి దాక్కుందాం," అన్నాడు.
“మనను పట్టటానికి బయలుదేరిన వాళ్ళు, ఈ చుట్టుపక్కల వున్న గుహలూ, గుట్టలూ, పుట్టలూ వెతక్కుండా వూరుకుంటారా? ఏమైతేనేం మనం, మాంత్రికుడి గుహలో నుంచి బయటికి రావటం బ్రహ్మపుర సైనికులు చూడటంతో, చిక్కులో పడ్డాం," అన్నాడు కేశవుడు.
“నువ్వంత నిస్పృహ పడకు, కేశవా, మనం రాజభటులకు దొరక్కుండా దాక్కు నేందుకు శాయశక్తులా ప్రయత్నిద్దాం. ఒకవేళ దొరికామో, ప్రాణాపాయం రాకుండా బయటపడే మార్గం నేను ఆలోచించే వున్నాను,” అన్నాడు జయమల్లు.
జయమల్లేదో పెద్ద ఎత్తుగడ ఒకటి ముందే ఆలోచించి వుంచాడని కేశవుడు అర్థం చేసుకున్నాడు. అయితే, అదేమిటో అడుగుదామని కేశవుడు అనుకునే లోపలే, జయమల్లు పక్కన వున్న ఒక సొరంగమార్గంలోకి ఎగిరి దూకుతూ, "కేశవా, చీకటని భయపడకు. నా వెనగ్గా రా, ఈ సొరంగమార్గం, నాకు బాగా తెలిసిందే,” అని కేక వేశాడు.
కేశవుడు మరి చేసేదేమీ లేక జయమల్లు వెనక సొరంగంలోకి దూకాడు. లోపల చీకటిగా వున్నది. జయమల్లు రెండు చేతులనూ, పక్కలకు బారచాచి, సొరంగపుటంచులను తాకుతూ, జాగ్రత్త అని కేశవుడికి హెచ్చిరికలిస్తూ త్వరత్వరగా ముందుకు నడవసాగాడు.
రాజగురువు ఆజ్ఞ విని, మాంత్రికుడున్న గుహనూ, ఆ పరిసర ప్రాంతాలనూ చుట్టు ముట్టడానికి బయలుదేరిన సైనికులకు, కేశవుడూ, జయమల్లూ కనిపించలేదు. వాళ్ళల్లో నలుగురు ప్రతి గుహలోకి తొంగిచూస్తూ, చివరికి బ్రహ్మదండి మాంత్రికుడి గుహ దగ్గరకు వచ్చి, లోపలకు చూస్తూనే, కాలభైరవుడి విగ్రహాన్ని చూసి, మూర్ఛ పోయినంత పనిచేశారు.
“ఉగ్రరూపం, భయంకరాకారం, కాళ్లకింద నేల గిర్రున తిరిగిపోతున్నది!" అంటూ యిద్దరు సైనికులు గుహ ముందు వెల్లకిలా పడిపోయారు. సైనికుల అరుపులు విన్న రాజగురువూ, సేనానాయకుడూ అక్కడికి పరిగెత్తుకు వచ్చారు. గుహముందు యిద్దరు సైనికులు మూర్ఛపడి వున్నారు, మరిద్దరు గుహకు అనుకుని నిలబడి, గట్టిగా కళ్ళు మూసుకుని, ఏదో దండకం వినబడి వినబడనట్టుగా గొణుగుతున్నారు.
సైనికుల వాలకం చూస్తూనే, సేనా నాయకుడికి మండిపోయింది. అతడు కిందపడి వున్న సైనికులను కాలితో గట్టిగా తన్నుతూ, “చచ్చారా, బతికున్నారా?” అంటూ పళ్ళు కొరికాడు.
సేనానాయకుడి తాపులకు కిందపడి వున్న సైనికులిద్దరూ ఎగిరి లేచి నిలబడ్డారు. దండకం పఠిస్తున్న వాళ్ళు చప్పున కళ్ళు తెరిచారు. తరవాత నలుగురు సైనికులూ ఏక కంఠంగా, “గుహలో వున్న భయంకర స్వరూపాన్ని చూస్తూనే, మాకు శరీరాలు స్వాధీనం తప్పినై, సేనానీ,” అన్నారు.
“ఆహాఁ, ఎంతటి సాహస విక్రమార్కులోయ్, మన బ్రహ్మపుర సైనికులు!" అంటూ రాజగురువు గుహలోకి ప్రవేశించాడు. గుహంలో అంతా నిశ్శబ్దంగా వున్నది. కాలభైరవుడి విగ్రహం ముందు మాంత్రికుడు వెలిగించిన మంటలు యింకా చల్లారలేదు. వాడు వేసిన ధూపం తాలూకు పొగ, యింకా గుహలో అక్కడక్కడా తారట్లాడుతున్నది.
“సేనానీ!" అని కేకవేశాడు రాజగురువు, చుట్టూరా కలయచూస్తూ, సేనానాయకుడు గుహలోకి వచ్చాడు.
"ఈ గుహలో నుంచి ఎక్కడికో రహస్య మార్గం వుండి వుంటుంది. మాంత్రికుడు దానివెంట పారిపోయి వుంటాడని నా అనుమానం. వాడి అనుచరులిద్దరూ గుహలోంచి బయటికి పారిపోవటం మనం చూశాం. వాళ్ళను రాజుగారి అంగరక్షకుడు వెతికి పట్టు కుంటాడు. మనం, ఈ మాంత్రికుణ్ణి కలుగులోంచి బయటికి లాగాలి," అన్నాడు రాజగురువు.
సేనానాయకుడు గుహకు అన్ని వైపులా పరీక్షగా చూశాడు. అతడి కెక్కడా ద్వారం వున్న గుర్తు కనిపించలేదు. "గుహలోకి మనం ప్రవేశించిన దారి తప్ప, పారిపోయేందుకు మరే మార్గం వున్నట్టు కనిపించటం లేదు, గురువర్యా.” అన్నాడతడు.
"చూడగానే కనిపించేదైతే, అది రహస్య మార్గం ఎలా అవుతుంది? గుహలో ప్రతి అంగుళాన్ని నొక్కుతూ కదిలించి చూడండి. ఏదైనా రహస్య ద్వారం వుంటే తెరుచుకుంటుంది," అన్నాడు రాజగురువు.
సేనానీ, నలుగురు సైనికులూ, గుహనంతా చేతులతో, కత్తిపీడులతో, నొక్కి చూశారు. ఎక్కడా రహస్య ద్వారం వున్న సూచనలైనా కనిపించలేదు. ఈ లోపల రాజగురువు కాలభైరవుడి విగ్రహాన్ని పరీక్షగా చూడసాగాడు. హఠాత్తుగా ఆయనకో అనుమానం కలిగింది.
సేనానాయకుడు వచ్చి గుహలో ఎక్కడా రహస్య ద్వారం లేదని చెప్పగానే, రాజగురువు, కాలభైరవుడి విగ్రహాన్ని అతడికి చూపుతూ, “బహుశా, ఈ విగ్రహం అడుగున ఏదైనా రహస్యబిలం వున్నదేమో. లేకపోతే మాంత్రికుడు ఎట్లా మాయమయినట్టు? విగ్రహాన్ని కదిలించి చూడండి,” అన్నాడు.
సైనికులూ, సేనానాయకుడూ, కాలభైరవుడి విగ్రహాన్ని పైకెత్తేందుకు ప్రయత్నించారు. అది కదలలేదు. అటూ యిటూ పక్కలకు లాగేందుకు యత్నించారు. కాని, అది వున్న చోటు నుంచి అంగుళమైనా జరగలేదు. రాజగురువు ఈసారి విగ్రహాన్ని తల దగ్గర నుంచి అతి జాగ్రత్తగా తడివి చూస్తూ, దాని వెన్ను మీద వేళ్ళతో నొక్కుతూ, “ఆహాఁ, ఇదీ రహస్యం! ఇదేదో పోతపోసిన విగ్రహం అనుకున్నాను, కాదు. ఇది అతుకులమారి బొమ్మ. ఎక్కడో ఏదో ఒక భాగాన్ని కదిలిస్తే, ఇది తప్పక రెండుగా విచ్చుకుంటుంది. మాంత్రికుడు దీని పొట్టలో వుండి వుంటాడని నా అనుమానం. బహుశా, వాడు మన సంభాషణ అంతా వింటూండినా వింటుండొచ్చు,” అంటూ పెద్దగా నవ్వాడు.
రాజగురువు యిలా అనగానే, సేనానీ, సైనికులూ కాలభైరవుడి విగ్రహాన్ని, తలా, కాళ్ళూ పట్టుకుని గుంజసాగారు. సైనికులకు మాత్రం ఆ విగ్రహం అంటే యింకా భయం పోలేదు. వాళ్ళేదో కాలుతున్న లోహాన్ని తాకి చూస్తున్న వాళ్ళలాగా అటూ యిటూ గెంతు తున్నారు.
ఇదంతా గమనిస్తున్న రాజగురువు, కోపంగా వాళ్లకేసి చూస్తూ, “ఎందుకింత భయపడి చస్తున్నారు? మీ ప్రాణాలకేం ప్రమాదం రాదు," అని గట్టిగా కసిరాడు.
సైనికులకా మాటల్లో ప్రాణభయం పోకపోయినా, ఉద్యోగాలకు ముప్పు వస్తుందే మోనన్న దడుపు పుట్టింది. రాజగురువు సర్వసమర్థుడు. రాజుగారి దగ్గర ఆయన మాటకు తిరుగులేదు. ఇలా అనుకుని సైనికులు ఎక్కడా లేని తెగువా తెచ్చుకుని కాలభైరవుడి విగ్రహాన్ని, అటూ యిటూ కదిలించసాగారు. వాళ్ళల్లో ఒకడు విగ్రహం తోక పట్టుకుని గుంజేసరికి, ఉరిమినట్టు ఫెళ ఫెళ మంటూ విగ్రహం రెండుగా చీలి పక్కలకు పడిపోయింది.
రాజగురువు పొందిన ఆశ్చర్యం అంతా యింతా కాదు. మాంత్రికుడు కాలభైరవుడి పొట్టలోంచి కొండలోకి ఎక్కడికో ఒక రహస్య బిలమార్గం ఏర్పాటు చేసుకున్నాడన్న మాట!
ఇప్పుడు వాడు ఆ బిలమార్గం లోంచి బయటికి పారిపోయి వుంటాడు. లేదా, అందులోనే ఎక్కడైనా దాక్కొని అయినా వుంటాడు.
రాజగురువు యిలా ఆలోచించి, సేనా నాయకుడితో, “సేనానీ, మాంత్రికుణ్ణి పట్టుకునే పని ఒక విధంగా సుకరమయిందనుకుంటాను. మన సైనికులు కొండ గుహలన్నీ గాలిస్తూ వుండగా, వాడు కొండ దిగి పారిపోయేందుకు ప్రయత్నించడు. ఈ బిలం చూశావు గదా? ఇది ఎక్కడికి పోతుందో తెలియదు. కాని, మాంత్రికుడు యిందులోనే ఎక్కడో దాక్కుని వుంటాడు. మనవాళ్ళకు కాగడా లిచ్చి, బిలమంతా వెతికించు,” అన్నాడు.
గుహలో మాంత్రికుడు సొంత వుపయోగానికి దాచుకున్న కాగడాలను సైనికులు, అక్కడే వున్న చమురులో తడిపి, వెలిగించి, సేనానాయకుడు ముందుండి దారితీయగా, కాలభైరవుడి పొట్టలో నుంచి దిగువకు వున్న బిలంలో దిగారు.
కాలభైరవ విగ్రహం రెండుగా విరిగి పడినప్పుడు అయిన పెద్ద ధ్వనిని, మచ్చల సింహం గుహలో దాక్కొని వున్న కేశవుడూ, జయమల్లూ విన్నారు. సింహం గుహముందున్న బండరాయి మీద పడుకుని నిద్రమత్తుతో జోగుతున్నది.
“బ్రహ్మదండి గాడి రహస్యం సైనికులకు తెలిసిపోయింది. ఇక వాణ్ణి వాళ్ళు పంది కొక్కును కలుగులో నుంచి లాగినట్టు బయటికి లాగుతారు." అన్నాడు జయమల్లు. ఇంతలో వాళ్ళు దాక్కున్న గుహ, వెనక భాగాన అడుగుల చప్పుడు వినిపించింది.
"సైనికులకు మనం దాక్కున్న చోటు తెలిసిపోయింది!” అన్నాడు కేశవుడు, ధ్వని వచ్చిన వైపుకు చూస్తూ, జయమల్లు ఒక్క ఎగురున వెళ్ళి, గుహ వెనకభాగాన నలుచదరంగా వున్న ఒక రాతికి అడ్డంగా, ఇనపకమ్మీ నొక దానిని తోసి, అడుగులో అడుగు వేసుకుంటూ కేశవుడి దగ్గరకు వచ్చి, రహస్యంగా అతడితో, “ఇక మనకు ఆ వైపు నుంచి ప్రమాదం రాదు. అక్కడ ఏదో నలుచదరపు రాయి వున్నదని తప్ప, అది గుహలోకి తెరుచుకునే తలుపు అని వాళ్ళు గ్రహించలేరు. ఇంతకీ బ్రహ్మదండిగాడు ఏమయినట్టు? వాళ్ళకు దొరికిపోయాడా?" అన్నాడు అనుమానంగా, కేశవుడు జవాబు చెప్పబోయేంతలో గుహ వెనుకభాగాన్నుంచి, “శిష్యా, శిష్యా," అన్న సన్నని పిలుపు వినిపించింది. ఆస్వరం గుర్తుపడుతూనే, జయమల్లు నిలువెల్లా కంపించిపోయాడు. అతడు కేశవుడి చెవిలో రహస్యంగా, “కాలభైరవుడి విగ్రహం అడుగున ఏదో రహస్య బిలం వున్నదని నాకు తెలుసు కాని, అది సరిగా ఈ గుహలోకి వస్తుందని నే నెరగను. బ్రహ్మదండిగాడి రహస్యం సైనికులకు తెలిసిపోగానే, వాడు యిక్కడికి పారిపోయి వస్తున్నాడు. మనం ఆ నలుచదరపు రాయికి అడ్డం తీసి గుహలోకి దారి యిచ్చామో, మనం కూడా సైనికులకు చిక్కిపోతాం. అందుకని మనం గుట్టు చప్పుడు కాకుండా వూరుకోవటం మంచిది," అన్నాడు.
ఈలోపల బ్రహ్మదండి మాంత్రికుడు, శిష్యా, శిష్యా, అంటూ చాలాసార్లు కేకలు పెట్టి, గుహ వెనుకభాగాన్ని తన మంత్రదండంతో కొట్టసాగాడు. కాని, అతడికి యివతలి నుంచి ఎలాంటి జవాబూ రాలేదు. కేశవుడూ, జయమల్లూ కిక్కురుమనకుండా గుహలో ఒక మూలకొదిగి కూర్చున్నారు.
అక్కడ రాజగురువు ఆజ్ఞ విని బిలంలోకి దిగిన సేనానాయకుడూ, సైనికులూ, మాంత్రికుడు వెళ్ళిన మార్గం కనుక్కోలేక, పక్కదారుల వెంట చాల సేపు తిరిగి, చీకటి కోణాల్లో నానా అవస్థలు పడి, కొంత సేపటికి రాజగురువున్న చోటుకు తిరిగి వచ్చారు. “మాంత్రికుడు దొరకలేదా?” అని అడిగాడు రాజగురువు.
"గురువర్యా, వాడా బిలంలో వున్న సూచనలేం కనిపించలేదు. బిలమార్గం ఎక్కడా సూటిగా లేదు. చేతివేళ్ళలా అందులో అన్ని వైపులకూ సొరంగమార్గాలున్నై. వాడెక్కడా కనిపించలేదు,” అన్నాడు సేనానాయకుడు.
“అలాగా," అంటూ రాజగురువు కొంచెం సేపు ఆలోచించి, “వాడు, ఈ బిలం లోని, ఏ సందుల్లోనో దాగివున్నాడనే దాంట్లో సందేహం లేదు. వాణ్ణి బయటికి రప్పించటానికి ఒకే మార్గం వున్నది. మీరంతా వెళ్లి ఎండుపుల్లలూ, ఆకలములూ పోగుచేసుకు వచ్చి, బిలమార్గాన్ని వాటితో నింపి, నిప్పు పెట్టండి. వాడు ఆ పొగకు తట్టుకోలేక ఏదో ఒక సొరంగం నుంచి బయటికి వస్తాడు. అప్పుడు పట్టుకోవచ్చు,” అన్నాడు.
సైనికలు బిలద్వారాన్ని ఎండు పుల్లలతో నింపి, దానిమీద యింత చమురు పోసి, నిప్పంటించారు.
ఇంకా వుంది....
Post a Comment