రాకాసిలోయ (చందమామ)_07 RakasiLoya Janapada Novel by Dasari Subramanyam (CHANDAMAMA)

       RakasiLoya 1-35 Janapada Novel by Dasari Subramanyam (CHANDAMAMA) 

రాకాసిలోయ (చందమామ)_07

 _దాసరి సుబ్రహ్మణ్యం

రాకాసిలోయ_07

    ఎత్తుగా వున్న ఒకచోట, రాళ్లచాటుగా నిలబడి కొండ కిందికి చూస్తున్న జయమల్లుకు నలుగురు మనుషులు కొండ ఎక్కటం కనిపించింది. గుహలో బ్రహ్మదండి మాంత్రికుడు, కాలభైరవుడి ముందు ముగ్గులు వేసి, వాటి మధ్య కేశవుణ్ణి కూచోపెట్టి హోమం చేస్తూ మంత్రాలు పఠిస్తున్నాడు. కేశవుణ్ణి కాలభైరవుడు ఆవేశించబోతున్నాడనీ, ఆ స్థితిలో అతణ్ణి చూడటం ప్రమాదం అని చెప్పి, అతడు జయమల్లును గుహ నుంచి బయిటికి పంపేశాడు. కాని,జయమల్లు వీలు దొరికినప్పుడల్లా గుహ దగ్గరకు వెళ్ళి లోపల జరుగుతున్న తతంగం అంతా చాటుగా వుండి చూస్తూనే వున్నాడు.


    జయమల్లు తెలుసుకోవాలనుకుంటున్న దేమిటంటే; కాలభైరవుడు ఆదేశించినప్పుడు కేశవుడు ఏమి చెపుతాడన్నది. రాకాసిలోయకు వెళ్ళే మార్గం, అక్కడున్న ధన రాసులో మరేవో వున్న చోటూ, మాంత్రికుడు తెలుసుకోవాలని చూస్తున్న సంగతి అతడికి లోగడే తెలుసు. ఒకసారి, ఆ రహస్యం తెలుసుకున్న తరవాత మాంత్రికుడు, కేశవుణ్ణి చంపేస్తాడన్న అనుమానం కూడా జయమల్లుకువుంది. కనక, తాను రాకాసిలోయకు వెళ్ళే మార్గం ఏదో వినాలి. కాలభైరవుడు ఆవేశించినప్పుడు కేశవుడు చెప్పే మాటలు, వాడు వదిలిపోయిం తరవాత, అతడికి జ్ఞాపకం వుండే అవకాశం లేదు. కనక తనే విని జ్ఞాపకం వుంచుకోవాలి.


    జయమల్లు యిలా అలోచిస్తూ, కొండ దిగువకు చూసేసరికి, కొండ ఎక్కుతున్న నలుగురిలో నుంచి ఒకడు వెనుదిరిగి, వేగంగా అడవిలోకి పరిగెత్తి పోతున్నాడు. తతిమ్మా ముగ్గురూ శిలా ప్రతిమల్లా కదలా మెదలక నిలబడి, కొండ పైకి చూస్తున్నారు.


    ఆ ముగ్గుర్నీ అంత ఆశ్చర్య పరిచిన సంగతేమిటా అని జయమల్లు వెనుదిరిగి చూశాడు. గుహలో నుంచి నల్లని పొగబయటికి వచ్చి, తాటిచెట్టు పరిమాణాన ఆకాశంలోకి లేచింది. కొండ ఎక్కుతున్న ముగ్గుర్నీ, ఆశ్చర్యపరిచిన దృశ్యం అదేనని జయమల్లు గ్రహించాడు. ఇప్పుడు తనేం చేయాలి? బ్రహ్మదండి మాంత్రికుడితో, చెప్పాలా? చెపితే... చెప్పక పోతే...


    ఈలోపల రాజుగారి అంగరక్షకుడు కొండ దగ్గిర నుంచి పంపిన సైనికుడు బ్రహ్మ పురం కేసి వాయువేగ మనోవేగాలతో పరిగెత్తుతున్నాడు. వాడికి అదృష్టం కొద్ది దారిలో, గుర్రాన్నెక్కి పోతున్న ఒక శతవృద్ధు కనిపించాడు. ఇదే అదననుకుంటూ సైనికుడు కత్తి దూసి, ఆ వృద్ధుణ్ణి భయ పెట్టి గుర్రం మీంచి కిందికి లాగి, దాన్నెక్కి నగరం కేసి దౌడు తీశాడు.


    కోట ముఖద్వారం దాటి ఆవరణలోకి అడుగు పెడుతూనే, సైనికుడు, “మహారాజా, మహారాజా!" అంటూ కేకలు పెట్టాడు. ఆ కేకలు వింటూనే కొత్తగా నియమితుడైన సేనా నాయకుడు భవనంలో నుంచి బయటికి వచ్చి, “ఏయ్, నోరుముయ్! ఏకంగా మహారాజు గారినే కేకలు పెట్టి పిలుస్తున్నావే, నీకేమన్నా మతిపోయిందా? ఏమిటీ సంగతి?" అని గద్దించి అడిగాడు.


    సైనికుడు దానితో అదురుకుని, “సేనానీ, రాజుగారి అంగరక్షకుడు నన్ను పంపాడు. కొండమీద వున్న ఒక గుహలో నుంచి నల్లని పొగ బయలుదేరి ఆకాశం ఎత్తు లేస్తున్నది. గుహలో మాంత్రికుడొకడున్నాడనీ, వాడే లోగడ సేనానాయకుణ్ణి చంపాడనీ, ఒక ముసలి వాడు చెప్పాడు. ఆ వార్త రాజుగారికి చెప్పి, మరికొందరు సైనికుల్ని వెంటపెట్టుకు రావలసిందిగా అంగరక్షకుడు నన్ను పంపాడు," అన్నాడు.


    “అది చెప్పవలసిన తీరు! ఒక్కగుక్కలో అన్ని వివరాలు చెప్పేశావ్. ఇక నోరు మూసుకుని నా వెంట రా,” అంటూ సేనానాయకుడు, సైనికుణ్ణి వెంట పెట్టుకుని రాజుగారి దగ్గరకు వెళ్ళాడు.


    రాజుగారూ, రాజగురువూ సేనానాయకుడు చెప్పినదంతా విని, సైనికుణ్ణి, "ఆ ముసలివాడెవరు?" అని ప్రశ్నించారు.


    “వాడు మాకు అడివిలో కనిపించాడు. తను అడివిలో కందమూలాలూ, ఆకలములూ తిని బతుకుతుంటానని చెప్పాడు." అన్నాడు సైనికుడు.


    "గుహలో నుంచి పొగరావటానికి కారణం మాంత్రికుడే ఎందుకై వుండాలి? శత్రు సైనికు లెందుక్కాగూడదు?” అని ప్రశ్నించాడు రాజగురువు.


    “కాదని ఆ ముసలాడే చెప్పాడు. తను అడవిలో ఆ మాంత్రికుణ్ణి చాలాసార్లు చూశాడట. వాడుండే గుహకూడా తనకు తెలుసునన్నాడు,” అన్నాడు సైనికుడు.


    “వింత జంతువును గురించి ఆ ముసలాడి కేమైనా తెలుసా?" అని రాజుగారు ప్రశ్నవేశాడు.


    “ఆ వింతజంతువు ఆ మాంత్రికుడి సృష్టేనని ముసలాడి నమ్మకం. తను మాత్రం ఆ జంతువును చూడలేదన్నాడు, మహారాజా,” అన్నాడు సైనికుడు.


    “గురువర్యా, ఏమిటి కర్తవ్యం?" అన్నాడు రాజుగారు.


    రాజగురువు ఓక్షణకాలం ఆలోచించి, “ఆ కొండ మీద గుహలో ఎవడో మాంత్రి కుడున్నాడనేందుకు సందేహం లేదు. శత్రు సైనికులైతే అంత తెలివి తక్కువగా గుహలో నుంచి పొగ బయట పడనివ్వరు. అలా జరిగితే వాళ్ళ రహస్యం మనకు తెలిసిపోతుందిగదా. కనుక, అంత తెలివితక్కువ శత్రువులుండరు. ఇప్పుడు నా అనుమానం ఏమిటంటే, ఆ మాంత్రికుడు ఏదో పెద్ద ఎత్తున గుహలో హోమం చేస్తున్నాడని. లేకపోతే అంత పొగ ఒక్కసారిగా బయటపడేందుకు వీలులేదు. వాణ్ణి మనం ప్రాణాలతో పట్టుకోవాలి." అన్నాడు.


    “వాడు దుష్ట మాంత్రికుడుగదా, మనం రహస్యంగా వెళ్ళి వాణ్ణి పట్టుకోగలమా?" అన్నాడు రాజుగారు నిస్పృహ కనబరుస్తూ.


    “అదంతా నాకు వదలండి. నేను మంత్ర శాస్త్రం తెలిసిన వాడినైనా, ఇంతవరకూ దాన్ని ఉపయోగంలో పెట్టలేదు. ఆ దుష్టుడి మంత్రశక్తిని హరించి, వాణ్ణి ఎలా చేజిక్కించు కోవాలో నాకు తెలుసు," అంటూ రాజగురువు, సేనానాయకుడి కేసి తిరిగి, “సేనాని, మెరికల వంటి వాళ్ళను ఓ పదిమంది సైనికుల్ని ఏరి వెంటనే బయలుదేరేందుకు సిద్ధం చేయి," అన్నాడు.


    పది నిమిషాలు గడిచీ గడవక ముందే రాజగురువూ, సేనానాయకుడూ, సైనికులూ గుర్రాలెక్కి, నగరం వదిలి అడవి మార్గాన కొండ దగ్గిరకు బయలుదేరారు. అంగరక్షకుడు పంపిన సైనికుడు దారి తీస్తున్నాడు.


    గుహ ముందు కావలి వున్న జయమల్లు కొండను సమీపిస్తున్న రాజగురువునూ, ఇతర సైనికులనూ చూశాడు. ఇంతకు ముందు అడివికి అడ్డంపడి పరిగెత్తిపోయిన సైనికుడు, వీళ్ళందర్నీ వెంట పెట్టుకు వస్తున్నాడని అతడికి అర్థం అయింది. గుహలో నుంచి బయిటికి వెలువడుతున్న పొగమాంత్రికుణ్ణి పట్టించింది. వాడు రాకాసి లోయలో వున్న వేటికోసమో చేసే ప్రయత్నంలో మైమరిచి, తన గొంతుకు వురితాడు పడనున్న సంగతే గుర్తించటం లేదు!


    జయమల్లు చప్పున వెనుదిరిగి గుహ దగ్గరకు వెళ్లాడు. లోపల కంచులా మోగుతున్న బ్రహ్మదండి మాంత్రికుడి గొంతు చప్పున ఆగిపోయింది. ఆ వెంటనే కేశవుడి గొంతు వినిపించింది. అతడు చెపుతున్నాడు; “వింధ్యారణ్యాల కవతల ఒక గొప్పకొండలోయ వున్నది. అదే రాకాసి లోయ. ఆ లోయలో ఒకచోట ఎత్తయిన ఒక రావిచెట్టు. దాని కింద ఒక పాము పుట్ట...." బ్రహ్మదండి మాంత్రికుడు ఎక్కడలేని ఆనందంతో పెద్దగా నవ్వుతూ, “ఊఁ కాలభైరవా, చెప్పు, త్వరగా చెప్పు." అంటూ కేశవుడి భుజంమీద మంత్రదండంతో గట్టిగా చరిచాడు.


    “ఎండి మోడుగా వున్న చెట్టు వెన్నెల రాత్రి ఫల పుష్పాలతో నిండిపోతుంది, పులి రాజును చంపి, చర్మం వలిచి, దాన్ని....” కేశవుడు మాట మధ్యలోనే ఆగి, చేత్తో గొంతు గట్టిగా పట్టుకుని వణికిపోతూ వెనక్కూ ముందుకూ ఊగసాగాడు.


    కేశవుడి వాలకం చూస్తూనే, బ్రహ్మదండి మాంత్రికుడు గుహ దద్దరిల్లేలా, “ఆఁ ఎవడు వాడూ? నా మీదే మంత్ర ప్రయోగం చేశాడా? కాలభైరవుడి నోరు కట్టుబడేలా చేశాడా?" అంటూ హుంకరించాడు. జయమల్లు ఒక్క గంతులో గుహముందు నుంచి పరిగెత్తి కొండ దిగువకేసి చూశాడు. గుర్రాల మీద వచ్చిన వాళ్ళల్లో నుంచి, ఒకరు కిందికి దిగి, కమండలంలో నుంచి నీళ్ళు తీసుకుని, కొండరాళ్ళ మీద చల్లుతూండటం అతడికి కనిపించింది. అతడు రాజగురువు! -


    బ్రహ్మదండి మాంత్రికుడితో పాటు, తనూ, కేశవుడూ కూడా రాజభటులకు చిక్కి పోతామని జయమల్లు భయపడ్డాడు.


    “గురురాయా, గురురాయా!" అంటూ జయమల్లు గుహలోకి పరిగెత్తి, “బ్రహ్మపుర సైనికులు కొండ ఎక్కి వస్తున్నారు." అన్నాడు మాంత్రికుడితో.


    మాంత్రికుడు పళ్ళు పటపట, కొరికి, “వాళ్ళు సైనికులయితే మనకేం భయంరా, శిష్యా, వాళ్ళవెంట తుచ్ఛ మాంత్రికుడెవడో ఒకడున్నాడు. వాడు మన ఉపాసకుల ఊడల మర్రి నోరు కట్టేశాడు. సరే, ఆ తుచ్ఛుణ్ణి కాలభైరవుడికి బలిపెట్టక మానను,” అన్నాడు.


    “ఆ తుచ్ఛమాంత్రికుడు నోరు కట్టేసే లోపల మనకు కావలసిన సంగతులన్నీ, కాలభైరవుడు చెప్పేశాడా, గురురాయా?” అని అడిగాడు జయమల్లు.


    హఠాత్తుగా బ్రహ్మదండి మాంత్రికుడి కనుబొమలు ముడివడినై. అతడు అనుమానంగా జయమల్లుకేసి చూస్తూ, “నీవేమైనా చాటున దాగివుండి, గుహలో జరుగు తున్నదంతా చూశావా ఏరా, శిష్యా?" అని అడిగాడు.


    “అదేమిటి గురురాయా! నన్ను బయట కావలి వుండమన్నారు గదా? మీ ఆజ్ఞ పాలించబట్టే, నేనా బ్రహ్మపుర సైనికుల్ని చూడటం తటస్థించింది. గుహలో జరుగుతున్న దేమిటో చూస్తూ కూచుంటే, కొండను సమీపిస్తున్న శత్రువుల నెలా చూడగలిగేవాడిని?" అన్నాడు జయమల్లు అమాయికంగా.


    అప్పటివరకూ మైకంలో వున్న వాడిలా అటూ యిటూ వూగుతున్న కేశవుడు, చప్పున లేచి నిలబడి, చుట్టూ కలయచూస్తూ, "నే నెక్కడున్నాను? నేనెవణ్ణి?" అంటూ కేకలు ప్రారంభించాడు.


    మాంత్రికుడు అతణ్ణి సమీపించి భుజం పట్టుకుని కుదుపుతూ, “నువ్వు కేశవుడివి. మహామాంత్రికుడైన బ్రహ్మదండి గుహలో వున్నావు. తెలిసిందా? అడుగో చూడు, ఉపాసకుల ఊడలమర్రి, ఉన్మత్త భైరవుడు!” అన్నాడు ఆవేశంతో.


    కేశవుడు కాలభైరవుడి విగ్రహం కేసి చూసి, “కాలభైరవుడి కళ్ళల్లో వెలుగు కొంచెం తగ్గినట్టుందేం?” అన్నాడు.


    జయమల్లు ఏదో చెప్పబోయేంతలో మాంత్రికుడు అతణ్ణి వారించి, “మరేం లేదు, కేశవా. నేను అజాగ్రత్తగా, వున్న సమయంలో, ఒక తుచ్ఛ మాంత్రికుడు, నా మీద దొంగ దెబ్బ తీశాడు. నువ్వేమీ భయపడకు. వాణ్ణి కొద్ది క్షణాలలో కాలభైరవుడికి బలిపశువును చేస్తాను,” అంటూ హుంకరించాడు.


    “గురురాయా, మనం యిక్కడ కాలయాపన చేసేందుకు లేదు. ఎటైనా పారిపోదాం. మార్గం చూపండి,” అన్నాడు జయమల్లు.


    “పారిపోవటమా? ఈ మహామాంత్రికుడు బ్రహ్మదండి, శత్రువులకు భయపడి పారిపోవటమా? ఎంత మాటన్నావు, శిష్యా! కాలభైరవుడే నాకు రక్ష! ఇక్కణ్ణించే, నా మీద దొంగ దెబ్బ తీసిన నీచుణ్ణి హతమారుస్తాను. వాడి పాఠం వాడికే ఒప్పచెపుతాను. మీ యిద్దరు మాత్రం ఎక్కడికైనా దూరంగా పోయి దాక్కోండి,” అంటూ బ్రహ్మదండి మాంత్రికుడు కాలభైరవుడి విగ్రహం కేసి నడిచాడు.


    కేశవుడు తన విల్లంబులు తీసుకున్నాడు. ఆ తరవాత జయమల్లూ అతడూ కలిసి, గుహ నుంచి బయిటికి వచ్చి, రాళ్ల వెనకగా నక్కుతూ, ఏనుగుల కొలను కేసి పారిపోసాగారు. 

ఇంకా వుంది...

Post a Comment

Previous Post Next Post