రాకాసిలోయ (చందమామ)_05 RakasiLoya Janapada Novel by Dasari Subramanyam (CHANDAMAMA)

     RakasiLoya 1-35 Janapada Novel by Dasari Subramanyam (CHANDAMAMA) 

రాకాసిలోయ (చందమామ)_05

 _దాసరి సుబ్రహ్మణ్యం

రాకాసిలోయ_05

     బ్రహ్మదండి మాంత్రికుడి ఆజ్ఞ వింటూనే జయమల్లు కేశవుడి చేయి పట్టుకుని అక్కణ్ణించి బయలుదేరాడు. “అంతా నాకు అయోమయంగా వుంది. ఇంత పెద్దకొండను తన మంత్రశక్తి చేత ఈ బ్రహ్మదండిగాడు ఊగించగలిగాడంటే ఎలా నమ్మటం?" అన్నాడు కేశవుడు.


    “వాడు మంత్రశక్తి చేత భూకంపం తెప్పించాడంటే నేను నమ్మను. నా అనుమానం కొండ కింద గంధకంలాంటి పదార్థమేదో వున్నదని, ఆ కారణంగా కొండ అప్పుడప్పుడూ అదరటం జరగవచ్చు. అలాంటి సమయాల్లో బ్రహ్మదండి అందుక్కారణం తన మంత్రశక్తి అని ప్రగల్ఫాలు కొడుతున్నాడేమో. ఏదీ తేల్చి చెప్పటం కష్టం," అన్నాడు జయమల్లు.


    ఆ సరికి యిద్దరూ కొండ మీద పల్లంగా వున్న ప్రదేశంలో గల ఒక కొలను దగ్గరకు వచ్చారు. వాళ్ళు కొలనను సమీపిస్తుండగానే, దాని అంచునవున్న గుహలలో నుంచి సింహగర్జన వినిపించింది. ఆ వెంటనే జూలు ఆడిస్తూ ఒక సింహం గుహ నుంచి బయటికి వచ్చి, మరింత పెద్దగా గర్జనచేస్తూ ఒక రాతిమీదికి ఎగిరి నిలబడింది.


    “ఇదే ఏనుగుల కొలను, ఆ మొరుగుతున్నదే మచ్చల సింహం!" అంటూ జయమల్లు పెద్దగా నవ్వాడు.


    “అన్నీ వింతలే! ఈ సింహానికి ఆహారం చెయ్యటానికి బ్రహ్మదండి మాంత్రికుడు నన్ను యిక్కడికి పంపలేదుగదా?” అనుకుంటూ కేశవుడు అనుమానంగా జయమల్లుకేసి చూశాడు. జయమల్లు తల ఎత్తి మచ్చల సింహంకేసి చూస్తూన్నాడు. సింహం కోరలు చాచి, పంజా ఎత్తి కర్ణకఠోరంగా గర్జించసాగింది.


    కేశవుడు సింహంకేసి ఓ క్షణకాలం పరీక్షగా చూశాడు. అది ఏ నిమిషాన్నయినా రాతిమీది నుంచి దూకి తన మీదికి లంఘించవచ్చని అతడికి అనుమానం కలిగింది.


    కేశవుడు యిలా అలోచిస్తూనే విల్లంబులు పైకెత్తి మచ్చల సింహం తలకు బాణాన్ని గురిచేశాడు. అతడు వింటి తాడును బాగా లాగి బాణం వదలబోతున్నంతలో జయమల్లు. ఓంకారి..... అంకారి.....మృగత్తెకట్టు... అంటూ చప్పున కేశవుడికేసి తిరిగి, “ఏమిటి, నువ్వు చెయ్యబోతున్నది? నీ బాణంతో సింహాన్ని చంపగలననే అనుకుంటున్నావా? నేను కట్టు మంత్రం వేసి దాని నోరు మూయబోతున్నాను. అయినా ఏదీ చూద్దాం, బాణం వదులు!" అన్నాడు పెద్దగా నవ్వుతూ.


    కేశవుడు బాణాన్ని సింహం తలకు గురి చేసి వదిలాడు. బాణం రివ్వుమంటూపోయి దాని తలను తాకుతానే గర్ర్  మంటూ శబ్దించి, అంతదూరం గాలిలోకి ఎగిరి కొలనునీటిలో పడిపోయింది. "చూశావా, నీ బాణం ఒకటి వృధా అయింది తప్ప, సింహానికి చీమ కుట్టినట్టుయినా లేదు. ఇది బ్రహ్మదండి మాంత్రికుడి పెంపుడు సింహం. ప్రపంచంలో ఎక్కడాలేని ఈ మచ్చల సింహాన్ని తనే సృష్టించానని వాడు చెపుతుంటాడు. కాని నేను నమ్మను, వాడు మాంత్రికుడేగాని బ్రహ్మదేవుడు కాదు కదా? దీన్ని చిన్నపిల్లగా వున్నప్పుడే పట్టుకుని పైన ఏ చిరతపులి చర్మాన్నో కుట్టివుంటాడని నా అనుమానం." అన్నాడు జయమల్లు.


    "అది అసంభవం. ఒక జంతువుకు మరో జంతువు చర్మాన్ని తెచ్చి కుడితే అది దాని శరీరంలో ఎలా కలిసిపోతుంది?” అన్నాడు కేశవుడు.


    “అయితే, ఒకటి చేసివుంటాడు. ఇది చిన్నపిల్లగా దొరికినప్పుడే దాని శరీరాన్ని అక్కడా యిక్కడా కాల్చివుంటాడు. అవి మానిన తరవాత మచ్చలయివుంటవి." అన్నాడు జయమల్లు.


    “అలా జరిగితే జరిగుండొచ్చు. అయినా, ఈ చర్చ అంతా ఎందుకు. ఈ సింహం వల్ల నా కేమీ అపాయం లేదు గదా - ఆ మాట ముందు చెప్పు?" అన్నాడు కేశవుడు కొంచెం విసుగ్గా.


    “అపాయం ఏమీలేదు! ఇన్నేళ్ళుగా మాంత్రికుడి శిష్యుణ్ణియి వుండి కనీసం మృగాలకైనా మంత్రకట్టు వేయలేననుకున్నావా? చూడు, దాని జోరు ఎలా తగ్గిపోయిందో, ఇంకా సేపటిలో పిల్లిలా ఆ రాతిమీద బోర్లాపడుకుంటుంది.” అన్నాడు జయమల్లు.


    చూస్తూండగానే సింహం ఒక్కసారి గట్టిగా జూలు విదిలించి, ఆవిలిస్తున్నట్లు పెద్దగా నోరు తెరిచి, బల్లిలా రాతిని అంటిపెట్టుకుని పడుకున్నది. కేశవుడు జయమల్లు మంత్రశక్తికి ముగ్ధుడయ్యాడు. నిజంగా వీడు తనకు స్నేహితుడైతే, బ్రహ్మదండి మాంత్రికుడి నుంచి ప్రమాదం లేకుండా తేలిగ్గా పారిపోవచ్చనుకున్నాడు.


    జయమల్లు ఏనుగుల కొలనులో దిగి బుడుంగు బుడుంగుమని మునుగుతూ, “చూస్తావేం, కేశవా,దిగు, స్నానం చెయ్యి. మన కోసం బ్రహ్మదండి కనిపెట్టుకుని వుంటాడు," అని కేకవేశాడు.


    కేశవుడు విల్లంబుల్ని కొలను ఒడ్డున పడవేసి కొలను నీటిలో దిగి స్నానం చెయ్య సాగాడు. బహుశా తాను స్నానం చేసి శుచి అయిన తరవాత మాంత్రికుడు తనను కాలభైరవుడికి బలి యివ్వాలనుకుంటున్నాడని అతడికి తోచింది.


    కేశవుడు తన సందేహాల గురించి జయమల్లును అడుగుదామనుకున్నాడు. కాని, జయమల్లు కొలనులో చాలా దూరంపోయి కేరింతలు కొడుతూ ఈతలు వేస్తున్నాడు. కేశవుడు మెల్లిగా ఈదుతూ అతణ్ణి సమీపించి, తన భయాలను గురించి అడిగేందుకు పెదాలు కదిపేంతలో, కొలనుకు ఆవైపు నుంచి, రాళ్ళూరప్పలూ దొర్లిపోతున్న ధ్వని, ఆ వెంటనే ఏనుగుల ఘీంకారాలూ వినిపించినై.


    “ఏనుగు మంద కొలనుకు వస్తున్నట్టున్నది?” అన్నాడు కేశవుడు.

    “దీని పేరే ఏనుగుల కొలను గదా, మరి యిందులో స్నానాలు చేసేందుకు ఏనుగులు రాక మరేం వస్తవనుకున్నావు?” అన్నాడు జయమల్లు నవ్వుతూ.


    “అలా అయితే మనం త్వరగా యిక్కణ్ణించి పారిపోవటం మంచిది. అవి వచ్చి పడినవో, మనం వాటి కాళ్ళకింద తునాతునియలైపోతాం!" అంటూ కేశవుడు ఒడ్డుకేసి గబగబా ఈదసాగాడు.


    జయమల్లు కేశవుడి భయంచూసి పెద్దగా నవ్వాడు. చూస్తూండగానే అయిదారు ఏనుగులు ఒకదాన్ని ఒకటి తోసుకుంటూ, తొండాలతో కొలను పక్కనవున్న చెట్ల కొమ్మలను ఆలవోకగా పట్టివిరుస్తూ కొలను ఒడ్డుకు వచ్చినై, వాటిని చూస్తూనే జయమల్లు బుడుంగున నీటిలో మునిగి చప్పున పైకివచ్చి, పెద్దగా మంత్రం పఠిస్తూ, యింత బురదను ఏనుగలకేసి విసిరాడు. ఆ మరుక్షణం ముందువచ్చిన ఏనుగులూ, వాటిని అనుసరించి వస్తున్న మరికొన్ని ఏనుగులూ ఉన్నచోటునే కదలా మెదలక స్థాణువుల్లా అయిపోయినై.


    “చూశావా, మనశక్తి!" అంటూ జయమల్లు కేశవుడి కేసి పెద్ద కేక పెట్టి, నిదానంగా ఈదుకుంటూ కేశవుడున్న చోటికి వచ్చాడు. కేశవుడికి కలిగిన ఆశ్చర్యం అంతాయింతా కాదు. నిజంగానే జయమల్లు గొప్ప మాంత్రికుడనుకున్నాడతడు.


    కేశవుడి ఆలోచనల్ని పసికట్టిన వాడిలా జయమల్లు తలవూపి, “నోరులేని మృగాలనూ, పక్షులనూ లొంగదీసుకోగలగటం ఏమంత గొప్ప శక్తికాదు. ఇలాంటి స్వల్ప శక్తుల్ని బ్రహ్మ దండిగాడు చేయీ కాలూ కదపకుండా ప్రదర్శించగలడు. రాకాసిలోయలో ప్రవేశించి, అక్కడవున్న గొప్ప గొప్ప నిధుల్ని కొల్లగొట్ట గల శక్తిని సంపాయించినప్పుడే మనం నిజమైన మంత్రవేత్తలం అవుతాం." అన్నాడు.


    “ఆ రాకాసిలోయ ఎక్కడున్నది?" అని అడిగాడు కేశవుడు.


    “ఆ సంగతి తెలిస్తే యింక కావలసిందేముంది? అది తెలుసుకునేందుకే గదా, నేను యింత కాలంగా ఆ బ్రహ్మదండిగాణ్ణి సేవిస్తున్నాను," అన్నాడు జయమల్లు.


    ఆ మాటలతో కేశవుడికి గురుశిష్యుల మధ్యవున్న వైరానికి కారణం ఏమిటో అర్థమయిపోయింది. ఆ రాకాసిలోయలో వున్న నిధులో నిక్షేపాలో సంపాయించుకునేందుకు తను వాళ్ళకు సాయపడాలన్న మాట!


    జయమల్లు పై బట్టతో ఒంటిని శుభ్రంగా తుడుచుకుని, కేశవుడికేసి తిరిగి, “ఊఁ త్వరగా కానీయ్, బయలుదేరుదాం,” అన్నాడు. కేశవుడుకూడా ఆదరాబాదరా ఒళ్ళు తుడుచు కుని, విల్లంబులు తీసుకుని బయలుదేరాడు. జయమల్లు రెండడుగులు వేసి చప్పున ఆగి పోయి, “పాపం, ఆ ఏనుగులు గొంతెండి చస్తే, మనకు ఏం వస్తుంది!" అంటూ వెనుదిరిగి ఏవో మంత్రం చదివి, “ఏయ్, గజరాజులూ, యిక మీరు కొలనులో దిగవచ్చు,” అంటూ అరిచాడు .


    ఎవరో ఆజ్ఞ యిచ్చినట్టుగా ఏనుగులు గుంపుగా ముందుకు కదిలి కొలనులోకి దూకినై. జయమల్లు అక్కడవున్న ఒక చిన్నరాతిని చేతిలోకి తీసుకుని, మచ్చల సింహానికేసి విసురుతూ, “ఇక నువ్వు కూడా నీ కంఠశోష ప్రారంభించు," అని అరిచాడు. సింహం ఎగిరి రాతిమీద నిలబడి చెవులు దిబ్బిళ్ళుపడేలా గర్జించటం మొదలు పెట్టింది. ఆ గర్జన వింటూనే కొలనులోని ఏనుగులు తొండాలెత్తి పెద్దగా ఘీంకారనాదం చేసినై.


    “నేను కొలనుకు స్నానానికి వచ్చిన రోజల్లా యిదే వరస. ఆ ఏనుగులూ, ఈ సింహం యిలాగే గంటల తరబడి కవ్వించుకుని, చివరకు వేటిదారిన అవి పోతవి," అన్నాడు జయమల్లు ఎంతో తృప్తిగా.


    జయమల్లు ధోరణి కేశవుడికి చిరాకు తెప్పించింది. తనకు యిక కొద్ది గంటల్లో మాంత్రికుడివల్ల ప్రమాదం రాబోతున్నది.


    జయమల్లు కేమో చీమ కుట్టినట్టయినాలేదు. “మన యిద్దరం ఈనాటి నుంచీ స్నేహితులమని చెప్పావు. అయినా,నాకు కలగనున్న ప్రమాదాన్నుంచి కాపాడేందుకు నువ్వు ఎలాంటి ప్రయత్నం చేస్తున్నట్టు లేదు." అన్నాడు కేశవుడు.


    జయమల్లు తల ఎత్తి కొండ పైభాగానికేసి చూశాడు. అక్కడ ఒక పెద్ద బండరాయి నానుకుని బ్రహ్మదండి మాంత్రికుడు తమ కేసే చూస్తూండటం అతడికి కనిపించింది. వెంటనే జయమల్లు కేశవుణ్ణి హెచ్చరిస్తూ, "నువ్వుంత పెద్దగా మాటాడకు. వాడివి పాము చెవులు. నీకు ప్రమాదం కలగకుండా కాపాడటం నాకూ ఎంతో అవసరం. రాకాసిలోయలో ప్రవేసించేందుకు అర్హుడెవడో బ్రహ్మదండిగాడితోపాటు, నేనూ ఈ రోజునే తెలుసుకున్నాను. నీ భుజం మీద వున్న మచ్చ - పడగ విప్పి, పాము చూసిం తరవాత వాడు ఎంత సంతోషపడ్డాడో చూశావు గదా? ఈ రాత్రి నీకు ఏదో శక్తిని ఆవహింపచేసి, ఆ రాకాసి లోయకు వెళ్ళే దారి, అక్కడ నిధినిక్షేపాల సంగతీ నీ చేత చెప్పిస్తాడు. ఆ వివరాలేవో తెలిసిం తరవాత మనం వాణ్ణి మరోలోకానికి పంపిద్దాం, భయపడకు!” అన్నాడు.


    “మనకంటే ముందే వాడు జాగ్రత్త పడి, మననే వాడు పరలోకయాత్ర చేయిస్తే? ఆ సంగతాలోచించావా?" అన్నాడు కేశవుడు అనుమానంగా.


    “వాడా పనిచేయలేడు. వాణ్ణిప్పుడు ధనపిశాచీ, కీర్తి భూతం పట్టి పీడిస్తున్నవి. అందువల్లే వాడిలో ఇంగిత జ్ఞానం లోపించింది. అలా కాకపోతే, వాడు నమ్మి మన యిద్దర్నీ యిలా కలిసి కట్టుగా తిరగనిచ్చే వాడు కాదు," అన్నాడు జయమల్లు.


    కొండమీద రాతి పక్కన నిలబడి వాళ్ళ కేసే చూస్తున్న బ్రహ్మదండి మాంత్రికుడి పెదాలమీద చిరునవ్వు కదుల్లాండి, వాడు చేయెత్తి, “శిష్యా జయమల్లూ, కేశవా! వచ్చేప్పుడు యిన్ని ఎండు దిరిశెనపుల్లలూ, యిన్ని వెలగపుల్లలూ - సమపాళ్ళలో పట్టుకురండి.


    కాల భైరవుడు ఆకలితో నకనకలాడిపోతున్నాడు. పాపం, వెయ్యి సంవత్సరాల కొక్కసారి మాత్రమే ఈ ఉపాసకుల ఊడలమర్రికి ఆకలివేస్తుంది!" అని కేక పెట్టాడు. 

ఇంకా వుంది...

Post a Comment

Previous Post Next Post