RakasiLoya 1-35 Janapada Novel by Dasari Subramanyam (CHANDAMAMA)
రాకాసిలోయ (చందమామ)_0
రాకాసిలోయ_04
రాజభటులకు హడలెత్తించి, వాళ్ళు అడవిలో చెల్లా చెదురుగా పారిపోయేట్టు చేస్తున్న భీకరాకారాన్ని చూసి కేశవుడు పొందిన ఆశ్చర్యం అంతా యింతా కాదు. గబ్బిలాని కున్నట్టు రెక్కలున్న మనిషి వుంటాడని గాని, లేక గబ్బిలానికి మనిషి తలలాంటిది వుంటుందని గాని, వాడు ఏనాడూ వినివుండలేదు. కాని, యిప్పుడు స్వయంగా అలాటి వింత ఆకారం వున్నట్టు చూశాడు. ఇది వాస్తవమా లేక మాంత్రికుడు తన మంత్రశక్తి చేత తనకు కలిగిస్తున్న భ్రమా?
“వత్సా, కేశవా! చూశావా, కాలభైరవుడి శక్తి సామర్థ్యాలు? ఇక నీ తండ్రికి యిప్పట్లో రానున్న ప్రమాదం ఏమీలేదు. రాజభటులు తిరిగి చూడకుండా బ్రహ్మపురం పారిపోతారు. నిన్నూ, నీ ముసలి తండ్రిని కాపాడే భారం నాదని లోగడే నీకు అభయం యిచ్చానుగదా! ఏదీ నీ భుజం మీద వున్న అంబులపొదిని పక్కకు తొలగించు. సంశయ నివారణ చేసుకోవాలి,” అన్నాడు మాంత్రికుడు.
ఆ సరికి కేశవుడికి మాంత్రికుడి మీద ఎంతో కృతజ్ఞతాభావం కలిగింది. రాజభటుల పాలపడకుండా తన తండ్రిని అతడు కాపాడాడని కేశవుడు నమ్మాడు. ఆ కారణం వల్ల మాంత్రికుడు అడగటమే తడవుగా అతడు భుజం మీది నుంచి అంబులపొదిని పక్కకు లాగాడు. మాంత్రికుడు కేశవుడి భుజాన్ని కొద్దిసేపు కన్నార్పకుండా చూసి, “ఆహ్హాహ్హా! వత్సా, అదృష్టవంతుడివి. నీది అమోఘమైన జాతకం. నీ దెబ్బకు తిరుగులేదు. మూపుమీద మహారాజయోగాన్ని మోస్తూ, ఈ లోకంలోకి వచ్చావు!" అంటూ కేశవుడి వీపు చరిచి, “అయినా ఆవగింజంత సంశయం మాత్రం ఎందుకుండాలి? ఇప్పుడే తేల్చుకుందాం,” అంటూ గుహ నుంచి బయటికి వెళ్ళాడు.
మాంత్రికుడికి అంత ఆనందాన్ని కలిగించిన విశేషం ఏమిటో చూసేందుకు కేశవుడు తన భుజాన్ని ముందుకు వంచి పరీక్షించాడు. అక్కడ ఏవిధమైన పుట్టుమచ్చలుగాని, ఇతర గుర్తులుగాని అతడికి కనిపించలేదు. తన కళ్లకు కనిపించని గుర్తులేవో మాంత్రికుడికి కనిపించి వుండవచ్చని కేశవుడు అనుకుంటున్నంతలో, మాంత్రికుడు ఏదో ఆకులను అరచేతిలో నలుపుతూ అక్కడికి వచ్చి, “వత్సా, ఆ పుట్టుమచ్చ నీ కంటికి కనబడేది కాదు, ఇదిగో, ఈ ఆకు పసరు రాయనీ, నువ్వు కూడా దాన్ని చూడవచ్చు,” అంటూ పసరును కేశవుడి భుజానికి రాశాడు.
పసరు తగలగానే కేశవుడి భుజంమీద పడగవిప్పిన నల్లనిపాము ఆకారం ఒకటి కనిపించింది. దాన్ని చూస్తూనే మాంత్రికుడు బ్రహ్మానందం పొంది, “వత్సా, కేశవా! ఇక మనక వశ్యం కాని శక్తి అంటూ ఏదీ లేదు, కాలభైరవుడు, ఆది భైరవుడు, ఉన్మత్త భైరవుడు... అందరూ మన యింటి పాలేళ్ళు కాబోతున్నారు,” అని పెద్దగా మంత్రం జపిస్తూ కాలభైరవుడి విగ్రహం ముందు సాష్టాంగపడి, చూస్తూండగానే ఉపాసనా తన్మయత్వంలో కళ్ళుమూశాడు.
కేశవుడు మాంత్రికుడు కళ్ళు తెరుస్తాడేమో అని చూస్తూ అక్కడే నిలబడ్డాడు. కాని, పావుగంట కాలం గడిచినా అతడిలో చలనం కనిపించలేదు. కేశవుడికి ఎందుకనో హఠాత్తుగా భయం కలిగింది. ఒకవేళ మాంత్రికుడు తనను కాలభైరవుడికి బలి చెయ్యటానికి తెచ్చాడేమో అనుకున్నాడు. ఈ అనుమానం కలగ్గానే కేశవుడు అప్రయత్నంగా తన ఆయుధాల కోసం చూశాడు, కత్తి, విల్లంబులూ గుహ వాకిలి దగ్గిర అతడికి కనిపించినై. కేశవుడు ఒక్కదూకున అక్కడికి వెళ్ళి, వాటిని తీసుకునేందుకు వంగాడు. అంతలో, “ఆగు,కేశవా, తొందరపడకు!" అన్న హెచ్చరిక అతడికి వినిపించింది. కేశవుడు తల ఎత్తి ముందకు చూశాడు. ఎదురుగా దాదాపు ఇరవైఏళ్ళ వయసుగల యువకుడొకడు నిలబడి వున్నాడు.
“నువ్వెవరివి? ఇక్కడికెలా వచ్చావు?" అన్నాడు కేశవుడు ఆశ్చర్యంగా.
“నేను బ్రాహ్మదండి మాంత్రికుడి శిష్యుణ్ణి. నేను ఎక్కడినుంచీ రాలేదు, ఇక్కడే వుంటాను,” అన్నాడు యువకుడు.
“ఎవరు బ్రహ్మదండి మాంత్రికుడు?" అని అడిగాడు కేశవుడు.
“ఓయి అమాయకుడా, ఆ మాత్రం అర్థం కాలేదా?" అంటూ యువకుడు కాలభైరవుడి విగ్రహం ముందు సొమ్మసిల్లి పడివున్న మాంత్రికుణ్ణి చూపించాడు.
“హఠాత్తుగా ఆకాశం నుంచి ఊడిపడ్డట్టు నువ్వు కనబడటంతో నేను కాస్త భయ పడ్డాను, సుమా!" అన్నాడు కేశవుడు కత్తినీ, విల్లంబులనూ తీసుకుంటూ.
“ఆ కాస్త భయపడటం కూడా మరిచిపోవాలి. లేకపోతే నువ్వు రానున్న ప్రమాదాన్ని ఎలా ఎదుర్కోగలవ్.” అన్నాడు యువకుడు.
“ఏమిటి రానున్న ప్రమాదం?" అని అడిగాడు కేశవుడు ఆశ్చర్యంగా. అతడికి వింత జంతువు తనకు కనపడిన నిమిషం నుంచి, తను చిక్కుల్లో పడ్డానన్న సంగతి గుర్తు కొచ్చింది, దానికోసం చుట్టూ కలయచూశాడు. కాని, అది ఆ ఛాయల ఎక్కడా వున్నట్టు లేదు.
“దేనికోసం చూస్తున్నావ్?" అని అడిగాడు యువకుడు.
“ఒక వింతరకం జంతువు నెక్కి నేనిక్కడికి వచ్చాను. అదేమయిందా అని చూస్తున్నాను," అన్నాడు కేశవుడు.
యువకుడు పెద్దగా నవ్వి, “ఆ వింత జంతువును, నేనే! నేను బ్రహ్మదండి మాంత్రికుడి శిష్యుణ్ణని చెప్పానుగదా. నా పేరు జయమల్లు. నా వల్లనే నువ్వు ఇన్ని ప్రమాదాలకు లోను కావలసివచ్చింది గనక, నిన్ను నా శక్తి కొద్దీ కాపాడేందుకు ప్రయత్నిస్తాను.” అన్నాడు జయమల్లు.
జయమల్లు మాటలు వింటూనే కేశవుడు, గురుశిష్యుల మధ్య ఏదో విరోధభావం వున్నదని గ్రహించాడు. అతడు గుహ లోపలికి చూశాడు. బ్రహ్మదండి మాంత్రికుడు కాలభైరవుడి విగ్రహం ముందు రాయిలా కదలా మెదలక పడివున్నాడు.
“అతడు మనం ఏం మాట్లాడుకున్నా వినే స్థితిలో లేడు. అతణ్ణి భక్తిమైకం కమ్మింది. మనం లేపకుండా వూరుకుంటే, సూర్యాస్తమయం వరకూ అలాగే వుండి పోతాడు." అన్నాడు జయమల్లు.
“అలాగా, నా కేదో ప్రమాదం రానున్నదన్నావ్, ఎవరినుంచి?” అని అడిగాడు కేశవుడు. జయమల్లు బ్రహ్మదండి మాంత్రికుడికేసి వేలు చూపాడు.
“అయితే, నేను యిప్పుడే కొండ దిగి పారిపోతాను. నన్ను ఆపగల వాళ్లెవరు?" అన్నాడు కేశవుడు.
జయమల్లు చిరునవ్వు నవ్వుతూ, కేశవుణ్ణి భుజం పట్టుకుని గుహముందు నుంచి దూరంగా తీసుకుపోయి, “ఒకసారి ఈ బ్రహ్మదండిగాడి చేతిలో పడినవాడు తప్పించుకు పోలేడు. నా సంగతేమనుకుంటున్నావ్? మనం వాణ్ణి హతం చేసి తప్ప యిక్కణ్ణించి ప్రాణాలతో పారిపోలేం,” అన్నాడు.
“అయితే, ఆ పని యిప్పుడే చేస్తాను. వాడు మైకంలో వుండగానే కత్తితో తల నరుకుతాను," అంటూ కేశవుడు కత్తి పైకెత్తి గుహకేసి వెళ్ళబోయాడు.
జయమల్లు కేశవుడి భుజం పట్టుకుని ఆపుతూ, “తొందరపడకు కేశవా, మన యిద్దరం ఏకమయితే, వాణ్ణి ఏనాడైనా చంపవచ్చు. ఇప్పుడు నువ్వు వాణ్ణి చంపి పొందబోయే లాభం ఏముంది? నువ్వు కొండ దిగి అడవిలోకి పోగానే రాజభటులు నిన్ను శత్రుదేశపు గూఢచారివని పట్టుకుంటారు. తెలిసిందా?" అన్నాడు.
“రాజభటుల్ని మనిషితలా, గబ్బిలంలా రెక్కలూ వున్న ఒక భయంకరాకారం అడవిలో నుంచి తరిమేసిందిగదా?" అన్నాడు కేశవుడు.
ఈ మాటలకు జయమల్లు బిగ్గరగా నవ్వాడు. తరవాత కేశవుణ్ణి వెంట పెట్టుకుని ఒక ఎత్తయిన ప్రదేశానికి తీసుకుపోయి, దిగువగా వున్న అడవికేసి చేయిచూపుతూ, “జాగర్తగా చూడు! ఎంతమంది రాజభటులు నీ కోసం అడవిలో చెట్లూ పుట్టలు గాలిస్తున్నారో,” అన్నాడు.
కేశవుడికి అంతా చిత్రంగా వున్నది. జయమల్లు చెప్పినదాంట్లో అబద్ధం ఏమీ లేదు. గుర్రాల మీద కొందరూ, కాలి నడకన కొందరూ, రాజభటులు అడవిలో చెట్టూ చేమా, పుట్టలూ పొదలూ వెతికి చూస్తున్నారు. “అయితే, యిందాక మాంత్రికుడు నాకు కాలభైరవుడి కళ్ళల్లో కనబడేలా చేసిందంతా వట్టి మాయ అన్నమాట!” అన్నాడు కేశవుడు.
“కాక మరేమిటనుకున్నావ్ నన్ను వింత మృగంగా మార్చి నీ దగ్గరకు పంపినది వాడే. నిన్ను చిక్కుల్లో పడేలా చేసి, ఈ కొండమీదికి రప్పించుకున్నాడు. అందుకు నేను సహాయపడక తప్పలేదు. నీ కుడిభుజం మీద వున్న పుట్టుమచ్చ పడగవిప్పిన సర్పం - అతణ్ణి ఆనందంతో ఒళ్ళుమరిచేలా చేసింది. నీ ద్వారా మాత్రమే వాడు కోరుతున్న అపూర్వ శక్తుల్ని వశపరుచుకోగలడు. అందుకు నిన్ను ఉపయోగించుకోబోతున్నాడు. తెలిసిందా?" అన్నాడు జయమల్లు.
“ఏమిటా అపూర్వశక్తులు? వాటికోసం నాకెలాంటి పరీక్ష పెట్టబోతున్నాడు?" అని అడిగాడు కేశవుడు.
జయమల్లు చిరునవ్వు నవ్వి, కేశవుడి కేసి చూస్తూ కొంచెంసేపు వూరుకుని, తరవాత అతడి రెండు చేతులూ తన చేతుల్లోకి తీసుకుని, "కేశవా, ఈనాటి నుంచి మనం స్నేహితులం. ఏది కాని మన స్నేహాన్ని భగ్నం చెయ్యలేదు. నువ్వూ, నేనూ కూడా ఈ బ్రహ్మదండి మాంత్రికుడి వల్ల ప్రమాదానికి లోను కాబోతున్నాం. కాని, ఇద్దరం ఏకమై కలిసి కట్టుగా వుంటే, వాడు మననేమీ చెయ్యలేడు, అంతేగాక, వాడు సంపాయించాలని ప్రయత్నిస్తున్న అమానుష శక్తుల్ని మనమే సంపాయించవచ్చు. నిన్ను వాడే విధంగా వుపయోగించుకోవాలని చూస్తున్నాడన్న విషయం..."
జయమల్లు మాట పూర్తి చేయకుండానే కొండలో ఉరుములాంటి పెద్ద ధ్వని పుట్టి, ఫెళఫెళ మంటూ భయంకరంగా మోగి, కొండ అటూ ఇటూ - నీటిలో పడవ వూగినట్టు ఊగసాగింది. పెద్ద పెద్ద కొండరాళ్ళు పల్లానికి జారసాగినై. కేశవుడూ, జయమల్లూ తాము నిలుచున్న రాయి పక్కనుంచి దూరంగా పరిగెత్తారు. అంతలో గుహలోపలి నుంచి బ్రహ్మ దండి మాంత్రికుడు కేకలు పెడతూ బయటికి వచ్చి, అడవి కేసి చూస్తూ, “ఆహ్హాహ్హా! కాలభైరవుడి అమోఘశక్తి, నా మంత్ర ప్రభావం! కొండ కుదురు దగ్గర నుంచి కదిలిపోతున్నది. కావాలంటే దీన్ని ఆకాశంలో పక్షిలా ఎగిరించగలను! అదుగో, చూడండి! కొండ ఎక్కాలని చూసిన రాజభటులు ఏవిధంగా ప్రాణాలు అరిచేత పట్టుకుని పారిపోతున్నారో! నేను మంత్రించి వదిలిన కొండరాళ్ళు వాళ్ళను వెంటబడి తరుముతున్నై," అన్నాడు.
కేశవుడూ, జయమల్లూ కొండ దిగువకు చూశారు. మాంత్రికుడు చెప్పినట్టే రాజు భటులు అశ్వాలమీదా, కాలినడకనా కొండ దిగి పరిగెత్తుతున్నారు. భూకంపం వల్ల అదురు తున్నట్టు ఊగిసలాడుతున్న కొండమీంచి పెద్ద పెద్ద రాళ్ళు దొర్లి పల్లంలో వున్న అడవిలోకి వెళ్ళిపడుతున్నవి. వాటి తాకిడికి గుర్రాలెక్కివున్న కొందరు రాజభటులూ, కొందరు కాలి బంట్లూ అడకత్తెరలో చిక్కిన వక్కల్లా నలిగిపోతున్నారు. బ్రహ్మదండి మాంత్రికుడు కేశవుడికేసి పరీక్షగా చూస్తూ తృప్తిగా తలాడించసాగాడు.
కేశవుడు కొద్దికాలం నిశ్చేష్టుడై, ఆ భయంకర దృశ్యాన్ని చూసి తేరుకుంటున్నంతలో, బ్రహ్మదండి మాంత్రికుడు అట్టహాసం చేస్తూ, “శిష్యా, మన కేశవుణ్ణి మచ్చల సింహం గుహ ముందున్న ఏనుగుల, కొలనులో స్నానం చేయించి తీసుకురా! సూర్యాస్తమయం తరవాత మనందరం చేయవలసిన ముఖ్యమైన పనులు చాలా వున్నవి," అన్నాడు.
ఇంకా వుంది...
Post a Comment