రాకాసిలోయ (చందమామ)_03 RakasiLoya Janapada Novel by Dasari Subramanyam (CHANDAMAMA)

   RakasiLoya 1-35 Janapada Novel by Dasari Subramanyam (CHANDAMAMA) 

రాకాసిలోయ (చందమామ)_03

 _దాసరి సుబ్రహ్మణ్యం

రాకాసిలోయ_03

    తండ్రి మాటలు వింటూనే కేశవుడు ఉలిక్కిపడ్డాడు. అతడు అంతదూరంలో మేస్తూ వున్న వింత జంతువు కేసి ఆశ్చర్యంగా చూస్తూ, “అయ్యా, ఇప్పుడు అంతా అర్థమైంది. రాత్రి నేను చెప్పిన వింతజంతువు యిదే! దాని కొమ్ముకేసి చూడు. ఎంత నెత్తురు గడ్డకట్టి వున్నదో!” అన్నాడు.


    ముసలివాడు కొడుకుతో మాట్లాడే హడావుడితో యింతవరకూ ఆ వింత జంతువు కేసి చూడలేదు. ఇప్పుడు అతడి దృష్టి దానిమీద పడింది. అతడు నివ్వెరపోయాడు. కేశవుడు తండ్రిని దాని దగ్గరకు తీసుకుపోయి, దాని కొమ్ముకేసి వేలుచూపుతూ, “చూశావా, నెత్తురు! ముఖానకూడా... ఇదుగో ఇక్కడా... ఇక్కడా - ఇవి నెత్తురు మరకలు!" అన్నాడు.


    "అయితే నగరంలో పుట్టిన పుకారు అబద్ధం కాదు. ఇది సేనానాయకుణ్ణి, వెంటవున్న భటుణ్ణి పొడిచి చంపింది. రాజభటులు అరణ్యానికి వస్తున్నారు. నువ్వు మారువేషంలోవున్న శత్రుదేశపు గూఢచారివని ఎవరో ఒక నీలివార్త వేశారు. భటుల వల్ల నీకు అపాయం తప్పదు." అన్నాడు ముసలివాడు నిస్పృహగా.


    “ఇందులో నా నేరం ఏమీలేదు. సేనానాయకుడు కోరి కొరివితో తల గోక్కున్నాడు. ఈ వింత జంతువును బలవంతంగా మెడకు ఉచ్చువేసి పట్టుకుపోయాడు. బహుశా అది వాణ్ణి చంపి తిరిగి యిక్కడికి పారిపోయి వచ్చివుంటుంది. కొమ్ము నుంచి ఓడుతున్న నెత్తురుతో అది తిరిగిరావటం చూస్తూనే, ఏదో ప్రమాదం జరిగిందనుకున్నాను." అన్నాడు కేశవుడు.


    "సరే, తప్పు ఎవరిదైతేనేం? రాజభటులు వస్తే మనకు ముప్పు తప్పదు. నువ్వు ఎటైనా పారిపో. ఇదుగో కత్తి. నీ తాత చనిపోయినప్పటి నుంచి యిది గోడకు వేలాడు తున్నది. ఇదీ, నీ దగ్గర వున్న బాణాలూ, నీ ఆత్మరక్షణకు వుపయోగిస్తవి. రాజభటులకు బందీగా చిక్కి అవమానం పాలయేకన్న, ఆత్మరక్షణ చేసుకుంటూ అవసరమైతే ప్రాణాలు వదలటం ఉత్తమం!" అన్నాడు తండ్రి.


    కేశవుడు తండ్రి దగ్గర నుంచి కత్తి తీసుకుంటూ, “నీ మాటేమిటి?” అని ప్రశ్నించాడు.


    “నా మాటకేం? నారక్షణ నేను చూసుకోగలను. కాకపోయినా ముసలివాణ్ణి, వెయ్యేళ్లు బతకపోవటం లేదు గదా, నేనూ, రాజభటుల కంట పడకుండా దాక్కుంటాను. ఆలమందను అరణ్యం మధ్యకు తరిమేస్తాను. అవీ వాళ్ల కంటపడకూడదు,” అన్నాడు ముసలివాడు.


    వాళ్లిద్దరూ యిలా మాట్లాడుకుంటూ వుండగా, అరణ్యంలో ఎక్కడో గుర్రాలూ, మనుషులూ కదులుతున్న కలకలం వినబడింది. ముసలివాడు కొడుకుకేసి ఆదుర్దాగా చూశాడు. కేశవుడు చప్పున వింత జంతువు దగ్గరకు వెళ్లి దాని జూలు పట్టుకుని, “నేను రాజభటులు చేతచిక్కకుండా పారిపోవాలంటే, దీనిమీద ఎక్కి సవారీ చేయక తప్పదు. నా దగ్గిర ఎందుకనో యిది చాలా సాధువుగా ప్రవర్తిస్తున్నది," అంటూ ఎగిరి దానిమీద కూచున్నాడు.


    వింత జంతువు కళ్ళు అదోలాగా మెరిసినై. “ఊఁ పరిగెత్తు. నీ యిష్టం వచ్చిన ప్రదేశానికి నన్ను తీసుకుపో," అంటూ కేశవుడు దాని జూలు పట్టుకుని లాగి, మడమల్తో డొక్కలో గట్టిగా పొడిచాడు. అది తుఫాను వేగంతో కొండకేసి పరిగెత్తసాగింది.

 

     వింతజంతువు వేగానికి కేశవుడు భయపడిపోయాడు. తను ఎక్కడ పట్టుతప్పి కొండ రాళ్ళమీదపడి తునాతునియలైపోతానో అని అతడు కంగారుపడసాగాడు. వింత జంతువు పక్షిలా ఒక రాతిమీది నుంచి ఇంకొక రాతిమీదికి ఎగురుతూ కేశవుణ్ణి కొండ శిఖరానికేసి తీసుకుపోసాగింది.

 

    ఆ కొండ ప్రదేశమంతా మహాభయంకరంగా వున్నది. కొండమీద పొదలూ, పెద్ద పెద్ద చెట్లు, గుహలు - వాటిమీద కారాడుతూ తిరిగే చిరతపులులూ, ఎలుగుబంట్లూ మహా సర్పాలూ - వీటిని చూస్తూనే కేశవుడు తన ప్రాణాల మీద ఆశ వదులుకున్నాడు. ఈ క్రూర జంతువుల బారినపడి దిక్కులేని చావు చచ్చేకన్న, బ్రహ్మపుర సైనికులకు చిక్కి కారాగారంలో మరణించటం అతడికి సుఖంగా వుండేటట్టు కనబడింది.


    “ఈ వింత జంతువు నన్ను మోసం చేసింది!” అనుకున్నాడు కేశవుడు. కాని అంతలోనే అతడికి జంతువు మోసంచేయటమేమిటా అన్న సంశయం కలిగింది. తన తండ్రి చెప్పినట్టు యిదేమైనా మాయారక్కసేమో అనుకున్నాడు కేశవుడు. ఏది ఏమైనా తను యిప్పుడు చేయగలిగిందేమీ లేదు. వింత జంతువు తనను ఎక్కడికి తీసుకుపోతే అక్కడికి వెళ్ళవలసిందే. తన చేతిలోవున్న కత్తితో దాన్ని అప్పటికప్పుడు మెడనరికి చంపినా, తను క్రూరమృగాల మధ్య వుండిపోవలసి వస్తుంది. వాటినుంచి ప్రాణాలతో బయటపడటం అసాధ్యం.


    కేశవుడు యిలాంటి భయాందోళనలతో వుక్కిరిబిక్కిరవుతుండగా, వింత జంతువు ఒక ఎత్తయిన రాతిమీది నుంచి పల్లంలోకి దూకి, ఎదురుగావున్న గుహ ముందు చప్పున ఆగి పెద్దగా సకిలించింది. ఆ వెంటనే చీకటి గుయ్యారంగా వున్న గుహలో మినుకు మినుకుమంటూ చిన్న కాంతి కనబడి, అంతలో పెద్ద కాగడా వెలుగూ, నల్లని పొగా... హాం ఓం ఫట్ భట్ హుం అన్న భీకరమైన గొంతు వినిపించింది. కేశవుడు నిలువెల్లా వణికిపోయాడు. మరుక్షణంలో అతడు ఒరనుంచి కత్తిదూసి, వింత జంతువు మీది నుంచి కిందికి దూకాడు.


    గుహ మళ్ళీ ఎప్పటిలా చీకటి మయమై పోయింది. వెలుగూ, పొగా మటుమాయ మయినై. మంత్రం పఠిస్తున్న గొంతుకూడా ఆగిపోయింది. అంతా నిశ్శబ్దం. ఈ వింత మార్పు కేశవుణ్ణి ఆశ్చర్యపరిచింది. గుహలో ఎవడోవున్నాడు, వాడు రాక్షసుడు కావచ్చు, మాంత్రికుడు కావచ్చు లేక నరమాంస భక్షకుడైన అడివి మనిషి కావచ్చు!


    కేశవుడు ఒక్క తృటికాలంలో ఓ నిర్ణయానికి వచ్చాడు. గుహలోవున్న వాణ్ణి తను చీకటివల్ల చూడలేక పోయాడుగాని, వాడు వెలుగులో వున్న తనను చూసి వుంటాడు. తనను సునాయసంగా పట్టుకునేందుకు వాడేదో పన్నాగం వేస్తున్నాడనే దాంట్లో సందేహం లేదు. కనక తను సాధ్యమైనంత వేగంగా అక్కణ్ణించి పారిపోవాలి. కేశవుడు యిలా అనుకుంటూనే వింత జంతువు కోసం చూశాడు. కాని అది అతడికి అందుబాటులో లేదు. అల్లంత దూరాన ఒక రాతినానుకుని నిలబడి, ఎదురుగావున్న మరో బండరాయిని కొమ్ముతో కుమ్ముతున్నది. కేశవుడు ఒక్క పరుగున వెళ్ళి దానిని పట్టుకునేందుకు ముందుకు దూకాడు. కాని కేశవుడు సమీపించేలోపల వింత జంతువు ఛెంగున ఎగిరి బండరాయి మీద నిలబడింది.


    కేశవుడిలో కలిగిన నిరాశ అంతాయింతాకాదు. సరిగ్గా ప్రాణాపాయం కలిగే సమయంలో వింత జంతువు తనకు అందకుండా పోయింది. కాలినడకను అక్కణ్ణించి పారిపోప్రయత్నించటం క్షేమం కాదు. రాళ్ళచాటున పొంచివున్న ఏ క్రూరమృగమైనా తనను యిట్టే పట్టుకుని చంపి తినగలదు.


    ఇప్పుడేం చేయాలి? కేశవుడు గుండెరాయి చేసుకున్నాడు. కత్తివున్న చేతిలోనే కొన్ని అంబులుకూడా పట్టుకుని, ఏడమచేతితో విల్లుపట్టుకుని అతడు జాగ్రత్తగా గుహ ముందు నుంచి ఒక్కొక్క అడుగే వెనక్కు వేయసాగాడు.


    హఠాత్తుగా గుహాలో పెద్ద కాంతి కనిపించింది. ఆ వెలుగులో కేశవుడికి సన్నని పొడవాటి గడ్డం, నల్లని ముఖం, నెత్తిమీద కుచ్చుకట్టిన శిరస్త్రాణం గల ఒక వికృతాకారుడు కనిపించాడు. అతణ్ణి చూస్తూనే కేశవుడు నిలుచున్నచోట ఆగిపోయాడు.


    “వత్సా, భయపడకు, భయపడకు, అభయమిస్తున్నాను! నిన్నేకాక, నీ ముసలి తండ్రిని కూడా దుర్మార్గులైన రాజభటుల నుంచి కాపాడే భారం నాది!" అంటూ ఆ వికృతా కారుడు గుహ లోపలినుంచి బయటికి వచ్చాడు.


    ఆ వికృతాకారుడి మాటలు కేశవుడి శరీరాన్ని జలదరింపచేసినై. “వీడెవడోగాని నా గురించి సర్వం తెలుసుకున్నాడు." అనుకున్నాడతడు. ఇప్పుడు తను పారిపోయే ప్రయత్నం చేయటం వృధా. అందువల్ల మేలుకన్న కీడే ఎక్కువ కలగవచ్చు. ఎంతో ప్రేమ కనబరుస్తున్న ఈ వికృతాకారుడు తన నుంచి ఎలాంటి సహాయం ఆశించి తననూ, తన తండ్రిని రాజభటుల నుంచి కాపాడతానని అభయమిస్తున్నాడు?


    “వత్సా, నువ్వు నా శక్తి సామర్థ్యాలను శంకిస్తున్నావా? ఇటురా, గుహలోకి రా!" అంటూ వికృతాకారుడు వెనుతిరిగి గుహలోకి వెళ్ళబోయేవాడల్లా ఆగి, కదలక నిలబడివున్న కేశవుణ్ణి పరీక్షగా చూస్తూ, "నా వెంట గుహలోకి వచ్చేందుకు భయమా?" అని ప్రశ్నించాడు.


    ఆ ప్రశ్న కేశవుడికి కోపం తెప్పించింది. తననేదో పిరికిపంద కిందకట్టి వీడు మాట్లాడుతున్నాడన్న అభిప్రాయం కలగగానే, కేశవుడు ధైర్యంగా ముందుకు నడుస్తూ, "ని వెంట గుహలోకి కాదు మరెక్కడికి రమ్మన్నా వస్తాను. అడవిలో పుట్టి అడవిలో పెరిగిన వాణ్ణి. భయం అంటే ఏమిటో నాకు తెలీదు. పోతే, నన్ను బాధిస్తున్న సంశయం ఏమిటంటే, నీకు నా గురించి, నా తండ్రిని గురించి ఎలా తెలుసా అని!" అన్నాడు.


    “అంతేనా? అయితే గుహలోకిరా, సంశయనివారణ చేస్తాను. గుహలో వున్న కాలభైరవుడి కళ్ళల్లోకి తొంగిచూశావంటే, లోకంలో ఎక్కడ ఏమి జరుగుతున్నదీ నీవు తెలుసుకోవచ్చు." అన్నాడు వికృతాకారుడు.


    కేశవుడు అతడి వెంట గుహలోకి వెళ్లాడు. గుహలోపల అంతా చీకటిగా వున్నది. ఆ చీకటిలో ఓ పదడుగులు నడిచిన తరవాత పక్కగా కొండరాతిలో తొలిచిన చిన్న బిలం ఒకటి కనిపించింది. అందులో అంత ఎత్తున్న ఒక కుక్క ఆకారం - రాతితో మలిచినది వున్నది. దాని రెండుకళ్ళూ నిప్పుకణాల్లా మెరుస్తున్నవి.


    "వీడే కాలభైరవుడు! ఉపాసకుల ఊడలమర్రి, శత్రువులపాలిట బ్రహ్మజెముడు! జై కాలభైరవా!" అంటూ వికృతాకారుడు మునివేళ్ళతో విగ్రహం కళ్ళను ఒకసారి తాకి, చప్పున వెనకడుగు వేస్తూ, "కేశవా, ఇప్పుడు కాలభైరవుడి కళ్ళల్లోకి చూడు! అడుగో నీ తండ్రి, అవిగో నీ ఆలమందలు! రాజభటులను చూశావా... విచ్చుకత్తులతో, ఆహ్హాహ్హా!" అంటూ బిగ్గరగా నవ్వసాగాడు.


    కేశవుడు ముందుకు వంగి కాలభైరవుడి కళ్ళల్లోకి చూశాడు.


    కేశవుడి ముసలి తండ్రి గుబురుగా వున్న ఒక చెట్టుకొమ్మల్లో కూచుని వున్నాడు. ఆవులు అడవిలో చెల్లా చెదురుగా పరిగెత్తుతున్నవి. వాటిని అన్ని వైపుల నుంచీ చుట్టు ముట్టుతూ రాజభటులు గుర్రాలమీద తరుముకు వస్తున్నారు.


    ఆ దృశ్యం చూస్తూనే కేశవుడికి ఎక్కడ లేని విచారం కలిగింది. తన తండ్రి ప్రాణ భయంతో చెట్టుమీద దాక్కున్నాడు. తన ఆలమందను రాజభటులు పట్టుకుపోవాలని చూస్తున్నారు. ఆ పశువులు లేకపోతే తన తండ్రి అడవిలో ఆకూ అలమూ తిని బతక వలసిందే. సమయానికి తను ఈ కొండ మీద చిక్కుకుపోయాడు!


    వికృతాకారుడు కేశవుడి మనోభావాలు తెలిసిన వాడిలా నవ్వుతూ, “దిగులుపడకు కేశవా! నీ తండ్రినీ, నీ ఆలమందను కాపాడే భారం నాది," అంటూ గుహలో నుంచి బయటికి వచ్చి, “శిష్యా, శిష్యా, ఎక్కడ? నువు వెళ్ళి ఆ రాజభటులను తరిమి, మన కేశవుడి తండ్రినీ, ఆలమందనూ, కాపాడు!" అంటూ కేక పెట్టాడు.


    కాలభైరవుడి కళ్ళల్లోకి చూస్తున్న కేశవుడి దృష్టికి ఒక వింత దృశ్యం కనిపించింది. మనిషి తలా, గబ్బిలంలా రెక్కలూ వున్న ఒక నల్లని పెద్ద ఆకారం అడవిలో రాజభటుల తలల మీద ఎగురుతూ పల్టీలు కొట్టసాగింది. ఆ భీకర స్వరూపాన్ని చూస్తూనే రాజభటులు, ప్రాణభయంతో అరుస్తూ అడవికి అడ్డంపడిపారిపోసాగారు. 

ఇంకా వుంది...

Post a Comment

Previous Post Next Post