రాకాసిలోయ (చందమామ)_02 RakasiLoya Janapada Novel by Dasari Subramanyam (CHANDAMAMA)

  RakasiLoya 1-35 Janapada Novel by Dasari Subramanyam (CHANDAMAMA) 

రాకాసిలోయ (చందమామ)_02

 _దాసరి సుబ్రహ్మణ్యం

రాకాసిలోయ_02

    సేనాని ఆజ్ఞ వింటూనే భటుల్లో ఒకడు తన గుర్రాన్ని దౌడుతీయించి, వింత జంతువును అదిలిస్తూ సేనాని వైపుకు తరుముకు వచ్చాడు. సేనాని దానికేసి ఓ నిమిషకాలం కళ్ళార్పకుండా చూసి, “ఇదేదో అపూర్వమైన జంతువు! ప్రపంచంలో యిలాటిది మరొకటి వుంటుందని నమ్మటానికి లేదు. రాజుగారికి దీన్ని బహూకరిస్తే ఎంతగానైనా సంతోషిస్తాడు." అంటూ కేశవుడికేసి తిరిగి, “ఏరా ఇలాంటి అపూర్వమైన జంతువును ఎక్కడ దొంగిలించావు? రాజ్యంలో దొరికే నిధినిక్షేపాలతో పాటు, ఇటువంటి అపూర్వమైన జంతువులూ, పక్షులూ -- అన్నీ రాజుగారివే అన్న శాసనం సంగతి నీకు తెలియదా?" అంటూ ప్రశ్నించాడు.


    సేనాని బెదిరింపులు వింటున్న కేశవుడికి ఎక్కడలేని కోపం వచ్చింది. కాని, దాన్ని అతడు బయటపడనీయకుండా, “అయ్యా, ఈ జంతువును నేనెక్కడా దొంగిలించలేదు. ఆ కొండ మీద ఇంతచిన్నపిల్లగా నాకు దొరికింది. పెంచి పెద్దచేశాను. ఎప్పుడూ నా ఆల మందలో వెంట తిరుగుతుంటుంది. నాకు చదువుసంధ్యలు రావు. పైగా ఎన్నడూ ఈ అరణ్యం వదిలి వెళ్ళినవాణ్ణికాను. అందువల్ల రాజుగారి శాసనం సంగతి నాకు తెలీదు." అన్నాడు.


    “అలాగా, అయితే క్షమించాను. ఒరే, దాని మెడకు తాడువేసి నగరానికి తీసుకు రండి!” అంటూ సేనాని గుర్రాన్ని ముందుకు నడిపాడు. భటుల్లో ఒకడు ఉచ్చు బిగించివున్న పెద్ద తాడు నొకదాన్ని వింత జంతువు మెడకు పడేలా విసిరి, అది బిగుసుకోగానే, తాడు కొసను తను ఎక్కి వున్న గుర్రం జీనుకు కట్టి, సేనాని వెనకగా బయలుదేరాడు. రెండవ భటుడు, కేశవుడి దగ్గరకు వచ్చి కత్తి ఝళిపిస్తూ, “జాగర్త, నేను మళ్లీ ఓ నెలరోజుల్లో ఒంటిగా యిక్కడికి వస్తాను. ఈసారి కొండమీద దొరికిన పిల్లను నా కప్పగించకపోయావో, ఒళ్లు చీరేస్తాను," అని హెచ్చరించి మొదటి భటుడి వెంట బయలుదేరాడు.


    సేనానీ, అతడి వెంటవున్న భటులూ ప్రదర్శించిన నీచవర్తన కేశవుడి రక్తాన్ని ఉడికించింది. అతడు అంబుల పొదిలో నుంచి ఒక బాణం తీసి వాళ్లకేసి ఎక్కుపెట్టి, “ఛీ, ఎంత శత్రువునైనా వెనకనుంచి దొంగదెబ్బ తీయకూడదు." అనుకుంటూ బాణాన్ని కిందికి జారవిడిచాడు.


    భటులిద్దరూ వింత జంతువునూ వెంటతీసుకుని వెనక వస్తుండగా, ముందుండి అరణ్యంలో దారితీస్తున్న బ్రహ్మపురం సేనాని ఆనందం అంతాయింతా కాదు. ఆ జంతువును మహారాజుకు చూపి, దాన్ని పట్టుకునేందుకు అరణ్యంలో తనెన్ని సాహసకృత్యాలు చేశాడో నమ్మబలికి, రాజు నుంచి పెద్ద బహుమానం సంపాయించాలని అతడు ఆలోచిస్తున్నాడు. ఒక కాపు యువకుణ్ణి బెదిరించి, ఆ వింత జంతువును పట్టుకొచ్చినట్టు నగరంలో ఎవరికీ తెలియకూడదు. అందువల్ల తను ముందుగా తన భటులను హెచ్చరించాలి.


    సేనాని యిలా అనుకుని, తన పథకం సంగతి భటులకు చెప్పేందుకు గుర్రాన్ని అవి వెనుతిరగబోయేంతలో హఠాత్తుగా అతడికి భటుడు వేసిన చావుకేక వినిపించింది. “అయ్యా, ఇదేదో రాక్షసిగుర్రం! నా గుర్రాన్ని డొక్కలో పొడిచి చంపేసింది. నా మీదకు..." అంటూ కెవ్వుమన్నాడు.


    సేనాని తత్తరపడుతూ తల వెనక్కు తిప్పాడు. ఒక భటుడూ, వాడి గుర్రం రక్తం మడుగులో విలవిలా తన్నుకుంటున్నారు. రెండో భటుడు గుర్రాన్ని పక్కకు తిప్పి అరణ్యంలోకి ఉడాయిస్తున్నాడు. సేనాని నిలువెల్లా వణికిపోతూ, గుర్రాన్ని ముందుకు దూకించ బోయేంతలో వింత జంతువు ఒక్క ఎగురున ముందుకు వచ్చి, తన ఒంటి కొమ్ముతో దాన్ని గుండెల్లో పొడిచింది. గుర్రం పక్కకు ఒరిగిపోయింది. దాని మీదినుంచి కిందికి దూకబోయిన సేనానిని, అతడు నేలను తాకక ముందే వింత జంతువు వెన్నులో గట్టిగా పొడిచింది.


    “రక్షించండి, రక్షించండి, రాక్షసి గుర్రం!" అని కేకలు పెడుతూ చావుతప్పించుకున్న భటుడు బ్రహ్మపురం చేరాడు. వాడు రాజవీధి వెంట ఇలాగే అరుస్తూపోవటం చూసిన జనులు, వాడికేదో పిచ్చెక్కిందనుకున్నారు. వాడు కోటద్వారం చేరి, అక్కడ కాపలా వున్న భటులను చూస్తూనే, “మన సేనాని చచ్చాడు, గుర్రమూ చచ్చింది. అందర్నీ ఆ రాక్షసి గుర్రం పీక్కు తింటున్నది!” అని మరింత బిగ్గరగా అరిచాడు.


    కాపలా భటులు చేతుల్లో వున్న ఈటెలు అడ్డం పెట్టి గుర్రాన్ని ఆపి,వాణ్ణి బలవంతంగా దాని మీదినుంచి కిందికి దించారు. వాడు కిందికి దిగి యింకా కేకలు పెడుతూనే వున్నాడు. కాపలా వాళ్లలో ఒకడు వాడి గుండెలమీద ఈటె ఆనించి, “ఇంక అరిచావో, పొడిచేస్తాను జాగర్త! సేనానాయకుడెక్కడ?” అని గద్దించి అడిగాడు.


    “ఇంకెక్కడి సేనానాయకుడు! అరణ్యంలో ఆయన్నీ, మన భటుణ్ణి ఒంటి కొమ్ము రాక్షసిగుర్రం తినేసింది. నేను ప్రాణాలతో పారిపోయివచ్చాను," అన్నాడు భటుడు ఆయాస పడుతూ.
అంతలో అక్కడికి కాపలావాళ్ల నాయకుడు వచ్చాడు. అతడికి భటుడి వాలకం చూడగానే, వాడికి పిచ్చెత్తిందన్న నమ్మకం కలిగింది. కానీ, వాడు ఉదయం సేనా నాయకుడితో కలిసి అడవికి వేటకు వెళ్ళాడన్న సంగతి అతడికి గుర్తొచ్చింది.


    “పిచ్చిగా కేకలు పెట్టకుండా, నిజంగా జరిగిందేమిటో చెప్పు, మహాసేనాని ఇంకా అడివిలోనే వున్నాడా?" అని అడిగాడు కాపలావాళ్ల నాయకుడు.


    "అది రాక్షసిగుర్రం! సేనానాయకుణ్ణి బొమికకూడా మిగల్చకుండా తినేసి వుంటుంది" అన్నాడు భటుడు.
ఆ జవాబు వింటూనే కాపలావాళ్ళ నాయకుడు పక్కన వున్న వాడి దగ్గర్నుంచి ఈటె లాక్కుని, భటుణ్ణి పొడిచేందుకు పైకెత్తాడు. భటుడు ప్రాణభయంతో కంపించిపోతూ, “చంపేస్తున్నాడు, రక్షించండి!” అంటూ గావు కేకపెట్టాడు.


    ఆ కేక వింటూనే రాజభవనం రెండో అంతస్తులోని గది నుంచి మంత్రి బయటికి వచ్చి, “ఎవర్రా, ఆ కేకలు పెట్టేది?" అని కోపంగా ప్రశ్నించాడు.

    “అయ్యా, వీడికి మతి చెడింది. 'సేనానాయకుణ్ణి అడివిలో ఒంటికొమ్ము రాక్షసి గుర్రం చంపి తిన్నదని కేకలు పెడుతున్నాడు," అన్నాడు కాపలా వాళ్ల నాయకుడు.
“అలాగా! వాణ్ణి నా దగ్గరకు పంపండి!" అంటూ మంత్రి గదిలోకి వెళ్ళిపోయాడు.


    భటుడు గది వాకిలిని సమీపించగానే మంత్రి నవ్వుతూ అతడికేసి చేయివూపి, “భయపడకుండా జరిగిందేమిటో వివరంగా చెప్పు," అన్నాడు.


    భటుడు కాస్త స్థిమితపడి, అరణ్యంలో కాపుయువకుడు కేశవుడు కనబడటం దగ్గిర నుంచి, సేనాని ఆ వింతజంతువును అపహరించి బయలుదేరటం, ఆ తరవాత దారిలో అది ముందు భటుణ్ణి, తరవాత సేనానినీ చంపటం, తను పారిపోయిరావటం... అంతా వివరంగా చెప్పాడు.


    మంత్రి ఓక్షణకాలం ఆలోచిస్తూ వూరుకుని, “అయితే, ఆ యిద్దర్నీ వింత జంతువు చంపుతూండగా నువ్వు చేతులు కట్టుకుని దూరంగా నిలబడ్డావన్న మాట! నీకు ప్రాణభయం కలగలేదా?" అని అడిగాడు.


    “ప్రాణభయమా! నా పై ప్రాణాలు పైనే పోయినై. నా తోటి భటుణ్ణి చంపేందుకు ఆ వింత జంతువు ఎగరగానే నేను అరణ్యానికి అడ్డంపడి పారిపోయి వచ్చాను," అన్నాడు భటుడు.
“అయితే, సేనాని చావటం నువ్వు చూడలేదన్నమాట!" అన్నాడు మంత్రి.


    “అయ్యా, కంటితో చూడకపోతేనేం? 'చచ్చాను, రక్షించండి' అంటూ మహాసేనాని గావుకేకలు పెట్టటం నాకు వినిపించింది," అన్నాడు భటుడు.


    భటుడి జవాబుకు మంత్రి నవ్వి, “అడివిలో నువ్వేదో పిచ్చిపుచ్చకాయ తిన్నట్టుంది. నిజంగా సేనానీ మరణించివుంటే, దానికి కారణం నువ్వు చెప్పినట్టు వింత జంతువుకాదు. అలాంటి జంతువు లోకంలో ఎక్కడా వుండదు. ఆ కాపు యువకుడు కేశవుడున్నాడే... వాడు విలువిద్య నేర్చిన వాడు గదా? సరే, భటుల్ని కొందరిని అరణ్యానికి పంపి జరిగిం దేమిటో తెలుసుకుంటాను. దారి చూపవలసిన వాడివి నువ్వు!" అన్నాడు.
“అయ్యా, చిత్తం, చిత్తం!" అంటూ భటుడు తల వూపాడు. కాని, వాడికి అరణ్యం పేరు చెపితేనే గుండెదడ పుట్టుకొస్తున్నది. అయినా, మంత్రి ఆజ్ఞను ధిక్కరించేందుకు లేదు.


    మంత్రి కోట ద్వారం కాపలావాళ్ల నాయకుణ్ణి పిలిచి, అడవిలో సేనాని కోసం వెదకవలసిందిగా ఆజ్ఞ యిచ్చాడు.


    ఈలోగా నగరంలో సేనాని దుర్మరణాన్ని గురించి రకరకాల వార్తలు ప్రచారం కాసాగినై. రాజవీధి వెంటవస్తూ భటుడు పెట్టిన గావుకేకలు చాలామంది ప్రజలు విని వున్నారు. ఏదో అపూర్వమైన వింత జంతువు....ముఖాన ఒంటికొమ్మూ... పెద్ద పెద్ద రెక్కలు గలది... అరణ్యానికి వేటకు వెళ్లిన సేనానిని పట్టుకుని ఆకాశానికి ఎత్తుకుపోయిందని కూడా నీలివార్తలు బయలుదేరినై.


    పాలమ్మటానికి నగరానికి వచ్చిన కేశవుడి తండ్రి ఈ పుకార్లన్నీ విన్నాడు. అతడికి రాత్రి తన కొడుకు చెప్పిన వింత జంతువు సంగతి గుర్తు కొచ్చింది. సేనాని అంతవాణ్ణి చంపిన ఆ క్రూరజంతువు, తన కొడుకును మాత్రం ప్రాణాలు తీయకుండా వదులుతుందా?


    ముసలివాడి మనసు యిలాంటి అనుమానాలతో చికాకైపోయింది. అతడు నగరాన్నించి హడావిడిగా తన ఇంటికి బయలుదేరాడు. సరిగా అతడు నగరద్వారం దాటుతూండగా మరీ ఆశ్చర్యకరమైన పుకారువినవచ్చింది. అరణ్యంలో ఆలమందలు కాచుకు బతుకుతున్నట్టు నటిస్తున్న, ఒక శత్రుదేశపు గూఢచారీ, సేనానాయకుణ్ణి, అతడి వెంటవున్న భటుణ్ణి చంపివేశాడట! అతణ్ణి వీలైతే ప్రాణాలతో పట్టుకు రావలసిందిగా మంత్రి భటుల్ని పంపుతున్నాడు.


    ఈ వార్త విన్నమీదట ముసలివాడికి నిజంగానే తన కొడుకు ప్రాణానికి ముప్పు వాటిల్లనున్నదని భయం కలిగింది. ఈసరికే అతణ్ణి వింత జంతువు చంపివుండకపోతే, ఇంగిత జ్ఞానం కూడా లేని మంత్రి పంపిన భటులు అతణ్ణి గూఢచారిగా భావించి తప్పక చంపుతారు. తను ముందుగా వెళ్లి అక్కడి పరిస్థితి ఎలావుందో చూసి, తన కొడుకుకు హెచ్చరించాలి.


    ముసలివాడు ఆగమేగాలమీద అరణ్యంలోని తన పూరిపాక చేరాడు. అక్కడ ఎవరూ లేరు. ఎందుకైనా మంచిదని ఎంతోకాలంగా గోడకు తగిలించి వున్న తనతండ్రి కాలంనాటి కత్తిని తీసుకుని, తన కొడుకు ఆలమందను మేపే కొండ ప్రాంతానికి బయలుదేరాడు.


    కేశవుడు మామూలుగా రోజూ కూచునే చెట్టుకింద కనిపించే సరికి ముసలివాడికి ప్రాణం లేచి వచ్చినట్టయింది. అతడు పరిగెత్తుతూ కొడుకును సమీపించి, “కేశవా! నిన్ను ప్రాణాలతో చూడగలుగుతాననుకో లేదురా, బాబూ! నగరంలో చాలా చాలా పుకార్లు బయలుదేరినై. అసలు నిజంగా యిక్కడ జరిగిన సంగతేమిటి?” అని ఆదుర్దాగా అడిగాడు.


    తండ్రి ఆదుర్దా, అతడి చేతిలోని కత్తి కేశవుణ్ణి చాలా ఆశ్చర్యపరిచినై. నగరంలో బయలుదేరిన పుకార్లేమిటో అతడికి అర్థం కాలేదు. అతడు తండ్రికేసి నిశ్చలంగా చూస్తూ, “కత్తి తెచ్చావెందుకు? పుకార్లేమిటి?” అని ప్రశ్నించాడు.


    "బ్రహ్మపురం సేనానాయకుణ్ణి, అతడి వెంట వున్న భటుణ్ణి, ఒక వింత జంతువేదో అరణ్యంలో చంపిందని నగరంలో పుకారుగా వుంది. మారువేషంలో వున్న శత్రుదేశపు గూఢచారి అతణ్ణి చంపాడని మరికొందరు చెప్పుకుంటున్నారు." అన్నాడు తండ్రి. 

ఇంకా వుంది...

Post a Comment

Previous Post Next Post