రాకాసిలోయ (చందమామ)_01
రాకాసిలోయ_01
పూర్వం బ్రహ్మపురమనే నగరానికి సమీపానగల అరణ్యంలో కేశవుడనే కాపు యువకుడొకడు పశువులను మేపుకుంటూ వుండేవాడు. వాడికి తల్లి లేదు, ముసలి తండ్రి మాత్రం వున్నాడు. ఆ ముసలివాడు రోజూ ఉదయం పశువుల పాలుపిండి, వాటిని నగరంలో అమ్మి, ఆ వచ్చిన డబ్బులతో ఇంటికి అవసరమయిన వస్తువులు కొని తెస్తూండేవాడు.
కేశవుడూ, అతని తండ్రి అరణ్యం మధ్య ఒక చిన్న పూరిపాకలో నివశిస్తూండేవారు. వారున్న ప్రాంతానికి దాపులలో ఎక్కడా గ్రామాలులేవు. వాళ్ళు వుంటున్న అరణ్యం చుట్టూతా పెద్ద పెద్ద కొండలుండేవి. కేశవుడు రోజూ తన పశువుల మందను కొండదరికి తోలుకుపోయి, అక్కడవున్న పచ్చిక బీళ్ళలో వాటిని మేపుతూండేవాడు. అలాంటి సమయాల్లో అతడికి కొండ పైభాగానికి ఎక్కి చూడాలనిపించేది. కాని, తండ్రి అతణ్ణి కొండ ఎక్కవద్దని ఏనాడో శాసించాడు. కారణమేమంటే, ఆ కొండమీది గుహల్లో పెద్ద పెద్ద సర్పాలూ, పులులూ, ఎలుగుబంట్లూ వుంటాయని అతడి నమ్మకం.
ఒకనాడు పశువులను పచ్చికబీటి వైపుకు తోలి, కేశవుడు ఒక చెట్టు నానుకుని కూచుని విల్లంబులు తీసుకుని, బాణాలను దూరంగా వున్న అడివిచెట్ల బోదెలకూ, కొమ్మల పైన వున్న పక్షులకూ గురిచేసి వదులుతున్నాడు వాడావిధంగా విలువిద్యాభ్యాసంలో మైమరచి వుండగా, కొండ పాదంలోని రాతిబండల వైపునుంచి ఒక వికృతమైన ధ్వని వినిపించింది. కేశవుడు భయంవల్ల కంపించిపోయి, అంతలోనే గుండె నిబ్బరం తెచ్చుకుని, ఆ వికృతధ్వని వచ్చినవైపుకు కళ్ళుతిప్పాడు. చూస్తూండగానే ఒక వింత జంతువు అక్కడ ఎత్తుగావున్న ఒక రాతి మీదికి ఛెంగున ఎగిరి నిలబడింది. దాని ఆకారం గుర్రాన్ని పోలి వున్నది. కాని శరీరం మీద అడవి గాడిదలకు వున్నట్టుగా పెద్ద చారలున్నాయి. ముఖాన పొడవైన ఒకే ఒక కొమ్ము వున్నది.
ఈ వింత జంతువును చూసి కేశవుడు తబ్బిబ్బయిపోయాడు. ఇలాంటి జంతువు లోకంలో వుంటుందనయినా వాడు ఎన్నడూ వినలేదు. ఇప్పుడేం చేయాలి? బాణం ఎక్కుపెట్టి దాన్ని గురిగా కొట్టగలిగితే బావుండును. ఆ వింతమృగం రాతిమీద నిలబడి తోకతో శరీరాన్ని దులుపుకుంటూ, మెడ మీద పెద్ద జూలును ఎగరవేస్తూ కేశవుడి కేసి తల తిప్పింది. ఇదే మంచి ఆదననుకుంటూ కేశవుడు వింటితాటిని చెవివరకూ లాగి, ఒక బాణాన్ని దాని మీదికి వదిలాడు. బాణం ఝం అంటూ వచ్చి శరీరాన్ని తాకే లోపల ఆ వింత జంతువు రాతిమీది నుంచి ఎగిరి పక్కకు దూకేసింది. కేశవుడు ఆశ్చర్యపడుతూ మరోబాణాన్ని వింటికి తగిలించబోయేంతలో, అది వాయువేగమనోవేగాలతో దూకుతూ వచ్చి కేశవుడి చేతిలో వున్న విల్లంబులను నోటపట్టి దూరంగా విసిరివేసింది.
తనకు ప్రాణాపాయం కలగనున్నదని కేశవుడు భావించాడు. ఆ క్షణంలోనే అతడికి ఎక్కడలేని తెగింపూ కలిగింది. అతడు చెట్టుకు ఆనించి వున్న తన చేతి కర్రను అందుకోబోయేలోపల, ఆ వింత జంతువు ఆవుకన్నకూడా సాధువులా తలాడిస్తూ వచ్చి, ముట్టెను అతడి భుజం మీద పెట్టింది.
కేశవుడు మరింత ఆశ్చర్యపడ్డాడు. ఈ వింత జంతువుకు మానవుల మనోభిప్రాయాలు తెలుసుకునే దివ్యజ్ఞానం వున్నదేమో అనిపించిందతడికి. ఏది ఏమైనా, ఈ వింత జంతువు వాలకం చూస్తూంటే, అది తనకు హాని చేసేదిగా కనబడలేదు. ఆ కారణం వల్ల కేశవుడు ఉత్సాహంగా లేచి నిలబడి, దాని వెన్నుమీద అరిచేతితో గట్టిగా చరిచాడు. దానితో ఆ వింత మృగం గుర్రంలా కాళ్ళతో కదనుతొక్కుతూ, తల పైకెత్తి పెద్దగా సకిలించింది.
"ఇది బహుశా గుర్రం జాతికి చెందిన జంతువై వుండొచ్చు." అనుకున్నాడు కేశవుడు. ఆ అభిప్రాయం అతడికి కలగగానే,
దానిమీద స్వారీ చేయాలన్న కోరిక కలిగింది. ఆ వెంటనే అతడు ఎగిరి దాని వీపుమీద కూచున్నాడు.
వింతజంతువు ఈసారి మరింత పెద్దగా సకిలించి, చిన్న చిన్న అడుగులు వేస్తూ కొండకేసి బయలుదేరింది. కళ్ళెం, జీనూ లేకుండానే దీని మీద స్వారి చేయవచ్చు, అనుకున్నాడు కేశవుడు, కొండను సమీపిస్తున్న కొద్దీ దాని వేగం క్రమంగా హెచ్చసాగింది. కేశవుడు కింద పడబోయేవాడల్లా దాని జూలు పట్టుకుని ముందు కొరిగాడు.
అదే సమయంలో అది బంతిలా ఎగిరి ఒక బండరాయి మీదికి ఎక్కింది. కేశవుడు భయపడిపోయాడు. “ఓహెఁ, ఇది, నన్ను కొండమీదికి తీసుకుపోవాలని చూస్తున్నది. అక్కడి గుహల్లో పులులూ, ఎలుగుబంట్లూ.... ప్రమాదం!” అనుకుంటూ అతడు దానిమీది నుంచి కిందికి దూకేశాడు. కేశవుడు కిందికి దూకగానే, వింత జంతువుకూడా రాతిమీది నుంచి కిందికి దూకి, అతడి చుట్టూ కదను తొక్కుతూ గిర్రున తిరగసాగింది. కేశవుడికి ఏమిచేయాలో తెలియలేదు. వాడు కాళ్ళీడ్చుకుంటూ మామూలుగా కూచునే చెట్టు వద్దకు వెళ్లాడు. వింత జంతువు కూడా అతడికి వెనకగా అక్కడికి చేరింది.
కేశవుడు ఆలోచనలో పడ్డాడు. ప్రపంచంలోమాట ఏమోగాని, తను వుంటున్న రాజ్యంలో మటుకు ఇలాంటి జంతువు వున్నట్టు తను ఎన్నడూ వినలేదు. అదికొండమీది నుంచి తను వున్నచోటుకు వచ్చింది. తను స్వారిచేయాలని ప్రయత్నిస్తే తనను కొండమీదికి తీసుకుపోవాలని ప్రయత్నించింది. అంటే, దాని నివాసస్థానం కొండమీద ఎక్కడో వుండి వుంటుంది. దీనిని పట్టుకుపోయి బ్రహ్మపురంలో అమ్మితే తనకు చాలా ధనం రావచ్చు!
కేశవుడు యిలాంటి ఆలోచనల్లో తలమునకలైవుండగా, వింత జంతువు వాడి పశువుల మందలోకి వెళ్ళి, వాటితోపాటు పచ్చిగడ్డి మేయసాగింది. మొదట్లో, దాన్ని చూసి బెదిరిన ఆవులు క్రమంగా భయంపోయి, దానితోపాటు కలిసి తిరగసాగాయి. ఆ వింత జంతువు తిరిగి కొండమీదికి వెళ్లిపోతుందనుకున్నాడు, కేశవుడు, కాని, అలా జరగలేదు. చీకటి పడుతూండగా వాడు మందను ఇంటికి మళ్లించుకు వచ్చేటప్పుడు, అదికూడా వాటితోపాటు వాడి పూరిపాక దగ్గరకు వచ్చింది. కేశవుడు పశువులన్నిటిని ఒకచోటికి చేర్చి, వాటి చుట్టూ నెగడువేసి పాకలోకి వెళ్ళిపోయాడు. ఈ వింత జంతువు సంగతి తన తండ్రితో చెప్పటమా? మానటమా? అని ఆలోచిస్తూనే, వాడు ఆ రాత్రి భోజనంచేసి హాయిగా నిద్రపోయాడు.
మర్నాడు తెల తెల్లవారుతూండగానే తండ్రి కేశవుడి మంచం దగ్గరకు వచ్చి,వాణ్ణి భుజం పట్టుకుని కుదుపుతూ, "కేశవా, లేలే! ఎంత ప్రమాదం జరిగిపోయింది! రాత్రి మన మందలోకి ఒక తోడేలు వచ్చింది. చుట్టూ నెగళ్ళ వెలుగువున్నా అదెట్లా లోపలికి వచ్చిందో నాకు తెలియటం లేదు." అన్నాడు ఆదుర్దాగా.
కేశవుడు ఉలిక్కిపడి లేచి కూచున్నాడు. వాడికి చప్పున క్రితంరోజు ఆవులమంద దగ్గరకు వచ్చిన వింత జంతువు గుర్తుకొచ్చింది. తండ్రి దాన్ని చూసి తోడేలనుకుంటున్నాడా? అతడికి పెద్దతనం వల్ల బాగా చూపు ఆనకపోయినా, గుర్రం అంత ఎత్తున ఆ వింత జంతువును చూసి తోడేలని ఎలా అనుకోగలడు? ఒకవేళ ఆ వింత జంతువే రాత్రివేళ తోడేలుగా మారి తన ఆవుల్ని చంపి తిని పారిపోయిందేమో!
“ఆ తోడేలు ఎన్ని ఆవుల్ని పొట్టన పెట్టుకున్నది?” అని అడిగాడు కేశవుడు తండ్రిని.
“దేవుడి దయవల్ల అలాంటిదేమీ జరగలేదు. తోడేలు నన్ను చూస్తూనే నెగళ్లమంట మీదిగా దూకి అడవిలోకి పారిపోయింది," అన్నాడు తండ్రి.
కేశవుడు ఒక పెద్ద నిట్టూర్పు విడిచి, “నువు చూసింది. తోడేలు కాదేమో! నిన్న సాయంకాలం మందలోకి కొండ మీదినుంచి ఒక వింతజంతువు వచ్చింది," అంటూ తండ్రికి దాన్నిగురించి అంతా వివరంగా చెప్పాడు. అంతా విని తండ్రి ఆశ్చర్యపడుతూ, “నువ్వు చెప్పిన వింత జంతువేదీ నాకు మందలో కనిపించలేదే! కొండమీంచి వచ్చిందంటావు, జాగర్త! అది జంతురూపంలో వున్న ఏ మాయావి రక్కసయినా కావొచ్చు!" అన్నాడు.
తండ్రి మాటలకు కేశవుడు బిగ్గరగా నవ్వుతూ, "రక్కసైతే నన్ను పట్టుకుపోయేందుకు ఆ రూపంలోనే రావొచ్చుగా, ఈ వింత రూపం ఎందుకు ధరించాలి? నువ్వు చూసింది నిజంగానే తోడేలు, సందేహం లేదు. మందవెంట మన ఇంటికి వచ్చిన వింతజంతువు రాత్రికిరాత్రే అడవిలోకి వెళ్ళిపోయివుంటుంది,” అన్నాడు.
తరవాత తండ్రి పాలకావిడి ఎత్తుకుని నగరంకేసి వెళ్ళిపోయాడు. కేశవుడు ఆదరా బాదరా ముఖం కడుక్కుని, స్నానం చేసి చద్ది అన్నం తిని మందను కొండదరి పచ్చికబీడులోకి తోలుకుపోయేందుకు పాకలోంచి బయిటికివచ్చాడు. ఆవుల్లో కొన్ని నెమరువేస్తూ పడుకొని వున్నాయి, కొన్ని అంభా అని అరుస్తూ గంతులు వేస్తున్నాయి. కాని, ఎక్కడా వింత జంతువు జాడలేదు.
కేశవుడు ఆవుల మందను కొండదరికి తోలుకుపోయి, తను మామూలుగా కూచునే చెట్టుకింద కూచుని, బాణాలు ఎక్కుపెట్టి కొండమీదిక ఝాం ఝాం అని ప్రతిధ్వనించేలా వదులుతున్నాడు. హఠాత్తుగా అతడి వెనకు వింతజంతువు వికృతంగా సకిలించిన శబ్దం వినబడింది. కేశవుడు తుళ్ళిపడి వెనక్కు తిరిగి చూశాడు. వింత జంతువు వెనకకాళ్ళమీద లేచి నిలబడి మరింత పెద్దగా సకిలించి, అతడి ముందుకు వచ్చి నిలబడింది.
"మళ్ళీ వచ్చావా? నీ మాటే మరచిపోయాను సుమా?” అన్నాడు కేశవుడు, మనిషితో మాట్టాడుతున్న ధోరణిలో, వింత జంతువు తలాడించింది. కేశవుడి ఆశ్చర్యానికి అంతులేదు. అంతలోనే అతడికి తండ్రి మాటలు గుర్తుకొచ్చినై. “ఇదేదైనా మాయరక్కసి కాదుగదా?" అనుకున్నాడు మనసులో. అతడి మనోగతభావాలు ఆర్థమైనదానిలా వింత జంతువు గిరుక్కున వెనుదిరిగి ఆవుల మందకేసి బయలుదేరింది. కేశవుడు దానికేసి కొంచెం సేపు అనుమానంగా చూసి, విసుక్కుంటూ, అంబులపొదిలోంచి బాణాలు తీసి ఎక్కుపెట్టి, ఈసారి చెట్ల కొమ్మల మీదికి వదలసాగాడు.
ఈ విధంగా కొద్దికాలం గడిచింది. దూరంగా ఎక్కడో గుర్రాలు పరిగెత్తుకొస్తున్న చప్పుడయింది. చూస్తుండగానే ఇద్దర రౌతులు కేశవుడున్న చోటుకు వచ్చి, అతడికేసి వింతగా చూస్తూ, “మహాసేనానీ, ఇక్కడెవ్వడో ఏకలవ్యుడున్నట్టుంది!" అని కేక పెట్టారు.
“ఏకలవ్యుడా? అయితే ఆలశ్యమెందుకు, వెళ్ళు తెగొట్టండి!” అంటూ విలువైన దుస్తులతో, బాగా అలంకరింపబడిన గుర్రానెక్కి వున్న ఒకడు అక్కడికి వచ్చాడు.
"ఏమిరా ఆ పొగరు! లేచి నిలబడవేం? ఈ వచ్చింది ఎవరనుకున్నావ్? బ్రహ్మపుర మహాసేనాని!" అన్నాడొక రౌతు.
కేశవుడు చప్పున లేచి నిలబడి, బ్రహ్మపురసేనానికి, చేతులెత్తి నమస్కారం చేశాడు. సేనాని అతణ్ణి, చెట్టుకింద వున్న అంబులపొదినీ, ధనువునూ పరీక్షగా చూసి మీసం దువ్వుకుంటూ, “ఏరా, నువ్వెవరివి? క్షత్రియుడివా? ఎవరి ప్రాణాలు తీయాలని, ఈ ధనుర్విద్య నేర్చుతున్నావ్?” అని కఠినంగా ప్రశ్నించాడు.
“అయ్యా, నేను కాపుకుర్రాణ్ణి. నాకీ లోకంలో శత్రువలెవరూ లేరు. ఏదో ఉబుసుపోక ఈ విల్లంబులు వెంట తెచ్చుకున్నాను. అదుగో, ఆ కొండ దరిని నా ఆలమంద!" అన్నాడు కేశవుడు వినయంగా,
సేనాని తల తిప్పి ఆలమందకేసి చూసే లోపలే, గుర్రపు రౌతుల్లో ఒకడు గగ్గోలు పడుతున్నట్టు గొంతెత్తి, “మహాసేనానీ, చూడండి, చూడండి! పంచకల్యాణి! దేవతాశ్వంలా వున్నది!” అంటూ వింత జంతువు కేసి చేయెత్తి చూపాడు.
సేనాని ఆశ్చర్యపడుతూ ఆ వింతజంతువు కేసి ఓక్షణకాలం చూసి, "అది పంచ కల్యాణి కాదు, దేవతాశ్వమూ కాదు; అడివిగాడిదలా వున్నది! అడివి గాడిద అంత ఎత్తు వుండదే! ఒంటి కొమ్ము ఏమిటి? ఇలాంటి జంతువు వుంటుందని విననైనా వినలేదే! ఇటు మళ్ళించుకు రండి!" అని భటులకు ఆజ్ఞయిచ్చాడు.
ఇంకా వుంది...
Post a Comment